సమాజ దుఃఖ నివారణ మార్గాన్వేషకునిగా ఇల్లు వదలిన గౌతమ సిద్ధార్థుడు, ఆరేళ్ళ అన్వేషణానంతరం, జ్ఞానోదయాన్ని పొంది, బుద్ధుడయ్యాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని, బోధనల ద్వారా మాత్రమే గాక, ఆచరణ ద్వారా కూడా ప్రజలకు అందించాడు. అందుకే బౌద్ధం అంటే మానవులను కరుణార్ద్రచిత్తులుగా తీర్చి దిద్దగలిగిన ధర్మంగా గుర్తింపును పొందింది. నాది, మాది అన్న మాటలను మనది అన్న మాటగా
మార్చింది. వ్యష్టిని, సమిష్టిగా మార్చి, మనిషిని మనీషిగా ఎదిగించింది. అందుకే బౌద్ధం అంటే ఒక జీవన విధానంగా రూపుదిద్దుకుంది. రెండువేల అయిదు వందల సంవత్సరాలకు పైగా ప్రజల హృదయాలను, పరిమళింప జేస్తున్న బౌద్ధం, ఆధునికులను సైతం ఆకర్షిస్తూంది. అలాటి ఆధునికులలో, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత, జర్మన్ రచయిత .. అయిన, హెర్మన్ హెస్(1877-1962) ఒకరు. తన ముప్ఫైనాల్గవ యేట, భారతదేశంలో పర్యటించిన హెస్, భారతీయ మత దృక్పథాల పట్ల ఆకర్షితుడయ్యాడు. భారత, చైనా తాత్వికతలు తనను ప్రభావితం చేసినంతగా, మరే తత్త్వమూ ప్రభావితం చేయలేక పోయిందని చెప్పుకున్న వీరిని, ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన బుద్ధుడు ఆకర్షించాడు. ‘‘బుద్ధునిలా ప్రతియొక్కరు జ్ఞానోదయం పొందగలగడం సాధ్యమేనా?’’ అన్న అన్వేషణకు ఫలితంగా వెలసినదే వారి, ‘సిద్ధార్థ’ అన్న నవల. క్రీ.శ. 1922లో ప్రచురితమై, ప్రపంచ భాషలు పెక్కింటిలోకి అనువదింపబడి, నేటికీ పాఠకుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న యీ నవల, చాలాకాలం మనలను వెంటాడుతూనే ఉంటుంది.
క్రీ,శ. 1957లో శ్రీ బెల్లంకొండ రాఘవరావు గారు, 2005లో శ్రీ వల్లభనేని అశ్వినీకుమార్ గారు, 2012లో శ్రీ శార్వరిగారు చేసిన తెలుగు అనువాదాలు నాకు దొరికిన పుస్తకాలు. 1957లో ప్రచురింపబడిన తొలి అనువాదం, ఐదేళ్ల కాలంలో పదివేల ప్రతులు అమ్ముడు పోవడం, 2012లో మళ్ళీ మరొక రచయిత అనువదించడం వంటి వివరాలు యీ పుస్తకానికున్న ప్రాధాన్యతను తెలుపుతున్నాయి.
‘‘ఎన్నిసార్లు చదివినా మన సానుభూతిని, భావనను వృద్ధిపరుస్తూ, మనకు గంభీరమైన, విస్తారమైన విజ్ఞానాన్ని అందీయగల ఉత్తమ రచన’’ అని, ‘‘ప్రతివ్యక్తి హృదయ క్షేత్రంలోను నిక్షిప్తమై వున్న జ్ఞానాన్ని, ‘ఉన్నది’ అని నమ్మడం, దానికోసం వెదకడం, దానిని కనుక్కొని వినియోగించుకోవడం యిదే ఈ రచన బోధిస్తున్న సత్యం’’ అన్న ముందుమాటతో వెలసి తొలి అనువాదం (1957)లో, ‘తొలిపలుకు’, కె. స్వామినాథన్ యిప్పటి తరాన్ని సైతం ఆకర్షిస్తున్న యీ నవల, ప్రాకృతిక పరిశీలనతో కూడిన వ్యక్తిగత అనుభవాలు, ప్రకృతిలో మమేకం కాగలిగే స్థాయిని సాధించగలిగిన ‘అహం’ నిర్మూలన.. వంటి ఎదుగుదలలే సిద్ధార్థుని, బుద్ధునిగా ఎదగనివ్వగలవని చెబుతుంది.
ఈ నవలలోని సిద్ధార్థుడన్న యువకుడు ఉన్నత కుటుంబంలో జన్మించి, వేదవేదాంగాలను చదివి, ధర్మాన్ని అవగాహన చేసుకొన్నా, తను నేర్చిన విద్యలకన్న భిన్నమైనది ఆత్మ, పరమాత్మల తత్త్వానికి అందనిదీ అయిన జీవన సత్యం మరేదో ఉందని, దానిని తెలిసికోవాలని ఆరాటపడేవాడు. తండ్రి అనుమతిని పొంది, మిత్రుడు గోవిందునితో బాటు, మూడేళ్లు జైన గురువును సేవించి, ఆ ధర్మాన్ని అధ్యయనం చేసినా తృప్తి పడలేక, ఆ మార్గాన్ని త్యజించి, శాక్యర్షి, గౌతమబుద్ధుని దర్శించాడు. భిక్షుగణంతో కలసి వుంటూ, స్వయంగా భిక్షాటన ద్వారా తెచ్చుకున్న పిడికెడంత భిక్షను, అందరితోబాటు కలసి కూర్చుని తింటూ, అతి సామాన్యంగా కనిపిస్తున్న బుద్ధునిలోని మహోన్నత మూర్తిమత్వాన్ని, అసాధారణ శక్తిని గుర్తించాడు. అణువణువున లాలిత్యాన్ని, కారుణ్యాన్ని, శాంతిని నింపుకుని, మందస్మితవదనంతో. అలౌకికానంద మూర్తిమత్వంతో, ప్రశాంతత మూర్తీభవించిన సత్యస్వరూపుడై, నిర్మలంగా, మార్మికంగా కదిలే బుద్ధుడు అహాన్ని జయించిన వ్యక్తి అని గుర్తించాడు.
బుద్ధునితో సంభాషించిన సిద్ధార్థుడు, ‘నానుంచి అన్నీ దోచుకున్నాడు, గాని ఎంతో విలువైన సిద్ధార్థునిునన్ను నాకు పరిచయం చేశాడు’ అని ఆనందించాడట. ‘‘సుఖదుఃఖాలు, మంచిచెడులు, సత్యాసత్యాలుౌ ఇలా భిన్నమైన వాటిలో ఒకానొక ఏకత్వం ఉన్నదని, సర్వఘటనలకు అన్యోన్య సంబంధం కలదని, అల్ప, అనల్ప విషయాలన్నీ ఒకే కార్యకారణ ధర్మంవలన, ఒకే ప్రవాహంలో పుడుతూ, నశిస్తూ ఉన్నవని, సంపూర్ణమైన, అవిచ్ఛిన్నమైన, నిరంతరమైన కార్యకారణ బద్ధమైన శృంఖలమే యీ ప్రపంచమని, యీ శృంఖలాన్ని త్రెంపుకున్నపుడే నిర్వాణాన్ని పొందగలమని మీరు చెప్పినట్లు నాకు అర్థం అయింది,,, నన్నంటిపెట్టుకున్న అహం, తమ బోధనలపై అభిమానంగాను, తమపై భక్తిగాను, భిక్షుసంఘంపై ప్రేమగాను, పరిణామం పొందుతుంది. ఈ రకమైన అహంత పరిణామం ఎంత ఉత్తమమైనది అయినా బంధ హేతువే కదా!?’’ అని బుద్ధునితో చెప్పి, మళ్లీ ప్రపంచంలోకి నడకను సాగించాడు. బుద్ధునివలె తాను కూడ ‘అహం’ను జయించాలని, తనను గూర్చి తాను తెలుసుకున్నపుడే అది సాధ్యమవుతుందని గ్రహించాడు. ఈ గ్రహణ తరువాత చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రకృతి – అతనికి అందంగా, విచిత్రంగా, గూఢంగా, మనోహరంగా కనిపించాయట.
సిద్ధార్థుడు తన ఆత్మధర్మాన్వేషణలో, పడవసరంగు వాసుదేవుని, నగరవధువు కమలను, వ్యాపారి కామస్వామిని కలిశాడు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాడు. ఊరి ప్రజలకు ఎంతో సాయంచేశాడు. ఈ మనుష్యులనుండి, ఈ అనుభవాల నుండి ఎన్నో జీవితసత్యాలను నేర్చుకున్నాడు. చివరకు అందరినీ, అన్నిటినీ త్యజించి, మళ్ళీ సన్యాసిలా వాసుదేవుని చేరాడు. నదితో మాట్లా డటం నేర్చుకున్నాడు. చెట్లు, పుట్టలు, కొండలు, నదులు వీటినుండి సమస్త జీవనధర్మాన్ని గ్రహించవచ్చునన్న అవగాహనకు వచ్చాడు. బుద్ధుని ప్రసంగాలను వినడానికి వెళ్లివచ్చే వారిని, వందలకొలది మందిని నదిని దాటించాడు. బుద్ధుడు పరినిర్వాణం పొందబోతున్నాడన్న వార్తను విని ఖేదపడినాడు. తన తోటను బౌద్ధభిక్షువులకు దానం చేసి,బౌద్ధ ఉపాసకురాలిగా మారిన కమల, బుద్ధుని ఛూడడానికి వెళ్తున్న వారితో కలసి ప్రయాణిస్తూ, పాముకాటుకు గురై మరణించడం, ఆమె వెంటనున్న పిల్లవాడు తన కుమారుడని తెలిసినపుడు కలిగిన ఆనందం – ఆ పిల్లవాడు తనను వదలి పారిపోయినపుడు ఖేదంగా మారడం, వాసుదేవుని వలన విన్న జీవిత పాఠాలు, నదీమ తల్లి బోధనలు.. ఈ అన్నీ కలిసి సిద్ధార్థుని ఊరడిరచాయి. తన వలన తండ్రి, యీ పిల్లవాని వలన తాను… పొందిన బాధలు ఒక వృత్తి పరిణామమని, తనవలె వాడు కూడా తనకు తానై జీవిత సత్యాలను అన్వేషించి తెలుసుకోగలడని నిర్థారణకు వచ్చాడు. అతడిలోని ‘అహం’ పూర్తిగా విచ్ఛిన్న దశకు చేరుకున్నది. అందుకే అతడిలో ఒక తేజోమూర్తిని కమల, ఒక ప్రశాంత మూర్తిని వాసుదేవుడు, మరో బుద్ధుని అతని మిత్రుడూ, బౌద్ధభిక్షువు అయిన గోవిందుడు దర్శింపగలిగారు.
బౌద్ధ భిక్షువైన గోవిందునితో మాట్లాడుతూ సిద్ధార్థుడు పలికిన మాటలు బౌద్ధతత్త్వానికి అచ్చమైన ప్రతీకలు.
‘‘నిరంతరం గమ్యం గురించి ఆలోచిస్తూనే జీవన గమనాన్ని సాగిస్తున్న మీకు, వర్తమానంలో పరిసరాలు, ప్రాకృతిక సౌందర్యం నేర్పే పాఠాలపై శ్రద్ద లేదు. సజీవంగా పలుకరించే ప్రకృతి, ఆ ప్రకృతి ఒడిలో నివసించే సామాన్య మానవుడు కూడా ఎన్నో సత్యాలను విశదీకరిస్తారు. వీటన్నిటినీ అవగాహన చేసుకుంటూ, అన్వేషిగా సాగే సాధకుడు మాత్రమే అంతరంగాన్ని జాగృతం చేసుకోగలడు. ఎన్ని వైరుధ్యాల మధ్యనున్నా బురద అంటని పద్మంలా ప్రకాశింపగలరు. ఓంకార నాదమైనా, బుద్ధోపదేశమైనా దారిచూపే దివ్వెలుగానే పరిగణించాలి. ఎవరైనా విముక్తి మార్గాన్ని సూచింపగలరు తప్ప, మనకు మనమే స్వప్రయత్నం చేత విముక్తులం కావలసి ఉంటుంది. పూర్వ గ్రంథాలలో ఉన్నాయని గాని, పెద్దలు చెప్పారని గాని, దేనినైనా గ్రుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదని, ‘స్వయంగా హేతుదృష్టితో, అన్వేషించి, నీ మార్గాన్ని ఎన్నుకో’ అన్న బుద్ధవచనం గమనింపదగినది.’’ అన్న సిద్ధార్థుని పలుకులు జ్ఞాన మార్గాన్వేషి అయిన భిక్షువు అంతరంగాన్ని వెలిగించే జ్యోతులు.
బుద్ధుడు చెప్పే ‘నిత్య పరిణామ శీలం’ అన్న మాటను అర్థం చేసుకోవడం ఎలాగో హెర్మన్ హెస్ వివరించిన తీరు గమనార్హం. ‘‘ఒకరాయి, ధూళిగా మారి, నీటిలో కలిసి రూపాలు కోల్పోతుంది. ఆ పరిణామ దశలను, పూర్తి రూపంలో నున్న కొండలోనే దర్శించగలగడం విజ్ఞతకు గుర్తు. ‘అన్నీ క్షణికం’ అంటే ‘ఏదీ లేదు’ అని అర్థంగాదు. ప్రతిప్రాణిలో అన్ని భావాలు నిక్షిప్తమై ఉంటాయి. అందులోని విశిష్టమైన భావాన్ని గుర్తించడం – అంటే మైత్రి, కరుణ, సహానుభూతి, ప్రశాంతత వంటి భావాల వైశిష్ట్యాన్ని గుర్తించడం ముఖ్యం. అలా గుర్తించడం, తన బోధనలను ఆచరణలో పెట్టడం చేశాడు. కాబట్టే బుద్ధుడు మహోన్నతుడయ్యాడు’’ అంటాడు హెర్మన్ హెస్. అందుకే బుద్ధుడి బోధనలను దారిదీపాలుగా చేసుకోవడమే గాక, పరిసరాలను, ప్రకృతిని, ప్రకృతి నేర్పే ప్రతి చిన్న అంశాన్ని, పరిశోధిస్తూ, సహనాన్ని, శాంతిని పోగొట్టుకోక నిరంతరాన్వేషణలో సాగినపుడు మాత్రమే జీవన, ప్రాకృతిక రహస్యాలను గుర్తించగలమని, అదే జ్ఞానోదయం అని చెబుతుంది ఈ ‘సిద్ధార్థ’ నవల.
ఈ నవలా నాయకుడైన సిద్ధార్థుని జీవితంలో ఈ జ్ఞాన సముపార్జన నాలుగు దశల్లో జరిగినట్లు గమనించగలం. వైదిక, శ్రమణ సంస్కృతులు సిద్ధార్థునిలో కలిగించిన భావశైబల్యతలను ప్రథమదశగా గుర్తిస్తే, ఆ అసంతృప్తి నుండి చేసిన బుద్ధదర్శనం, సిద్ధార్థునిలో కలిగించిన ఆలోచనా శీలత రెండవ దశ. బుద్ధునికీ యితరులకు మధ్యనున్న తేడాను గుర్తింపజేసిన దశ యిది. బుద్ధునిలోని ఆచరణశీలత, యితరులలో లేకపోవడాన్ని గమనించిన దశ. ఈ వైఫల్య స్థితిని దాటాలంటే అహంకారరహిత, శాంతి సహనాలతో కూడిన సంస్కారాన్ని పెంపొందించుకోవలసి ఉందని గుర్తింపు నిచ్చినదశ. తన జ్ఞానాన్ని తానే అన్వేషించాలని సాగిన సిద్ధార్థుని జీవితంలో కమల పరిచయం, కామస్వామి వ్యాపారభాగస్వామ్యం, తద్వారా లభించిన వైఫల్యఫలిత శిథిలజీవనం మూడవ దశ. ఏవేవి వైఫల్య సిద్ధాంతాలో గ్రహించి, అన్నింటినీ త్యజించి, నదీతీరంలో పడవసరంగు వాసుదేవుని సాంగత్యంలో నదీమతల్లినుండి, ప్రకృతినుండి సందేశాలను వినగలిగే స్థాయికి తనను తాను ఎదిగించుకున్నదశ నాల్గవ దశ. సిద్ధార్థునిలోని ‘అహం’ సమూలంగా నశించిన దశ యిది. అందుకే, ఏ శాంతి, ఏ దయ, ఏ జ్ఞానం, ఏ వెలుగు బుద్ధభగవానుని చిరునవ్వులో గోచరించిందో, అచ్చంగా ఆ విధంగానే గోచరిస్తున్నది సిద్ధార్థుని ముఖంలోని చిరునవ్వులో కూడా అని నమస్కరించాడట బౌద్ధభిక్షువైన గోవిందుడు.
ప్రతివ్యక్తి, బుద్ధత్వాన్ని పొందడానికి ఎలా పరిక్రమించాల్సి ఉంటుందో, జీవన శైథిల్యాలనధిగమించి, స్వయం శిక్షణతో తనను తాను ఎలా మెరుగుబెట్టుకోవాలో అన్న అన్వేషణతో సాగిన ఈ నవల, హెర్మన్ హెస్ ఊహలనుండి రాలిపడిన భావధార మాత్రమే కాదు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య అతలాకుతలమైన బాహ్య జీవితం, విఫలమైన మూడు వివాహాలు, స్విస్ దేశపు పౌరసత్వాన్ని స్వీకరించవలసి రావడం వంటి తన జీవితానికి సంబందించిన వ్యతిరేక భావధారలలో కొట్టుకుపోకుండా తననుతాను రక్షించుకున్న నేపథ్యం, బాల్యంలో తలిదండ్రుల నుండి భారత, చైనా దేశాల పర్యటనల నుండి, తాను సముపార్జించుకున్న తాత్వికతల నుండి సంక్రమించిందేనంటారు ఈ రచయిత, ఈ ప్రేరణే 1922లో ‘సిద్ధార్థ’ నవల, 1946లో నోబెల్ సాహిత్య బహుమతిని తెచ్చిపెట్టిన ‘ప్రపంచ శాంతి’ అన్న వ్యాస సంపుటి వంటి రచనలు వెలుగుచూడ సహకరించింది. జీవనాన్వేషణకు, దేశకాలాల పరిమితులుండవు అని గుర్తించిన యీ ‘సిద్ధార్థ’ నవల జ్ఞానసముపార్జనలో వ్యక్తికుండవలసిన స్వయంచోధక శక్తి, వర్తమాన జీవితపు స్పృహ, ప్రాకృతిక అవగాహనల ఆవశ్యకతను వివరిస్తూ, ‘నీ ఆలోచనలే నీ జీవితం’ అన్న బుద్ధధర్మాన్ని ప్రతిఫలిస్తూన్నది.
మూడు తెలుగు అనువాదాలు కూడా మూలవిధేయంగానే సాగినా, 2012లో వెలువడిన శ్రీ శార్వరి గారి ‘సిద్ధార్థ’ అనువాదం మాత్రం కొంత వివరణాత్మకంగా కొనసాగుతుంది. ‘హెర్మన్ హెస్ యిప్పుడీ నవలను వ్రాస ిఉంటే, యిలాగే వ్రాసి ఉండేవారని నా నమ్మకం’, అని ఘంటాపథంగా చెప్పికున్న శ్రీ శార్వరిగారు, మూలానికి ఎక్కడా విచ్ఛిన్నం కలగని రీతిలో ఈ కథను మరికొంత పెంపుజేశారు. అంటే బుద్ధునికి సిద్ధార్థునికి, సిద్ధార్థునికి గోవిందునికి, సిద్ధార్థునికి వాసుదేవునికి మధ్య జరిగిన సంభాషణలను కొంత వివరణాత్మకంగా పెంపుజేయడంలో మాత్రమే! అయినా చదివి ముగిసిన తరువాత గమనిస్తే ఎక్కడా మూలాతిక్రమణ జరుగలేదన్న అంశం స్పష్టమవుతుంది. ఈ విధంగా కూడా ఈ నవల ఆధునికులమీద చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేయగలం.
భారతదేశంతో బాటు ఎన్నో ప్రపంచ దేశాలలో వెలసి ఉన్న, ‘హెర్మన్ హెస్ మెమోరియల్ సొసైటీ’లు, యిప్పటికీ యింకా పెక్కు భాషల్లోకి వస్తున్న (1917లో వెలసిన తమిళానువాదం), ఈ ‘సిద్ధార్థ’ నవల అనువాదాలను గమనిస్తే, యీ నవల, యీ రచయిత ఆధునికులను ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అన్న అంశం విశదమవుతుంది.
(ఉదయిని పత్రిక నుండి…)