అది 2015. పర్సనల్‌గానూ, కెరీర్ పరంగానూ ఓ సందిగ్ధ సమయం. ఇప్పుడు నాకేం కావాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్నాను. నేను ఏమన్నా సాధించేశాను అని తృప్తి పడచ్చా, లేక వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వాడుకోలేక పోయినందుకు అపజయాన్ని ప్రకటించేయాలా అని అద్దంలో చూసుకుంటున్న సమయం. ఎక్కణ్ణించి బయల్దేరానో అక్కడికే వెళ్ళి నన్ను నేను కొలుచుకోవాలి
అనిపించింది. పల్లెటూరి నుంచి, ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినవాడ్ని. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి.
అప్పుడు తట్టిన మొదటి పేరు సాయి పద్మ. ఆవిడకి పింగ్ చేసి ‘మీ హాస్టల్ పిల్లలతో ఓ వారం గడిపే అవకాశం ఇస్తారా’ అని అడిగా. చారిటీ కాదు, దాతగా కాదు, వాళ్ళలో ఒకడిగా ఉంటూ, వాళ్ళకి చదువులో సందేహాలుంటే చెప్తాను అని అడిగా. అప్పటికే ఆవిడతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఉంది. ఆవిడ వెంటనే ఒప్పుకుంది. ‘‘బర్త్‌డేలకీ, పండగలకీ పిల్లలకి భోజనాలు పెట్టే పద్ధతి నాకు నచ్చదు. కానీ స్వయంగా వచ్చి పిల్లలతో గడిపే వాళ్ళు మాకు సమ్మతమే. వాళ్ళకి బయట ప్రపంచం కూడా తెలుస్తుంది’’ అన్నది. పిల్లలకి వసతులు సమకూర్చడమే కాదు, వాళ్ళ డిగ్నిటీ మీద కూడా ఈవిడకి ఆలోచన ఉంది అని అర్థమయ్యింది.
వైజాగ్‌లో ఫ్లైట్ దిగి నేరుగా వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింట్లో భోజనం చేసి ఓ కారు మాట్లాడుకుని గజపతినగరం వెళ్ళాను. అక్కడ హైస్కూల్ పిల్లల కోసం ఓ హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్‌లో చేరే పిల్లలు చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ‘వలస’ల నుంచి వచ్చిన వాళ్ళు. ఆ వలసల్లో ఒకటి నుంచి అయిదు దాకా చదువుకుని ఆ తర్వాత ఈ హాస్టల్‌కి వస్తారు.
నా కార్యక్రమం రోజంతా వాళ్ళ ఉద్యోగి రాజుతో ఈ వలసలకి బైక్ మీద వెళ్ళడం, ఆ చిన్న చిన్న ఒక్క గది స్కూళ్ళన్నీ చూడటం, సాయంత్రానికి గజపతినగరం వచ్చి హాస్టల్ పిల్లలకి లెక్కలు చెప్పడం, కబుర్లు చెప్పడం, ఆడుకోవడం (నన్ను అన్ని ఊళ్ళల్లో తిప్పి ఎంతో సహాయం చేసిన ఈ ఉద్యోగి రాజు ఓ సంవత్సరం క్రితం చనిపోయాడు.)
ఆ ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు దుఃఖం ఆపుకోవడం కష్టమయ్యేది. ఒక్కోసారి ఆ పిల్లల తెలివితేటలకి, వాళ్ళ చలాకీతనానికీ ఆశ్చర్యపోవాల్సి వచ్చేది. ఆ ఊళ్ళలో తాగుడుకి బలై నలభై ఏళ్ళ దాకా కూడా మగవాళ్ళు బతకరు అని చెప్తే నమ్మలేకపోయాను. తల్లులు, అమ్మమ్మలు, బామ్మలు పెంచాలి పిల్లల్ని. బురదలో బైక్ కూడా వెళ్ళని ఊళ్ళకి లిక్కర్‌లో కలపడానికి కావలసిన అన్నంతో తయారుచేసే రసాయనం ఏదో ఉత్తర భారతం నుంచి దిగుమతి అవుతుందిట. ఊళ్ళకి మంచినీళ్ళు చేరవు గానీ, పరదేశం నుంచి ఓ రసాయనం మాత్రం ఈ గూడేలకి చేరగలదు. ఆ వలసల దగ్గరికి వెళ్తుంటేనే చిక్కటి సారా వాసన. ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోతున్నా, పిల్లలు దిక్కులేకుండా పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
ఈ విషయం అర్థమయ్యాక నాకు సాయి పద్మ చేస్తున్న పని విలువ మరింత అర్థమయింది. ముందుగా రోడ్డున పడిన పిల్లల్ని ఆ చిన్న గది బడిలోకి చేర్చడం, ఈ వారం మీ అమ్మాయి లేదా అబ్బాయి బడికి ఎందుకు రాలేదు అంటూ ఆ రాజు అన్నాయన ఆ తల్లుల్ని బతిమలాడటం… ఈ చిన్న బడుల్లో అయిదు పూర్తయితే వీళ్ళలో ఆసక్తి ఉన్నవాళ్ళని, గ్లోబల్ ఎయిడ్ సంస్థ సామర్ధ్యం మేరకు గజపతినగరం హాస్టల్‌కి చేరుస్తారు. నేను పాఠాలు చెప్పిన ఒకళ్ళిద్దరు పిల్లల గురించి సాయి పద్మకి చెప్తూ, వీళ్ళు చాలా దూరం వెళ్తారు అని చెప్పాను. ఒకమ్మాయి ఇప్పుడు బి.ఫార్మ్ చదువుతోంది.
గజపతినగరం నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చేదాకా నాకు నా గురించి గుర్తు రాలేదు. నాకు మర్నాడు పొద్దున హైదరాబాద్‌కి ఫ్లైట్ ఉండడంతో, రాత్రి ఒక బీచ్ ఫ్రంట్ హోటల్‌లో ఉన్నాను. స్నేహితులంతా వచ్చి కలిసి వెళ్ళాక, నాకు ఒంటరిగా సమయం దొరికాక ఏడవకుండా ఉండటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చేతిలో ఉన్న ఖరీదైన ఓడ్కా, బీచ్ ఫ్రంట్ రూం, బీచ్ రోడ్డు మీద పరిగెడుతున్న ఖరీదైన కార్లు… నాకు తెలిసిన జీవితమూ, నేనూ… కొత్తగా కనపడ్డాయి. నాకు గిల్ట్ భావనలాంటివేమీ లేవు. ఈ దేశంలో అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో నగ్నంగా నాకు అర్థమయిన రోజు. కథల్లో, వ్యాసాల్లో, అంకెల్లో ఈ అంతరాల గురించి మనకి తెలుస్తుంది కానీ అర్థం కాదు. మనకి పక్కనే మనం ఎక్కడ్నుంచి వచ్చామో ఆ సమూహాలే మనకి ఇంత దూరం ఎలా అయిపోయాయి?
కావాలనే నేను సాయి పద్మ గురించి కన్నా ఈ పిల్లల గురించీ, నా గురించీ రాస్తున్నాను. ఈ ఒక్క గ్రామం గురించీ, మనుషుల గురించీ నేను చాలా రాసి ఉండాల్సింది, ఇప్పటిదాకా రాయకపోవడం నేరం. వీటన్నిటి గురించి రాయడమే సాయి పద్మ గురించి రాయడం. ఒక్క వారం రోజులు ఆ ప్రాంతంలో గడిపితేనే తట్టుకోలేక పోయిన నాకు, ఆ మనిషి వీల్ చైర్‌లో కూర్చుని, ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని అన్నేళ్ళు ఎలా ‘నిల’బడగలిగింది అనేది నాకు ఊహకందని విషయం… అది కూడా ముఖమ్మీద చిరునవ్వు చెరక్కుండా. ఆవిడ దగ్గర బోలెడు పుస్తకాలు ఉన్నాయి. ఆవిడకి సాహిత్యం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
2015లో నా అసంబద్ధ సందిగ్ధాలూ, అసంతృప్తులూ అన్నీ ఆవిడని కలిసి, ఆ ప్రపంచం చూశాక హాస్యాస్పదంగా అనిపించాయి. ఇకనుంచీ ఏ బాలిక అడ్మిషన్ గురించో, మరింకేదో అవసరం గురించో నా వాట్సాప్‌కి ఆవిడ మెసేజ్ పెట్టదు అని నమ్మాలని లేదు. ఆవిడ మొదలుపెట్టిన పనులను, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడం, అందుకు సహకరించడమే మనం ఇప్పుడు చెయ్యాల్సిన పని.
(సారంగ వెబ్ మ్యాగజైన్ నుండి…)