అనువాదం: ఎ.సునీత
అప్పుడూ, ఇప్పుడూ స్త్రీవాదం ఆధ్యాత్మిక ఆచరణకి పెద్దపీట వేసే ఒక ప్రతిఘటనా ఉద్యమమే. నా జీవితంలోకి స్త్రీవాద సిద్ధాంతం, ఆచరణ ప్రవేశించి ‘మనల్ని మనం ప్రేమించుకోవటం, ఒప్పుకోవటం రెండూ మన జీవితాన్ని మనమనుకున్నట్లు పరిపూర్ణం చేసుకోవటానికి అత్యవసరం’ అని అర్థం చేయించే ముందు, ఇటువంటి సందేశాలనిచ్చే ఇంకొక ఆధ్యాత్మిక దారిలో నేనూ నడిచాను.
అన్ని మతాలూ పురుషాధిక్యతతో నిండిపోయి ఉన్నప్పటికీ, స్త్రీలకి ఆధ్యాత్మిక మార్గంలో కొంత స్వాంతనం, ఆశ్రయం దొరికాయి. పశ్చిమ క్రైస్తవ చర్చి చరిత్రలో పురుషుల జోక్యం లేకుండా దేవుడి సమక్షంలో గడపాలనుకున్న అనేక మంది స్త్రీలు మొనాస్టరీలలో చేరి దేవుని సేవలో గడపటం మనం చూడొచ్చు. స్త్రీ వాదం రావటానికి చాలా ముందే జులియన్ ఆఫ్ నార్విచ్ ‘‘మన రక్షకురాలే (సేవియర్) మన నిజమైన తల్లి. ఆమెలోనే మనం పుడతాము, ఆమె లేకుండా మనం లేము’’ అని తన తీక్షణ దృష్టి, అలౌకిక స్పష్టతతో రాశారు. రక్షకులు (సేవియర్) ఎప్పుడూ మగవాళ్ళు మాత్రమేనన్న భావనని సవాలు చేసిన నార్విచ్, దైవిక స్త్రీత్వం (సేక్రెడ్ ఫెమినిన్ ` మూల దేవతలు) దగ్గరికి తిరిగి వెళ్ళటానికి మనం చేయాల్సిన ప్రయాణానికి దారులు వేశారు. పితృస్వామిక మతాలకి చేస్తున్న బానిసత్వం నుండి స్త్రీలని స్వతంత్రులను చేయడానికి సహాయం చేశారు.
తొలి రోజుల్లో స్త్రీవాద ఉద్యమం పితృస్వామిక మతంపై విమర్శని ఎక్కుపెట్టి దైవాన్ని ఆరాధించే తీరులో మార్పు తేవటానికి తోడ్పడిరది. పాశ్చాత్య తాత్వికతలో బలంగా వేళ్ళూనుకుని ఉండే ద్వైతం (ప్రపంచం ఎప్పుడూ ఒకటితో మరొకటి కలవని ఉన్నతం / నీచం, మంచి /చెడు అనే రెండు రకాల తరగతులుగా విభజించబడి ఉంటుందని, ఈ వివిధ వైఖరిలో చూస్తే అంతా అర్థం చేసేసుకోగలం అనే నమ్మకం) అనేక రకాల సమూహ (కలెక్టివ్) అణచివేతలకు (సెక్సిజం, రేసిజం మొదలైనవి) భావజాల పరమైన పునాదులని ఏర్పర్చిందని, యూదు`క్రైస్తవ (జూడియో క్రిస్టియన్) విశ్వాస వ్యవస్థకు (బిలీఫ్ సిస్టం) ఇదే మూలమని స్త్రీవాద విమర్శ బహిర్గతం చేసింది. మనం దైవాన్ని ఆరాధించే పద్ధతులని మార్చుకోవాలంటే ఆధ్యాత్మికతకు ఉన్న అర్థాన్ని, దాని ఉద్దేశ్యాలని పునరాలోచించుకోవాలి. స్త్రీవాద విమర్శ వచ్చిన సమయంలోనే అమెరికాలో సాంస్కృతికంగా కొత్త తరం ఆధ్యాత్మికత వైపు గాలి తిరిగింది. శతాబ్దాల తరబడి ఆ సమాజాలని శాసించిన మౌలిక యూదు క్రిస్టియన్ విశ్వాసాల నుండి పక్కకి మళ్ళీ భిన్నమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలున్న సంస్కృతుల వైపు అనేకమంది చూపు సారించారు. ‘మనుషులు పాపాలు చేసి ఆ తర్వాత కష్టపడి తమని తాము పైకి లాక్కుని మోక్షం పొందుతారు’ అని నమ్మే పితృస్వామ్య ఆధ్యాత్మికత స్థానంలోకి సృష్టిపై ఆధార (క్రియేషన్ ఓరియంటెడ్) పడిన ఆధ్యాత్మికత వచ్చి చేరింది. బుద్ధిజం, హిందూయిజం, ఊడౌన్ వంటి భిన్నమైన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో వీళ్ళకి స్త్రీ దేవతలు దొరకడంతో స్త్రీ దేవతల కేంద్రంగా ఉండే ఆధ్యాత్మికత వైపు మళ్ళడానికి వారికి అవకాశం దొరికింది.
మొదట్లో, స్త్రీవాద ఉద్యమం రాజకీయాలకు పరిమితం కావాలని, మతం జోలికి వెళ్ళకూడదనే కార్యకర్తలతో ఆధ్యాత్మిక స్త్రీవాదులకి సంవాదం, సంఘర్షణ జరిగింది. సామ్యవాద రాజకీయాల నేపథ్యం నుండి రాడికల్ స్త్రీవాదం లోనికి ప్రవేశించిన స్త్రీలలో అనేకమంది నాస్తికులు. స్త్రీ దేవతల కేంద్రీకంగా ఉండే దైవత్వం వైపు మళ్ళటాన్ని వాళ్ళు రాజకీయం లేని సెంటిమెంటల్ వ్యవహారంగా చూశారు. అయితే, ఈ విభజన ఎక్కువ రోజులు నిలవలేదు. అనేకమంది స్త్రీలు పితృస్వామ్య మతాన్ని సవాలు చేయడానికీ, విముక్తి వైపు నడిచే ఆధ్యాత్మికతకూ మధ్య ఉండే సంబంధాన్ని త్వరలోనే గ్రహించారు. అమెరికాలో అత్యధిక శాతం తమని తాము క్రిస్టియన్లుగా భావించుకుంటారు. మిగతా మతాల కన్నా, సెక్సిజం, పురుషాధిపత్యంతో కూడిన క్రిస్టియన్ మత విశ్వాసాల ద్వారానే ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు, పురుషుల జెండర్ పాత్రల గురించి నేర్చుకుంటారు. ఇటువంటి మత విశ్వాసాల్ని మార్చకుండా అమెరికన్ సంస్కృతిని స్త్రీవాద ప్రభావిత సంస్కృతిగా మార్చటం అసాధ్యం.
సృష్టి కేంద్రంగా (క్రియేషన్ సెంట్రిక్) ఏర్పడిన క్రిస్టియన్ ఆధ్యాత్మిక మేలుకొలుపు స్త్రీవాద ఉద్యమంతో కలిపి అడుగులు వేసింది. మాథ్యూ ఫాక్స్ తన ‘ఒరిజినల్ బ్లెస్సింగ్’ పుస్తకంలో దీని గురించి ఇలా వివరించారు, ‘‘పితృస్వామిక మతాలు, ఆ మతాల్లోని పితృస్వామిక దృష్టి ప్రపంచ నాగరికతలని దాదాపు 3500 సంవత్సరాల పాటు పాలించాయి. సృష్టి కేంద్రంగా ఉండే ఆధ్యాత్మికత సంప్రదాయం ఒక స్త్రీవాద సంప్రదాయం. ఈ ఆధ్యాత్మికతలో జ్ఞానం, నియంత్రణ కన్నా వివేకం, ప్రేమ, శృంగారానికి ప్రాధాన్యత ఉంటుంది’’. ప్రకృతి/పర్యావరణం గురించి మాట్లాడే స్త్రీవాదులకి, పౌర హక్కుల గురించి మాట్లాడే స్త్రీవాదులకి మధ్య వచ్చిన ఘర్షణల గురించి స్పందిస్తూ, ఈ రకమైన విభజన అనవసరమని మాథ్యూ అంటారు.
‘‘మన విశ్వ వికాసంలో న్యాయం కోసం జరిగే రాజకీయ ఉద్యమాలు ఒక భాగం. మనుషులు తమ గురించి, ప్రపంచాన్ని మార్చగలిగే తమ శక్తిని గురించి తెలుసుకోవటానికి ప్రకృతి ఎప్పుడూ ఒక మాతృకగా ఉంటుంది. ఈ జగత్తులో న్యాయం, సమతౌల్యం, సామరస్యం, సంబరం ఎంత సంపూర్ణంగా వికసించవచ్చో విముక్తి ఉద్యమాల రూపంలోనే మనకు అర్థమవుతుంది. అందువల్లే నిజమైన ఆధ్యాత్మిక విముక్తి మనలని, జరిగిన విముక్తిని పండుగగా జరుపుకోవటం, దాని ద్వారా తగిలిన గాయాలని మాపుకోవటం రెండిరటినీ ఆచారాల్లాగా జరుపుకొమ్మంటుంది. దీంతో మనుషులు కూడా తమని తాము మార్చుకుని, వ్యక్తిగత మోక్షం పొందే అవకాశం కలుగుతుంది.’’
పీడిత ప్రజానీకం, అణచబడిన సమూహాల విముక్తిని ఈ సంప్రదాయంలో దైవేచ్ఛని ప్రతిబింబించే విశ్వాసపూరిత చర్యలుగా పరిగణిస్తారు. అలాగే పితృస్వామ్య నిర్మూలనని కూడా దైవేచ్ఛగానే చూస్తారు. ఛాందస పితృస్వామ్య మతాలు ఎప్పుడూ కూడా స్త్రీవాద ఆలోచన, ఆచరణలని ప్రపంచంలో వ్యాపించకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మత ఛాందస వాదులు స్త్రీవాద ఆలోచనా పరులని, ముఖ్యంగా స్త్రీల పునరుత్పత్తి హక్కుల గురించి మాట్లాడేవాళ్ళని చంపాలని పిలుపునివ్వటమే కాకుండా, ఆయా హత్యలని సమర్ధించే వారిలో ముందుంటారు. క్రైస్తవంపై స్త్రీవాద విమర్శలు సాధారణ స్త్రీలని ఉద్యమం నుండి వేరు చేశాయి. ఎప్పుడయితే స్త్రీవాద క్రిస్టియన్లు బైబిల్‌నీ, క్రైస్తవాన్నీ ‘సృష్టి కేంద్రంగా’, కొత్తగా అర్థం చేయించారో అప్పుడు స్త్రీలకి తమ స్త్రీవాద రాజకీయాలను, వ్యక్తిగత క్రైస్తవ ఆచరణని సమన్వయపరచుకోవటానికి వీలుపడిరది. అయితే స్త్రీవాదానికి, క్రిస్టియన్ ఆధ్యాత్మికతకు ఘర్షణ లేదనే అవగాహనతో ఉద్యమాన్ని నిర్మించి స్త్రీలందరినీ ప్రభావితం చేసే కార్యక్రమం ఇంకా మిగిలే ఉంది. యూదు, బుద్ధిస్ట్, ముస్లిం స్త్రీవాదులు కూడా ఇటువంటి ఉద్యమాలని నిర్మించాలి. అది జరిగేవరకూ వ్యవస్థీకృత పితృస్వామిక మతాలన్నీ స్త్రీవాదం తీసుకొచ్చిన మార్పుకి చిల్లు పొడిచి వెనక్కి లాగుతూనే ఉంటాయి.
మొదటి తరం స్త్రీవాదులు పౌర హక్కులు, భౌతిక ప్రయోజనాల మీద పెట్టినంత ధ్యాస ఆధ్యాత్మికతపై పెట్టలేదు. ప్రధాన స్రవంతి మీడియా ఈ స్త్రీవాద విమర్శ పట్ల చూపించినంత ఆసక్తిని, ఆ తర్వాత భిన్న రకాల స్త్రీవాదుల్లో ఆధ్యాత్మికత పట్ల వచ్చిన మార్పు పట్ల చూపించలేదు. అందువల్లే అనేకమంది స్త్రీలు స్త్రీవాదాన్ని మత వ్యతిరేకని ఇప్పటికీ భావిస్తారు. వాస్తవానికి, స్త్రీవాదం పితృస్వామిక మతాల ఆలోచనా తీరు మారటానికి సహకరించి, మరింతమంది స్త్రీలు దైవత్వానికి దగ్గరవటానికి తోడ్పడి, వారిని ఆధ్యాత్మిక జీవితానికి నిబద్ధులుగా ఉండేలా చేసింది.
పితృస్వామ్య దాడులలో దెబ్బతిన్న స్త్రీలు తమని తాము నయం చేసుకోవటానికి థెరపీకి వెళ్ళినపుడు అక్కడ వారి స్త్రీవాద ఆధ్యాత్మిక ఆచరణకి గుర్తింపు, ఆదరణ లభించింది. ఆయా దెబ్బలన్నీ వారికి పుట్టిన కుటుంబాలలో, ఇతర దగ్గరి సంబంధాలలో తగిలినవే. స్త్రీవాద థెరపీ ఆచరిస్తున్న చోట స్త్రీల ఆధ్యాత్మిక అన్వేషణకు ఆమోదం దొరికింది. అయితే ఇటువంటి ఆత్మాన్వేషణ వ్యక్తిగత స్థాయిలో జరగడంతో ఆధ్యాత్మిక అన్వేషణకు స్త్రీవాద కార్యకర్తలు ఎంత ప్రాధాన్యమిస్తారోనన్న సంగతి ప్రజలకు తెలియలేదు. భవిష్యత్తులో ఇటువంటి స్త్రీవాద కార్యకర్తల ఆధ్యాత్మిక అన్వేషణ గురించి ఇతరులతో పంచుకోవటానికి స్త్రీవాద ఉద్యమం సరైన మార్గాలని ఎంచుకోవాలి.
ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక దారుల్ని ఎంచుకోవటం వల్ల ఆయా స్త్రీలకి ఒక పక్క పితృస్వామ్య మత సంప్రదాయాలని సవాలు చేస్తూ, ఇంకో పక్క తమ ఆధ్యాత్మిక జీవితానికి నిబద్ధులై బ్రతకటం సాధ్యమయింది. పితృస్వామ్యాన్ని వ్యవస్థీకృత రూపంలో కొనసాగించే చర్చిలు, దేవాలయాలన్నీ స్త్రీవాదుల జోక్యం వల్ల మారాయి. అయితే ఈ మధ్య చర్చి జెండర్ సంబంధిత వ్యవహారాల్లో జరిగిన ప్రగతినంతా వదిలేస్తోంది. పెరుగుతున్న మత ఛాందసవాదం ప్రగతిశీల ఆధ్యాత్మికతని దెబ్బ తీస్తోంది. ప్రపంచంలో అసమానత్వం అన్నది ‘సహజం’ అని నమ్మే మత ఛాందస వాదం స్త్రీల శరీరాలపైన నియంత్రణ అవసరమనే భావనని బలపరుస్తుంది. అందువల్లే అది స్త్రీల పునరుత్పత్తి హక్కులపై దాడులు చేస్తుంది. పైగా ఈ ఛాందస వాదం స్త్రీలు, పురుషుల లైంగికతని అణచిపెట్టి ఉంచటాన్ని, దానిలో భాగంగా వివిధ రకాల లైంగిక నిర్బంధాన్ని కూడా ఆమోదిస్తుంది. ఇప్పుడు కూడా స్త్రీ వాద కార్యకర్తలకి వ్యవస్థీకృత మతాల గురించి మాట్లాడి, వాటి గురించి విమర్శించి, పై ధోరణులని వ్యతిరేకించాల్సిన అవసరం చాలా ఉంది.
స్త్రీవాదాన్ని బట్టి బలపరిచే అద్భుతమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలిప్పుడు అనేకం ఉన్నాయి. కానీ, సాధారణ ప్రజలకి వీటి గురించి ఏ పరిజ్ఞానం అందుబాటులో లేదు. పితృస్వామ్య మతాలు మాత్రమే వారి ఆధ్యాత్మిక శ్రేయస్సుని పట్టించుకుంటాయని వారు ఇప్పటికీ అనుకుంటున్నారు. ఈ మతాలు తమ సందేశాల్ని ప్రజల్లోకి పంపించటానికి ప్రసార సాధనాలని, ముఖ్యంగా టెలివిజన్‌ని బాగా వాడుకుంటున్నారు. మన ప్రత్యామ్నాయ ఆధ్యాత్మికత గురించి అందరికీ తెలియజేయడానికి మనం కూడా ఈ పద్ధతులనే వాడుకోవాలి. స్త్రీ వాద ఆధ్యాత్మికత పాతబడిపోయిన విశ్వాసాల్ని ప్రశ్నించటానికి ఒక చోటుని సృష్టించింది, కొత్త దారులని వేసింది. దేవుణ్ణి భిన్న రకాలుగా చిత్రించి స్త్రీత్వాన్ని దైవత్వంలో భాగంగా చూసిన సంప్రదాయాలని ముందుకు తెచ్చింది. స్త్రీల దైవత్వం పట్ల గౌరవం పెంచి, మన ఆధ్యాత్మిక జీవితాల ప్రాధాన్యతని ఆమోదించింది, బలపరిచే దారులని మనకి చూపించింది. ఏ రకమైన అణచివేత నుంచి విముక్తి కోరుకోవటమయినా అది ప్రధానంగా ఒక ఆధ్యాత్మిక అన్వేషణ. అది మనల్ని న్యాయం, విముక్తి కోసం సంఘర్షించే ఆధ్యాత్మిక దారికి మనల్ని చేరుస్తుంది. మన ఆధ్యాత్మిక పరిపూర్ణత గురించి స్త్రీవాదం అందించే విమర్శనాత్మక దృష్టి అసలు సిసలయిన ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు ఏర్పరుస్తుంది.