ఏమిటీ దౌర్భాగ్యం? – వి.శాంతి ప్రబోధ

‘‘అయ్యో పాపం… ఎంత పనైపో యిందమ్మా…చ్చ్‌ చ్ఛో… తిలోత్తమ చనిపోయిందటమ్మా’’ ఏడుపు గొంతుకతో యాదమ్మ.
‘‘అవునా…ఎట్లా’’ ఆరా తీసింది అత్తగారు. ఆవిడ చూసే సీరియల్‌ నటి కావడంతో ఆసక్తి.

‘‘కారు టక్కరయిందట’’ అని ఒక్క నిమిషం ఆగి ‘‘తిలోత్తమ తమ్ముడు ఆమె పెనిమిటేనట’’ అని చెప్పి లోనికి వెళ్ళి పోయింది.
చీపురు, చేటతో వస్తూ ‘‘పెద్దమ్మగారు ఆ చందు ఆమె మగడు కాదట, ఉంచు కున్నోడట’’ గుసగుసగా చెప్పి పనిలో పడిరది యాదమ్మ.
‘‘కట్టుకున్న వాళ్ళ ఉసురు తగిలి చచ్చి ఉంటారు’’ టీవీలో చూసిన అత్తగారు… అదంతా పేపర్‌ చదువుతున్న నా చెవిలో పడుతూనే ఉంది.
యాక్సిడెంట్‌లో బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణవార్త, ఆమెతో పాటు ఆమె ప్రియుడు చంద్రకాంత్‌ గురించి వార్తలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత రెండు రోజులకి చందు ఆత్మహత్య… వెల్లువెత్తిన యూట్యూబ్‌ ఛానెళ్ళ వీడియోలు.
నిన్నటి వరకూ ఆవిడెవరో, అతనెవరో తెలియదు. వారి మధ్య ఉన్న నంబంధమేమిటో నాలాంటి వాళ్ళకు తెలియదు. ఇప్పుడు ఆవిడ, అతను మాత్రమే కాదు, వారిరువురి కుటుంబాలను కూడా వీథిన పడేశారు మన మీడియా, సోషల్‌ మీడియా వాళ్ళు.
ఇదంతా ఎందుకోసం? ఎవరికోసం? ఈ హడావిడితో లబ్ది పొందేది ఎవరు? నష్టపోయేది ఎవరు?
పవిత్ర జయరాం, చంద్రకాంత్‌ అనే ఇద్దరి జీవితాల్లో చీకట్లు, సంతోషాలు ఏమో కానీ పెళ్ళయిన ఇద్దరూ తమ కుటుంబాలను వదిలి తమదైన లోకంలో విహరించే విషయం నిన్నటి వరకూ ఆ రెండు కుటుంబాలకు కూడా పూర్తిగా తెలీదేమో! కానీ ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు.
జీవిత భాగస్వామితో, కన్న పిల్లలతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆ తల్లి/తండ్రి అది మరచిపోయారు. వాళ్ళకి తమ తమ కుటుంబ జీవితంలో అసంతృప్తి ఉండవచ్చు లేదా అది సుఖసంతోషాలను ఇవ్వకపో వచ్చు. బాధలు, బాధ్యతలు ఉండొచ్చు. ఒకరినొకరు భరించలేని స్థాయిలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పుడు ఆ బంధానికి స్వస్తి చెప్పొచ్చు. కొత్త బంధంలో జీవితాన్ని నిర్మించుకోవచ్చు. కానీ తనను నమ్మిన వారిని వంచించి, బాధించి మరో జీవితం లోకి అడుగుపెట్టడం ఎంతవరకు సబబు?
పెద్దల సంగతి కాసేపు పక్కన పెట్టి వారి పిల్లల గురించి ఆలోచిస్తే, పిలల్ల మానసిక భావోద్వేగ పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్‌ సంగతి ఏంటి? ముందే పెళ్ళై ఇద్దరు చిన్నారులకు తండ్రి అయిన చంద్రకాంత్‌, ఇద్దరు ఎదిగిన పిల్లలకు తల్లి అయిన పవిత్ర జయరాంల మధ్య ఏర్పడిన బంధం గురించి జరుగుతున్న ప్రచారం ఆ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో మీడియా ఆలోచించదా?
ఆమె పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం జీవితంతో పోరాటం చేసి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు జరిగింది ఏమిటి? ఈ సమాజం ఆ తల్లి పిల్లలని నిన్నటిలాగే రేపు కూడా చూస్తుందా? ఎదుటివారి జీవితాల్లోకి చొచ్చుకొచ్చి తీర్పులు ఇచ్చే జనాన్ని తట్టుకోగలరా? వారికి ఎందుకీ హింస.
ఛీ ఛీ… అసలే దుఃఖంలో ఉన్న అతని భార్య, ఆమె భర్త, పిల్లల ముందు మైక్‌ పెట్టి ఇంటర్వ్యూ పేరుతో చిత్రహింస పెడు తున్నారు. వారి భావోద్వేగాలతో పనిలేదా? వెళ్ళి మైక్‌ వారి ముందు పెట్టి మాట్లాడి స్తున్నారు. వారిని నడి బజారులో నిలబెట్టి నిలువునా ముంచుతూ పలికే సానుభూతి వచనాల వల్ల ఆ పిల్లలకు ఒరిగేది ఏమిటి? ఆ పిల్లలు రేపటి నుండి సమాజాన్ని ఎదుర్కోవాలంటే ఎంత యుద్ధం చేయాలో… ఎంత యాతన పడాలో…
ఇప్పటికే జరుగుతున్న రచ్చ చూసి వారెంత కుంగిపోయారో… రేపు వాళ్ళు ఏమైనా చేసుకుంటే అందుకు బాధ్యులెవరు?
ఒక స్త్రీ మోజులో పడి జీవితం విలువ తెలియనివాడు ఆత్మహత్య చేసుకుంటే, అదేదో దేశం కోసం పోరాడి ఆత్మ త్యాగం చేసి అమరుడైనట్లు అడుగడుగునా లైవ్‌ షోలు, ఇంటర్వ్యూలు… వగైరా, వగైరా… పనికిమాలిన ఛానళ్ళకు రేటింగ్‌ తప్ప బాధ్యత లేదా? హు… పీనుగుపై పేలాలు ఏరుకు తినే ఛానళ్ళు.
ఈ లోకంలో ఇంకేమీ వార్తలు లేనట్లు, చట్టవిరుద్ధమైన పనిచేసిన వారి చావును దేశ నేతల చావు లాగా విలువ ఇస్తూ జనం సమయం కొల్లగొట్టేస్తున్నాయి ఛానళ్ళు. వాళ్ళకు రైతుల సమస్యలు అవసరం లేదు. రైతు ఆత్మహత్య చేసుకుంటే అది వార్త కాదు, సమస్య కాదు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేసే వాళ్ళని, న్యాయం కోసం గొంతెత్తిన వాళ్ళని జైళ్ళలో కుక్కితే అది వార్త కాదు. ప్రభుత్వ సొమ్ము అడ్డగోలుగా అప్పనంగా కట్టబెట్టేస్తున్నా అది వార్త కాదు.
ఈ దేశానికి ఎంతటి దౌర్భాగ్య స్థితి?!
స్వార్థపూరితమైన మనిషి నుండి ప్రకృతిని, పర్యావరణాన్ని మాత్రమే కాదు మానవ సహజ ప్రకృతిని కూడా పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనదే.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.