పర్ఫెక్ట్ డేస్ సినిమా పేరు. ఇది జపనీస్ చిత్రం. విన్ వెండర్స్ దర్శకుడు. హిరయామా అనే ఒక టాయ్లెట్ క్లీనర్ కధ. కోజి యకుషో అనే నటుడు టాయ్లెట్లు శుభ్రం చేసే పాత్రలో అద్బుతంగా నటించాడు. టాయ్లెట్ శుభ్రం చేసే మనిషిని కథానాయకుడుగా పెట్టి విన్ వెండర్స్ ఓ కళాత్మక చిత్రం తీసాడు. కళాత్మక చిత్రం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది.
సినిమా మొత్తం హిరయామా దినచర్య మీద నడుస్తుంది.
తనుండే వీధిని ఊడ్చే వ్యక్తి చీపురు నుంచి వచ్చే శబ్దానికి హిరయామా రోజూ నిద్రలేస్తాడు. పడుకున్న పరుపు చుట్టడం, బ్రష్ చేసుకోవడం, తన అటక ఇంట్లోంచి కిందికి దిగడం, కాఫీ మెషిన్ లోంచి కాఫీ టిన్ తీసుకుని తాగి తన కారులో టోక్యోలోని ఒక ప్రాంతానికి వెళ్ళి టాయ్లెట్లు శుభ్రం చేయడం ఇదే అతని దినచర్య. నిద్రలేవగానే ఆకాశం వైపు ఆనందంగా, నవ్వు ముఖంతో చూడడం, తను పెంచుకుంటున్న ఇండోర్ మొక్కలకి నీళ్ళు పొయ్యడం కూడా అతని దినచర్యలో బాగమే. ప్రతిరోజూ తూచ తప్పని దినచర్య. ఇందులో ఏమంత గొప్పతనం ఉంది అనిపిస్తుంది కదా. వస్తున్నా అక్కడికే.
దాదాపు అరవయ్యేళ్ళ వయసులో ఒంటరిగా ఉంటున్న హిరయామా తన జీవితాన్ని చాలా క్రియేటివ్‌గా మలుచుకుంటాడు. ఇంటి నుంచి పనికి వెళ్ళే సమయంలో అతను ఎంతో చక్కటి సంగీతాన్నివింటుంటాడు. అతని ముఖం మీద గొప్ప ఆనందం తొణికిసలాడుతుంటుంది. అతని కళ్ళు నవ్వుతుంటాయి. ఎంతో నిబద్ధతతో టాయ్లెట్లు శుభ్రం చేస్తుంటాడు. ఆ తర్వాత తన కిష్టమైన తోటలో బెంచి మీద కూర్చుని లంచ్ తింటాడు. చెట్ల మధ్య నుంచి జాలువారే సూర్యకిరణాలను మైమరపుతో ముఖమంతా ఆ వెలుగు నింపుకొని చూస్తుంటాడు. అపుడపుడూ చిన్న చిన్న మొక్కల్ని అతి జాగ్రత్తగా తీసుకుని కవర్లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళి తన మొక్కల సరసన పెట్టుకుని నీళ్ళు పోస్తూ ఉంటాడు. హిరయామా దినచర్య ఇలాగే ఉంటుంది. అతని ఇంట్లో వంటగది కనబడదు. బాత్ రూం ఉండదు. పబ్లిక్ వాష్ రూంలో స్నానం చేస్తుంటాడు. పబ్లిక్ లాండ్రీలో బట్టలు ఉతికించుకుంటాడు. అలాంటి హిరయామా ఇంట్లో పుస్తకాలతో నిండిన లెబ్రరీ, తనకిష్టమైన బోలెడన్ని కేసెట్లూ ఉంటాయి. పని నుండి ఇంటికొచ్చాక ఒక పుస్తకం పట్టుకుని చదువుకుంటూ నిద్రపోతాడు. హిరయామా జీవితం దాదాపుగా ఇలాగే సాగుతుంటుంది.
మామూలుగా ఎవరి జీవితమైనా ఇలాగే ఉంటుంది. కొంతమందికి కొన్ని అదనంగానో, తక్కువగానో పనులుండొచ్చు. వాళ్ళ జీవితంలో మొనాటనీ ఉంటుంది. పని పట్ల సంతృప్తి లేని విసుగు ఉంటుంది. ఆనందం కోసం వెతుకులాట ఉంటుంది. రకకాల వ్యాపకాలు కల్పించుకుని ఒక అసంతృప్తితో బతుకు బండిని లాగడం కనిపిస్తుంటుంది. పెద్ద ఉద్యోగాలు చేస్తూ, వేలకొద్దీ జీతాలు సంపాదిస్తూ కూడా సంతోషంగా ఉండలేని వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు. హిరయామా సమాజం చిన్నచూపు చూసే పారిశుధ్య పనిలో ఉంటాడు. ఇంకా నువ్వు ఆ పనే చేస్తున్నవా అని అతని సోదరి అడుగుతుంది. బహుశా అతని కుటుంబానికి అతను చేసే పని నచ్చదు. అలా అని ఎక్కడా స్పష్టంగా ఉండదు. అతని కుటుంబం గురించి ఏమీ వివరంగా చెప్పడు దర్శకుడు.
సినిమాకి పర్ఫెక్ట్ డేస్ అని పెట్టడం వెనుక హిరయామా జీవితంలో రోజు తర్వాత రోజు నడుస్తున్న యాంత్రిక జీవితంలో యాంత్రికత లేదు అతని రోజులన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని చెప్పదలిచాడు దర్శకుడు. ఉదయాన్నే నిద్రలేవగానే నీలపు రంగు ఆకాశాన్ని చూసి నవ్వే అతని కళ్ళు రాత్రి పడుకునేటప్పుడు పుస్తకం చదువుతున్నప్పుడు అలాగే నవ్వుతుంటాయి. ఆ నవ్వు అతని కళ్ళల్లోంచి అతని ముఖం మీదకి పాకుతుంది. గొప్ప రిలాక్స్‌గా అనిపిస్తుంది మనకి కూడా. ఒక యాంత్రిక జీవితం గడుపుతున్న హిరయామా జీవితంలోకి ఆనందం, సంతృప్తి ఎలా రాగలిగాయి.
ఒక చెట్టుని, ఒక ఆకుని చూసి గొప్ప సంతోషంతో నవ్వే అతని కళ్ళు, కనీసం ఇంట్లో బాత్రూం లేకపోయినా, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా అతను వాటి గురించి వెంపర్లాడకుండా తన ఆనందాన్ని వెతుక్కుని తావులేమిటో గమనిస్తే మనకి అర్ధమౌతుంది. ప్రకృతితో అతని దోస్తీ, చెట్లను ప్రేమించడం, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిమగ్నం కావడం, ఆకుల సందుల్లోంచి సూర్యరస్మి వెలుతురు తీగల్లా జాలువార డాన్నీ చూడడం ఇవన్నీ అతని సంతోషపు తావులు. అంతేనా సంగీతం, సాహిత్యం, ఫోటోగ్రఫి అతని ఇష్టమైన వ్యాపకాలు. ఎక్కువమంది మనుష్యులను కలవకపోయినా మనుష్యుల్లోనే ఉంటాడు. అతని మేనకోడలు ఇంటి నుంచి పారిపోయి వస్తే తన ఇంట్లో చక్కగా ఉంచుకుంటాడు. ఆమెని కూడా పబ్లిక్ వాష్ రూంకి తీసుకెళ్లి స్నానం చేసే ఏర్పాటు చేస్తాడు. తన ఇంట్ళో వాష్ రూం లేదనే చింతను కూడా అతను వ్యక్తం చేయడు. ఒక టవల్ అద్దెకు తీసుకుని పబ్లిక్ వాష్ రూంకి మేనకోడల్ని తీసుకెళతాడు. మేనకోడలుతో నడుస్తున్నప్పుడు అప్పుడెప్పుడో కాదు ఇప్పుడు ఇప్పుడే అనే వాక్యం వినిపిస్తుంది. అంటే ఈ క్షణంలో బతకాలి అనే జెన్ బుద్ధిజం ఫిలాసఫి అన్నమాట. హిరయామాకి తను బతుకుతున్న తీరు పట్ల ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఉదయం నిద్ర లేచాక తన జీవితంలో ఎదురయ్యే ప్రతి క్షణాన్ని అది ఎలా వస్తే అలా తీసుకోవడం తప్ప ఎలాంటి కంప్లైంట్ చెయ్యడు. ఒక్కసారే అతని కోపాన్ని చూస్తాం. తనతో కలిసి పనిచేసే వ్యక్తి శెలవు పెట్టినప్పుడు రెండు షిఫ్టులు పని చేయాల్సి వచ్చినప్పుడు అతని కోపాన్ని చూస్తాం. అంతే.
నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందంటే జీవితమంటేనే పోరాటం. జీవించే క్రమంలో ఎన్నో పోరాటాలు చెయ్యాల్సి ఉంటుంది. క్రమంగా బతుకు గానుగెద్దులా అదే గాడిలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా తిరిగేదిగా మారిపోతుంది. చుట్టూ ఏముందో చూడకుండా గానుగెద్దు కళ్ళకి కంతలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ చేసిన పనే చేస్తుంటాం .అదే దారి, అదే ఆఫీసు, అదే పని అదే మనుష్యులు. అయితే ఆ మొనాటనస్ జీవితాన్నీ తప్పించుకోవడానికి సాధారణంగా వస్తువుల వెంట పడతాం. అక్కడా సంతృప్తి ఉండదు. పట్టణాల్లో బతకడం వల్ల ప్రకృతికి దూరమై పోతాము. ఉరుకుల పరుగుల జీవితం. ఒత్తిళ్ళతో నిండిన జీవనశైలి.
హిరయామా జీవితంలోను మొనాటని ఉంది. ప్రతి రోజు అదే పని. ఆ టాయ్లేట్లను కడగడమే రోజూ చేసే పని.
అయితే అతను టొక్యో లాంటి పట్టణంలోను నీలాకాశం, పచ్చని చెట్లూ, చెట్ల ఆకుల్లోంచి జాలువారే కాంతి ధారల్ని గొప్ప తన్మయంతో చూడడమే కాదు వాటి ద్వారా అందే ఆనందాన్ని తన కళ్ళ ద్వారా లాక్కుని ముఖమంతా పాకించుకోవడం చాలా సీన్లలో చూడొచ్చు. తను సేకరించుకున్న కేసెట్లు వెదజల్లే పాటల్ని వినడం, తాను చూసే దృశ్యాలను ఫోటోలుగా తీయడం, అలిసిపోయి ఇంటికొచ్చాక తన ఒంటరితనాన్ని పుస్తక పఠనంతో పూరించుకోవడం అనేవి హిరయామా జీవితాన్ని నవనవోన్మేషంగా ఉంచాయి. అంటే ప్రకృతికి సమీపంగా ఉన్న వారి జీవితంలో యాంత్రికత ఉండదని దర్శకుడు చెప్పకనే చెప్పాడు.
మనుష్యులతో సంబంధాల్లో యాత్రికత ప్రవేశించవచ్చు. మనం చేసే ఉద్యోగాల్లో యాంత్రికత ఉండొచ్చు. కానీ ప్రకృతి నుంచి ఎప్పుడూ యాంత్రికత ఎదురవ్వదు. అదే సూర్యోదయం, అదే సూర్యాస్యమయం, అదే ఆకాశం, అవే చెట్లు, అవే పిట్టలు కానీ అక్కడ యాంత్రికత ఉండదు. ఈ రోజు చిన్న మొగ్గ రేపటికి పూర్తిగా విచ్చుకున్న పువ్వు. ఆకాశం ఈ రోజు నీలంగా ఉండొచ్చు. రేపు తెల్లటి మబ్బుల్తో మెరుస్తుండొచ్చు. హీరయామా చేసే పని దంపుళ్ళ పాటలా ఒకే తీరుగా ఉంటుంది కానీ అతడు తన జీవన విధానంలోకి ప్రకృతిని, సాహిత్యాన్ని, సంగీతాన్ని నింపుకున్నాడు. అలాగే మనుష్యులతో సజీవ సంబధాలు కలిగి ఉన్నాడు.
ఈ సినిమా నాకు ఇంతగా నచ్చడానికి కారణం హిరయామా తీర్చిగదిద్దుకున్న జీవన విధానమే. నా జీవితానికి చాలా దగ్గరగా
ఉండడం కూడా సినిమా నచ్చడానికి మరో కారణం. హీరయామా లాగానే నా జీవితంలో యాంత్రికత ఉండదు. జీవితాన్ని నవనవోన్మేషంగా ఉంచుకోవాలంటే మనిషి వస్తు వ్యామోహాలు కాక ప్రకృతికి దగ్గరగా జరగాలి. ప్రకృతిలో దొరికే ఆనందమే అసలైన ఆనందం. దీనినే హిరయామా ఈ సినిమాలో సాధించి నిత్యానందంలో మునిగి తేలుతుంటాడు.