భూషణం కథలు – గిరిజన జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు

అడవులలో, కొండ ప్రాంతాలలో నివసిస్తూ లేదా సంచార జీవనము గడుపుతూ ఆదిమ సంస్కృతిలో ఉండే తెగవారిని ‘గిరిజనులు’ అంటారు. ప్రపంచ దేశాలలో అన్ని జాతుల సంస్కృతుల కన్నా ఆదివాసుల సంస్కృతి భిన్నంగానూ, అపురూపంగాను ఉంటుంది.

‘‘ప్రకృతిలో దొరికే ఆహారాన్ని సేకరించే మానవులు చిన్నచిన్న గుంపులుగా ఏర్పడతారు. ఈ గుంపు వ్యవస్థీకృతమైనప్పుడు ఒక కుదురు అవుతుంది. కొన్ని కుదురులు కలసి ఒక తెగ లేక గణంగా ఏర్పడుతుంది.’’ (బాలగోపాల్‌, ప్రాచీన భారతదేశ చరిత్ర, పుట: 10) ఈ ఆదివాసి తెగల్లో ఒక్కో తెగ ఒక్కో విశిష్ట లక్షణాలు ఒక్కో విలక్షణ రీతిలో ఉంటాయి. విడివిడిగా, ప్రత్యేకంగా తమ జీవన విధానాలు, విశ్వాసాలు, నమ్మకాలు, సంప్రదాయాలు, ఆచారాలు, సామెతలు, వినోదాలు, పొడుపు కథలు, వేడుకలు, ఆటలు మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా గిరిజన యాస, భాష, మాండలిక పదజాలం కలిగి ఉంటుంది.
మానవజాతికే మూలజాతిగా చెప్పుకునే జనులు ఈ గిరిజనులు. ‘‘ఆదివాసి తెగలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ముప్ఫై నాలుగు తెగలు’’ (https://aptribes.gov.in) ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలోనూ గిరిజనులు జీవిస్తున్నారు. ఈ గిరిజన సముదాయాలకు ఎక్కువగా తూర్పుకనుమలు, నల్లమల కొండలు, అడవులు నివాస ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలావరకు గిరిజనులు మైదాన ప్రాంతాల్లో కూడా నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఈ మూడు జిల్లాలలో సుమారుగా ముప్ఫై గిరిజన తెగలు వరకు ఉన్నాయి. అందులో కూడా ప్రధానంగా సవర, జాతాబు, గదబ, కొండదొర, మూకదొర, భగత, పోర్జ మొదలైన తెగలు ఎక్కువ సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. ఈ ఆదివాసి తెగలలో కూడా సవర, జాతాబు, గదబ, కొండదొర తెగలను కేంద్రంగా చేసుకొని, వారి జీవన విధానాన్ని చిత్రిస్తూ కథలు వెలువడ్డాయి. ఈ తెగల జీవనాన్ని అక్షరీకరించడానికి ముఖ్య కారణం. వీరు ప్రత్యక్షంగా శ్రీకాకుళ గిరిజన పోరాటంలో పాల్గొనడం.
‘‘భూషణంగారు ఉద్యమాలతో ప్రభావితులై ఉద్యమాలను ప్రభావితం చేస్తూ ఎఅచనలు చేసారు. ఆయన ఊరిని ఆనుకొని ఉన్న కొండలూ, మైదానాల్లో జరిగిన గిరిజన పోరాటాలూ ఆయనచేత ఈ కథలు రాయించేయి. ఆ విధంగా ఒక గొప్ప వారసత్వంలో కలం పట్టిన భూషణంగారు ఈ కథలు రాసి ఇంకో కొత్త వారసత్వానికి మొదటివారయ్యారు.’’ అని ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు భూషణంగారి పట్ల తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. భూషణం గిరిజన కథల కాన్వాస్‌ గురించి రామారావు మాస్టారి మాటలే చెబుతున్నాయి.
ఉత్తరాంధ్ర కథకులు తమ కథల్లో మొత్తంగా ఈ గడ్డపై సాగిన, సాగుతున్న రాజకీయ, సామాజిక ఆర్థిక పరిణామాలను అక్షరబద్దం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కథకులలో గిరిజన కథలు రాసిన వారు కూడా ఉన్నారు. గిరిజన కథ విషయానికి వచ్చేసరికి ‘‘గిరిజన భారతానికి వ్యాసులవారని’’ శ్రీశ్రీతో ప్రసంశలు అందుకున్న కథకులు భూషణం. ఉత్తరాంధ్ర ప్రాంత తొలి తెలుగు గిరిజన కథకులుగా ఈయన్ని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర గిరిజన కథకు చిరునామా చెప్పాల్సి వస్తే భూషణం పేరు తప్పక చెప్పాల్సిందే. శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో, గిరిజన జాతుల జీవన సంస్కృతిని అవలోకనం చేసిన రచయిత ఆయన.
భూషణం కథలు – గిరిజన జీవిత చిత్రణ: తెలుగు సామాజిక రంగాన్ని శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటమెంత ప్రభావాన్ని కలిగించిందో అంతకు మించిన ప్రభావాన్ని తెలుగు సాహిత్యం మీద కలగజేసింది. ఇంత ప్రభావాన్ని కలిగించిన శ్రీకాకుళ గిరిజన పోరాటాన్ని దశలవారీగా ఉద్యమాన్ని సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయరాజ్‌ మొదలైన వాళ్ళు కవిత్వికరిస్తే భూషణం కథనం చేసాడు.
అడివంటుకుంది: అమాయకులైన సవరల గూడకి వ్యాపారం కోసం వచ్చి, సవరులను మోసంచేసి, వారి శ్రమను దోచుకుంటున్న షావుకారి సత్తియ్యపై సవరులు తిరుగుబాటు చెయ్యడమే భూషణం ‘అడివంటుకుంది’. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి, కుటుంబ సభ్యులైన కూతురు, భార్య చేసిన అవమానకర పరిస్థితులు భరించలేక, పల్లం ప్రాంతంలో బతకలేక చనిపోదామని నిర్ణయించుకొని బయలుదేరిన షావుకారి సత్తియ్యకి అడవంతా పచ్చగా పరిపూర్ణంగా కనిపిచింది. చనిపోదామని వచ్చిన సత్తియ్యకు రెండు వరసల్లో ఉన్న పది ఇళ్ళ సవర గూడ కనిపించింది. ఆ గూడకి వచ్చేసరికి వీరాసామి గూడ నుంచి మేక పిల్లను తీసుపోతుంటాడు.
మైదాన ప్రాంతంలో బతకలేక, చేసిన అప్పులు తీర్చలేక పోలీసు జవానులాగా కాకీ బట్టలు ధరించి అమాయకులైన, నిరక్షరాస్యులైన సవరులను బెదిరిస్తూ, భయపెడుతూ, కొడుతూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దోచుకుంటున్న నకిలీ పోలీసు వీరాసామి. సవరగూడలో ఒకామె గొట్టాలమ్మ దేవతకు మొక్కుకున్న మేకపిల్లని వీరాసామి తీసుకుపోతుంటాడు. ఆమె ఎంత బతిమిలాడిన కనికరము చూపకపోగా, తిరిగి విసిగిస్తుందని ఆమె గుండెల మీద తంతాడు. ఆ దెబ్బకి ఆమె తలకి గాయం అయ్యి రక్తం చిమ్ముతుంది. ఇంత జరుగుతున్నా ఒక్క మగవాడు ముందుకురారు. వీరాసామి చేసిన అన్యాయాన్ని కళ్లారా చూస్తాడు సత్తియ్య. వీరాసామి సత్తియ్య దగ్గర ఖాతాను చెల్లించని వాళ్ళలో ఒకడు. సత్తియ్య వీరాసామి నకిలీ పోలీసని నిజం చెప్పాలని అనుకొని చెప్పకుండా వీరాసామి వెంబడిరచి వెళ్తాడు. అప్పుడు వీరాసామి, సత్తియ్యకి పల్లంలో జీవించలేని వాళ్ళు సవర గూడెంలో బతకవచ్చు అనే జీవిత సత్యాన్ని చెప్పి వెళ్ళిపోతాడు.
సత్తియ్య సవరగూడ నాయకుడు అయిన సారికి సిద్ధంని అడిగి అంగడి పెట్టుకొని జీవిస్తానంటాడు. నెమ్మదిగా వారి కష్టార్జితాన్ని అప్పుల పేరుతో దోపిడి చేస్తాడు. ‘‘తల మీద గంపతో ఉప్పూ పొగాకూ బెల్లం మోసి అమ్ముకుతిరిగిన సత్తియ్య షావుకారి ఇంతవాడు అంతవాడై అంతవాడు ఆకాశాన్నంటినంతవాడై అడివంతా తానే అయిపోయేడు’’ (భూషణం, కొండగాలి కొన్ని కథలు, పుట: 43). అడవి సరుకంతా పట్నంలో అమ్మి ఆస్తిని గడిరచేసరికి కరణంతో వెళ్ళిపోయిన భార్య, మునసపు కొడుకుతో లేచిపోయిన కూతురు తిరిగి వచ్చేస్తారు.
అడివిలో పండిన పంటని మైదాన ప్రాంతానికి తీసుకుపోతున్న బండ్లను సారికి సిద్ధం కొడుకు మంగడు అడ్డుకుంటాడు. ఎక్కడ పండిన పంట ఆ ఊర్లోనే అమ్మాలని ఎదిరించి, నిలదీస్తాడు. దాంతో సత్తియ్య గూండాలని పెట్టి కొట్టించాలనుకుని, సారికి సిద్దం సవరుల చైతన్యం తేవడానికి ఏర్పాటు చేసిన మీటింగుకు వస్తున్న ఆదివాసిలపై దాడి చేయిస్తాడు. సత్తియ్య ఏర్పాటు చేసిన గూండాలు ఆదివాసి స్త్రీని వివస్త్రని చేసి నానాబీభత్సం చేస్తారు. మంగడు గుండాలని ఎదురిస్తాడు. గుండాలకి, మంగడికి జరిగిన పెనుగులాటలో మంగడు దారుణంగా చనిపోతాడు. మంగడి చావుతో సవర గూడెం అంతా చైతన్య జ్వలలు రగిలి అడివి అడివంతా షావుకారి మీద తిరుగుబాటుకు బయలుదేరుతారు.
ఉద్ధరింపు: గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన కార్పోరేషన్‌ సంస్థలే వారిని దోచుకుంటున్నాయనే వాస్తవ నిజాన్ని భూషణం ‘ఉద్ధరింపు’ కథలో ప్రకటించారు. కొండకోనల్లో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నారు. వారిని దళారి వ్యాపారస్తుల నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన రాజ్యాంగబద్ద సంస్థ గిరిజన సహకార సంస్థ (Girijan Co-operative Corporation). ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థను 1956వ సంవత్సరంలో ఏర్పాటుచేసింది. ఈ సంస్థ గిరిజనులు స్థానిక వ్యాపారుల దోపిడికి గురి కాకుండా వారి అటవీ ఉత్పత్తులకు తగు ధరలను నిర్ణయించి, వాటిని సేకరిస్తుంది.
నిమ్మక సంగమ్మ ఆదివాసి మహిళ. ఇప్పపప్పు చాలా ఎక్కువ మొత్తం కూడబెట్టి ఒక్కసారి అమ్మి, వచ్చిన డబ్బులతో మంచి చీర కొనుక్కోవాలని ఆశ పడుతుంది. ఇంతలోపు సంగమ్మ తల్లి చెంచమ్మకి జ్వరం వచ్చి బాగాలేకపోతే సూదిమందు కొనడానికి డబ్బులు లేక ఇప్పపప్పు షావుకారికి అమ్మాలని నిర్ణయించుకుంటుంది. షావుకారి ఇప్పపప్పు చూసి ఆరు కేజీలుందని కేజీకి ఎనభై పైసలు (0.80/-) చొప్పున పది రూపాయలా ఎనభై పైసలు (10.80/-) ఇవ్వబోతాడు. ఇంతలోపు కార్పోరేషన్‌ ఉద్యోగి అక్కడికి వచ్చి షావుకారి కొన్న సరుకును అడ్డుకొని, అడవి పంటల్ని కొనుగోలు చెయ్యడానికి గిరిజన కార్పోరేషన్‌ ఉందని చెప్పి, సంగమ్మని తీసుకువెళ్తాడు. ఇప్పపప్పు తుయ్యగా మూడు కేజీలు వస్తుంది. కేజీకి రూపాయి ఇరవై పైసల (1.20/-) లెక్కన మూడు కేజీలకి మూడు రూపాయల అరవై పైసలు (3.60/-) సంగమ్మ చేతిలో పెడతారు. ఆరు కేజీల పప్పు మూడు కేజీలు ఉండమేంటని సంగమ్మ తీవ్రంగా వ్యతిరేకించి, తన పప్పు తనకి ఇచ్చేయమని అడుగుతుంది. అధికారులు కోపంతో సంగమ్మను బయటకు గెంటేస్తారు.
షావుకార్లే నమ్మించి అమాయకపు గిరిజనలను మోసం చేస్తుంటే, అంతకంటే ఎక్కువ దోపిడి గిరిజన కార్పోరేషన్‌ చేసింది. మూడు రూపాయలు తెచ్చి డాక్టర్‌ చేతిలో పెట్టగా డాక్టర్‌ కూడా మోసం చేసి చెంచమ్మకి డిస్టిల్‌ వాటర్‌ శరీరానికి ఎక్కించి వెళ్ళిపోతాడు. చివరికి కార్పోరేషన్‌ వాళ్ళ చేతిలో సంగమ్మ మోసపోతే, డాక్టర్‌ చేతిలో చెంచమ్మ మోసపోతుంది.
ఊరి మీద కధ: గిరిజనేతరుల దోపిడికి బలైపోయిన గిరిజనులు పేదరికంలోనే మగ్గిపోతున్న వాస్తవ సంఘటనని భూషణం ‘ఊరు మీద కధ’ చూపిస్తుంది. ఉత్తరాంధ్ర కొండకోనల్లో నివసించే గిరిజన తెగల్లో ప్రధానమైనవి సవర, జాతాబు, గదబ. కొండల మీద ఉన్న సంపద అంతా పల్లపు ప్రజల సొత్తు అయ్యి, వాళ్ళు ధనవంతులవుతున్నారు. కానీ ఆదివాసిలు ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నారు. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గిరిజన కార్పోరేషన్‌ పేరుకే ఉంది. కానీ గిరిజనులకు విత్తనాల పంపిణీలో మాత్రం వాటి పాత్ర శూన్యం. గిరిజనులు పండిరచిన పంటని అమ్మడానికి మైదాన ప్రాంతంలో ఉన్న సంతకి తీసుకువస్తే పల్లపు ప్రజలు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేసి సరుకునంతా దోపిడి చేస్తారు. గిరిజనులు డబ్బు అవసరమై వ్యాపారి వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు వ్యాపారి బంగారం పొడవు దారంతో కొలచి, ఆ దారాన్ని గిరిజనుడికి ఇస్తాడు. బంగారాన్ని విడిపించుకునేటప్పుడు ఆ దారాన్ని తెమ్మని చెపుతాడు. బంగారాన్ని కరిగించి కొంత బంగారం వ్యాపారి కాజేసి, అదే పొడవులో కనిపించేటట్లు చేసి గిరిజనులను నమ్మించి మోసం చేస్తారు.
గిరిజనుడు కొండమీద నుంచి పల్లపు ప్రాంతంలో ధనవంతుడు చేస్తున్న వివాహ కార్యక్రమానికి కట్టెలు కొట్టడానికి వస్తాడు. కట్టెలు కొడుతున్న గిరిజనుడి కాలుకి గొడ్డలి తగులుతుంది. గొడ్డలి తగిలి రక్తం కారుతున్న గిరిజనుడు ధర్మాసుపత్రికి వెళ్తే గాయానికి కట్టు కట్టడానికి దూది కూడా ఉండదు. ఆసుపత్రికి వచ్చే మందులు అంతా ధనవంతుల ఇంట్లో వస్తువుల రూపంలోకి మారిపోతుంటాయి. దెబ్బ తగిలిన గిరిజనుడికి సరైన వైద్యం అందక ధనుర్వాతం (వాతరోగం) వచ్చి చనిపోతాడు. ఆదివాసి స్త్రీ కొండ మీద పండిన పండ్లను అమ్ముకోవడానికి వస్తే ఆకతాయిలైన గిరిజనేతరులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. కష్టపడి గిరిజనులు పనిచేస్తే, వారికి రావాల్సిన ఫలాలను గిరిజనేతరులు నమ్మించి మోసం చేసి లాక్కుంటూన్నారు.
ఇదేదారి: ఆదివాసిలను ఋణగ్రస్తుల్ని చేసి వారి పంటని, భూమిని దోచుకోవాలనే చూసే వ్యాపారుల మీద గిరిజనులు చేసే విప్లవ పోరాటమే భూషణం ‘ఇదేదారి’ కథలోని వస్తువు. పల్లంలో బాగా సంపాదించిన సిద్ధాంతి షావుకారి ఏజెన్సీ వచ్చి ఇంకా బాగా సంపాదించాడు. చింతపండుకి, కందులకి పాయిదాలు ఇచ్చేవాడు. అతని బీరువాలో రూపాయిల కట్ల కంటే ప్రాంసరీ నోట్ల కట్లే ఎక్కువగా ఉండేవి.
సిద్ధాంతి షావుకారి గూడలో వాళ్ళ దగ్గర అప్పు వసూలు చెయ్యడానికి వెళ్తాడు. పువ్వల రాజన్న గూడెంకి నాయకుడు. అతని భార్య గుత్తిలమ్మకు ఆరోగ్యం బాగోనప్పుడు సిద్ధాంతి షావుకారి వద్ద ఐదు రూపాయిలు, ఎద్దు చనిపోయినప్పుడు వంద రూపాయిలు అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పుకి ఐదు సంవత్సరాలుగా వడ్డీ కడుతూనే ఉంటాడు. అయినప్పటికీ రాజన్న అప్పు ఇంకా తీరదు. పల్లంలో ఉన్న రాజన్న భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని సిద్ధాంతి ఆలోచన చేస్తాడు. నక్సలైట్ల ప్రేరణతో గిరిజనల్లో చైతన్యం రగులుకుంది. షావుకార్ల మీద, భూస్వాముల మీద గిరిజనులు తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఈ గొడవల నుండి దూరంగా వెళ్ళిపోవాలని సిద్ధాంతి నిర్ణయించుకుంటాడు. ఐదేళ్ళుగా వడ్డీ కడుతున్నప్పటికీ అప్పు ఇంకా వెయ్యి రూపాయిలు ఉంటుంది. ఆ అప్పుకి నీ పల్లం భూమి ఇస్తే సరిపోతుందని సిద్ధాంతి షావుకారి కరణంచేత చెప్పిస్తాడు. ప్రాంసరీ నోటు మీద వేలి ముద్ర వెయ్యడానికి రాజన్న నిరాకరిస్తాడు. అప్పుడు సిద్ధాంతి షావుకారి రౌడీలను పెట్టి రాజన్నను కొట్టించి బలవంతగా వేలి ముద్రను వేపించి భూమిని లాక్కుంటాడు. తర్వాత రాజన్న సంఘంలో చేరి ఆయుధాలతో సిద్ధాంతి ఇంటి మీద దాడి చేసి, నోట్లన్ని కాల్చివేసి, సిద్ధాంతి ఆస్తిని సమానంగా అందరికీ పంచిపెడతాడు. శ్రమజీవులకు స్పష్టమైన దారి చూపెడుతూ, రాజన్న కొండదారి పట్టిన జనంలో కలిసిపోతాడు.
తీర్పు: పాలేరు తనమనేది శ్రమదోపిడికి, వెట్టిచాకిరీకి పెట్టింది పేరని, ఆ కట్టుబానిస బతుకు బతకనని, కష్టపడి పనిచేసుకొని బతుకుతానని సత్తిగాడి చేత భూషణం ‘తీర్పు’ కథలో పలికిస్తాడు. శివ్వాల సత్తిగాడు సింగన్నపాలెం చివర వీధిలో చివరగా ఉన్న ఇంట్లో నివసిస్తుంటాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూలేరు. సత్తిగాడు పని చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. వర్షానికి ఇల్లు కారుతున్నా, గోడలు పెచ్చులూడిపోతున్నా, తలుపుల కింద ముక్కలు ఊడిపోయి కింద నుండి పిల్లులు కుక్కలు దూరిపోయి దాచుకున్న గంజి, అంబలిని తాగేస్తున్నా, వెనుక తలుపుకు బదులు తాతలనాటి తడక కట్టబడి ఉన్నా, రెండే రెండు గావంచాలు మూడంటే మూడు చినిగిన బాడీలతో బాధపడుతున్నప్పటికీ సత్తిగాడు పాలేరుగా చేరడానికి ఒప్పుకోడు. అప్పటికే పాపినాయుడుతో సహా ఊర్లో పెద్ద వాళ్ళంతా చాలాసార్లు సత్తిగాడిని కంబారితనం చేరమని అడుగుతారు.
‘‘నాను కంబారి పని సెయ్యను గాక సెయ్యను అని ఎప్పుడో నిశ్చయించుకున్నాడు’’ (భూషణం, కొండగాలి కొన్ని కథలు, పుట: 01) సత్తిగాడికి చాలామంది భూకామాంధులు చాలా ఆశలు చూపించి కంబారిగా కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. రోడ్డు పనులు, చెరువు పనులు, దమ్ముల్లో పార పనికి, ఆకు (నారు) తీతకి చేనుకోతకి రోజు కూలీగా వెళ్లేవాడు. నలుగురి పని ఒక్కడే చేసేవాడు. పూరిల్లు నేసేవాడు, ఇంటి చుట్టూ దడి (తడిక) కట్టేవాడు అన్ని పనుల్లోను ఆరితేరి ఉండటం వల్ల సంవత్సరం మొత్తం మీద ఏదో ఒక పని దొరికేది. సత్తిగాడు తిండికి చాలా ఇబ్బంది పడినప్పటికీ కూడా తన నిర్ణయంలో ఏమాత్రం మార్పులేదు. కూలీగానే ఉన్నాడు తప్పా కంబారీగా ఎవరి దగ్గర చేరలేదు. సత్తిగాడిని సరస ప్రేమిస్తుంటుంది. గారాల గున్నిగాడు, సత్తిగాడు, సరస అందరూ పొలం పనులు చేస్తుంటారు. గున్నిగాడు, సత్తిగాడు ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకుందాం అని పందెం కాస్తారు. గున్నిగాడు, సత్తిగాడిని కరెంట్‌ స్తంభం ఎక్కి కరెంట్‌ తీగ పట్టుకోమంటాడు. వెంటనే సత్తిగాడు తీగను పట్టుకుంటాడు. షాక్‌ తగిలి మంచాన పడతాడు. అప్పుడు సత్తిగాడికి సరస సేవలు చేస్తుంది. అక్కడి నుంచి ఊర్లో జనాలు సత్తిగాడిని కరెంటు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ కష్టకాలంలోనే పాపినాయుడు దగ్గర మూడు వందలు రూపాయలు అప్పు తీసుకుంటాడు. సత్తిగాడు కరెంట్‌ షాక్‌ నుండి తేరుకుంటాడు గాని అప్పు నుంచి తేరుకోలేకపోతాడు. చివరికి పాపినాయుడు దగ్గర కంబారిగా చేరిపోతాడు. సరస పెళ్లికి ముందే సంఘంలో సభ్యురాలు. సరస సంఘంలో ఉండటం మంచిది కాదని పాపినాయుడు సత్తిగాడికి సలహా చెప్తాడు. సంఘం విషయాల గురించి సరస, సత్తిల మధ్య చర్చ జరుగుతుంది.
సత్తిగాడి గుడిసె ముందర రాట విరిగిపోతుంది. వెంటనే వెళ్లి పాపినాయుడు కల్లం నుంచి ఒక రాట తీసుకొస్తాడు. పాపినాయుడు కొడుకు అభ్యంతరం చెపుతాడు. కానీ వెంటనే పాపినాయుడు సర్దిచెప్పి సత్తిగాడిని పంపిస్తాడు. సంవత్సరాంతంలో పాపినాయుడిని జీతం అడుగుతాడు. నూటికి రెండు పుట్లు చొప్పున మూడు వందల అప్పుకి ఆరు పుట్లు ధాన్యం నిర్ణయించి మిగతావిస్తాడు. కరెంటుగాడి కళ్ళకు కమ్మిన మాయపొరులు కరిగిపోతాయి. వెంటనే సత్తిగాడు సంఘంలో చేరిపోతాడు.
కంబార్లంతా సమ్మె చేస్తారు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. సత్తిగాడి నాయకత్వం వహిస్తాడు. మంచం కోడు విరిగిపోవడంతో నిండు గర్భిణి సరస నేల మీద పడుకుంటుంది. పాపినాయుడు కల్లంలో కర్ర ముక్క తీసుకువెళ్లి కంసాలికిస్తాడు. సత్తిగాడికి దొంగతనం అంటగడతారు. సరసని తీసుకు వచ్చి గజాలు దొడ్డికి కట్టేస్తారు. పాపనాయుడు పంచాయతీ పెడతాడు. పొలంలో ఉన్న సత్తిగాడికి విషయం తెలుస్తుంది. ఆరోజు రాటతీస్తే పోనీలే అన్నవాళ్ళు ఇప్పుడు కర్ర ముక్కకి యింత గొడవ చేస్తున్నారంటే సత్తిగాడు అసలు విషయం అర్థం అవుతుంది. పొలం నుండి సత్తిగాడు కోపంతో వచ్చి సరస కట్లను విప్పదీసి దమ్ముంటే అడ్డండీ అని సవాలు చేస్తాడు. ఇక మీదట ‘‘కప్పల బతుకుల మీద పాములు తీరుపులు సెప్పరాదు! మేకల బతుకుల మీద పులులూ సింహాలు తీరుపులు సెప్పడం పనికిరాదు!! ఎలకల గురించి పిల్లలు సెప్పిన తీరుపులు సెల్లకుండా సెయ్యాలి!’’ (భూషణం, కొండగాలి కొన్ని కథలు, పుట: 30) ఈరోజు నుండి బుగతల బతుకుల మీద మనం తీర్పు చెబుతాం అంటూ సత్తిగాడు, సరస అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
పులుసు: అడవితల్లి ఒడిలో, చేరువలో బతికే బడుగు జీవులకు అడివే జీవనాధారం. ఆ జీవనానికి అడ్డం వచ్చిన వారిమీద తిరుబాటే భూషణం ‘పులుసు’ కథలో చూడవచ్చు. మాలపేటకు చెందిన ప్రజలు చింతపండు లేక అప్పటికే చాలాకాలంగా ఇబ్బంది పడుతున్నారు. సంగడు, ముసలి బోడెమ్మ, గుంపడు, రావుడు దగ్గర్లో ఉన్న అడవికి చింతపండు కోసం వెళ్తారు. కొండకు చేరుకొని గిరిజనుల దగ్గర చింతపండు కొనుక్కొని కావిళ్ళలో పట్టుకొని గిరిజన కార్పోరేషన్‌ వాళ్ళ కంట పడకుండా కొండపై నుండి తిరిగి వస్తుంటారు. ఇంతలో గిరిజన కార్పోరేషన్‌ అధికారి వాళ్ళను చూస్తాడు. వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న చింతపండును లాక్కుంటాడు. బోడెమ్మ ముసలి తన గంపలో ఉన్న చింతపండు ఇవ్వకుండా అడ్డుకుంటుంది. దాంతో అధికారి కోపంతో ముసలి బోడెమ్మను బాగా కొట్టి గుండెల మీద తన్నుతాడు. అయినప్పటికీ ముసలి బోడెమ్మ గిరిజన అధికారిని ప్రాధేయపడుతుంది. సంగడు కూడా అధికారిని బతిమిలాడుతాడు. అయినప్పటికీ అధికారి వారిపైన జాలి చూపకపోగా బాగా కొడుతుంటాడు. సంగడు తమ కావిళ్ళ బద్దలు తీసి గిరిజన కార్పోరేషన్‌ ఉద్యోగులపై తిరగబడతారు. దాంతో అధికారులు తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సంగడు బృందం కూడా త్వరత్వరగా అడవి నుండి ఇంటికి చేరుకుంటారు. అధికారి మీద తిరుగుబాటుతో తనకు కావలసింది సాధించుకుంటారు.
విత్తనం: గిరిజనుల విశ్వాసాలను ఆశ్రయంగా చేసుకొని గిరిజనేతరులు మోసం చెయ్యాలని అనుకుంటే పొరపాటే, ఆదివాసిల జీవన విధానంలో మార్పులు సంతరించుకున్నాయని, గిరిజనులపై మైదాన గ్రామాల ప్రజల ఆగడాలు ఇక చెల్లవు అని భూషణం ‘విత్తనం’ కథలోని వస్తువు.
ఇద్దరు పల్లపు వ్యక్తులు తమ పని నిమిత్తం ఒకడు పాడి గేదెను, మరొకడు దున్నపోతును గిరిజనుల వద్ద కొనాలని కొండకు వెళ్తారు. మార్గం మధ్యమంలో ఉబుసుపోక పరస్పరం ఒకరికొకరు మాట్లాడుకుంటూ గిరిజనులు గతంలో లాగా అమాయకంగా లేరు, ఇప్పుడు తెలివిగా ఉన్నారని పాడిగేదె కొనాలని వెళ్తున్న వ్యక్తి దున్నపోతు కొనాలని వస్తున్న వ్యక్తితో చెబుతాడు. కొండకి నడుస్తూ అలసటను మర్చిపోవడానికై పరస్పరం ఒకరికొకరు కథలు చెప్పుకుంటారు. ముందుగా పాడిగేదెను కొనాలని వచ్చినవాడు దున్నపోతుని కొనాలని వచ్చినవాడికి కథ చెప్పడం మొదలుపెడుతూ-
గిరిజనులు జాతర్ల సమయంలో అబ్బాయి, అమ్మాయిని చూసి ఇష్టపడితే అమ్మాయి చేతిలో రూపాయి నాణెం పెడతాడు. అమ్మాయి కూడా అబ్బాయిని ఇష్టపడితే ఆ రూపాయికి, మరో రూపాయి నాణెం కలిపి అబ్బాయి చేతిలో పెడుతుంది. దాంతో వివాహం కుదిరినట్లే. ఈ వివాహ పద్ధతిని తెలుసుకున్న పల్లపు గ్రామంలో నివసించే పెళ్ళికాని కొండజాతి అబ్బాయి జాతరికి వచ్చి అమ్మాయి చేతిలో రూపాయి నాణెం బదులు ఐదు రూపాయిలు కాగితం పెడతాడు. ఆ ఐదు రూపాయిలు తీసుకున్న ఆదివాసి స్త్రీ కాఫీ దుకాణంలోకి వెళ్ళి మరి తిరిగిరాదు. పల్లపు గ్రామం నుంచి వచ్చిన కొండజాతి యువకుడు ఐదు రూపాయిలకి మరో ఐదు రూపాయిలు జోడిరచి పది రూపాయిలు తెస్తుందని ఎదురు చూస్తాడు. చివరికి నిరాశే మిగులుతుంది. ఈ కథను విన్న దున్నపోతు కొనడానికి వచ్చిన వ్యక్తి కూడా ప్రతిగా నేనొక కథను చెబుతానని ఇలా మొదలుపెడతాడు.
గిరిజనులు ఇతరుల సొమ్మును తాకరు. ఆ సొమ్మును పాపపు సొమ్ముగా భావిస్తారు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని సంతకి సరుకు తీసుకువచ్చిన గిరిజనుడి దగ్గరకు వ్యాపారి వెళ్ళి బేరమాడుతాడు. వ్యాపారి సరుకుని తగు ధరకి అడగకపోతే గిరిజనుడు ఇవ్వను అంటాడు. అప్పుడు వ్యాపారి తెలివిగా గిరిజనుడి మీద కొంత డబ్బు విసేరే వెళ్ళిపోతాడు. అప్పుడు గిరిజనుడు వ్యాపారి వెంటపడి ఆ సరుకు ఇచ్చేసి వెళ్తాడు. ఈ నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి దున్నపోతుల్ని కొనాలని కొండకు వెళ్తాడు. కొండ మీద గిరిజనుడి దగ్గర ఉన్న దున్నపోతుల్ని చూసి అమ్ముతావా? అని అడుగుతాడు. గిరిజనుడు అమ్మను అంటాడు. ఆ గిరిజనుడి మీదకి కొంత డబ్బులు విసేరేసి వెళ్ళిపోతాడు. ఊర్లోకి వెళ్ళి చూస్తాడు గిరిజనుడు రాడు, దున్నపోతులు లేవు. డబ్బులు పోయాయని బోరుమంటాడు. ఇలా ఈ కథ లోపల మరల రెండు కథలు నడుస్తాయి. చివరికి ఈ ఇద్దరు వ్యక్తులు కొండకి చేరుకుంటారు. తమకి కావలసిన పాడిగేదెను, దున్నపోతుని కొనాలని చూస్తారు. అక్కడ అమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని భావించి తిరిగి వెళ్ళిపోతారు.
నమ్మిక: మైదాన గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులు, అధికార్లు గిరిజనల్ని మోసం చెయ్యడమే కనిపిస్తుంది కానీ, ఆదివాసిలు ఎప్పుడూ విశ్వసనీయతను కోల్పోలేదు. నమ్మే కొద్దీ నాగరిక సమాజం వాళ్ళను పీక్కుతింటూనే ఉంటుంది. నమ్మకానికే నమ్మకంగా కట్టబడి ఉన్న ఆదివాసిల గురించి భూషణం ‘నమ్మిక’ కథలో చూపించారు.
గిరిజన సంక్షేమ శాఖలో అధికారి ఆశ్రమ పాఠాశాలకు వెళ్తాడు. రాష్ట్ర స్థాయిలో నృత్య పోటీలు ఉన్నాయని చెప్పి, ఆ పాఠశాలలో మణికుమారిని తీసుకువెళ్ళాలని అధికారి తన నిర్ణయాన్ని ప్రధానోపాధ్యాయుడుకి చెబుతాడు. తల్లి అనుమతి తప్పనిసరి అని, అది మీరే అడగాలని చెబితే తల్లిని కలవడానికి వెళ్ళి, ఆమెను కలిసి మణికుమారి విషయం చెపుతాడు అధికారి. మణికుమారి తల్లి తనతోపాటు కొండ మీదకి రమ్మంటుంది. కొండ పైకి వెళ్ళాక జువ్వి చెట్టు కింద కూర్చొని కిందకి చూస్తే అంతా చిన్నవిగా కనిపిస్తాయి. అప్పుడు మణికుమారి తల్లి అధికారితో పల్లం నుంచి వచ్చిన షావుకారి నమ్మకపు మాటలు చెప్పి కొండఫలాన్ని కిందకి తరలించాడు. తామంతా మోసపోతున్నామని బడి గురువు వచ్చి చెబితే ఆయన మాట విన్నాం. ఈ చెట్టు కింద రాయి మీదే షావుకారి, బడి గురువు చెప్పారు. పడమటి దిక్కు నుంచి వచ్చిన వాడు ఏవేవో మాటలు చెప్పి నమ్మించి తల్లిని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చి మణెమ్మను పంపించమని అడుగుతున్నావు. ఇప్పుడు కూడా నమ్ముతున్నాను అంటుంది.
విలువలు: ఒకవైపు గిరిజన శ్రామిక జీవుల ఔదార్యాన్ని, కృతజ్ఞతాతత్త్వాన్ని, విలువల్ని చూపుతూనే. మరొకవైపు శ్రమజీవులు ఇచ్చే బహుమానానికి అధికారి డబ్బు అంచనా వేసే తత్త్వాన్ని భూషణం ‘విలువలు’ కథలో వర్ణించారు.
ముసలాడు, ముసల్ది, వాళ్ళ కోడలు జీలుగు చెట్టు కింద వెన్నెలలో మంచం మీద కూర్చుంటారు. ముసలాడు ముసలిదాన్ని చూసి ‘గుమ్మడి పండులాగ’ ఉన్నావు అనగానే ముసల్ది ముప్పై ఏళ్ల పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. గురువు వచ్చి తమ ఊరును, పిల్లల్ని ఎలా బాగుచేసాడో, తమ ఇద్దరికీ ఎలా పెళ్లి చేసాడో అన్నీ ఆ రాత్రి తలచుకొని నిద్రపోతుంది. ఉదయాన్నే కారులో ఒక ఆఫీసరు వచ్చి బురద నీటిని శుభ్రం చేస్తుంటే పాత గురువు మళ్ళీ మదిలో పడతాడు. తన పంటలో పండిన అరటి గెలను ఆ ఆఫీసరకి ఇవ్వాలని నిర్ణయించుకొని పట్నంలో ఉన్న ఆఫీసుకు వస్తారు. ఆఫీసరకి గెల ఇవ్వగా దానికి విలువ కట్టి వంద రూపాయిలు ముసలవాడికి ఇవ్వబోతాడు. అప్పుడు ముసలివాడు ‘‘మాకు అప్మానం పుడితే ఇయ్యడం తెలుసును గానీ సొమ్ము పుచ్చుకోవడం తెల్దుమరి’’ (కొత్తగాలి, పుట: 41) అని చెప్పేసి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. రుణం: ‘శ్రీకాకుళ ఉద్యమంలో స్త్రీలు’ అనే అంశం రాయడానికి ఒక మాస్టారి సహాయంతో సుధాకర్‌, రాధిక, రమణ కొండల్లోకి వెళ్తారు. కొండ గ్రామంలో ఒక వృద్ధ గిరిజనుడు మాస్టారిని గుర్తుపట్టి నా దగ్గర సత్యం మాస్టారు ఇరవై సంవత్సరాల తుపాకీ తీసుకొని ఆరువందలు ఇస్తానని ఇక మరి నాకు కనిపించలేదు అని ప్రశ్నించిన భూషణం కథ ‘రుణం’.
శ్రీకాకుళ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్త్రీల గురించి తెలుసుకోవాలి ఒక మాస్టారి సహాయం తీసుకొని కొండ గ్రామాలకి సుధాకర్‌, రాధిక, రమణ బలుదేరుతారు. కొండ ఎక్కుతూ అలసిపోయి మార్గ మధ్యమంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న మాస్టారిని మధ్య వయసు గిరిజనుడు గుర్తు పట్టి మాట్లాడుతాడు. తన చిన్నతనం రోజుల్లాగా ఇప్పుడు లేదని అద్దం వచ్చి కొండను ఎంత మార్పుకు గురి చేసిందో చెబుతాడు. ఒక ఊరు వెళ్ళి సమాచారం తెలుసుకొని మరో ఊరు వెళ్తుండగా మాస్టారిని ముసలి గిరిజనుడు పిలిచి వచ్చిన వాళ్ళు మనవాళ్ళే అంటున్నారు కదా, వెంపటాపు సత్యం మాస్టారు నా దగ్గర ఇరవై సంవత్సరాల క్రితం తుపాకీ తీసుకొని ఆరువందలు ఇస్తానని ఇవ్వలేదని వాళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. ‘‘ఎప్పటికీ వెంపటాపు సత్యం మాస్టారి రుణం ఈ ప్రాంతం తీర్చలేదుగాక తీర్చలేదు అనుకున్న నాకు సత్యం మాస్టారు నా రుణం తీర్చలేదన్న ముసలి గిరిజన ముఖం…?!’’ (కొత్తగాలి, పుట: 48) సమాధానం చెప్పలేక అక్కడ నుంచి మాస్టారు వెళ్ళిపోయాడు.
అడ్రసు: గిరిజన గ్రామంలో గుమాస్తాల క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న గుమస్తాకి శ్రీకాకుళ పోరాటం గురించి పరిశోధన చేస్తున్నవారు ఒక పోరాట యోధురాలు అడ్రసు నిమిత్తం ఉత్తరం రాస్తారు. ఆ అడ్రసు వెతికే క్రమంలో ఒక పాత మిత్రున్ని కలవడానికి వెళ్ళిన గుమస్తా కలిసిన తర్వాత మిత్రుడు మాటలు విని హతాశుడైపోయిన ఉదంతాన్ని భూషణం ‘అడ్రసు’ కథలోని వస్తువు.
గుమ్మలక్ష్మీపురంలో నివాసముంటున్న గుమస్తాకి శ్రీకాకుళ పోరాటం గురించి పరిశోధన చేస్తున్న పరిశోధకుడు ఒక పోరాట స్త్రీ అడ్రసు నిమిత్తం ఉత్తరం రాస్తారు. ఆమె దంపతులు పోరాటానికి జీవితాన్ని అర్పించినవాళ్ళు. వాళ్ళకంటూ పర్మినెంట్‌ అడ్రసులు లేవు. ఆమె అడ్రసు వెతికే క్రమంలో ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఒక గిరిజన స్త్రీ తన కొడుకుకి రక్తమిచ్చి బతికించిన అధికారిని దండాలు పెడుతోంది. రక్తదానం చేసినందుకే ఆఫీసర్‌కి కృతజ్ఞత చూపుతుందే, ఇరవై సంవత్సరాల క్రితం గిరిజనుల కోసం తమ మిత్రులు రక్తం దారిపోసారు. కాలంలో ఎంత మార్పు వచ్చింది అనుకుంటూ అడ్రసు కోసం పాత మిత్రుణ్ణి కలవగా నేటి పరిస్థితులు దృష్ట్యా ఆ మిత్రులు త్యాగవీరుల అడ్రసులు నేను మర్చిపోయాను అని సమాధానం చెబుతాడు. ఆ సమాధానంకి గుమస్తా హతాశుడై వెళ్ళిపోతాడు.
ఎద: ఏది జరిగినా విచారించకుండా జరగవలసిన దాన్ని గురించి ఒక ఆశావహ దృక్పథంతో సాగిన భూషణం కథ ‘ఎద.’
పోలమ్మ కొండల్లో కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్న ఆశావహ స్త్రీ. పోలమ్మ జీవితం పశువులు కాయడంతోనూ, పొలం పనులుతోనూ సాగిపోయింది. కానీ తన పిల్లలు మాత్రం తనలాగ కాకుండా చదువుకుంటున్నారు. పోలమ్మ ఎంత పడుకుందాం అన్నా కంటి మీద కునుకు రావడం లేదు. కారణం? ఇంటిలో ధాన్యం తీసుకువెళ్ళి మట్టిలో చల్లింది. మళ్ళలో వర్షం లేక విత్తనాలు మొలకెత్తలేదు. ‘‘గంగమ్మ తల్లి ఇయాలైనా కరిగి నేల తల్లిని కలుస్తాదో కలదో ఎన్నాళ్లిలా కాలకుండా కదిలెలిపోతాది, ఎల్లలేదు అనుకుంది. అడివిని నరికేసారు. వర్షాలు పదమంటే ఎలా పడతాయి? అని కొందరనగా, కలికాలం దేవుడు దేవతా అన్నమాటే లేదు పాప భీతి అసలికిలేదు.’’ అని మరికొందరనగా విన్నది పోలమ్మ. కానీ ఆమె కళ్ళలో వాడిపోయిన గోగు మొక్కలూ మడి సెక్కల్లోని మట్టి పెళ్లలే కనిపిస్తున్నాయి. ‘‘గంగమ్మ తల్లి గోరం సేత్తాదా? సేయ్యదు గాక సేయ్యదు’’ అని జ్ఞాపకాల్లోకి జారిపోతుంది. కొండలకి రోడ్డు వేయగా రకరకాల వాహనలొచ్చాయి. ఆఫీసుకి రాతలొచ్చాయి. అలా రాయడానికి వచ్చిన వాడితో పోలమ్మ ఇష్టపడి ఇద్దరి పిల్లలకి తల్లి అవుతుంది. అతడు పనుల్లో అతడు తిరుగుతూ అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు. పోలమ్మ తల్లిదండ్రులు ఇచ్చిన కొద్ది భూమినీ సాగుకుంటూ జీవనం సాగిస్తుంది. అలా జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకుంటుంది. తెల్లారేసరికి వర్షం పడి ఉంటుంది. పోలమ్మ లేచేసరికి నీళ్ళలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారు. పోలమ్మ సంతోషంగా పొలం వైపు వెళ్తుంది. నిన్న తలలు వాల్చిన గోగు మొక్కలు తలెత్తి చిన్నగా ఊగుతున్నాయి. పొలంలో వేసిన ధాన్యం మొలకెత్తి కనిపిస్తున్నాయి. వాటిని చూసి సంతోషంగా పోలమ్మ పొలం చుట్టూ తిరుగుతుంది.
కొత్తగాలి: సమాజంలో మార్పులు సహజం. శాంతమ్మ పాత కాలపు మనిషి. పాత, కొత్త పద్ధతుల్ని చూసిన శాంతమ్మ కొత్త పద్ధతుల్లో ఇమడలేకపోతుంది. ఇబ్బంది పడుతుంది. నీతి నియమాలకు కట్టుబడి లేని సమాజాన్ని చూసి ఆందోళన చెందే స్థితిని భూషణం ‘కొత్తగాలి’ కథలో చూపించారు. మూడు రోడ్లు కలిసే చోట శాంతమ్మ టీ దుకాణం. శాంతమ్మ ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమైయ్యే ఉంటుంది. టీ పాకకి రకరకాల వ్యక్తులు, ప్రయాణికులు వస్తుంటారు. వచ్చినవాళ్ళు ఎన్ని హడావుడి వ్యవహారాలున్నా శాంతమ్మ నిదానంగానే టీ అందిస్తుంది. ఆమెలో పాతజ్ఞాపకాలు వద్దన్నా మదిలో పడుతుంటాయి. ప్రచారదళం వస్తే శాంతమ్మ వాళ్ళకి టీ ఇస్తుంది. టీ తాగి బాగుందని వాళ్ళు శాంతమ్మని అభినందిస్తారు. ఆమె చెయ్యి పట్టుకున్నవాడు దళంలోని సభ్యుడే. కొన్నాళ్ళకి ఆయన చనిపోతాడు. శాంతమ్మ ఒంటరి జీవితం గడుపుతుంది. ఒక యువకుడు వచ్చి మూడు రోడ్ల కూడలిలో టీ దుకాణం పెట్టిస్తా, నడుపుకో అంటాడు. టీ దుకాణంలో ఉండి శాంతమ్మ కొండలో వస్తున్న ప్రతి మార్పును గమనిస్తుంది. ఎప్పటిలాగే ఉదయం బస్సు దిగిన అమ్మాయి మా ఊరు వెళ్ళే బస్సు ఉందా అని అడుతుంది. ఉంది అని చెబితే నిజమా? అని మళ్ళీ అడుగుతుంది. శాంతమ్మకి ‘‘వీళ్ళ చదువూ నాగరికతా అంతా వీళ్ళకు అబద్ధమే నేర్పిస్తుందా?!’’ (కొత్తగాలి, పుట:33) అని బాధపడుతుంది. ఈ అసత్యపు మాటలు వినడానికా నాకు పాక పెట్టింది. అబద్ధపు మాటలని యువకునికి చెప్పడానికి ఆఫీసుకు వెళ్తుంది. అప్పటికే ఆ యువ ఆఫీసరు బదిలీలో వేరే చోటుకు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి తన పాక స్థానంలో ప్రయాణికుల విశ్రాంతి భవన నిర్మాణానికి చేస్తున్న సన్నాహాలు చూసి శాంతమ్మ నిర్ఘాంతపోతుంది. ఇప్పుడు శాంతమ్మ చుట్టూ కొండగాలికి బదులు కొత్తగాలి వీస్తుంది.
కొత్తప్రశ్న: 1970 దశకంలో జీవించిన గిరిజనులకు 2000 దశకంలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు మధ్య వచ్చిన మార్పులను ఈ కథ చెపుతుంది. ఈ మూడు దశాబ్దాల కాలంలో గిరిజనుల్లో వచ్చిన పెనుమార్పులను ఈ కథ సాక్ష్యంగా నిలుస్తుంది. ఒకప్పటి గిరిజనుడు అమాయకుడు. అతడిని మోసం చెయ్యడం చాలా సులభం. ప్రపంచీకరణ ప్రభావంతో ఇప్పుడున్న గిరిజనుడు పట్నంతో స్నేహం చేసి లోకం పోకడ తెలుసుకున్నాడు. పాత మాయమాటలకి ఇక గిరిజనుడు లొంగడని భూషణం ‘కొత్తప్రశ్న’ కథ తేల్చి చెబుతుంది.
నారాయణాచారి షరాబు. అతని తండ్రి బంగారం, వెండి ఆభరణాలను మెరుగుపెడుతూ, వాటిలోంచి కొంత భాగాన్ని కాజేస్తూ జీవితాన్ని గడిపేవాడు. నారాయణాచారి, తండ్రితో చాలాకాలం క్రితం ‘మామిడిమాను గూడ’ అనే గిరిజన గ్రామం వెళ్ళాడు. మళ్ళీ చాన్నాళ్ళకి ఆ గ్రామం వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. ఇంతకుముందు ఆ గ్రామంలో చాలామంది గిరిజన స్త్రీలు ఆభరణాలు ధరించేవారు. ఇప్పుడు ఎవరి శరీరంమీద నగలు లేవు. ఆ సంఘటన చూసి దిగులుతో ఒక గడపలో కూర్చుంటాడు. అక్కడ ఉన్న మధ్య వయస్సు గిరిజన స్త్రీని ఈ మార్పుకి కారణం అడిగి కనుక్కుంటాడు. పాత కాలంలా ఇప్పుడు మోసం చెయ్యడం కుదరదని తెలుసుకుంటాడు. వెనుతిరిగి వెళ్ళిపోతుండగా షావుకారి దుకాణం ఎదురవుతుంది. తర్వాత షావుకారి నారాయణాచారితో ‘‘మీ తాత తండ్రులకి మాయ తప్ప మదుపు లేదు! మాకు మదుపూ మాయా రెండూ ఉంటే గానీ జరగదు! ఇప్పుడిక్కడ మేం మాయ వొదిలేసి మదుపు మాత్రం పెట్టి రెక్కల కష్టం మీద బతుకుతున్నాం!’’ అంటాడు. కొండల్లో ఈర్ష్య కలిగించే మార్పులే సంతరించుకున్నాయి. ఇప్పటి ఈ కొండల్లోని కొత్తదనానికి రేపటి వారసులెవరు? రానున్న కాలంలో వారాసులెవరన్నది కొత్తప్రశ్న.
జ్ఞప్తి: మైదాన గ్రామాల నుంచి గుంపమ్మ, రంగన్న గంపలు, కావిళ్ళు పట్టుకొని కొండదినుసులు కోసం కొండ సంతకి వెళ్ళే సంగతిని భూషణం ‘జ్ఞప్తి’ కథలో చూపించారు. పల్లపు గ్రామాల నుంచి రంగన్న, గుంపమ్మ కొండ దినుసులు కోసం గంప, కావిళ్ళతో కొండ సంతకి ప్రయాణమౌతారు. గుంపమ్మ కొండ మీద ఉండే జోగయ్య ఇంటికి వెళ్ళి సేదదీరుతుంది. జోగయ్య భుజాల మీద కట్టెలు మోసి భుజాలు పుళ్ళై మచ్చలుగా కనిపిస్తాయి. గుంపమ్మ తన కాళ్ళు చూసుకుంటుంది. ఇంతలోపు అక్కడికి లారీ వస్తుంది. ‘‘కొండ ఒకనాడు తలగంపల్నీ కావుళ్ళనీ నాటుబళ్లలనీ పెంచింది. ఇదిగిప్పుడు ఆటితోబాటు లారీల్ని కూడా పెంచగలుగుతన్నది’’. (కొత్తగాలి, పుట: 85) అనుకుంటూ గుంపమ్మ ఒకనాటి నెత్తుటి ప్రమాణాల్ని తలచుకుంటూ వెళ్ళిపోతుంది.
తేడా: అక్రమానికి తావులేకుండా ఉద్యోగుల్లో బాధ్యతను పెంచాలని ప్రయత్నించిన గిరిజన సంక్షేమ ప్రాజెక్ట్‌ అధికారికి ఎదురైన అనుభవమే భూషణం ‘తేడా’ కథలో వస్తువు. గిరిజనాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు వాటికి అనుబంధంగా వసతి గృహాలు నిర్మించింది. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్‌ అధికారి గిరిజనుల ఉన్నతిని కాంక్షించి అన్ని పాఠశాలలు తనిఖీ చేసి ఉపాధ్యాయుల పనితీరు గమనిస్తాడు. పాఠశాల తనిఖీ చేస్తున్న సమయంలో ఒకామె ఏడుస్తూ వచ్చి తన బాధను అధికారికి చెప్పుకుంటుంది. ఆమె బాధను విని న్యాయం చేస్తానని హామీ ఇచ్చి హాస్టల్‌లో ఉద్యోగం ఇస్తాడు. విధులు సక్రమంగా నిర్వహించని ఉద్యోగుల్ని ఏరిపారేయాలని నిర్ణయించుకుంటాడు. వేరొక పాఠశాల తనిఖీ చెయ్యడానికి వెళ్లేసరికి వంటవాడు తనకి రావాల్సిన ఆరువందల రూపాయిల ఎరియర్స్‌ కోసం గిరిజన అధికారిని అడగగా తనకి నాలుగు వందలు లంచం ఇమ్మని మద్యం సేవిస్తూ అడుగుతాడు. ఈ దృశ్యాన్ని చూసిన పి.ఓ వెంటనే వంటవాడిని సస్పెండ్‌ చేసి, గిరిజన అధికారికి ఇంక్రిమెంట్‌ ఆపేస్తాడు. తర్వాత వంటవాడు ఉపాధ్యాయ సంఘ నాయకుడిని కలిసి జరిగిన విషయం చెబుతాడు. ఉపాధ్యాయ నాయకుడు పి.ఓ ని కలిసి విషయం చెబుతాడు. పి.ఓ బాగా ఆలోచించి మంచికీ-చెడుకి మధ్యగల తేడాను గురించి ఆలోచనల్లో పడతాడు. రెండు మాటలు: కొండ మీద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మాస్టారి సహాయంతో నూతనంగా గిరిజన శాఖలో ఉద్యోగం వచ్చిన స్త్రీ కొండ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళి గిరిజనుల్లో వచ్చిన మార్పులు చూసి ఆనందిస్తున్న తీరును భూషణం ‘రెండు మాటలు’ కథలో కనిపిస్తుంది.
అతని వెనుక ఆమె ఇద్దరూ కలసి కొండ మీద ఊరు చూడ్డానికి వెళ్తున్నారు. ఆమెకి గిరిజన శాఖలో ఉద్యోగం వచ్చింది. అతను ఆ ప్రాంతంలో ఉపాధ్యయుడిగా చేసిన పరిచయం ఉంది. ఇద్దరూ గెడ్డ (వాగు) దాటి పాఠశాలలోకి ప్రవేశిస్తారు. వాళ్ళని ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడుతుంటారు. అన్నింటిలోనూ పాఠశాల ఫస్ట్‌. పట్నం పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు అన్నం తింటూ తమ బతుకులు మారాయని అనుకుంటారు. వాళ్ళ మాటలు విని ఆమె సంతోషిస్తుంది.
భూషణం కథలు చదువుతూంటే ఉత్తరాంధ్రలోని సవర, గదబ, జాతాబుల (గిరిజనుల) దయనీయ జీవితం కళ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. వాళ్లు ఎందుకు తుపాకీ పట్టవలసి వచ్చిందో అర్ధం అవుతుంది. ఈ కథలు చదివిన పాఠకులకు వారిపై సానుభూతి కలగడం మాత్రమే కాదు వారి సాయుధ పోరాటంలో మనం కూడా భాగస్తులుగా ఉన్నామన్నంతగా పాత్రలలో మమేకం అవుతారు. అందుకే భూషణం కథలు గురించి చెబుతూ ప్రముఖ కథకులు కాళీపట్నం రామారావుగారు ‘‘ఈ కథల్లో బలిసిన పెద్ద పులులు బక్కజీవుల కంఠం ముడులందుకుని విదిలించినవేళ, ఆ అసహాయ జీవాల కన్నుల్లో కనిపించే ఆర్తీ, పులుల కరాళ దంష్ట్రలలో మెరిసే భీకర క్రౌర్యం కనిపిస్తాయి. వికృతమైన కొండచిలువలు తమ కోరల్లో చిక్కిన సన్న జీవాలను అంగుళమంగుళమే కబళించేటప్పటి మౌనరోదనలు, భయంకర నిశ్శబ్దాలు వినిపిస్తాయి’’ (చలం, జి.ఎస్‌. భూషణం. పుట: 47) అని అన్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.