మానవ మనుగడ అంతా నియంత్రణ కోసం పోరాటమే అనిపిస్తుంది. తంగలన్ తమిళుడా? ద్రావిడుడా, శతాబ్దాల క్రితం వంచించబడ్డ దళితుడా, ఆఫ్రికన్ సోదరుడా, రెడ్ ఇండియన్ నాయకుడా, అండమాన్‌లో అంతరించిపోయిన జాతుల ఏకైక నీడా? తంగలన్ ఇవేవి కాడు. జాతి చరిత్రను ఈడ్చుకుపోయి, కులం చెట్టున వేలాడదీసినప్పుడు ఊపిరికై తన్నుకులాడిన సమయాలలో పెనుగులాట తంగలన్.
ఆ పెనుగులాటలో బ్రతుకు మీద ఆశ తంగలన్. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే ప్రయాణంలో నమ్మిన హేతువు తంగలన్. ఆ హేతువును ఆధారంగా చేసుకుని, ప్రస్తుతానికి తలవం చకుండా భవిష్యత్తు కొరకు ఊపిరి బిగపట్టి, ప్రాణాలు ఒత్తిపెట్టి, నొప్పిని ఆయుధంగా మార్చి మరికాస్త ముందుకు సాగి తనవారికి, తన తరవాత తరాలకు అమూల్యనిధిని అందించాలని తపనపడినవాడు తంగలన్. మరి ఆరతి? తంగలన్‌కు ప్రతిధ్వని. ప్రతి నాయుకురాలైన నాయకురాలు. ఆమె ప్రకృతి. ఆరతి రక్తం చిందిస్తే తప్ప భూమి బంగారం కాదు. ఆ రక్తపు బంగారమే కదా అణిచివేసేవారికి కావలసింది. ఏ నిధి అయినా అలా సాక్షాత్కరించిందే. రక్తం చిందించనిదే నిధి దొరకదు! ఆ చిందించే రక్తం, ఎవ్వరిది? నిధి చుట్టూ ఉన్న మాయలు, మంత్రాలు, దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలు-వీరంతా ఎవరు? తమ ఉనికిని, నిలువనిచ్చే భూమిని, నీడనిచ్చే ఆకాశాన్ని కాపాడుకోవడం కోసం ఎవరు ఎవరితో యుద్ధం చేశారు? ఆరతి తంగలన్ ఒకే దేహంలో ఢీపడే రెండు హేతువులు. వారి పోరాటం, వ్యక్తిలోని రెండు భిన్న అస్తిత్వాల మధ్య పోరాటం. ఆరతి తంగలన్‌లోని మరో తంగలన్ కదా? ఎంత శక్తిమంతుడైన మగవాడు అయినా భూమి ముందు, మహిళల ముందు పిల్లవాడే. ఆ మాటను పదేపదే చెప్పారు. మహిళను భూమికి ప్రతీకలుగా నిలబెట్టారు. అది గలగలా పారే గంగమ్మాయినా, దడదడలాడే ఆరతి అయినా. ‘భూమాత ఇచ్చిందే తీసుకోవాల, మనం కావలనుకుంటే దొరకదు, తాను కావాల నుకుంటేనే ఇస్తది,’ అన్న మూలవాసి గొంతుక తంగలన్. చిన్న చిన్న బంగారపు పూసలతో తృప్తి పడిన తంగలన్, ఆశ పడి తననే తాను నాశనం చేసుకున్నాడు. తంగలన్ ఒక మనిషి కాదు. నాగరికత మొదలైనప్పటి నుండి వేనవేల కోట్ల మానవుల ఆశ, దురాశలు మధ్య కొట్టుమిట్టాడిన స్వార్థం. ఎదుగుదల మీద ఉన్న అపోహ.
చిన్నగా మొదలైనా కథల్లోని కథ, అసలు కథలో జమీందారు దోపిడితో తంగలన్ కుటుంబం ఉలిక్కిపడిరది. మళ్ళీ నిరాశ నుండి ఆశ. గొర్రె కసాయిని నమ్మడం అంటాం. పేదవాడు ధనవంతుడిని, నిస్సహాయుడు ఆశచూపిన వారిని నమ్మకపోతే ఇక మిగిలినది ఏమిటి? వైష్ణవమతం తీసుకున్న దళితులే, తీసుకోకపోయినా దళితులే. ఈ అపోహలతో అబద్ధపు జంధ్యాలతో తాత్కాలిక ఉపసమానాలు అక్కడిక్కడే పైన కింది బేరీజులు! కులం దెబ్బకు, జామీను నికృష్ట చర్యలకు మనసు బద్దలైన తంగలన్, దొరల వెంట పోకుంటే, మరి కొన్ని రోజులలో బతికిన శవమై తేలేవాడు. కానీ తంగలన్‌లో ఆశాగ్ని రగులుతూనే ఉంది. అది మిణుకుమిణుకుమని, కొన్ని సందర్భాలలో ఖణఖణమని, మారొకసారి భగ్గున రేగే మంటలా ఎగిసి ప్రజ్వలిత తేజంతో వెలుగుతూనే ఉంది. అశోక మాట్లాడే మాటలు మనలో ఫీుకరించే లోగొంతుక కాదా? గంగమ్మలను, ఆరతిని ఆవాహన చేసుకున్న దేహాలు భూమిపుత్రులవి కాదా? నొక్కి పడేసే ఆ గొంతుకలన్నీ ఒక్కొక్కసారి మీద కొచ్చి ఉరమవా? ప్రకృతి ఒక్కసారి వళ్ళు విరుచుకుని అత్యాశాపరుల కోరికలను క్షణంలో ముగించదా? ఎన్నిసార్లు జరిగినా సిగ్గుందా మనిషి జాతికి? ఆశ ముందుకు సాగిస్తూనే ఉంటుంది. దురాశ మోసగిస్తూనే ఉంటుంది. అది జామీను అయినా దొర అయినా. దొరకు, జామీనుకు దోపిడీ వచ్చు. అందకుంటే కాళ్ళు పట్టుకోవడం, అందకుంటే పీకలు కోయడం వచ్చిన దూర్మార్గపు నమూనాలు వీరు. ఒకరు భూస్వాములు, కులాధిపత్య పైత్యకారులు, మరొకరు రాజ్యాధి కారులు, ఐశ్వర్యం కొరకు మానవజాతులను ఒకరిపైకి ఉసిగొల్పే నక్కలు, రాబందులు. దీనికి తక్కువగాని పెట్టుబడీదారి విధానాలు. స్వంత పిల్లలనే కోల్పోయే ఆశ నిరాశలు. జీవితాన్ని నిలబెట్టే కూలదోసే సాధనాలు. మధ్యన నలిగిపోయే వారంతా భూమిపుత్రులే!!
కరువు-కడుపు, రోగం-రొష్టు, నిత్యం వెంటాడే భయం, ఆ వెనుకే ఆశ, దుర్మార్గాన్ని నమ్ముకోవడం తప్ప మరో మార్గం దొరకని నిస్సహాయత. ఆ నిస్సహాయత నుండి మండే వెలుగు. ఆ వెలుగు కొరకై బ్రతుకు. ఆ వెలుగు విప్లవమా? ఆ విప్లవం నిధి కొరకేనా? నిధి. నిధి అంటే ఏమిటి? ఎవరికి ఎలా చూస్తే అలా కనపడే దేముడిలానే, నిధి అర్ధం భద్రజీవులకు, చీకటిలో చుక్కలకోసం తారాడే వారికి ఒకటే ఎలా అవుతుంది? దొరకు నిధి-నియాంత్రణకు దారి. రాజుకు సంపద, బ్రాహ్మణుడికి ఆధిపత్యం, భూమి పుత్రుడికి ఆలంబన, ఉనికి, ఆత్మ గౌరవం, అవకాశం, బ్రతికే హక్కు. తంగలన్ నిధి, దొర నిధి ఒకటే ఎలా అవుతుంది? తనలోని ఆరతిని ఎదుర్కొనడానికి తన మరో ఉనికిని రక్తార్పణం చేసినా మళ్ళీ మళ్ళీ ఎలా వెలిగింది? ఆరతి తనలోని ప్రశ్న. తన మరో ఉనికి. తన తోబుట్టువు. తన తల్లి భూదేవికి పుట్టిన తన చెల్లి. ఆత్మీయు రాలు. ఆత్మ. నిధి అంటే? కులం, రాచరికం, పెట్టుబడిదారీ దౌర్జన్యం, ఆనకట్టలు, రహదారులు, మహా దేవాలయాలు, రాజ్యాలు, యుద్ధాలు-ఇవన్ని చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ నిధుల కొరకు సాగిన పోరాటాలు, హత్యలు, మానవ బలిదానాలు లెక్కలేవు, లెక్కలోకి రావు.
దొరికినట్టే దొరికి బంగారం మట్టిగా మారడం, ఆరతి మళ్ళీ మళ్ళీ రావడం. భూమిలో నుండి నాగుపాములు రావడం. ఆరతి ఆక్రందనలు, పిలుపు నిచ్ఛే పోలికేకలు – ఇవన్నీ ఆధిపత్యం కాంక్షించేవారి దురాగతాల పై ఆదివాసుల ప్రతిఘటన ప్రతీకలు. ఇదంతా నిర్మాణాత్మక హింసకు ఎదురెళ్ళడం వలనేనా? రాతిని కరగబెట్టి, తవ్వి కూలగొట్ట-శతాబ్దాల వ్యధను, క్షోభను భరిస్తూ ప్రాణాలు పోతున్న స్థితిలో చివరాఖరి శ్వాస వరకు పోరాడిన వారంతా ఎవరు? ఎన్నికోట్ల భూమిపుత్రుల వేదనను సమీకరిస్తే ఈ రాతిహృదయాలు ఇటువంటి హింసకు చెమర్చుతాయి?
ఆఖరున అరణ్య తన అసలు ఉనికి ఆరతిలోనే ఉంది అని తెలుసుకున్నాడు. ఇది పూర్తి పరిష్కారం కాదని తెలిసినా, ఆరతి అతని ఆక్రోశాన్ని అర్థం చేసుకుంది, అతను కోరుకున్న బంగారం వద్దకు చేర్చింది. ఆ బంగారాన్ని అందుకోవడానికి అతని సహచరులు, మహిళలు, పిల్లలు కూడా అతని వెంట వస్తారు. అది దొరలు, రాజులు కోరికలు తీర్చే బంగారమా? లేక సంస్కారం లేని నీచుల నుండి కాపాడుకునే ఆత్మగౌరవ సాధనమా? అవకాశాలా హక్కులా?
‘‘రాజ్యాంగం!’’