భారతీయ పితృస్వామిక సమాజంలో ప్రాచీనకాలం నుండి స్త్రీలను తల్లులుగా, దేవతలుగా ఒకవైపు పూజిస్తున్నారని చెబుతూనే మరోవైపు వారిని రెండవస్థాయి పౌరులుగా 19వ శతాబ్దం దిగజార్చేసింది. అదే 20, 21వ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచీకరణ నేపధ్యంలో పెట్టుబదీదారి వ్యవస్థ, స్త్రీలను అంగడి సరుకులుగా, ఆట బొమ్మలుగా మార్చివేస్తూ, వారి వ్యక్తిత్వాలను ఒకవైపు హననం చేసింది.
మరోవైపు మానసిక, శారీరక లైంగిక, అత్యాచార, హత్యలను చేస్తూ సమాజం దిగజారిపోయింది. అన్ని వర్గాల మహిళలపైన చిన్నచూపు, వివక్ష, అణచివేతను మరింత పటిష్టం చేసిన పురుషాధిక్య సమాజం చివరికి ఇప్పుడు మహిళా రచయితల దాకా వచ్చేసింది. రచయితలపైన, వారి మాటలపైన, రచనలపైన, వ్యక్తిగతంగా దిగజార్చే ధూషణలు చేస్తూ బెదిరింపుల వరకు వెళ్లిడం జరుగుతున్న సందర్భం. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత రచయిత ఒక్కరే తన ఒంటరి పోరాటం చేయలేక జారిగిల పడడం జరుగుతున్నది. అందులో మల్టీ మీడియా వచ్చిన తర్వాత అసభ్య పదజాలంతో రచయితలను ట్రోలింగ్ చేయడం వలన ఎవరికీ వారు చెప్పుకోలేక, ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక, తీవ్ర మానసిక ఒత్తిడి, వేదనకు లోనౌతున్నారు.
రచయితలు ఒంటరి వారు కాదూ.. వారికీ సమూహం వుంది అని చెప్పడం ఇలాంటి సందర్భాలలో సాటి మహిళా రచయితలుగా మన మద్ధతును ఇవ్వవల్సిన అవసరం ఎంతైనా వుంది. ఒక్కరు చేయలేని పోరాటం, ఐకమత్యంగా కదిలి అందరం కల్సి పనిచేయడానికి హైదరాబాదు నగరంలో మహిళా రచయితలకు ఎటువంటి సంస్థలు ఇప్పటి వరకు లేవు. అందుకోసం ఐకమత్య పోరాటాలు చేయడానికి, దాడులను తిప్పికొట్టడానికి మనకూ అంటూ ఒక ఫోరం, లేదా సంస్థ ఇప్పటివరకు (కేవలం హైదారాబాదు) లేదు. అందుకోసమే ఒక ఫోరం ఉండాలన్నది నా ఆలోచన. వ్యక్తిగతంగా ఎవరి సంస్థలు వారికి ఉన్నప్పటికినీ హైదరాబాదు నగరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న రచయిత మిత్రులందరిని సంఘటిత పరచక తప్పనిస్థితి ఏర్పడిరది.
చాలాకాలం నుంచి హైదరాబాదు మహానగరంలో నివసిస్తున్న రచయితలు కొందరు ఒక నిశ్శబ్ద వాతావరణంలో అసంతృప్తిగా వుండడం జరుగుతోంది. ఏ సందర్భంలోనో తప్ప, ఒకరిని ఒకరు కలుసుకోలేని వాతావరణంలోకి నెట్టి వేయబడడం వలన కొంతమంది మిత్రులు అసంతృపితో వుండడం గమనించిన తర్వాత.. అందరిని ఒక దగ్గర కలిపే వేదిక ఉంటే బాగుంటుందన్న ఆలోచన చాలా రోజులుగా నన్ను కలచివేస్తున్నది. ఆ సమయంలోనే ‘మౌమితా ఆలం’ అనే ఒక మైనారిటీ కవయిత్రి మన ‘‘హైదరబాద్ నగరానికి ఆంగ్లం నుండి తెలుగులోని అనువదించబడిన ‘రాయగూడని పద్యం’ కవితా సంపుటి ఆవిష్కరణ నిమిత్తం రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆ సమావేశానికి హాజరైన మిత్రులు, ప్రముఖ సీనియర్ కవయిత్రి, రచయిత మోర్తాల విమల మరియు ఘంటశాల నిర్మలగారు ‘మౌమితా ఆలం’తో ఒక ముఖా-ముఖి హైదరాబాదు నగరంలోని రచయితలనందరిని పిలిచి ఏర్పాటు చేద్దామా అని నన్ను అడగడం జరిగింది. అందుకు నా సమ్మతం తెలియజేసాను.
ఆ సందర్భంలో నగరంలో వున్న రచయితలందరికి ఆహ్వానం పలుకుతూ ఈ ‘‘హైదారాబాద్ విమెన్ రైటర్స్ ఫోరం’’ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసాను. అందుకు మిత్రులందరూ నా ఆహ్వానాన్ని మన్నించి తమ అంగీకారాన్ని తెలియజేశారు. గ్రూపు మిత్రులందరి సహకారంతో మార్చి 22, 2024న లామాకాన్‌లో ‘మౌమితా ఆలం’ గారితో ముఖా-ముఖి ఏర్పాటు చేసుకుని, సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ స్పూర్తితోనే మిత్రులందరి సహకారంతో రెండవ సమావేశం 26 జులై, 2024న ‘‘భూమిక’’ స్త్రీవాద పత్రిక ఆఫీసులో కొండవీటి సత్యవతి, మరియు సీనియర్ రచయిత, పాత్రికేయురాలు గోపరాజు సుధగారి ఆధ్వర్యంలో దాదాపు 25 మంది రచయితలందరం కలిసి ఉత్సాహంగా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. భూమిక ఆఫీసు మిత్రబృందం వారిచ్చిన ‘తేనీటి విందు’ తర్వాత రచయితలందరూ భవిష్యత్తులో ‘హైదారాబాద్ విమెన్ రైటర్స్ ఫోరం’ నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏవిధంగా వుండాలో సూచనలు చేయడం జరిగింది.
ముందుగా గోపరాజు సుధాగారు మాట్లాడుతూ మూడు సూచనలు చేసారు. 1. ఈ ఫోరం ఎందుకు ఏర్పడిరది 2. ఫోరం కార్యక్రమాలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించుకోవాలి? 3. ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనే విషయాలపై రచయితలందరూ తమతమ అభిప్రాయాలు తెలియచేసినట్లైతే, దానివలన భవిష్యత్తు కార్యక్రమాలు ఈ వేదిక ద్వారా నిర్వహించుకోవడానికి ఒక క్లారిటీ వస్తుందని అన్నారు. కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ ఫోరం మీటింగ్ ఏ రోజు సమావేశం నిర్వహించుకుంటుందో ముందుగా చెబితే, వర్కింగ్ రోజులలో భూమిక ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవడానికి సహకరిస్తామని, అందుకు భూమిక ఆఫీసు, స్టాఫ్ అందరూ తలుపులు తెరిచే ఉంచుతారని హామీ ఇచ్చారు. సమావేశానికి హాజరైన రచయతలందరూ చర్చల తర్వాత ఏకాభిప్రాయానికి వస్తూ ఈ క్రింది అంశాలను ఫోరం నిర్వాహణలో వుంటే బాగుంటుందని సూచిస్తూ, అందుకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు..
1. మనుషులు మనుషులుగా కలవడం వలన ఉత్సాహం వస్తుంది.
2. కష్టకాలంలో అండగా నిలవడం
3. వివిధ అంశాల మీద సోషల్ డాక్యుమెంటేషన్ చేయడం
4. క్రీడారంగంలో వున్న స్త్రీల గురించి రచనలు రావాలి.
5. ఒకరి అనుభవాలు ఒకరు పంచుకుని, మార్పు కోసం రచనలు చేయాలి.
6. రచయితలు రాసిన రచనలపై చర్చలు
7. రచయితలు తమ రచనలలో ఎడిటింగ్ విషయంలో సముఖతను పాటించడం, అందుకోసం ఒక ఎడిటింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
8. ప్రతినెల ప్రదేశాలు మారినా తప్పనిసరిగా రచయితలందరూ కలవడం
9. రచయితలు తమ రచనలను సామాజికంగా రాయగలగడం
10. ఐకమత్యంగా, గౌరవప్రదంగా రచనలు చేయడం
11. భాష మీద పట్టు సాదిస్తూ, యాసలపై కూడా రచనలను చేయడం
12. ప్రతి నెలా ఒక కొత్త అంశంపై మేధావులతో క్లాస్ చెప్పించుకుని, చర్చ మరియు ఆ అంశాలపై రచనలు చేయడం.
13. సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు ‘విమెన్ రైటర్స్ మీట్’ లను ప్రకృతి వేదికగా సిటీకి దూరంగా నిర్వహించుకోవడం (కవిత్వం, కధ, నవల, వ్యాసం, నాటకం, బాలసాహిత్యం మొదలగు అంశాలపై వర్క్ షాప్స్)
14. అస్తిత్వ వాదాలపై అసత్య ప్రచారాలు జరగకుండా ఆలోచనా పద్దతులు, ధోరణులను మార్చుకుని, రచనలు చేయడం
15. ఫోరం సమావేశానికి సమయం పాటించడం. ఆసాంతం సమావేశంలో వుండి చర్చలో పాల్గొనడం
16. రచయితలు గ్రూపుగా ఫీల్డ్ వర్క్ చేసి, రచనలు చేయడం
17. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సంఘటితంగా ఖండన తెలపడం
18. వెబ్ పత్రికను నిర్వహించడం, ఫోరం రచయితలతో రచనలు చేయించడం
19. చరిత్ర, వర్తమాన సంఘటనలను డాక్యుమెంటేషన్ చేయడం
20. ఇతర రచయితలను చదివే విధంగా రచయితలను ప్రోత్సహించడం
21. యువ రచయితలను ప్రోత్సహించడం. వారిని ఎక్కువగా ఫోరంలోకి ఆహ్వానించడం
22. ఫోరం నుండి ప్రకృతి ప్రదేశాలను దర్శించే విధంగా ఏర్పాటు చేసుకోవడం
23. ఏదైనా సంఘటన జరిగినప్పుడు రచయితల ఫోరం నుండి ఫాక్ట్ ఫైండిరగ్‌కు వెళ్ళడం మరియు బాధితుల పక్షం వహిస్తూ వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం
24. ఆటోబయోగ్రఫీ రచనలకు ప్రోత్సాహం
25. అత్యవసరమైన విషయాలపై జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం
26. రచయితల కలయిక ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరగడం
27. అత్యవసర సంఘటనలు, అంశాలు ఏవైనా జరిగినప్పుడు వాట్సాప్ గ్రూపులో చర్చలు చేయడం లాంటి విషయాలపై ఫోరం సమావేశానికి హాజరైన రచయితలందరూ ఏకాభిప్రాయానికి రావడం జరిగింది.
‘‘హైదరాబాదు విమెన్ రైటర్స్ ఫోరం‘‘ సమావేశానికి భండారు విజయ అద్యక్షత వహించి, నిర్వహించగా రచయితలు గోపరాజు సుధ, కొండవీటి సత్యవతి, గీతాంజలి, శిలాలోలిత, పైడిమర్రి గిరిజ, హిమజ, జ్వలిత, గుత్తా జ్యోస్న, శాంతిప్రబోధ, నాంపల్లి సుజాత, అరుణ, రత్న సుమతి, విప్లవ శ్రీనిధి, నీరజ అమరవాది, సుమతి, అనసూయ, దొంతాల సుజాత, శ్రీదేవి, వి.సుమతి, డా. అనిత, డా. సంద్యా విప్లవ్ మరియు భూమిక ఆఫీసు మిత్రులు లలిత, లక్ష్మి మొదలగువారు హాజరై సమావేశాన్ని విజయవంతంగా నిర్వ హించుకోవడం జరిగింది.