చిన్నప్పుడెప్పుడో
ఊహ తెలియక ముందే
మా పితామహుడు..
నాకో బిరుదుని అంటగట్టాడు
ఆ లక్షణాలన్నీ ఊటంకిస్తూ
‘పద్మినీ’ అంటూ సంబుర
పడేవాడు..!
ఆ నోటితోనే చెల్లెకేమో
మొండిఘటమనీ ఏదీ వినదని
‘శంకిని’ అంటూ నవ్వేవాడు
నా పసి హృదయానికి
వాటి వ్యుత్పత్తి టీకా తాత్పర్యాలు
స్ఫూరించకున్నా..
అణిగిమణిగి ఉండడం
వినయ విధేయతలను పెంచుకోవడం
చెప్పిందల్లా చెయ్యడం
ఇచ్చిందే తీసుకోవడం లాంటి
వినమ్రతల నెన్నింటినో
అలవరచుకున్నా..
ఇంకేం అప్పట్నుంచీ..
నన్ను నేను త్యాగం చేసుకుని
అందరి ముఖాల్లో ఆనందాన్ని వెతుకుతూ
నిశ్శబ్ద గాయం చేసుకుంటూ
సర్దుకుపోవడం అలవడిరది.
చూసిన చుక్కా, కాసిన కాయా
నచ్చిన అంగీ..
ఎంచుకున్న రంగు నావి కావులే అనుకొని
రాజీ పడ్డం నేర్చుకున్నా
ఇచ్చగించినా లేకున్నా
ఆ చట్రంలోంచే
అడుగులు కదపడం తల ఊపడం
పరిపాటయ్యింది
ఈ నడుమే..
మానవ జీవన పరిణామ వికాసాన్ని
ఆచార వ్యవహార పుట్టుపూర్వోత్తరాలని
లోతుల్లోంచి అనుభూతుల్లోంచి
అధ్యయనం చేశా..
హఠాత్పరిణామం నాలోకి ప్రశ్నలవర్షం
‘‘ఎందుకు, ఏమిటి, ఎప్పుడు,
ఎక్కడ, ఎలా’’ ప్రవేశించి
తలెత్తుకునేలా చేస్తున్నాయి..!