ఈ మధ్య కాలంలో పిల్లల మీద విపరీతంగా లైంగిక దాడులు పెరిగిపోయాయి. ఒక పేరున్న హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివే ముగ్గురు కుర్రాళ్ళు రెండో తరగతి చదువుతున్న పాప పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారం వారం షీ టీమ్స్ కౌన్సిలింగ్‌కి పోలీసులు తీసుకొచ్చే మగపిల్లలు రోడ్ల మీద ప్రవర్తిస్తున్న తీరు గమనిస్తే తీవ్రమైన కోపంతో పాటు ఆందోళన కూడా కలుగుతుంది.
చదువుకున్న వాళ్ళతో పాటు, చదువు సంధ్య లేకుండా బేకారుగా రోడ్ల మీద తిరిగే మగపిల్లలు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో పోలీసులు రికార్డు చేసే వీడియోల్లో చూస్తుంటే వీళ్ళ వల్ల ఎంత పబ్లిక్ హింస జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గుంపులు గుంపులుగా మోటార్ వాహనాలతో తిరుగుతూ బస్ స్టాపుల దగ్గర, ఆడపిల్లల కాలేజీలు, హాస్టళ్ళ దగ్గర అసభ్యకరమైన కామెంట్లు చెయ్యడం, దగ్గరకొచ్చి ముట్టుకోవడం, ఫోటోలు, వీడియోలు తీయడం, వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, బెదిరించడం ఇలా ఎన్నో అకృత్యాలకు మగపిల్లలు తెగబడుతున్నారు. సభ్యత, సంస్కారం అనే మాటలకి వీళ్ళకి అర్ధం తెలియదు. వీరి చర్యల్ని గమనించినపుడు బహిరంగ ప్రదేశాలు మహిళలకు ఎంత అభద్రంగా ఉన్నాయో అర్ధమౌతుంది.
ఇలా పోలీసులకు పట్టుబడిన మగపిల్లలకి కౌన్సిలింగ్ చేసేటప్పుడు కౌన్సిలర్లు బహిరంగ ప్రదేశాల్లో వారు చేస్తున్న వికృత చర్యల పరిణామాల గురించి, చట్టాల గురించి, పోలీస్ కేస్ అయితే భవిష్యత్తులో వారు ఎదుర్కోబోయే పరిణామాల గురించి వివరంగా చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. ముఖ్యంగా సైబర్ క్రైంకి పాల్పడినప్పుడు అరెస్టులు, జైళ్ళు ఉంటాయని చెప్పినప్పుడు మరింత భయపడతారు. ఒకవేళ ఎఫ్‌ఐఆర్ అయితే వారి పై చదువులు, విదేశాలకు వెళ్ళాలంటే వీసా రాదని, ఉద్యోగం రాదని ఇలా ఎన్నో విధాలుగా మాట్లాడి కౌన్సిలర్ వాళ్ళు చేసిన చర్యల పరిణామాలను వివరిస్తారు. ఒకసారి కౌన్సిలింగ్‌కు వచ్చిన వాళ్ళు రెండో సారి పోలీసులకు దొరికిన కేసులు ఒక్కటి కూడా లేవు. దీనిని బట్టి అర్ధమౌతున్నది ఏమిటంటే మగ పిల్లలకి మంచి చెడూ చెప్పేవారు, వారి చర్యల పర్యవసానాల గురించి వివరించే వారు ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు కానీ, స్కూల్లో టీచర్లు గానీ ఈ అంశం మీద వివరంచడం లేదు. తల్లిదండ్రులు వారి వారి జీవన పోరాటాల్లో మునిగి ఉండడం, టీచర్లకు సమయం ఉండక పోవడం లాంటి ఎన్నో కారణాలు.
పై నేపథ్యంలోంచి చూసినపుడు డాక్టర్ విజయలక్ష్మిగారు ప్రచురించిన ‘‘చిన్నోడికి ప్రేమతో’’ పుస్తకం ఎంత విలువైనదో అర్ధమౌతుంది.
డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు చాలా కాలంగా తెలుసు. పిల్లల కోసం ఆవిడ నిర్వహించే కార్యక్రమాలు తెలుసు. పిల్లలంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. ఇటీవల విజయలక్స్మి గారు ప్రచురించిన పుస్తకం ‘‘చిన్నోడికి ప్రేమతో’’ పేరుతో తెచ్చిన పుస్తకం అన్ని విధాలా చాలా విలక్షణమైంది. ఈ పుస్తకమంతా ఉత్తరాల రూపంలో ఉంది. దాదాపు 250 పేజీల పుస్తకం. చిన్నోడికి ప్రేమతో అంటూ తన కొడుకు ప్రకాష్‌కి రాసిన ఈ ఉత్తరాల పూల తోటలో ఎన్నో పూలు వికసించాయి. పరిమళాలు వెదజల్లాయి. ఒక్కో ఉత్తరం చదువుతూ పోతుంటే అమ్మ నుంచి అపారమైన ప్రేమతో పాటు ఎన్నో అంశాల గురించి ఉగ్గుపాలతో రంగరించినట్టు ఆమె చెప్పిన విధం అద్భుతం.
ముందే నేను ఉత్తరాల ప్రేమికురాలను. ఉత్తరం రాయడం, అందుకోవడం మహా ఇష్టం నాకు. ఇన్ని ఉత్తరాలు ఒకేసారి అదీ తల్లి తన పిల్లవాడికి ప్రేమగా రాసినవి చదవడం గొప్ప అనుభవం. విజయలక్ష్మి చాలా బిజీగా ఉండే డాక్టర్. అయినప్పటికీ అనివార్యంగా హాస్టల్‌లో ఉన్న కొడుకు కోసం టైం తీసుకుని ఎన్నెన్నో అంశాలను పిల్లవాడికి ఉత్తరాల రూపంలో అవగాహన కలిగించగలిగారు. పర్యావరణం గురించి, ప్రకృతికి సమీపంగా ఉండడం గురించి ఆటలు, పాటలు, చుట్టూ కమ్ముకుని ఉండే మొక్కల గురించి ఎంతో వివరంగా రాయడమే కాక పిల్లాడు వాటి పట్ల ప్రేమ పెంచుకునేలా రాసారు. సైన్స్ గురించి, పుస్తకాల గురించి, స్ఫూర్తి ప్రదాత లైన వ్యక్తుల గురించి మనసుకు హత్తుకునేలా రాసారు.
‘‘పుస్తకాలతో స్నేహం’’ పేరుతో రాసిన ఉత్తరంలో
‘‘తల్లిగా లాలించి తండ్రిగా నడిపించి-గురువుగా మనసులో బరువు దించి
నిశ్శబ్ద మితృడై నీడగా వెన్నంటి-పదిమంది సభలోన పరువు నిలిపి
బ్రతుకు శూన్యంబుగా పల్కరించిన వేళ-బాసటగా నిలిచి బాట చూపి
సందేహములు చేరి సందడి చేయగా-నిక్కచ్చి ఐనట్టి నిజము చెప్పి
ప్రగతి దారుల పయనించు తెగువ నిచ్చి-చేతబట్టిన ప్రతి ప్రతివారికీ ఊతమిచ్చి
ఆశ్రయించిన వారికి అర్ధమగుచు మస్తకంబుల మలచు పుస్తకంబు’’ ఇలాంటి ఆణిముత్యాలు ఈ పుస్తకం నిండా దొరుకుతాయి.
ప్రతి తల్లీ, తండ్రీ, గురువూ ఇలాంటి అంశాలను గురించి జీవన నైపుణ్యాల గురించీ, సమాజంలో వారు ఎలా ప్రవర్తించాలి, సభ్యతా సంస్కారాలు ఎలా అలవర్చుకోవాలి, తనతో పాటు బతికే అమ్మాయిల పట్ల ఎలా సెన్సిటివ్‌గా వ్యవహరించాలి అనే విషయాలను పదే పదే చెప్పాలి. బయట ప్రపంచంలో తమ సుపుత్రులు ఎలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారో గమనించుకోకపోతే ‘‘పోక్సో’’ లాంటి తీవ్రమైన చట్టాల్లో ఇరుక్కు పోయే ప్రమాదం ఉంది. చాలా సులభంగా అందరికీ అందుబాటులోకి వచ్చేసిన గంజాయి లాంటి మత్తు పదార్ధాల ప్రభావంలో పడుతున్నారేమో కూడా గమనించుకోవాలి. సమాజపు పోకడలతో పాటు పుస్తకాలని, ప్రకృతిని, సైంటిఫిక్ టెంపర్ని బిడ్డల ఎదుగుదలకు అవసరమైన సమస్త అంశాలని ప్రేమతో రంగరించి తన కొడుక్కి ఉత్తరాల రూపంలో అందించిన విజయలక్ష్మి గార్కి ధన్యవాదాలు, అభినందనలు. అందరూ ఈ పుస్తకం చదవాలని తమ పిల్లలతో చదివించాలని కోరుకుంటూ…