అమ్మలు అందరూ మంచివాళ్ళా అంటే ఏమో నేను చెప్పలేను. రకరకాల పరిస్థితుల్లో, రకరకాలుగా వ్యవహరించే అమ్మలను ఎంతమందిని చూశాను, విన్నాను కూడా. కానీ ఖచ్చితంగా చెడ్డవాళ్ళు కారు అని మాత్రం చెప్పగలను.
ఈ ఫోటోలో కనిపిస్తున్న షవర్ చైర్ నేను ఒక గంట కష్టపడి assemble చేశాను. మామూలు వాళ్ళకి ఇది పెద్ద పని కాదు కానీ, వీల్ ఛైర్‌లో ముందుకి, వెనక్కి వెళ్తూ దేన్నయినా కూర్చడం అనేది నా వరకు నాకు చాలా పెద్ద పని. అమ్మ ఉంటే, ఏంటి నీకు ఈ బాధ ఎందుకు… ఇలా అనుకుంటూ చాలా బాధపడేది. పిల్లలకి, ముఖ్యంగా నాలాంటి వికలాంగ పిల్లలకి ఈ బాధ, దాని వెనుక ఉన్న గిల్టీనెస్ చూడడం ఒక నరకం. డిజెబిలిటీ ఉన్నవాళ్ళు… చాలా మెంటలన హెల్త్ ఇష్యుస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది, నీ వల్లే ఇదంతా జరిగింది, నీ వల్లే కుటుంబంలో మనశ్శాంతి కరువైంది, నువ్వు ఎలాగూ సెటిల్ అవ్వవు, నీ వల్ల మిగతా వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది… ఇలాంటి మాటలు వినని వికలాంగులు లేరేమో అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇవాళ పొద్దున్న నుంచి నాకు చాలా నీరసంగా ఉన్నా, అనుకోకుండా సుమారు ఆరుగురు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. రకరకాల స్టేజ్‌లలో ఉన్నవాళ్ళు, తెలివి, చదువు, అందం, ఆరోగ్యం ఉన్నవాళ్ళే కాకుండా, లేనివాళ్ళు కూడా ఉన్నారు. అందరిదీ ఒకటే బాధ… నిరంతరం ఏది లేదో దాన్ని మాత్రమే ఎత్తి చూపించి న్యూనతలోకి, డిప్రెషన్‌లోకి నెట్టేసే మనుషులు, పరిస్థితులు. దీనికి, అమ్మకి ఏం సంబంధం అనుకుంటున్నారా… ఆగండి, ఆగండి చెప్తాను… చాలా చిన్నప్పటి నుంచి disability ఉండడం వల్ల చిన్నప్పుడు అర్థం కాదు గానీ, ఎదుగుతున్నప్పుడు ప్రతి విషయం ఒక న్యూనతా ప్రహసనం. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో పక్కకెళ్ళేదాకా కూడా ఆగరు, మొహం మీద అనేస్తారు. అలా మా అమ్మని చాలామంది అనేవారు. అందులో కొన్ని ముఖ్యమైనవి…
1. ఏంటమ్మా నువ్వు డాక్టర్‌వి కదా, మీ పిల్లకి టీకాలు ఇప్పించలేదా
2. అందరికీ మంచి చేస్తావు కదా, నీకేంటి శాపం లాంటి పిల్ల పుట్టింది
3. చదువుకున్న వాళ్ళు నమ్మరు గానీ, గత జన్మలో ఏదో పాపం చేసి ఉంటావు అమ్మాయ్
4. ఈ పిల్లని పెంచాలంటే బాగా సంపాదించాల్సిందే
5. అయినా… నువ్వు, మీ ఆయన ఇలా క్యాంపులు అంటూ తిరిగితే, పాపం మీ అమ్మ, నీ చెల్లెలు దానితో చాలా అవస్థలు పడుతున్నారు.
6. సంబంధాలు చూడడం మొదలుపెట్టారా… అయినా, మీ పెద్దమ్మాయి అలా అయిపోయింది కదా. మీరు మాత్రం ఏం చేస్తారు? మీ ఆస్తి చూసి చేసుకోవాల్సిందే.
అదృష్టమో, దురదృష్టమో నాన్నగారి దగ్గర ఎవ్వరూ ఇలాంటి మాటలు వాడేవారు కాదు, మే బీ అన్నా ఆయన పట్టించుకునేవారు కాదేమో. కానీ, అమ్మ అడ్డంగా దొరికిపోయేది. ఒక్కోసారి స్పోర్టివ్‌గా తీసుకున్నా, చాలాసార్లు అమ్మ మొహం మాడిపోవటం, నిశ్శబ్దంగా, మౌనంగా తనలో తాను ఉండిపోవడం గమనించాను నేను. తర్వాత అమ్మ చాలా ఏళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. వాళ్ళతో ఉన్నవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అది ఎంత భయంకరమైన వలయమో. నేను, చెల్లి మాకు చేతనైనంత ధైర్యం చెప్పేవాళ్ళం. అయినా డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు చాలా చాలా బలవంతులు, మొండి వాళ్ళు కూడా. అమ్మతో మేము పోట్లాడేవాళ్ళం. మేము బాగున్నాము అని చెప్పేవాళ్ళం. పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేవాళ్ళం. ఇంకా చాలా చేసేవాళ్ళం. చలం చెప్పినట్టు… జీవితాన్ని తన స్వశక్తితో మలుచుకున్న ప్రతి ఒక్కరి వెనుక భరించలేనంత మొండితనం, వాళ్ళకి మాత్రమే సొంతమైన స్వార్థం ఉంటుంది. వాళ్ళకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఇది అర్థం కాదు. మేము చెప్తున్నకొద్దీ అమ్మ ఇంకా ఇంకా మొండితనంలోకి వెళ్ళేది. నిద్ర మాత్రలు, anxiety pills, తన జీవితంలో భాగమయ్యాయి. ఎంత పని చేసేదో అంత మౌనంగా కూడా ఉండేది. మధ్యమధ్యలో కొన్నేళ్ళు చాలా నార్మల్‌గా, మరి కొన్నేళ్ళు పని రాక్షసిలా, మరి కొన్నేళ్ళు మా ఫ్రెండ్‌లా ఉన్న అమ్మ… అమ్మమ్మ పోయిన తర్వాత మాత్రం మనస్ఫూర్తిగా నవ్వడం తగ్గించేసింది. డిప్రెషన్ ఒక భయంకరమైన గుహ. ఒకసారి ఆ వలయంలో చిక్కుకున్న వాళ్ళు బయటకు వచ్చినట్లు అనిపిస్తారు కానీ, సమయం, వెసులుబాటు దొరికితే తమదైన ప్రపంచంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ క్లినికల్ డిప్రెషన్ గురించి తెలిసినంతగా, అప్పుడు తెలీదు. అమ్మ ఎందుకు అలా ఉంటుంది? అసలు ఏంటి కష్టం? అనే కోపంలో ఉండేదాన్ని.
ఇన్ని శారీరక బాధలు దాటి, నన్ను నేను మలుచుకున్న ధైర్యమంతా, అమ్మ కన్నీళ్ళ ముందు ఆవిరైపోయేది. ఏదైనా మాట్లాడితే, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెబితే నీకేం తెలుసు, నువ్వు నీ వీల్‌చైర్ సంగతి చూసుకో అని నిర్దాక్షిణ్యంగా కట్ చేసేది. నాకు తెలిసిన అమ్మేనా అనిపించేంది. మళ్ళీ వెనుక నేను ఎలా ఉన్నాను అన్నది పెళ్ళి కాక ముందు పిన్నినీ, తర్వాత ఆనంద్‌నీ అడిగేది. నేను జనాల మాటలు, దగ్గర వాళ్ళ కామెంట్స్ పట్టించుకొని బాధ పడుతున్నానని గమనించి, పద్మా… ఎవరి డెసిషన్‌కి ఎవరూ బాధ్యులు కారు, నువ్వు గిల్ట్ ఫీల్ కాకు అనేది…!! ఇదంతా ఎందుకు రాస్తున్నానో నాకే తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం మా అమ్మలాంటి ఎంతోమంది అమ్మాయిలకి చెప్పాలని అనుకుంటున్నా…!! ఎన్ని అయినా రానీండి, మీరు చాలా స్పెషల్… మీకు పిల్లలుంటే, వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, కానీ డిప్రెషన్‌ని వారసత్వంగా ఇవ్వకండి. అద్భుతమైన మనుషులు శిథిలం అవుతుండగా నిస్సహాయంగా చూడడం కన్నా… ప్రత్యక్ష నరకం మరొకటి లేదు…!!