‘మనసెందుకో సున్నితం’ పేరుతో బిట్ల అంజనీ దేవి రచించి వెలువరించిన కవితా సంపుటిలో మొత్తం యాభై కవితలు ఉన్నాయి. ఈ కవితల్లో వైవిధ్యమైన వస్తు ఎంపిక ఉంది. మనిషితనంపై మమకారం ఉంది. వర్గ స్పృహ ఉంది. రాజకీయ చైతన్యం ఉంది. ప్రకృతి ప్రేమ ఉంది. సామాజిక స్పృహ ఉంది. స్త్రీవాద చైతన్యం ఉంది. అస్తిత్వ ప్రకటన ఉంది. అన్నిటినీ మించి నిజాయతీగా స్పందించే హృదయం ఉంది.
వృత్తి రీత్యా ఉపాధ్యాయనిగా పని చేస్తున్న అంజనీ దేవి, తను ఎందుకు రాస్తానో చెపుతూ ‘‘లోలోపల మాట్లాడుకున్నప్పుడు…/ మనుషులనే కాదు, మనసులని కలవాలి, కదిలించాలి/ కన్నీళ్ళతోనో, కన్నెర్రజేసో, చెప్పాలనుకుని చెప్పలేకపోయినప్పుడు,/ ఎగిరిపోయిన ఎన్నో ఆలోచనలు మేఘాలై ప్రయాణించి/ చిరునామా తెలుసుకుని చిరుజల్లై పలకరించినట్టు/ పంచుకోవటానికి పరమాన్నం లేనపుడు కొన్ని అక్షరాలను ఎంచుకున్నపుడు వచ్చినవే ఈ భావాక్షరాలు’’ అంటారు తన కవిత్వం గురించి.
వస్తువు పరంగా చూస్తే ఈ కవితల్లో అస్తిత్వం, మానవత్వం, స్త్రీలు/ఆడపిల్లలు, ప్రకృతి, కరోనా, సామాజిక అంశాలు వంటివి కనపడతాయి. కవితా శైలి సరళమైన భాషతో, సూటిగా పలికే భావాలతో, అనవసర అలంకారాలు లేకుండా, పాఠకుల మనసుని నేరుగా తాకే విధంగా, వాస్తవికంగా ఉంటుంది. చాలా కవితలలో, పంక్తులు సహజమైన లయతో, నడకతో అకట్టుకుంటాయి. భావ వ్యక్తీకరణ నిజాయితీగా, వాస్తవికంగా, అక్కడక్కడా పల్లె ప్రజలు వాడే సామెతలు, పలుకుబడులతో సహజంగా ఉంటుంది. చిన్న చిన్న పదాలలోనే లోతైన భావాన్ని వ్యక్తపరచటం ఈమె ప్రత్యేకత.
సమయమెందుకో ఊగిసలాడిరది ఈ కవితా వస్తువు విలక్షణమైనది. సాధారణంగా కవితల్లో సమయం ఎవరి కోసం ఆగదని, ఎవరి సుఖదుఃఖాలతో పని లేకుండా గడిచిపోతుందని అంటారు. లేదా మరి కొన్ని చోట్ల సమయం భారంగా గడుస్తోందని, త్వరగా మనం ఎదురు చూసిన ఘడియలు రావాలని ఆత్రుత పడే సందర్భాలు ఉంటాయి. అయితే అది మన మానసిక స్థితి. కానీ ఈ కవితలో సమయాన్ని అలా వర్ణించటం ఉండదు. సమయమే ఒక మనసు సంతరించుకుని రావాలా వద్దా అన్న సంశయంతో ఊగిసలాడుతూ ఉంటుంది.
ఉదయం వికసించిన పువ్వులు/ సాయంత్రానికి వాడటం ఇష్టం లేకనే/ సాయంత్రం కావటానికి సమయమెందుకో ఊగిసలాడిరది! అని రాస్తారు. ఎంత సున్నితమైన భావన! పక్షులన్నీ ఇళ్ళకు చేరుతున్నాయి/ అన్ని వచ్చాయో లేదో లెక్క తేలలేదు/ గూళ్ళు లెక్కపెట్టటంలో మునిగిపోయాయి/ లెక్క తెలిసిన సమయం / సాయంత్రం కావటానికి ఊగిసలాడిరది! లెక్క తెలిసిన సమయం అనటంలోనే కవితలోని లోతైన తాత్వికత బోధపడుతుంది. సమయానికి జరిగింది, జరగబోయేది అన్నీ తెలుసు. మనుషులకి తెలియదు. తెలిస్తే భవిష్యత్తు మోసుకొచ్చే దుఃఖ వార్త విని తట్టుకోలేరు. అందుకే ’లెక్క తెలిసిన సమయం ఊగిసలాడిరది’ అంటారు. ఈ ఒక్క పంక్తి కవితలోని సారాన్ని అంతా వ్యక్త పరుస్తుంది. ఇది చాలా కొత్త వ్యక్తీకరణ మరియు లోతైన తత్త్వం కలిసిన కవిత!
నేను కవితలో తన అస్తిత్వాన్ని వివరిస్తూ… అవును నేను పల్లేరుకాయనే/… ఒక్కో గాయం ఒక్కో ముల్లై పెరిగింది నాలో అంటారు. ఆ పైన అవును నేను ఎడారి మొక్కనే, అవును నేను తామర పువ్వునే అంటూ అన్ని ప్రతికూలతల మధ్య కూడా విరబూసే గుణం కల దానిగా చెప్పుకుంటారు. ’నేను వేణువును/ నిలువెల్లా గాయాలున్నా గేయమై అలరిస్తాను/ అంటారు. చివరిగా ’మనిషితనం నా మతం/ మమతల గానం నా స్వరం’ అంటూ మానవత్వం, ప్రేమ నిండిన తన వ్యక్తిగా, ఏ మతానికి, కులానికి, వర్గానికి బందీ కాని మమతామూర్తిగా తనని తాను ఆవిష్కరిస్తారు.
నువ్వెక్కడికీ పోలేదు ఇది ఒక చిన్న కవిత. తనకి దూరమైన ప్రియమైన వ్యక్తి గురించి నువ్వు ఎక్కడికీ పోలేదు అని చెపుతూ…’ నువ్వు ఎక్కడో మేఘాలలో/ దాగి దాగి చినుకువై పలకరిస్తావు/పువ్వుల్లో దాగి దాగి సువాసనై పరిమళిస్తావు’ అంటారు. అంటే ప్రకృతిలో తమ ప్రియతములను చూసుకోవటం చాలా ప్రేమ కవితల్లో కనిపించేదే అయితే ఈ కవితలోని ఆఖరి పంక్తులు చూడండి… ’శూన్యమైన నాలో అనంతమై ఉన్నావు’ అంటూ మళ్ళీ చిన్న వాక్యంలో చాలా లోతైన భావాన్ని ఇమిడ్చి చెప్తారు. శూన్యం, అనంతం రెండూ పరస్పర వ్యతిరేక పదాలు. శూన్యమైన నాలో అనంతమై ఉన్నావు అనటంలో తనలోని ఖాళీ మొత్తంలో నిండి ఉన్నది నువ్వే అని చెప్పటం మంచి వ్యక్తీకరణ. నువ్వు నేను ఎప్పుడు కలిసేది? ఈ కవిత ఇద్దరు మిత్రుల మధ్య వర్గ వైరుధ్యాన్ని ఎత్తి చూపే కవిత. కాలంతో పాటు కింది వర్గం వారు కొంత ఎదిగినా, పై వర్గం వారు ఇంకా ఎదిగి వారి మధ్య దూరం మళ్ళీ అలాగే కొనసాగుతుంది. పుస్తకాల సంచితో సర్కారు బడిలో / నువ్వున్నప్పుడు/ మూరెడు చింకి గొంగళి, బారెడు చేతి కర్రతో / బర్ల మంద కాడ నేను ’సర్కారు బడికి నేను వస్తే/ టిక్కు టిక్కు వానెక్కి / ప్రైవేటు బడికి నువ్వు పోతివి…
నేనింత ఉద్యోగం సంపాదించి / రవ్వంత తలెగరేసి నీవైపు చూస్తే/ విదేశాలకి పోతూ వెక్కిరిస్తివి/ నువ్వు నేను ఎట్లా కలిసేది’ … అని విచారిస్తూనే… నిన్ను నన్ను కలిపే స్నేహ వారధి/ ఆకాశంలో నిర్మించుకుందామా/ నువ్వూ నేను మాట్లాడుకునే ప్రేమ భాష ఫోనులో పెట్టుకుందామా/… అనే ఒక సానుకూల ఆశాభావంతో ముగుస్తుంది. రెండు వర్గాల మధ్య ఆఖరికి సాంకేతికత వారధి కట్టిందేమో అనిపిస్తుంది. నన్ను క్షమించు తల్లీ తన కూతురితో ఒక తల్లి చేసే సంభాషణ వంటిది ఈ కవిత. అప్పుడే రెక్కలు విచ్చుకుని బయటకు వచ్చిన ఆనందం నీది/ చందమామతో చెలిమి, చల్లగాలితో సయ్యాటలు/ చిటారు కొమ్మన ఊయలలూగాలని ఉరకలు వేసే కోరికలు/అంటూ ఆ చిన్నారి ఆశలు, ఆకాంక్షలు వివరిస్తూ… నన్ను క్షమించు తల్లీ/ నీకు సంకెళ్ళు వేస్తున్నందుకు / అంటారు. నిను లటుక్కున పట్టుకోవటానికి రాబందులు… ఆదమరచి ఉంటే వేటాడడానికి / గోతికాడ నక్కలుంటాయని నీకేం తెలుసు / ’రంగుల రాట్నం కాదమ్మా/ రాక్షస క్రీడదీ సమాజం’ అని సమాజంలో పొంచి ఉన్న కుళ్ళు కుతంత్రాలు, ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు. పురాణాలలోని పలుకబడులు ఉదహరిస్తూ ’అభయహస్తం కాదు అది వామనపాదం / ప్రేమ కౌగిళ్ళు కావు అవి ధృతరాష్ట్ర కౌగిళ్ళు / నిన్ను కాపాడుకోవటం కోసం నీకు సంకెళ్ళు వేయక తప్పడం లేదు/ నన్ను క్షమించు తల్లీ / నీ ఆనందాన్ని చిగురులోనే / చిదిమేసే అనివార్య రాక్షసత్వం నాది’
అంటే కవిత తాత్పర్యం, నీ మంచి కోసమే నీకు స్వేచ్ఛని ఇవ్వట్లేదు. అయితే స్త్రీ స్వేఛ్చ వ్యతిరేకులు అంతా, ఇదే మాట చెప్పారు కదా! అసలు ఆడవాళ్ళని ఇంటికే పరిమితం చేసినప్పుడూ, ఉద్యోగాలు మాన్పించేటప్పుడు ఇదే వాదన వాడారు కదా, భర్త పోయిన స్త్రీకి సర్వాలంకారాలు తీసేసినప్పుడు ఇవే మాటలు చెప్పారు కదా. ఆఖరికి మనువు కూడా స్త్రీ తన జీవితంలోని ప్రతి స్థాయిలోని ఎవరో ఒక పురుషుడి రక్షణలో ఉంటూ బతకాలి అని’న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని కదా చెప్పాడు. మరి మనమూ స్త్రీలుగా అదే నమ్మాలా అనేది ప్రశ్న! అయితే మరి సమాజంలో ప్రమాదాలు లేవా? అంటే ఉన్నాయి. అసలు భద్రత ఉందా అంటే చాలా సందర్భాలలో
ఉండదు. మరప్పుడు సంకెళ్ళు వేసుకోవటమే మార్గమా, కాదని చాలా మంది స్త్రీలు పోరాడి గెలిచి సంకెళ్ళు తెంచుకుని నిరూపించారు. అంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, కానీ బందీలుగా మిగిలిపోకూడదు.
మనిషితనం ఎందుకిలా… మరుగైపోతున్న మానవత్వం గురించి కవి వేదన ఈ కవిత. ’పరిమళాలు వెదజల్లాల్సిన పూదోటలో/ ఏదో గంజాయి వాసన ప్రమాదం పొంచి ఉంది, అంటారు ’ మానవులు తయారవాల్సిన ఫ్యాక్టరీలో / ఎందుకో మారణాయుధాలు తయారవుతున్నాయి… మంచు కొండలా చల్లగా ఉండాల్సిన మనిషితనం/ ఎందుకో లావాలా జ్వలిస్తుంది/ నేనెందుకనో గడ్డ కట్టిపోతున్నాను / రేపెప్పుడైనా అగ్నిపర్వతంలా జ్వలించి/ లావాలా స్రవించాలి కాబోలు’ అంటూ చుట్టూ ఉన్న సమాజం, మనుషులతో పాటు తనూ మారి ఏమవ్వాలో సూచిస్తారు.
భరోసాలౌదాం! ఈ కవిత ప్రరవే వారు ప్రచురించిన ఆమె పదం కవితా సంకలనంలో చోటు చేసుకుంది. మహిళలను
ఉద్దేశిస్తూ, ఉద్భోదిస్తూ వ్రాసిన కవిత ఇది. ’అగ్గితోటే తెల్లారినా/ రోజంతా మంచుకొండలా ఉండాలట’ అంటూ మొదలౌతుంది ఈ కవిత. చాలా మటుకు ఆడవాళ్ళకి పొయ్యి వెలిగించటంతోనే రోజు మొదలౌతుంది. అగ్గితో మొదలైనా, వాళ్ళు మంచులా చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంటే వినయంగా, సౌమ్యంగా ఉంటూ, అందరి అవసరాలు తీర్చాలని. ఎలా…
మది నిండా మాటల యుద్ధాలే జరుగుతున్నా/ మౌనంగా ఉండాలట… అంటూ
‘ఇంత దూరం వచ్చాక / ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోవడమెందుకు… అని
స్టవ్‌తో పాటు ఆలోచనలు వెలిగిద్దాం/ అవసరమున్న చోట విత్తుదాం, పంచుదాం అని కర్తవ్య బోధ చేస్తారు. ఏ ఆలోచనా లేకుండా యాంత్రికంగా పొద్దున లేచిన దగ్గర నుండి ఇంటిపనులు చేసుకుంటూ పోయే మహిళలు అందరికీ ఇది మేల్కొలుపు అని చెప్పాలి. స్టవ్‌తో పాటూ ఆలోచనలు వెలిగిద్దాం అంటే మేధస్సుని వాడమని… పైగా ’లోలోపల రగలడమెందుకు, బయటకి ఘర్షిద్దాం, ప్రశ్నిద్దాం, ఎదిరిద్దాం, ఎండగడదాం’ అని ఒక కార్య ప్రణాళిక ఏర్పరిచి’ నేర్చుకుందాం, నేర్పిద్దాం, అవసరమైన చోట భరోసాలు అవుదాం. అని స్త్రీలు ఒకరికి ఒకరు ఎలా అండగా నిలవాలో కూడా చెపుతూ ముగిస్తారు. ఒంటరిగా భరిస్తూ పోయే కన్నా ఒకరికొకరు తోడుండి కష్టాలు పంచుకుని, తీర్చుకోవాలి అని చెప్పే మంచి కవిత ఇది.
ఆలోచనలను పొట్లం కట్టాలి భిన్నమైన వస్తువు గల కవిత. ఆలోచనలంటే ఒక నదీ ప్రవాహం లాంటివి, ఎప్పటికప్పుడు పేపర్లో పెట్టి దాచుకోకపోతే, నీరు సముద్రం పాలు అయినట్టు మళ్ళీ వెతుక్కున్న దొరకవు అంటారు. ఆలోచనలను వర్ణిస్తూ కొన్ని సేద తీర్చే చెలిమెలౌతాయి/ కొన్ని చెంత చేరి కవ్వించే చెలియలౌతాయి అనటం బాగుంది. కొన్ని ఎద మోయలేని బరువులౌతాయి/ కొన్ని ఎదను పిండే వ్యధలవుతాయి అంటారు. పేపర్లో కట్టి పెడితే ఎప్పుడయినా విప్పుకోవచ్చు… అప్పుడప్పుడు పాటవుతుంది/ అప్పుడప్పుడు పాఠమౌతుంది. ముగింపు పంక్తులు కూడా చాలా బాగున్నాయి. ఇది రచయితలు అందరికీ మంచి సూచన కూడా… రాసి పెట్టుకుంటే బాగుంటే పాట అవుతుంది. లేకుంటే ఎలా రాయద్దో పాఠం అవుతుంది.
ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని అంతా ఒకే రీతిన కుదిపేసిన విపత్తు కరోనా! నేటికీ అది మనల్ని ఏదో రకంగా భయపెడుతూ, మధ్య మధ్యలో ఉలికిపడేలా చేస్తోంది. కోవిడ్ సమయంలో అనేక మంది కవులు రచయితలు ఆ వస్తువుపై రాశారు. అంజనీదేవి కూడా కరోనాపై చాల కవితలు వ్రాశారు. ఇందులో ఏడు కరోనా కవితలు ఉన్నాయి. ‘నాతో నేను మాట్లాడుకోవాలి’, ‘నేను వెలివేయబడ్డాను’, ‘తావీజులు కట్టండి’, ‘క్షమించు బంధమా’, ‘మిత్రమా చింత ఎందుకు’, ‘కేన్వాస్ పై చిత్రాలు’, ‘రంగ స్థలంపై సీన్లు మారుతున్నాయి’. ‘కాస్త కాఫీ అంటే/ అమ్మో కరోనా/ అంటూ వీధి గుమ్మంలోనే ఆగిన సోపతి’ ఈ పంక్తులు దూరమైన బంధాలని చక్కగా చెపుతుంది. ’అభివృద్ధి మంత్రం ఇప్పుడు/ కరోనా జపం అయింది/ వృద్ధి వ్యూహాలు ఇప్పుడు/ లెబోరేటరీ పరీక్షకు నిలబడ్డాయి’ అని కరోనా సమయంలో బయటపడ్డ మన సమాజపు అసమానతలు, ప్రభుత్వాల వైపల్యాలు, అభివృద్ధి నమూనాలో డొల్లతనం వంటివి ప్రస్తావిస్తారు. ఆఖర్లో ‘ఇక ఆసుపత్రులే గాలిగోపురాలు/ పాలకులే ద్వార పాలకులు/ డాక్టర్ పోలీస్ రైతు పారిశుద్ధ కార్మికులే / నాలుగు దిక్కుల దేవుళ్ళు’ అంటారు.
‘క్షమించు బంధమా’ కవితలో కూడా దూరం తప్పనిసరి అయినప్పుడు పడే యాతనని బాగా వ్యక్తీకరించారు. ’నా చుట్టూ నీ చుట్టూ కరోనా మంచుపొగ/ దట్టంగా ఆవహించింది/ ఏడడుగుల బంధానికి తప్పని ఆరడుగుల దూరం అని భార్యాభర్తల మధ్య కూడా తప్పని దూరాన్ని ప్రస్తావిస్తారు.
‘తావీజులు కట్టండి’ కవితలో దేవుడు కూడా కరోనా భయంతో తలుపులు మూసుకున్నాడు అంటారు వ్యంగ్యంగా. ‘బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడ/ రామ్ రాబర్ట్ రహీములెక్కడ అని ప్రశ్నిస్తూ ఇప్పుడు నలుగురే మన దేవుళ్ళు డాక్టర్ పోలీస్ రైతు పారిశుద్ధ కార్మికులే అంటూ కరోనా సమయంలో అవిశ్రాంతంగా కష్టపడ్డ ఆ నలుగుర్నీ పేర్కొంటారు. ’ఇప్పుడిక దండాలు ప్రదక్షిణాలు, ముడుపులు రక్షించవని తేలిపోయింది/ కట్టుబాట్లే కంకణాలు/ హెచ్చరికలే శిరోధార్యం’ అంటూ మూఢనమ్మకాల బదులు సైన్స్‌ను నమ్మమని చెపుతూ ఆఖరుగా ’కులమతాల కుళ్ళు ,స్వార్ధ ప్రయోజనాల/ జబ్బులు పోవడానికి ఇక తావీజులు కట్టండి. అని సమాజంలో చికిత్స దేనికి అవసరమో చెపుతారు.
‘నాతో నేను మాట్లాడుకోవాలి’ కవితలో అనూహ్యంగా లాక్డౌన్ కల్పించిన శెలవ గూర్చి చెప్తూ ’ ’నన్ను నేను కలవాలని చాల సార్లు అనుకున్నాను/ ఎంతమంది అడ్డుకున్నారు… ఈ రోజు అడగని శెలవే దొరికింది… అనేక నెనులం ఒక్కసారన్నా కలవాలి అనుకునాం… ఈ లాక్డౌన్లో అందరం కలిశాం… నాలో నేను నాతో నేను హాయిగా మాట్లాడుకోవాలి. కొన్ని నింపుకోవాలి/ కొన్ని నేర్చుకోవాలి అంటారు. కష్మిర్ లో ఒక గుడిలో ఆసిఫా అనే ఒక చిన్నారి పై జరిగిన హత్యాచారం పై ఒక కవిత రాశారు. కవిత ఎత్తుగడే చాలా శక్తివంతంగా
ఉంది. ‘చల్లని మంచుకొండల్లో/ రగులుతున్న అగ్నిగుండం నా ఉదంతం/ అపహాస్యమైన మానవత్వం/ అదృశ్యమైన నిర్భయ చట్టం’ అని ఆసిఫా గొంతులో పలికిస్తారు. ఆ తర్వాత పంక్తులలో’ ప్రజలే న్యాయ నిర్ణేతలు కావలని తేలిపోయింది… న్యాయస్థానం ముందు న్యాయం కోసం / దేబురించాల్సిన రోజులు పోవాలి’ అంటారు. చట్టం న్యాయం అందివ్వనప్పుడు ఇలాంటి ఆక్రోశం సహజమే కానీ ప్రజలే న్యాయ నిర్ణేతలు అయినప్పుడు ఒకొక్కసారి మూకోన్మాదం రాజ్యమేలుతుంది. తక్షణ ఎన్కౌంటర్లు జరుగుతాయి కానీ బాధితులకు న్యాయం దొరుకుతుందా అని చెప్పలేము. పాలకులు, న్యాయ వ్యవస్థలను ఇంకా జవాబుదారీగా, పటిష్టంగా చెయ్యటం తప్ప మార్గం లేదు.
మనసెందుకో సున్నితం పుస్తకం శీర్షికగా పెట్టిన ఈ కవిత పేరుకు తగ్గట్టు సున్నితంగా ఒక స్త్రీ మనోభావాలు తెలిపే కవిత. ’మనసెందుకో మరీ సున్నితం / మొదటిసారి వేడి తగిలినప్పుడు/ వేళ్ళు చురుక్కుమన్నాయి/ వయసు పెరిగే కొద్దీ /చర్మం ముదిరిందో/ అలవాటయ్యిందో ఇప్పుడు అమాంతం వేడి గిన్నె దించగలను’ ఆ తర్వాత పంక్తులలో ‘ఇప్పుడు ముళ్ళపై నడవగలను/ కంకరపై పడుకోగలను’ అంటారు అనుభవం పెరిగే కొద్దీ అన్ని తట్టుకున్న ఈ శరీరలోని/ మనసెందుకనో అందుకు భిన్నం’/ ’మనసు చేతికి దొరికితే బాగుండు / ముల్లు గుచ్చో/ సెగ తగిలించో/ రాతితో బాదో/ గట్టిపడేసే దాన్ని అని చెప్తూ తగిలిన ఎదురు దెబ్బలకు శరీరం గట్టిపడినా, మనసు మాత్రం మరింత సున్నితం అవుతుంది. అంటారు. ఇది మంచి కవిత, పలువురి ప్రశంసలు పోంది పేరు తెచ్చిన కవిత. కానీ మనసు సున్నితంగా ఉండి స్పందిస్తేనే మానవత్వం బతికుండేది, కవితా కుసుమాలు వికసించేది అనిపిస్తుంది.
బోసి నవ్వుల సౌందర్యం కవితలో వృద్ధాప్యం గురించి వ్రాస్తూ, ముడతలు పడిన శరీరం/ కొంకర్లు తిరిగిన వేళ్లు కాదు’ అదొక అనుభవాల సౌందర్య నిర్మితం అంటూ’ శ్రుతి తప్పిన అనురాగాలు/ గతి తిప్పిన బాంధ్వవ్యాలు వలన వారు వృద్ధశ్రమాలలో… గాజు కళ్ళతో ఉదయముండని రాత్రి కోసం వెతుకుతూ ఉంటారు’ అని రాస్తారు. చావు కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని’
ఉదయముండని రాత్రి కోసం వెతుకుతూ’… అని రాయటం ఒక లోతైన వ్యక్తీకరణ!
‘సైబీరియా పక్షులు’ కవితలో నేటి విద్యా విధానం ఈ రోజు ఎన్ని రకాలుగా విడిపోయి విభజింపబడి ఉందో చెప్తారు. ‘అరకొర వసతుల బడిలో కొందరు/ హంగుల ఆర్భాటాల ఒడిలో కొందరు’ అంటూ సర్కారు బడులు, ప్రైవేటు బడుల వ్యత్యాసం ఎత్తి చూపుతారు. ఈ ఇంట్లో ఆత్మీయత నిషిద్ధం, ఆఖరి చూపులో వంటి కవితలలో మనుషుల నైజాన్ని, వారి ద్వంద ప్రవృత్తిని బాగా చిత్రించారు. షూటింగ్ కవిత నేడు ఎక్కడ ఏ ఘాతుకం జరిగినా, చుట్టూ ఉన్న వారు సాయపడాలని కాక ఆ ఘటనని సెల్ ఫోన్లో చిత్రించటానికి ఎక్కువ ఆసక్తి చూపటాన్ని చర్చించారు. ఇది ప్రస్తుత సమాజలో ఒక జాడ్యాన్ని ఎత్తి చూపింది. ఆమెకు హద్దులు, మెల్టింగ్ పాయింట్, త్యాగానికి హద్దులు కవితలు స్త్రీ మనోగతాన్ని, ఆమె స్థితిగతులను ఆవిష్కరించేవే!
‘శాంతి కపోతమై ఎగురుదాము’ కవితలో యుద్ధం వల్ల జరిగే అల్లకల్లోలం గూర్చి, ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకత గూర్చి వ్రాస్తారు. ’మానవత్వం కోల్పోయిన చోటే కదా మారణ హోమం నడుస్తుంది’ అంటారు. ’శాంతి కోసం శోధన అవసరం లేదు సాధనే కావాలి’ అంటారు. అనామిక అనాధను మనం తరచూ వార్తలలో… అప్పుడే పుట్టిన పసి గుడ్డుని చెత్త కుప్పలో పడేసారని, రోడ్డు పక్కన వదిలేసారని వింటూ ఉంటాము. ఈ కవితా వస్తువు అదే. ‘నన్ను కలుపు మొక్క అనుకున్నారేమో/ చెత్తకుప్పలే నాకు పొత్తిళ్ళయ్యాయి/ వీధికుక్కలు నేస్తాలయ్యాయి’ అంటారు. ‘కాస్త ఆగితే కల్పనా చావ్లనయ్యేదాన్నేమో/ చెంతకు చేర్చుకుంటే శకుంతలాదేవినౌతానేమో…’ అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ బాలలు కూడా వాళ్ళు చెయ్యని తప్పుకి బలౌతారని ఈ కవితలో చాలా ఆర్ద్రంగా చెపుతారు అంజనీ దేవి. కవి ప్రేమాస్పద హృదయం కూడా ఇందులో వ్యక్తమౌతుంది.
పైన చెప్పినవే కాక సంపుటిలో ఇంకా చాలా కవితలు ఉన్నాయి. వస్తువు గొప్పదే అయినా, భావం బాగున్నా అందమైన పదాల కూర్పు, చిక్కనైన మాటల అల్లిక, ఒక లయబద్ధమైన నడక అనేవి ఒక మంచి కవితకు కావలసిన అంశాలు. కొన్ని కవితలు ఈ సహజమైన లయ, ప్రాస లోపించి, కేవలం వచన పంక్తులుగా ఉన్నవి ఉన్నాయి. అలాగే మొదటి నుంది చివరి దాకా కవితలో ఏక సూత్రత ఉండాలి. కవితా వస్తువు విషయంలో స్పష్టత కలిగి, కవిత అదే కక్ష్యలో పరిభ్రమించాలి. అలా కొద్దిగా కక్ష్య దాటిన కవితలు కొన్ని ఉన్నాయి.
మొత్తానికి కవి నిత్యం తన మనసుతో, అంతరాత్మతో సంభాషిస్తూ, తన చుట్టూ ప్రపంచాన్ని విశ్లేషిస్తూ, అర్థం చేసుకుంటూ, అన్యాయాలకు స్పందిస్తూ, ప్రకృతికి పులకరిస్తూ తన ఉనికిని అస్తిత్వాన్ని అన్వేషిస్తూ సాగే పయనంగా అనిపిస్తుంది అంజనీదేవి కవిత్వం! మొదటి కవితా సంపుటితోనే పాఠకుల మనసులు చూరగొన్న అంజనీ దేవి కవిత్వం సాహితీ లోకానికి మరొక మంచి చేర్పు. ఆమె కవిత ముందు ముందు ఇంకా శోభిస్తుందని, ఆమె ఇంకా మంచి కవిత్వం రాస్తారని ఆకాంక్షిస్తున్నాను!