కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, అన్ని విషయాలలో ఇరువురు సహకరించుకుంటే ఆ బంధం బాగుంటుంది. పితృస్వామ్య భావజాలంతో భార్యను బానిసగా చూడటం, అధికారం చెలాయించడం, ప్రతిక్షణం అణిచివేయడం సర్వ సాధారణమైంది.
కొండవీటి సత్యవతిగారు వివాహం తర్వాత స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను గురించి వారి కథల సంపుటి అయిన కొన్ని మెరుపులు కొన్ని ఉరుములులో చిత్రించారు. కె. సత్యవతి స్త్రీవాద రచయిత్రి. సామాజిక ఉద్యమకారిణి, స్త్రీవాద పత్రిక భూమిక ప్రారంభించి, దానికి సంపాదకత్వం వహిస్తున్నారు.
భార్యా భర్తల బంధం బలంగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ ఉండాలి. ఒకరి మాటకు ఒకరు విలువనిస్తూ, పరస్పరం గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్థంచేసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినా అప్పటికప్పుడు మాట్లాడుకుని, దాన్ని పరిష్కరించుకుని, పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. ఉప్పు నిప్పులా ఉంటే ఆ బంధాలు ఎక్కువకాలం నిలబడవు. సత్యవతిగారు భార్యా భర్తల మధ్య అపనమ్మకం, అధికారాల వల్ల ఆడవాళ్లు ఎంతటి బాధను అనుభవిస్తారో తెలిపిన కథలు ‘అపూర్వం, మెలకువ సందర్భం, ఐతే’.
ఆడవారికి మనసుంటుంది కోరికలు, ఇష్టాలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. కానీ పెళ్లి తర్వాత అన్నీ వదిలేసి ఒక యంత్రంలా మారి, భర్తే దైవం, ఇళ్లే ప్రపంచం అనుకుంటూ, బావిలో కప్పల్లా బతకాలి. భర్తకి ఎదురు చెప్పకూడదు. అతని అధికార పరిధి దాటకూడదు. భర్త అనుమతి లేనిదే ఏ పని చేయకూడదు. ముఖ్యంగా భర్తతో సమానంగా భార్య అసలు ఉండకూడదు అనుకుంటారు. ఇలాంటి ఇతివృత్తం గల కథ ‘అపూర్వం’. ఇందులో హరిత, తన భర్త ప్రభాకర్, మిత్రుడు చంద్రశేఖర్ ప్రధాన పాత్రలు.. తన ఇష్టాలు, వ్యాపకాలు, ఆలోచనలు, ఎంతో గౌరవించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్న మిత్రుడు (ప్రభాకర్) భర్త స్థానంలోకి రాగానే ఎలా అధికారాన్ని చెలాయిస్తాడో చెప్తుందీ కథ. ‘‘స్నేహితుడిగా ఉన్నప్పుడు కల్మశంలేని సెలయేరులా స్వచ్ఛంగా ఉండేవాడు, ఏ రోజైతే మొగుడి అవతారమెత్తాడో ఆ రోజే అధికార సంబంధాల్లోకి జారిపోయాడు… అతనిలో వచ్చిన మార్పు తనని ఎంతగా హింసించింది’’ (సత్యవతి కొండవీటి. కొన్ని మెరుపులు కొన్ని ఉరుములు. పుట.105). పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అతనిలోని మార్పుని తలుచుకుంటూ బాధపడుతుంది హరిత. పెళ్లికి ముందు మంచివాళ్లుగా నటిస్తారు. తర్వాత ఆ ముసుగు తొలగిపోయి, అసలు రంగు బయటపడుతుంది. వివాహానంతరం ఆడవాళ్లు భర్త చెప్పు చేతల్లో ఉంటారని, ఏం చేసినా ఎదిరించరని, భర్త తోడు లేకపోతే స్త్రీకి బతుకేలేదనే నమ్మకం. అందుకే భార్యమీద అధికారాన్ని చెలాయిస్తూ, ప్రతిక్షణం అణిచివేస్తూ పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తారు.
భార్య ఎప్పుడూ భర్త అధికార పరిధిలో వుండాలి, తనని మించి తెలివి వుండకూడదు, వాళ్ళ అదుపాజ్ఞలలో వుండాలనుకుంటారు, లేకపోతే భరించలేరు. ‘‘నువ్వు నాతో సమానంగా అడుగులేయడం మొదలు పెట్టగానే నిన్ను వెనక్కి నెట్టివేయడానికి నా శాయశక్తులా కృషి చేశాను. నువ్వు నన్ను దాటి వెళ్ళిపోతావేమో అనే భయం అనుక్షణం నన్ను పీడిరచేది. నిటారుగా, ధైర్యంగా నడిచే నిన్ను భరించలేక అణిచివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించాను’’ (పుట.110). పై విధంగా ప్రభాకర్ మారిన తర్వాత హరితకు రాసిన ఉత్తరంలో చెప్తాడు. ఆడవారిని ఎంత వేధించినా, చులకనగా చూసినా, వారు భర్తను గౌరవిస్తూనే ఉంటారు. ఎందుకంటే, ఎప్పటికైనా మారతారనే నమ్మకం. కానీ అతని ప్రవర్తన మితిమీరితే ఆత్మగౌరవం గల ఏ స్త్రీ భరించలేదు. కాబట్టి హరిత, ప్రభాకర్‌ను వదిలేసింది.
ఆదర్శ పురుషుడిగా దర్శనమిస్తూ భర్త స్థానంలోకి రాగానే భార్యను బానిసగా చూడడం, హింసించడం, అవమానించడం భరించలేక తన వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, వైవాహిక బంధం వద్దనుకొని, స్వతంత్రంగా బతకాలని గడప దాటిన పాత్ర అపుర్వంలోని హరిత. ఇందులో ప్రభాకర్‌ను మారిన పాత్రగా చూపించారు. ఆ తర్వాత వారి వైవాహిక బంధం కొనసాగే దిశగా హరిత ఆలోచిస్తున్నట్టు ముగింపు ఇచ్చారు. హరిత వద్దనుకున్నది భర్తను కాదు. అతనిలోని పురుషాహంకారమని ఈ కథలో చెప్పారు. ఇలాంటి మరోకథ ‘మెలకువ సందర్భం’. ఇందులో ప్రధాన పాత్రలు రమేష్, అరుణ. ‘‘ఆశయాల ముసుగులో పురుషుల్లో కొనసాగుతున్న పురుషాధిపత్యానికి ప్రతీక, సంప్రదాయ భావాలను వదలించుకుని, సామాజిక బాధ్యతతో, స్వేచ్ఛగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా కృషి చేయాలో చూపించిన కథ మెలకువ సందర్భం’’.(ఛాయాదేవి అబ్బూరి. భూమిక స్త్రీవాద మాస పత్రిక. డిసెంబర్, 2013).
స్త్రీల సమస్యల గురించి ఆలోచన కలిగించే ప్రసంగాలు చేస్తూ, ఉన్నత ఆశయాలు గల వ్యక్తిగా తారసపడతాడు రమేష్. స్త్రీల పట్ల అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అరుణ. తన ఆలోచనలకు, ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తి రమేష్ అనుకొని, అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతని ఉపన్యాసాలు, ఆదర్శాలు పదిమంది మెప్పుకోసమేనని తర్వాత గ్రహిస్తుంది. ‘‘నువ్వు ఉపన్యాసాల్లో వల్లించే ఉన్నతాశయాలు అబద్దాలని తేలిపోయింది. ఈ రోజుల్లో స్త్రీ స్వేచ్చ అని, స్త్రీల సమస్యలనీ అందరూ మాట్లాడుతున్నారు. ఆచరణలో మాత్రం పచ్చి ఫ్యూడలిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు అంతే’’ (పుట.51) అంటుంది అరుణ. స్త్రీల గురించి చెప్పేవన్నీ కాగితాలకు, ఉపన్యాసాలకే పరిమితం, ఆచరణ శూన్యం. ఎంతసేపు భార్యని కాలికింద చెప్పులా ఉంచాలనుకుంటారే గానీ, ఆమె మనిషేనని, తనకు మనసుంటుందని గ్రహించరు. మగవాళ్లనే అహంకారం, ఏం చేసినా చెల్లుతుందనే నమ్మకం. ఇదే వస్తువుతో వచ్చిన మరోకథ ఐతే. ఇందులో ప్రధాన పాత్రలు ప్రకాశరావు, జానకి. మగవారు ఎన్ని తప్పులు చేసినా అవన్నీ పట్టించుకోకుండా, చూసీ, చూడనట్టు ఉంటూ, వారికి ఎదురు చెప్పుకుండా, వాళ్లేం చెప్పినా చేసుకుంటూ పోయినంతకాలం ఆ దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది. భార్య ఎదురు తిరిగి, భర్త తప్పుల గురించి చెప్తే, అది ఎంతకైనా దారితీస్తుంది.
ఈ కథలో ప్రకాశరావు ప్రభుత్వ ఉద్యోగి అని జానకినిచ్చి పెళ్లి చేస్తారు. అతను మరో అమ్మాయిని ప్రేమించినట్టు చెప్తాడు, ఆమె అంటేనే తనకు ఇష్టమని, నువ్వు నచ్చలేదని జానకితో చెప్తాడు. ‘‘మొదటి రాత్రి ఎంతో సంతోషంగా గదిలోకి అడుగు పెట్టిన జానకి ఆనందం వెంటనే ఆవిరైపోయింది. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తనకి తన కొలీగ్‌తో ప్రేమ వ్యవహారముందని, ఆమె కులం వేరే అవ్వడం వల్ల, తల్లి చనిపోతానని బెదిరించి, బలవంతంగా ఈ పెళ్ళి చేసిందని పిడుగులాంటి వార్త చెప్పాడు’’ (పుట.237). పై విధంగా ఒక అమ్మాయి మాట్లాడితే ఆ క్షణం నుండి తన జీవితం నిప్పుల మీద నడకల మారుతుంది. కులం వేరని, ఇంట్లో ఒప్పుకోరని ప్రేమించేటప్పుడు అతనికి తెలీదా. ప్రేమ పేరుతో ఒకరి జీవితం, పెళ్లి పేర మరొకరి జీవితం నాశనం చేశాడు. ‘‘నీకు అన్యాయం చేయను. ఆమెను ఒదులుకోలేను. నేను లేకపోతే ఆమె చచ్చిపోతుంది’’ (పుట.238). ఆమెను పెళ్లి చేసుకుని అన్యాయం చేసింది చాలదని, మరో ఆడదానితో కలిసి వుంటానని ధైర్యంగా చెప్తాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా, ఎవరితో తిరిగితే ఏముంది నిన్ను వదిలేయనందుకు సంతోషపడు అంటారు. అదే ఒక స్త్రీ పరాయి మగాడితో కాస్త చనువుగా మాట్లాడితే లేనిపోని సంబంధాలు అంటగట్టి ఆమెను బతకనివ్వరు.
జానకి తన భర్త ఆగడాలు పిల్లల పెళ్లిళ్ల వరకు భరిస్తుంది. అతను మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసినా, కేవలం పిల్లల కోసం ఓర్పుగా ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ల తర్వాత అతన్ని ఎదిరించి, తన దారి తాను చేసుకుంటానని అంటుంది. ‘‘ఆడ పుటక పుట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మగాడికి లక్ష సంబంధాలుంటాయి. ఏంటో అనుకుంటున్నావ్ ఈ ఇల్లు దాటావంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే’’ (పుట. 241) అంటాడు ప్రకాశరావు. ప్రకాశరావు పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, ఎప్పుడూ అక్కడే ఉండటాన్ని జానకి కొడుకు, తన పుట్టింటివాళ్లు అందరూ సమర్థిస్తారు. అతను మగాడు కాబట్టి ఎంతమందితో సంబంధం పెట్టుకున్నా తప్పులేదంటారు.
పురుషుడు ఏం చేసినా తప్పుపట్టదీ సమాజం. మగవాడు ఎంతమందితో తిరిగినా తప్పులేదు. ఆడది మాత్రం పవిత్రంగా వుండాలి, పరాయి మగాళ్లతో మాట్లాడినా అనుమానిస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాతారు. ‘‘దొంగ ము.. ఎక్కడికెళ్లతావ్ వాడి దగ్గరికే కదా? ఆ బాల సుబ్బిగాడ్ని చంపి పాతరేస్తే నీ రోగం కుదురుతుంది’’ (పుట.242). భర్త దుర్మార్గాలను భరించలేక భార్య విడిపోతానంటే, ఆమె మరో మగాడి అండ చూసుకునే ఇలా మాట్లాడుతుంది అనుకుంటారే గానీ, వదిలేయాలనుకునేంత తప్పించేశానని ఏ భర్త ఆత్మ విమర్శ చేసుకోడు. అరవై ఏళ్ల వయసులో ఇలాంటి పని చేస్తావా, మా ఇంట చెడబుట్టావు అని తన అన్న అంటాడు. ముప్పై ఏళ్లుగా అంటే జానకి పెళ్ళయిన దగ్గర నుండి ప్రకాశరావు మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నా కూడా అతన్ని పవిత్రుడిగానే భావిస్తున్నారు. ఏదేమైనా, ఎవరు ఏమనుకున్నా, ఏమన్నా అతనికి విడాకులు ఇచ్చి తనదారి తాను చూసుకుంటుంది జానకి. ఆడవాళ్ళు భర్త నుండి ప్రేమానురాగాలు, ఆత్మీయ పలకరింపును ఆశిస్తారు. అంతేకాదు భర్త పరాయి ఆడదానితో కలిసుండటం ఏ భార్య భరించలేదు. ఈ కథలో జానకి ప్రకాశరావును వదిలేసే సంగతి ధైర్యంగా చెప్తుంది. వాస్తనంగా సమాజంలో ఎంతోమంది స్త్రీలు లోకానికి భయపడి, పిల్లల భవిష్యత్తుకోసం, భర్తను వదిలేస్తే సమాజంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో వుంచుకొని, తప్పనిసరై దాంపత్య జీవితంలో కొనసాగుతున్నారు.
భార్యా భర్తల బంధం బలంగా ఉండాలంటే వారు జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారో పెళ్లికి ముందే మాట్లాడుకుని, ఇరువురు సరైన అవగాహనతో ఒక నిర్ణయానికి వచ్చాక, వివాహ బంధంలోకి అడుగుపేడితే ఆ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వస్తువుతో వచ్చిన కథ ‘హమ్ చలేంగే సాథ్ సాథ్’. ఇందులో ప్రధాన పాత్రలు అవని, గురు.
పెళ్లి తర్వాత ఆడపిల్లలు అత్తింటికి వెళ్లి అక్కడ అత్తమామలకు సేవ చేస్తూ, భర్త ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకుని, పూర్తిగా అతని మీద ఆధారపడి బతకడం నేర్పుతారు. ఇలా బతకడమే సంప్రదాయం అంటారు. ఇది పురుషాదిపత్యానికి నిదర్శనం. అలా కాకుండా దాంపత్య జీవితం గురించి స్త్రీ పురుషులు ఇరువురు ముందుగా మాట్లాడుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని హక్కులు, అధికారాలకు తావులేకుండా, వారి ఆలోచనలు, ఆశయాలు, ఇష్టాలు పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమగా, ఆదర్శంగా జీవించడం ఎలాగో అవనీ, గురూ పాత్రల ద్వారా తెలిపారు సత్యవతి.
గురు, అవనీ పెళ్ళికి ముందే వివాహానంతరం వాళ్ళు ఎలా వుండాలనుకుంటున్నారో మాట్లాడుకుని, అది ఇరువురికి అంగీకారయోగ్యం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. కాబట్టి వాళ్ల కాపురం ఎలాంటి కలతలు లేకుండా సాగిపోతుంది. భార్యాభర్తల బంధం హక్కులు, అధికారాలు లేకుండా ప్రజాస్వామికంగా వుండాలని రాశారు. దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య ప్రేమ, స్నేహం, పరస్పర అవగాహన, సహకారం ఉండి, వ్యక్తిత్వంతో పాటు కుటుంబ బంధాన్ని ఎలా నిలుపుకోవాలో ఈ కథలో చెప్పారు.
కె. సత్యవతి తన కథలలో భార్యా భర్తల మధ్య అధికారాలు, అణిచివేతలు, హింస, వివక్ష వుంటే ఆ బంధాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో తెలిపారు. భార్య భర్తలు మిత్రుల్లా వుండాలని, అలాగే వారి మధ్య ప్రేమ, స్నేహం, పరస్పరం అవగాహన, సహకారం వుంటే ఆ దాంపత్య జీవితం ఎంత అదర్శంగా వుంటుందో కూడా చెప్పారు.
ఉపయుక్త గ్రంథ సూచి: 1. కొండవీటి సత్యవతి. కొన్ని మెరుపులు కొన్ని ఉరుములు. 2. స్త్రీవాద పత్రిక భూమిక.
(పిహెచ్‌డి ధీసిస్‌కి రాసిన వ్యాసం)