ఊర్వశీ బుటాలియా ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, ఉద్యమకారిణి, పరిశోధకురాలు, ప్రచురణకర్త, స్త్రీల చరిత్రకారులు. 1984లో రీతూ మీనన్‌తో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద ప్రచురణ సంస్థ కాళీ ఫర్ విమెన్‌ను స్థాపించారు. 2003లో జుబాన్ బుక్స్‌ను స్థాపించారు.
అంతకుముందు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, న్యూ ఢల్లీి, జెన్ బుక్స్, లండన్‌లలో పని చేసారు. దేశవిభజన చరిత్రను స్త్రీవాద దృక్పథం నుండి నిశితంగా, విమర్శనాత్మకంగా పరిశీలించారు. బుటాలియా రాసినThe Other Side of Silence : Voices from the Partition of India (1998) స్త్రీవాద చరిత్రల్లో ఒక ముఖ్యమయిన మలుపు. అలాగే, Speaking Peace : Women’s Voices from Kashmir (2002) కూడా. ప్రచురణకర్తగా కూడా ఎన్నో అద్భుతమయిన పుస్తకాలను ప్రచురించారు. ఎన్నో ప్రతిష్టాత్మకయిన గౌరవాలు, అవార్డులు అందుకున్నారు. సాహిత్యంలో, విద్యలో వాళ్ళు చేసిన కృషికి ఊర్వశి బుటాలియా, రీతూ మీనన్ 2011లో పద్మశ్రీ కూడా అందుకున్నారు. ప్రస్తుతం బుటాలియా అశోక యూనివర్సిటీ, ఢల్లీిలో విజిటింగ్ ఫాకల్టీ గా ఉన్నారు. తన స్నేహితురాలైన ట్రాన్స్ మహిళ మోనా అహ్మద్ జీవిత చరిత్ర రాస్తున్నారు. బుటాలియా గురించి, జుబాన్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే, https://zubaanbooks.com/about-zubaan/zubaanis/ వెళ్ళాలి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, స్కూల్ అఫ్ సోషల్ సైన్సెస్ నిర్వహిస్తున్న గోల్డెన్ జూబిలీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ సిరీస్‌లో భాగంగా ఊర్వశి బుటాలియా “The Researcher and the Researched: The Challenge(s) of Feminist Knowledge Production” అంశం మీద ఆగష్టు రెండో తేదీన ప్రసంగించారు. ఆ సందర్బంగా ఆమె సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్‌కు వచ్చారు. భూమిక పాఠకుల కోసం ప్రొఫెసర్ సునీతా రాణితో ముచ్చటించారు.
సునీతా రాణి: హలో, ఊర్వశీ, గుడ్ ఆఫ్టర్ నూన్. మీరు మా పాఠకులతో మాట్లాడటానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. మీరు రచయిత్రిగా, పరిశోధకురాలిగా, అధ్యాపకురాలిగా, స్త్రీవాద ఉద్యమకారిణిగా, ఆపై ప్రచురణకర్తగా ప్రసిద్ధి చెందారు. అసలు మీరు ప్రచురణరంగం లోకి ఎలా వచ్చారు?
ఊర్వశి బుటాలియా: హాయ్, సునీతా, మీతో మాట్లాడ్డం బాగుంది. భూమిక కోసం మాట్లాడమని నన్ను అడిగినందుకు ధన్యవాదాలు. చాలా కాలం క్రితం నేను ప్రచురణరంగంలోకి వచ్చాను, కానీ దాని గురించి ప్రతి చిన్న విషయం నా మనస్సులో ఇంకా స్పష్టంగా చెక్కబడి ఉంది. నేను అనుకోకుండా ప్రచురణరంగంలోకి వచ్చాను. ఢల్లీిలో నా ఎంఏ డిగ్రీ పూర్తి చేశాను. 1970లలో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి కావు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేయాలనుకుంటే, సాహిత్యంలో డిగ్రీ అందుబాటులో ఉండేది. కాబట్టి నేను ఇంగ్లీష్ ఆనర్స్, తర్వాత ఇంగ్లీష్ ఎంఏ చేసాను. కాని నేను ఢల్లీి విశ్వవిద్యాలయంలో రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉన్నాను. ఆంగ్ల సాహిత్యం మన పరిధులను అద్భుతంగా విస్తృతం చేస్తుంది. కానీ, నేను జీవిస్తున్న వాస్తవికతకు పూర్తిగా దూరం. వేరే ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, నూటికి నూరు శాతం బోధనలోకి మాత్రం వెళ్లకూడదనుకున్నాను. అవకాశాలకోసం ఎదురుచూస్తున్నప్పుడు అనుకోకుండా ఒక రోజు నాతొ ఫ్రెంచ్ చదువుతున్న నా స్నేహితురాలు తాను పని చేసే ఆఫీసులో ఫ్రీలాన్స్ పని ఉందని, ఒకసారి వచ్చి చూసి నిర్ణయం తీసుకోమని చెప్పింది. తప్పకుండా వస్తానని చెప్పి తనతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌కి వెళ్లాను. అక్కడ ఆమె సెక్రటరీగా పని చేస్తుండేది. వాళ్ళు నాకు ఆ ఫ్రీలాన్స్ పని ఇచ్చారు, అద్బుతమైన పని. వాళ్ళు భారతీయ పాఠశాలలకు సరిపోయేట్లుగా ఇంగ్లండ్ నుండి తీసుకువచ్చిన పాఠ్యపుస్తకాలను మార్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఆంగ్లంలో పాఠ్యపుస్తకాల రచయితల్లో భారతీయులు పెద్దగా ఉండేవాళ్ళు కాదు. పాఠాలు అవే ఉండేవి కానీ పేర్లు మాత్రం మారిపోయేవి. అంటే, జాన్ మేరీలు రాముడు సీత అయ్యేవాళ్ళు. నన్ను జూaర్‌వతీ అప్పర్‌గా అప్పాయింట్ చేసుకున్నారు. పెద్ద పెద్ద కాగితాలను చిన్న చిన్న ముక్క్కలుగా కత్తిరించి టెక్స్ట్ బుక్స్‌లో పేర్ల మీద అతికించడం నా పని. జాన్ మేరీల పేర్ల మీద రాముడు సీత పేర్లు రాసి ఉన్న కాగితం ముక్కలను అతికించేదాన్ని. ఒక ఆర్టిస్ట్ కూడా ఉండేవాడు. పిల్లల జుట్టు, కళ్ళు నల్లగా చేయడం, డబుల్ డెక్కర్ బస్సుల పైభాగాలను కత్తిరించడం అతని పని. అప్పట్లో మనదేశంలో డబుల్ డెక్కర్ బస్సులు పెద్దగా లేవు. అప్పటి సాంకేతికత అలా ఉండేది. పని అంతా చేత్తోనే జరిగేది. నేను ఈ పని చేస్తున్నప్పుడే ప్రచురణతో, పుస్తకాలు తయారు చేయడంతో పూర్తిగా ప్రేమలో పడ్డాను. అప్పుడే అనుకున్నా, ఇక జీవితమంతా ఇక్కడే అని, అలాగే జరిగింది. నా ఫ్రీలాన్స్ పని అయిపోయింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ వాళ్ళు మీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాం, మాతో ఉంటారా అని అడిగారు. శిక్షణ కూడా ఇస్తామన్నారు. ఒప్పుకున్నా. మొదటగా వాళ్ళు నాకు పుస్తక ప్రచురణలో శిక్షణ ఇచ్చారు. అలా మొదలుపెట్టాను, పుస్తకాలు, కాగితం, ప్రింటింగ్, ఇలా ప్రతీదీ. ప్రింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం కావడంతో ఆ పనంతా మరింత ఇష్టంగా అనిపించింది. అక్కడనుండి ఆలా ముందుకు వెళ్ళిపోయాను. ప్రచురణ రంగంలో మరింత లోతుగా వెళ్ళాను. అది మొదలు.
సునీత: వాట్ ఎ బిగినింగ్! తొలిరోజుల్లో మీ పుస్తకాలన్నీ కూడా సహకార, ఉమ్మడి ప్రచురణలు, ఉమ్మడి రచనలు. ఉదాహరణకు, రీతు మీనన్‌తో మరియు తనికా సర్కార్‌తో కలిసి తీసుకొచ్చిన పుస్తకాలు. నేను దీనిని స్త్రీవాద సంఫీుభావం, స్త్రీవాద ఆందోళనలకు సమిష్టి ప్రతిస్పందనగా చూస్తాను. ఇలాంటి భాగస్వామ్య ప్రచురణల్లో మీ అనుభవం ఏమిటి? మేధో భాగస్వామ్యం, కానీ ఉద్యమ భాగస్వామ్యం కూడా. దాని ఫలితం ఏమిటి? ఈ సహకారం మీ పనిని బలోపేతం చేయడానికి లేదా మీ పనిని నిర్దిష్ట పద్ధతిలో రూపొందించడానికి ఎలా దారితీసింది?
ఊర్వశి: మంచి ప్రశ్న! నిజానికి నేను ఇంతకు ముందు అలా ఆలోచించలేదు. కానీ వాస్తవానికి మేము కలిసి పని చేసాం, నా స్వంత రచనల్లోనే కాదు, ప్రచురణల్లో కూడా. సమిష్టిగా రూపొందించబడిన రచనల ప్రచురణలో మేము అనుసరించే నమూనా కూడా అదే. నా ఉద్దేశ్యం, స్త్రీవాద ఉద్యమం చాలా విషయాలను సేకరించింది. దాన్ని ప్రతిబింబించడం మా పని అని నేను అనుకుంటున్నాను. కలిసి పనిచేయడం చాలా ముఖ్యమైన అనుభవం. ఉదాహరణకు, కాళీ ప్రచురణల్లో, స్త్రీవాద ప్రచురణల మీద, వాటి చరిత్ర మీద రీతూ, నేను కలిసి చాలా పని చేసాం. ప్రచురించడం గురించి చాలా రాసాము. ఒకే లాగా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు, కొంచెం భిన్నమయిన నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వృత్తిపరంగా కలిసి పనిచేయడం అది. నేను మహిళా ఉద్యమాల్లో లోతుగా పని చేస్తున్నాను, నిరసనల్లో పాల్గొంటున్నాను. రీతూ వేరే నేపథ్యం నుంచి వచ్చింది. మహిళా ఉద్యమంలో ఆమెకు అలాంటి ప్రమేయం లేదు, కాబట్టి ఆమె భిన్నమైన దృక్పథాన్ని తీసుకువచ్చింది. మా ఇద్దరి దృక్పథాలు అలా కలిసి రావడం చాలా ఆసక్తికరంగా మారింది. మా ఎంపికల్లో, మేము సంకలనాల్లో చేర్చిన కథల ఎంపికల్లో కూడా తీవ్రమైన విభేదాలు ఏమీ ఉన్నట్లు నాకు గుర్తు లేదు. ప్రజలకు ఏది నచ్చుతుంది, ఏది ప్రచురించాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అర్థం చేసుకోవడంలో ఇదొక ముఖ్యమయిన పాఠం. కానీ తనికతో కలిసి పనిచేయడం, ఉమాతో కలిసి పనిచేయడం, తర్వాత నవశరణ్ సింగ్‌తో కలిసి పనిచేయడం, లక్ష్మీ మూర్తితో పనిచేయడం, గాఢమయిన చర్చలకు దారితీసింది. ఎందుకంటే వీళ్ళందరికీ స్త్రీవాద ఉద్యమంతో సన్నిహితంగా పని చేసిన అనుభవం ఉంది. కలిసి పని చేయడమన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. ఆలోచనలను సమిష్టిగా ఉత్పత్తి చేయడం, పంచుకోవడం, వ్యక్తపరచడం, చర్చకు పెట్టడం తెలిసినవాళ్లు. ఆలోచనలను వ్యక్తపరచడం ముఖ్యం, దాని యాజమాన్యాన్ని ఎవరు క్లెయిమ్ చేసారో కాదు. ఇది వ్యక్తుల కృషిని కొట్టిపడేయడం కూడా కాదు. కలిసి పనిచెయ్యడం, మిగతా వాళ్ళు చెప్పేది వినడం ఎలాగో నేర్చుకోవడం చాలా ముఖ్యం. అది కూడా గౌరవంతో వినడం. వింటున్నట్లు నటించి మనం కావాలనుకున్నది చేయడం కాదు. మహిళలకుండే పరిమితులను అర్థం చేసుకోవడం కూడా ఇందులో భాగమే. మీకు తెలుసా, మేమందరం ఒకే రకమైన రచయితలం కాదు. మాకు వ్యక్తిగత సమస్యలు ఉండేవి, మాకు రాజకీయ ఆదర్శాలు ఉండేవి. వీటన్నింటి మధ్య రచనలు కూడా సాగేవి. వాటికి కూడా సమాన ప్రాధాన్యం ఉండేది. అవన్నిటినీ అర్థం చేసుకోవాల్సి వచ్చేది. సామూహిక పనితీరు గురించి మహిళా ఉద్యమంలో శిక్షణ ఇక్కడ బాగా సహాయపడిరది. అది ఒక అద్భుతమైన అనుభవం. తనికా మరియు నేను హిందూ మహిళలపై కలిసి పనిచేశాము. తనికా తన అద్భుతమైన అకడమిక్ ఇన్‌పుట్‌ని అందించింది. ఆమె స్వయంగా చాలా రాసింది. నేను యాక్టివిస్ట్ ఎలిమెంట్ తీసుకొచ్చాను. ఉమా, నేను లైంగిక హింసకు సంబంధించిన పుస్తకాలపై కలిసి పనిచేశాం. ఉమా సాటిలేని ఉద్యమకారిణి, సాటిలేని సిద్ధాంతకర్త. అదే సినర్జీ వి.గీతతో కలిసి తన పుస్తకాల మీద పని చేసేటప్పుడు కూడా ఉండేది. అలా పని చేయడం ఒక అద్భుతమయిన అనుభవం. దాన్ని నేను ఎట్టి పరిస్థితిలోనూ మార్చాలనుకోను. మేము సమిష్టిగా రూపొందించిన పుస్తకాలను కూడా ప్రచురిస్తాము. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వర్క్‌షాప్‌ల పరంపరలో పాల్గొన్న రాజస్థాన్ గ్రామీణ మహిళలు స్త్రీల శరీరాల మీద రూపొందించిన పుస్తకం ‘‘షరీర్ కీ జాన్ కారీ’’ మేము హిందీలో ప్రచురించాం. వాళ్ళు ఆ పుస్తకాన్ని మా దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఏమన్నారంటే, మా దృష్టిలో విజ్ఞానం అంటే సమిష్టిగా ఉత్పత్తి చేయబడేది, అందరికీ సమిష్టిగా చెందినది అని. డెబ్భై అయిదు మంది కలిసి రాశాం కాబట్టి డెబ్భై అయిదు పేర్లు పుస్తకం కవర్ పేజీ మీద ఉండాలని కండిషన్ పెట్టారు.
సునీత: చక్కటి ఆలోచన.
ఊర్వశి: చాలా ఆలోచించాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పింది నిజం. వాళ్ళందరూ కలిసి సమిష్టిగా ఆ విజ్ఞానాన్ని ఉత్పత్తి చేసారు. అలాగే, చాలా కాలం తరువాత, మేము ఇంకో పుస్తకం తీసుకొచ్చాం. దాని గురించి నేను ఈ రోజు సెషన్‌లో మాట్లాడబోతున్నాను. యూపీలోని సీతాపూర్‌కు చెందిన తొమ్మిది మంది మహిళలు, గ్రామీణ మహిళలు, వివిధ కులాలకు చెందినవాళ్లు, బ్రాహ్మణులు, దళితులు, ఇద్దరు నగర మహిళలు కలిసి ఈ పుస్తకాన్ని రూపొందించారు. అంతమంది కలిసి ఒక పుస్తకాన్ని రూపొందించే ప్రయోగం అంటే శ్రమ గురించి ఆలోచించడం కూడా. శ్రమ అంటే ఏమిటి? ఇద్దరు మహిళలకు తమ మేధోశ్రమ గురించి రాయగలిగిన శక్తి ఉన్నంత మాత్రాన దాన్ని ఈ పుస్తకంలోని కథలను గురించి మాట్లాడ్డానికి, వాటిని బయటకు తీసుకురావడానికి దోహదపడ్డ భావోద్వేగ శ్రమ, రాజకీయ శ్రమ కంటే గొప్పదిగా ఎందుకు చూడాలి? ఇలాంటి సమిష్టి విజ్ఞాన నిర్మాణం నుండి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు.
సునీత: ఫెమినిస్ట్ ఎపిస్టెమాలజీ. ఆ సమిష్టి విజ్ఞాన నిర్మాణం స్త్రీవాద విజ్ఞాన నిర్మాణంలో అతి ముఖ్యమయిన కోణం. అది స్త్రీలు తమ విజ్ఞానాన్ని తమదని చెప్పుకోవడం, తమ చెయ్యి జారిపోనివ్వకపోవడం.
ఊర్వశి: చెయ్యి జారిపోనివ్వకపోవడం, దాని సమిష్టి లక్షణాన్ని గుర్తించడం కూడా.
సునీత: అవును, మేం కూడా ఉన్నాం అంటూ తమ ముద్రను వెయ్యడం. స్త్రీలు త్యాగశీలురు లాంటి మూస పాత్రలను బద్దలు కొట్టడం. .
ఊర్వశి: అవును..
సునీత: ఆలా కలిసి పని చెయ్యడం, ముఖ్యంగా మొదటి రోజుల్లో, మిమ్మల్ని ది అదర్ సైడ్ అఫ్ సైలెన్స్, స్పీకింగ్ పీస్ లాంటి పుస్తకాలు రాయడం వైపు నడిపించిందా? అవన్నీ దాచి పెట్టబడిన కథలు, సామూహిక కథలు, పంచుకోని కథలు.
ఊర్వశి: అవును, వివిధ రకాలుగా. రెండు పుస్తకాలు దాదాపు ఒకేసారి వచ్చాయి. ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్ 1998లో వచ్చింది. 2000లో స్పీకింగ్ పీస్ వచ్చింది. స్పీకింగ్ పీస్ విషయంలో ఏం జరిగిందంటే, అప్పుడు మహిళా ఉద్యమాల్లో అంతర్మధనం జరుగుతోంది. కశ్మీర్లో ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, మేమెందుకు దాని గురించి పట్టించుకోలేదు, మాకు తెలీకుండానే ఎక్కడో లోలోపల మేము కూడా జాతీయ వాద చర్చల్లో భాగమయ్యామా, కశ్మీర్లో జరుగుతున్నది జాతీయ వ్యతిరేక ఉద్యమంగా భావిస్తున్నామా, అందుకనే దాన్ని కొట్టిపడేస్తున్నామా, అందుకనే అక్కడి స్త్రీల గురించి పట్టించుకోవట్లేదా లాంటి ప్రశ్నలు మాకు మేమే వేసుకుంటూ ఉన్నాం. మాకు మేము ప్రశ్నలు వేసుకోవడమే కాదు. కశ్మీరీ మహిళలు కూడా అలాంటి ప్రశ్నలే లేవనెత్తారు. భారతీయ మహిళా ఉద్యమం చేసిన అతి పెద్ద యుద్ధం స్త్రీల మీద హింసకు వ్యతిరేకంగా. మీరు భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. మరి మా సంగతేమిటి? భారతీయ స్త్రీవాదం కశ్మీర్లో ఏం జరుగుతుందో ఎందుకు పట్టించుకోలేదు? మా ప్రశ్నలు, వాళ్ళ ప్రశ్నలు కలిసి మమ్మల్ని ఆ వైపు పని చేసేలా చేసాయి. షీబా చాచి, సోనియా జబ్బార్ కలిసి కశ్మీరీ స్త్రీల మీద అద్భుతమయిన ఒక ప్రదర్శన చేసారు. కశ్మీర్ మీద చాలా రిపోర్ట్స్ వచ్చాయి. వివిధ మహిళా సంఘాలు పరిశోధనాత్మక రిపోర్ట్స్‌ను తీసుకువచ్చాయి. వాటిలో రెండు, ద గ్రీన్ అఫ్ మై వ్యాలీ ఇజ్ ఖాకీ, కశ్మీర్ ఇంప్రిజన్డ్. ఇంకా చాలా ఉన్నాయి. చాలా స్పష్టంగా అప్పుడు చాలా పని జరుగుతోంది. నేను పుస్తకాలన్నీ చూసాను. కశ్మీరీ స్త్రీల మీద ఏమీ లేదు. అస్సలు ఏమీ లేదు. కశ్మీర్‌పై కనీసం 150 పుస్తకాలు ఉన్నాయి. మహిళల గురించి ఎవరూ మాట్లాడలేదు. పంతొమ్మిది వందల నలభైల్లోనే ఒక కొత్త కాశ్మీర్ కావాలన్న దార్శనికతతో నయా కశ్మీర్ పత్రాన్ని రాసుకున్నారు. అందులో ఒక అధ్యాయం మొత్తం స్త్రీల మీదే ఉంది. చాలా తక్కువ దేశాలు భవిష్యత్తు గురించి, స్త్రీల పట్ల ఒక దార్శనికతతో ఆలోచించారు. దేశ విభజన కాలంలో చాలా చురుగ్గా పనిచేసే మహిళా మిలిషియా కశ్మీర్లో ఉండేది. తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు వాడడంలో శిక్షణ త్రీసుకున్నారు. అందులో క్రిస్టియన్, ముస్లిం, హిందూ, సిఖ్ మహిళలందరూ ఉండేవాళ్ళు. ఈ చరిత్ర అందరికి ఎందుకు తెలియదా అని నేను ఆశ్చర్యపోయాను. అందుకే నేను పని చేశాను, కానీ మనసు నిండా సందేహాలతోనే చేశాను. ఆ పని నిజానికి కశ్మీరీ మహిళలే చేసి ఉండాల్సింది. ఆ తర్వాత కాశ్మీరీ మహిళలు విస్తృతంగా రాయడం మొదలుపెట్టారు. ఆ ఎరుక, కనువిప్పు మహిళా ఉద్యమాల్లో జరుగుతున్న పరిణామాల్లోంచి వచ్చినా, ఆ పుస్తకాన్ని రాయడమన్నది నా స్పందన. అలాంటి స్పందన కాశ్మీరీ మహిళల నుండి వస్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. కానీ, అప్పటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కశ్మీరీ మహిళలు ఆలోచించడం లేదని కాదు, రాయడం లేదని కాదు. ఉన్న చోటే ఉండి తమ గురించి తాము రాయలేని నిస్సహాయతకు, బయటవాళ్ళు ఆ స్థితిని గురించి రాయగలగే స్థితిలో ఉండగలగడానికి ఇదొక ఉదాహరణ. దేశ విభజన విషయానికి వస్తే, అది నా అనుభవం, నా కుటుంబ చరిత్రలో భాగం. ఒక రకంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. 1984లో ఢల్లీిలో జరిగిన ఇందిరా గాంధీ హత్య, సిక్కులపై హింస హఠాత్తుగా నా అస్తిత్వం పట్ల నాకో అవగాహనను ఇచ్చాయి. అప్పటి వరకు నేను దాని గురించి ఆలోచించను కూడా లేదు. విచిత్రమేమిటంటే, మాకు పెద్దగా ఆస్తులు, ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు, కానీ నేను చదువుకున్నాను. అదే నా విశేషాధికారం. కానీ, 1984 వరకు కూడా అస్తిత్వాల గురించి ఆలోచించలేదు. హఠాత్తుగా ఒక సిక్కుగా నిస్సహాయత ఆవరించింది. దాని ఫలితం ఏమిటంటే, ఆ అస్తిత్వాన్ని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. అక్కడనుండి నాకు దేశ విభజన మీద ఆసక్తి మొదలయింది. నా కుటుంబానికి చెందిన విభజన చరిత్రను నేనెప్పుడూ పట్టించుకోలేదని అప్పుడే నేను గుర్తించాను. మా కుటుంబం దేశ విభజన వల్ల చాలా గాయపడిరది. నా తల్లితండ్రులిద్దరూ విభజన శరణార్థులు. ఆ పుస్తకం మీద పనిచేయడానికి ప్రేరణ ఆలా వచ్చింది. కానీ, ఆ పుస్తకం ఆ రూపం తీసుకోవడానికి కారణం మాత్రం మహిళా ఉద్యమాల్లో నేర్చుకున్న పాఠాలే. ఉద్యమంలో మేమందరం కలిసి కూర్చునేవాళ్ళం, కథలు పంచుకునేవాళ్ళం, ఒకర్నొకరు వినడం నేర్చుకున్నాం, కాస్త ఆగి పక్క వాళ్ళు మాట్లాడ్డానికి చోటుందని నిర్ధారించుకోవడం నేర్చుకున్నాం. మనం చాలా తేలికగా మాట్లాడగలిగినప్పుడు, మరొకరు ఆలా మాట్లాడ్డానికి కష్టపడుతున్నప్పుడు, వాళ్ళు చెప్తున్నది వినాలంటే మనం కాస్త ఆగాలి. ఆలా అగగలగడమన్నది మనకు మనకు చెప్పుకోగలిగే పాఠం. అది విభజన మీద నేను పని చేసే విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయినా ఇంకా స్త్రీల గురించి నాకు తెలియనివి, నేను ఆలోచించనివి చాలా విషయాలు మిగిలే ఉన్నాయి. ఒక స్త్రీవాదిగా అవన్నీ నేను తెలుసుకుని ఉండాల్సింది. ఆలా ఆ అనుభవం హింస పట్ల, స్త్రీవాదం పట్ల, లైంగిక హింస పట్ల, వాటి మీద మన దృక్పథం పట్ల నా ఆలోచనలను విస్తృతం చేసింది.
సునీత: చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే తర్వాత కూడా మీరు విభజన కథలు, విభజన కాలం నాటి స్త్రీల కథలు కూడా ప్రచురించారు. బహుశా ఈ ఆలోచనల్లో కొన్ని తరువాతి పుస్తకాల్లో ఉండే ఉంటాయి. కానీ ఒక మైలురాయిలాగా మేము ది అదర్ సైడ్ అఫ్ సైలెన్స్‌ను, ద స్పీకింగ్ పీస్‌ను గుర్తుంచుకుంటాము. ఆ పుస్తకాల్లో లోతుగా లీనమయిపోతాం. ఒకసారి క్లాసులో పొరపాటున నేను ది అదర్ సైడ్ అఫ్ వయలెన్స్ అన్నాను.
ఊర్వశి: ఓకే.
సునీత: స్టూడెంట్స్ ఏమన్నారంటే, నిజానికి ఆ పుస్తకం శీర్షిక అది కూడా కావచ్చు అని. అది హింసకు అటు వైపు కూడా కదా. ఆ పుస్తకం పాఠకుల్ని తనలోకి లాక్కుంటుంది. రకరకాల హింసను మన చుట్టూ చూస్తూనే ఉంటాం. దేశ విభజన అప్పటి హింస అంత కాకపోయినా, ప్రతిరోజూ ఏదో ఒక హింసను చూస్తూనే ఉంటాము. అలాంటి సంఘటనలు, సంఘర్షణలు గుర్తుకొస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుండి జాతీయోద్యమ పోరాటం, తెలంగాణ పోరాటం, సారా వ్యతిరేక ఉద్యమం, మహిళా ఉద్యమాలు, ఇలా ఎన్నో. మనకు తెలియని మన చరిత్ర పుస్తకం గురించి మీకు కూడా తెలుసు. ఎన్నో పోరాట సందర్భాల్లో స్త్రీలు ఉన్నారు, కానీ మాట్లాడలేకపోయారు, వాళ్ళ పోరాటాల గురించి చరిత్ర పట్టించుకోలేదు కూడా. కానీ, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవడం, మాట్లాడ్డం మొదలుపెట్టారు. మీలాంటి పరిశోధకులు వాళ్ళ కథలను అందరి దృష్టికి తీసుకువచ్చారు. మీరన్నట్లు, ఆ కథలను మళ్ళీ చెప్పడానికి ఒక సందర్భం ఉండిరది. ఆలా ఎన్నో కథలు, ఎన్నో సందర్భాలు. అయితే, అలాంటి కథలను కొన్ని రాజకీయ సందర్భాలు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాయి అనిపిస్తుంది ఒక్కోసారి. దేశ విభజన నాటి హింసలో మతం కూడా ఉంది. పరస్పర హింస, కానీ ఒకరిపై ద్వేషాన్ని పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది కదా. స్త్రీలపై హింస గురించి మాట్లాడినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉండదా?
ఊర్వశి: సునీతా, మీ ప్రశ్నలో చాలా విషయాలు ఉన్నాయి. మీరు మొదట్లో అడిగిన ప్రశ్న కు తిరిగి వెళితే, నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఇలాంటి ఒక పుస్తకం పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక జరిగే వాటిని మనం ఏ రకంగానూ నియంత్రించలేము. మీరు చెప్పింది నిజమే. ఆ పుస్తకంలో ఎన్ని విషయాలున్నాయంటే, వాటిని ఉపయోగించుకోవచ్చు, దుర్వినియోగపరచొచ్చు. దేశవిభజన విషయంలో అదే జరిగింది కదా. చాలా సంవత్సరాలు నేను ఆ పుస్తకాన్ని ప్రచురించలేదు. ప్రచురించడానికి భయపడ్డాను. ఒకే ఒక్క ఇంటర్వ్యూ తప్ప మిగతావన్నీ ఇటువైపు నుండి వచ్చిన కథలే. చాలావరకు హిందువుల మీద ముస్లింల హింస గురించి మాట్లాడేవే. ఎవరయినా అందులోంచి ఏదో ఒక కథ ఎంచుకుని ఉపయోగించుకోవచ్చు. అందుకే, చాలా ఆలోచించాను. నేను దీన్ని ప్రచురించలేను, అబద్ధపు సమానార్థకాలు చూపించలేను, అనుకున్నాను. కానీ, అదృష్టవశాత్తు, అలాంటిదేమి జరగలేదు. ఆ పుస్తకం అలాంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. అంటే, రాజకీయ నాయకులు అలా దుర్వినియోగం చెయ్యరని నేను అనడం లేదు. ఏది దొరికినా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వాటిలో ఒకటి దేశ విభజన దారుణాలు. అయితే, మన ముందున్నవి రెండే మార్గాలు, మాట్లాడ్డం లేదా నిశ్శబ్దంగా ఉండడం. ఏదో ఒకటి ఎంచుకోవడం అంత సులభం కాదు.
సునీత: ఫెమినిస్ట్ డిలెమా.
ఊర్వశి: అవును, ఇది డిలెమా. అలాగే, ఇప్పుడు మనకు తెలిసినవి అప్పుడు తెలిసే అవకాశం లేదు. మాట్లాడ్డమన్నదే విముక్తి అని, మనం మాట్లాడినప్పుడు కేవలం సానుకూల ఫలితాలే ఉంటాయని ఇప్పుడు మనం అనుకోవట్లేదు. ఆలా కూడా జరగాక పోవచ్చు. మనం అది తెలుసుకోవాలి. దాని పర్యవసానాల గురించి తెలుసుకోవాలి.
సునీత: అవును, మీరు చెప్పింది నిజమే. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువ ప్రశ్నలు తలెత్తుతాయి. సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. బహుశా అది స్త్రీవాదం యొక్క చైతన్య శీలత కావచ్చు. ఆలోచనలు, మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇదే ముగింపు అని చెప్పలేము. ఇక్కడ ఆగిపోవచ్చు అని చెప్పలేము.
ఊర్వశి: అవును, ఇది పూర్తయింది, చెయ్యడానికి ఇంకేమి లేదు అనలేము. స్త్రీవాదం అనేది నిరంతరం పరిణామానికి గురి అవుతూనే ఉంటుంది, మనం నేర్చుకుంటూనే ఉంటాము. బయటినుండి చూసేవాళ్ళు స్త్రీవాదమంటే ఇంతే, ఒక నిర్వచనమే అనుకుంటారు, అందుకే అందులో ఎదో లోపించింది అనుకుంటారు.
సునీత: మీరు చెప్పింది నిజం. వాళ్ళు అందులో లోటునే చూస్తారు. స్త్రీవాదం చాలా కఠినమయినదని కూడా అనుకుంటారు. ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్‌లో మీరు చెప్పిన ఒక విషయం నా జ్ఞాపకంలో ఉండిపోయింది. హింసకు గురై కనుమరుగయిన స్త్రీల కథలనయితే బయటకు తీసుకువస్తున్నాం. వాళ్ళ గురించి తెలిసిన వ్యక్తుల జ్ఞాపకాలనుండి, దొరికిన రికార్డులనుండి. కానీ, వాళ్ళ ఆలోచనలు, స్పందన గురించి ఎలా తెలుసుకోగలం? అవును, మనం స్త్రీల చరిత్రలను వెలికి తీయగలం కానీ మళ్ళీ ఇతరుల దృక్కోణాల నుండి మాత్రమే. మనం ఇతరుల దృక్కోణాల ద్వారా స్త్రీల చరిత్రను తెలుసుకోవచ్చు. కానీ, వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడితే, అది మనం వినగలిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.
ఊర్వశి: ముఖ్యంగా, స్త్రీల ఆత్మ హత్యల విషయంలో. అవి ఆత్మహత్యలనుకుని సులభంగా వాటిని గౌరవప్రదమయిన, వీరోచిత నిర్ణయాలుగా ముద్ర వెయ్యొచ్చు. కానీ, పదహారేళ్ళ వయసులో జీవితం ముగించడానికి దేశం గురించి, వైభవం గురించి ఏం తెలుసని? కానీ, మాట్లాడ్డానికి, చెప్పడానికి ఆ వ్యక్తి లేదు కాబట్టి తాను ఎలా ఆలోచించిందో ఏమనుకుందో మనకు తెలియదు.
సునీత: ఆలా జీవితాన్ని ముగించవలసి రావడం వాళ్లను ఎంత గాయపరచి ఉంటుంది!
ఊర్వశి: చాలా విపరీతమయిన ఒత్తిడి ఉండి ఉండాలి.
సునీత: మాట్లాడ్డం దగ్గరనుండి భాష వైపు వెళదాం. మీకు చాలా భాషలు తెలుసు, భారతీయ భాషలు, యూరోపియన్ భాషలు కూడా. మీ రచనలు, ప్రచురణలు ఇంగ్లీషులోనే. ఇంగ్లీషులో రాయడం, ప్రచురించడం ప్రివిలెజ్‌గా భావిస్తున్నారా? నా ఉద్దేశ్యం, ఎక్కువమంది పాఠకులను చేరుకోగలగడం అని. అనేక చరిత్రలు ఉండవచ్చు, స్త్రీలు లేదా అణగదొక్కబడిన వర్గాల వ్యక్తులు రాసిన అనేక కథలు ఉండవచ్చు, కానీ బహుశా ప్రజలను చేరుకోవడానికి లేదా స్పష్టంగా కనిపించడానికి వాటి మాధ్యమం అనుమతించకపోవచ్చు. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇంగ్లీషులో రాయడం కావచ్చు లేదా పరిశోధన చెయ్యడం కావచ్చు.
ఊర్వశి: నీకు తెలుసా, సునీతా, ఇది నాకు చాలా పెద్ద డిలెమా, నాకే కాదు, నాలాంటి చాలామందికి. ఢల్లీిలో, ఇంగ్లీషులో చదువుకున్నాము. ఇంగ్లీషులో పెరిగాము. చిన్నప్పుడు, మా స్వంత భాషలపై మాకు పెద్దగా ఆసక్తి లేదు, కానీ మేము వాటిని మా చుట్టూ విన్నాము. కానీ, నాకు భాషలంటే ప్రేమ కాబట్టి నా కుటుంబంలోని ఇతర సభ్యుల కంటే, నా తోబుట్టువుల కంటే ఎక్కువగా నేను వాటిని గ్రహించాను.
నేను పంజాబీ, హిందీ, ఇంగ్లీషుల్లో పెరిగాను. మూడుభాషల్లో మాట్లాడ్డం, చర్చించడం, వ్యవహరించడం సమానంగా వచ్చు. ఇంగ్లీషులో, హిందీలో రాయడం చదవడం వచ్చు. పంజాబీ చదవగలను, కానీ సులభంగా రాయలేను. మాట్లాడటం అస్సలు సమస్య కాదు. కానీ మేము మా పబ్లిషింగ్‌ని ప్రారంభించినప్పుడు, మాకున్న సందిగ్గ్ధాల్లో మీరు అడుగుతున్న ప్రశ్న ఒకటి. ఇంగ్లీషు ప్రివిలెజ్ ఉన్న భాష. అధికారపు భాష. మేము ఆంగ్లంలో ప్రచురిస్తాము. ఢల్లీిలో ఉన్నాము. మరి స్త్రీవాదులం ఎలా అవుతాం? మనకు తెలిసిన వాస్తవికతకు భిన్నంగా భారతదేశంలో చాలా జరుగుతున్నాయి. అందుకే, నా ముందున్న దారి, ముందుకు వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవడం. నా ముందున్న సవాలు అది. చేయడమో వదిలెయ్యడమో. ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నాం. మొదలుపెట్టాక ఉన్న పరిమితుల్లో ఏం చెయ్యొచ్చో ఆలోచిద్దామనుకున్నాం. వాటిలో ఒకటి, చాలా ముఖ్యమయినది, భారతీయ భాషల్లోకి అనువాదం చెయ్యడం. కానీ, దానికి తగిన వనరులు లేకుండా ముందుకు పోవడం అంటే దిశ తెలియకుండా దూసుకుపోవడమే. ఎవరో ఈ పుస్తకం బాగుందని చెబుతారు. మేము దాన్ని అనువాదం చేస్తాం. కానీ ఈ మధ్య కొంచెం విభిన్నంగా ముందుకు వెళుతున్నాం. విస్తృతమయిన ఆంగ్ల సాహిత్యాన్ని భారతీయ భాషల్లోకి తీసుకువెళ్ళడమంటే నిజంగా చాలా సంతోషకరమయిన విషయం. కలకత్తాలో అనువాదంలో ఆసక్తి ఉన్న ప్రభ ఖైతాన్ ఫౌండేషన్ అనే ఒక సాహిత్య ఫౌండేషన్ గురించి మాకు తెలిసింది. నేను ఒక రోజు దాన్ని నడుపుతున్న వ్యక్తితో మాట్లాడాను. ఆతను అనువాద రంగంలో కృషి చేయాలనుకుంటున్నాడు. అతనికి ఒక నిర్దిష్ట ఆలోచన ఉంది. దాన్ని చర్చకు పెట్టాడు. జుబాన్ ఏదయినా పెద్ద అనువాద సంబంధిత ప్రాజెక్ట్ ఎందుకు చెయ్యకూడదు అన్నాడతను. నేనన్నాను, లేదు, మాకు ఆసక్తి లేదు. మాకు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన పుస్తకాల మీదే ఆసక్తి ఉంది అని. అయితే సరే, కొంచెం వివరించండి, మీకు దేని మీద ఆసక్తి ఉంది అని అడిగాడు. స్త్రీవాద రచనలను భారతీయ భాషల్లోకి అనువదించగల అనువాదకుల కోసం అనువాద గ్రాంట్లు అందుబాటులో ఉంచాలని కోరిక. భారతీయ భాషలలో స్త్రీవాద సాహిత్యం లేదని కాదు. కానీ, మేము అప్పటికే భారతీయ భాషల నుండి ఆంగ్లంలోకి అనువదిస్తున్నాము.
అయితే, అనువాదాలు రెండు వైపులా నుండి చేద్దాం, నాకో బడ్జెట్ ఇవ్వండి, నేను మూడు సంవత్సరాలకు సరిపడా డబ్బు ఇస్తాను, అన్నాడు. అలాగే చేసాం. బడ్జెట్ తక్కువే. కానీ, అతను ఇచ్చిన డబ్బుతోనే మేము పని చేసాం. మూడేళ్లలో పదకొండు భారతీయ భాషల్లోకి నలభై ఏడు అనువాదాలు తీసుకువెళ్లగలిగాం. నాకది అద్భుతంగా అనిపించింది. ఎన్నో విషయాలు తెలిసాయి. మీరు నాకు భూమిక చూపించినప్పుడు, సత్యవతిగారి గురించి చెప్పినప్పుడు, నాకిదంతా గుర్తొచ్చింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు లాంటి దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో, కొన్ని ఉత్తర భారతదేెశ రాష్ట్రాల్లో స్వతంత్ర ప్రచురణ సంస్థలను నడిపే వ్యక్తులను మేము కలిసాం. వాళ్ళందరూ కూడా కేవలం తమ అభిరుచి, నిబద్ధతలతో వాటిని నడుపుతున్నారు. వాళ్లకు ఇలాంటి అనువాద ఆర్థిక సహకారం ఉపయోగపడవచ్చు. ఊర్మిళ పవార్, మీనాక్షి మూన్‌ల పుస్తకం, అంబేద్కర్ ఉద్యమంలో పనిచేసిన మహిళల మీద మేము ప్రచురించిన పుస్తకం తమిళం, తెలుగు, కన్నడలోకి అనువాదమయ్యింది. ప్రతి భాషలోనూ స్త్రీలే ఈ అనువాదాలకోసం ముందుకు వచ్చారు.
నిజానికి ఆ గ్రాంట్ దేనికీ సరిపోదు, కానీ కొంతవరకు ఉపయోగకరం. అంటే, మన పనుల్లో పరిస్థితుల్లో మన వర్గం, స్థానం, భాష పరిమితులుగా మారితే, మనం దాన్ని ఓటమిగా చూస్తామా లేదా మరింతగా పని చెయ్యడానికి ఒక అవకాశంగా చూస్తామా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. మేమదే చెయ్యడానికి ప్రయత్నించాం. కలకత్తానుండి నిధులు ఇచ్చే వ్యక్తి మూడేళ్ల తర్వాత మాకు నిధులు ఇవ్వడం మానేశాడు. అయన మూడేళ్లు మాత్రమే నిధులు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఇంకెవరయినా ముందుకొస్తారా అని వెతుకుతున్నాను. చూడాలి, మా ప్రయత్నం విజయవంతమవుతుందనే అనుకుంటున్నాను.
సునీత: అవును. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అంత ఖర్చు కూడా కాకపోవచ్చు. వెబ్ సైట్లు, జర్నల్స్, ఆన్లైన్ జర్నల్స్ అనువాదాలను బాగా ప్రోత్సహిస్తున్నాయి.
ఊర్వశి: అవును.
సునీత: స్త్రీల ఉద్యమాలు మరియు స్త్రీవాద ఉద్యమాల వైపు వెళదాం. స్త్రీల ఉద్యమాల నుండి చాలా శక్తివంతమైన స్వరాలు ప్రభుత్వానికి, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రత్యేకించి పంతొమ్మిది వందల డెబ్బైలలో వినిపించాయి. యాభై ఏళ్ళ తర్వాత ఇప్పటి స్త్రీవాద సందర్భానికి మరిన్ని సవాళ్లు తోడయ్యాయి. పితృస్వామ్యానికి ప్రపంచీకరణ, మార్కెట్ సంస్కృతి, ఛాందసవాద స్వరాలు, మరెన్నో శక్తులు జోడిరచబడ్డాయి. గత 50 ఏళ్లలో స్త్రీవాదం యొక్క ఈ ప్రయాణాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మారిన సందర్భంలో మనకు మరిన్ని సాధనాలు మరియు మరిన్ని వ్యూహాలు అవసరమని అనిపిస్తుంది. డెబ్బైలలో లేదా ఎనభైలలో మనం ఉపయోగించిన వ్యూహాలు ఇప్పుడు పని చేయకపోవచ్చు. మనమందరం మరింత వ్యూహాత్మకంగా పనిచెయ్యడం నేర్చుకుంటున్నాం. మీరు ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తారు? ప్రస్తుత స్త్రీవాద దృక్పథానికి ఏం సలహాలిస్తారు?
ఊర్వశి: నేను ఆ ప్రశ్నలో కొంత భాగానికి సమాధానం చెప్పగలను. పూర్తిగా సమాధానం చెప్పగలనో లేదో తెలియదు. ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తున్నారని అడిగినందుకు సంతోషం. నిజంగానే ఇది ఒక ప్రయాణం. ఆలా ఒక ప్రయాణంగా చూడడం చాలా ముఖ్యం. చాలాసార్లు మనం ఆలా చూడం. ఎందుకంటే బోధనాశాస్త్రంలో మన చరిత్రలు లేవు, మనమధ్యలో కూడా లేవు. మీకు చెప్పాను కదా ఒక చిన్న ప్రయోగాన్ని గురించి? మహిళలు ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఎలా దోహదం చేసారో బోధించేటప్పుడు విద్యార్థుల నుండి వచ్చే సమాధానాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. శతాబ్దాల పూర్వపు చరిత్ర కాదు కదా? అయినా వాళ్లకు దాని గురించి చాలా తక్కువ తెలుసు. కాబట్టి, ఎలాగయినా సరే ఈ విషయాలన్నీ మన బోధనలోకి తీసుకురావాలి. డెబ్భైలలో విమెన్స్ స్టడీస్ సెంటర్లు, విమెన్స్ స్టడీస్ ఒక సబ్జెక్టుగా వచ్చినప్పుడు వ్యక్తిగత రంగాన్ని కూడా పరిశోధనలోకి తీసుకొచ్చాయి. పరిశోధన అంటే కేవలం పబ్లిక్ రంగంలో ఉండేది మాత్రమే కాదని, ఇంటి గడప దాటి లోపలి వెళ్లాలని చెప్పాయి. గడప దాటి లోపలి వెళితే ఏముంది, అల్లుకుపోయిన సంబంధాలు, కథలు, ఇంకా ఎన్నో. ముక్కలై ఎండిపోయిన సంఖ్యలు, అంకెలు కనిపించవక్కడ. వాటికీ భిన్నమయినవెన్నో కనిపిస్తాయి. వాటిని ఎలా అర్థం చేసుకుంటాం? అర్థం చేసుకునే సాధనాలేవి? ఇంట్లో జరిగే విషయాలను ఎలా కొలుస్తాం? ఎలా మ్యాప్ చేస్తాం? ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా అర్థం చేసుకోవాలి, స్త్రీల పాత్రను ఎలా చూడాలి అన్నవన్నీ మనం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమయినది. కొన్ని రకాలుగా చూస్తే చాలా మార్పు వచ్చింది. నేను వెనక్కు తిరిగి డెబ్భైల వైపు చూస్తే, మేము వీధుల్లో ఉద్యమాలు చేసాం. చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, చెప్తాను. అప్పట్లో రాజ్యం వేరే లాంటి జంతువు. వర్గవాదం, కులతత్వం లాంటి అన్ని విభేదాలు ఉన్నా, అప్పటి రాజ్యం కొంత జవాబుదారీతనం చూపించేది. రాజ్యాన్ని బాధ్యురాలిని చెయ్యగలిగేవాళ్ళం. ఢల్లీిలో నిరసన ఊరేగింపులు తీసేవాళ్ళం, బోట్ క్లబ్ దాక మార్చ్ చేసేవాళ్ళం. పార్లమెంట్ సభలకు ప్రతినిధి బృందాన్ని తీసుకు వెళ్ళేవాళ్ళం. ఎవరో ఒక మంత్రి బయటకు వచ్చి మెమొరాండం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది అసాధ్యం. రాజ్యం ప్రజలనుంచి దూరమవడమే కాదు, ప్రజలపట్ల ద్వేషపూరితంగా ఉంది. దాదాపు ప్రజలతో యుద్ధం చేస్తున్నట్లే ఉంది. డబ్బు యొక్క శక్తి అధికారాన్ని మరింత ప్రాణాంతకంగా మార్చింది.
కాబట్టి ఆ వ్యూహాలు ఇకపై పని చేయవు. మీరు ఇకపై వీధులను కూడా క్లెయిమ్ చేయలేరు. కాబట్టి యుద్ధ రంగాలు మారాలి, తదనుగుణంగా వ్యూహాలు కూడా మారాలి. కానీ ఎక్కడ, ఎలా అన్నది కష్టమయిన ప్రశ్న. కొంత వరకు ఇంటర్నెట్‌లో సమీకరించవచ్చు, కానీ ఎక్కువగా తమ స్త్రీవాదాన్ని ఇంటర్నెట్లో అమలు చేస్తున్న యువ స్త్రీవాదులకు ఏం జరుగుతోంది? ఒక విషయం ఏమిటంటే కమ్యూనిటీ బిల్డింగ్ చాలా ముఖ్యమైనది. అణచివేతకు గురి కాబడ్డ అస్తిత్వాలు ఇంటర్నెట్లో మరింత సులభంగా విజ్ఞానాన్ని పంచుకోగలవు, సమూహాలను నిర్మించుకోగలవు. కానీ, చుట్టుముడుతున్న ఒంటరితనం సంగతేమిటి? జరుగుతున్న మార్పుని కళ్ళతో చూడలేము. మేము చూడగలిగే వాళ్ళం. కాగితం మీద వచ్చిన మార్పు అంత గొప్పదేం కాదని మీరు అనొచ్చు, కానీ, ఆ మార్పు రావడం మేము చూసాం. పోరాడాం, చట్టాలను మార్చాం. అంటే, మార్పు సాధ్యం, నేను సాధించగలను అన్న నమ్మకం వచ్చింది. ప్రదర్శనలు చేసాం, కార్మికుల వేతనాల్లో పెంపును తెచ్చాం. అంటే, మార్పుకు అవకాశం ఉంది అన్న నమ్మకం వచ్చింది.
మార్పు సాధ్యం అవుతోంది. అది సంఫీుభావాన్ని సృష్టించింది. బలపరచింది. అదంతా ఇప్పుడు పోయింది. ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న నా యువ విద్యార్థులు కొంతమంది ఏమంటారంటే, సరే, ఇప్పుడు నేను స్త్రీవాదిగా మారతాను, తర్వాత ఏమిటి? నేను ఉద్యమంలో ఎలా చేరాలి అన్న ప్రశ్న కూడా అడుగుతారు. మా విషయంలో ఎలాగంటే, ఉద్యమం మా చుట్టూ ఉండేది, మా చుట్టూ ఎన్నో జరుగుతూ ఉండేవి. చాలా ‘‘సహజంగా’’ మేము దానిలోకి అడుగుపెట్టాము. కాబట్టి మనం ఎలాంటి వ్యూహాలు సృష్టించుకోవాలో నాకు తెలియదు. కానీ మనం ఎదుర్కొంటున్న సమస్యలు చాలా క్లిష్టంగా మారాయన్నది మాత్రం స్పష్టం. విజ్ఞాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం, దాని ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలి. అట్టడుగు నుండి, అణగదొక్కబడిన ప్రజల నుండి, సామాన్యుల గొంతులు, కథల నుండి విజ్ఞానాన్ని సృష్టించుకోవాలి. గతంలోకంటే ఎక్కువగా ఇప్పుడు ఆ అవసరం ఉంది. నేర్చుకోవడానికి ఇదొక మార్గం.
సునీత: ఉద్యమ ప్రయాణం గురించిన ప్రశ్న అది. కానీ ఇప్పుడు స్త్రీవాదిగా మీ ప్రయాణం గురించి ఒక ప్రశ్న. ప్రారంభంలో, సిస్ మహిళల కథలు. మహిళల నుండి ట్రాన్స్ మహిళల వరకు, ఈ ప్రయాణాన్ని మీరు ఎలా వివరిస్తారు?
ఊర్వశి: నిజానికి, సునీతా, మీకు తెలుసా, మనం ఫ్రాంక్, ఓపెన్, వల్నరబల్ సంభాషణలు చేయగలిగితే, మనం ఆలోచించడానికి ఇది చాలా ఉత్తేజకరమైన విషయాలలో ఒకటి. విషాదమేమిటంటే, అలాంటి సంభాషణలు పెద్దగా జరగడం లేదు. 2006లో అనుకుంటా, కలకత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మహిళా ఉద్యమాల సదస్సు లో తొలిసారిగా ట్రాన్స్ మహిళలు ప్రవేశించారు. వేలాది మంది కలిసి ఉన్నాం. తినడం, తాగడం, మాట్లాడడం, నిద్రపోవడం అంతా ఒకే చోటే. కాలికట్‌లో దళిత మహిళల లాగానే ట్రాన్స్ మహిళలు కొన్ని ప్రశ్నలను సంధించారు. ఎందుకంటే ఒకే చోట పడుకోవడం, ఒకే టాయిలెట్‌ను వాడడం గురించి చాలా మంది సిస్ మహిళలు భయాందోళనలకు గురయ్యారు, ప్రాథమికంగా చెప్పాలంటే, ఎంతయినా వాళ్ళు మగవాళ్లే కదా అన్నట్లు. వాళ్ళ శరీరాలు పరివర్తన చెందిన మగ శరీరాలు, అప్పట్లో పరివర్తనాలు కూడా ఇప్పటి లాగా లేవు. ఆ క్షణం నుండి ఈ రోజు వరకు చాలా మార్పు వచ్చింది. వ్యక్తిగతంగా కూడా నాలో చాలా మార్పు వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ రోజు నా ప్రెజెంటేషన్‌లో నేను మాట్లాడబోతున్నది ఒక హిజ్రా మహిళతో నా చర్చలు, సంబంధం, స్నేహం గురించి. నేను తన జీవితం మీద పుస్తకం రాస్తున్నాను. నాకు ఆమె ఎప్పుడు ఒక స్త్రీగానే తెలుసు. ఆమెను ఒక స్త్రీగా తప్ప ఇంకేలాగు చూడలేదు. నేను ఆమెను ట్రాన్స్‌గా ఎప్పుడూ అనుకోలేదు. నేను ఆమెగానే సంబోధిస్తాను. కానీ ఆమె చాలా అస్తిత్వాల మధ్య మసలింది. ఆమె జీవిత చరమాంకంలో ఆమె మేనల్లుడు ఆమెతో కలిసి ఉండేవాడు. అతనికి ఆమె ఇప్పటికీ అతని మేనమామ. మామధ్య అద్భుతమయిన సంభాషణలు నడిచేవి. ఆమె పేరు మోనా, మేనల్లుడు నాసిర్, ఇంకా నేను. మోనా తన గురించి నేను ఇలా చేస్తాము, నేను వెళతాము అని మాట్లాడేది. చాలా జాగ్రత్తగా జెండర్‌ను అవాయిడ్ చేసేది. మేనల్లుడు ఆమెని అతడుగానే సంబోదించేవాడు. నేను తనని మోనా అని, ఆమె అని సంబోధించేదాన్ని. ఆలా మేము చాలా మాట్లాడుకునేవాళ్ళం. నాకయితే ఇది చాలా వ్యక్తిగతమయిన విషయం కూడా. వాస్తవానికి, మనకు ఇప్పుడు స్పెక్ట్రమ్ గురించి తెలుసు. సెక్స్ అన్నది జీవసంబంధమయినది, జెండర్ అన్నది సామాజికమయినది అన్న పాత బైనరీ ఇప్పుడు వర్తించదు. మానవశరీరంలో మార్పులు జరగొచ్చని, అవి మనల్ని జీవితంలో ఎప్పుడయినా, అది కూడా అసలు ఊహించని సమయంలో, ఆటో ఇటో లేదా సగం ఆటో ఇటో తిప్పొచ్చని విజ్ఞాన శాస్త్రం తన పరిశోధనల్లో నిరూపిస్తూనే ఉంది. అది మనకు తెలుసు. జెండర్ అంటే ఏమిటి, దాని నిర్ధారణ దేని మీద ఆధారపడి ఉంటుంది, శరీరమా లేకపోతే మరేమిటి అని చర్చించడానికి ఇది అద్భుతమయిన సమయం. ఆ సంభాషణలు జరిగితే బాగుంటుందనిపిస్తుంది. కానీ, అలాంటి సంభాషణలు జరగవు. ఎందుకంటే, ప్రతి విషయం కూడా నిశ్చయత అన్న మురికిలో ఇరుక్కుపోతుంది, పురుషులనుండి స్త్రీలుగా మారే ప్రక్రియ కూడా. ఇప్పుడు పురుషులనుండి స్త్రీలుగా కూడా మారుతున్నారు. అదింకా ఆసక్తికరమయిన విషయం. నా స్నేహితురాలు మోనాను, నా ఇతర ట్రాన్స్ స్త్రీ మిత్రులను అడిగాను. వాళ్లేమంటారంటే, ప్రతి నిముషం ఆ విషయంతో సంఘర్షించడం వల్ల వచ్చే అలసట భయంకరంగా ఉంటుందని, ఒక్కోసారి వదిలేయాలని అనిపిస్తుందని. ఎందుకంటే, పురుషుడుగా ఉండడం చాలా సులభం. వెనక్కు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అందుకే వాళ్ళు అస్తిత్వాల మధ్య మారుతూ ఉంటారు. అంతే కాదు, నువ్వు శిక్షణ పొందిన అస్తిత్వం నీది కాదు అని మనసెప్పుడు చెపుతుందో అర్థం కాదు. తను కాని వ్యక్తిగా జీవించడమంటే ఒక యుద్ధమే. ఇదంతా మాట్లాడుకోగలిగితే ఎంతో బాగుంటుంది. కానీ, మాట్లాడుకోము ఎందుకంటే, సందేహాలు వ్యక్తపరిచగలిగే అవకాశాలను మనం తుడిచేసాం. అదే విషాదం. కానీ, మహిళా ఉద్యమాల్లో ఇదొక అద్భుతమయిన మలుపు.
సునీత: తను కావాలనుకుంటున్నట్లుగా ఉండాలనుకోవడం, అలాంటి గుర్తింపుని ఇతరుల నుండి పొందాలనుకోవడం.
ఊర్వశి: ఇంకొక విషయం కూడా, సునీతా. వ్యక్తికి తన మనసు తెలియవచ్చు. తాను తనది కాని శరీరంలో ఉందని మోనాకు తన చిన్నప్పటి నుండి తెలుసు. కానీ, తాను కోరుకునే తీరాన్ని చేరుకోవాలని కోరుకున్నప్పుడు, మనసు లాగే శరీరానికి కూడా ఆ అవగాహన ఉండాలి కదా. అదొక్కటి జరిగితే సమస్యలన్నీ తీరిపోతాయనుకోవచ్చు. కానీ, కాదు. శస్త్రచికిత్స జరగొచ్చు, శరీరాన్ని స్త్రీ శరీరంగా మార్చొచ్చు. తాను స్త్రీ అని మనసుకి అప్పటికే తెలుసు. కానీ సమస్య అక్కడితో తీరదు, ఎందుకంటే ఆ విషయం ఇతరులకు కూడా తెలియాలి కదా.
సునీత: స్త్రీవాద చైతన్యపు మూలాల గురించి ఆలోచిస్తున్నాను. మొదట్లో, మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ను చూస్తే, ఆమె కుటుంబజీవితం, విద్య లాంటి విషయాల గురించి మాట్లాడటం ప్రారంభించింది. స్త్రీవాదపు మొదటి రెండవ తరంగాల్లో ఉన్నది ప్రధాన స్రవంతి స్త్రీలే. కానీ, దళిత, నల్లజాతి, ఆదివాసీ స్త్రీలు ఉప్పెనలా మాట్లాడ్డం మొదలు పెట్టారు. విభిన్నమయిన అస్తిత్వాలు, అనుభవాలు స్త్రీవాదాన్ని మరింతగా విస్తృతం చేస్తూనే ఉన్నాయి. చీర కట్టుకోవడం ఇష్టం లేదు, అందుకే వేరే డ్రెస్ వేసుకున్నాను అన్నంత సులభం కాదు. నాకు ఈ శరీరం వద్దు, మరో శరీరం కావాలి అనడం. దుస్తులు ఎంచుకోవడం కూడా పోరాటమయిన సందర్భాలు ఉంటాయి, కాదనను. కానీ, ట్రాన్స్ వ్యక్తుల సవాళ్లు, పోరాటాలు, సంఘర్షణలు, ఆనందాలు వేరు.
ఊర్వశి: అవును, అదే. భిన్న కుల అస్తిత్వాల మధ్య క్లిష్టమయిన సంభాషణలు ఎలా జరగాలి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, యూపీ స్త్రీల గురించి. క్లుప్తంగా చెప్తాను. బ్రాహ్మణులు, బహుజనులు, దళితులు ఉన్న చిన్న గ్రూప్ అది. వారు మాట్లాడగలిగిన విధానం, వారి బలహీనతలు, దళిత స్త్రీలు లేవనెత్తిన ప్రశ్నలు, వాటి పరిష్కారాలు, తమ స్నేహాన్ని నిలుపుకున్న విధానం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ పుస్తకం పేరు ప్లేయింగ్ విత్ ఫైర్. వాళ్ళందరూ తమ జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే ఆ పుస్తకం. తర్వాత వాళ్లతో ఒక ఎపిసోడ్ రికార్డ్ చేసాం. వాళ్లు కులం గురించి ఎలా మాట్లాడారో తెలుసా? కులాల విభజనను దాటుకుని తమ సమస్యలను ఎలా పంచుకున్నారో తెలుసా? ఆ పుస్తకం హిందీలో ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
సునీత: స్త్రీవాద రచనలు, పరిశోధన చెయ్యాలనుకునేవాళ్లకు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏం చేయొచ్చు, ఏం చేయలేము, ఎలాంటి పరిశోధన చెయ్యొచ్చు, సబ్జెక్టివిటీ విషయం ఏమిటి, మన జీవితాలను కథలుగా చెప్పగలమా అంటూ.
ఊర్వశి: అవును, మనం మన కథలు చెప్పాల్సిందే. ఒక రచయితగా సబ్జెక్టిటివిటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను విభజన గురించి వ్రాసేటప్పుడు ఇదే జరిగింది. సబ్జెక్టివ్ గా ఉండడం, దాని గురించి బాధపడడం మధ్య సంఘర్షణకు లోనయ్యాను. ఆ కథల్లో నేను చాలా లోతుగా, ఎమోషనల్‌గా చిక్కుకుపోయాను కాబట్టి నేను ప్రయత్నించాను. ఆ సంభాషణల్లో ఏడుస్తూనే నేను ముందుకు వెళ్ళాను. దూరంగా నిలబడి చూస్తున్నట్లు రాయడం మొదలుపెట్టాను. కానీ అదంతా తెలివితక్కువగా, నిజాయితీ లేనట్లుగా అనిపించింది. చివరికి ఆలా రాసిందంతా పడేసి తర్వాత నాకనిపించినట్లు ఈ పుస్తకం రాసాను. కొన్నిరకాలుగా చూస్తే అదే ఆ పుస్తకాన్ని నిలబెట్టింది, అంటే, 23-24 ఏళ్లుగా ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నారు. ఇంకా నిలబడే ఉంటుందని అనుకుంటున్నాను. ఒక పబ్లిషర్‌గా అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం స్త్రీలుగా సబ్జెక్టివిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తామేమో అనిపిస్తుంది. ఆలా చెయ్యకూడదు. ఇది కేవలం నా అనుభవం మాత్రమే అనుకోకుండా వ్యక్తిగత అనుభవం విస్తృత వాస్తవికతతో ఎలా ముడిపడి ఉంటుందో తెలుసుకోవాలి. ఆ అవగాహన చాలా అవసరం.
సునీత: మనం పంచుకోవడం మొదలుపెడితేనే ఆ అవగాహన వస్తుంది.
ఊర్వశి: అవును, మనం పంచుకోవడం మొదలు పెట్టినప్పుడు దాని ప్రాధాన్యం తెలుస్తుంది. పంచుకోవడానికి ఒక కమ్యూనిటీ కూడా దొరుకుతుంది. ఎందుకంటే, రచయితలను ఒంటరితనం వెంటాడుతుంది. పంచుకోండి, అభిప్రాయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు నేను మాట్లాడిన మోనా జీవిత చరిత్రను నేను కొంతమంది మిత్రులతో పంచుకున్నాను. ఇద్దరయితే చదివారు, దాన్ని నిశితంగా విమర్శించారు. ఆ ఇద్దరు నివేదిత మీనన్, సుందర్ సరుక్కాయ్. ఇప్పుడు నేను పునరాలోచిస్తున్నాను. ఆ పుస్తకాన్ని ఎలా తిరగరాయాలో ఆలోచించుకోవడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది. వాళ్ళ విమర్శ దృఢమయినది, లోతయినది. మొదట్లో కాస్త బాధపడినా, ఇప్పుడు వాళ్లకు నా కృత్ఞతలు.
సునీత: మీ టైం చాలా తీసుకున్నాను. మీతో ఇలా మాట్లాడగలగడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎంతసేపయినా మీరు చెప్పేది వింటూనే ఉండాలని ఉంది. ఈ చర్చ భూమిక పాఠకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నాను. నిజానికి చాలా మంది రచయిత్రులు భూమిక నుండి తమ ప్రయాణం మొదలుపెట్టారు. ధన్యవాదాలు.