అనువాదం: నీరజ పార్థసారధి
హెహెగరా అడవి నుంచి సేకరించిన సాల పత్రాలతో పాత్రలను, పళ్ళాలను తయారుచేసి డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు సకుని, గీతా దేవిలు. ఇరుగుపొరుగు వారు, స్నేహితులు కూడా అయిన ఈ ఇద్దరు మహిళలు గత రెండు దశాబ్దాలకు పైగా కలిసి ప్రయాణిస్తూ ఈ పనిని చేస్తున్నారు. ఆ వచ్చే సంపాదన చాలా కొద్దిగానే అయినప్పటికీ, ఈ పనిని వదిలే పరిస్థితి వారికి లేదు.
‘‘మేం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం’’, తన పక్కనే నిల్చొని ఉన్న స్నేహితురాలు సకుని వైపు ప్రేమగా చూస్తూ అన్నారు గీతా దేవి. ఈ ఇద్దరూ దగ్గరలో ఉన్న అడవి నుంచి సాల (షోరియో దొబస్టా) పత్రాలను సేకరించి వాటితో దోనెలు (గిన్నెలు), పత్తల్‌లు (పళ్ళాలు) చేసి, వాటిని పలామూ జిల్లా ప్రధాన కార్యాలయమైన డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు.
గీతా దేవి, సకునిలు గత 30 ఏళ్ళుగా కోపె గ్రామంలోని నదిటోలా అనే చిన్న పల్లెలో ఇరుగు పొరుగులుగా జీవిస్తున్నారు. రaార్ఖండ్ రాష్ట్రంలోని అనేకమంది గ్రామస్తులలాగే గీత, సకుని కూడా తమ జీవిక కోసం అడవిపైనే ఆధారపడుతున్నారు.
వాళ్ళు అడవిలో ఏడెనిమిది గంటలపాటు గడుపుతారు. మేతకు వెళ్ళిన పశువులు ఇళ్ళకు మళ్ళిన సమయంలో
వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరతారు. సరిపోయినన్ని ఆకులను సేకరించడానికి వారికి రెండు రోజులు పడుతుంది. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ, తమ కుటుంబాల గురించి, స్థానిక వార్తల గురించీ మాట్లాడుకుంటూ ఉంటే వారికి సమయం త్వరగా గడిచిపోతుంది. ప్రతి ఉదయం, ‘‘నికలీహే…’’ అంటూ పొరుగింటామె తనను పిలిచే పిలుపు కోసం గీత ఎదురుచూస్తారు. కొద్దిసేపటి తర్వాత, పాత సిమెంటు గోతాలతో చేసిన ఒక సంచిని, ప్లాస్టిక్ సీసాలో నీటిని, చిన్న గొడ్డలిని, పాత గుడ్డముక్కను పట్టుకొని ఇద్దరూ తమ ఇళ్ళనుంచి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ రaార్ఖండ్‌లోని పలామూ టైగర్ రిజర్వ్‌కు తటస్థ ప్రాంతంగా ఉన్న హెహెగరా వైపు వెళ్తారు.
ఆ ఇద్దరు స్నేహితులు వేర్వేరు సముదాయాలకు చెందినవారు. గీత భుయియాఁ దళిత వర్గానికి, సకుని ఉరాఁవ్ ఆదివాసీ సముదాయానికి చెందుతారు. మేం నడుస్తున్నప్పుడు గీత ఒక హెచ్చరిక కూడా చేశారు, ‘‘ఇక్కడికి ఒంటరిగా రావద్దు’’ అంటూ, ‘‘కొన్నిసార్లు అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. మేం తెందువాలను (చిరుతపులులను) చూశాం!’’ అని చెప్పారామె. పాములు, తేళ్ళ వల్ల కూడా ముప్పు ఎక్కువగానే ఉంటుంది. ‘‘మేము చాలాసార్లు ఏనుగులను చూశాం’’ అని సకుని జత పలికారు. పలామూ టైగర్ రిజర్వ్‌లో 73 చిరుతపులులు, సుమారు 267 ఏనుగులు ఉన్నాయి (2021 వన్యప్రాణుల గణన ప్రకారం).
మంచుతో కూడిన ఈ శీతాకాలపు ఉదయాన, యాభై ఏళ్ళ పైబడిన వయస్సు గల ఆ ఇద్దరూ తేలికపాటి శాలువాలను మాత్రమే ధరించి ఉన్నారు. వారు మొదట లాతేహార్ జిల్లాలోని మనికా బ్లాక్‌లోని వారి ఇంటికి దగ్గరగా ఉన్న ఔరంగా నదిని దాటారు. నీరు తక్కువగా ఉండే చలి కాలంలో కాలినడకన నదిని దాటడం సులభమే, కానీ వర్షాకాలంలో ఒడ్డుకు చేరుకోవడానికి వారు తరచుగా మెడలోతు నీటిలో ఈదవలసి ఉంటుంది.
ఒకసారి అవతలి ఒడ్డును చేరిన తర్వాత మరో 40 నిమిషాల నడక. నేలపై వారి రబ్బరు చెప్పులు చేసే లయబద్ధమైన టక్`టక్ శబ్దం మాత్రమే అడవిలోని నిశ్శబ్దాన్ని చెడగొడుతోంది. వారు ఒక పెద్ద మహువా (మధూకా లాంజిఫోలియా ` విప్ప) చెట్టు వైపుకు
వెళ్తున్నారు, ఇది సాల చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతానికి సూచిక.
‘‘అడవి ఇప్పుడు ఒకప్పటిలా లేదు. ఇది ఇంతకు ముందు చాలా దట్టంగా ఉండేది. మేం ఇంత దూరం రావాల్సిన అవసరం
ఉండేది కాదు’’ అని చెప్పారు సకుని. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డేటా ప్రకారం రaార్ఖండ్ 2001`2022 మధ్య 5.62 వేల (కిలోల హెక్టార్లు అని రాశారు. నేను వేల హెక్టార్లు అని మార్చాను. ఒకసారి చెక్ చేయండి) హెక్టార్ల చెట్ల విస్తీర్ణాన్ని కోల్పోయింది.
కొన్ని దశాబ్దాల ప్రకారం అడవిలోకి తమ ప్రయాణాలను గుర్తు చేసుకుంటూ సకుని, ‘‘అప్పుడు ఏ సమయంలోనైనా 30`40 మంది అడవిలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కువగా పశువులు, మేకల కాపరులు, పొయ్యిలోకి కట్టెలు సేకరించేవారు మాత్రమే ఉంటున్నారు’’ అన్నారు. నాలుగేళ్ళ క్రితం కూడా చాలామంది మహిళలు ఈ పనిని చేస్తుండేవారని, అయితే దీనిద్వారా వచ్చే ఆదాయం తక్కువగా
ఉండడం ఈ పనిని కొనసాగించేందుకు ఆటంకంగా మారిందని గీత చెప్పారు. వారి గ్రామంలో ఇప్పటికీ ఈ వృత్తిని కొనసాగిస్తోన్న కొద్దిమంది మహిళల్లో ఈ స్నేహితురాళ్ళిద్దరూ ఉన్నారు.
ఇప్పుడు అమ్మకానికి కట్టెలు సేకరించడాన్ని నిషేధించటం వలన కూడా మహిళలు ఆ పనిని మానేశారు. ‘‘ఇది 2020లో లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయింది’’ అని చెప్పారు సకుని. రaార్ఖండ్ ప్రభుత్వం మొదట కట్టెల సేకరణపై రుసుము విధించి ఆ తరువాత ఉపసంహరించుకున్నప్పటికీ, ఎండిన కర్రలను విక్రయించాలంటే మాత్రం వారు ఇప్పటికీ రుసుము చెల్లించాలని గ్రామస్థులు చెబుతున్నారు.
అడవిలో ఆ స్నేహితుల నడక తమనూ, తమ కుటుంబాన్నీ పోషించుకోవడం కోసమే. సకుని తన ఇరవైల వయసులో ఈ పనిని ప్రారంభించారు. ‘‘నాకు చాలా చిన్న వయస్సులోనే పెళ్ళయింది’’ అని ఆమె చెప్పారు. తాగుడుకు బానిసైన భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోవడంతో, సకుని తనను, తన ముగ్గురు కొడుకులను పోషించుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ‘‘చాలా తక్కువ పని (అందుబాటులో) ఉండేది’’ అని ఆమె చెప్పారు. ‘‘ఆకులు, దతువాఁలు (పందుం పుల్లలు) అమ్మడం ద్వారా నా పిల్లలను పోషించుకున్నాను.’’
సకుని ఇప్పుడు తన చిన్న కొడుకు 17 ఏళ్ళ అకేందర్ ఉరాఁవ్‌తో కలిసి ఒక రెండు గదుల కచ్చా ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె పెద్ద కుమారులిద్దరూ పెళ్ళి చేసుకుని అదే కోపే గ్రామంలో వేర్వేరు ఇళ్ళల్లో నివసిస్తున్నారు.
అక్కడికి కొన్ని ఇళ్ళ తర్వాత, గీత తన పెద్ద కుటుంబంలోని ఏడుగురు… ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు, కోడలు, ఇంకా ఇద్దరు మనవలతో కలిసి ఒక మట్టి ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె భర్త ఐదేళ్ళ క్రితం చనిపోయారు. గీత చిన్న కుమార్తె 28 ఏళ్ళ ఊర్మిళాదేవి కూడా దోనాలు అమ్ముతుంది. కానీ గీత ఆమెకు వేరే భవిష్యత్తును కోరుకుంటోంది. ‘‘నేను నా పెద్ద కుమార్తెను ఒక పేద కుటుంబంలో ఇచ్చి వివాహం చేశాను. నా చిన్న కూతురికి అలా చేయను. కావాలంటే కట్నం ఇస్తాను’’ అంటారామె. (ఆమెకు ఒక కుమార్తె అని మొదటి లైన్‌లో రాశారు. కానీ తర్వాత చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె అని రాశారు. గమనించగలరు)
ఏడుగురు తోబుట్టువుల్లో చిన్నదైన గీత చిన్నప్పటి నుంచి పనిచేస్తూ బడికి వెళ్ళనే లేదు. ‘‘నేను బడికి వెళ్తే, ఇంటి పనులు ఎవరు చేస్తారు?’’ అని అడుగుతారామె. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె దినచర్య మొదలవుతుంది. వంట చేయడం, ఇల్లూ వాకిలీ శుభ్రం చేయడం, అడవికి వెళ్ళేముందు పశువులను (ఒక ఆవు, రెండు ఎద్దులు) మేతకు పంపడం వంటి ఇంటి పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆమె స్నేహితురాలి దినచర్య కూడా ఇదే అయినా, గీతకు ఇంటి పనులలో కోడలు సాయం చేస్తుంది. కానీ, సకునికి సహాయం చేసేవారు ఎవరూ లేరు.
తటస్ఠ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ ఇద్దరు మహిళలు తమ సంచులను కింద పెట్టారు. చల్లగా ఉన్న ఆ ఉదయాన కూడా నడక వారికి చెమటలు పట్టేలా చేసింది. తమ చీర కొంగు చివర్లతో వారు నుదురు, మెడ తుడుచుకున్నారు.
పని ప్రారంభించడానికి ముందు వారు పాత గుడ్డ మూలలను కలిపి ముడివేసి, దాన్ని ఒక సంచిలాగా తయారు చేశారు. అందులో వారు ఆకులను ఉంచుతారు. తమ చీర కొంగులను నడుములోకి దోపుకొని, సంచిని భుజాలపైన వేలాడేసి, ఇప్పుడు వారు ఆకులు కోసేందుకు సిద్ధంగా ఉన్నారు.
వారు తమ ఎడమ చేతితో కొమ్మను పట్టుకుని, కుడిచేతితో పెద్దగా, దీర్ఘవృత్తాకారంలో ఉండే ఆకులను కోస్తారు. ‘‘ఈ చెట్టుకు మాటాలు (ఎర్ర చీమలు) ఉన్నాయి, జాగ్రత్త’’ అంటూ సకుని తన స్నేహితురాలిని హెచ్చరించారు.
‘‘మేం తక్కువ రంధ్రాలున్న మంచి ఆకుల కోసం చూస్తాం’’, తన సంచిలో కొన్ని ఆకులను వేసుకుంటూ చెప్పారు గీత. కిందికి వంగిన కొమ్మల నుండి వాటిని కోస్తారు, కానీ ఆకులు అందనప్పుడు చెట్టెక్కి గొడ్డలిని ఉపయోగించవలసి వస్తుంది. సాధారణంగా సాల చెట్లు నెమ్మదిగా, 164 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అయితే, ఈ అడవిలో ఉన్న సాల చెట్లు మాత్రం చిన్నవి, 30`40 అడుగుల ఎత్తులోనే ఉంటాయి.
సకుని దాదాపు 15 అడుగుల ఎత్తు ఉన్న ఒక చెట్టు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఆమె చీరను పైకెత్తి మోకాళ్ళ మధ్య నుంచి వెనుకకు దోపుకున్నారు. గీత ఆమెకు గొడ్డలిని అందించారు. ‘‘దానిని నరుకు’’, ఒక కొమ్మను చూపిస్తూ చెప్పారామె. కొమ్మలను ఒకే కొలత ఉండేలా పొడవుకు కత్తిరించి దతువాఁ (పందుం పుల్ల)గా ఉపయోగించేందుకు వీళ్ళు వాటిని అమ్ముతారు.
‘‘ఇది సరైన మందంలో ఉండాలి’’, ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వెళ్తున్నప్పుడు గొడ్డలితో తన దారికి అడ్డం వచ్చే పొదలను తొలగిస్తూ అన్నారు గీత. ‘‘సాల పుల్లలు చాలా మంచివి, ఎందుకంటే అవి త్వరగా ఎండిపోవు. మీరు వాటిని 15 రోజులు కూడా నిల్వ
ఉంచుకోవచ్చు’’ అని ఆమె చెప్పారు.
ఆకులను, కొమ్మలను సేకరించడం అంత తేలికైన పని కాదు. ‘‘శీతాకాలం అత్యంత గడ్డు నెలÑ మా చేతులు మొద్దుబారిపోతాయి’’ అని చెబుతారు గీత. ‘‘గొడ్డలిని గట్టిగా పట్టుకోవడం వలన నా చేతులు నొప్పిపెట్టడం మొదలవుతుంది’’. సాల చెట్లు ఆకులు రాల్చే ఫిబ్రవరి`మార్చి నెలల మధ్య, ఏప్రిల్`మే నెలల్లో మళ్ళీ కొత్త ఆకులు కనిపించేవరకూ… వారి పని ఆగిపోతుంది. ఈ సమయంలో సకుని మహువా (విప్ప) పువ్వులను సేకరిస్తారు. 2023 సంవత్సరం ప్రారంభంలో ఆమె అడవి నుండి 100 కిలోల మహువాను సేకరించి, ఎండబెట్టి, ఆ పువ్వులను స్థానిక వ్యాపారికి కిలో 30 రూపాయల చొప్పున అమ్మారు. పచ్చని ఆ పువ్వులను మద్యం తయారీకి, వంట నూనె తయారు చేయడానికి, ఇంకా వంట పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. అయితే గీత మాత్రం ఆ సమయంలో పని చెయ్యరు. వలస కూలీలుగా పనిచేస్తోన్న ఆమె ముగ్గురు కుమారుల ఆదాయం ఆ సమయంలో వారి కుటుంబాన్ని పోషిస్తుంది. ఇంట్లో ఉండే మహువా చెట్టు వారి ఇంటి అవసరాలను తీరుస్తుంది.
… … …
అడవిలో మూడు రోజుల పాటు శ్రమించి తగినంత సేకరించిన తర్వాత గీత, సకుని తమ సరుకును డాల్టన్‌గంజ్ తీసుకువెళ్తారు. సుమారు 30 కిలోల బరువుండే ఆ సంచులను మోసుకుంటూ, అక్కడికి 30 నిమిషాల నడక దూరంలో ఉన్న హెహెగరా స్టేషన్‌కు వెళ్తారు. ‘‘నేనీసారి ఎక్కువ దతువాఁలను తీసుకువెళ్తున్నాను’’ నవ్వుతూ చెప్పారు గీత. వారి వీపుపై ఉండే సంచులకు తోడుగా ఒక వెచ్చని దుప్పటి కూడా ఉంటుంది.
హెహెగరా స్టేషన్‌లో ఆ ఇద్దరు మహిళలు ఒక చెట్టు నీడను చూసుకొని కూర్చొని, తమను డాల్టన్‌గంజ్‌కు తీసుకు వెళ్ళే మధ్యాహ్నం 12 గంటల లోకల్ రైలు కోసం వేచి చూస్తారు.
‘‘పత్తా, దతువాఁ అమ్మే వారికి టికెట్లు అవసరం లేదు’’ అని సకుని ఈ విలేఖరితో చెప్పారు. ఆమె తన వస్తువులను రైలు తలుపు పక్కనే ఉన్న సీటుపై ఉంచారు. నెమ్మదిగా నడిచే ఆ పాసింజర్ రైలు 44 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటల సమయం తీసుకుంటుంది. ‘‘ప్రయాణంలోనే రోజంతా వృధాగా గడిచిపోతుంది’’ అని నిట్టూర్చింది సకుని. రైలు కదలడం మొదలైంది. గీత తన 2.5 ఎకరాల భూమి గురించి మాట్లాడడం ప్రారంభించారు. అందులో ఆమె వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, శీతాకాలంలో గోధుమలు, బార్లీ, శనగలు పండిస్తారు. ‘‘ఈ సంవత్సరం వరి పంట బాగా రాలేదు. కానీ మేం 250 కిలోల మొక్కజొన్నను 5,000 రూపాయలకు అమ్మాం’’ అని ఆమె చెప్పారు.
సకునికి సుమారుగా ఒక ఎకరం భూమి ఉంది. అందులో ఆమె ఖరీఫ్, రబీల కాలంలో పంటలు సాగు చేస్తారు. ‘‘నేను ఈసారి సాగు చేయలేదు. వరి నాటాను కానీ అది పెరగలేదు’’ అని చెప్పారామె.
వారు కబుర్లు చెప్పుకుంటుండగానే, వారి చేతులు దోనాలు తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి. నాలుగు నుండి ఆరు ఆకులను ఒకదానిపై ఒకటి అమర్చడం, వాటిని వెదురు పుడకలతో కుట్టడం… మృదువైన ఆ ఆకులు ఎన్నిసార్లు మడిచినా చిరిగిపోకుండా, చక్కని పళ్ళాలుగా తయారవుతాయి. ‘‘ఆకులు పెద్దవైతే రెండు ఆకులతో ఒక దోనా చేయవచ్చు, లేకపోతే ఒక దోనా చేయడానికి నాలుగు నుంచి ఆరు ఆకులు పడతాయి’’ అని సకుని వివరించారు.
వాటిని వృత్తాకారంలోకి తీసుకురావడానికి ఆకుల అంచులను మడుస్తారు, తద్వారా ఆహారం వడ్డించినపుడు అది పడిపోకుండా ఉంటుంది. ‘‘మనం అందులో కూర వేసినా, అది కారిపోదు’’ అని చెప్పారు గీతాదేవి.
12 దోనాలున్న ఒక కట్టను నాలుగు రూపాయలకు అమ్ముతారు. ఒక్కో కట్టలో దాదాపు 60 ఆకులు ఉంటాయి. సుమారు 1600 ఆకులను కోసి, దోనాలు చేసి, వాటిని రవాణా చేయడం ద్వారా వారికి వచ్చే సంపాదన 100 రూపాయలు.
ఈ మహిళలు దతువాఁ, పోలా (సాల ఆకులు) కూడా పదుల కట్టలుగా విక్రయిస్తారు. దతువాఁను ఐదు రూపాయలకు, పోలాను పది రూపాయలకు విక్రయిస్తారు. ‘‘ప్రజలు దతువాఁ కోసం ఐదు రూపాయలు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు, బేరమాడతారు’’ అంటారు సకుని. సాయంత్రం ఐదు గంటలకు రైలు డాల్టన్‌గంజ్‌లోకి ప్రవేశించింది. స్టేషన్ బయట, రోడ్డు పక్కనే నేలపై నీలిరంగు పాలిథిన్ పట్టాను పరిచారు గీత. మళ్ళీ ఇద్దరూ దోనాలను తయారుచేసే పనిని మొదలుపెట్టారు. వీరు పత్తల్ లేదా పళ్ళాల కోసం కూడా ఆర్డర్లు తీసుకుంటారు. ఒక పళ్ళాన్ని రూపొందించడానికి 12`13 ఆకులు అవసరమవుతాయి. ఒక పళ్ళాన్ని ఒకటి నుండి ఒకటిన్నర రూపాయలకు విక్రయిస్తారు. గృహ ప్రవేశాలు లేదా నవరాత్రులు లేదా దేవాలయాల్లో ఆహార వితరణ వంటి సందర్భాలలో వీటిని ఉపయోగిస్తారు. 100 పత్తల్‌లు లేదా అంతకంటే ఎక్కువ ఉండే పెద్ద ఆర్డర్ కోసం చాలామంది కలిసి పనిచేస్తారు.
గీత, సకునిలు వారి వస్తువులన్నీ అమ్ముడయ్యే వరకు ఇక్కడే ఉంటారు. కొన్నిసార్లు ఒకరోజు కంటే ఎక్కువ సమయం పడుతుందని, ‘‘దోనాలు అమ్మేవాళ్ళు ఇంకొంతమంది వస్తే’’, ఎనిమిది రోజుల వరకు కూడా పడుతుందని సకుని చెప్పారు. అలాంటి సందర్బాలలో ఆ నీలిరంగు పట్టా రాత్రికి వారి తాత్కాలిక పడకగా మారుతుంది. వారు తీసుకెళ్ళిన దుప్పట్లు అప్పటికి ఉపయోగపడతాయి. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే, వాళ్ళు రెండు పూటలా (శనగపిండి జావ) తింటారు. అందుకోసం ఒక్కొక్కరు రోజుకు రూ.50 ఖర్చు చేస్తారు.
వారి ‘దుకాణం’ 24 గంటలూ తెరిచే ఉంటుంది. రాత్రి రైలులో వచ్చే ప్రయాణీకులు వారి వద్ద నుండి దతువాఁలు కొంటారు. సాయంత్రానికి గీత, సకుని స్టేషన్ లోపలికి వెళ్ళిపోతారు. డాల్టన్‌గంజ్ ఒక చిన్న పట్టణం, రైల్వేస్టేషన్ వారికి సురక్షితమైన ఆశ్రయం.
మూడు రోజుల తర్వాత, గీత 30 కట్టల దోనాలు, 80 కట్టల దతువాఁలు అమ్మి రూ.420 సంపాదించగా, సకుని 25 కట్టల దోనాలు, 50 కట్టల దతువాఁలు విక్రయించి రూ.300 సంపాదించారు. తాము సంపాదించిన ఆ డబ్బుతో ఇద్దరూ రాత్రివేళ ఆలస్యంగా బయలుదేరి, మర్నాడు పొద్దున్నే బర్వాడీప్‌ాలో దించే పలామూ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. అక్కడి నుంచి హెహెగరా వెళ్ళేందుకు వారు లోకల్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. సకునికి తన సంపాదన పట్ల సంతోషం లేదు. ‘‘ఈ పని చాలా కష్టమైనది, కానీ డబ్బులు వచ్చేది చాలా తక్కువ’’, తన సంచిని సర్దుకుంటూ చెప్పారామె.
అయితే మరో రెండు రోజుల్లో వారిక్కిడికి తిరిగి రావాల్సి ఉంటుంది. ‘‘ఇది నా జీవనాధారం. నా కాళ్ళూ, చేతులూ పని చేస్తున్నంత కాలం నేనీ పని చేస్తాను’’ అన్నారు గీత.
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్‌ఎమ్‌ఎఫ్) ఫెలోషిప్ మద్దతు లభించింది.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/en/articles/tb-in-india-the-scourge-continues-te/)
ఫిబ్రవరి 17, 2024 లో మొదట ప్రచురితమైనది.)