అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

మా తల్లిదండ్రులు మృదు స్వభావులు. వాళ్లెన్నడూ మాపై చెయ్యెత్తింది లేదు, పల్లెత్తు మాటన్నది లేదు. ఇతరుల పట్ల.. ఇరుగుపొరుగు కావొచ్చు, ఇతర కులాలకు చెందిన పనివారు కావొచ్చు.. ఎవరి పట్లా వాళ్లు తెలిసి నిర్దయగా ప్రవర్తించింది లేదు. అయితే బ్రాహ్మణులుగా తాము ఇతరులందరికంటే అధికులమన్న భావన మాత్రం వారిలో ఉండేది.

మా ఇంట్లో మడీ మైల నియమాలన్నీ చాలా కఠినంగా పాటించే వాళ్లు. బయట తిననిచ్చే వాళ్లు కాదు. తినే పదార్ధాలు వేటినీ ఎడమ చేత్తో ముట్టకూడదు` వడ్డించేప్పుడు కూడా. ఇక వండిన గిన్నెలు, పదార్థాల్లాంటివి ముట్టుకుంటే.. వెంటనే ఆ చేత్తో నెయ్యి, పెరుగు వంటి కొన్ని పదార్థాలను తాకటం నిషిద్ధం. చాలాకాలం మా ఇంట్లో ఉల్లిపాయలనేవే వుండేవి కావు. ఇక వెల్లుల్లినైతే నేను కాలేజీలో అడుగుపెట్టేంత వరకూ చూడను కూడా లేదు. పనిమనుషుల్ని ఇంట్లో అడుగుపెట్టనిచ్చేవాళ్లు కాదు. గిన్నెలు కడగటం, బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ వాళ్లు ఇంటి బయట వున్న నల్లా దగ్గరే చేయాలి. ఇక ఇంటి లోపలి పనులన్నీ అమ్మా, మేమే చేసుకునేవాళ్లం. అయితే నాన్నకు తరచూ బదిలీలు అవుతూ చాలాకాలం తమిళనాడుకు వెలుపలే గడిపాం కాబట్టి ఈ కఠినమైన నియమాల్లో మేం కొన్నింటినైనా తప్పించుకోగలిగామనే చెప్పాలి. ఎక్కడకు వెళ్లినా మేం బ్రాహ్మలు మాత్రమే ఉండే అగ్రహారాల్లో కాకుండా అందరి మధ్యా, ‘సెక్యులర్‌’ ఇళ్లలోనే ఉండేవాళ్లం కాబట్టి ఇరుగు పొరుగున ఇతర కులాలవారూ వుండేవారు. బాగా చిన్నతనం అంటే నాకు బొంబాయే గుర్తుకొస్తుంది. అక్కడ మేం ఫ్లోరా ఫౌంటెన్‌ ఎదురుగా, పెద్ద ‘పి అండ్‌ టి’ బిల్డింగ్‌లో వుండేవాళ్లం. (అదిప్పుడు లేదు, కూల్చేశారు). మా ఇల్లు నాలుగో అంతస్తులో వుంటే, నాన్న ఆఫీసు రెండో అంతస్తులో వుండేది. చెక్క మెట్లు. వాటి మీద పైకీ, కిందకీ పరుగుపెడుతుంటే వచ్చే చప్పుడు మాకు చాలా ఇష్టం. నా స్కూలు జీవితం అక్కడి జీసెస్‌ అండ్‌ మేరీ కాన్వెంట్‌తో మొదలైంది. అక్కడి నుంచి మద్రాస్‌కు తిరిగొచ్చాక మమ్మల్నందర్నీ శాంథోమ్‌లోని రోజరీ మెట్రిక్యులేషన్‌ స్కూల్లో చేర్పించారు. అప్పటికి నేను నాలుగో తరగతికి వచ్చాను. అక్కడ నాకు జెస్సీ డిసౌజా, మేరీ యాన్‌, షాలినీ కురుప్‌, హష్మి, షీలా రాణి మంచి స్నేహితులయ్యారు. అలా నాకు తొమ్మిదేళ్లప్పటి నుంచి పదిహేనేళ్లు వచ్చే వరకూ కూడా మేం మద్రాసులోనే వున్నాం.
పదేళ్లున్నప్పుడు అనుకుంటా.. నాకు మొదటిసారి బ్రాహ్మణ స్త్రీలు ఎదుర్కొంటుండే వివక్ష, దాని పట్ల వాళ్ల మనసుల్లో పేరుకుపోయిన తీవ్రమైన నిరసనల గురించి తెలిసింది. అమ్మ మాకు తరచుగా` తిరువనంతపురంలో వాళ్ల అన్నయ్య తనని బడికి వెళ్లనీయకుండా ఎలా అడ్డుపడ్డాడో చెబుతుండేది. ఆయన తనకున్న ఒకే ఒక్క మంచి బట్టల జతని చించేసి స్కూలుకు పోనివ్వకుండా చేశాడని చాలా యాష్టపడేది. బహుశా తను ఆ విషయాన్ని తరచూ చెప్పటం వెనక ఆంతర్యం` ఆనాడు తనకు నిరాకరించిన అవకాశం ఇప్పుడు మాకు దక్కుతోందనీ, మా కాళ్ల మీద మేం బలంగా నిలబడాలని ప్రత్యేకంగా గుర్తు చేయటమే కావొచ్చు. స్త్రీగా బతకటమంటే కష్టాల కొలిమిలో ఉండటమేననీ, ఆ కష్టాలను కొంతైనా తప్పించుకోవాలంటే చదువు ఒక్కటే మార్గం అని మా మనసుల్లో బాగా నాటుకుపోయేలా చేసిందామె. తను చెబుతున్న విషయాలు చిన్నపిల్లగా నా మనసు మీద ఎంతటి బలమైన ముద్ర వేస్తున్నాయో ఆమెకు తెలీదు. ఆమె కథను నేను మళ్లీమళ్లీ చెప్పించుకుని ఆసక్తిగా వినేదాన్ని. చిన్నపిల్లగా అమ్మ పడిన ఆ కష్టాలు నన్ను చాలా కలచివేసేవి, నేనెప్పుడూ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకూడదని గట్టిగా అనుకునేదాన్ని. ఒక విధంగా అమ్మే నాకు తెలిసిన మొట్టమొదటి ఫెమినిస్టు!
అయితే మమ్మల్ని పెంచిన తీరు చాలా విషయాల్లో పరస్పర విరుద్ధంగా వుండేది. ఒకవైపు ఇంట్లో తిండి, మడీ, మైల, బట్టలు, ప్రవర్తన, సంస్కృతి వంటి విషయాల్లో కఠినమైన సాంప్రదాయిక కట్టుబాట్లు పాటించేవారు. మరోవైపు మమ్మల్ని ఇంగ్లీష్‌ స్కూళ్లకు పంపించేవారు, చిత్రంగా పాశ్చాత్య తరహా ఆసక్తులు, అభిరుచులవైపు బలంగా ప్రోత్సహిస్తుండేవాళ్లు కూడా. ఇంగ్లిష్‌ సినిమాలు చూడమని, ఇంగ్లిష్‌ పుస్తకాలు చదవమని, ఇంగ్లిష్‌ పాటలు వినమని చెప్పేవాళ్లు. బహుశా, అవి మా చదువులకూ, ఉద్యోగ భవిష్యత్తుకూ తోడ్పడతాయన్నది వారి ఉద్దేశం కావచ్చు. అలాగే మా క్రైస్తవ స్నేహితురాళ్లని ఇంట్లోకి రానిచ్చే వాళ్లు. మేం వాళ్ల ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించేవారు. మా అక్కచెల్లెళ్లు ఐదుగురికీ కర్ణాటక సంగీతం నేర్పించారు. రోజూ ఉదయం ఐదు గంటలకు మేం ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం వింటూనే నిద్ర లేచేవాళ్లం. ప్రతి సంవత్సరం మద్రాసులో డిసెంబరు`జనవరి నెలల్లో ఉత్సాహభరితంగా జరిగే మార్గళి (మార్గశిర) సంగీత కచేరీలకు మా అందరినీ తీసుకెళ్లేవారు.
నేను నాలుగేళ్ల వయసు నుంచే కథల పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. చదవడానికి ఇంట్లో ఏమీ దొరకనప్పుడు చివరికి టెలిఫోన్‌ డైరెక్టరీ, అట్లాస్‌, రైల్వే టైంటేబుల్‌ వంటి వాటిని కూడా వదిలిపెట్టే దాన్ని కాదు. పైగా వాటిని గంటల తరబడి ఇష్టంగా తిరగేసేదాన్ని. అవి నా చుట్టూ వున్న వాస్తవ పరిస్థితులకు దూరంగా ఎక్కడో ఊహాలోకంలోకి తీసుకెళ్లేవి. వాటిలో కనిపించే చిత్ర విచిత్రమైన కొత్తకొత్త పేర్లు, ఎక్కడో సుదూర ప్రాంతాలు, నదులూ, పర్వత సానువుల చుట్టూ కథలుకథలుగా నా ఊహా విహారం ఆరంభమయ్యేది. ఇంట్లో కూర్చునే అద్భుతమైన రైలు ప్రయాణాల్లో దేశమంతా చుట్టిరావటం పూర్తయిపోయేది. నేనొక నిరంతర పాఠకురాలిని. చేతిలో పుస్తకం లేకపోతే మనసును ఆందోళన ముప్పిరిగొనేది. ఈనిడ్‌ బ్లైటన్‌ మొదలుకుని రిచ్మల్‌ క్రాంప్టన్‌ రాసిన విలియం బుక్స్‌ సిరీస్‌ మొత్తం, ఆ తర్వాత ఎ.ఎ.మిల్నే, సి.ఎస్‌.లూయీస్‌ల రమణీయమైన పుస్తకాలన్నీ చదివేశాను. టాల్‌స్టాయ్‌, డాఫ్నె డు మారియర్‌, చార్ల్స్‌ డికెన్స్‌, జేన్‌ ఆస్టిన్‌, సోమర్‌సెట్‌ మామ్‌, థామస్‌ హార్డీ వంటి వారిని చదువుకుంటూ టీనేజీలోకి అడుగుపెట్టాను. వీరిలో చాలామంది రచనలు తర్వాత మా పాఠ్యపుస్తకాల్లోనూ తారసపడేవి. చదవటమన్నది నా ప్రపంచాన్ని విస్తరించింది. ముఖ్యంగా కొత్త అవకాశాలు, వినూత్న ఆలోచనల గురించి మా కుటుంబం నాకు అందించలేకపోయిన అవగాహనను ఈ పుస్తకాలే సమకూర్చి పెట్టాయి. మరికాస్త పరిశీలనాత్మకమైన రచనలను.. అంటే హెమింగ్వే, స్టైన్‌ బెక్‌, అలాగే నాన్‌ఫిక్షన్‌లో ఇ.హెచ్‌.కార్‌, గార్డన్‌ చైల్డ్‌ వంటి వారి పుస్తకాలను చదవటమన్నది కాలేజీలో చేరిన తర్వాతగానీ మొదలవలేదు. ప్రతి దానికీ విశ్లేషణాత్మక వివరణలుండే ఒక హేతుబద్ధమైన,
ఉదార ప్రపంచాన్ని నాకు పుస్తకాలే పరిచయం చేశాయి.
యుక్తవయసు తొలినాళ్లలో సరికొత్త పద్ధతిలో ఆలోచించడం నేర్పింది సైన్స్‌! సంప్రదాయాలనీ, మూఢనమ్మకాలనీ ప్రశ్నించడం మొదలుపెట్టిన ఆ సమయంలో నాకు జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రాలు గొప్ప సాంత్వననీ, కొత్త సమర్థనలనీ యిచ్చాయి. ఓ నిశ్శబ్ద తిరుగుబాటుకు, ఆ సమయంలో నేను కాస్త గట్టిగా నిలదొక్కుకునేందుకు సైన్స్‌ ఓ బలమైన పునాదినిచ్చింది. ఆ రోజుల్లో స్కూల్లో మా మీద బలమైన ప్రభావం చూపిన సైన్స్‌ టీచర్లు ఎవరూ ఉన్నట్లు గుర్తు లేదుగానీ పాఠ్యపుస్తకాలే ఎంతో విప్లవాత్మకంగా వుండేవి. జీవశాస్త్ర పాఠాల్లో` మన శరీర నిర్మాణంతో పాటు రుతుక్రమం లేదా బహిష్టు అంటే ఏమిటో స్పష్టమైన వివరణలున్నాయి. బహిష్టు అనేది బిడ్డ పుట్టుకతో ముడిపడిన ప్రకృతి సహజమైన జీవ ప్రక్రియ అని నేను పాఠ్యపుస్తకాల ద్వారానే తెలుసుకున్నాను. ఆహార పదార్థాలు కుళ్లి పాడైపోతున్నాయంటే అది వాటిలో ఉండే సూక్ష్మక్రిముల వల్లనే తప్ప బహిష్టయిన స్త్రీ ముట్టుకున్నందువల్ల కాదని అర్థం చేసుకున్నాను. గర్భధారణ, బిడ్డ పుట్టుక అనేవి స్త్రీ పురుషుల లైంగిక కలయిక వల్ల జరుగుతాయిగానీ.. ఒక స్త్రీ మరో పురుషుడితో మాట్లాడినంత మాత్రాన కాదని తెలుసుకున్నాను. అలాగే భూ పరిభ్రమణం, సూర్యుడి ప్రకాశం, వరదలు ముంచెత్తటం వంటివి ప్రకృతి సహజ పరిణామాల వల్ల సంభవిస్తున్నాయే తప్ప ఏవో రాతి విగ్రహాల మహత్యం వల్ల కాదని గ్రహించాను. ప్రకృతికి సంబంధించిన ఈ విజ్ఞానమంతా కూడా నా సామాజిక జీవనంతో సంబంధం ఉన్నదేనన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించాను. ఇక భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలు` మహిమలూ, మాయల మంత్రాల భావనలను పక్కకునెట్టి అసలు ఈ భౌతిక ప్రపంచం ఏ సూత్రాలపై ఆధారపడి నడుస్తోందో వివరించాయి. చరిత్ర పుస్తకాలు ఐరోపాలో విజ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధి పలా జరిగిందో, అందుకు జరిగిన పెను యుద్ధాలేమిటో కళ్లకు కట్టాయి. అంటే ప్రజలు గతంలో కూడా ఇలాంటి యుద్ధాలు చేశారు, గెలిచారన్న మాట! మానసికంగా నాకు పెద్ద సాంత్వననిచ్చిన అంశం అది.
చాలా విషయాలను తర్కబద్ధంగా వివరించవచ్చనీ, ఏవో అభూతమైన వాటి గురించి భయపడాల్సిన పని లేదని తెలుసుకోవటం నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. నా శరీరంలో రకరకాల మార్పులు చోటుచేసుకుంటూ, సరిగ్గా నేను ఇంట్లో ‘మడీ`మైల’ పేరుతో రకరకాల బ్రాహ్మణీయ విధి నిషేధాలను ఎదుర్కోవాల్సి వస్తున్న సమయంలోనే.. స్కూల్లో సైన్స్‌తో పరిచయం పెరగటం ఆరంభమైంది. నాలో పొంగుకొస్తున్న హేతుబద్ధ, ఉద్వేగభరిత భావనలన్నీ కలగలిసిపోయి.. ఇంట్లో పాటించే మూఢనమ్మకాలపై బలంగా విరుచుకుపడటం, కొద్దికొద్దిగా తిరగబడటం మొదలైంది. నాకు బహిష్టు అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే నేను రజస్వల అయ్యాను. మా కుటుంబం బహిష్టు నిషేధాలన్నింటినీ తూచా తప్పకుండా పాటించేది. మా అక్కయ్యలు బహిష్టు అయినప్పుడు దూరంగా కూర్చునేవాళ్లు. ఇంట్లో ఏవీ ముట్టుకోకూడదు. వేరే గదుల్లోకి వెళ్లకూడదు. అన్నం కూడా దూరంగా ఓ మూలగా పెట్టేవారు. వాళ్లు అందరికీ దూరంగా పడుకునేవారు. మూడో రోజు తర్వాత వాళ్లకు స్నానం చేయించటం, వాళ్లు ముట్టుకున్న ప్రతి వస్తువునూ శుద్ధి చెయ్యటం.. అదంతా పెద్ద ప్రహసనం! ఇతరత్రా పనికిమాలిన ఆచారాల్లా ఇది కూడా అర్థంపర్థం లేనిదేనని నేను కొట్టిపారేస్తుండే దాన్ని. నాకు పదమూడేళ్ల వయసున్నప్పుడు ఓ రోజు స్కూల్లో.. నా యూనిఫాం వెనకాల రక్తం మరక వుందంటూ స్నేహితురాళ్లు ముసిముసిగా నవ్వటం మొదలుపెట్టారు. ‘నేను ఎక్కడ కూర్చున్నానబ్బా.. మరక అంటుకోవటానికి.. ’ అనుకుంటూ అదేమీ పట్టనట్టే నేను హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటూ వుండిపోయాను. ఇంతలో ఎవరో వెళ్లి మా పెద్దక్కకి ఈ విషయం చెప్పారు. ఆమె పరుగుత్తుకుంటూ వచ్చి, గుసగుసలాడుతున్నట్టు గొంతు బాగా తగ్గించి ‘పదా.. ఇంటికి వెళ్దాం!’ అంది. చూస్తుంటే అక్క బాగా కలవరపడిపోతున్నట్లుంది. నేనేమో తాపీగా ‘ఎందుకేమిటి?’ అనడిగాను. వణికిపోతున్న గొంతుతో ‘వెంటనే వెళ్లాలి, పద’ అంది నా చెవిలో. ఇక మేం ఇల్లు చేరగానే ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ‘ఇది యూనిఫాం మీద రక్తం మరకతో అందరి ముందూ తిరిగింది. స్కూల్లో అందరికీ తెలిసిపోయింది’ అంటూ బోరుమంది. ‘అయితే ఏంటే! మీది ఆడపిల్లల స్కూలే కదా. అందరికీ పీరియడ్స్‌ వస్తూనే వుంటాయి కదా!’ అంది అమ్మ. ‘కానీ వీటి గురించి ఎవరికీ తెలియకూడదు. ఎవ్వరూ ఇలా చెయ్యరు. నేనింక స్కూల్‌కి వెళ్లలేను..’ అంటూ అక్క అవమానభారంతో కుంగిపోతున్న దానిలా వెక్కిళ్లు పెట్టి మరీ ఏడ్వటం మొదలుపెట్టింది. బహిష్టులు నాకేం పెద్ద చికాకు కలిగించలేదుకానీ.. కొత్తగా మొదలైన ఈ ఆంక్షలు మాత్రం చిర్రెత్తించాయి. నేను నెలసరి పీరియెడ్స్‌ గురించి చదివాను, అవెందుకు వస్తాయో శాస్త్రీయంగా అర్థం చేసుకున్నాను. దీని గురించి మా క్లాసులో మిగతా పిల్లల దగ్గర ప్రస్తావించినప్పుడు బ్రాహ్మణేతర ఇళ్లల్లో దీన్నో పండగలా చేస్తారని తెలిసింది! తమ బిడ్డ పెద్దదయ్యిందని వాళ్ల తల్లిదండ్రులు సంతోషంగా, గర్వపడతారట. ఇక్కడేమో మా అక్కయ్య ‘అందరికీ తెలిసిపోయిందని’ తెగ బాధపడిపోతోంది. ఇక అమ్మకేమో.. పెళ్లి చేసి పంపాల్సిన పిల్లల జాబితాలో మరో కూతురూ చేరిందని కొత్త దిగులు మొదలైంది.
మా ఇంట్లో మొత్తం ఆరుగురం ఆడవాళ్లం. నెలసరి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరూ మూడేసి రోజుల చొప్పున దూరంగా కూర్చోవాలి. అయితే మమ్మల్ని విడిగా వుంచేందుకు` తిరువనంతపురంలో, హరిపాడ్‌లో మా పూర్వీకుల ఇళ్లల్లో వున్నట్టు బొంబాయిలో గానీ, మద్రాస్‌లో గానీ ప్రత్యేక గదులూ, ఔట్‌హౌస్‌ల్లాంటివేం ఉండేవి కాదు. అయినా నెలసరి రోజుల్లో మేం ఇంట్లో ఒక్కటంటే ఒక్క వస్తువును కూడా ముట్టుకోకుండా మూలనే ఉండిపోయేవాళ్లం. పొరపాట్న ఏ పచ్చడినో, కూరనో తాకామంటే అది మైలపడిపోయిందని, దాన్ని పారెయ్యాల్సిందేనని భావించేవాళ్లు. బహిష్టు రోజుల్లో మేం పూజగదిలో కాలు పెడితే కళ్లు పోతాయని చెప్పేవాళ్లు. కానీ నేను మాత్రం తెలిసీతెలియని ఆ నవయవ్వనోత్సాహంలో వద్దన్న పనులన్నీ చేసేదాన్ని. కావాలని పచ్చళ్లనూ, కూరలనూ ముట్టుకుని.. భోజనంచేసే సమయానికి అవేమైనా పాడైపోయాయా అని చూసేదాన్ని. పూజ గదిలోకి వెళ్లి దేవుళ్ల విగ్రహాలను తాకి.. నా కళ్లకేమైనా అవుతోందా, గుడ్డిదాన్నైపోతున్నానా అని కొద్ది రోజుల పాటు పరీక్షించుకునేదాన్ని. కానీ ఎప్పుడూ అలాంటివేం జరగలేదు.
మూడు రోజులు పూర్తవగానే మా బట్టలు, దుప్పట్ల వంటివన్నీ తడిపి ఉతికేసేవారు. మేం తలస్నానం చేసేవాళ్లం. దాంతో సంప్రదాయబద్ధంగా మా మైల ముగిసిపోయేది. కానీ ఒక్కోసారి మాకు ఐదు రోజులపాటు రుతుస్రావం అవుతూనే వుండేది. నిజానికి అదే నేనీ చాదస్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించేలా చేసింది. ‘అమ్మా నా కింకా రక్తస్రావం అవుతూనేవుంది. మరి మైల తొలగిపోయి, నేను పరిశుద్ధం ఎలా అవుతాను?’ అని అడిగేదాన్ని. వెంటనే అమ్మ ‘ష్‌ ష్‌.. మాట్లాడకు. ఆచార ప్రకారం మూడు రోజులూ అయిపోయాయి’ అనేది. ‘దీనర్థం మన ఆచారాల్లో నిజం లేదనే కదా అమ్మా’ అంటే ‘ఇది మన సంప్రదాయం, అంతే’ అని నోరు మూయించేది. నాకు ఆ సమాధానం ఏ కోశానా సంతృప్తినిచ్చేది కాదు. బ్రాహ్మణీయ ఆచారాలు, సంప్రదాయాలతో నా గొడవ ఇక్కడి నుంచే మొదలైంది. బహిష్టు సమయంలో ముట్టుకున్నప్పటికీ ‘దేవుడు నన్ను గుడ్డిదాన్ని చేయలేదంటే కచ్చితంగా దేవుడు లేనట్టే కదా…’ అనే దాన్ని. ప్రతి ఒక్క దాన్నీ ప్రశ్నించటం నేర్చుకున్నాను. తరచూ నేనిలాంటి ప్రశ్నలు వేస్తుంటే అమ్మ విసుక్కునేది, ‘నాకు తెలియదు. పెద్దవాళ్లు ఎందుకు చెప్పారో, ఏంటో.. పాటిస్తున్నాం..’ అనేది. దీనికి నేను ‘మరి నా పుస్తకాల్లో అలా రాసి ఉందేంటి’ అని ఎదురు ప్రశ్నించే దాన్ని.
మేం కింద కూచుని భోజనాలు చేసేవాళ్లం. చాలా బ్రాహ్మణ ఇళ్లల్లో పళ్లెం చుట్టూ అవీఇవీ పోసినా చికాకుపడరు. చీకేసిన ములగకాయ ముక్కలు, కరివేపాకులు, మామిడి తొక్కలు, మిరపకాయల్లాంటివన్నీ పళ్లెం లేదా విస్తరాకు చుట్టూ పడేస్తుంటారు. వాటిని మా ఇంట్లో చేతులతో ఎత్తి, తర్వాత ఆ ప్రదేశమంతా బట్టతో తుడిచేవారు. అది చూస్తేనే నాకు చికాకుగా ఉండేది` ఆ ఎంగిలి చెత్తను చీపురుతో ఊడవొచ్చుగా? అందుకే నా వంతు వచ్చినప్పుడల్లా నేను చీపురు తీసుకుని ఊడ్వబోతుంటే.. చప్పున మా అక్కయ్యలు వచ్చి నా చేతుల్లోంచి చీపురు లాగేసుకుని ఆ పని వాళ్లు చేసేవారు. నాలా వాళ్లెప్పుడూ ఎదురు ప్రశ్నలు వేసే వాళ్లు కాదు.
నాన్నతో పెద్దగా వాదించేదాన్ని కాదుగానీ… అమ్మను మాత్రం చాలా విషయాల్లో నా ప్రశ్నల పరంపరతో వేధించుకు తినేదాన్ని. నాన్న మరీ అంత కఠినంగా ఉండేవారేం కాదు, కాకపోతే ఆయనా పితృస్వామ్య వ్యవస్థలో భాగంగానే ప్రవర్తించేవారు. ఇంట్లో ఆయన చెప్పిందే వేదం, ఆయన అన్నదే ఫైనల్‌. నేను ఏదన్నా వాదిస్తుంటే అమ్మ.. పురాణ ఉదాహరణలో, ఇతర కుటుంబాల్లో జరిగిన భయంకర సంఘటనల గురించో చెప్పి నన్ను ఏదో రకంగా ఒప్పించటానికి తంటాలు పడుతుండేది. కానీ నాన్న మాత్రం చిన్నగా నవ్వుతూనే` శాసనం చేసేసేవాళ్లు. నేను ప్రతి విషయం మీదా వాదిస్తుంటే అమ్మ రోజులో చాలాసార్లు తల కొట్టుకుని.. దీన్నెవరో మార్చేశారంటూ మథన పడేది. ‘‘నువ్వసలు ఎవరి పిల్లవే?’’ అంటూండేది. ఇంట్లో మిగతా వాళ్లతో పోలిస్తే నేనేమో కొంచెం నల్లగా ఉండేదాన్ని. ఈ నల్ల పిల్లని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారే అని అమ్మ పైకే అంటూండేది. ఈ నస వినీవినీ నాలో నేను అసలు పెళ్లే చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేశాను. ఏదో రకంగా సర్దుకుపోవటం కంటే పెద్దయిన తర్వాత నా బతుకు నేను, వీలైతే ఇంతకంటే మెరుగ్గానే బతకాలనీÑ సంప్రదాయికంగా అందంగా ఎర్రగా బుర్రగా కనబడేవాళ్లకు దూరంగా ఉండాలని నిర్ణయానికొచ్చాను.
అమ్మతో తరచూ విభేదించిన అంశాల్లో లోదుస్తుల గొడవ ఒకటి. మేమందరం చేత్తో కుట్టిన బాడీలు, అండర్‌ పాంట్స్‌, వెస్ట్‌ వంటి లోదుస్తులనే ధరించేవాళ్లం. వీటిని ఇంట్లో మేమే కుట్టుకునేవాళ్లం. ఈ రకం బాడీలను.. ఆధునిక జాకెట్ల ఫ్యాషన్‌ వచ్చేంత వరకూ కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంత స్త్రీలు ధరిస్తుండే వాళ్లు. ఒకే గుడ్డ ముక్కతో కుట్టిన వీటిని రొమ్ముల కింద గట్టిగా ముడివేసుకోవాలి. అది రొమ్ముల్ని గట్టిగా అదిమిపెట్టి, చదునుగా వుంచుతుంది, పైగా ఆ ముడి రోజంతా గుచ్చుకుంటూనే
ఉంటుంది. స్కూల్లో దాదాపు నాతోటి ఆడపిల్లలంతా బ్రాసరీలు ధరించేవారు. నాకు కూడా వాటిని వేసుకోవాలనిపించేది. ఎవరు ఏం ధరించారో చూస్తూనే తెలిసిపోతుందిగా.. లోపలి నుంచి వాటి అంచులు యూనిఫాం మీద స్పష్టంగానే కనబడుతుండేవి. బ్రాసరీలకు అమ్మ కుదరదంటే కుదరదంది. ‘రొమ్ములు పైకి బాగా కనిపించడానికి వాటిని వేశ్యలు వేసుకుంటారు, మంచి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలెవ్వరూ అలాంటివి వేసుకోరు’ అని చెప్పింది. దీంతో నా బ్రాలను నేనే కొనుక్కోవాలని, అందుకు ముందు డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాను. ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. బడికి బస్సులో కాకుండా నడిచి వెళ్లేదాన్ని. ఇతరులకు బట్టలు కూడా కుట్టేదాన్ని. అలా సొంతంగా డబ్బు కూడబెట్టి, బ్రాసరీలను కొనుక్కుని ధరించడం మొదలుపెట్టాను. ఇక నన్నెవ్వరూ ఆపలేకపోయారు. అలా నా తిరుగుబాటు విజయవంతమైందో లేదో.. ఇంట్లో అక్కయ్యలందరూ కూడా బ్రాలు వేసుకోవడం మొదలుపెట్టారు. నానా కష్టాలూ పడి, నేను తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఇంట్లో ఒక్కళ్లు కూడా నాకు మద్దతుగా నిలబడలేదు కానీ ఫలితాన్ని మాత్రం అంతా పంచుకున్నారు. తర్వాత్తర్వాత` మా అక్కల కాన్పుల కోసం 1970లలో అమెరికా వెళ్లి రావటం మొదలుపెట్టాక` అమ్మ కూడా ఆ పాతరకం బాడీలను వదిలేసి బ్రాసరీలు ధరించడం మొదలుపెట్టింది.
ఆ యుక్త వయసులో తరచూ స్కూళ్లు మారటం నా ఆలోచనలను మరింత పదునుదేల్చింది. నేను కేవలం బాలికల కోసమే క్రైస్తవ నన్స్‌ నిర్వహించే, చాలా నిశ్శబ్దంగా నడిచిపోతుండే రోజరీ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌ నుంచి.. మద్రాస్‌ రాయపేట్‌లో చాలా హడావుడిగా ఉండే ఆదర్శ్‌ కేంద్రీయ విద్యాలయకు మారాను. తరచూ తనకు బదిలీలవటం, అయినప్పుడల్లా మళ్లీ కొత్త చోటుకు వెళ్లి తన ఐదుగురు కూతుళ్లకూ కాన్వెంట్‌ స్కూళ్లలో అడ్మిషన్లు సంపాదించడం నాన్నకు చాలా కష్టంగా తయారైంది. దానికి తోడు కేంద్రీయ విద్యాలయాల్లో ఫీజులు కూడా తక్కువగా ఉండటంతో అవి సౌకర్యంగా అనిపించాయి. తరచూ రాష్ట్రాలు మారి బదిలీలు అవుతుండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక సిబ్బంది కోసం` పిల్లల చదువుల్లో అడ్మిషన్ల ఇబ్బంది రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే కేంద్రీయ విద్యాలయాలను/సెంట్రల్‌ స్కూళ్లను నెలకొల్పింది. ప్రైవేటు స్కూళ్ల ప్రపంచానికి ఈ కేవీలు చాలా దూరంగా ఉండేవి. ఈ రెంటి మధ్యా ఎక్కడా సంబంధమే ఉండేది కాదు, పైగా వాటిని ‘సర్కారీ బడుల్లా’ చిన్నచూపు చూసేవారు. పధ్నాలుగేళ్లప్పుడు నేను కేంద్రీయ విద్యాలయలో చేరాను. ఆ మార్పు నాకేమాత్రం నచ్చలేదు, ఎందుకంటే ఆ రోజుల్లో (ఇప్పుడు కూడా) కాన్వెంట్‌ స్కూళ్లలోనే ఇంగ్లీష్‌ చదువులు బాగుంటాయని నమ్మేవాళ్లు. కానీ అనూహ్యంగా.. నా జీవితం అక్కడే వికసించటం మొదలైంది!
మద్రాస్‌ కేంద్రీయ విద్యాలయంలో నేను కేవలం ఒక సంవత్సరమే చదివాను. తర్వాత, 1968లో నాన్నకి మళ్లీ బదిలీ అయ్యింది. ఈ సారి హైదరాబాద్‌కి. నన్నూ, మా చెల్లెల్నీ పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయలో చేర్పించారు. అప్పుడు మేం ఈస్ట్‌ మారేడ్‌పల్లిలో వుండేవాళ్లం. అదో రకంగా ఆధునిక అగ్రహారంలాంటిదనే చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ప్రతి రోజూ మేం స్కూల్‌కి నడచుకుంటూ వెళ్లేవాళ్లం. కిక్కిరిసినట్టుండే మద్రాస్‌తో పోలిస్తే.. ఆహ్లాదకరమైన వాతావరణంతో, పచ్చని చెట్లతో, విశాలమైన రోడ్లతో, భిన్న నేపథ్యాలకు చెందిన ప్రజలతో హైదరాబాద్‌ చాలా ఆసక్తిగా అనిపించేది. రాయపేట్‌లో కంటే పికెట్‌ కేవీలో నా అనుభవాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి.
అప్పటి వరకూ నాకు పరిచయం లేని జీవులు.. అబ్బాయిలను ఇక్కడ మొట్టమొదటిసారి కలిశాను. తమిళ ప్రాబల్యం ఎక్కువగా ఉండే కాన్వెంట్‌ స్కూళ్ల మాదిరిగా కాకుండా ఇక్కడ దేశం నలుమూలల నుంచీ వచ్చిన వాళ్లు.. అదీ రకరకాల శారీరక, మానసిక వైవిధ్యాలతో తారసపడ్డారు. పికెట్‌ కేవీ మాకు మొదటిరోజు నుంచే చాలా స్వేచ్ఛగా వుండేందుకు హామీ నిచ్చింది. అతిగా పర్యవేక్షివేస్తుండే నన్స్‌ మాదిరిగా కాకుండా ఇక్కడి ఉపాధ్యాయులు ఎంతో కలివిడిగా, అభిమానంగా వుండేవాళ్లు. చదువుల్లో కంటే క్రీడల్లో సాధించిన విజయాలకు అభినందనలు ఎక్కువగా దక్కేవి. పిల్లల్లో పలుకుబడి పెంచుకోవటానికి విలువ ఎక్కువ. పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌ కూడా అక్కడి కంటే ఇక్కడ స్వేచ్ఛగా వుండేది, మగపిల్లల కంటే అడపిల్లల్ని బాగా చూసుకునేవాళ్లు (అవును, నిజంగానే). మమ్మల్ని ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేవాళ్లు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇక్కడి సైన్స్‌ బోధన మాకు స్వేచ్ఛను ప్రసాదించింది!
ఇక్కడ చేరాక ఇంట్లో బ్రాహ్మణులుగా, స్కూల్లో క్యాథలిక్కులుగా వుండాల్సిన ఇబ్బందికర పరిస్థితి నుంచి విముక్తి లభించింది. ‘వాళ్లు బ్రాహ్మలా, కాదా?’ అన్న గుసగుసలూ, ఆరా తీయటాలూ, వాళ్ల కులం ఏమిటో తెలుసుకోటం కోసం టిఫిన్‌ బాక్సులు తెరిచి చూడటాల వంటివన్నీ ఇక్కడ లేవు. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి సైన్యంలో పనిచేస్తున్న వారి పిల్లలు ఇక్కడ ఎక్కువగా ఉండేవాళ్లు. చదువులతో పాటు.. అంతర్‌ పాఠశాలల పోటీలూ, నిరంతర సంగీత శిక్షణలూ, క్రీడలూ.. ఇలా ‘ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌’ చాలానే ఉండేవి. మొత్తమ్మీద పరిస్థితి కొంత ప్రజాస్వామికంగా ఉండేది. పదో తరగతిలో వున్నప్పుడు ఓసారి మేం సమ్మె చేసిన విషయం నాకు ఇప్పటికీ గుర్తే. మాది కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాల కావడంతో మొదట్లో అక్కడ తగినన్ని బల్లలు ఉండేవి కాదు. దీంతో పిల్లలు చాలామంది నేల మీద కూర్చోవాల్సి వచ్చేది. తరచూ ఒక క్లాసులో బెంచీలు, కుర్చీలను ఇంకో క్లాసు వాళ్లు ఎత్తుకెళ్లిపోతుండేవారు. దాంతో మేమంతా విసిగిపోయి, తరగతులను బహిష్కరించి, సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. మీటింగులు పెట్టుకున్నాం, స్కూల్లోనే చిన్న ఊరేగింపులు తీశాం. ప్రిన్సిపాల్‌కు ఒక వినతిపత్రం సమర్పించాం. చివరికి మా సమ్మె విజయవంతమైంది. వెంటనే కొంత మేరకు కొత్త ఫర్నిచర్‌ వచ్చింది.
నేను ఆ స్కూల్లో చివరి సంవత్సరం చదవుతున్నప్పుడు హెడ్‌ గర్ల్‌ అయ్యాను. ఈ విషయంలో నాకు కొద్దిగా గర్వంగా కూడా ఉండేది. ఎందుకంటే అప్పటి వరకూ స్కూల్లో హెడ్‌ బోయ్సే ఉండే
వాళ్లు. ఆ స్థానానికి ఎంపికైన మొట్టమొదటి ఆడపిల్లని నేనే. ప్రతి రోజూ ఉదయం ప్రార్థనా సమావేశమప్పుడు విద్యార్థులందరికీ నేనే ‘సావధాన్‌’ (అటెన్షన్‌), ‘విశ్రామ్‌’ (స్టాండ్‌ ఎట్‌ ఈజ్‌) అంటూ కమాండ్స్‌ ఇచ్చేదాన్ని. ఆ రోజుల్లో కేవీల్లో తరచూ రకరకాల పోటీలు, ఉత్సవాలు నిర్వహిస్తుండేవాళ్లు. వీటిలో హైదరాబాద్‌` సికింద్రాబాద్‌ పరిధిలోని ఐదు కేవీలతో పాటు ఇతర పాఠశాలలూ పాల్గొనేవి. వక్తృత్వం, క్విజ్‌ పోటీల్లో నేను మా పాఠశాలకు ప్రాతినిధ్యం వహించేదాన్ని. అలాగే మేం స్థానిక యంగ్‌ మెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించే సికింద్రాబాద్‌ హై`వై క్లబ్బుకు కూడా వెళుతుండే వాళ్లం. హైస్కూల్‌ విద్యార్థుల కోసం ఉద్దేశించిన దీన్ని చాలావరకూ పిల్లలే నడుపుతుండే వాళ్లు, వైఎంసీఏ పెద్దల కొద్దిపాటి పర్యవేక్షణ ఉండేది. ఆ క్లబ్బును మారేడ్‌పల్లిలో వుండే ఓ పెద్దాయన ప్రారంభించారు, ఆయనకు ఇద్దరు కూతుళ్లు. తన కూతుళ్లిద్దరూ స్థానిక బ్రాహ్మణ కుటుంబాల పరిధి దాటి.. బయట విశాలమైన, మరింత అర్థవంతమైన కార్యక్రమాల్లో నిమగ్నం కావాలన్న ఉద్దేశంతోనే ఆయన దాన్ని ప్రారంభించినట్లున్నారు. మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ బోర్డింగ్‌ స్కూల్లో చదువుకున్న ఆయన` సమకాలీన, ఉదార భావాలను బాగా ప్రోత్సహించేవారు. ఓ రోజు ఆయనే మా తల్లిదండ్రులను కలుసుకుని మమ్మల్ని హై`వై క్లబ్బుకు పంపించమని కోరారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ ఆస్కారం లేకుండా తాను చూసుకుంటానని భరోసా కూడా ఇచ్చారు. దీంతో మేం ఆ క్లబ్బులో చురుకుగా పాల్గొనటం తేలికైంది. అక్కడ రకరకాల అంశాలపై చర్చలు జరుగుతుండేవి. తరచూ డిబేట్లు, క్విజ్‌ల్లాంటివి నిర్వహిస్తుండే వాళ్లు. పిల్లల్ని పిక్నిక్‌లకి, గెట్‌ టుగెదర్‌లకి బయటికి తీసుకెళ్తుండేవారు. ఆడపిల్లలూ, మగపిల్లలూ కలుసుకోవడాన్ని పెద్దగా ప్రోత్సహించని ఈ నగరంలోని యువతకు ఆ క్లబ్బు ఒక పెద్ద వరమనే చెప్పాలి. నాడు అక్కడి పరిచయాలు మున్ముందు రకరకాలుగా భాగస్వాములు కావటానికి చాలామందికి దోహదపడ్డాయి కూడా. ఇలా స్కూల్లో 12వ తరగతి పాసై బయటికి వచ్చే నాటికి నేను చాలా దృఢమైన, ఆత్మవిశ్వాసంగల ఆడపిల్లగా, బయటి ప్రపంచంలో స్వతంత్రంగా వ్యవహరించగలిగే సత్తా ఉన్న యువతిగా ఎదిగాను. ముఖ్యంగా` ఏ రకంగా చూసుకున్నా నేను అబ్బాయిలతో సమానమేననీ, వాళ్లకు నేనే రకంగానూ తీసిపోననే నమ్మకం వచ్చింది. బయటకు వెళ్లి వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం వల్లనే నాలో ఈ ఆత్మవిశ్వాసం పెరిగింది.
1971లో పాఠశాల చదువు ముగించుకుని బయటికి వస్తున్నప్పుడు` ఇక నేను సాంప్రదాయిక బ్రాహ్మణ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్లటం తప్పదని, ఆ భారం మోయటం స్త్రీలకి మరీ కష్టమని అర్థమైపోయింది. దాన్నుంచి బయటపడాలంటే స్వతంత్రంగా నేనొక వృత్తిని ఎంచుకోవటమే మార్గమని నిర్ణయానికి వచ్చేశాను. సరిగ్గా ఇదే సమయంలో నాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. స్కూల్లో పెద్ద క్లాసుల్లోకి వచ్చాక నేను గణితంలో మంచి ప్రతిభ కనబరిచాను. ఐఐటీలో చేరాలని ఆశపడ్డాను. ఆ రోజుల్లో సీబీఎస్‌ఈలో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఉంటే ఐఐటీలో చేరడం సులభమే. నాకు పది లోపు ర్యాంకే వచ్చింది. కానీ ఇంట్లో నాన్న ఒప్పుకోలేదు. ఐఐటీల్లో ఫీజులు భరించలేమనీ, ఆడపిల్లను ఇంటికి దూరంగా వుంచటం తనకి ఇష్టం లేదనీ చెప్పుకొచ్చారు. మేం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు మారుతున్నప్పుడు మెడిసిన్‌ చదువుతున్న మా పెద్దక్కయ్యని అక్కడే హాస్టల్‌లో చేర్పించక తప్పలేదు. మళ్లీ ఇంకొకర్ని హాస్టల్‌లో చేర్చడం తన వల్ల కాదన్నారు. ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉందన్న విషయం నాకూ తెలుసు. మా ఇంకో అక్కయ్య డిగ్రీ పూర్తవుతూనే చదువు మానేసి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. నేను ఎన్‌టీఎస్‌ఈ ద్వారా నేషనల్‌ సైన్స్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ కూడా గెలుచుకున్నాను. దాని కింద డిగ్రీ చదువుతున్నప్పుడు నెలకి రూ.250, అలాగే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసేప్పుడు నెలకు రూ.450 చొప్పున ఆకర్షణీయమైన మొత్తం స్కాలర్‌షిప్‌గా ఇచ్చేవాళ్లు. అయితే అది సైన్స్‌లో డిగ్రీ చదివే విద్యార్థులకే వర్తిస్తుంది. ఆ డబ్బు ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందనుకున్నారు నాన్న. దానికి తోడు ఆ రోజుల్లో ఐఐటీల్లో సైన్సులో బాచ్‌లర్స్‌ లేదా మాస్టర్స్‌ కోర్సులేమీ లేవు. కాబట్టి నాకు ఇంక ఐఐటీల్లో చేరే అవకాశమే లేకుండాపోయింది.
1971లోనే జరిగిన మరో సంఘటన కూడా నా పైన చాలా బలమైన ప్రభావం చూపిందని చెప్పక తప్పదు. ఓ రోజు మా అక్కయ్యని` అప్పుడామె వయసు ఇరవై నాలుగేళ్లు` ఆమె భర్త దారుణంగా కర్రతో కొట్టాడు. నాకు ఆ అక్కయ్య అంటే ఎంతో ఇష్టం. ఆమె మమ్మల్నందర్నీ చాలా బాగా చూసుకునేది. తను బాగా చదివేది. గణితంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది, అదీ డిస్టింక్షన్‌లో పాసయింది. అందరితో చక్కగా మాట్లాడుతుంది. ఇంటి పనులు, బయటి పనులన్నీ తనే పొందికగా చేసేది. పెళ్లికి ముందే తను బ్యాంకులో ఆఫీసర్‌గా చేరింది. ఆ రోజుల్లో అది చాలా గొప్ప. అప్పట్లో, అంటే యాభై ఏళ్ల క్రితం అలాంటి పర్యవేక్షక స్థాయి ఉద్యోగాల్లో మధ్యతరగతి మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. 1971లో తనకు పెళ్లి అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. వాళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అక్క తన జీతాన్ని ఆయన చేతిలో పెట్టకుండా వేరే అకౌంట్‌లో (కచ్చితంగా అమ్మ ప్రభావమే) వేసుకోవాలనుకుంది. దాంతో భర్త ఆమెను దారుణంగా తిట్టాడు, కర్రతో కొట్టాడు. వాళ్లు మారేడ్‌పల్లిలో మా పక్క వీధిలోనే వుండేవాళ్లు. ఆ రోజు అక్కయ్య తన పసిబిడ్డను చేతుల్లో పెట్టుకుని, కళ్ల వెంట నీళ్లు ధారకడుతుండగా వడివడిగా నడుచుకుంటూ మా ఇంటికి వచ్చింది. అప్పటి వరకూ నేనెన్నడూ అక్కయ్యని అలాంటి స్థితిలో చూడలేదు. తనంత తేలికగా చలించిపోయే రకం కూడా కాదు.
నాకు ఎదురైన మొట్టమొదటి భయానక అనుభవం ఇది. అంతులేని దుఖంతో మనసు మొద్దుబారిపోయింది. ఎవరైనా మా అక్కయ్యని ఆ స్థాయిలో ఏడిపించగలరని నేనెప్పుడూ అనుకోలేదు. ఇంట్లో చిన్నవాళ్లం అందరం మౌన ప్రేక్షకుల్లా వుండిపోయాం. ఆ రోజు మమ్మల్ని ఇంట్లో ఒక్కమాట కూడా మాట్లాడనివ్వలేదు. కానీ ఈ సంఘటనకు నేను తీవ్రంగా కదిలిపోయాను. దేనినైనా తలకిందులు చేసేయగల, మన ఉనికినే శూన్యంగా మార్చేయగల శక్తిమంతమైన వ్యవస్థలో ఉంటూ.. ఏమైనా చెయ్యాలనుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? దీనికి తోడు, మారేడ్‌పల్లిలో ఉన్న బ్రాహ్మణ పెద్దలంతా వచ్చి, అటూఇటూ మాట్లాడి, మా అక్కయ్యను మళ్లీ ఆ భర్త దగ్గరకు తీసుకువెళ్లారు. వాళ్లు విడిపోవడం మన సమాజానికే చేటు అన్నారు, దానివల్ల మరి కొందరు యువతులకు స్వతంత్రంగా బతకాలన్న ఆలోచనలు వస్తాయన్నారు. అంతకు ముందు మా అమ్మానాన్నా అక్కయ్యతో ‘నీకు ఇష్టం లేకపోతే తిరిగి వెళ్లాల్సిన పని లేదు, నువ్వు ఎప్పటిలా మాతోనే వుండొచ్చు’ అన్నారు. కానీ ఆమెను మళ్లీ భర్త దగ్గరకు తీసుకువెళుతుంటే ఇద్దరూ నోరు మెదపలేదు, ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. నేనారోజే మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను` జీవితంలో పెళ్లనేది చేసుకోకూడదని, పురుషులు చేయగల ద్వేష పూరిత ఘనకార్యాలు వేటికీ కూడా నన్ను నేను గురి చేసుకోకూడదని! పైకి మాత్రం మౌనంగానే ఉండిపోయాను, ఎందుకంటే ఇలాంటి విషయాలు మన ఇంట్లో కూడా చర్చించుకునే పరిస్థితులు లేవు. ఆనాడు తానెదుర్కొన్న ఆ బాధాకరమైన ఘటన నాపైన ఎంతటి ప్రభావం చూపిందన్నది.. ఇప్పుడీ పుస్తకం చదివే వరకూ మా అక్కయ్యకు కూడా తెలిసే అవకాశం లేదు.
హైస్కూలు చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నప్పుడు నాకు నేను రెండు వాగ్దానాలు చేసుకున్నాను` ఒకటి, జీవితంలో ఏ పురుషుడి ముందూ సాగిలపడకూడదు. రెండు, నాలోని సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించు కునేందుకు సకల శక్తులూ ఒడ్డాలి. నాకిక ఆకాశమే హద్దు! పత్రులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ఫోన్‌ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.