అవును
అతడు మనిషి
నిరంతర పధికుడు
అంచు(తు)లు వెదికే ప్రయాణీకుడు…
ఆహ్లాదకరమైన మన ప్రయాణాలని మన రోటీన్ యాత్రల తాలూకూ భ్రమలని, బద్దలు కొట్టిన వివేకి అతడు. మనని చేయి పట్టి, లంకమల దారుల్లో నడిపించి, అనతి కాలంలోనే మనందరికీ అత్యంత ప్రియమైపోయిన వాడు. అవి పేరుకు లంకమల దారులే కానీ నిజానికా బాటలు అనంతం. ఆ దారుల్లో, చాలాసార్లు అతనికి అతడే ఎదురవుతుంటాడు. నిజానికి ఇదొక ప్రత్యేకమైన అనుభవం. సాధారణంగా, ప్రయాణాల్లో మరెవరికి ఎదురుకాని అనుభవం. ఈ ఆత్మదర్శనం. అతడు భౌతికంగా, మనిషి మాత్రమే ఇక్కడ ఉంటాడు కానీ, అతడి ఆలోచనలు మాత్రం అక్కడెక్కడో యుగాలకవతల ఏ సమాధానాలూ దొరకని గృహాంతర్భాగాల్లో దేనికోసమో వెతుకులాడుతూనే ఉంటాయి. పరిసరాలను వెతుక్కుంటూ, అతడుచేసే ఈ ప్రయాణాల్లో, జీవితాన్ని, సమాజాన్ని తడిమే సందర్భాలు ఎదురైనప్పుడు కలిగే తృప్తి అనిర్వచనీయం. ఆ సందర్భాల్లో చాలాసార్లు తనని తానే దర్శిస్తూ, అడుగున పడ్డ, గాయపడ్డ జీవితాలను చేతుల్లోకి తీసుకుంటాడు. హృదయానికి హత్తుకుంటాడతడు.
అతడు మనిషి…
ఈ క్రమంలో
అతడికి ఆకలుండదు…
దాహమేయదు…
చలి పుట్టదు…
జ్వరం రాదు…
బలమైన సంకల్పం కలిగిన వాడతడు…
ప్రయాణాల రసవిద్య తెలిసిన ఆల్కెమిస్ట్…
అతడు…
అతడు మనిషి…
సోమశిల వెనుక జలాల్లో మునిగి పోయిన జీవితాలూ, కూలిపోయిన కాపురాలూ, కొట్టుకుపోకుండా తేలుతోన్న తాడి తలలు, ప్రతి మూల, మూలలా ప్రసరించే అతడిలో చూపు ఎక్కడికక్కడ మనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చేపల వేటనీ. ఎంత ప్రేమగా, ఆర్తిగా వివరిస్తాడంటే ఆకలి కోసం, వాళ్ళు ఇచ్చే పది పన్నెండు వేల జీతం కోసం వందల మైళ్ళు ప్రయాణించి వచ్చిన వలస కూలీల జీవన చిత్రాలతో కలగలిపి, నీటి మీద విశాలంగా పరిచిన వలలని ముందుకూ, వెనక్కూ లాగుతూ, చేపల వేటతో పాటు, వారి చరిత్రను ముక్కలు ముక్కలుగా తవ్వితీసి కథలు కథలుగా ముడివేసిన తీరు ప్రశంసనీయం. ఇవి కథలా అంటే. కావొచ్చు అనుభవ కథనాలు కావొచ్చు. అయితే ప్రతి కథనమూ, శిల్ప సౌందర్యం కలిగి ఉండడం అతడి చతురత. మైదుకూరు వద్ద భూమాయపల్లె యాదవుల కుటుంబంలో, పుట్టి పెరిగిన ఆధునిక రాబిన్ హుడ్ మల్లన్న. దివిటీ మల్లన్న చరిత్రను, పొరలు పొరలుగా పెకలించి, మనకి పాఠంలా బోధిస్తాడతడు. అది నిజంగా, నిజమేనని నిరూపిస్తూ తొణకల బాయిని చూపిస్తాడు మనకి. సన్నపురెడ్డి మనందరికీ పరిచయం చేసిన కొండపొలం యాత్ర 20 కిలోమీటర్ల మేరా స్వయంగా మిత్రులతో కలిసి రెండుసార్లు రెండు వైపుల నుండి పయనించి, చేయి పట్టి మననీ ఆ కొండపొలం తీసుకెళ్తాడు. నరమానవుని అలికిడుండని ఆ మార్మిక ప్రపంచంలో, క్రూర మృగాలు యదేచ్చగా సంచరించే చోట, కాశి నాయన ఒంటరిగా ఆ కొండమీద 12 ఏళ్ల పాటు తపస్సు చేసిన ప్రాంతంలో కట్టబడిన ఆ గదిలో సేదతీరి, కాశినాయన్ని తనలోకి ఆవాహన చేసుకుంటాడు. ఆ సమయంలో నమ్మరు గాని, మనం కూడా తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నల్లమల దారుల్లో, నడవాలన్న బలమైన కోరికని అతి ప్రయత్నం మీద ఆపుకుంటాం… లేదా నేనూ నీతో వస్తానని అతడితో భంగపడతాం. అతడు రాసిన నిమల్లి గాని బత్తెం’’ నిఅరణ్యవాసం’’ సినిమాగా రాబోతోంది.
కొండ పొలం గొర్ల కాపర్ల జీవితమైతే, ప్రేమ కోసం గొర్లతోలుకొని అడవికి పోయిన వాని కద నిఅరణ్యవాసం’’ ఈ సినిమాకి కథ సంభాషణలు అందించడం అతడి ప్రత్యేకత. ఆ క్రమంలో కొండపొలం వెళ్లేవారు భుజాన వేసుకుని వెళ్తున్న బత్తెం బరువుని కూడా తూకం వేస్తాడతడు.. అంత నిశితమైన పరిశీలన, అతడిలోని విశేషం. కొండా, కోన, వాగూ, వంకా, దొన, అడవి, లంక, జలపాతం ఇలా విన్నాం కానీ జలుగు కొత్త పదం… నిట్ట నిలువునా ఉన్న కొండ చంపలపై వాలు ఎక్కువ ఉండడం వల్ల, రాళ్లు జారుతూ కిందికొస్తూ ఉంటాయి. దాన్ని జలుగు అంటారట. అక్కడ రెండు కాళ్లు నాలుగవుతాయి మరి. గుండెలవిసిపోయే ఈ జలుగుని గురించి చెప్తూనే, తొలకరి జ్ఞాపకాల నడుమ మందమైన ఆకులతో మెరిసిపోతున్న ఎర్రచందనం చిగుళ్ళని లేపనంలా మన గుండెలకు అడ్డుతాడు. మరోచోట యాభై, అరవై మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు దూకుతూ ఉంటే ఆ అందం రెట్టింపు అయ్యేలా మూల నుంచి ముందుకు వచ్చిందట బండ రాయి ఒకటి గూడులా ఉంది అంటూ మననీ మురిపిస్తాడు… ఎన్నెన్ని పెద్ద తలకాయల్ని అడిగి ఎంతెంత సమాచారాన్ని సేకరించాడతడు… ఎంతెంత చరిత్రను తవ్వి తీశాడు. చాలా చోట్ల వాస్తవ చరిత్ర తాలూకూ సజీవ సాక్ష్యాలను గురించి చెబుతూ తన ఉద్వేగమంతా మనలోకి ప్రసరింప చేస్తాడు.
ప్రియమైన మిత్రుడు, శివ రాచర్ల తనని మోటివేట్ చేసిన సందర్భాన్ని ఆర్తిగా, ఆర్ద్రంగా చెప్పి మనని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అభినందనలు శివా గారు. అతడి కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికి ఆ మిత్రబృందమంతా అందించిన సహకార సౌజన్యం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. పులివెందుల వివేక్, గోవర్ధన్, అరణ్య శేఖర్, శివారాచర్ల, విష్ణు, వీరాడ్డి, సుబ్బారెడ్డి. ఇంకా ఎక్కడికక్కడ దారులు చూపిన స్థానికులు రామయ్య, పాములేటయ్య. ఆపుడపుడు వీరిని అనుసరించిన అఫీషియల్స్ కొందరు అంతా అతడి రసవిద్యను అంటించుకున్న వారే. అనుభూతించిన వారే. అభినందనీయులే. ఇంజనీరింగ్ తర్వాత రెండేళ్లు ఖాళీ.
సంవత్సరం ఐటి జీవితం తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే, మెయిన్స్ కోసం జాబ్ వదిలేసాడు. ఒక ర్యాంక్ తేడాతో ఆగింది. తీవ్ర నిరాశకు తోడు తరిమే ఆర్థిక ఒత్తిడి. సంవత్సరం తిరిగేలోపు మళ్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారిపోయాడు. ఒక్క మార్కుతో ఆగినా అది అరమార్కుతో జారినా, ఓటమి ఓటమే అయినా, ప్రస్తుత జీవితం పట్ల ఏ మాత్రం అసంతృప్తి లేదతడికి. ఉన్నది ఒక్కటే జిందగీ, చివరికి మిగిలేది అనుభవాలు, అనుభూతులూ అంటాడు. ఆ అనుభూతుల కోసమే అతడి వేట.
అతడు మనిషి ఇంతకీ ఎవరతడు??? అతడు వివేక్ వివేక్ లంకమల
(నేనింత వరకూ ఒక భాగం మాత్రమే ఈ లంకమల దారుల్లో నడిచాను… మిగిలిన మూడు భాగాలు నడిచే క్రమంలో మళ్ళీ మరోసారి మీ ముందుకు రాగలనేమో చూద్దాం). ఈ లోపు మీరు కూడా ఈ దారుల్లో నడవడానికి భంగపడండి.