అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

(గత సంచిక తరువాయి…)
2. యూనివర్సిటీలో నా ఆలోచనలు
1971లో నేను కోఠీలోని యూనివర్సిటీ వుమెన్స్‌ కాలేజీలో బీఎస్‌సీ (ఎంపీసీ)లో చేరాను. ఆ క్యాంపస్‌ చాలా అందంగా ఉండేది. కానీ అక్కడి ప్రధాన భవనాన్ని ఎప్పుడో 1798`1805 మధ్య హైదరాబాద్‌ సంస్థానంలో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా పనిచేసిన కర్నల్‌ జేమ్స్‌ అకిలెస్‌ కిర్క్‌పాట్రిక్‌ నిర్మించాడట. దాంతో నేను చేరేటప్పటికే ఆ భవనం చాలా వరకూ శిధిలావస్థకు చేరుకుంది.

కొన్ని తరగతి గదుల గోడలు పెచ్చులూడి వేలాడుతుండేవి. దూలాల నిండా లెక్కలేనన్ని పావురాలు. పైకప్పు చాలాచోట్ల లీకయ్యేది. అక్కడక్కడ కొంత భాగం కూలి కూడా పోతుండటంతో మమ్మల్ని అటువైపు వెళ్లనిచ్చే వారు కాదు. మా తరగతులన్నీ ఎక్కువగా వెనకవైపున ఉన్న, ఒకప్పటి ఏనుగుల శాలల్లో నిర్వహిస్తుండేవాళ్లు. మొదట్లో అసలా ప్రాంగణం మొత్తం 60 ఎకరాలకు పైగా విస్తరించి వుండేదట. మేం చదువుకునే నాటికి అది 42 ఎకరాలకు కుచించుకుపోయింది. భవనం మాట అటుంచి, అసలు నాకా కాలేజీ వాతావరణమే చాలా నిరాశాజనకంగా అనిపించేది. ఆడపిల్లలూ, మగపిల్లలంతా కలిసి హాయిగా చదువుకునే స్కూలు నుంచి వచ్చిన నాకు ఆ ఆడపిల్లల కాలేజీలో ఊపిరి ఆడనట్లుండేది. పైగా ఆ అమ్మాయిల్లోనూ రెండు గ్రూపులు. ఒకరంటే ఒకరికి పడకపోవటం లాంటిదేం లేదుగానీ ఏ గ్రూపు వాళ్లు ఆ గ్రూపుకే అతుక్కుపోయి ఉండేవాళ్లు. ముస్లిం అమ్మాయిలు బురఖాలు వేసుకుని వచ్చేవాళ్లు. కాలేజీ గేటు దగ్గరకు రాగానే వాటిని తీసి, దాచిపెట్టేసి చుట్టుపక్కల సినిమా థియేటర్లలో మార్నింగ్‌ షోలకు వెళ్లిపోయేవాళ్లు, లేదంటే కోఠీలోని తాజ్‌మహల్‌ హోటల్లో కూర్చునే వాళ్లు. నా అమాయకత్వానికి ఇదంతా కాస్త చిత్రంగానూ, చికాకుగా కూడా అనిపించేది` మగవాళ్ల చూపులను తప్పించుకోవాలనే అనుకుంటే ఆ అమ్మాయిలు ఇంట్లోనే వుండి పోవచ్చుకదా అనుకునేదాన్ని. అప్పట్లో నగరంలో ఉడిపి బ్రాహ్మలు నడిపే తాజ్‌మహల్‌ హోటళ్లు నాలుగు ఉండేవి, నాలుగూ వేటికవే ప్రత్యేకం. సికింద్రాబాద్‌ తాజ్‌ అంటే కుర్రకారుకు ప్రాణం. నారాయణగూడ తాజ్‌ యువ అభ్యుదయవాదుల అడ్డా. కోఠీలోని తాజ్‌ కేమో ఎక్కువగా అమ్మాయిలు వెళుతుండేవాళ్లు. ఇక అబిడ్స్‌ తాజ్‌ అన్ని రకాల వారితో ఎప్పుడూ కిటకిటలాడుతుండేది.
ఆ రోజుల్లో నా పరిస్థితి చెప్పాలంటే` తీర్పరితనం చాలా జాస్తిగా ఉన్న హిందూ ఆడపిల్లని! విషయం ఏదైనా సరే, చాలా వేగంగా నిర్ణయానికి వచ్చేసేదాన్ని. ఎక్కడైనా సరే అధికారాన్నీ, పెత్తందారీతనాన్నీ ఎదిరించాలంటే అందుకు` ప్రత్యక్షంగా సంఘర్షణకు దిగటం నుంచి సంప్రదింపులు, చర్చలు, తిరుగుబాటు వరకూ.. రకరకాల మార్గాలుంటాయని నాకు అప్పటికి తెలీదు. అది తెలుసుకోవటానికి చాలాకాలమే పట్టింది. తర్వాత్తర్వాతి కాలంలో నేను నక్సలైట్లలో చేరినప్పుడు నాన్న తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే` ఆయన దగ్గర స్వయంగా నేనీ సంప్రదింపులు, తిరుగుబాటు పంథాలనే అనుసరించాను. ఇక కాలేజీలో హిందూ అమ్మాయిలంతా ఎప్పుడూ క్లాసు పుస్తకాల్లోనే తలలు దూర్చుకుని కూర్చునే వాళ్లు. వేరే పుస్తకాలవైపు కన్నెత్తి కూడా చూసేవాళ్లు కాదు. ఇలా ఆ కాలేజీలో చదివిన ఏడాది కాలమూ నాకు పరమ దుర్భరంగా గడిచిందనే చెప్పాలి. హాయిగా ఐఐటీలో చేరాల్సిన దాన్ని, అనవసరంగా మా వాళ్లు అడ్డుపడి చెడగొట్టారని నెలల తరబడి బాధపడటం తప్పించి.. ఆ కాలేజీ రోజుల గురించి నాకు మరేం గుర్తు లేదు!
ఒకే ఒక్క ఊరట ఏమిటంటే, ఆ కాలేజీలో నాకు కొందరు బ్రాహ్మణేతరులు, సంప్రదాయాల పట్ల అంత పట్టింపుల్లేనివారు మంచి స్నేహితులయ్యారు. వారిలో తప్పకుండా చెప్పుకోవాల్సింది సుమీత్‌ సిద్ధు అనే సిక్కుల అమ్మాయి గురించి. తను చాలా నిరాడంబరంగా, స్థిరంగా వుండేది. బహిష్టు నొప్పులు నన్ను ఎక్కువగా బాధిస్తుంటే బలవంతంగా నా చేత కాస్త ఎక్కువ దూరం నడిపించి, అవి తగ్గిపోయేలా చేసేది. మా బృందంలో ఇంకా గీతా పటేల్‌, కిరణ్‌ మిర్‌చందాని కూడా వుండేవాళ్లు గానీ.. నేను ఒక్క సుమీత్‌ సిద్ధూతోనే చాలా ఏళ్ల పాటు స్నేహాన్ని కొనసాగించగలిగాను. మేం తరచూ ఆమె ఇంట్లోనే కలుసుకునేవాళ్లం. వాళ్లు ఆర్‌ఆర్‌లాబ్స్‌ (రీజినల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీస్‌) క్వార్టర్లలో ఉండే వాళ్లు. పెద్ద విశాలమైన ఇల్లు, దాంట్లో సుమీత్‌కు ప్రత్యేకంగా ఒక గది వుండేది. నా స్నేహితుల్లో చాలామంది కుటుంబాలు మాకంటే చాలా సంపన్నమైనవి, భిన్నంగా కూడా ఉండేవి. వాళ్లతో గడపటం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను కూడా. వాళ్ల ఇళ్లలో వ్రతాలు, తంతులు, మతపరమైన కార్యక్రమాల వంటివి దాదాపు ఉండేవి కాదు. బహుశా, వాళ్ల వర్గ నేపథ్యాలే అందుకు కారణం కావచ్చు. తల్లిదండ్రులతో వాళ్ల సంబంధాలు స్నేహపూర్వకంగా వుండేవి. సంప్రదాయాల బరువు, ఆ భారం మోయాల్సిన అవసరం లేకపోవటం వల్లనే కావొచ్చు, వాళ్లు స్వేచ్ఛాయుతంగా, కొంత హేతుబద్ధమైన జీవితం గడుపుతున్నారనిపించేది. ఉదాహరణకు, వాళ్లు అదే పనిగా ప్రతిరోజూ బట్టలు ఉతుక్కునేవాళ్లు కాదు, వాటిని బయట గాలికి ఆరేసే వాళ్లు. ఒక రోజు స్నానం చేయకపోతే వాళ్లింట్లో మిన్నేమీ విరిగి మీద పడదు. వాళ్లు తినే తిండి కూడా ఆసక్తిగా వుండేది. ఓ రోజు ఛోళే భతూరే తింటే, మరో రోజు అండా భుర్జీ, ఇంకో రోజు ఆలూ పరాఠా.. ఇలా వుండేది వాళ్ల మెనూ. భోజనం తర్వాత ఎప్పుడూ పాయసమే కాదు.. పుచ్చకాయ ముక్కలతో కస్టర్డ్‌, శ్రీఖంఢ్‌ లేదా చాక్లెట్‌ కేక్‌.. ఇలా రకరకాలుండేవి. వాళ్లు తమ బంధువుల్లో మగపిల్లలతో కూడా సన్నిహితంగా మెలిగేవారు. కానీ చాలా బ్రాహ్మణ కుటుంబాల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అన్నీ విభజనలే! మా ఇంట్లో అయితే అమ్మ ప్రతి రోజూ.. ‘ఏ మగాడినీ నమ్మొద్దు, చివరికి మీ సొంత తండ్రిని కూడా! పొరపాట్న ఎవరన్నా అబ్బాయి పక్కన కూర్చున్నారో మీకు గర్భం వచ్చేస్తుంది.. జాగ్రత్త’ అని మా ఐదుగురు బుర్రల్లోకీ ఎక్కించేస్తుండేది. ‘ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించుకుని, మీరు మీ సొంత కాళ్ల మీద నిలబడాలి’ అని చెబుతూనే ఉండేది.
ఎంత వైవిధ్యభరితమైన, ఆసక్తికరమైన స్నేహితులున్నప్పటికీ నాకా వుమెన్స్‌ కాలేజీ మాత్రం చాలా నిరాసక్తంగా వుండేది. మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికే నేనింక ఇక్కడ ఉండకూడదని గట్టి నిర్ణయానికి వచ్చేశాను. వేరే మార్గాలేం ఉన్నాయా అన్న వెతుకులాటలో నాకు ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీలో` బీఎస్సీ స్పెషల్‌ కోర్సు ఒకటి కనిపించింది. ఒక రకంగా అది ఆనర్స్‌ కోర్సు లాంటిది, ప్రధానమైన మూడు సబ్జెక్టులూ కష్టమైనవే. అయినా సరే, నాకు అదేం పెద్ద ఇబ్బందిగా కనిపించ లేదు. అప్పటికే నేను చదువుతున్న కెమిస్ట్రీని వదిలేసి స్టాటిస్టిక్స్‌ తీసుకోవాల్సి వచ్చినా లెక్కచేయకుండా నేను
ఉస్మానియా క్యాంపస్‌కు మారిపోయాను. సుమీత్‌ సిద్ధూ కూడా నాతో పాటు క్యాంపస్‌కి వచ్చేసింది. నాన్న కూడా అభ్యంతరం చెప్పలేదు` కానీ అక్కడ చేరిన తర్వాత మున్ముందు ఏం జరగనుందో లీలామాత్రంగా ఊహించగలిగినా ఆయన నన్ను వెంటనే చదువు మాన్పించేసే వాళ్లన్నది నిస్సందేహం!
నేను 1972లో ఉస్మానియా యునివర్సిటీలో.. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా బీఎస్సీ రెండో సంవత్సరం కోర్సులో చేరాను. ఓయూ క్యాంపస్‌ అందంగా మనసుని ఆవహించేసింది. విశాలమైన తరగతి గదులూ, పెద్దపెద్ద వరండాలూ, శుభ్రమైన బాత్రూములూ, ఎటుచూసినా బోలెడన్ని ఖాళీ ప్రదేశాలతో విస్తారమైన ప్రాంగణం` ప్రతి రోజూ క్యాంపస్‌కు వెళ్లాలంటేనే ఎంతో ఉత్సాహంగా వుండేది. విద్యార్థుల్లో అటు పల్లెల నుంచి, ఇటు పట్టణాల నుంచి వచ్చినవాళ్లు, అమ్మాయిల్లో బురఖాలు, లంగా వోణీలు, ట్రౌజర్లు వేసుకునే వాళ్లు.. ఇలా భిన్న రకాల నేపథ్యాల నుంచి వచ్చిన వారితో క్యాంపస్‌ చాలా ఆకట్టుకునేలా ఉండేది. ఎంతో కళాత్మకంగా ప్రాచీన శైలిలో నిర్మించిన ఆర్ట్స్‌ కాలేజీ, లైబ్రరీ భవనాలు చూపరులను కట్టిపడేస్తుంటే` మరోవైపు మా సైన్స్‌ కాలేజీ బిల్డింగు మాత్రం చాలా సాదాసీదాగా ఉండేది. బిల్డింగే కాదు, లోపల విద్యార్థులూ అంతే అనాసక్తంగా, ఎప్పుడూ పాఠ్యపుస్తకాల్లో తలలు దూర్చి కూర్చునేవాళ్లు. అదే ఆర్ట్స్‌ కాలేజీ వైపు చూస్తే అందమైన విద్యార్థినీవిద్యార్థులు, మేధావులైన లెక్చరర్లతో కళకళలాడిపోతుండేది. అక్కడి పిల్లలంతా విస్తృతంగా, రకరకాల పుస్తకాలు చదివేస్తుండే వాళ్లు. అప్పటికి నేను కేట్‌ మిలెట్‌, జర్మెయిన్‌ గ్రీర్‌, గ్లోరియా స్టెయినెమ్‌.. ఇలా చాలామంది ఫెమినిస్ట్‌ రచయితలను చదువుతున్నాను. నాలాంటి అభిరుచులు వున్న మిత్రులు ఎవరు దొరుకుతారా అని క్యాంపస్‌లో నా కళ్లు ఎప్పుడూ వెతుకుతూనే ఉండేవి.
సరిగ్గా నేను ఉస్మానియా యూనివర్సిటీలో చేరడానికి రెండు నెలల ముందు అక్కడ జరిగిన ఓ సంఘటన నా జీవిత గమానాన్నే మార్చేసింది. 14 ఏప్రిల్‌ 1972. ఆ రోజు అంతర్‌ కళాశాలల క్విజ్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేను మా కాలేజీ బృందంతో కలిసి ఉస్మానియా క్యాంపస్‌కు వెళ్లాను. సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో` మా పోటీలు జరుగుతున్న యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ భవనం ఎదురుగా విద్యార్థుల మధ్య ఏదో గొడవ మొదలైంది. వెంటనే నిర్వాహకులు వచ్చి మా క్విజ్‌ పోటీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ఒక విద్యార్థి హత్య జరిగిందట. ఎవరా విద్యార్థి అని ఆరా తీస్తే ‘జార్జి రెడ్డి’ అనే ఓ మొండిఘటం అని చెప్పారు. నేను అదేదో విద్యార్ధి గూండాల గొడవ ఏదో అనుకుని, పెద్దగా పట్టించుకోకుండా అక్కడ్నించి వచ్చేశాను. యూనివర్సిటీలో చేరిన తర్వాతే తెలిసింది.. జార్జిరెడ్డి అంటే ఎవరో, ఆయనను ఎందుకు చంపారో! 1960లలో ఉస్మానియా క్యాంపస్‌ మొత్తం భూస్వామ్య, పెత్తందారీ వైఖరులతో, కులమత వర్గాలుగా విడిపోయి, చిల్లర రాజకీయాలతో నిండిపోయింది. నేను చేరే నాటికి వీటన్నింటిలోనూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ముందుండేది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా పేరు మార్చుకున్న ఒకప్పటి జనసంఫ్‌ు పార్టీ విద్యార్థి విభాగమే ఈ ఏబీవీపీ. దాన్ని హిందూ అతివాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) నడిపిస్తుండేది, క్యాంపస్‌లో దీని వ్యవహారాలన్నీ కూడా నారాయణ్‌దాస్‌ అనే ఓ ప్రచారక్‌ ముందుండి నడిపిస్తుండేవాడు. జనసంఫ్‌ు ఆంధ్రప్రదేశ్‌లో వేరే ఎక్కడా బలంగా లేకపోయినా ఒక్క ఓయూ క్యాంపస్‌ను మాత్రం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది.
యూనివర్సిటీ దైనందిన పరిపాలనా వ్యవహారాల నుంచి పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాస్టళ్లు, పక్కనున్న బస్తీలు.. వీటన్నింటినీ కూడా ఈ మాఫియానే నియంత్రిస్తుండేది. అలాంటి సమయంలో జార్జి రెడ్డి వచ్చి వాళ్ల కబంధ హస్తాల పట్టు వదలగొట్టాడు. ఆయనా, ఆయనకున్న కొద్దిమంది అనుచరులూ కలిసి కొద్దిరోజుల్లోనే క్యాంపస్‌లో విద్యార్థులు` స్వేచ్ఛగా తమ అసమ్మతిని వ్యక్తం చేయగల వాతావరణాన్ని సృష్టించారు, ఓయూలో వామపక్ష విప్లవ విద్యార్థి ఉద్యమానికి బీజం వేశారు. ఆ రోజుల్లో వియత్నాం, క్యూబా, దక్షిణ అమెరికా, ఐరోపాల్లో పలుచోట్ల విప్లవ, విద్యార్థి ఉద్యమాలు ఎగసిపడుతూ యావత్‌ ప్రపంచాన్నీ ఉరకలెత్తిస్తున్నాయి. మరోవైపు మన దేశంలో నక్సల్బరీ. జార్జి రెడ్డి వీటన్నింటి నుంచీ స్ఫూర్తి పొందాడు. జార్జి రెడ్డి, ఆయన సహచరులంతా కలిసి ప్రగతి శీల విద్యార్థి కార్యాచరణ కోసం ‘ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌’ అనే విద్యార్థి సంఘాన్ని నెలకొల్పారు. తదనంతర కాలంలో అదే ‘ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (పీడీఎస్‌యూ)’గా రూపుదిద్దుకుంది.
తాము నిర్మించుకున్న కంచుకోట బీటలువారుతుండటం చూసి ఆగ్రహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ 1972 ఏప్రిల్‌ 14న క్యాంపస్‌లోని ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో, అదీ పోలీసుల సమక్షంలోనే జార్జి రెడ్డిని పొడిచి చంపేసింది. హత్యానేరం కింద తొమ్మిది మంది మీద కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత తొమ్మిది మందీ నిర్దోషులుగా విడుదలైపోయారు. హత్య విషయంలో రాజ్యం కూడా కుమ్మక్కవటంతో జార్జి సహచరులూ, ఆయన తమ్ముడు సిరిల్‌ ఇక న్యాయం కోసం, ప్రతీకారం కోసం పోరాటం తప్పదని నిశ్చయించుకున్నారు.
దాదాపు ఇదే సమయంలో భావసారూప్యం గల కొద్దిమంది యువకులతో నాకు స్నేహం కుదిరింది. వీరిలో నా క్లాస్‌మేట్‌, జార్జి రాజకీయాలను బలంగా సమర్థించే ప్రదీప్‌ బూర్గుల కూడా ఉన్నాడు. వాళ్ల అన్నయ్య బూర్గుల నర్సింగ్‌రావు తెలంగాణా సాయుధ పోరాట కాలంలో, విద్యార్థి కమ్యూనిస్టు రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. అతని సోదరి రమా మేల్కోటే కూడా వామపక్ష భావాలవైపు మొగ్గు చూపే ఉదారవాదే. ఇక స్కూలు రోజుల నుంచీ హై`వై ద్వారా నాకు మంచి స్నేహితులైన గోపాల్‌, శశి కూడా ఉన్నారు. వాళ్లిద్దరూ క్యాంపస్‌ విద్యార్థులు కాకపోయినా వైఎంసీఏకు చెందిన యూని`వై ద్వారా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈ యూని`వై అనేది హై`వైకు కొనసాగింపుగా, యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏర్పాటైన విభాగం. ప్రదీప్‌ కూడా వాళ్లకు సన్నిహితుడయ్యాడు. మేమంతా కలిసి ఓ చిన్న వామపక్ష బృందంలా తయారై.. క్యాంపస్‌లోని ఇతర బృందాలతో మాట్లాడుతుండే వాళ్లం. అందరం తరచుగా ఇరానీ కేఫుల్లో కలుసుకుని రాజకీయాల గురించీ, స్థానిక సంఘటల గురించీ చర్చించుకునే వాళ్లం. కలసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేవాళ్లం. నగరంలో ఎక్కడెక్కడో దూరంగా జరుగుతుండే మీటింగులకు కూడా నడుచుకుంటూ వెళ్లి హాజరవుతుండే వాళ్లం. ఎంతో ఆత్మీయంగా
ఉండే ఈ బృందం కొద్దిరోజుల్లోనే నన్ను అక్కునజేర్చుకుంది. గోపాల్‌ మంచి స్నేహశీలి, కొద్దిగా హడావుడి మనిషి. ప్రదీప్‌ ప్రశాంతంగా ఉంటాడు, ఆచితూచి అడుగేస్తాడు. శశి మేధావి, కాస్త అనూహ్యంగా కూడా ఉంటాడు. బయటి జీవితం తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ఈ మిత్రబృందం నాకు ఎంతగానో తోడ్పాటునిచ్చింది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం రంగుల మయంగా మారిపోయింది. ఈ ప్రపంచాన్ని మార్చడం సాధ్యమేనన్న ఆశలను రేకెత్తించే ఎన్నో పుస్తకాలు నాకు పరిచయమయ్యాయి. మేం తరచుగా కలిసి ఈ విషయాలను లోతుగా చర్చించుకునే వాళ్లం, నేనిలాంటి ఎన్నో సమావేశాలకు హాజరయ్యేదాన్ని. ఇదంతా కూడా చాలా ఉత్సాహంగా, ఆకట్టుకునేలా ఉన్న టీనేజీ మగ పిల్లలతో! ఈ సమయంలోనే జీవితంలో మొట్టమొదటి సారిగా నేను ప్రేమలో పడ్డాను. అలాగని మేం శారీరరకంగా ఎప్పుడూ దగ్గరకాలేదు. అసలు ఇలాంటి విషయాల్లో మా తరం ఎందుకంత కచ్చితమైన నియంత్రణలు పాటించేదో ఆలోచిస్తే నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. బహుశా, పెల్లుబుకుతున్న విప్లవ ఆకాంక్షలు మాలోని లైంగిక భావనలను, వాంఛలను తుడిచిపెట్టేశాయా? లేక కేవలం మా చుట్టుపక్కల ఉన్న ‘సభ్య’ సమాజం ప్రవచించే కట్టుబాట్లే ఇందుకు కారణమా? అన్నది ఇప్పటికీ నాకు అంతుబట్టదు. నేను ఇతరులతో కూడా సన్నిహితంగా వుండేదాన్ని, చివరికి నా జీవిత భాగస్వామిగా ఎవరవుతారా? అనీ ఆలోచిస్తుండేదాన్ని. లైంగికత గురించి ఎంతో ఉత్సుకతతో తెలుసుకునే వయసది. మా బృందంలోని యువకులంతా అతి జాగ్రత్తపరులు కావడం వల్ల చివరికి ఓసారి నేను బాగా ఇష్టపడే, నాకంటే పెద్దవాడైన వ్యక్తి వద్ద కోరికను వ్యక్తం చేశాను కూడా. అయితే, ఆయన చాలా సున్నితంగా తిరస్కరించేశాడు.
మేం 1971లో నాగపూర్‌లో జరిగిన ఒక యూత్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యాం. మా మొగ్గు వామపక్ష భావాల వైపే అయినా ఇతరత్రా అవకాశాలకు మేం తలుపులు మూసేసుకోలేదు. నాగపూర్‌ సమావేశానికి విమలా రామచంద్రన్‌, సంజయ్‌ బారు కూడా వచ్చారు. ఓ చిన్న చర్చాగోష్టిలో మేమందరం ఇందిరా గాంధీని కూడా కలుసుకున్నాం. విమలా, నేనూ ఒకే స్కూల్లో చదువుకున్నాం, తను హై`వై, యునీ`వై క్లబ్బుల్లో కూడా చురుకుగా వుండేది. తర్వాత తను విద్యా రంగంలో, ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ఆడపిల్లల చదువుల మీద ప్రత్యేక దృష్టిపెడుతూ చాలా కృషి చేసింది. సంజయ్‌ ఆర్థికశాస్త్రం చదువుకుని, పత్రికా రంగంలో పనిచేసేవాడు. ఆ తర్వాత ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు మీడియా సలహాదారుగా పని చేశాడు, ప్రధాని కార్యాలయంలో తన అనుభవాలతో ఒక పుస్తకం కూడా రాశాడు. 1971లోనే మేం బొంబాయిలో జరిగిన మరో యువజన కాంగ్రెస్‌ సమావేశానికి కూడా వెళ్లాం. కానీ అక్కడి విలాసవంతమైన ఏర్పాట్లు, భారీ ఖర్చులు చూసి చికాకుగా అనిపించింది. ముఖ్యంగా అందంగా తయారై, ‘యువ’ కాంగ్రెస్‌ నాయకుల వెంట తిరుగుతున్న అమ్మాయిలను చూశాక నాక్కాస్త వెగటుపుట్టింది. ఇలాంటి రాజకీయాలు నాకు సరిపడవని అర్థమయింది. ఈ నా కార్యకలాపాలన్నీ కూడా ఇంట్లో అమ్మానాన్నలకు తెలీకుండా చేసినవే. ఊళ్లో కార్యక్రమాలైతే క్లాసులు ఎగ్గొట్టి వెళ్లే దాన్ని. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడి సంస్థలేవో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయంటూ సైక్లోస్టైల్‌ మెషీన్‌ మీద నకిలీ ఆహ్వాన పత్రాలు తయారు చేసి, ఇంట్లో చూపించి, వాళ్లను ఒప్పించేదాన్ని.
ఆ రోజుల్లో నాకు గట్టిగా మాట్లాడతాననీ, ఏ విషయాన్నైనా ధైర్యంగా చర్చిస్తాననీ పేరుండేది. ట్రౌజర్లు వేసుకుని చాలా చెలాకీగా కూడా ఉండేదాన్ని. 1972లో జార్జి రెడ్డి తొలి స్మారక సమావేశాన్ని నిర్వహించమని నన్ను అడిగినప్పుడు.. వెంటనే, సంతోషంగా ఒప్పుకున్నాను. ఒక రకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అదే నా తొలి అడుగు అని చెప్పొచ్చు. ఆ రోజు నేను తొలిసారిగా వామపక్ష వాదుల తరఫున బహిరంగంగా, బలంగా నిలబడటంతో` అప్పట్నించీ నేను వారి గ్రూపులకు చెందిన దాన్ననే గుర్తింపు వచ్చింది. జార్జి రెడ్డినీ, ఆయన రాజకీయాలనూ అభిమానించే వారంతా అప్పుడప్పుడే సంఘటితమవుతున్నారు. అంతా ఉత్సాహవంతులు, మంచి చదువరులు, తెలివిగలవాళ్లు, ముఖ్యంగా జీవితంలో ఏదైనా అర్థవంతమైన పని చేయాలన్న తపన ఉన్న వాళ్లు! వీరంతా రాజకీయాల గురించి విస్తృతంగా చదివేవాళ్లు, లోతుగా వాడివేడిగా చర్చించే వాళ్లు. అప్పుడే నాకు చే గవేరా, రెజీస్‌ దె భై, డానియెల్‌ కాన్‌`బెండిట్‌, జాన్‌ పాల్‌ సార్త్ర్‌, నోమ్‌ చోమ్‌స్కీ వంటి వారి రచనలను పరిచయం చేశారు. నేను కారల్‌ మార్క్స్‌, లెనిన్‌లను చదవాలని ప్రయత్నించాను కానీ పెద్దగా ముందుకెళ్లలేకపోయాను. వారికంటే ఏంగెల్స్‌, ట్రాట్‌ స్కీ, పాల్‌ స్వీజీ, లియో హ్యూబర్‌మన్‌, క్లారా జెట్‌కిన్‌, రోసా లగ్జెంబర్గ్‌, ఎరిక్‌ ఫ్రామ్‌, ఇ.హెచ్‌.కార్‌లను చదవడం తేలిక అనిపించింది. అప్పట్లో నాకు చాలా సూటిగా, స్ఫూర్తిమంతంగా అనిపించిన రచయిత మావో. అంతా భారత రాజకీయాలను అర్థం చేసుకునేందుకు ఆర్‌.పి.దత్‌ రాసిన ‘ఇండియా టుడే’ చదవటం తప్పనిసరి అని చెబుతుంటే నేనా పుస్తకాన్ని మళ్లీమళ్లీ చదివాను. వీటితో పాటు నా ‘బూర్జువా’ పుస్తకాలనూ నేనేం వదిలిపెట్టలేదు. సోమర్‌సెట్‌ మామ్‌, జేన్‌ ఆస్టిన్‌, జేమ్స్‌ హెరియట్‌లను ఎప్పటికీ వదులుకోలేను. ఫిక్షన్‌ అంటే నాకు ప్రాణం!
1972`73 మధ్య కాలం ఎంతో ఉద్విగ్నంగా వుండేది. అప్పటి క్యాంపస్‌ వాతావరణం నన్ను ఆకట్టుకోవటమే కాదు, పూర్తిగా ఆవహించేసింది కూడా. నాకు వామపక్ష రాజకీయాలు ఎంతో అర్థవంతమైనవిగా, ఉత్కృష్టమైనవిగా అనిపించేవి. నేను చదువుకున్న పుస్తకాలు, పీడీఎస్‌యూ విద్యార్థులతో నిరంతరం జరిగే చర్చల ద్వారా వామపక్ష రాజకీయాల మీద నాకున్న ఆసక్తి మరింత బలపడిరది. ఈ సమయంలో నాకు మళ్లీ నిజంగా ఐఐటీలో చేరే అవకాశం ఇస్తానన్నా సరే, కచ్చితంగా వద్దని చెప్పేసేదాన్నే! ఒకరకంగా నా జీవిత లక్ష్యం ఏమిటో, గమనం ఎటో స్పష్టత వచ్చింది. ఓ పెను కెరటంలా ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టేస్తున్న నూతన, రాడికల్‌ ఉద్యమాలతో కలిసి కదం తొక్కుతున్న తరంలో నేనూ ఒక భాగస్వామిని. ఎక్కడెక్కడో పురుడుపోసుకుంటున్న ఆ తిరుగుబాట్లన్నీ సంఘటితమై, కలిసి కదిలితే.. దోపిడి, అణచివేత పునాదిగా ఉన్న మన సమాజాన్ని సమూలంగా తల్లకిందులు చేయటం సాధ్యమేనని అనిపించిన అద్భుత కాలమది. అమెరికాలో వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ఆఫ్రికా, ఆసియాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయి. బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం, ఐరోపాలో విద్యార్థి ఉద్యమాలు, అప్పుడప్పుడే అంకురిస్తున్న స్త్రీ విముక్తి పోరాటాలు, చైనాలో సాంస్కృతిక విప్లవం.. ఇలా ప్రపంచంలో ఎటు చూసినా ఉద్యమాలే. చరిత్రాత్మకమైన ఈ ఉద్యమాలను అన్నిచోట్లా ముందుండి నడిపిస్తున్నది యువతరం ప్రతినిధులు, అట్టడుగు వర్గాలవారే కావటం విశేషం. ఇక మన దేశంలో చూస్తే` ఎన్నో ఆశలు పెట్టుకున్న స్వాతంత్య్రం విఫలమవుతున్న దాఖలాలు ప్రస్ఫుటమవుతుండటంతో ప్రజల్లో క్రమేపీ అసహనం గూడుకట్టుకుపోతోంది, దీనిలోంచి ఆవిర్భవించిందే నక్సల్‌బరీ ఉద్యమం. అప్పుడు మాకు` విప్లవం కనుచూపుమేరలోనే వుందనీ, దానికి మేమే సారథులమనీ అనిపించేది.
ఇక ఇంట్లో నా గొంతు బలంగా వినిపించటం మొదలుపెట్టాను. ఇదివరకటిలా ఏదో ప్రశ్నించి ఊరుకోవడం, ఉత్సుకతతో వాదించటం కాదు, అసలు నా ఆలోచనలేమిటో, నేనెలా జీవించాలనుకుంటున్నానో దృఢంగా చెప్పటం మొదలుపెట్టాను. ఎప్పటిలా వేసవిలో మా కుటుంబమంతా కలసి యాత్రలకు వెళ్లినప్పుడు నేను గుడి లోపల అడుగుపెట్టేందుకు నిరాకరించేదాన్ని. ఏమన్నా అంటే బహిష్టు అయ్యాననే దాన్ని. మెల్లగా ఇంట్లో నా వాదనలు అమ్మతో కాదు, నేరుగా నాన్నతోనే మొదలయ్యాయి. ఆయన నన్ను విపరీతంగా భయపెట్టే వాళ్లు. నేనేదైనా మీటింగుకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తే గేటుకు అడ్డంగా నిలబడి, నన్ను ఇంట్లోకి రానిచ్చేవాళ్లు కాదు. ఇరుగు పొరుగు అందరికీ వినిపించేలా గట్టిగా తిడుతుండేవారు. నాకలా వీధిలో గొడవపడటం అంటే అసహ్యం. ఆయన నన్నలా నడిరోడ్డున నిలబెట్టి, బిగ్గరగా అరుస్తుండటం చూసి నాలోనేనే బిక్కచచ్చిపోయేదాన్ని. ఈ బాధ భరించలేక ఒక్కోసారి నా కార్యక్రమాలన్నీ కట్టిపెట్టేసి, ఆయన చెప్పినట్టు ఇంటికే పరిమితమవుదామా అని కూడా కాస్త మెత్తబడేదాన్ని. కానీ చటుక్కున దాని పర్యవసానం ఏమిటో నా కళ్ల ముందు విశ్వరూపంలా కనిపించేది` బుర్ర లేకుండా ఒంటికి రౌండ్లు రౌండ్లు చుట్టుకునే ఆ బట్టలు, దిగేసుకునే నగలు, పూజలు, గుళ్ల చుట్టూ ప్రదక్షిణాలు, పనికిమాలిన వాళ్లతో పోచికోలు కబుర్లు, ఎవడో ఓ నిరంకుశుడితో మెడలో తాళి కట్టించుకోవటం.. చాలుచాలు, నా సంకల్పం మళ్లీ వెంటనే దృఢమైపోయేది. మా అక్కయ్యకు పట్టిన గతి గుర్తుకొచ్చి.. దానికంటే ఎలాంటి జీవితమైనా మెరుగేననిపించేది!
నేను ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన ఏడాదికి, అంటే 1973లో ముగ్గురు యువతులు పీజీ చేసేందుకు మా క్యాంపస్‌కు వచ్చారు. వాళ్లు నాకంటే ఓ ఏడాది సీనియర్లు, డిగ్రీ వేరే ఎక్కడో చేసి వచ్చారు. వాళ్లలో ఒకరైన లలిత మా మాథ్స్‌ డిపార్ట్‌మెంట్‌లోనే చేరింది. ఆమెను అందరూ నందూ అనేవాళ్లు. ఆమె విమలా రామచంద్రన్‌ సోదరే కాబట్టి నాకు ముందర నుంచే పరిచయం. మిగతా ఇద్దరూ` రుక్మిణి, లలిత. వీళ్లు ఆర్ట్స్‌ విద్యార్ధులు. రుక్మిణి మేనన్‌ని అంతా మిన్నీ అని, కొందరు మీనా మేనన్‌ అని కూడా పిలిచే
వాళ్లు. ఆమె కాలేజీలో మా అక్కయ్య క్లాస్‌మేట్‌ కాబట్టి తను కూడా నాకు ముందే తెలుసు. పైగా ఆమె అప్పటికే పీడీఎస్‌యూ శ్రీకృష్ణకు మంచి స్నేహితురాలు కావటంతో క్యాంపస్‌కు వస్తూనే మాతో కలిసిపోయింది. ఇక లలిత ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో మిన్నీతో కలిసి చదివేది. మేం నలుగురం చాలా సన్నిహితంగా, సరదాగా వుండేవాళ్లం. మిన్నీ మంచి అందగత్తె, ఎవరినైనా భలే అనుకరించేది, ఎప్పుడూ రంగురంగుల బట్టలేసుకుని, చెలాకీగా ఉండేది. తర్వాతి కాలంలో ఆమె బొంబాయిలో కార్మిక సంఘ నాయకురాలైంది. 1980లలో గిర్ని కామ్‌గార్‌ సంఘర్ష్‌ సమితి (మిల్లు కార్మికుల కార్యాచరణ కమిటీ) నిర్వాహకుల్లో ఒకరిగా, తర్వాత 2000లలో ఎన్‌జీవోలలో కన్సల్టెంట్‌గా పని చేసింది. లలిత స్త్రీల అధ్యయన సంస్థ ‘అన్వేషి’ వ్యవస్థాపక సభ్యురాలు, యుగాంతర్‌ అనే ఎన్‌జీవోలో కూడా పనిచేస్తుంది. చాలా నిదానంగా, ఉత్సాహంగా ఉండే నందు బ్యాంకు ఉద్యోగంలో చేరింది, కానీ చేరిన పదేళ్లలోపే, తన కూతురికి ఇంకా ఏడాది కూడా నిండక ముందే.. ఉన్నట్టుండి గుండె పోటుతో చనిపోయింది. మేం నలుగురం ఒక జట్టులా తయారై, కలిసి చదువుకుంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించటం మొదలుపెట్టాం. అప్పటి వరకూ కోపంతో మాలో మేమే ఉడికిపోతూ, ఏం చెయ్యాలో పాలుపోక నిస్సహాయంగా ఉండిపోయే యువతలా వున్న మేం` ఈ క్రమంలో పూర్తిగా మారిపోయాం. మాలో హక్కుల గురించిన చైతన్యం పెరిగింది. ఈ దేశ పౌరులుగా మనకున్న హక్కులేమిటో, మనకు దక్కాల్సినవేమిటో స్పష్టమవుతూ వచ్చింది. అంతే కాదు, ఆచరణలోకి వచ్చేసరికి ఆ హక్కులేవీ కూడా నిలబడుతున్నట్టు, వాటికి అసలు ప్రాధాన్యం ఇస్తున్నట్టే కనిపించటం లేదన్న విషయాన్నీ అర్థం చేసుకున్నాం.
కోఠీ వుమెన్స్‌ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే చూశాను` చాలామంది ఆడపిల్లల్ని వాళ్ల తల్లిదండ్రులు చటుక్కున చదువు మాన్పించి తీసుకెళ్లిపోతుండే వాళ్లు. ఒక దశ దాటిన తర్వాత ఆడపిల్లలకు ఇంక చదువులెందుకు, అనవసరమని భావించేవాళ్లు. అంటే మనకు ‘చదువుకునే హక్కు’ ఉందిగానీ, అది అత్యంత బలహీనమైనదన్న మాట. మమ్మల్ని ఎప్పుడైనా, ఎవరో ముక్కూమొహం తెలియని వాడికిచ్చి పెళ్లిచేసి పంపించెయ్యొచ్చు.. దాని పర్యవసానం ఇంక జీవితంలో మిగిలేది దు:ఖమే కావొచ్చు. మా తల్లిదండ్రులు వరకట్నం పేరిట భారీ మొత్తాలను సమర్పించుకుని, మాక్కాబోయే అత్తమామలను శాంతింపజేసి, మమ్మల్ని వారింటి బానిసలుగా ఉంచేందుకు అనుమతించమని వేడుకోవాలి! ఇక బయటకు వెళితే మేం సౌకర్యంగా ఉండే, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చే ప్రదేశమే ఉండదు` రోడ్ల మీదా, క్లాస్‌రూముల్లో, హోటళ్లలో.. ఎక్కడ చూసినా మాపై లైంగిక వేధింపులే. ప్రతిచోటా మా శరీరాలను వాణిజ్య సరుకుగా మార్చేసే అసహ్య ప్రకటనలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టాకు అంతే ఉండదు.
గత ఏడాది కాలంగా నేను చదువుతున్న పుస్తకాలు, మా రాజకీయ చర్చలన్నింటి వల్లా.. మనం హక్కులున్న పౌరులమనీ, పౌరులుగా మనకున్న హక్కుల మాటేమిటన్న స్పృహ నాలో బాగా బలపడిరది. దాదాపు ఇవే భావాలున్న మిత్రబృందం కూడా తోడవటంతో ఇక చిన్నగా ఏదైనా కార్యాచరణకు పూనుకోవటం అవసరమని నిర్ణయించుకున్నాం. మొదటగా క్యాంపస్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం. కొద్దిగా బయటకు వచ్చి, నగరంలో అశ్లీల వ్యతిరేక ప్రచారం చేపట్టాం. దీనిలో భాగంగా నగరమంతా విచ్చలవిడిగా ఉన్న అసభ్య, అశ్లీల పోస్టర్ల మీద, ప్రకటనల మీద నల్లరంగు పూశాం. మాకు దొరికిన, మమ్మల్ని పిలిచిన ప్రతి వేదిక మీదా మా గొంతు బలంగా వినిపించాం. ఆ రోజుల్లో ప్రగతిశీల భావాలుగల స్త్రీవాది బి.లక్ష్మీబాయిని తరచూ కలుస్తుండేవాళ్లం. ఆమె ఓయూ క్యాంపస్‌లో భాషాశాస్త్రం బోధించేది, ఆమెకు జార్జి కూడా బాగా తెలుసు. చదవటం, ఆలోచించటం, చర్చించటం చాలా అవసరమని ఆమె మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేది. కానీ అంతలోనే` ఊహించినట్లుగానే, వామపక్ష వాదుల్లో అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి. ఆమె మార్క్సిస్టు`లెనినిస్టు పార్టీల్లోనే మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో, గ్రూపు రాజకీయాల కారణంగా దురదృష్టవశాత్తూ మేమే ఆమెకు దూరంగా వుండాల్సి వచ్చింది.
ఆ రోజుల్లో మాకు కొత్త ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ ఇచ్చినవేమిటో తెలుసుకుంటే నేటితరం అమ్మాయిలకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఉదాహరణకు వనజా అయ్యంగార్‌ అని, అప్పట్లో మాకు ఓయూలో గణితశాస్త్రం బోధించే టీచర్‌ ఉండేది. ఆమె అంటే మాకు వల్లమాలిన అభిమానం. ఒక సనాతన తమిళ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె కేంబ్రిడ్జిలో చదువుకుంది, వామపక్ష విద్యార్థి బృందాల్లో చేరింది, మోహిత్‌ సేన్‌ను పెళ్లి చేసుకుంది, (తర్వాతి కాలంలో ఆయనే భారత కమ్యూనిస్ట్‌ పార్టీ`సీపీఐలో పూర్తి కాలం పనిచేశారు), అధ్యాపకురాలిగా పనిచేసేందుకు హైదరాబాద్‌కు తిరిగొచ్చింది.
చాలా అందంగా, హుందాగా వుండే ఆమె ఉపాధ్యాయుల గదిలో కూర్చుని సిగరెట్లు తాగేది. నేను పనిగట్టుకుని తరచూ అటుపోయి, ఆ గదిలోకి తొంగి చూస్తుండేదాన్ని. ఆమె సిగరెట్‌ కాలుస్తున్న దృశ్యం కనిపించిందంటే చాలు, ఇంక ఆ రోజు నాకు పట్టరాని సంతోషమే. ఆ రోజుల్లో ఒక మహిళ అలా ధీమాగా కూర్చుని సిగరెట్టు తాగడం చిన్న విషయమేం కాదు. అలాగే సత్యమ్మ శ్రీనాథ్‌ అని, రెడ్డి కాలేజీలో లెక్చరర్‌. ఆమె తన స్కూటరేసుకుని మా క్యాంపస్‌లో రయ్యిన తిరుగుతుండేది` ఒక మహిళ అలా స్కూటర్‌ మీద వెళుతుండటం చూస్తుంటే మా కళ్లు అబ్బురంతో విప్పారేవి. ఫెమినిస్టు, డాక్టరు అయిన వీణా శతృఘ్న కూడా స్కూటర్‌ మీదే వచ్చేది. అంతే కాదు, ఆ రోజుల్లోనే ఆమె స్లీవ్‌ లెస్‌ జాకెట్లు కూడా వేసుకునేది!
ఎం.శాంత (తర్వాతి కాలంలో ఆమే శాంతా సిన్హా) ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న
ఉదంతాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. శాంత ఎంతో సహృదయశీలి, నాకున్న ఆత్మీయ మిత్రుల్లో ముఖ్యురాలు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యునివర్సిటీలో రాజకీయ శాస్త్రం బోధించేది, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌ను స్థాపించింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎంతో కృషి చేసింది, బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేసినప్పుడు దానికి తొలి అధ్యక్షురాలిగా వ్యవహరించింది. కాలేజీ రోజుల్లో ఆమె తన క్లాస్‌మేట్‌ అజయ్‌ సిన్హాను ప్రేమించింది. కానీ ఆమె తల్లిదండ్రులు దాన్ని అంగీకరించలేదు. తమ సంప్రదాయ పుదుర్‌ ద్రావిడ కుటుంబానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఖాయం చేసి, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేసేశారు. ఆమెను బయటకు తేవటమెలాగా అన్నది మా అందరికీ పెద్ద సమస్యగా తయారైంది. అప్పుడు మా పీడీఎస్‌యూ మిత్రులంతా కలసి ఓ వ్యూహం పన్నారు. మరో మిత్రుడు మహిపాల్‌ రెడ్డి పోస్ట్‌మ్యాన్‌ వేషం వేసుకుని సైకిల్‌ మీద మారేడ్‌పల్లిలోని వాళ్లింటికి వెళ్లాడు. పథకం ప్రకారం అతని వెనకాలే నెమ్మదిగా ఒక కారు కూడా వెళ్లింది. అతను వాళ్ల ఇంటి గుమ్మం ముందు నిలబడి ‘శాంతకు టెలిగ్రాం’ అని బిగ్గరగా కేకేశాడు. కుటుంబ సభ్యులెవరో తలుపు తీసి టెలిగ్రాం కోసం చేయి చాస్తే ‘దీని మీద శాంత గారే సంతకం పెట్టాలి’ అని చెప్పాడు. కొద్దిసేపట్లో శాంత బయటికి వచ్చింది. అంతే, ఒక్క ఉదుటన ఆమె బయట ఎదురుచూస్తున్న కారు ఎక్కేయటం, ఇంటి నుంచి వచ్చేయటం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది!
ఇలాంటిదే ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకున్న మరో సంఘటన వుంది. అతని పేరు విజయ్‌ కులకర్ణి. జార్జి రెడ్డికి చాలా సన్నిహిత మిత్రుడు, పీడీఎస్‌యూ వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. అయితే జార్జి రెడ్డి చనిపోయిన తర్వాత తనే ఎందుకో ఆ గ్రూపుకు దూరమయ్యాడు. తను ఆర్ట్స్‌ కాలేజీలో ఎంఏ చదువుతున్న, అప్పటికే పెళ్లయిన ఓ విద్యార్థితో ప్రేమలో పడ్డాడు. వాళ్లిద్దరూ ఢల్లీికి పారిపోయారు. ఇలాంటి సంఘటనల పట్ల పెద్ద వాళ్లంతా (వారిలో వామపక్షాల వారూ ఉన్నారు, ఇతరులూ ఉన్నారు) కన్నెర్ర చేస్తుండే వాళ్లు. అయినాసరే, మేం మాత్రం వీటిని` సంప్రదాయ ఛాందసవాదానికి, మహిళలపై కర్కశంగా సాగుతున్న అణిచివేతకు మేం ఎలుగెత్తి విసురుతున్న సవాల్‌గానే చూశాం!
పత్రులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ఫోన్‌ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.