శిలాలోలిత
కవిత్వమే జీవితంలో వెలుగురేఖై నిలిచే సందర్భంలో పలికిన మాటలో, రాసిన అక్షరంలో, ఊహలో సైతం కవిత్వమే సదా పొలమారుతూ వుంటుంది. అటువంటి పలవరింత, కలవరింతే వై. శ్రీరంగనాయకి కవిత్వం. గతంలో 5 కవితా సంకలనాలను వెలువరించి, ‘ఆరేళ్ళ అద్దం’ అనే కొత్త సంకలనాన్ని ఈ మధ్యే తీసుకొచ్చింది. ‘పాపినేని శివశంకర్’ – కథల మీద రీసెర్చ్ చేసి, ప్రస్తుతం గుంటూరులోని కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
మనుషులు సమాజంలో బ్రతకొచ్చు, బ్రతకకపోవచ్చు. కానీ, కవులు మాత్రం సమాజంతో మమేకమై జీవిస్తారు. ప్రతి సందర్భం కవి కోణం నుంచీ, కొత్తరూపునూ, పరిష్కారాన్నీ, సాఫల్య, వైఫల్యాలను వ్యక్తీకరిస్తూనే వుంటుంది. అనుభూతుల చెలమలలో చేదతో తోడుతున్నంతసేపూ అక్షరమై మెరుస్తూనే వుంటుంది.
రంగనాయకి కవిత్వం, వస్తు విస్తృతిని సాధించింది. అనేక పార్శ్వాలనూ, నేటి సామాజిక స్థితిగతుల్నీ చిత్రిక పట్టింది.
ప్రేమ పేరుతో, అవగాహనా రాహిత్యంతో హింస పెరిగిపోతున్న నేటి స్థితిని రెండు మూడు కవితల్లో చెప్పింది. సమస్య మూలాన్ని ప్రశ్నిస్తూ, పిల్లల, తల్లిదండ్రుల, అధ్యాపకుల, సామాజికులు అర్థం చేసుకోవాల్సిన రీతిని, మారాల్సిన స్థితినీ వెల్లడించింది.
‘ఇవ్వడంలోనే ప్రేమ స్వరూపం దాగుందని గ్రహించటం’ (మలుపులు) ‘స్వార్థంతో మొదలైన ప్రేమ / కొబ్బరిబొండాల కత్తిపదును / ద్రావకం సీసాల మృత్యు పరశువు / అర్థం చేసుకోవడం / ఆస్వాదించటంతో మొదలైన ప్రేమ…. వెలుతురుతోపాటు వెదురుకూ ఓ రాగం వుంది / వసంతంతో పాటు శిశిరానికీ ఓ రాగం వుంది / విచ్చిన పూవుతోపాటు రాలిన ప్రాణానికీ ఓ రాగం వుంది / … తనువు నార్పే ప్రేమైతే త్యజించు / … సువిశాల జీవన ప్రస్థానంలో ప్రేమ ఎప్పటికీ విరామ చిహ్నమే!’ – అంటుంది. (అది…విరామచిహ్నం)
స్త్రీ జీవితాన్ని ఇప్పటివరకూ చాలామంది అనేక విధాలుగా చిత్రిస్తూ వచ్చారు. రంగనాయకి ఒక విలక్షణమైన రీతిలో, కొత్తగా వ్యక్తీకరించిన కవి.
? ! /
ఊ… మెల్లిగా నడవమన్నానా/చెప్పానా…/చిన్నగా మాట్లాడమని/అరె…చెప్పిన పనింకా పూర్తికాలేదా/ అబ్బా… గబగబ తినొద్దన్నానా/ ష్… గట్టిగా నవ్వమాకు/ ఓహ్… ఇంకా పడుకోలేదా
షిట్… ఇం…కా… లేవలేదా
అతని కార్లో…
క్యూట్ ఇండోర్ ప్లాంట్ కుండీ
జీవనశైలి ఆహా! ఆహా!
అతని ఆశ్రితులవి మాత్రం
ఇరుక్కుని కూరుకుపోయిన యూనిఫాం జీవితాలు!!
అంతా విండో షాపింగు!
ఈ కవిత గురించి మనమేం మాట్లాడుకోకపోయినా, అక్షరమొహాన్ని తొడుక్కుని అంతా చెప్పేస్తూ పోతుంది. రైతుల మట్టిబతుకుల్ని, రైతుకూలిగా మారినా వీడని పల్లె బాంధవ్యాన్ని ఎంతో ఆర్ధ్రతతో రచించింది కొన్ని కవితల్లో. యం.యస్. సుబ్బలక్ష్మి మీద స్మృతి కవిత ఒకటుంది.
తరాల అంతరాల కవిత నాలుగుతరాల స్త్రీ మనోవైచిత్రికి అద్దం పట్టింది.
‘మనకు మనల్ని కొత్తగా పరిచయం చేసే
మంచి దృశ్యాల ఉషస్సులు
నిరుత్సాహంతో రాతిమీద నీళ్ళు పోయకు
ఉత్సాహంతో మట్టి మీద పోయి! (కేరింతల కిటికీలు)
స్నేహమంటే ఈ కవయిత్రికి ప్రాణం. అందుకేనేమో రెండుమూడు కవితలున్నాయి.
‘మనం కలిసిన చోట / మమతల మార్దవాలు / మనం విడిపోయే చోట / కలంకారీ ముద్దరలు! – అంటుంది. (ఆరేళ్ళ అద్దం)
సునామీ మీద, కాలం మీద, ప్రకృతి మీదా, పిల్లల బాల్యం మీదా, విద్యావిధానం మీద, గురుశిష్యుల బంధం మీద, పసిపిల్లల స్వచ్ఛమైన మనస్సుల మీదా, కవిత్వం మీదా, ఇలా ఎన్నెన్నో కవిత్వ వస్తువులైనాయి. స్త్రీల కొరకు పరితపిస్తున్న ఈ కవయిత్రి ఓ కవితలో… పొత్తిళ్ళనుండి పుట్టి మునిగేలోపు
ప్రతి మజిలీ కొక పాఠం
అన్నీ జన్మలే / తోటివారి కన్నీరు / తుడవాలనే ప్రయత్నంలోనే మనమొక పూలచెట్టవుతాం / మనమొక పండ్లతోటవుతాం / మొగులు గుంపవుతాం / మొగలి ఘమఘమలవుతాం /.
రంగనాయకి కవిత్వశక్తి మరింత తేజోమయం కావాలని అభిలషిస్తూ, మంచి కవిత్వాన్ని చదివే అవకాశం యిచ్చినందుకు రంగనాయకికి ధన్యవాదాలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags