1984లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే కవిత్వ సంపుటితో మొదలైన అనిశెట్టి రజిత సాహితీ ప్రయాణం ఆరు కవితా సంపుటాలు, అనేక దీర్ఘ కవితలు, హైకూలు, నానీలు, వందలకొలదీ సాహిత్య సామాజిక వ్యాసాల రచనలతో పాటు, అనేక గ్రంథాలకు సంపాదకత్వంతో నేటి వరకూ కొనసాగుతూనే
ఉంది. పలు పత్రికలకు సంపాదక వర్గంలో సభ్యులుగా, రుద్రమ ప్రచురణల ప్రచురణ కర్తగా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షులుగా… ఇలా అనేక పాత్రలలో ఆమె విస్తారమైన సాహితీ, సామాజిక రంగ కృషి అందరికీ పరిచయమే. ఇక ఆమె పొందిన ప్రముఖ పురస్కారాల జాబితా కూడా పెద్దదే. సుభద్రాకుమారీ చౌహాన్ అవార్డు, వీరాంగన సావిత్రీబాయి ఫూలే ఫెలోషిప్ అవార్డు, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, డాక్టర్ బోయి భీమన్న పురస్కారం, రొట్టమాకు రేవు కవిత్వ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ ` కుందుర్తి ఆంజనేయులు అవార్డు ఇలా అనేకం.
తాజాగా ఆమె వెలువరించిన ‘కాలం కేన్వాస్ మీద’ అనే ఈ కవిత్వ సంపుటి ఆమె రచించిన ఏడవ కవిత్వ సంపుటి. ఈ సంపుటిలో యాభై కవితలు ఉన్నాయి. వైవిధ్యమైన వస్తువులతో, విభిన్నమైన తన శైలిలో, తన అనుభవాలను, అనుభూతులను, ఆవేదనలను, బహుళ అస్తిత్వ గళాలను, అణచివేతను, అసమానతలను, తనకు పరిచయమైన వ్యక్తులతో తన అనుబంధాన్నీ… అన్నీ తన కవితల్లో పదునైన మాటలకు, లోతైన తాత్వికత జోడిరచి పదిలపరిచారు.
కవితా సంపుటి శీర్షికగా ఉన్న కవిత ‘కాలం కేన్వాస్ మీద’ కవితలో ‘‘నేనిప్పుడు ఒక నైమిశారణ్యంలో సేదతీరాలని/ విశ్వయాత్రతో విస్మృతినై తప్పిపోవాలని / కాలం కేన్వాస్ మీద తుమ్మెదలా వాలి ఒక చుంబన మకరందాన్ని ఆస్వాదించాలని/ ఒక సృష్టిని అధ్యయన మథనం చేస్తూ / కాలానికి ఊయలగట్టి రుతురాగమై ఊగాలని / పిల్లనగ్రోవి నుండి వీచే గాలిపాటనై/ నిర్మోహంగా ఆత్మదీపాన్ని ఆలింగనం చేసుకోవాలని (ఉంది)’’ అన్న ఆకాంక్షలో అంతులేని భావుకతతో పాటు లోతైన తాత్వికత కనిపిస్తుంది. ఈ సంపుటిలో ఇలాంటి కవితలు ఎన్నో!
ముందుగా వ్యక్తుల నుండి స్ఫూర్తి పొంది రాసిన కవితలు చూద్దాం!
బాల్యంలో ఎవరికైనా తన తండ్రి హీరోలాగా కనబడతాడు. వాళ్ళని తెలియకుండానే అనుకరిస్తారు, అనుసరిస్తారు. కొంచెం పెద్దయ్యేకొద్దీ వాళ్ళని ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అలా తన తండ్రి గురించి రజిత గారు రాసిన కవిత ‘మా నాన్నే విశాల ప్రపంచం!’ అందులో ఇలా చెప్తారు.
‘‘బతుకు వ్యవసాయంలో కష్టాలతో / అలంకృతుడైన మా నాన్న / నిఖార్సైన కార్మికుడూ కర్షకుడు / అనుబంధాలని ఆవిష్కరించినవాడు / మాకు మా నాన్నే ఈ సుందర సువిశాల ప్రపంచం అనిపిస్తాడు.’’
ఇలా ఒక కూతురు తన తండ్రి గురించి ఆరాధనతో, ప్రేమతో రాసుకున్న పంక్తులు మన హృదయాంతరంగాలను కూడా సూటిగా తాకుతాయి. అయితే తన తండ్రి అనే కాదు, రజిత తాను విన్న, చూసిన, కలిసి నడిచిన అనేకమంది వ్యక్తుల వల్ల స్ఫూర్తి పొందారు. మంచిని, గొప్పతనాన్ని ఎక్కడున్నా చర్చించి, గుర్తించి, మన్నించి, దాన్ని స్వీకరించి ప్రేరణ పొందటమే కాక ఆ విషయాన్ని ఎటువంటి భేషజం లేకుండా ఒప్పుకుని, ఆ అనుభవాలకి కవితా రూపం ఇచ్చారు. తన సొంత తండ్రి తరువాత తన తండ్రి సమానంగా భావించిన కాళోజీపై రెండు కవితలు రాశారు.
మా నాయన విశ్వమానవుడు, ఆకాశమంత మనిషి. అందులో కాళోజీ గురించి… ‘‘ప్రజా కవీ! పౌర హక్కుల రవీ!’’ అని పిలుస్తూ…
‘‘పొగడ్తలకు లొంగని ధిక్కారం / పురస్కారాలకు తలవంచని సంస్కారం / అతడొక మహా సైన్యం’’ అంటారు. పైగా ‘‘ఆకాశమంత మనిషిని దేనితో కొలుస్తాం, మనసుతోనే కదా! / అంతెత్తు మనిషిని ఎంతెత్తుకెదిగితే చూస్తాం / అరాచకాలపై కన్నెర్ర జేస్తేనే కదా / ‘నా’ నుండి ప్రయాణంలో ‘మనం’ వరకూ చేరుకుంటేనే కదా / జనం మనం అని తెల్సుకుంటేనే కదా’’ అంటూ కాళోజీ ఆశయాలకి అసలైన నివాళి ఎలా ఇవ్వాలో కూడా చెప్తారు.
అబ్దుల్ కలాం, సినారె, ఉద్యమకారిణి పొద్దుటూరు జయశ్రీ, సాహితీ మిత్రులు వేణు సంకోజు… ఇలా అనేకమంది ప్రముఖులు, సన్నిహితులపైన కూడా కవితలు రాశారు రజిత.
ఈ సంపుటిలోని ‘ఆమె పాదం’, ‘రెండో సగానివి’, ‘పితృస్వామ్యంలో’ అనే కవితలు స్త్రీ వాదిగా, స్త్రీ పక్షపాతిగా, పితృస్వామ్య వ్యతిరేకిగా అనిశెట్టి రజిత స్వరాన్ని పదునైన మాటలతో, స్పష్టమైన భావజాలంతో సాక్షాత్కరింపజేస్తాయి. ఆడపిల్లల పట్ల సమాజంలో
ఉన్న వివక్షని ఎత్తి చూపుతూ…
‘‘సత్సాంప్రదాయాల పుట్టినిల్లీ దేశం / స్త్రీని పూజించే పుణ్యభూమీ దేశం / అయినా ఆడజన్మలు అంతరిస్తుంటాయి / ఏడుపు పాటలుగా ధ్వనిస్తుంటాయి’’ అంటారు.
‘పితృస్వామ్యం’ కవితలో ‘‘సతీత్వం వెంటనే దహించేస్తుంది / విధవత్వం మెల్లిగా చంపేస్తుంది / ధర్మ శాసనాల
ఉచ్చుల్లో బంధించి / హింసిస్తుంది పురుషస్వామ్యం’’ అంటూ ‘‘యుగయుగాల వైఫల్యం పితృస్వామ్య వ్యవస్థది / మరో దారి లేదు… రావాలిక మాతృస్వామ్యం’’ అంటారు.
హైదరాబాద్ నగరంపై ప్రేమతో, అక్కడ మతాల మధ్య నెలకొన్న సామరస్య సంస్కృతి, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాల పట్ల గర్వం, ఉర్దూ భాషపై మక్కువతో రాసిన కవిత ‘‘విశ్వ ప్రేమ కావ్యం’’. హైదరాబాద్ నగర సంస్కృతిలో భాగమైన ఉర్దూ, తెలుగు సమ్మేళనం ఈ కవితలో కనపడుతుంది.
కరోనాపై రాసిన రెండు కవితలు ‘మాఫ్ కరోనా’, ‘జాగో జనతా, భాగో కరోనా’ కవితల్లో కూడా ఈ ఉర్దూతో
సమ్మిళితమైన తెలుగు భాషా ప్రయోగం కనపడుతుంది. ఇది తెలంగాణ ప్రాంత ప్రత్యేక అస్తిత్వానికి ప్రతీకగా కూడా
భావించవచ్చు. ఇక పల్లెల్లో మూలాలు కలిగి అక్కడే తమ బాల్యం గడిపిన వారు పల్లెతో గల అనుబంధాన్ని జీవితాంతం మరచిపోరు. ‘ఊరు బంధం’, ‘ఆ పల్లె జాడ ఏడ’… ఈ రెండు కవితల్లో వస్తువు అదే. ‘ఊరు బంధం’ కవితలో ఊరి గురించి చెబుతూ…
‘‘ఊరంటే ఉట్టి మట్టి కాదు / మట్టీ, మనిషీ ఉత్పత్తీ / ఊరంటే జనజీవన తంత్రం / సూర్యునితో కలెదిర్గె శ్రమయంత్రం… మనిషికి ఊరు చిరునామా / ఊరు బంధాల సంబంధాల కల్నేత / ఊరు ఊర పిశికెలు అల్లుకున్న గూడు / ఊటబాయిల ఊరే తేట నీరు… ఊరంటే చెట్లు పనిముట్ల స్నేహం / మనిషిని మనిషి పట్టించుకునే ఆరాటం! … ఊరు సబ్బండ జాతుల సంస్కృతి / మనిషి ప్రకృతితో జతకట్టే నియతి!’’
ఇలా ఈ కవిత మొత్తం పల్లె జీవనం ఎలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ, కాల నియమాలను పాటిస్తూ, ఆధునికతకు దూరంగా, మనిషితనానికి దగ్గరగా ఉండేదో చాలా ఆప్యాయంగా… అబ్బురంగా చెప్తారు. అయితే అది ఒకప్పటి మాట. ఏ మాత్రం లాభసాటిగా లేని వ్యవసాయం, మంచి బడులు, కాలేజీలు, మౌలిక సదుపాయాలు కరువై, యువతకి ఉపాధి కల్పించలేని పల్లెల పరిస్థితులు, యువతని, కుటుంబాలని పల్లె నుండి పట్నాలకు, నగరాలకు వలస పంపాయి.
‘ఆ పల్లె జాడ ఏడ’ కవితలో నేటి పల్లెల దుస్థితి పట్ల బాధ, తన బాల్యం నాటి పరిస్థితి ఇప్పుడు పల్లెల్లో లేదన్న ఆవేదన వ్యక్తపరుస్తారు.
‘‘పల్లె రా బిడ్డా అని చేతులు జాపి అవ్వోలే పావురంగా పిలిచేది / కాళ్ళకి నీళ్ళిచ్చి పల్కరిచ్చి / గుడ్లనీరు ఊరంగ తడిమేది… / ఇదేంది గిప్పుడు గా పల్లెలు వన్నె దప్పి మాసిపోయినయి / ఊల్లె మన్సులు కానరాక / సడీసప్పుడు లేక బావురుమంటానయి… బుగులుగమ్మి మనాది పట్టిన దేశం నా పల్లె జాడ ఏదనో జెప్పుండ్రని నోరార్సుకుపోంగ అడుగుతాంది’’ అంటారు.
కొంతకాలం క్రితం, చిన్నారి పాప శ్రీహితపై జరిగిన హత్యాచారంపై ఒక మనసున్న మనిషిగా స్పందిస్తూ, మానవత్వం కరువైన సమాజాన్ని నిందిస్తూ రాసిన కవితలు ‘అంతా అయిపోయింది పాపా’, ‘చిన్నారీ’.
‘‘మేము నిర్లజ్జగా ఒప్పుకుంటున్నం / ముసుగేసుకున్న శవాలమని / పట్టించుకోనితనం అనే పాపిష్టి రోగం సోకిన రోగులమని’’ అంటూ ఎవరికి ఏమైనా తమకేమీ పట్టనట్టు ఉండే నేటి సమాజపు స్పందనా రాహిత్యాన్ని పదునైన మాటలలో వ్యక్తీకరిస్తారు.
‘నల్లకలువల కొలను’ ఈ సంపుటిలో ఈ కవిత ఒక విశిష్టమైన కవిత!
‘‘ఏడు గుర్రాల స్వారీ చెయ్యగల నల్ల సూర్యుళ్ళు మా తల్లులు / వెన్నునంటిన దొక్కలతో / వంగి నాట్లు వేస్తున్న దైన్యాలు’’ అంటూ మొదలవుతుంది ఈ కవిత! సాధారణంగా పురుషులనే సూర్యుడితో పోలుస్తారు. ఇక్కడ తల్లులని నల్ల సూర్యుళ్ళతో పోల్చటం కవి భిన్న దృక్పథానికి ప్రతీక.
‘‘ఊచకోతలకు రాలిన రక్తపుష్పాలు / తిరుగుబాట్లను దున్నిన రక్తక్షేత్రాలు / ఆధిపత్యాలను అడ్డుకున్న సవాళ్ళు / పోటెత్తిన బహుజన సాగరాలు / అగ్ని కొలనుల్లోని నల్లకలువలు’’ అంటారు. అంటే బహుజన అస్తిత్వం, బహుజన పోరాటంపై ఒక స్పష్టమైన వైఖరితో, శక్తివంతమైన రాజకీయ చైతన్యంతో రాసిన కవితగా దీనిని చెప్పొచ్చు.
‘‘పాలనాధికారమే చివరి తాళం చెవి / అది గుర్తిస్తేనే దక్కేది రాజ్యాధికారపు నిధి’’ అంటూ బహుజనుల రాజ్యాధికార కాంక్షకి మద్దతు ప్రకటిస్తారు. ఇక్కడ నల్ల కలువలు అంటే స్త్రీలు అనే కాకుండా, బహుజన సమూహం మొత్తాన్ని సంభోదిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆర్యుల ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు ప్రకటిస్తూ, ‘‘దగాపడ్డ జనగీతం చైతన్యమై పడగెత్తుతుంది / ఇక తిరుగు వలస పట్టండిరా’’ అని హెచ్చరికతో ముగుస్తుంది ఈ కవిత. ‘పండగొచ్చిందని’ కవిత మరియు ‘పంటకారుల ఉగాది’ కూడా బహుజన అస్తిత్వంతో రాసిన కవితలే. ‘ఏ దేవుడు రాసిండు’ కవిత పెట్టుబడిదారీ వ్యవస్థలో నలిగిపోతున్న బడుగు బతుకుల గురించి తీవ్రమైన ఆగ్రహ స్వరంతో ‘‘ఈ పతనానికి కారణమెవ్వరు / ఈ నాశనానికి మూలం ఎక్కడ? వ్యాపార మృగాలు ఏలుతున్న ఈ కబేళా వ్యవస్థలో మతి తప్పనోళ్ళు ఉంటారా’’ అని ప్రశ్నిస్తారు.
రాయబడని కావ్యం కూడా అణచబడ్డ అస్తిత్వ ఆక్రోశమే!
‘‘రాస్తూ రాస్తూ ఉండగానే నా కావ్యం అపహరణకు గురయ్యింది / అలుక్కుపోయిన అక్షరాలు కనిపించకుండా ఎలబారిపోయాయి / సిరాలేని ఖాళీ కలంలో డొల్లడొల్లగా భావగీతం కాగితపు పడవలా తేలిపోతూ రాస్తుండగానే మునిగిపోయిన నా కావ్యం!’’ అంటారు. ‘‘పుట్టక ముందే నా కవితను కానరాకుండా కబళిస్తుంటే / రక్తపుటేరై పారుతూ నేను / రక్తపుష్పమై తేలుతూ కావ్యం అని రాయబడని కావ్యం’’ గురించి ఆర్ద్రంగా రాస్తారు.
కవులు, భావుకులు నిత్యం అంతర్ముఖులై ఆత్మ పరిశీలన, ఆత్మాన్వేషణ చేస్తూ ఉంటారు. దానికి మౌనమే మొదటి మెట్టు! అలాంటి కవితే ‘మౌనంలోకి ప్రవహిస్తూ…’
‘మౌనంతో ప్రేమలో పడినప్పుడల్లా నేనో నిశ్శబ్ద ప్రవాహంలా మారిపోతుంటాను / బ్రతుకు రుచిని తెలుసుకునేందుకు / మౌనంగా మృత్యువును పరామర్శిస్తుండాలి / అప్పుడప్పుడూ మౌనం వైద్యంలా మనలోకి ఆర్ద్రంగా ప్రవహిస్తుండాలి’’.
‘ఎచటకి పోతానీ కాలం’ కవిత ఒక వేదనాభరిత స్వరం! ‘‘కాలనియమాలు లేని కర్కశత్వాలకి దేహగాయాల సలపరింతలు… మనిషితనం తోడుండే మందేది’’ అని ప్రశ్నిస్తారు. ‘‘జీవితం కోల్పోయిన తనం / నా ఉసురుల పొగమంచు సెగల్లో / ఊపిరాడక కొల్లగొట్టుకుపోతూ / గాలానికి చిక్కిన చేపను / ఎచటికి పోతానీ కాలం’’ అని దీనంగా అడుగుతారు. ‘నదిలా సాగాల్సిన జీవితం’ కవితలో కూడా ‘‘ఊపిరాడక బండబారిన చెరసాలలో / ఉరికొయ్యకు వేళ్ళాడే స్వప్న శిలను / శిల్పంగా నన్ను చెక్కుకోలేని ఉలిని’’ అంటారు నిస్పృహ నిండిన స్వరంతో…
మన పయనంలో వరుసగా పరాజయాలు ఎదురవుతున్నప్పుడు, మనం నమ్మిన విలువల పట్ల, మనం ఎంచుకున్న బాట పట్ల సంశయం కలగటం సహజం! అలాంటి ఒక సందర్భమే ‘‘కలమా… కత్తా… ఏది మనం పట్టాల్సింది అనే సందేహం!
‘‘అనుకోని ఆయుధం ఒకటి / కలం గుండెల్లో కెలికి గాయం చేసి మీసాలు మెలేస్తుంది / మెదళ్ళలో కదలికలు తెచ్చే కలం / మెడలను తెగ్గోస్తే కత్తి. శక్తివంతమైనదేదో?… విలువల పువ్వులన్నీ / కొమ్మల నుండి దూకి ఆత్మహత్యలు చేసుకుంటాయి / చీకటితో ఓడిన చిరుదీపాలు లొంగిపోయి ఆరిపోతాయి… మరణ శాసనాలు ఉక్కుపాదాల కింద / సగం జీవంతో, సగం శవంలా మానవ హక్కులు! / కలమా, కత్తా, ఏది మనం పట్టాల్సింది?!’’
‘‘ఆశ్ నిరాశ్ కే దో రంగోఁసే దునియా తూనే బనాయి… నయ్యా సంగ్ తూఫాన్ బనాయా మిలన్ కె సాత్ జుదాయి’’ అన్న ఒక ప్రముఖ కవి షకీల్ బధాయునీ హిందీ సినీ గీతంలో పంక్తులు గుర్తుకు వచ్చాయి ఈ సంపుటిలోని కవితలు చదివాక. ఈ కవితల్లో కూడా, నిరాశతో, నిర్వేదంతో కూడిన క్షణాలు, మనసుతో, శరీరంతో, పరిస్థితులతో అంతర్యుద్ధం చేసి మళ్ళీ ఆశని, శక్తిని, పోరాట పటిమని కూడగట్టుకుని సానుకూల దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో చురుకుగా అడుగులు వేసే సందర్భాన్ని చూస్తాం.
ఆశ, నిరాశల యుద్ధంలో, ఈ అంతర్మధనంలో గెలిచిందెవరో అని సహజంగానే మనకు సందేహం కలగవచ్చు. దానికి సమాధానం ఈ సంపుటిలోని రెండు కవితలు… మొదటిది ‘‘ఏదో ఒక రోజు’’ అన్న కవిత!
‘‘గుప్పెడంత గుండె నుండి శిశిరాన్ని తరిమేస్తాను / తవుటం బెట్టిన తోటలా నిరీక్షిస్తూ ఉగాది అడుగుల చప్పుడు కలను కంటాను / శుభసూచకం, జయహో అంటూ మేల్కొని ఏదో ఒక రోజు అన్న ఆలాపనతో ఆనంద గీతమౌతాను’’ అని గొప్ప ఆశావహ దృక్పథంతో నిరాశని తరిమికొడతారు. ఇక ఈ కవితా సంపుటి వెనుక కవర్ పేజీ మీద ఉన్న ‘అంతర్గానం’ కవితా పంక్తులలో మనకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ‘‘నేనిప్పుడు నా మనో దేహాల బూజుల్ని దులపరించుకుని మనిషిని కావాలి / కవినై, గాయకినై, శిల్పినై కొత్తగా నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి!
ఆ స్వప్నాలు స్వప్న శిలలై మాసిపోకుండా / వసంత కాల మేఘ గర్జనలతో కలిసి / కాకలీ కాంతి స్వనాల వానగా కురుస్తూ / కోకిలల కోసం చిగురుటుయ్యాలలు కట్టాలి’’ అంటూ సమాజంపై గొప్ప ప్రేమతో, కొత్త ఉత్సాహంతో, భవిష్యత్తు పట్ల ఆశాభావంతో ‘రేపు’ని ఆహ్వానిస్తారు. పడకుండా ఉండడం గొప్ప కాదు, పడ్డాక అలాగే ఉండిపోకుండా ప్రయత్నంతో తిరిగి లేచి పరుగు తియ్యటమే గొప్ప అని పెద్దలు అంటారు. ఆ పోరాట స్ఫూర్తికి, ఆశావహ దృక్పథానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంపుటిలోని చాలా కవితలు!
ఇదీ కాలం కేన్వాస్‌పై కవయిత్రిగా అనిశెట్టి రజిత అంతరంగ ఆవిష్కరణ!