ఆ మధ్య ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అని మిత్రులు చాలామంది వారికి ఇష్టమైన పాటలను గుర్తుచేసుకున్నారు. కొంతమంది పాడి వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. మిగిలిన పోస్ట్‌లు ఏవీ పట్టించుకోకపోయినా పాట వినపడితే ఆగిపోతాను నేను. ఎందుకీ పాటలంటే ఇంత పిచ్చి అని ఆలోచించుకుంటే అర్ధమయింది పాట జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమో.
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి మా ఇంట్లో ఉన్నది ముగ్గురమే… అమ్మ, అక్క, నేను… రెండు పోర్షన్‌ల తాటాకు ఇంట్లో కనీస సౌకర్యాలు తప్ప టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఏవీ ఉండేవి కావు. అప్పట్లో వేసవి కాలం కరెంటు కోతలు ఎక్కువ. మా రేపల్లె సముద్ర తీరప్రాంతం కావడంతో విపరీతమైన ఉక్కపోత ఉండేది ఇంట్లో ఉంటే. అందుకే కరెంటు పోగానే ఇంటి ముందు వసారాలో చాపలు పరుచుకుని అక్కడ చేరేవాళ్ళం ముగ్గురం. అంత్యాక్షరి ఆడుకోవడం, లేదంటే అమ్మతో ఆపకుండా పాటలు పాడిరచుకోవడం.
‘‘నేరుతునో లేదో ప్రభూ నీ పాటలు పాడ…. ’’ అని అమ్మ మొదలు పెట్టగానే ఇక నాన్ స్టాప్‌గా మేము అడగడం, ఆమె పాడటం.
‘‘రాగమందునురాగమొలికి రక్తి నొసగును గానము రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం
చెదిరిపోయే భావములను చేర్చి కూర్చును గానం జీవమొసగును గానం. మది చింతబాపును గానం’’ అని అమ్మ పాడుతుంటే చింతలన్నీ ఎటో పారిపోయినట్లే ఉండేది.
‘’నదిలో నారూపు నవనవలాడిరది మెరిసే అందములు మిలమిలలాడినవి
వయసు వయ్యారము పాడినవే పదేపదే’’ అంటే శీఅషవ ఎశీతీవ అంటూ పదేపదే పాడిరచుకుంటూనే ఉండేవాళ్ళం.
‘‘బ్రతుకే ఎలమావి తోట మదిలో మకరందపు తేట
అడుగడుగున పూవులబాట అనిచాటే కోయిల పాట’’
‘‘ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
నిదురపోయే రామచిలుక ఎగిరిపోతుందీ కల చెదిరిపోతుంది’’
‘‘నీకోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు తేలెనోయి గాలిపైన తీయనైన కోరికలు
చెరుపుకోకు నీ సౌఖ్యం, చేతులార ఆనందం మరలరాదు రమ్మన్నా మాయమైన ప్రేమధనం చిగురించదు మళ్ళీ వాడిచెడిన పూలవనం’’ ఇట్లా పాటల ప్రవాహం సాగుతూనే ఉండేది. ఎప్పటికప్పుడు అప్ టు డేట్‌గా ఉండి లేటెస్ట్ సినిమాలలోని పాటలు కూడా మాతో రాయించుకుని మరీ నేర్చుకునేది.
‘‘ఎటోపోయేటి నీలిమేఘం వర్షం చిలికి వెళదా ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలపించగా
అన్నివైపులా మధువనం పూలుపూయదా అనుక్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం’’ అని తీగసాగినట్లు పాడుతుంటే ఎవరికి చెవుల్లో అమృతం పోసినట్లు ఉండదు?
ఇద్దరు ఆడపిల్లలతో ఒంటరిగా జీవితాన్ని నెట్టుకురావాల్సిన బరువు ఎప్పుడూ ఆమెలో కనపడలేదు. కనీసం మా ముందు ఎప్పుడూ ఙబశ్రీఅవతీaపఱశ్రీఱ్‌వ చూపించలేదు. మమ్మల్ని చదివిస్తూనే తాను కూడా డిగ్రీ పూర్తిచేసింది. లా చదివింది. బడి మొదలుపెట్టి ఒక మోడల్ స్కూల్ లాగా నడిపింది (ఈ బడి పాటలు ఇంకొక సారి రాస్తాను). ఇలా ఉరుకుల పరుగుల జీవితంలో మేము కాలేజీ చదువుకొచ్చి ఆమెకు కొంత వెసులుబాటు వచ్చాక రోజూ రిక్షా వేసుకుని వెళ్లి మరీ కొన్నాళ్ళు సంగీతం నేర్చుకుంది. అప్పటి నుండి ఇక మా టాస్క్ వాళ్ళ గురువు గారు చెప్పిన పాటలు పుస్తకంలో రాసి పెట్టడం, ఆమె పాడి మాకు వినిపించడం
‘‘ఇది ఒకటి హరినామమింతైన చాలదా… చెదరికీ జన్మముల చెరలు విడిపించ… మదినొకటి హరినామ మంత్రమిది చాలదా…
పదివేల నరకకూపముల వెడలించ’’ అంటూ పుస్తకం ఎదురుగా పెట్టుకుని పాడుతుంటే ఇదొక్క పాట చాలదా అన్నట్లు ఉండేది.
‘‘ఉదయాస్త శైలంబు లొనరగంభములైన ఉరుమండలము మోసెనుయ్యాల
అదననాకాశపధమడ్డదూలంబైన అఖిలంబునిండేనీ ఉయ్యాల’’ అంటే అఖిలంబు ఏమో కానీ మనసు నిండిపోయేది.
కొన్నేళ్ళు ఇదే మాకు కాలక్షేపం, ఇదే వ్యాపకం. పుస్తకాలు నిండిపోయేట్లు పాటలు రాసిపెట్టడం, అమ్మతో పాడిరచుకోవడం.. కొన్నేళ్ళకు అక్క పెళ్ళయ్యి వెళ్ళిపోయింది. చదువుకోసం నేను హైదరాబాద్ వచ్చేసాను. ఎవరి జీవితాలలో వాళ్ళం తలోచోట ఉండిపోయాం. కానీ అమ్మ పాట మాతోనే ఉంది. ‘‘బ్రతుకును బాటను కడదాకా… నడిచే పోవలె ఒంటరిగా… ఇడుములు రానీ పిడుగులు పడనీ… నీ అడుగులు తడబడునా… ‘‘ అని అమ్మ అడుగుతున్నట్లే ఉంది.
అమ్మతో మా పాటల ప్రయాణం గురించి రాసాను కదా. ఇక మా బడిలో పాటల గురించి కూడా కొంచెం చెబుతాను. మా బడి అంటే మేము చదువుకున్న బడి కాదు. నేను ఆరో తరగతికి వచ్చేసరికి అమ్మ మా రెండు పోర్షన్‌ల తాటాకు ఇంట్లోనే ఐదవ తరగతి వరకు బడి మొదలుపెట్టింది (తర్వాత సంవత్సరాల్లో పది వరకూ కూడా నడిపింది). మేము ఉండే గదులు కూడా రాత్రి పడుకునేందుకు, ఉదయాన్నే వండుకునేందుకే. మధ్యలో అంతా అవి కూడా క్లాసురూమ్ లే. మా శాంతినికేతన్ మొదలయినప్పటి నుండి పొద్దున్నే లేచి తయారయ్యి మా పక్కదుప్పట్లు అన్నీ అలమరలలో కనపడకుండా దాచేయాలి. ఈ లోపు అమ్మ వంట చేసి మా బాక్స్‌లు సర్ది ఇచ్చి వంట సామాన్లు, వండిన పదార్ధాలు కూడా అలమరలలో సర్దేసేది. అక్కడ కూడా క్లాస్ జరగాలి. పిల్లలంతా వచ్చేసరికి అమ్మ తయారయ్యి ఆఫీస్ రూమ్‌లో కూర్చుని ఉండేది. అందరూ రాగానే దాదాపు గంటసేపు అసెంబ్లీ జరిగేది. అసెంబ్లీలో ప్రార్ధనాగీతం వంటి వాటితో పాటు ప్రతిరోజూ పిల్లలంతా కలిసి ఏదో ఒక్క పాటను సాధన చేయాలి. నెలకొక పాటను మాస గీత్ అని ఎంపిక చేసేది అమ్మ. ఆమె ఒక్కో లైన్ పాడుతుంటే పిల్లలు కూడా అలాగే పాడాలి. ఆ నెల అయేసరికి బడిలో పిల్లలందరికీ ఆ పాట వచ్చేసేది.
‘‘స్వతంత్ర భారత జననీ నీకిదె నితాంత నవనీరాజనము అశేష పూజా శిరీషములతో అగణిత నరనారీజనముతో’’
‘‘వినీల గగనపు వీధులు తాకెడి వింధ్యాహిమాచల గిరిధారీ విశ్వవ్యాపిని విమల రూపిణి విజయభారతికి సుతులమమా’’
‘‘కల్పతరువు భరతభూమి ఘనత నీవు పాడరా కర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా’’
‘‘శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు.. వరలినది ఈ భారతఖండము భక్తిపాడర తమ్ముడా’’ వంటి దేశభక్తి గీతాలే కాదు
‘‘మంచిచెడ్డలొక్క పాదు నుంచి పుట్టి పెరిగెరా వెలుగుచీకటొక్కటిగా వెనువెంటనె తిరిగెరా
బుద్ధిజీవి సద్ది జీవి భూమి పొంటే మరిగెరా జ్ఞానము అజ్ఞానమంత అడుగడుగున జరిగెరా’’
‘‘కూలీ, రైతు, మేధావీ చేయి చేయి కలపాలి పల్లె పట్నం ఏకంగా ప్రగతిపధంపై నడవాలి’’ వంటి అభ్యుదయ గీతాలు కూడా పిల్లల గొంతుల్లో మా ఇల్లు దాటి వీధంతా ప్రతిధ్వనిస్తుండేవి.
ఇక ఈ రోజువారీ పాటలు ఇలా సాగితే ఏడాదికో సారి జరిగే వార్షికోత్సవ పాటల ఎంపిక ఒక పెద్ద ప్రక్రియ. వార్షికోత్సవానికి తేదీ నిర్ణయం రెండు నెలల ముందే జరిగేది. ఇక అప్పటి నుండీ మా ఇంట్లో ప్రతిరోజూ హడావిడే. ఒక స్వాగత గీతం, ఒక సాంప్రదాయ నృత్యప్రధానమైన గీతం, ఒక జానపద గీతం, ఒక దేశభక్తి గీతం ఇలా రకరకాల పాటలు సెలెక్ట్ చేసేది అమ్మ. కొన్ని ప్రైవేట్ ఆడియో ఆల్బమ్స్ నుండి సేకరిస్తే, కొన్ని రాయించేది, కొన్ని తానే రాసేది. ఇలా పాటల ఎంపిక అయ్యాక ఇక ఒక ఆదివారం దిగేవారు హార్మోనిస్టు స్వరాజ్యలక్ష్మిగారు, తబలా వలిగారు, పాటలు పాడే సత్యనారాయణగారు, నటరాజ్ గారు, స్కూల్‌లో టీచర్లు. ఫిమేల్ వాయిస్‌లో పాటలు అమ్మే పాడేది. ఒక్కొక్క పాటను తీసుకుని ట్యూన్లు కట్టి పాడి బోలెడు సార్లు ప్రాక్టీస్ చేసి టేప్ రికార్డర్‌లో రికార్డు చేసేవారు. స్వరాజ్యలక్ష్మిగారు మంచి విద్వత్తు ఉన్న మహిళ. ఏదో సినిమాలో కూడా నటించిందని అమ్మ చెప్పేది. పర్ఫెక్ట్ అనుకునే దాకా రికార్డు చేయనిచ్చేది కాదు ఆమె. ఇలా రెండు వారాంతాల పాటు కష్టపడి సెలెక్ట్ చేసిన పాటలన్నీ రికార్డు చేసి టీచర్లకు, పిల్లలకు అప్పచెప్పేవాళ్లు. ఇక పిల్లలు టేప్ రికార్డర్‌లో ఆ పాటలు పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటిలా సినిమా పాటలు పెట్టి నడిపేసిన రోజులు కావవి.
‘‘రావనా చందనాలో ఎన్నెలా రాజా నీకొందనాలో ఎన్నెలా’’
‘‘ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సింగారమా, ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గాజుల వయ్యారమా’’
‘‘కొనగోమ్మలూగినాయి గోవులే గెలిచినాయి ఆడొత్త జానకీ కోడిపందెము ఆడి గెలిచొత్త జానకీ కోడిపందెము’’
‘‘దేశమ్ము నీ సొమ్మురా, కాపాడుకో తమ్ముడా, తల్లి కీర్తి వైజయంతి క్రిందకి దిగుతుందిరా’’ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పాటలు, గేయ నాటికలు ఎన్నో ఉన్నాయి.
‘‘గుట్టగుట్ట తిరిగినాడే హోళీ చెమ్మకేళీ గుట్టమీద కెక్కినాడే హోళీ చెమ్మకేళి’’ అనే పాటైతే హోలీ పండగకి ముందు ఇంటికి వచ్చి నాట్యం ఆడే లంబాడీ స్త్రీల దగ్గర నేర్చుకుంది అమ్మ. వాళ్ళ దగ్గరే డాన్స్ స్టెప్‌లు నాకు నేర్పించి బడిలో పిల్లలకి నేర్పమంది. మా వార్షికోత్సవ ప్రక్రియ మొత్తానికి ఒక శీపంవతీఙవతీ ఉండేవారు. మా ఊరి దగ్గరలో ఉండే కూచినపూడిలో రవి విద్యానికేతన్ అనే బడి నడిపే కోటేశ్వరరావు మాస్టారు. మా శాంతినికేతన్ వార్షికోత్సవ ప్రిపరేషన్ ప్రారంభం అయిన దగ్గర నుండి ఆయన కూడా తరచుగా వచ్చి అవే పాటలను వాళ్ళ బడి వార్షికోత్సవంలో ప్రదర్శించేవారు. అందుకోసం ఆయన ఈ రిహార్సల్స్ అన్నీ దగ్గరుండి చూసేవారు. ఇప్పుడు మా బడి లేదు. సంయుక్తంగా గొంతెత్తి రాగాలు తీసే పిల్లలు లేరు. కానీ మా బడి నుండి బయటకు వెళ్లి ఎక్కడెక్కడో స్థిరపడ్డ పిల్లలెవరూ బడి నేర్పిన పాటలను మర్చిపోరనే అనుకుంటాను.
‘‘సూర్యునీ వెలుతురుల్ సోకునందాక, ఓడలా జెండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూస్థలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీతెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ భారతము’’
మా వీధి మొత్తాన్ని పాటలతోనే మేల్కొల్పిన మా బడి పిల్లల పాటల గురించీ అమ్మ, అక్క, నేను కలిపి పాటలతో వెలిగించుకున్న రాత్రుల గురించీ రాసాను కదా. ఇక మా పాటల ప్రయాణంలో మాతో కలిసి నడిచిన మరొక బృందం ఉంది. మా అమ్మ స్నేహితులు. బడి మొదలుపెట్టి కాస్త కుదురుకున్నాక, మేము పై చదువులకి వచ్చాక అమ్మకి కాస్త వెసులుబాటు దొరికింది. ఇక అప్పటి నుండి ప్రతి రెండవ శనివారం మా ఇంట్లో ఒక పాటల పండగ జరిగేది. రెండో శనివారం అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేసిన దగ్గర నుండి అమ్మ మిత్రబృందం మా ఇంట్లో చేరేవారు. మా ఇంటి ఎదురుగా ఉండే కృష్ణవేణి గారితో పాటు అమ్మ స్నేహితులు ఛాయగారు, విజయగారు, జగన్మోహనరావు మాష్టారు, నటరాజ్‌గారు ఇంకా అప్పుడప్పుడు వచ్చే మరికొందరు. ఈ మీటింగ్‌లకు వేరే అజెండా ఏమీ ఉండేది కాదు. నోటికొచ్చిన పాటలు పాడుకోవడమే. ఊరికే పాడుకుంటే మజా ఉండదని తబలా వాయించే వలి గారిని కూడా పిలుచుకునేవారు. నాలుగైదు గంటల పాటు పాటల ప్రవాహమే ఆ రోజు ఇక. కృష్ణవేణి ఆంటీ భక్తి గీతాలు పాడుతుంటే ఛాయ ఆంటీ తన అద్భుతమైన గొంతుతో జయదేవుని అష్టపదులు పాడేది. ‘‘సావిరహే తవదీనా రాధా’’ అనీ, ‘’చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ, కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ’’ అని ఆమె పాడుతుంటే వీణ మీటినట్లు తీయగా ఉండేది. ఎన్నో అరుదైన ప్రైవేట్ సాంగ్స్ వచ్చు ఆంటీకి. ఆమెది మా ఊరికి కొంచెం దూరాన ఉండే నల్లూరు. అక్కడ నుండి కూడా ఊరికే ఇలా పాటలు పాడుకోవడానికి వచ్చేవారామె. ‘‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసీ విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరైకారగ కట్నపు జ్వాలలో సమిధయిపోయావా’’ అని ఛాయా ఆంటీ ఎన్నిసార్లు పాడినా అన్నిసార్లూ కళ్లనీళ్లు పెట్టుకునేవాళ్ళం.
జగన్మోహనరావు గారిని అభినవ ఘంటసాల అనేవారు. ‘‘రాగమయీ రావే, అనురాగమయీ రావే’’, ‘‘శివశంకరీ శివానందలహరి’’ వంటి కఠినమైన గీతాలు కూడా ఆయన బజ్జీలు, పునుగులు తినేస్తూ అలవోకగా పాడేసేవారు. ‘‘ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా’’ అంటే అందరికీ వాణి జయరాం గుర్తొస్తారేమో కానీ మాకు మాత్రం మా నటరాజ్‌గారు గుర్తొస్తారు. ప్రతి మీటింగ్‌లో ఆయన ముందు ఈ పాట పాడాల్సిందే. జానపద గీతాలు కూడా అద్భుతంగా పాడతారు. ఇంకా మాబడి టీచర్‌గా పని చేసిన బాబురావు మాష్టారిది చావలి గ్రామం. అక్కడి భజన బృందాలతో కలిసి పాటలు పాడేవారాయన. ఆ పాటలు ఇక్కడ కూడా పాడుతుండేవారు. సినిమాపాటల శైలిలో భక్తి గీతాలు పాడటం మాస్టారి ప్రత్యేకత. ‘‘వానజల్లు గిల్లుతుంటే’’ పాట శైలిలో ‘‘చిన్నికృష్ణ మమ్ము బ్రోవ వేగమే రారా’’ అని నవ్వుకుంటూనే పాడేవారు. ‘‘అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడోయ్ మాధవుడు, తాళం శబ్దం చెవిలో పడగనే పరుగున వచ్చును కేశవుడు’’ అని తాళాలు పట్టించి మమ్మల్ని కూడా కూర్చోపెట్టి భజన పాటలు పాడిరచేవారు. మా చదువులు పూర్తయ్యి నేను ఉద్యోగంలో చేరాక కూడా వీళ్ళ శనివారపు సత్సంగాలు జరుగుతూనే ఉండేవి. నేను వెలుగు ప్రాజెక్ట్‌లో చేరినాక మొట్టమొదటిగా మాకు నేర్పింది వెలుగు ప్రార్ధనా గీతం. ‘‘జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేల పైకి దించుదాం’’ అని ప్రార్ధనాగీతం నేర్పిస్తుంటే ఇక్కడ కూడా మాకు పాటలతోనే మొదలు అనుకున్నా. ప్రార్ధనాగీతంతో ఆగిపోలేదు వెలుగు పాటల ప్రస్థానం. నిజంగానే ‘వెలుగు పాటలు’ అని ఒక పుస్తకం కూడా ఇచ్చారు మాకు. అది ఇంటికి పట్టుకుపోయి అందులో చాలా పాటలు అమ్మకి నేర్పించాను.
కమ్యూనిటీ మొబిలైజషన్ వెలుగు ప్రాజెక్టులో ఎంతో ముఖ్యం. ఊరిలోని పేదలందరినీ ఒక దగ్గరకు సమీకరించి వారి సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా అమలు చేయాల్సిన ప్రాజెక్ట్ అది. ఈ కమ్యూనిటీ మొబిలైజషన్ అంత తేలికగా సాధ్యమయేది కాదు. సాధారణంగా ఈ పని ఊరంతా భోజనాలు చేసే పడుకోబోయే వేళకి మొదలు పెట్టేవాళ్ళం. ఎక్కువ మందికి వీలయేది అదే సమయం కాబట్టి. పొద్దంతా ఎంత చెప్పినా పగలంతా పని చేసి అలిసిన మనుషులకి ఆ సమయంలో ఇలాంటి మీటింగ్‌లు అంటే ఇష్టపడకపోవడం సహజం. ఇలాంటి సందర్భాలలో మాకు ఉపయోగపడిన సాధనం పాట. కమ్యూనిటీ మొబిలైజషన్‌లో పాటకి ఉన్న ప్రాధాన్యతను గుర్తించబట్టే మా ప్రాజెక్ట్ నుండి కూడా మా అందరికీ ఒక టేప్ రికార్డర్, రేడియో, ఎమర్జెన్సీ లైట్ కలిసి ఉన్న ఒక multi-purpose పరికరాన్ని కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్‌లోని ప్రతి బృందంలో ఒకరైనా బాగా పాటలు పాడగలిగే సభ్యులు ఉండేవాళ్ళు. పంచాయితీ సహకారంతో ఒక మైక్ సెట్ ఏర్పాటు చేయించుకుని మేము అనుకున్న సమయానికి చిన్నగా పాటలు పాడటం మొదలు పెడితే ఒక్కొక్కరుగా ఊరంతా వచ్చి చేరేది.
సంఘాలలో మహిళలను చేర్పించడానికి, నెలకు కనీసం ముఫై రూపాయలు దాచుకునేలా ప్రోత్సహించడానికి వారికి అర్ధమయ్యేలా, సరదాగా వారిని ఆకట్టుకునేలా ‘‘రోజుకొక్క రూపాయి దాచుకోమంటేనూ దాచను పొమ్మంది మా వదిన, భలే డాబుసరిగుంటాది మా వదిన’’ అనే పాట పాడేవారు. ‘‘పేదవాడే నాయకుడవ్వాలి, పేద ప్రజలను పైకి తేవాలి’’ అని నాయకత్వం గురించైనా, ‘‘ఆడబొమ్మవో, అరటి ఆకువో, మల్లె తీగవో కావమ్మా, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన మూర్తివి నీవమ్మా’’ అని స్త్రీ సాధికారత గురించైనా, విషయం ఏదైనా, సమావేశం ఏదైనా, శిక్షణ ఏదైనా సరే పాటల పాత్ర చాలానే ఉండేది. అర్ధరాత్రుళ్ళ వరకు పని చేసి ఉండే మాకు అవే అలసట పోగొట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటో తెలుగో మరే భాషో అర్ధం కాకుండా ఉంది కదా. అది ఒడియా పాట. నేను ప్రాజెక్ట్‌లో చేరినాక పదిహేను రోజుల ఇండక్షన్‌కు శ్రీకాకుళం వెళ్ళాను. నేను బస చేసిన గ్రామాలన్నీ ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు. అక్కడ అత్యధికంగా ఒడియానే మాట్లాడుతున్నారు. స్కూల్స్‌లో కూడా ఒడియా మీడియంలో బోధన జరుగుతుంది.
నేను వెళ్ళిన ఒక ఊరిలో రాత్రి పూట గ్రామ సంఘం మీటింగ్ నిర్వహించింది. అక్కడి కమ్యూనిటీ కోఆర్డినేటర్ గ్రేస్. నాకు ఆ ఫీల్డ్ వర్క్, ఆ ప్రాంతం, ఆ మనుషులు అన్నీ పూర్తిగా కొత్త. అక్కడి మహిళలకు నేను కొత్తదానిని. అందరం ముడుచుకు పోయి ఉన్నాం ఏమీ మాట్లాడకుండా. మా పరిస్థితి చూసి గ్రేస్ వాళ్ళల్లో ఒకరిని ఏదైనా పాట పాడమని అడిగింది. అప్పుడు ఒక మహిళ ఒడియాలో పాడిన పాట ఇది. ఆమె పాడుతూ ఉంటే మిగిలిన వాళ్లలో కొంతమంది చీరకొంగుతో కళ్ళు తుడుచుకోవడం గమనించి ఆ పాట అర్థమేమిటి అని అడిగాను. అది తెలుగులో కూడా ఉంది అని తెలుగులో నాలుగు లైన్లు పాడిరది ఆమె. ‘‘ఆడపిల్లంటేనే లోకాన అలుసై పోయెనమ్మా.. ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందని నిలదీసి అడుగమ్మా’’ అని మొదలవుతుంది. అందరూ స్త్రీలే కాబట్టి చాలా కనెక్ట్ అయిపోయారు ఆ పాటకి. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. నాకు కూడా నచ్చి నేను రాసుకుంటాను అని అడిగాను. అప్పుడు వాళ్ళు పాడుతుంటే రాసుకున్న పాట ఇది. ఇలాంటి పాటలు నేను ప్రాజెక్టులో నేర్చుకున్నవి ఇంటిదగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ శనివారపు సమావేశాల్లో పాడిరచేది అమ్మ. గౌరునాయుడు గారు రాసిన ‘’పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతిపతాకం’’ పాటని మళ్ళీ మళ్ళీ పాడిరచుకుని కోరస్ ఇచ్చేవాళ్ళు అమ్మ మిత్రబృందం. ‘‘నా షోలాపూరు చెప్పులు బాబూ పెళ్ళిలో పోయాయి’’ అంటూ హాయిగా నవ్వుకున్న కాసేపటికే ‘‘కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి జేరెను మేని పసల్, హంసల జేరెను నడకల బెడగులుబీ దుర్గను జేరెను పూర్ణమ్మ’’ అంటూ ఏడిపించేసేవారు. ఇలా చిన్నతనం నుండి ఉద్యోగాలు, సంసారాల్లో స్థిరపడేవరకూ పాటలు మా జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం.
‘‘బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగా సాగాలి’’ అని కోరుకోకున్నా అత్యంత సంక్లిష్టమైన దారుల్లోనూ జీవితాన్ని పాటలాగే నడిపించిన అమ్మకి కృతజ్ఞతలు అంటే తక్కువే అవుతుందేమో…