సంస్కరణ చేతనం రచయిత్రి దామెర్ల సీతమ్మ – అనిశెట్టి రజిత

మద్రాసు ప్రెసిడెన్సీలోని ఒక జిల్లా అయిన నార్త్‌ ఆర్కాట్‌ జిల్లాలోని వేలూరుపురంలో జన్మించింది దామెర్ల సీతమ్మ. ఆమె తల్లి వేంకట రామణాంబ, తండ్రి అత్తోట రామయ్య. వీరిది ఆంధ్ర ప్రాంతంలోని నర్సాపురం. ఉద్యోగరీత్యా ఆయన ఆర్కాట్‌లో స్థిరపడాల్సి వచ్చింది.

పదేళ్ళున్నప్పుడు సీతమ్మకు నర్సాపురం సమీపంలోని బెండమూరులంక గ్రామానికి చెందిన దామెర్ల సన్నయ్య గారి కొడుకు దామెర్ల సదాశివరావుతో పెళ్ళి జరిగింది. రామయ్య తన కొడుకులతో పాటు అల్లుడికీ మద్రాసులో చదువు చెప్పించాడు. సీతమ్మకు అన్నలు చదువు చెప్పారు. ఆమె అరవం చదవడం, రాయడం, మాట్లాడడం ఆసక్తిగా నేర్చుకుంది. ఆమె పెళ్ళి జరిగిన రెండేళ్ళకే ఆమె తండ్రి మరణించాడు. ఆమె పెద్దన్నకు తండ్రి ఉద్యోగాన్ని గోదావరి జిల్లాలో ఇవ్వడంతో వాళ్ళు కాకినాడకు మారిపోయారు. సీతమ్మకు 12 ఏళ్ళు ఆనాటికి. 1894 నాటికి 12 ఏళ్ళంటే ఆమె 1882లో జన్మించి ఉండాలి, పెళ్ళి 1892లో అయి ఉండాలి.
అత్తింటి వారు భర్త చదువు కోసం రాజమండ్రిలో కాపురం పెట్టినందున 1895లో ఆమె అక్కడికి చేరింది. కొంతకాలం తర్వాత సదాశివరావుకు 1906లో రాజమండ్రిలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరమైనా తిరగకుండానే మశూచికం వచ్చి ఆయన చనిపోయాడు. 24 ఏళ్ళ వయసులో ఆమె వితంతువయింది. ఆమెకు కలిగిన సంతానంలో ఒక కొడుకు మరణించడం, కూతురుకు పెళ్ళైన ఆరునెలలకే వితంతువు కావడం ఆమె జీవితంలోని విషాదాలు.
1900 నాటికి రచనారంగంలో ప్రవేశించిన సీతమ్మవి 15 వచన రచనలు, 5 పద్య రచనలు, ఒక పాట లభిస్తున్నాయి. ఆమె జీవిత వివరాలు తెలియజేసే రెండు రచనలు ‘హిందూ సుందరి’ పత్రికలలో మే 1911 సంచిక ఒకటైతే, 1913 సెప్టెంబర్‌ సంచికలో ఒకటి. ఆమె జీవిత చిత్రం రూపుకట్టే పద్య రచన ‘సోదర స్మృతి’. 1914లో ఆమె రచనలు ప్రచురించబడిన సంచికల ద్వారా కూడా ఆమె జీవిత విశేషాలు తెలుస్తాయి.
ఆమె తండ్రి మరణం, తరువాత భర్త మరణం, కొడుకు మరణం, 1913లో అన్న అత్తోట లక్ష్మీ నరసింహం మరణం లాంటి సాంసారిక సమస్యల నడుమ ఆమెలోని జీవితాశను, విద్యాభిలాషను, సాహిత్యాభిలాషను, సామాజిక సేవాభిలాషను ఆమె అన్న లక్ష్మీనరసింహం వ్యక్తిత్వమే సజీవం చేసింది.
1910లో కాకినాడలో ‘శ్రీ విద్యార్థినీ సమాజం’ పునరుద్ధరింపబడిరది. తన అన్న ప్రోత్సాహంతో సీతమ్మ బాలాంత్రపు శేషమ్మతో పాటుగా కార్యదర్శిగా ఉంది. తరువాత కోశాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించింది. వదిన అత్తోట శేషమ్మ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉండేది. వీరి ఇంట్లోనే ప్రతివారం వీళ్ళ సభలు జరుగుతుండేవి. 1910 నుండి సామాజిక కార్యక్రమాలతో పాటు సీతమ్మ రచనా వ్యాసంగం మళ్ళీ మొదలయింది. ఆమె ఎదుగుదలకు ముఖ్య కారకుడైన అన్న అత్తోట లక్ష్మీనరసింహం 1913లో మరణించిన తర్వాత ఆమె సోదర వియోగ దుఃఖంతో రాసిన పద్యాల వల్ల సోదరుడు ఆమెకు ఏ విధంగా ప్రోత్సాహమందించాడో తెలుస్తుంది.
… … …
ఆ రోజుల్లో మహిళలు, వైధవ్యం పొందిన స్త్రీలు చదువుకోవడం, సభలకు వెళ్ళడం అమర్యాదకరంగా భావించేవారు. దానికి ఆవేదన చెందుతూ ఆమె మొదట రాసిన ‘దివ్యజ్ఞాన సమాజం’ (1900 స్వతంత్రత నుండి స్వాతంత్య్రానికి ` అనీబిసెంట్‌ జనానా). 1904 మే నెలలో వెలువడిన హిందూ సుందరి సంచికలో ఆమె రాసిన ‘భగవత్ప్రార్ధన’ బ్రహ్మసమాజ ప్రభావంతో రాసినదై ఉండవచ్చు. ఆమె భావనలో భగవంతుడు నిరాకారుడు, నిర్గణుడు. ఆమె కొన్ని పూజాతంతుల్ని కూడా నిరసించింది. ప్రకృతి వనరులను సృష్టించిన భగవంతుడి పట్ల కృతజ్ఞులమై ఉండాలంటుంది. ‘వెలిభయము లేని సంస్కరణము’ వ్యాసము ఆమె ఆచరణాత్మక సంస్కరణ దృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది.
బాలికలకు రజస్వల అనంతరం, వితంతు వివాహాల లాంటివి జరిగినప్పుడు మతాచార్యులు ముందుకొచ్చి వెలిపత్రాలు జారీచేస్తుండడం వల్ల వాళ్ళు కుటుంబాలకు, బంధుమిత్రులకు, సామాజిక అవసరాలకు అంటరానివాళ్ళుగా అనేక అగచాట్లు పడుతుండటం చూసిన సీతమ్మ ఈ సమస్యల పట్ల సంస్కరణ కార్యకలాపాలకు దూరం కావలసిందేనా అని ప్రశ్నించుకుంటుంది. వెలి భయము లేకుండా సంస్కరణలు ఆచరించవచ్చు కదా అని తర్కిస్తుంది.
సీతమ్మకు మగపిల్లల పెళ్ళి వయస్సు, ఆడపిల్లలకు పెద్ద మనిషైన తర్వాతే పెళ్ళిళ్ళు చేయడం, కట్నాలు లేని పెళ్ళిళ్ళ గురించి కొన్ని సంస్కరణ ఆలోచనలు ఉంటాయి.
కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం కార్యదర్శిగా ఉండి గుంటూరు హిందూ స్త్రీ మహాసభలో ప్రసంగిస్తూ బొంబాయి, పూణేలో స్త్రీలు విద్యావంతులవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, విద్యావంతులై వైద్యసేవలు, సమాజసేవలు అందిస్తున్న స్త్రీల గురించి విస్తృతంగా వివరించింది. ఆమె ప్రస్తావించిన స్త్రీలందరూ దాదాపుగా మహర్షి కార్వే ‘హిందూ వితంతు గృహం’తో సంబంధం ఉన్నవాళ్ళే. విచిత్రం ఏమిటంటే, ఆమె అన్న లక్ష్మీ నరసింహం సీతమ్మనూ, ఆమె కూతురునూ ఆ వితంతు గృహంలో చేర్పించాడు. అక్కడ ఆమెకు చదువు పట్ల, తనలాంటి వాళ్ళ సమస్యల పట్ల అవగాహన పెరిగింది. చెల్లెలి దుఃఖం తగ్గించాలని అన్న ఆ గృహంలో చేర్పించి ఉంటాడు. ఒక సంవత్సర కాలం ఉన్న సీతమ్మకు అక్కడి పరిచయాలు, జీవితకాల అనుభవాలు బాగా గుర్తుండిపోయి ఆమె ప్రసంగాల్లో ఆ విషయాలు వినిపిస్తాయి. సోదరుని స్మృతిలో రచించిన పద్యాల్లో కూడా స్త్రీలు ఆత్మగౌరవంతో లోకానికి ఆదర్శంగా ఉండాలంటే విద్య అవసరమనీ, సంసారపు బాధ్యతలు, ఇంటి పనులు, సేవలతో తీరిక లేదనుకోవడం సరికాదని అంటుంది. తన ప్రసంగం చివర్లో, స్త్రీల విద్యా విషయమై ‘సనాతన ధర్మమండలి’ పక్షాన పనిచేస్తున్న ఏకా వెంకటరత్నమ్మను ప్రశంసిస్తుంది.
‘విద్య వలన లాభములు’ అనే వ్యాసాన్ని 1910 సెప్టెంబర్‌ హిందూ సుందరి, సావిత్రి పత్రికల్లో ప్రచురించారు. స్త్రీలు చదువుకుంటూ ఉద్యోగాలూ చేయగలరు, రాజ్యపాలనా చేయగలరు అనే విశ్వాసాన్ని ఆమె ప్రకటించింది. వితంతువులు విద్య నేర్చుకుంటే స్వధర్మాన్ని తెలుసుకొని స్వార్థత్యాగులై సమాజానికి ఉపయోగపడతారని చెప్తుంది. ఆనాటి సమాజంలోని సాంస్కృతిక వైరుధ్యం వల్ల ఆమె భర్త ఉన్న స్త్రీ, భర్త లేని స్త్రీ బేధాలతో చదువు, విద్య అనేది ఉపయోగపడుతుందని చెప్పడం కనిపిస్తుంది.
స్త్రీలు చదువు నేరిస్తే దుష్టులవుతారు అన్న వాదన నాడు ఉండేది. దాన్ని ఆమె తిరస్కరిస్తూ చదువుకుంటే దుష్టులవుతారంటే పురుషులు చదువుకొని దుష్టులవుతున్నారా? చదువు వల్ల ఎవ్వరూ దుష్టులు కారు, స్వభావం వల్ల అవుతారు అంటుంది. నీతి, న్యాయాలు లేకపోతే ఆడా, మగా ఎవరైనా విద్యా విహీనులే అని వాదిస్తుంది. స్త్రీలకు పాఠశాలలు పెట్టాలని, అందుకు త్వరగా పూనుకోవాలని కోరుతుంది. ఆమె స్త్రీ విద్యావశ్యకత, వారి ఆరోగ్య పరిస్థితుల పట్ల నివేదికలు రూపొందించింది.
‘‘రాజమహేంద్రవరపు మిషన్‌ బాలికా పాఠశాల’’ అనే ఆమె రచనను 1911 మార్చిలో ‘సావిత్రి’ పత్రికలో ప్రచురించారు. అది ఆమె క్షేత్ర పర్యటానుభవంతో రాసింది. స్త్రీలు అభివృద్ధి సాధనలో తమ బాట తామే వేసుకోవాలన్నది ఆమె మాట. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్‌ నేర్చుకొని తోటి స్త్రీలకు చదువు చెప్పాలన్నది స్త్రీలకు ఆమె చేసిన సూచన. దామెర్ల సీతమ్మ కూడా అదే పనిచేసినట్లు తెలుస్తోంది.
‘‘హిందూ వితంతువుల స్థితి, వారు దేశమున కెట్లుపయోగపడెదరు’’ అనే వ్యాసంలో (1911 సంవత్సరాది ఆంధ్రపత్రిక సంచిక) ఆమె విద్య, జ్ఞాన, వైరాగ్యాలు, మోక్షాలు అందరూ సంపాదించుకోవల్సినవేనని, కానీ విద్య లేనందున స్త్రీలు వాటికి దూరం కావల్సి వస్తున్నదనీ, వితంతు స్త్రీలు వాళ్ళలో భాగమేనని చెప్తుంది. వితంతు స్త్రీలు, భర్త చనిపోయాక పుట్టిల్లు చేరి లోకాభిరామాయణంలో, పరనిందలో కాలం గడుపుతున్నారని వ్యధ చెందుతుంది. ఇంటి వెనుక పనులు చూస్తూ శుభకార్యాలకు రాకుండా, పసుపు కుంకుమ ముట్టకుండా నిషేధాల నడుమ దుర్భర జీవితాలు గడపడం వేదనామయం అంటుంది. బాల్య వితంతువుల పరిస్థితి మరీ వేదనాకరం. బాల్యంలోనే తాళి కట్టినవాడు మరణిస్తే జీవన పర్యంతం వైధవ్యం మోయడం అన్యాయం అంటుంది. వితంతువులు స్వార్థత్యాగులై, విరాగినులై, విద్యావంతులై శాస్త్రజ్ఞానం సంపాదించి బోధకులు కావాలని ఆశించింది సీతమ్మ. వాళ్ళు చేయదగిన పనులను లోకవిద్యను అభ్యసించి ఉపాధ్యాయినులు కావచ్చనీ, విరాగినులై తత్వబోధ చేయవచ్చనీ, వైదులై స్త్రీలకు సేవలు అందించవచ్చనీ మార్గదర్శనం చేసింది. అన్న అత్తోట లక్ష్మీ నరసింహం మరణం ఆమెకు ఎంతో దుఃఖకారణమైంది. తండ్రి తర్వాత తండ్రిలా, తన భర్త మరణానంతరం తన జీవితాన్ని ఒక మార్గంలో పెట్టిన అన్నతో బాంధవ్యాన్ని తలచుకుంటూ రాసిన పద్యాలు ఒక విధంగా ఆత్మకథాత్మకమైనవి. ఆ పద్యాల్లో ఆయన మరణం పట్ల శోకార్తులైన తీరు, ఆయన సంఘ సంస్కరణ ఆచరణ గురించి రాసింది. ఒక పద్యంలో ఆమె అన్న దళితుల విద్యాభివృద్ధికి చేసిన కృషిని పేర్కొంది. పదేళ్ళ వయసులో సీతమ్మ కూతురు వితంతువు అయితే ఆ బాలిక పట్ల అన్న చూపిన శ్రద్ధను గుర్తు చేసుకుంటూ, ఆమెను తనతో సహా ‘పూనా విడో హోం’లో చేర్చడం, అక్కడ మేనకోడలికి ఆ వాతావరణం పడకపోవడంతో ఆమెను మళ్ళీ ఆ హోంకు పంపించకపోవడం సీతమ్మ తలచుకుంటుంది. భర్త పోయి దుఃఖసాగరంలో ఉన్న తనకు తన అన్న సముద్రాన్ని దాటించే నావలా నిలిచాడని చెప్పుకున్నది. అన్నను తలచుకుంటూ రాసిన పద్యాల్లో ఆ కాలపు సంస్కరణ ఉద్యమ వాతావరణాన్ని అంచనా వేయవచ్చు.
1917 తర్వాత దామెర్ల సీతమ్మ రచనలు లభించలేదు. ఆమె గురించిన ఇతర వివరాలూ తెలియరాలేదు. తండ్రి మరణిస్తే ఆమె తల్లికి వైధవ్యం ప్రాప్తించింది. అన్న మరణిస్తే వదిన శేషమ్మకు వైధవ్యం కలిగింది. తన భర్త మరణంతో తానొక వితంతువయ్యింది. పదేళ్ళ వయస్సులోనే తన కూతురు వైధవ్యం పొందాల్సి వచ్చింది.
సీతమ్మ ఇవన్నీ చూస్తూ, అనుభవిస్తూ ఒక సంక్షుభిత సమాజంలో అన్న చేయూతతో విద్యావంతురాలిగా, సంఘ సంస్కరణ వాదిగా ఎదగగలిగింది. స్త్రీల ఉన్నతికోసం రచనలూ చేసింది, ప్రసంగాలూ చేసింది.
అది స్త్రీలకు ప్రతికూలమైన సమాజం, స్త్రీ చైతన్యాన్ని అణచిపెట్టే కాలం. అయినా, ఆ దుర్భర పరిస్థితులకు ఎదురీది తన జీవితానికో లక్ష్యం ఏర్పర్చుకున్నది సీతమ్మ. తన జీవితంలోని విషాదాలను పూడ్చుకోగలిగింది. విధి వంచితులకు, వ్యవస్థ బాధితులకు చేయూతనిచ్చి ప్రోత్సహిస్తే వారు తమ కన్నీళ్ళనూ, కష్టాలనూ అధిగమించి తమను తాము నిరూపించుకుంటారు అని సీతమ్మ జీవిత ప్రయాణం వల్ల తెలుసుకుంటున్నాము.
(కాత్యాయనీ విద్మహే ‘తొలి అడుగులు ` ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్యం’ 1875`1903 ఆధారంగా)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.