రేఖా బెన్‌ జీవితపు పడుగూ పేకా… -ఉమేశ్‌ సోలంకి / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

మోటా టింబ్లా గ్రామానికి చెందిన ఒంటరి తల్లి రేఖా వాఘేలా గుజరాత్‌కు చెందిన పటోలాతో – క్లిష్టమైన డబుల్‌ ఇక్కత్‌ నేతకు ప్రసిద్ధి చెందిన చేనేత పట్టు వస్త్రాలు, ఎక్కువగా చీరలు – పాటుగా తన సంక్లిష్టమైన జీవిత కథనూ నేస్తున్నారు.

లీంబడీ హైవే నుండి చీలిపోయిన రాళ్ళు పరచిన బాట 10-12 కిలోమీటర్ల దూరంలో
ఉన్న మోటా టింబ్లా గ్రామం వరకు విస్తరించి ఉంది. గ్రామం చివరి అంచున, ఇక్కడ నివసించే దళిత నేత సముదాయాల ఇళ్ళ కోసం కేటాయించిన వణకరవాస్‌ ఉంది. ఖట్‌-ఖట్‌… ఖట్‌-ఖట్‌ అంటోన్న నాడె మగ్గాల లయబద్ధమైన శబ్దాలు పాతకాలపు పెంకుల పైకప్పులున్న ఇళ్ళతో పాటు కొన్ని గడ్డితో కప్పిన ఇళ్ళ మధ్యనున్న ఇరుకైన సందులలో ప్రతిధ్వనిస్తాయి. అప్పుడప్పుడూ వినిపించే ఒకటో రెండో గొంతులు చేనేత మగ్గం చేస్తోన్న లయబద్ధమైన చప్పుడుకు అంతరాయం కలిగిస్తున్నాయి. నిశితంగా వినండి, మీరు శ్రమ చేస్తోన్న శబ్దాన్ని కూడా వింటారు. మరింత దగ్గరగా వినండి, రేఖా బెన్‌ వాఘేలా కథకు ముందుమాటలా, ఒక సంక్లిష్టమైన నమూనాను నేస్తోన్న మగ్గం ర్యాప్‌-ట్రాప్‌-ర్యాప్‌ బిగ్గర ధ్వనుల మధ్య ఒక విచారపు మంద్రధ్వనిని మీరు పట్టుకోవచ్చు.
‘‘నేను 8వ తరగతిలో మహా అయితే మూడు నెలలు ఉన్నాను. లీంబడీలో ఒక హాస్టల్లో ఉండే నేను పాఠశాలలో మొదటి పరీక్ష అయిపోయాక ఇంటికి వచ్చాను. అప్పుడే నేనింక చదవబోవటంలేదని మా అమ్మ చెప్పింది. మా అన్న గోపాల్‌ భాయికి సహాయం అవసరం. అతను జీవనోపాధి సాధన కోసం గ్రాడ్యుయేషనుకు ముందే చదువు మానేశాడు. నా ఇద్దరు సోదరులను చదివించడానికి నా కుటుంబం వద్ద ఎప్పుడూ డబ్బు ఉండేదికాదు. ఆ విధంగా నేను పటోలా పనిని మొదలుపెట్టాను,’’ పేదరికం పదునుపెట్టే అన్ని విషయాలలాగే రేఖా బెన్‌ మాటలు కూడా సూటిగా, కానీ పదునుగా ఉన్నాయి. ప్రస్తుతం నలబైల వయసులో ఉన్న ఆమె గుజరాత్‌ సురేంద్రనగర్‌ జిల్లాలోని మోటా టింబ్లాకు చెందిన నిపుణురాలైన నేతరి. ‘‘నా భర్త మద్యం, జూదం, పాన్‌ మసాలా, పొగాకులకు బానిసయ్యాడు,’’ పెళ్ళి తర్వాత తన జీవిత కథలోని మరో దారాన్ని – కొంచెం కూడా సంతోషం లేనిదాన్ని – లాగుతూ చెప్పారు రేఖ. చాలా తరచుగా ఆమె తన భర్తను వదిలి పుట్టింటికి వస్తుండేది, కానీ నచ్చచెప్పి మళ్ళీ అతని దగ్గరకే పంపేవారు. ఆమె చాలా దీనస్థితిలో ఉండేవారు. అయినా అదంతా భరించారు. ‘‘అతను మంచి స్వభావం కలిగినవాడు కాదు,’’ అని ఆమె ఇప్పుడు చెప్తున్నారు.
‘‘నన్ను అప్పుడప్పుడూ కొడుతుండేవాడు, నేను గర్భంతో ఉన్నప్పుడు కూడా,’’ అన్నారామె. ఆమె గొంతులో ఆ గాయాల పచ్చిదనాన్ని మనం వినగలం. ‘‘నా కూతురు పుట్టిన తర్వాత అతనికి ఉన్న ప్రేమ వ్యవహారం గురించి నాకు తెలిసింది. అలాగే ఒక ఏడాది పాటు కొనసాగాను. అప్పుడే గోపాల్‌ భాయ్‌ ప్రమాదంలో చనిపోయాడు 2010లో. అతని పటోలా పని మొత్తం నిలిచిపోయింది. తనకు సరుకు ఇచ్చిన వ్యాపారికి ఆయన బాకీపడ్డాడు. అందుచేత తర్వాత ఐదు నెలలు నేను అక్కడే పుట్టింటిలో ఉండిపోయి, ఆయన పనినంతా పూర్తిచేశాను. ఆ తర్వాత నన్ను తనతో తీసుకువెళ్ళేందుకు నా భర్త వచ్చాడు,’’ చెప్పారామె. చిన్న పాప సంరక్షణను చూసుకుంటూ, బాధను తనలో తానే దిగమింగుకుంటూ, సంతోషంగా ఉన్నట్టు తనను తాను మోసం చేసుకుంటూ మరి కొన్నేళ్ళు గడిచాయి. ‘‘చివరకు నా కూతురికి నాలుగన్నరేళ్ళ వయసప్పుడు ఆ చిత్రహింసను ఇంకెంత మాత్రం భరించలేక నేను వచ్చేశాను,’’ అన్నారు రేఖా బెన్‌. బడి వదిలేశాక తాను నేర్చుకున్న ఆ పటోలా నేత నైపుణ్యం, తన భర్తను వదిలేసి వచ్చాక ఇప్పుడామెకు అక్కరకు వచ్చింది. పేదరికం చేసిన లోతైన మొరటు గాయాలను అది నయంచేసి, ఆమె జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చింది. అది కూడా చాలా బలమైన ఆరంభం.
చాలా కాలం క్రితమే రేఖా బెన్‌ పటోలా నేతపనిలో ఎంతో నైపుణ్యంతోనూ, సులభంగానూ పడుగూ పేకల దారాలను అమరిక చేసే ఏకైక మహిళగా లీంబడీ గ్రామాలలో పేరు తెచ్చుకున్నారు. ‘‘మొదట్లో నేను మా ఎదురింటివాళ్ళ దగ్గరకు దాండీ పని కోసం వెళ్ళేదాన్ని. అది నేర్చుకోవటానికి ఒక నెల పట్టినట్టుంది,’’ అన్నారు రేఖా బెన్‌. నాడెను సర్దుబాటు చేస్తూ, అనుభవంతో గరుకుగా మారిన తన బుగ్గలను రుద్దుకుంటూ, మగ్గంపై తన మోచేతులను విశ్రాంతిగా ఆనిస్తూ ఆమె మాతో మాట్లాడుతున్నారు. పడుగు (నిలువు), పేక (వెడల్పు)ల దారాలతో ఆమె జాగ్రత్తగా ఆకృతులను అమరుస్తున్నారు. నాడెలో ఖాళీ అయిన కదురును మరొక కొత్త కదురుతో భర్తీచేసి, పడుగు దారాలలో కావలసిన పొరలను ఎత్తిపట్టేలా, వాటిగుండా నాడె వెళ్ళేలా మగ్గం రెండు పాదాలను ఆమె తొక్కుతున్నారు. ఒక చెయ్యి పడుగు దారపు కదలికను నియంత్రించే మీటను లాగుతుంది, మరో చెయ్యి పడుగు దారాన్ని సరైన స్థానంలో ఉంచేలా వేగంగా బీటర్ను లాగుతుంది. రేఖా బెన్‌ ఒక్క చేతి మీద పటోలును నేస్తారు. ఆమె కళ్ళు మగ్గం మీద, ఆమె మనసు రూపొందనున్న నమూనాపై కేంద్రీకరించి ఉండగా, అదే ఊపున ఆమె తన జీవితం గురించీ, నైపుణ్యం గురించీ మాట్లాడుతున్నారు.
సంప్రదాయంగా పటోలు నేతలో కనీసం ఇద్దరు మనుషులు పాల్గొంటారు. ‘‘దాండీ పనిచేసే సహాయకులు ఎడమవైపునా, నేసేవారు కుడివైపునా ఉంటారు,’’ అని ఆమె వివరించారు. నేయబోయే పటోలు రకాన్ని బట్టి పడుగు లేదా పేక లేదా రెండిరటికీ ముందుగానే అద్దకం వేసిన దారాలను కూర్చడమే దాండీ పని చేయటమంటే. ఒక్కో వస్త్రాన్నీ నేయటానికి పట్టే సమయాన్నీ, వెచ్చించే శ్రమశక్తినీ చూసినప్పుడు ఆ ప్రక్రియ చాలా సాంద్రమైనదిగా ఉంటుంది. అయితే రేఖా బెన్‌ తన పనితనంతోనూ, కౌశలంతోనూ ప్రతి పనిని సునాయాసంగా చేస్తున్నట్టు కనిపించేలా చేస్తారు. కష్టతరమైన నేత ప్రక్రియ అంతా ఆమె కళ్ళలోని ఒక మాంత్రిక స్వప్నాన్ని ఆమె వేళ్ళ చివరలు ఆవిష్కరిస్తున్నాయి తప్ప మరేమీ కాదనిపిస్తుంది.
సింగిల్‌ ఇక్కత్లో డిజైన్‌ పడుగుపైనే ఉంటుంది. డబుల్‌ ఇక్కత్లో పడుగూ పేకా రెండిరటికీ డిజైన్‌ ఉంటుంది,’’ అంటూ రెండు రకాల పటోలా లోని బేధాలను వివరించారామె. ఈ రెండు రకాలను వేరుచేసేది డిజైన్‌. రaాలావాడ్కు చెందిన పటోలా సింగిల్‌ ఇక్కత్‌ రకానికి చెందినది, దీనిని బెంగళూరు నుండి వచ్చే సన్నని పట్టుతో తయారుచేస్తారు. అయితే పాటణ్‌ నుండి వచ్చే డబుల్‌ ఇక్కత్లను అస్సామ్‌, ఢాకా లేదా ఇక్కడి నేతకారులు చెప్తున్నట్టుగా ఇంగ్లండ్‌ నుంచి వచ్చే మందమైన పట్టును ఉపయోగించి నేస్తారు. ఇక్కత్‌ అని పిలిచే ముడివేసి, అద్దకం వేసే సంక్లిష్ట ప్రక్రియను భారతదేశమంతటా తెలంగాణా, ఒడిశా రాష్ట్రాల వంటి అనేక ప్రాంతాల్లో ఆచరిస్తున్నారు. ఏదేమైనా, గుజరాత్‌ నుండి వచ్చిన పటోలా విశిష్టతకు దాని భౌగోళిక స్థానమే కాకుండా, దాని సంక్లిష్టమైన, స్పష్టమైన డిజైన్లు, పట్టులో వైవిధ్యభరితమైన రంగులు కారణం. తయారైన ఉత్పత్తులు ఖరీదైనవి, రాచరిక పోషణ చరిత్రను కూడా కలిగివున్నాయి.
పడీ పటోలే భాత్‌, ఫాటే పణ్‌ ఫీటే నహీ – పటోలా డిజైన్‌, అది చిరిగిపోయినప్పుడు కూడా వెలిసిపోదు – అని ప్రసిద్ధ గుజరాతీ సామెత. పటోలా డిజైన్‌ ఎలా తయారుచేశారనేది మరో సంక్లిష్టమైన కథ. దాని గురించి మరోసారి చెప్పుకుందాం.
రేఖా బెన్‌ తన భర్త ఇంటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆమె జీవితం అంత సజావుగా ఏమీ సాగలేదు. ఆమె నేతపని చేయడం మానేసి చాలాకాలం అయింది. ఆ నైపుణ్యాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. ‘‘నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను, కానీ పని విషయంలో ఎవరూ నాపై నమ్మకముంచలేదు,’’ అని ఆమె చెప్పారు. ‘‘సోమాసర్కి చెందిన జయంతి భాయ్‌ నాకు నిర్ణీత కూలీ ఇచ్చే పద్ధతిలో ఆరు చీరలు నేసే పని ఇచ్చాడు. కానీ నేను నాలుగేళ్ళ విరామం తర్వాత తిరిగి పని మొదలుపెట్టాను కాబట్టి, ముగింపు అనుకున్నంత బాగా రాలేదు. నా పని ఆయనకు ముతకగా అనిపించింది, నాకు మరొక అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవాడు,’’ రేఖా బెన్‌ నిట్టూర్పుతో నేతపని కానిస్తూనే చెప్పారు. ఇది మొత్తం నమూనాకు కీలకమైన పడుగు ఖచ్చితమైన అమరికకు భంగం కలిగించిందేమోనని నేను అనుకున్నాను.
పని ‘అడగాలా వద్దా’ అనే మీమాంసతోనే రోజులు గడచిపోయాయి. పేదరికపు నీడలు చిక్కగా పరచుకున్నాయి. పని కోసం అడుక్కోవాలంటే రేఖా బెన్‌ ఎంతమాత్రం సందేహించరు, కానీ డబ్బులు అడగాలంటే మాత్రం స్వాభిమానం అడ్డుపడుతుంది. నేను మా ఫుయి కొడుకు మేనత్త కొడుకు మనూభాయ్‌ రాథోడ్తో మాట్లాడాను. అతను కొంత పని ఇచ్చాడు. నా పనిలో కొంత మెరుగుదల ఉంది. అతనికి నచ్చింది. ఒక ఏడాదిన్నరకు పైగా నేను కూలి డబ్బులు తీసుకొని నేతపని చేసే శ్రామికురాలిగా పనిచేశాను. అది సింగిల్‌ ఇక్కత్‌, నాకు ఒక పటోలా చీర నేసినందుకు 700 రూపాయలు వచ్చేవి,’’ అని రేఖా బెన్‌ గుర్తు చేసుకున్నారు. ‘‘మా వదిన గోపాల్‌ భాయ్‌ భార్య నేను కలిసి పనిచేసినప్పుడు ఒక చీర నేసేందుకు మాకు మూడు రోజులు పట్టేది.’’ ఆ రోజుల్లో కేవలం నేత పనికి రోజులో పది గంటల సమయం పట్టేది, కానీ మిగిలిన పనులు చేయటానికే చాలా గంటల సమయం పట్టేది. నిరంతర పోరాటంతో నిండిన జీవితం ఆమెకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ‘‘నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే నేను సొంతంగా నా పని చేసుకుంటేనే మంచిదని నాకనిపించింది. ముడి సరుకులు కొన్నాను, బయట తయారు చేసిన మగ్గాన్ని తెచ్చుకున్నాను. మగ్గం సిద్ధం కాగానే, పడుగులను ఇంటికి తెచ్చుకొని నేతపని మొదలుపెట్టాను,’’ గట్టిగా శ్వాస తీసుకుని చెప్పారామె. ‘‘ఆర్డర్లు తీసుకొని కాదు,’’ సగర్వంగా నవ్వుతూ అన్నారామె. ‘‘నేను నా సొంత పటోలా నేయటం మొదలుపెట్టాను. ఇంటి దగ్గర నుండే వాటిని అమ్మాను కూడా. నెమ్మదిగా నేను ఉత్పత్తిని పెంచాను.’’ అది నిజంగా చాలా అసాధారణమైన కార్యం – దుర్బలత్వం నుండి స్వతంత్రానికి ఒక ముందడుగు. అయితే, డబుల్‌ ఇక్కత్‌ నేతపై పరిజ్ఞానం, పట్టు లేకపోవటమొక్కటే ఆమెను బాధించే విషయం.
‘‘చివరకు నేను మా పెదనాన్న దగ్గర ఒక నెలన్నర పాటు శిక్షణ తీసుకున్నాను,’’ అన్నారామె. ఆమె కుమార్తె ఇంకా చిన్నపిల్లే, 4వ తరగతి చదువుతోంది. ఆమె అత్తగారి కుటుంబం వైపునుంచి ఎలాంటి సంబంధాలు లేకపోవటంతో ఆమెపై అర్థిక భారం ఇంకా చాలా అధికంగానే ఉంది. కానీ రేఖా బెన్‌ దృఢ నిశ్చయం కలిగినవారు. ‘‘నేను పొదుపు చేసినదంతా ముడి పదార్థమైన పట్టు దారాన్ని కొనడానికే వెచ్చించాను. నేను నా సొంతంగానే పదహారు పటోలాలకు సరిపడేలా డిజైన్లతో కూడిన దారాన్ని సిద్ధం చేసుకున్నాను,’’ అని చెప్పారామె. ‘‘ఈ పని చేయడానికి నీకు కనీసం ముగ్గురు మనుషులు కావాలి, అయితే ఇక్కడ ఉన్నది నేనొక్కదాన్నే. నేను గందరగోళ పడ్డాను. పసీ విచార్యూ జే కరవాణు ఛే ఎ మరజ్‌ కరవాణు సే. మన్‌ మక్కమ్‌ కరీ లిధు పసీ (అయితే, చేయవలసినవేవో చేయడానికి ఇప్పుడు నేను మాత్రమే ఉన్నానని నాకు నేను చెప్పుకున్నాను. నా మనసును సిద్ధపరచుకున్నాను).’’ అయితే, కొన్నిసార్లు ఆమెకు సహాయం అవసరమైనప్పుడు ఆమె సముదాయానికి చెందినవారు సహాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు: రంగు వేసిన పడుగు దారాలను ఒక పూత గంజిని పూసి దానికి బలాన్నివ్వడానికి వీధిలో రెండు స్తంభాలను పాతి, వాటికి ఈ పడుగు దారాలను చుట్టడానికి, గంజి పెట్టిన పడుగు దారాలను దండెకు చుట్టడానికి, ఆ దండెను మగ్గానికి బిగించడానికి, దండెకు చుట్టిన దారాలను ఫెణ్‌ (హెడిల్‌) గుండా సరైన క్రమంలో పోయేలా చూడటానికి (ఈ ప్రక్రియను స్లేయింగ్‌ అంటారు), చేతిమగ్గాన్ని నేతపనికి సిద్ధంగా ఉంచటానికి – ఆమెకు సాయపడేవారు.
దారాలకు ఒక పూత గంజిని పూయటం కొంచం నేర్పుతో కూడుకున్న పని. ఎక్కువైన పిండిని నిర్లక్ష్యంగా దారం మీదే వదిలేస్తే, అది మగ్గంలోకి ఎలుకలనూ బల్లులనూ ఆకర్షిస్తుంది. ‘‘డబుల్‌ ఇక్కత్‌ నేయటం సులువేమీ కాదు. నేను తప్పులు చేశాను. పడుగూ పేకల దారాల అమరికలో తప్పులు చేయటం వంటివి. అది ఎలా చేయాలో చెప్పించుకోవడానికి నేను బయటి నుంచి మనుషులను పిలవాల్సి వచ్చేది. మనం ఒక్కసారి పిలిస్తే ఎవరూ రారు. నాలుగైదు సార్లు వెళ్ళి వాళ్ళను బతిమాలాల్సి వచ్చేది. ఆ తర్వాత అంతా సరైపోయింది!’’ ఆమె నవ్వులో అనిశ్చితి, భయం, తికమక, ధైర్యం, మొండిపట్టులతో కూడిన సంతృప్తి ఉంది. ‘అంతా సరైపోయింది’ అంటే పడుగు దారాలు పేక దారాలతో చక్కగా అమరిపోయాయనీ, ఇది బట్టపై ఎలాంటి లోపంలేని నమూనా వచ్చేలా చేస్తుందనీ. అలా లేకుంటే పటోలు కొనుగోలుదారుల కంటే తయారీదారులకే ఎక్కువ ఖరీదైనదిగా తేలుతుంది. సంక్లిష్టమైన డబుల్‌ ఇక్కత్‌ పటోలా ఒకప్పుడు పాటణ్‌ నుంచి మాత్రమే వచ్చేది. ‘‘పాటణ్‌ నేతకారులు పట్టును ఇంగ్లండ్‌ నుంచి తెచ్చుకుంటారు, మేం బెంగళూరు నుంచి తెచ్చుకుంటాం. చాలామంది వ్యాపారులు రాజ్కోట్‌ నుంచి, సురేంద్రనగర్‌ నుంచి పటోలా కొని వాటిపైన పాటణ్‌ ముద్ర వేసుకుంటారు,’’ తన అనుభవంతో చెప్పారు. అదే గ్రామానికి చెందిన విక్రమ్‌ పర్మార్‌ అనే 58 ఏళ్ళ నేతకారుడు. ‘‘వాళ్ళు మా దగ్గర యాభై, అరవై, డెబ్బై వేల రూపాయలకు కొంటారు, వాటిని చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. వాళ్ళు కూడా వీటిని నేస్తారు కానీ, ఇలా కొనటం వారికి చవక,’’ అన్నారు విక్రమ్‌. రaాలావాడ్‌ పటోలా ను కొని దానిపై పాటణ్‌ ముద్ర వేసి పెద్ద పెద్ద నగరాలలో లక్షల రూపాయలకు అమ్మే సంగతిని ఈ గ్రామంలోని మరి కొంతమంది నేతకారులు కూడా చెప్పారు. ఇప్పటికి చాలా కాలంగా ఇది జరుగుతూ ఉంది. సుమారు 40 ఏళ్ళ క్రితం రేఖా బెన్‌ కంటే ముందు తరానికి చెందిన 70 ఏళ్ళ హమీర్‌ భాయ్‌ పటోలాను లీంబడీ తాలూకాకు తీసుకువచ్చారు.
‘‘అర్జన్‌ భాయ్‌ నన్ను భాయావదర్‌ నుంచి రాజ్కోట్కు తీసుకువచ్చారు,’’ లీంబడీలోని కటారీయా గ్రామానికి చెందిన హమీర్‌ భాయ్‌ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ఒకటి రెండు నెలల పాటు నేను ఒక కర్మాగారం నుంచి మరోదానికి మారుతూ వచ్చాను. ఒకసారి ఒక యజమాని నన్ను అడిగాడు: ‘చేవా సో?‘ (నీదే కులం?), నేను ‘వణ్కర్‌‘ అని చెప్పాను. ఇంకంతే. ‘కల్‌ థీ నో ఆవతా, తమారా భేగు పాణీ నాథ్‌ పివూ ‘ (రేపటి నుంచి రావద్దు, నువ్విచ్చే నీళ్ళు కూడా నేను తీసుకోలేను), అన్నాడు. ఆ తర్వాత పటోలా నేర్చుకుంటావా అని ఒకసారి మోహన్‌ భాయ్‌ నన్ను అడిగాడు. అలా రోజుకు ఐదు రూపాయలతో నేను మొదలుపెట్టాను. ఆరు మాసాల పాటు డిజైన్‌ చేయటమెలాగో నేర్చుకున్నాను, మిగతా ఆరు నెలలు నేయటమెలాగో నేర్చుకున్నాను,’’ చెప్పారతను. ఆయన కటారీయాకు తిరిగివచ్చి నేతపనిని కొనసాగించారు, అనేకమందికి ఆ నైపుణ్యాన్ని అందించారు.
‘‘నేను గత యాభై ఏళ్ళుగా నేతపని చేస్తున్నాను,’’ మరో నేతరి పుంజా భాయి వాఘేలా చెప్పారు. ‘‘బహుశా నేను మూడో తరగతిలో ఉండగా నేతపని మొదలుపెట్టినట్టున్నాను. మొదట నేను ఖాదీ నేసేవాడిని. పటోలా తర్వాత వచ్చింది. మా పెదనాన్న నాకు పటోలా నేతను నేర్పించాడు. అప్పటినుండి నేనీ పనిని చేస్తున్నాను. మొత్తం సింగిల్‌ ఇక్కత్‌, ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది వేల రూపాయల ఖరీదుచేసేవి. మేం, భార్యాభర్తలం,’’ తన భార్య జసూ బెన్‌ వైపు చూపిస్తూ, ‘‘సురేంద్రనగరుకు చెందిన ప్రవీణ్‌ భాయికి పనిచేశాం. గత ఆరేడు నెలలుగా మేం రేఖా బెన్‌ కోసం పనిచేస్తున్నాం,’’ అన్నారాయన.
‘‘మేం మగ్గం దగ్గర ఆమె పక్కన కూర్చొని (దారాల అమరికలో సహాయంచేస్తూ) పనిచేస్తే, మాకు రోజుకు 200 రూపాయలు వస్తాయి. కొన్ని చిన్న చిన్న డిజైన్లు ఉండే పని చేసినప్పుడు మాకు 60 నుంచి 70 రూపాయలు వస్తాయి. మా అమ్మాయి ఊర్మిళ దారానికి అద్దకం వేసే పని చేయటానికి రేఖా బెన్‌ ఇంటికి వెళ్తుంది. ఆమెకు రోజుకూలీగా 200 రూపాయలు వస్తాయి. అన్నీ కలుపుకొని మేం ఇల్లు గడుపుకోగలుగుతున్నాం,’’ అన్నారు జసూ బెన్‌. ‘‘ఈ మగ్గం గిగ్గం అన్నీ రేఖా బెన్వే,’’ టేకు చెక్కతో చేసిన చట్రాన్ని తడుతూ చెప్పారు పుంజా భాయి. మగ్గం ఒక్కటే 35-40000 ఖరీదు చేస్తుంది. ‘‘మాకున్నదంతా మా శ్రమశక్తి. అన్నిటినీ కలుపుకొని మేం నెలకు పన్నెండు వేల రూపాయలు సంపాదిస్తాం,’’ మాటల్లో తన పేదరికాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తూ చెప్పారు పుంజా భాయి. వ్యాపారం పెరగటంతో రేఖా బెన్‌ కొంత నేత పనిని పుంజా భాయికి అప్పగిస్తున్నారు. ‘‘నేను ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తాను,’’ అన్నారామె. ‘‘రాత్రి పదకొండు గంటలకు నిద్రపోతాను. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాను. ఇంటి పని చేయటం కూడా నా పనే. అలాగే బయటి పనులు, మా సముదాయంలోని వ్యక్తులతో సంబంధాలు నెరపటంతో సహా. మొత్తం వ్యాపారం కూడా నా నెత్తిపైనే ఉంటుంది.’’ రేఖా బెన్‌ పడుగు దారాలు చుట్టివున్న బాబిన్ను నాడె లోపలికి తోసి, నాడెను కుడివైపు నుండి ఎడమవైపుకు జరిపారు. నాడె కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి కదలడాన్ని, రేఖా బెన్‌ చెయ్యి పడుగునూ పేకనూ అమర్చటాన్ని, ఒక పరిపూర్ణమైన పటోలా రూపకల్పనను నేను మైమరచి చూస్తున్నాను. నా మనసులో కబీర్‌ ఇలా పాడుతున్నాడు:
పడుగూ పేకలు నాట్యమాడుతున్నాయి, పాతదైపోయిన కూఁచ్‌లి కూడా నాట్యమాడుతోంది, ఎలుక దారాన్ని కటకటా కొరికేస్తుండగా
కబీరు మగ్గాన్ని నాట్యమాడిస్తున్నాడు. దారాన్ని శుభ్రం చేసే ఒక మెత్తని కుంచె జైసుఖ్‌ వాఘేలా చేసిన సహాయానికిగాను రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/en/articles/the-warp-and-weft-of-rekha-bens-life-te/)
ఆగష్టు 5, 2024 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.