ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళా మేధావుల్లో ప్రముఖురాలైన భండారు అచ్చమాంబ (1874`1905), అబలా సచ్చరిత్ర రత్నమాల వంటి గొప్ప రచనలు చేసి, తను జీవించిన కాలంలోనే విద్వాంసురాలిగా, అఖండ మేధావిగా ప్రఖ్యాతి చెంది, ఎంతోమంది సమకాలీన స్త్రీలు తనను ఆదర్శంగా తీసుకునే స్థాయికెదిగింది.

బ్రతికిన కేవలం ముప్ఫై సంవత్సరాల స్వల్పకాలంలోనే ఆశ్చర్యం గొలిపే విధంగా కార్యాచరణయుతమైన సాహిత్య, సంఘ సంస్కరణ జీవితాన్ని గడిపిన అచ్చమాంబకు తొలి తెలుగు కథా రచయిత్రిగా గుర్తింపు లభించింది. అచ్చమాంబ సాగించిన బౌద్ధిక కార్యకలాపాలూ, క్షేత్రస్థాయి కార్యాచరణల వల్ల, ఆమె ఖ్యాతి తెలుగు సార్వజనిక రంగానికీ, తెలుగు పత్రికలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇంగ్లిష్‌ ప్రపంచంలోకీ ప్రవహించింది. ఇంతదాకా మనలో చాలమందికి తెలియని ఆ విషయాన్ని వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
అచ్చమాంబ పేరుతోపాటే గుర్తుకొచ్చే గ్రంథం సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం 1901లో ప్రచురితమైన అబలా సచ్చరిత్ర రత్నమాల. ఆమె పరిశోధనా పటిమకు అద్దంపట్టే ఈ ఉద్గ్రంథం Indian Ladies’ Magazine అనే ఇంగ్లిష్‌ స్త్రీల పత్రికలో సమీక్షించబడిరది. అంతేకాకుండా, అచ్చమాంబ కొనసాగిస్తున్న క్షేత్రస్థాయి కార్యకలాపాలూÑ ఆమె చనిపోయినపుడు ఒక నివాళి వ్యాసమూÑ ఆమెకు సంబంధించిన మరికొన్ని వివరాలూ ఈ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ఈ వివరాలకు ముందు, Indian Ladies’ Magazine గూర్చి కొంత తెలుసుకుందాం.
I
ఆంగ్ల సాహిత్యంలో ప్రకాండ పండితురాలైన కమలా సత్యనాధన్‌ సంపాదకత్వంలో మద్రాస్‌ నుండి వెలువడిన The Indian Ladies’ Magazine, 1901 జులైలో ప్రారంభమై 1918 వరకూÑ తర్వాత 1927లో పునరుద్ధరింపబడి 1938 వరకూ 28 సంవత్సరాలు నడిచింది. వలస భారతదేశంలో ఒక స్త్రీల పత్రిక యింత సుదీర్ఘకాలం కొనసాగగలగడమనేది దానంతటికదే ఒక విశేషమైతే, ఒక భారతీయ స్త్రీ సంపాదకత్వంలో ఇంగ్లిష్‌లో వెలువడిన మొట్టమొదటి స్త్రీల పత్రిక కావడం అంతకన్నా గొప్ప విశేషం. ప్రధానంగా మాసపత్రిక అయిన Indian Ladies’ Magazine, తీవ్ర ఆర్థిక ఇబ్బందులవల్ల కొంతకాలం త్రైమాసికంగానూ, ద్వైమాసికంగానూ వెలువడిరది. త్రైమాసికంగా వున్నప్పుడు కమల చెల్లెలు Mrs. S.G. Hensman ఒక సంవత్సరం పాటు సంపాదకురాలుగా పనిచేసింది. పునరుద్ధరించబడ్డాక కమల కూతురు పద్మిని సహాయ సంపాదకురాలుగా బాధ్యతల్ని నిర్వహించింది. “A Monthly journal conducted in the interests of the women of India” అని తనను తాను నిర్వచించుకున్న ఈ పత్రిక, 30 నుండి 35 పేజీలు కలిగి, ప్రతినెలా 12వ తేదీన ప్రచురితమయ్యేది. దక్షిణాసియా దేశాలకు పోస్టల్‌ ఖర్చు కలుపుకొని సంవత్సర చందా నాలుగు రూపాయలు. నాణ్యమైన కాగితం మీద ముద్రితమై, వివిధ రకాలైన అందమైన ఛాయాచిత్రాలతో చాలా ఆకర్షణీయంగా వుండేది. ప్రపంచవ్యాప్తంగా చందాదారుల్ని కలిగివుండిన Indian Ladies’ Magazineకు తెలుగు ప్రాంతాల్లో కూడా చాలామంది చందాదారులు వుండడం విశేషం: తెలుగు ప్రముఖులైన కందుకూరి వీరేశలింగం, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు, గంజాం జిల్లాలోని అస్కాలో ‘అసికా స్త్రీ సమాజా’న్ని స్థాపించిన మహిళోద్యమ నాయకురాలు బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ మొదలైన వారు వీరిలో కొద్దిమంది మాత్రమే! హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్శీ మొదలైన మతాలకు చెందిన స్త్రీ, పురుషులు ఈ పత్రికకు చందాదారులుగా వుండడమనేది మరో విశేషం. ఈ పత్రిక ప్రారంభమవబోతున్నదని రెండు నెలల ముందే, అంటే 1901 మే సంచికలో తెలియజేసిన ప్రముఖ తెలుగు స్త్రీల పత్రిక అయిన తెలుగు జనానా, Indian Ladies’ Magazine లక్ష్యాలను వివరిస్తూ, అది ‘‘హిందూ కాంతలకందఱకు నెంతయు నుపయోగకరముగా నుండును’’ అని తెల్పుతూ, ‘‘ధైర్య స్థైర్యములతో’’ ఈ పనికి పూనుకున్న కమలా సత్యనాధన్‌ కృషికి తోడ్పాటునందివ్వమని పాఠకులను కోరింది (The Indian Ladies’ Magazine): హిందూ సుందరీ పత్రిక’, పు.341`343).
Indian Ladies’ Magazine లక్ష్యాలు ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి. భారతీయ స్త్రీల అభివృద్ధికీ, సంఘ సంస్కరణకూ, తద్వారా దేశాభివృద్ధికీ తోడ్పడ్డమే కాకుండా, దేశంలోని వివిధ కులాలకూ, మతాలకూ, ప్రాంతాలకూ, భాషలకూ, సంస్కృతులకూ చెందిన స్త్రీలందర్నీ ఒక వేదిక మీదికి తీసుకురావడంÑ ఈ విధంగా, వివిధ నేపథ్యాలకు చెందిన స్త్రీలందరికీ పరస్పర సంబంధం కలిగించి, వారి అభివృద్ధికి పాటుపడ్డంÑ వారి ప్రయోజనాలను కాపాడ్డంÑ వారిలో సాహిత్యాభిరుచిని కలిగించి, వారి రచనల్ని ప్రోత్సహించడం పత్రిక లక్ష్యాల్లో కొన్ని. మరీ ముఖ్యంగా, ప్రాచ్య (భారతీయ), పాశ్చాత్య (ఆంగ్ల) సంస్కృతులకు చెందిన స్త్రీలకు పరస్పర పరిచయం, సంబంధం కలిగించడం ద్వారా ఆయా విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన స్త్రీల మధ్య వారధిగా పనిచేసి, తద్వారా ఒక పరస్పర అంతర్జాతీయ అవగాహనను కలిగించడం కూడా పత్రిక లక్ష్యాల్లో ప్రధానమైనది. మొదటి సంచికలో పత్రిక లక్ష్యాల్ని స్పష్టంగా విశదీకరించిన సంపాదకురాలు, బ్రిటిష్‌ సంపర్కం వల్ల విద్య, సాంఘికాభివృద్ధి మొదలైన రంగాల్లో కలిగిన సత్ఫలితాలు భారతీయ స్త్రీలకు అందాల్సినంతగా అందలేదనీ, పురుషులే ఎక్కువగా లాభపడ్డారనీ కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించింది. స్త్రీలను వదిలిపెట్టి కేవలం పురుషులు మాత్రమే అభివృద్ధి చెందితే, అది దేశమంతా అభివృద్ధి చెందినట్లు కాదనీÑ ఒకవేళ భారతీయులు నిజంగా అభివృద్ధి చెంది నాగరిక దేశాల్లో గౌరవనీయమైన స్థానం పొందాలని భావిస్తే, స్త్రీలను తప్పనిసరిగా అభివృద్ధి పథంలో నడిపించాలనీ నొక్కి చెప్పింది. మరీ ముఖ్యంగా, స్త్రీల అభివృద్ధే తమ అభివృద్ధి అని పురుషులు గుర్తించాలనీÑ మునిగినా, తేలినా యిద్దరూ కలిసేననీ హెచ్చరించింది. (‘they should realise that “the woman’s cause is man’s: they rise or sink together”).
బ్రిటిష్‌ పాలిత భారతదేశంలో వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడిన అనేక స్త్రీల పత్రికలకుండిన అన్ని హంగులూ Indian Ladies’ Magazineకు వుండేవి. స్త్రీ విద్య, సంఘ సంస్కరణÑ స్త్రీ, పురుష సంస్కర్తలూ, వారు నడిపే సంస్థలూ, సాధించిన విజయాలూ, జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ మహిళాభివృద్ధి కోసం జరుగుతున్న కృషి మరీ ముఖ్యంగా స్త్రీల ద్వారా జరుగుతున్నది. మహిళా సంఘాలూ, సమావేశాల్లో స్త్రీలు చేసిన ఉపన్యాసాలూ ` ఇలా భారతీయ మహిళోద్యమానికి సంబంధించిన సమస్త సమాచారాన్నీ ప్రచురించేది. అలాగే, లబ్దప్రతిష్ఠులైన మహిళా మేధావులే కాకుండా, అప్పుడప్పుడే రాయడం ప్రారంభించిన స్త్రీలు వివిధ ప్రక్రియల్లో చేసిన రచనలూ, పుస్తక సమీక్షలూ మొదలైనవి కూడా Indian Ladies’ Magazine పుటల్లో విస్తృతంగా కన్పిస్తాయి. స్త్రీల పౌర హక్కుల కోసం గళమెత్తినప్పటికీÑ వాళ్ళు ఎంత అభివృద్ధి సాధించినా, వారి ప్రధాన కార్యక్షేత్రం కుటుంబమేననీ, కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్న స్త్రీలు అసలు పెళ్ళిళ్ళే చేసుకోకుండా వుండాల్సిందనీ కమలా సత్యనాధన్‌ బలంగా విశ్వసించడం వల్ల కుటుంబం పట్ల స్త్రీల బాధ్యతల్ని నొక్కి చెప్పింది Indian Ladies’ Magazine. అందుకే, స్త్రీల కుటుంబ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ అంటే గృహ నిర్వాహకత్వం, పిల్లల పోషణ, భార్యాభర్తల సంబంధం, సఫలవంతమైన కుటుంబ జీవితం, స్త్రీల ఆరోగ్యం, వంటా వార్పూ మొదలైన వాటిపై విస్తృతంగా ప్రచురించేది.‘What is being done for and by Indian Ladies’ అనేది పత్రికలోని ముఖ్యమైన శీర్షికల్లో ఒకటి. దీని ద్వారా దేశవ్యాప్తంగా మహిళాభివృద్ధి కోసం పురుషులూ, వివిధ సంస్థలూ, ప్రభుత్వాలూ చేస్తున్న కృషినీÑ స్త్రీలే తమ అభివృద్ధి కోసం చేపడుతున్న అసంఖ్యాక కార్యక్రమాల్నీ వివరించేది. తద్వారా బ్రిటిష్‌ భారతదేశంలోని మహిళోద్యమ చరిత్రను తన పుటల్లో అద్భుతంగా నిక్షిప్తం చేసింది. అలాగే,‘Editorial Notes’ అనే శీర్షికన సంపాదకురాలు మహిళలకు సంబంధించిన అనేక సమస్యల్ని చర్చించేది. Indian Ladies’ Magazineలోని పాఠకుల లేఖలూ, వాటికి సంపాదకురాలి జవాబులూ అలాగే అనేక విషయాలపై వివిధ రచయితలూ/రచయిత్రుల మధ్య జరిగిన చర్చలూ చాలా ఆలోచనాత్మకంగా వుండి విభిన్న ఆలోచనలకు పట్టం గట్టాయి. స్త్రీల సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చిన Indian Ladies’ Magazineను వైవిధ్యభరితమైన పత్రికగా తీర్చిదిద్దడానికి కమలా సత్యనాధన్‌ తీవ్రంగా శ్రమించేది.
సమకాలీనంగా ప్రఖ్యాతిగాంచిన భారతీయ, భారతీయేతర స్త్రీ, పురుషులు చాలామంది Indian Ladies’ Magazine లో తమ రచనల్ని ప్రచురించారు. ఇంగ్లిష్‌లో రాయగలిగిన భారతీయ స్త్రీలలో చాలామంది యిందులోనే మొదటిసారిగా తమ రచనల్ని ప్రచురించడం గమనార్హం. ప్రఖ్యాత రచయిత్రి సరోజినీ నాయుడు కవిత్వాన్ని మొట్టమొదట ప్రచురించిన ఘనత ఈ పత్రికకే దక్కుతుంది. కమలా సత్యనాధన్‌కు ఆప్తమిత్రురాలైన సరోజినీ నాయుడు కవిత్వం విస్తృతంగా ఈ పత్రికలోనే ప్రచురితమైంది. అలాగే, ప్రఖ్యాతి గాంచిన తొలితరం భారతీయ ముస్లిం స్త్రీవాది రొఖయా షఖావత్‌ హుస్సేన్‌ రాసిన అద్భుతమైన కథ Sultana’s Dream’ మొదట యిందులోనే ప్రచురితమైంది (Vol. V., No. 3, సెప్టెంబర్‌ 1905, పు.82`86). వీరితో పాటు కార్నెలియా సొరాబ్జి, తోరుదత్‌, పండిత రమాబాయి సరస్వతి, లేడీ హర్నామ్‌ సింగ్‌, అనీబిసెంట్‌,The Journal of the National Indian Association సంపాదకురాలైన Adelaide Manning మొదలైన వారి రచనలు Indian Ladies’ Magazine పుటల్ని అలంకరించాయి. ఆంగ్ల సాహిత్యానికి పెద్ద పీట వేసిన ఈ పత్రికలో షేక్స్పియర్‌ నుండి షెల్లీ దాకా ఎంతోమంది ప్రముఖ ఆంగ్ల సాహిత్యకారుల రచనలు ప్రచురించబడ్డమే కాకుండా, విమర్శనాత్మకంగా అంచనా వేయబడ్డాయి. ఈ సాహిత్య విమర్శ వ్యాసాల్ని చాలా వరకు కమలా సత్యనాధనే రాసింది.
బాల్య వివాహాలూ, వితంతు సమస్య మొదలైనవాటితోపాటు, ‘పర్దా’ లాంటి ముస్లిం స్త్రీల సమస్యలూÑ స్త్రీలకు ఇంగ్లిష్‌ విద్య అవసరమా? లేదా? వంటి చర్చలూÑ భారతీయ గృహాలూ, వాటిని నాగరీకంరిచాల్సిన అవసరమూ ` యిలా అనేక విషయాలపై చక్కటి చర్చల్ని ప్రోత్సహించిన Indian Ladies’ Magazine శతాబ్దం ప్రథమార్ధంలోని భారతీయ స్త్రీల చైతన్యానికీ, ఆనాటి మహిళోద్యమానికీ, అందులోని వైరుద్ధ్యాలకూ చక్కగా అద్దం పడ్తుంది. మరీ ముఖ్యంగా, తెలుగు ప్రాంతంలోని మహిళోద్యమపు ప్రతిబింబాలూ యిందులో స్పష్టంగా కన్పిస్తాయి. బ్రిటిషాంధ్రలో వెల్లివిరిసిన సంఘ సంస్కరణోద్యమాన్ని, మరీ ముఖ్యంగా మహిళోద్యమ చరిత్రను రాయాలనుకుంటున్న వారు Indian Ladies’ Magazineని కూడా పరిశోధిస్తే ఆ చరిత్రకు నిస్సందేహంగా మరింత సమగ్రత చేకూరుతుంది. అందుకే, యింత గొప్ప స్త్రీల పత్రికలో తొలితరం తెలుగు స్త్రీవాది అయిన భండారు అచ్చమాంబ చర్చించబడ్డం విశేషం.
II
అబలా సచ్చరిత్ర రత్నమాల పై ప్రచురించబడిన సమీక్ష ద్వారా మొట్టమొదటిసారి Indian Ladies’ Magazine లో భండారు అచ్చమాంబ కన్పిస్తుంది.‘A Telugu Work by an Indian Lady’ శీర్షికన 1901 సెప్టెంబరు సంచికలో (పు.77`78) రెండు పుటల సమీక్షతో పాటు అచ్చమాంబ నిలువెత్తు ఫొటొగ్రాఫ్‌ ప్రచురించబడిరది. పుస్తక సమీక్షకుల పేరివ్వలేదు గాని, అది రాసింది కమలా సత్యనాధనే అని గట్టిగా భావించవచ్చు. ‘‘ఇటీవల వెలువడిన ఆసక్తికరమైన గొప్ప పుస్తకాల్లో ఒక భారతీయ స్త్రీ తెలుగులో రాసిన …’’ అని ప్రారంభమైన పుస్తక సమీక్ష, అబలా సచ్చరిత్ర రత్నమాలను ‘‘చాలా సంతోషంగానూ, అనుకంపతోనూ’’, హృదయ పూర్వకంగానూ స్వాగతించాలనీÑ ఎందుకంటే, తన జ్ఞానాభివృద్ధికై సరైన అవకాశాలు కల్పిస్తే, ఒక భారతీయ స్త్రీ ఎంత గొప్ప కార్యాల్ని సాధించి చూపెట్టగలదో ఈ పుస్తకం నిర్ద్వంద్వంగా నిరూపిస్తుందనీ ప్రకటించింది. అచ్చమాంబ తెలుగు ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ అని పాఠకులకు పరిచయం చేస్తూ, ఆమె తండ్రి గూర్చీ, భర్త గూర్చీ సమాచారాన్నందించింది. పుస్తకంలో అచ్చమాంబ ప్రయోగించిన భాష ‘‘స్వచ్ఛం’’గానూ, ‘‘రుచికరం’’గానూ, ‘‘పాండిత్యం’’తోనూ కూడివున్నదని ప్రశంసిస్తూ, జ్ఞానం పట్ల స్వచ్ఛమైన ప్రేమా, తన దేశ స్త్రీల అభివృద్ధిపట్ల ప్రగాఢమైన వాంఛా కలిగి వుండడం వల్లనే అచ్చమాంబ ఈ పుస్తకాన్ని రాయగలిగిందని ప్రస్తుతించింది.
అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాలను తన ‘‘సొంత బిడ్డ’’గా భావించిందని తెల్పుతూ, ఆమె తన బిడ్డను కోల్పోయిన విషయాన్నీ, దు:ఖంలో వున్న ఆమెతో తమ్ముడు లక్ష్మణరావు నాగోజీభట్టు గూర్చి చెప్పడాన్నీ, దాని ద్వారా ఆమె ప్రేరణ చెందడాన్నీ వివరించింది. పుస్తకాన్ని అచ్చమాంబ తన భర్తకు అంకితం చేసిందనీ, తన రచనా వ్యాసంగానికి తోడ్పడినందుకు భర్తా, తమ్ముడూ యిద్దరికీ కృతజ్ఞతలర్పించిందనీ తెలియజేస్తూ, స్త్రీ విద్య విషయంలో బాగా వెనుకబడిన భారతదేశం లాంటి చోట పురుషులు స్త్రీలకు అందించే చిన్నపాటి తోడ్పాటు స్త్రీల జీవితాల్లో గొప్ప మార్పులు కలుగజేయగలదన్న విషయాన్ని నిరూపించడానికి అచ్చమాంబ మాటల్నే ఉటంకించింది. మన దేశపు స్త్రీలకు భర్తలూ, తమ్ముళ్ళూ సహాయపడితే భారతదేశంలో గార్గి, మైత్రేయి లాంటి విద్వాంసురాల్లూÑ అహల్యాబాయి, భవానీదేవి లాంటి రాణులూÑ మొల్ల లాంటి కవయిత్రులూ మరొక్కసారి ప్రాదుర్భవించి, భారతదేశం యింతకు ముందు అనుభవించిన ఔన్నత్యాన్నీ, గౌరవాన్నీ మళ్ళీ పొందగలదని అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన అచ్చమాంబ మాటలు నిజం కావాలని మనసారా కోరుకుంది (“Oh, that her saying would come true!”).
అబలా సచ్చరిత్ర రత్నమాల అచ్చమాంబ పాండితీ గరిమాకూ, ఆమె పరిశోధనా పాటవానికీ నిలువెత్తు నిదర్శనమని ప్రశంసిస్తూ, దాన్ని రాయడానికి ఆమె చాలా శ్రమించిందనీ, అనేకానేక ఆకరాల నుండి, ముఖ్యంగా ఆమెకు బాగా తెలిసిన భాషలైన మరాఠీ, హిందీల నుండి సమాచారం సేకరించిందనీÑ అంతేకాకుండా, గుజరాతీ, బెంగాళీ, సంస్కృతం, ఇంగ్లిష్‌ భాషల్లో లభ్యమైన సమస్త సమాచారాన్నీ
ఉపయోగించుకుందని తెలియజేస్తూ పుస్తక రచనలో అచ్చమాంబ పడ్డ కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించింది. కందుకూరి వీరేశలింగం సంపాదకత్వంలో వెలువడిన చింతామణి పత్రికలో అబలా సచ్చరిత్ర రత్నమాలలోని కొన్ని భాగాలు తొలుత ప్రచురితమయ్యాయన్న విషయాన్నీ తెలియజేసింది. పుస్తకం రాయడంలో అచ్చమాంబకున్న మూడు లక్ష్యాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించిందిÑ ఈ లక్ష్యాల ఆంగ్లానువాదం అత్యద్భుతంగా వుంది.
అబలా సచ్చరిత్ర రత్నమాలకు సంబంధించి అచ్చమాంబకున్న బృహత్‌ ప్రణాళికను వివరిస్తూ, ఆమె యిలాంటివే యింకో రెండు సంపుటాలు వెలువరించాలని అనుకుంటున్నదనీ, ప్రస్తుత సంపుటం చారిత్రక స్త్రీల చరిత్రలకు సంబంధించిందనీ, రెండవ సంపుటం వేద, పౌరాణిక కాలాల స్త్రీలకూ, మూడవ సంపుటం ఆంగ్ల తదితర పాశ్చాత్య దేశాల స్త్రీల చరిత్రలకు సంబంధించినవనీ తెలిపింది. ఒకవేళ తన పుస్తకంలో తప్పులేవైనా వున్నా, లేదా తనకు తెలియకుండా కొంత మంది స్త్రీల చరిత్రల్ని రాయకుండా వదిలేసి వున్నాÑ పుస్తక రచనలో తన అసామర్థ్యమున్నా మన్నించమని పాఠకుల్ని వేడుకొన్న అచ్చమాంబ వినయశీలత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘‘తనంతకు తాను విధించుకున్న’’ ఈ గొప్ప కర్తవ్య నిర్వహణలో అచ్చమాంబ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంత మంచి పని చేసినందుకు/చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలర్పించింది. అవకాశాలు లభించి, ఒకవేళ చాలామంది భారతీయ స్త్రీలు అచ్చమాంబలాగా ప్రశంసనీయమైన లక్ష్యాలతో తమంత తామే ముందుకొస్తే, వాళ్ళు కూడా ఘనకార్యాల్ని సాధించగలరని మిక్కిలి ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది. అచ్చమాంబ తన కార్యాచరణ ద్వారా నిజంగానే అంతటి ఆత్మవిశ్వాసాన్ని సమకాలీన స్త్రీలలో కలిగించగలిగిందన్న విషయం దీని ద్వారా స్పష్టమౌతోంది.
అబలా సచ్చరిత్ర రత్నమాల ‘ముందుమాట’లో అచ్చమాంబ ప్రముఖంగా ప్రస్తావించిన హరదేవి, సరళాదేవి మొదలైన సమకాలీన మహిళా మేధావులూ, కార్యకర్తలందర్నీ ప్రస్తావించిన సమీక్షకురాలు, వారందరి గూర్చి తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుందని తెలిపి, మహిళాభివృద్ధి కోసం వాళ్ళు చేసిన/చేస్తున్న గొప్ప`గొప్ప కార్యక్రమాల్ని స్థూలంగా వివరించింది. ‘‘అత్యంత ఆసక్తికరమైన’’ అబలా సచ్చరిత్ర రత్నమాలలో లభించే సమాచారం యింకోచోట దొరకడం చాలా కష్టమనీ, కాబట్టి అలాంటి కష్టసాధ్యమైన పనిని సాధించిన అచ్చమాంబకు చాలా కృతజ్ఞులమై వుండాలనీ ప్రశసింస్తూ, Indian Ladies’ Magazine పాఠకుల ప్రయోజనార్థం అందులోని కొన్ని భాగాల్ని అనువదించి ప్రచురించదలచుకుంటున్నానని సంతోషంగా ప్రకటించింది. కానీ, ఈ వ్యాస రచయిత గమనించినంత వరకూ, ఆ పని నెరవేరలేదనే చెప్పుకోవచ్చు. ఇక సమీక్షల్లో చివరగా వివరించేట్లు, అబలా సచ్చరిత్ర రత్నమాల ధర ఒక రూపాయి అనీ, మద్రాసులోని పరశువాకంలో నివసిస్తున్న పండిట్‌ వీరేశలింగంకు రాసి పుస్తకాన్ని తెప్పించుకోవచ్చనీ తెల్పుతూ సమీక్ష ముగిసింది. అయితే, పుస్తకం ఫొటొ ప్రచురించకపోవడం సమీక్షలోని ప్రధాన లోపం. అచ్చమాంబ పుస్తకం ప్రచురితమైనపుడు ఎంత సంతోషంతో ఈ సమీక్షను ప్రచురించిందో, ఆమె చనిపోయినపుడు అంతకన్నా గొప్ప దు:ఖంతో ఒక నివాళి వ్యాసాన్నీ Indian Ladies’ Magazine ప్రచురించింది.
III
మధ్య పరగణాల్లోని బిలాస్‌పుర్‌లో 1905 జనవరి 18న చనిపోయిన అచ్చమాంబ మృతిపట్ల ‘‘తీవ్ర విచారం’’ వ్యక్తం చేస్తూ ప్రారంభమైన ఈ నివాళి వ్యాసం, ఆమె చనిపోయిన మరుసటి నెలలోనే అంటే 1905 ఫిబ్రవరి సంచికలోనే ప్రచురితమవడం గమనార్హం (పు.244`246). అచ్చమాంబ నిలువెత్తు ఫొటొగ్రాఫ్‌తో పాటు రెండు పేజీల నిడివిలో సాగిన ఈ వ్యాసాన్ని అచ్చమాంబను బాగా దగ్గరగా ఎరిగినవారు రాశారు: అయితే అతడి/ఆమె పూర్తి పేరు యివ్వలేదు N.S. అని సంతకం చేశారు. నివాళి వ్యాసాల్లో సాధారణంగా కన్పించే ఆహా! ఓహో! తరహాగా కాకుండా, అచ్చమాంబ కృషినీ, సమకాలీన సమాజంపై, మరీ ముఖ్యంగా మహిళోద్యమంపై, ఆమె ప్రభావాన్ని నిక్కచ్చిగా అంచనా వేసే ప్రయత్నం ఈ వ్యాసంలో స్పష్టంగా కన్పిస్తుంది. అచ్చమాంబ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్నీ వదలకుండా, ప్రతి అంశాన్నీ క్లుప్తంగానే అయినప్పటికీ ప్రతిభావంతంగా వివరించారు. తెలుగు పత్రికల్లో ప్రచురితమైన ఏ నివాళి వ్యాసమూ యింత సమగ్రంగా, స్పష్టంగా లేదని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
అచ్చమాంబ Lives of Noble Women (అబలా సచ్చరిత్ర రత్నమాల) అనే ప్రఖ్యాతిగాంచిన పుస్తకాన్ని రచించిన ప్రకాండ పండితురాలైన రచయిత్రి అనీ, ఆమె Indian Ladies’ Magazine పాఠకులకు సుపరిచితురాలేననీ తెల్పుతూ, యింతకు ముందు యిదే పత్రికలో ఆమె పుస్తకాన్ని సమీక్షించిన విషయాన్నీ, తర్వాత 1903లో ఉత్తర సర్కారు జిల్లాల్లో ఆమె సాగించిన ఉపన్యాస పరంపరల పర్యటనను గూర్చీ రాసి వున్నామనీ చదువరులకు గుర్తు చేశారు. అచ్చమాంబ పాండిత్యాన్నీ, ఆమెకు లభించిన ఖ్యాతినీ ప్రస్తావిస్తూ, తెలుగు ప్రాంతాల్లో స్త్రీల అభివృద్ధి కోసం అచంచలమైన అంకితభావంతో, ‘‘ఒక పటిష్టమైన ప్రణాళికతో పనిచేసిన మొట్టమొదటి స్త్రీ’’ అచ్చమాంబేనని కొనియాడారు. అబలా సచ్చరిత్ర రత్నమాల రాయడంలో అచ్చమాంబ లక్ష్యాల్ని వివరిస్తూ, ఈ ‘‘ఉదాత్తమైన’’ లక్ష్యాలే ఆమెను ఆ పుస్తకం రాయడానికి ప్రేరేపించాయనీ, ఆ ‘‘లక్ష్యసాధన’’లో ఆమె ‘‘సఫలీకృత’’మైందనీ ప్రశంసించారు. ఈ సందర్భంలో ఆ పుస్తకం భవిష్యత్తులో తెలుగు ప్రాంతాల్లోని సంఘ సంస్కరణోద్యమానికి ఇతోధికంగా తోడ్పడుతుందనడంలో అతిశయోక్తి లేదంటూ అభిప్రాయపడిన సమీక్షలోని మాటల్ని ఉటంకించారు. తెలుగు సమాజంపై ఆమె రచనల ప్రభావం అత్యధికంగా పడిరదని నిరూపించడానికి అబలా సచ్చరిత్ర రత్నమాల వెలువడిన కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఎంతోమంది రచయిత్రులు పుట్టుకొచ్చారనీ, స్త్రీల సంపాదకత్వంలోనే రెండు స్త్రీల పత్రికలు వెలువడనారంభించాయనీ తెలిపారు (పేర్లు తీసుకోలేదు గాని, ఆ రెండు పత్రికలు హిందూసుందరి, సావిత్రి లు).
అచ్చమాంబను తెలుగు ప్రజలు అత్యధికంగా గౌరవించారనీ, 1903లో ఉత్తర సర్కారు జిల్లాల్లో ఆమె చేపట్టిన ఉపన్యాస పర్యటనా కార్యక్రమం (“lecturing tour”) విజయవంతమైందనీÑ వెళ్ళిన ప్రతిచోటా ఆమెకు ఘనస్వాగతం లభించిందనీ, వృద్ధ, సంప్రదాయ స్త్రీలను సైతం ఆకర్షించి వారిని ప్రభావితులను చేసిందనీ కొనియాడారు. ఆమె కల్గించిన ప్రభావాన్ని విశదీకరిస్తూ, అచ్చమాంబ పర్యటన తర్వాత స్త్రీల సంఘాలూ, సమావేశాలనేవి ఉత్తర సర్కారు జిల్లాల్లో ఒక ‘‘ఫాషన్‌’’గా మారాయని ఒక మిత్రులెవరో హాస్యస్ఫోరకంగా అన్న మాటలు నిజమని ధృవీకరించారు. గత పది`పన్నెండు సంవత్సరాల్లో మహిళా చైతన్యం, విద్యాభివృద్ధిల కోసం పురుషులు చేపట్టిన కార్యక్రమాల వల్ల కలిగిన ప్రభావం కన్నా చాలా ఎక్కువగా అచ్చమాంబ పర్యటన ప్రభావం కల్గించిందనడంలో అతిశయోక్తి లేదన్న కాకినాడ కళాశాల ప్రిన్సిపల్‌ (పేరివ్వలేదు) మాటల్నీ చదువరులకు గుర్తు చేశారు.
అచ్చమాంబ రచనా వ్యాసంగంపై ప్రతిఫలిస్తూ, ఆమె రాస్తూండిన మూడు పుస్తకాలు యింకా అసంపూర్తిగానే మిగిలాయనీ, వాటిలో అత్యంత ముఖ్యమైంది అబలా సచ్చరిత్ర రత్నమాల రెండో భాగమనీÑ మొదటి సంపుటాన్ని ఎంతటి విద్వత్తుతో సాధికారికంగా రూపొందించిందో, రెండో భాగాన్ని కూడా అలాగే తీర్చిదిద్దాలని ఆమె శ్రమించిందనీÑ ఆ రెండో భాగం వేద, పురాణ స్త్రీల చరిత్రలకు సంబంధించిందనీ తెలిపారు. అచ్చమాంబ రచనా శైలి, పరిశోధనా పద్ధతులపై వ్యాఖ్యానిస్తూ, మౌలిక ఆధారాలను పరిశీలించకుండా ఆమె ఏ విషయాన్నీ రాసేది కాదని ఆమె పరిశీలనా తత్పరతనీ, పరిశోధనా పటిమనూ ప్రస్తుతించారు. ఇదే విషయాన్ని యింకాస్త స్పష్టపరుస్తూ, తను నివసించిన ప్రాంతంలో వేదాలూ, పురాణాలూ మొదలైనవి సంపూర్తిగా లభించకపోవడం వల్ల, ఆ సమాచార సేకరణ కోసం ఆమె ఎంతో శ్రమకోర్చి దూర`దూర ప్రాంతాలకు ప్రయాణించేదనీÑ అంతే కాకుండా, చాలా ఖర్చును భరించి పోస్టు ద్వారా కూడా పుస్తకాలు తెప్పించుకునేదనీÑ తనకు కావాల్సిన సమాచారం దొరకవచ్చనే ఆశతో ఒకసారి వారణాసికి (బనారస్‌) సయితం పయనమైందనీ, కానీ ఇంట్లో సంభవించిన ఒక దురదృష్టకర సంఘటన వల్ల బనారస్‌ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని తిరిగిరావాల్సి వచ్చిందనీ వివరించారు. ఈ విధంగా అబలా సచ్చరిత్ర రత్నమాల రెండో భాగాన్ని సాధ్యమైనంత సాధికారికంగా రూపొందించాలని అనుకున్నందు వల్లే అది రాయడం ఆలస్యమైందని నిర్ధాంచారు. ఈ పుస్తకంతో పాటు ‘కుట్టుపని’, ‘అల్లిక పని’ గూర్చి కూడా ఆమె రెండు పుస్తకాలు రాస్తూండిరదనీ, ‘కుట్టుపని’పై రాసిన పుస్తకం దాదాపు పూర్తి అయిందనీ, అది త్వరలోనే ప్రచురితమవగలదనీ ఆశించారు.
అచ్చమాంబ బహుభాషావేత్తగా ప్రముఖురాలనీ (“known linguist”), తెలుగుతో పాటు సంస్కృతం, హిందీ, మరాఠీ భాషల్లో ప్రకాండ పండితురాలనీÑ వీటితో పాటు బెంగాళీ, గుజరాతీ భాషలు కూడా ఆమెకు బాగా వచ్చనీ తెలిపిన సందర్భంలో ఆమెకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని నివాళి వ్యాసకర్త అందించారు. తనకు తెలిసిన భాషలన్నిట్లో స్త్రీలు రాసిన ప్రతి పుస్తకాన్నీ ఆమె కచ్చితంగా `అంటే ఒక ‘‘నియమం’’గా` కొనేదనీ, అలాంటి పుస్తకాలెన్నో ఆమె వ్యక్తిగత గ్రంథాలయంలో వున్నాయనీ, తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ పుస్తకాల్ని చూపించి, అవి తన జాతికి చెందినవారు అంటే స్త్రీ జాతి సృష్టించిన సంపద అని అత్యంత తమకంతో చెప్పేదని తెలిపారు. అచ్చమాంబ బౌద్ధిక జీవితంపట్ల ప్రశంసల జల్లు కురిపిస్తూ, “So much for the intellectual side of Mrs. B. Atchamamba” అని అచ్చెరువొందారు.
అచ్చమాంబ సాధించిన బౌద్ధిక విజయాలన్నీ ఒక ఎతై ్తతే, ఆమె జీవితానికి సంబంధించి ‘‘మరింత ఆసక్తిదాయకమూ,
ఉదాత్తమూ’’ అయిన యింకొన్ని అంశాలున్నాయనీ, ఆమె ‘‘అత్యంత దయార్ధ్ర హృదయ’’గా పేరొందిందనీ నివాళి వ్యాసకర్త ప్రశంసించారు. ‘‘పేదవారి పట్ల దయ’’ అనేది ‘‘ఆమె వ్యక్తిత్వంలోని ప్రధానాంశమ’’ని పేర్కొంటూ, దాన్ని నిరూపించే అనేక ఉదాహరణలు పొందుపరచారు. అచ్చమాంబకు బిడ్డ పుట్టినపుడు ఉత్సవాలపై డబ్బు వృధా చేయకుండా, పేదల కోసం ఒక శరణాలయాన్ని స్థాపించిందనీ, అది కొంత కాలమే నడిచినప్పటికీ నాటి కఱువు పీడితులకు బాగా ఉపయోగపడిరదనీ కొనియాడారు. అలాగే, 1899 ప్రాంతంలో చూడ్డానికి ‘‘అసహ్యం’’గా వుండి, రెండు నెలల వయసున్న ఒక అనాథ పసికందును చేరదీసి, వాడికి చదువు చెప్పించి వృద్ధిలోకి తెచ్చిన విషయాన్నీÑ భిక్షకులుగా బతుకు వెళ్ళదీస్తున్న ఒక స్త్రీనీ, ఆమె యిద్దరు పిల్లల్నీ ఆదుకొని, వాళ్ళను సొంతకాళ్ళపై నిలబడగలిగేలా చేసిన ఉదంతాన్నీ, మరీ ముఖ్యంగా తానే అన్ని ఖర్చులూ భరించి ఆ పూర్వ భిక్షుక తల్లి కూతురికి చక్కటి సంబంధం వెతికి పెళ్ళి చేసిన సంఘటననీÑ పెద్ద ఆఫీసరు భార్య అనే భేషజం చూపకుండా ఒక నిరుపేద నిండు చూలాలికి ప్రసవంలో సహాయం చేసిన తీరునూÑ పేదలతో కలివిడిగా మెలిగే ఆమె సౌజన్యాన్నీ వివరించి అచ్చమాంబ ఎంతటి దయాళువో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
పై విషయాలతో పాటు అచ్చమాంబ గృహిణీత్వానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ ఆమె తెలుగు, మరాఠీ వంటకాలు చేయడంలో ప్రవీణురాలనీ, కుట్టుపని ఆమెకు అత్యంత ఆహ్లాదం కలిగించేదనీ, ఈ విషయానికి సంబంధించి ఆమె వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలన్నీ సదరు కళలో ఆమె నైపుణ్యాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తాయనీ పేర్కొన్నారు.
నివాళి వ్యాసం చివరి పారగ్రాఫ్‌లో అచ్చమాంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం పెద్దగా లభించడం లేదనీ, వివిధ పత్రికల్లో ప్రచురితమైన విషయాలను బట్టి ఆమె 1874 లేదా ‘‘ఆ దరిదాపుల్లో’’ జన్మించిందనీ, ఆమె తండ్రి కొమఱ్ఱాజు వెంకటప్పయ్య మునగాల సంస్థానంలో దివాన్‌గా పనిచేశారనీ, ఆ సంస్థానపు ప్రస్తుత దివాన్‌ అయిన కె.వి.లక్ష్మణరావు యం.ఏ., కి ఆమె ఏకైక సోదరి అనీ, ఆమె పెళ్ళి 1884 సంవత్సరంలో మధ్యపరగణాల్లో పి.డబ్లు.డి. విభాగంలో సబ్‌`డివిజనల్‌ ఆఫీసరుగా పనిచేస్తున్న బి.మాధవరావుతో జరిగిందనీ, పెళ్ళి తర్వాత ఆమె మధ్యపరగణాల్లో నివసించనారంభించిందనీ, తరచుగా తెలుగు ప్రాంతాల్ని సందర్శించేదనీ స్థూలంగా వివరించారు. అచ్చమాంబ ఏ పాఠశాలలోనూ చదువుకోలేదనీ, ఆమె సాధించిందంతా ‘‘స్వయంకృషి’’ వల్లనే అని కొనియాడుతూ నివాళి వ్యాసం ముగిసింది. ఈ విధంగా తన సమకాలీన సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన అచ్చమాంబను సెల్ఫ్‌`మేడ్‌ వుమన్‌గా నిర్ద్వంద్వంగా నిరూపించగలగడం ఈ నివాళి వ్యాసపు ఉత్క ృష్టత.
Iప
భౌతికంగా చనిపోయినప్పటికీ, Indian Ladies’ Magazine పుటల్లో అచ్చమాంబ జీవించే వుంది. అచ్చమాంబ చనిపోయాక ఆమె స్మృత్యర్థం కొంతమంది తెలుగు ప్రముఖులు కొన్ని మంచి కార్యక్రమాల్ని చేపట్టారు. ఈ విషయాలకు సంబంధించిన చాలా వివరాలు Indian Ladies’ Magazine లో నిక్షిప్తమై వున్నాయి. అచ్చమాంబ స్మారకంగా మునగాల జమీందారు యేర్పాటు చేసిన ఉపకార వేతనాలకు సంబంధించిన ప్రకటనను ‘The Atchamamba Memorial Scholarship’ శీర్షికన 1905 మార్చి సంచికలో (పు.290) ప్రచురించారు. దాని ప్రకారం, ఒక్కొక్కటి 144 రూపాయల విలువగలిగి, మూడు నుండి నాలుగు సంవత్సరాలు కొనసాగే రెండు అచ్చమాంబ స్మారక ఉపకారవేతనాల్ని మునగాల జమీందారు యేర్పాటు చేశారు. తెలుగు బాగా వచ్చి, ఇంగ్లిష్‌తో లోయర్‌ సెకండరీ పరీక్ష పాసై వుండి, మెట్రిక్యులేషన్‌ చదవాలనుకున్న ‘‘హిందూ’’ స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక షరతు మీదనే ఈ ఉపకార వేతనాలు లభిస్తాయి. వీటిని ఉపయోగించి చదువుకున్న స్త్రీలు వీరేశలింగం స్థాపించిన బాలికల పాఠశాలలో వేతనం మీద కనీసం మూడు సంవత్సరాలు పని చేయాల్సి వుంటుంది. ఔత్సాహికులు తమ దరఖాస్తులను ‘‘ఎ. కాళేశ్వర రావు బి.ఏ., 14, కచ్చలేశ్వర అగ్రహారం, మద్రాస్‌’’ అనే చిరునామాకు పంపాలని తెలియబరిచారు.
అలాగే, అచ్చమాంబ స్మృతిని ‘‘శాశ్వతీకరించడానికి’’ మద్రాసులోని ‘హిందూ సోషల్‌ రిఫామ్‌ అసోసియేషన్‌’ (‘The Madras Hindu Social Reform Association’) ని యేర్పాటు చేయాలని తీర్మానించిందనీ, దాని ద్వారా స్త్రీల ఉపయోగార్థం ప్రాంతీయ భాషల్లో ప్రచురితమైన పుస్తకాలనూ, పత్రికలనూ యింటింటికీ చేర్చే కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నారనీ తెలిపి, అచ్చమాంబ స్నేహితులూ, అభిమానులూ ఈ లక్ష్యసాధనలో తమవంతు సహాయ సహకారాలందించాలని ప్రార్థిస్తూ, 1906 ఫిబ్రవరి సంచికలో (పు. 273)‘What is being done for and by Indian Ladies’ శీర్షిక కింద ఒక ప్రకటన వెలువరించారు. ఇలాంటి ప్రకటనే 1906 మే సంచికలో కూడా వెలువడిరది (పు.340). ఈ విధంగా, భండారు అచ్చమాంబకు సంబంధించిన దాదాపు సమస్త సమాచారాన్నీ Indian Ladies’ Magazine ఇంగ్లిష్‌ ప్రపంచానికి తెలియజేసింది.
ఇంతకీ అచ్చమాంబను యింత అద్భుతంగా ఇంగ్లిష్‌ ప్రపంచానికి పరిచయం చేసిన కమలా సత్యనాధన్‌ ఎవరు? ‘సత్యనాధన్‌’ అనే ఇంటి పేరు వల్ల సాధారణంగా ఆమె తమిళామె అని అనుకుంటారు. కానీ, ఆమె అచ్చమైన తెలుగు స్త్రీ. బ్రిటిష్‌ ప్రభుత్వంలో సబార్డినేట్‌ జడ్జిగా పనిచేసిన బారిస్టర్‌ ఓరుగంటి శివరామకృష్ణమ్మ గారి నలుగురు పిల్లల్లో కమల పెద్దది. తల్లిదండ్రులు పెట్టిన పేరు హన్నా రత్నం కృష్ణమ్మ. 1880 జులై రెండవ తేదీన రాజమండ్రిలో పుట్టిన హన్నా రత్నం, తమిళుడైన డాక్టర్‌ శామ్యూల్‌ సత్యనాధన్‌ని పెళ్ళాడాక కమలా సత్యనాధన్‌ అయింది. పుట్టుకతో బ్రాహ్మణ కులస్థుడైన ఆమె తండ్రి శివరామకృష్ణమ్మ, క్రై స్తవ మతం పట్ల ఆకర్షితుడై, మతం మారాడు. అలా కమల దేశీయ క్రై స్తవ కుటుంబంలో పుట్టింది. తండ్రి ఉద్యోగరీత్యా మచిలీపట్నం (బందరు)లో పెరిగిన కమల, అక్కడి నోబుల్‌ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసింది. మొత్తం దక్షిణ భారతదేశంలో B.A. degree సాధించిన మొట్టమొదటి స్త్రీ కమలే కావడం విశేషం. అలాగే, మొత్తం దక్షిణ భారతదేశంలో M.A. degree సాధించిన స్త్రీలలో కూడా కమలా సత్యనాధనే ప్రప్రథమురాలు. ఉన్నత విద్యాభ్యాసం విషయంలో కమల సాధించిన ఈ విశిష్ట విజయాల్ని పలు సమకాలీన స్త్రీల పత్రికలు వేనేళ్ళ కొనియాడ్డం గమనార్హం. ఉదాహరణకు, ప్రముఖ తెలుగు సంఘ సంస్కర్త అయిన రాయసం వేంకటశివుడి సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్త్రీల పత్రిక అయిన తెలుగు జనానా 1901 ఏప్రిల్‌ సంచికలో ‘‘యం.యే. పరీక్ష నిచ్చిన తెలుఁగు స్త్రీ (A Telugu Lady M.A.)’’ శీర్షికన కమలా సత్యనాధన్‌ సాధించిన విజయాన్ని కొనియాడ్డంతో పాటు, ఆమెకు ఉన్నత విద్యనందించిన తండ్రిని కూడా ప్రశంసిస్తూ, ‘‘ఈ సంగతిని గుర్తెఱెఁగి, సర్వ ప్రయత్నముల చేతను, దమ పుత్రికల విద్యాపోషణమును గావించుచుండవలయును’’ అని తల్లిదండ్రులను ప్రార్థించింది (పు.313`315).
1898లో, 18 సంవత్సరాల వయసులో, B.A. degree పాసైన హన్నా రత్నం కృష్ణమ్మ, అదే సంవత్సరంలో, తనకన్నా 20 సంవత్సరాలు పెద్దవాడై, విధురుడైన డాక్టర్‌ శామ్యూల్‌ సత్యనాధన్‌ను తన ఉన్నత విద్యకు అడ్డు చెప్పకూడదన్న షరతుపై పెళ్ళాడి (పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ప్రేమ వివాహం కాదు) కమలా సత్యనాధన్‌ అయిందిÑ తద్వారా, ఆమె మకాం మద్రాసుకు మారింది. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చదివిన డా. శామ్యూల్‌ సత్యనాధన్‌ అంతర్జాతీయ ఖ్యాతి గడిరచిన విద్యావేత్తే కాకుండా, గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజ్‌లో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. డా. సత్యనాధన్‌ మొదటి భార్య అయిన కృపాబాయి సత్యనాధన్‌ కూడా ప్రముఖురాలు. ఇంగ్లిష్‌లో నవల రాసిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కృపాబాయే కావడం విశేషం. ఆ నవల పేరు సగుణ. దీంతో పాటు కమల అనే యింకో నవలనూ ఆమె రాసింది. అభ్యుదయవాది అయిన భర్త ప్రోత్సాహ ప్రోద్బలాల వల్ల కూడా కమలా సత్యనాధన్‌ సాహిత్యరంగంలో విశేష కృషి చేసింది. భారతీయ స్త్రీల అభివృద్ధి పట్ల తీవ్రమైన అంకితభావం గల శామ్యూల్‌ ప్రోత్సాహం వల్లే తాను Indian Ladies’ Magazineను ప్రారంభించానని ఆమె స్వయంగా చెప్పుకుంది. అంతకు ముందే సాహిత్య పిపాసులూ, సంఘ సంస్కర్తలూ అయిన భార్యాభర్తలిద్దరూ కలిసి 1899లో Stories of Indian Christian Life అనే 12 కథలున్న పుస్తకాన్ని వెలువరించారు: ఇందులోని 6 కథలు కమల రాస్తే, మిగిలిన 6 కథల్ని శామ్యూల్‌ రాశాడు.
సమకాలీన ప్రపంచంలో విఖ్యాతుడైన శామ్యూల్‌ (ఆహ్వానం మీద) అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో భారతీయ తత్త్వశాస్త్రంపై ఉపన్యాసాలివ్వడానికి వెళ్ళి, ఆ పనిని విజయవంతంగా ముగించుకొని, స్వదేశానికి తిరిగొస్తూ మార్గ మధ్యంలో తీవ్రంగా అస్వస్థుడై 1906 ఏప్రిల్‌ 4న జపానులో చనిపోయాడు. అప్పటికి వాళ్ళకు యిద్దరు చిన్న`చిన్న పిల్లలున్నారు. భర్త చనిపోయి తీవ్ర దు:ఖంలో వున్న కమలకు డబ్బు దాచుకున్న బ్యాంకు మునిగిపోవడం గోరుచుట్టుపై రోకటిపోటైంది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడ్డప్పటికీ కమల కుంగిపోలేదు. స్వతంత్ర ప్రవృత్తి కలది కాబట్టి మామూలు హిందూ వితంతువుల్లా సోదరుల/బంధువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించదలుచుకోలేదు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు యివ్వగలిగిన అసలైన కట్నం వాళ్ళకు ఉన్నత విద్య చెప్పించడమే అని బలంగా నమ్మి, కొడుకులతో పాటు తన కూతుర్లిద్దర్నీ ఉన్నత విద్యావంతుల్ని చేసిన తండ్రి చెప్పించిన చదువు కష్టకాలంలో కమలను ఆదుకుంది. తత్ఫలితంగా, 1911 నుండి ఆరు సంవత్సరాలు పిఠాపురం రాణికి ట్యూటర్‌గా పనిచేసి, ఆమెకు ఇంగ్లిషూ, సంస్క ృతమూ నేర్పింది. పిఠాపురం ఆస్థానంలో ఆరు సంవత్సరాల సుదీర్ఘ కాలం పని చేశాక, దయాదాక్షిణ్యాలు లేని రాజావారి నిర్వాకం వల్ల ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నిరుద్యోగం, ఆర్థిక యిబ్బందులూ వెంటాడ్డంతో కొంతకాలం మిత్రులతో, సోదరుడితో వాల్తేరు, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో గడిపి మద్రాసు చేరింది. తర్వాత మద్రాసు దగ్గర్లోని పల్లవరంలో ‘విద్యోదయ’ అనే బాలికల పాఠశాలను స్థాపించి, ఒక సంవత్సరంపాటు దానికి ప్రిన్సిపల్‌గా పనిచేసింది.
కమల భర్త శామ్యూల్‌కు తన పిల్లల్ని ఇంగ్లండ్‌లో చదివించాలనీ, కొడుకును ICS (Indian Civil Service) అధికారిని చేయాలనీ బలమైన కోరికుండేది. భర్త కలల్ని నెరవేర్చాలని దృఢంగా నిశ్చయించుకున్న కమల, సడలని పట్టుదలతో 1919లో పిల్లలిద్దర్నీ తీసుకొని ఒంటరిగా ఇంగ్లండుకు పయనమయ్యింది. ఎన్నో కష్టాల కోరుస్తూ `మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యల నెదుర్కొంటూ` అక్కడ ఐదు సంవత్సరాలుండి పిల్లల్ని చదివించింది. ఆమే, విగత భర్తా ఆశించినట్లుగానే కొడుకు Iజూ ఆఫీసరై, తెలుగు జిల్లాలను కూడా కలుపుకొని మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని వివిధ జిల్లాల్లో కలెక్టరుగానూ, ఆపై స్థాయి అధికారిగానూ పని చేశాడు. కొడుకు ఉన్నతోద్యోగం వల్ల ఆర్థిక కష్టాలు తీరిపోవడంతో అనేక సమాజాభివృద్ధి కార్యక్రమాల్లో కమల మళ్ళీ తలమునకలైంది. మరీ ముఖ్యంగా, తనకు బాగా ఇష్టమైన కార్యరంగమైన మహిళాభివృద్ధి విషయంలో తీవ్రంగా కృషి చేసింది. శుభ్రత గూర్చి ప్రచారం చేయడం, స్త్రీల క్లబ్బులను అంటే మహిళా సంఘాలను స్థాపించడం, పేద స్త్రీలకూ, నిస్సహాయులకూ ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వివిధ రకాలైన సహకార సంఘాల్ని నెలకొల్పడం, వాటిని విజయవంతంగా నిర్వహించడం మొదలైనవి ఆమె చేపట్టిన సాంఘిక సేవ, మహిళాభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే!
స్త్రీల సహకార సంఘాల నిర్మాణ రంగంలో కమలా సత్యనాధన్‌ కృషి ప్రత్యేకంగా పేర్కొనదగ్గది. ఆమె రాయలసీమలోని అనంతపురంలో ఒకటి, మద్రాసులోని వివిధ ప్రాంతాల్లో 9 సహకార సంఘాల్నీ స్థాపించి పేద స్త్రీలకు ఇతోధికంగా సేవ చేసింది. తిరనళ్వేళిలో Child Welfare and Maternity Centre జవఅ్‌తీవను స్థాపించడమే కాకుండా, దిండిగల్‌లోని Child Welfare Societyని పునరుద్ధరించింది. అలాగే, కాకినాడలోని Red Cross Society పునరుద్ధరించింది. సమాజాభివృద్ధికి జ్ఞాన ప్రచార, ప్రసారాలు ముఖ్యమని గుర్తించిన కమలా సత్యనాధన్‌ అనేక ప్రాంతాల్లో Reading Clubలను యేర్పాటు చేసింది. వాటిల్లో తెలుగు ప్రాంతంలోని విజయనగరంలోనూ, మద్రాసులోనూ స్థాపించిన Reading Clubలు ఘన విజయం సాధించాయి. అనాథల పట్ల తీవ్ర సంవేదనను కలిగిన కమల, విజయనగరంలోని అనాథాశ్రమాన్ని బాగా అభివృద్ధిలోకి తెచ్చింది. ICS అధికారి అయిన కుమారుడు బదిలీపై ఏయే ప్రాంతాలకెళ్తే, ఆ ప్రాంతాలన్నింట్లోనూ ఆమె సంక్షేమ కార్యకలాపాల్ని, మరీ ముఖ్యంగా మహిళాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్ని ఎంతో ఉత్సాహంతో చేపట్టేది. శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన కమలా సత్యనాధన్‌, మురికి వాడలకెళ్ళడం, అక్కడి ప్రజలతో మమేకమై వారికి శుభ్రత ప్రాముఖ్యాన్ని వివరించడం, ఇళ్ళు శుభ్రంగా వుంచుకునే గృహిణులకు బహుమతులిచ్చి ప్రోత్సహించడం మొదలైన వాటి ద్వారా గ్రామీణాభివృద్ధికై విశేషంగా తోడ్పడిరది.
మహిళాభివృద్ధి కోసం కమలా సత్యనాధన్‌ క్షేత్రస్థాయిలో చేసిన కృషంతా ఒక యెత్తైతే, సాహిత్య రంగంలో ఆమె చేసిన అమోఘమైన కృషి యింకో ఎత్తు. ఇంగ్లిష్‌లో ప్రకాండ పండితురాలైన కమలా సత్యనాధన్‌ కలం అనేక అమూల్యమైన రచనల్ని ప్రసవించింది. Indian Ladies’ Magazineలో ఆమె ప్రచురించిన అసంఖ్యాకమైన వ్యాసాలూ, సమీక్షలూ, మరీ ముఖ్యంగా ప్రఖ్యాత ఆంగ్ల సాహిత్యకారులైన కార్లైల్‌, రస్కిన్‌, షెల్లీ, కీట్స్‌, టెన్నిసన్‌, బ్రౌనింగ్‌ మొదలైన వారి రచనలపై ప్రచురించిన విమర్శనాత్మక వ్యాఖ్యానాలు మొదలైనవాటితో పాటు మరెన్నో రచనలు చేసింది. భర్తతో కలిసి రాసిన Stories of Indian Christian Life గూర్చి ముందే తెలుసుకున్నాం కదా! పద్మ, డిటెక్టివ్‌ జానకి మొదలైన నాలుగు నవలలతో పాటు Great Men and Women of India, Tales of India and of Animals, Stories of Ancient India మొదలైన గ్రంథాల్నీ, పిల్లల కోసం Indian Tales of Animals అనే గ్రంథాన్నీ రచించింది. ఆమె ఇంగ్లండు అనుభవాల సమాహారమైన “My Impressions of England” 1925లో ద హిందూ పత్రికలో ధారావాహికగా వెలువడిరది. జీవిత చరమాంకంలో “Christ, the Son of Man” అనే ఉత్క ృష్టమైన వ్యాసాన్నీ రాసింది. ఒకవేళ ప్రచురిస్తే, కొన్ని పదుల సంపుటాలకు సరిపడేటంతటి సాహిత్యాన్ని కమలా సత్యనాధన్‌ సృజించింది. ఈ విధంగా మహిళాభివృద్ధికీ, సారస్వత రంగానికీ విశేషమైన సేవలందించిన కమలా సత్యనాధన్‌ను అనేక ప్రతిష్ఠాత్మకమైన పదవులు వరించడం ఆశ్చర్యం కాదు. మూడు`మూడు సంవత్సరాలపాటు మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల సెనేట్‌ మెంబర్‌గానూÑ మద్రాస్‌, విజయనగరాల గౌరవ మాజిస్ట్రేట్‌గానూ ఆమె సేవలందించింది. అలాగే ‘Central Advisory Education Board for Women’s Education’లో సభ్యురాలిగా నియమించబడిరది. ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటిష్‌ ప్రభుత్వం 1941వ సంవత్సరంలో Coronation Medal తోనూ, MBE (Member of the Order of the British Empire)తోనూ ఘనంగా సత్కరించింది. అయితే, సమాజం కోసం నిస్వార్థంగా పని చేసేవారు ఎన్నికల రాజకీయాల్లో నెగ్గుకురావడమన్నది అత్యంత అరుదైన విషయం కాబట్టి, రాజకీయ టక్కుటమారాలు పెద్దగా తెలియని కమలా సత్యనాధన్‌ మద్రాస్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు!
మనుషులంతా సమానమేనని బలంగా నమ్మిన కమల, మనుషుల్ని ఒక పద్ధతి ప్రకారం వేరు చేసే కులవ్యవస్థను తీవ్రంగా నిరసించింది. హెచ్చు తగ్గులనేవి పాటించకుండా అందరూ కలిసుండాలని చెప్పడమే కాకుండా, దాన్ని తనింట్లో పాటించి చూపేది. దళితులు సహా వివిధ కులాలకు చెందిన వారినందర్నీ పిలిచి సహపంక్తి భోజనాల్లాగా కామన్‌ టీ పార్టీల్ని తరచుగా యేర్పాటు చేసేది. ‘‘పని మనుషులు కూడా మనుషులే’’ అని బలంగా విశ్వసించిన కమల, అప్పుడప్పుడూ తనే వంట చేసి వాళ్ళకు వడ్డించేది. కమల కూతురు పద్మినీ సేన్‌గుప్త ప్రకారం, కసువు వూడ్చేవాళ్ళనూ, కలెక్టరునూ సమదృష్టితో చూడగలిగిన ఈ మహా మానవి 70 సంవత్సరాల వయసులో 1950 జనవరి 26న అంటే రిపబ్లిక్‌ డే రోజున ఈ ప్రపంచాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. భర్త పోయాక ఏమాత్రం కుంగిపోకుండా అత్యంత సమర్థవంతంగా కుటుంబ భారాన్నంతా మోసిన కమలా సత్యనాధన్‌, తాను మాత్రం వృద్ధాప్యంలో పిల్లలకు భారం కాకూడదనుకుంది. ఆమె నమ్మినట్టు, జీసస్‌ దయ వల్ల, తన కోరిక నెరవేరింది. కమల మృతి పట్ల అనేక పత్రికలు ప్రగాఢ సంతాపం ప్రకటించాయి. ఉదాహరణకు, ఆమె సాధించిన విజయాల్ని శ్లాఘిస్తూ, మరీ ముఖ్యంగా ‘‘భారత మహిళోద్యమంలో ఆమె చాలా కృషి చేసింది’’ అని కొనియాడుతూ, ‘‘ప్రశంసింపదగిన జీవితమిట్లా 70 సం॥లు గడిపి స్వర్గస్థురాలైంది. జిహోవా ఆమె ఆత్మకు విముక్తి నిచ్చుగాక’’ అని డా. కె.యన్‌. కేసరి సంపాదకత్వంలో వెలువడ్డ ప్రముఖ తెలుగు స్త్రీల పత్రిక అయిన గృహలక్ష్మి 1950 ఫిబ్రవరి సంచికలో ఘన నివాళి అర్పించింది (‘కీ.శే. సత్యనాధన్‌ సతి’, పు.125`126).
వలస భారతదేశంలో యింత గొప్పగా మహిళోద్యమానికి పాటుపడిన హన్నా రత్నం కృష్ణమ్మ ఉరఫ్‌ కమలా సత్యనాధన్‌ అనే తెలుగు క్రైస్తవ బంగారు తల్లిని మరీ ముఖ్యంగా తెలుగు సమాజం దాదాపు మరిచిపోవడమన్నది చాలా బాధాకరం. కమలే కాకుండా ఆమె విస్తృత కుటుంబ సభ్యులందరూ తెలుగువారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఉదాహరణకు, భండారు అచ్చమాంబ స్థాపించిందని చాలా మంది అపోహపడుతున్న ‘‘బృందావనపుర స్త్రీ సమాజా’’న్ని స్థాపించింది కమల చెల్లెలే! తెలుగు వారికి ఆమె ఓరుగంటి సుందరీ రత్నమాంబగా తెలుసు. ఆమే Mrs. S. G. Hensman గా ప్రసిద్ధురాలు. ఏది ఏమైనప్పటికీ, బాగా మరుగున పడిపోయి వున్న యిలాంటి మహిళా దారి దీపాలన్నింటినీ వెతికి పట్టుకోవడం, వాళ్ళ స్మృతినీ, కృషినీ కొనసాగించడం మన కర్తవ్యం. అవన్నీ వర్తమాన, భవిష్యత్‌ మహిళోద్యమాలకు తగినంత ప్రాణవాయువును అందిస్తాయన్నది తథ్యం.
ముగింపుకు మారుగా మరోమాట: ఇంగ్లిష్‌ ప్రపంచంలోకి యింత గంభీరంగా ప్రవహించిన భండారు అచ్చమాంబ ఖ్యాతి, ఆమెకు యింకా బాగా దగ్గరైన మరాఠీ, హిందీ, బెంగాళీ, గుజరాతీ భాషల్లోకి ప్రవహించకుండా వుండే అవకాశముందా? ఔత్సాహిక పరిశోధకులు ఈ దిశగా కూడా దృష్టి సారిస్తే, అచ్చమాంబకు సంబంధించిన మరికొంత సమాచారం తప్పకుండా లభించగలదన్నదే ఈ వ్యాస రచయిత దృఢ విశ్వాసం. అచ్చమాంబ కోసం ఒకటీ, రెండు కొత్త భాషలు నేర్చుకోవడం సఫల ప్రయత్నమే అవగలదు.
కృతజ్ఞతలు: ఈ వ్యాసం కోసం పోగుచేసిన సమాచార సేకరణలో సహకరించిన శ్రీమతులు శాంతిశ్రీ బెనర్జీ, రీతా సింగ్‌ (Prime Minister’s Museum and Library/ Teen Murti Library, New Delhi) గార్లకూÑ మరీ ముఖ్యంగా కీ.శే. డా. పాలా కృష్ణమూర్తి గారికీÑ శ్రేయోభిలాషులు కొప్పర్తి గారికీ, శ్రీ ఉద్దరాజు బాపిరాజు గారికీ, ప్రియ మిత్రులు జనాబ్‌ మొహమ్మద్‌ ఆసిం, డా. సయ్యద్‌ మీర్‌ అబుల్‌ హుసేన్‌, ప్రియ శిష్యుడు మౌలానా మొహమ్మద్‌ హారిస్‌ గార్లకూ, వ్యాసాన్ని చక్కగా టైప్‌ చేసిన శ్రీమతి శ్రీలక్ష్మి గారికీ హృదయపూర్వక సలాములు.
– అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ హిస్టరీ, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటి, హైదరాబాద్‌`32

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.