ఉద్యోగరీత్యా రోజూ అతను, బస్‌లో వాళ్ళ ఊరి నుంచి పక్క ఊరికి, కడప నుంచి నెల్లూరు వెళ్ళే బస్‌లో ప్రయానిస్తుంటాడు. రోజూ ఆతనితో సహదేవ్ అనే మరో ఉద్యోగస్తుడు కూడా ప్రయానిస్తుంటాడు. అలా ఇద్దరికీ బాగా పరిచయం.
మూడు వేపమానుల సత్రం దగ్గర నలుగురు మహిళలు గల గలా సవ్వడి చేసుకుంటూ ఎక్కారు. వాళ్ళు నిండుగా పారే ఏటి ఒడ్డున తారసపడే కొత్త పక్షుల్లా వాళ్ళు ప్రత్యేకంగా వున్నారని అతను అనుకుంటాడు. వాళ్ళు సంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో, తెల్లటి శరీర ఛాయతో వున్నారు. వాళ్లలో నుంచి ఒక అందమైన అమ్మాయి లేచి, చేతిలోని కరపత్రాల్ని తోటి ప్రయాణికులకు పంచి, తిరిగి తన సీట్లో కూర్చుంది. అతను అదేమిటోయని ఆశ్చర్యానికి గురై, తీసి చదువుతాడు.
‘‘మేము రాజస్థాన్ నివాసులం. మా ఇల్లు, పొలంలోని పంట నాశనం అయినాయి. మాకు వివాహం కావలసిన ఇద్దరు కుమార్తెలున్నారు. దయార్ద్రహృదయులైన ప్రజలకు మేము చేయు విన్నపములు ఏమనగా ఐదు, పది, ఇరవై రూపాయలిచ్చి సహాయం చేయగలరు. దీనికి ప్రతిగా భగవంతుడు మీకు సహాయం చేయగలడు’’ అని ఆకాగితంలో ఉంది. ఆ కాగితాన్ని ఒక లాయర్ రాసిచ్చినట్టుగా వుంది. చదివిన వాళ్లు చదివారు, ఇవన్నీ మాములేనని కొందరు చదవలేదు. ఇలాగే ఇంగ్లీష్, హిందీలో కూడా రాసివుంది. ప్రయాణీకులకు పని పెట్టినట్లు అయ్యింది. సహదేవ్ మాత్రం కన్నార్పకుండా ఆ అమ్మాయినే చూస్తున్నాడు. అతను గమనించక పోలేదు. అడిగాడు ఏమిటని. సహదేవ్ చిన్నగా, కొత్తగా నవ్వాడు. కాసేపటికి ఆ అమ్మాయి మళ్ళీ ముందుకు వచ్చి నిల్చుంది. తాను ఇచ్చిన కరపత్రాన్ని తిరిగి తీసుకుంటూ వుంది. కొందరు చిల్లర డబ్బులు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. ఆ అమ్మాయి సహదేవుని చూసి గుర్తు పట్టి, చిన్నగా నవ్వింది, ఆమె కళ్ళల్లో కాంతులు. మడతేసి కరపత్రాన్ని ఆమెకందించాడు. ఆమె విప్పదీసి చూసింది, లోపల యాభై రూపాయల నోటు. తృప్తిగా చూసిందామె. సహదేవ్ కొనమీసాన్ని కొరుకుతూ, కళ్ళు ఎగరేసాడు. ఆమె సిగ్గుపడి ముందుకెళ్ళిపోయింది. అతను అంతా విచిత్రంగా చూశాడు. ఆ అమ్మాయి మీకు ముందే పరిచయమా అంటూ సహదేవున్ని అడిగాడు. అవును ఆ అమ్మాయికి నేను పేరు కూడా పెట్టాను ‘‘జముడు పువ్వు’’ అన్నాడు. ఎందుకంటే, రాజస్థాన్ ఎడారులో బ్రహ్మజెముడు, నాగజెముడు ముళ్ళ కొమ్మలకు పూసే తెల్లని పువ్వులాగా మెరిసిపోతూ వుంటుంది కదా ఆమె, అందుకే ఆ పేరు పెట్టానని అంటాడు. పెళ్లి అయ్యింది కదా మీకు, ఏదైనా లవ్ అఫైరా ఆ అమ్మాయితోయని అతను అడిగాడు. ప్రేమా లేదు, గీమాలేదు, ఒకసారి వస్తే వాడుకోవాలని వుందంతే, నా రూట్లో ట్రై చేస్తున్నానని సహదేవ్ అన్న మాటలకి, అతను ఇబ్బందిగా మొహంపెట్టాడు, ఇదేం పిచ్చి మీకన్నాడు.
లైఫ్లో అన్నీ వుండాలండి… రాజస్థాన్ అమ్మాయిల కోసం చరిత్రలో మహా మహా యుద్దాలే జరిగాయి, మనమెంత? మొఘల్ చక్రవర్తులంతటి వారే చిత్తోడ్, సినోడియా రాజపుత్రుల స్నేహానికి గుర్తుగా స్థానిక రాజస్థాన్ అమ్మాయిలను కోరుకున్నారనీ, జహంగీర్ తల్లి జైపూర్ రాకుమార్తె, షాజహాన్ తల్లి జోథ్పూర్ యువరాణి… జోధా అక్బర్ సినిమా చూడలేదాయని సహదేవ్ చరిత్ర చెబుతూ, ఎదురు ప్రశ్న వేశాడు. ఎందుకు వీళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికొచ్చారనే ప్రశ్న ఆతన్ని చాల రోజులుగా వేధిస్తోంది. రోజుకు వీళ్ళ సంపాదన ఎంతనీ అడిగాడు సహదేవుని. అవన్నీ నాకెందుకు’ జముడు పువ్వు’ కావాలంతే యని జవాబిచ్చాడు. ఇలాంటి వాళ్ళు గ్రూపులుగా బస్‌లు ఎక్కిదిగి పోతూవుంటారు. ఒక్కో బస్‌లో, యాభై నుంచీ వంద దాకా సంపాదిస్తారు. సాయంత్రానికి ఆ అమ్మాయి కాంతి కోల్పోయిన చూపుల్తో ‘దిగులు దేవత‘లా కనిపిస్తుంటుంది.
ఎప్పటిలాగే ఆ అమ్మాయి, ఒక రోజు బస్‌లో కర పత్రాల్ని పంచింది. ఆ అమ్మాయి గోరింటాకు చేతుల్ని తాకుతూ కరపత్రాన్ని తీసుకొని ముసి నవ్వులు విసిరాడు సహదేవ్. అదేమీ పట్టించుకోలేదమ్మాయి. కాసేపటికి కరపత్రాల్ని ఆ అమ్మాయి తిరిగి తీసుకుంది. ఆ అమ్మాయి ఆత్రంగా సహాదేవ్ కరపత్రాన్ని మడత విప్పి చూసుకుంది. అందులో వెయ్యి రూపాయల నోటు. ఊహించని సంఘటనకు ఆ అమ్మాయి నిర్ఘాంత పోయింది. వెంటనే వెయ్యి నోటును వెనక్కు ఇచ్చి, కరపత్రాన్ని మాత్రమే తీసుకుంది. ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీటి చెమ్మ. సహదేవున్ని అసహ్యంగా చూసింది. ముఖాన ‘థ్ తూ‘ అని ఊయటం ఒక్కటే తక్కువ. సహదేవ్ తలొంచుకున్నాడు. మళ్ళీ రెండ్రోజుల తర్వాత, బస్ ఎక్కిన అమ్మాయి అందరికీ కరపత్రాల్ని ఇచ్చింది గానీ, సహదేవ్‌కి మాత్రం ఇవ్వలేదు. ‘‘పైకి శిల్పం లాగా కనిపిస్తుంది గానీ ఇదొక శిల’’, ఇది నిజంగా ‘జముడు పువ్వు,’ ఒళ్ళంతా ముల్లె అంటూ సహదేవ్ మండి పడ్డాడు. ‘‘బతకటం ముఖ్యమే గానీ, అన్నిటినీ కోల్పోయి బతకదల్చుకుంటే వాళ్ళు ఇంత దూరం రానవసరం లేదేమో’’, అని అతను అనుకుంటాడు. ఇదీ కథ.
నిజమే కదా, కూటికి పేదవాళ్ళైనా, నీతికి గొప్పవాళ్ళు ఆ స్త్రీలు. చెయ్యి చాచి అడుక్కుంటారు గానీ, కొంగు పరచి పడుకోరు. ఎంతో పేదరికంలో వున్నా, మగవాడు ఎన్ని ఎరల్ని విసిరినా, లొంగని స్త్రీలున్నారు మన సమాజంలో. రచయిత తాను నిజజీవితంలో ఎదురైన వాస్తవ సంఘటనల్ని, దుర్భర ఆర్థిక దుస్థితిని కథగా మలచారు. ఆ స్త్రీల గొప్ప వ్యక్తిత్వాన్ని నీతిని మనకు విశదీకరించారు.
స్త్రీ తన ఆత్మగౌరవాన్ని వదలి, చెయ్యి చాచి అడుక్కుందంటే, వాళ్ళ ఆర్థిక దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. పంటలు పండని, తాగునీరు లేని ఎడారి వాసులు, నాల్గు మెతుకుల కోసం ఇంత దూరం వచ్చారంటే, ఉన్న ఊరిలోని వాళ్ళ సంస్కృతికి దూరంగా వచ్చి, నవ యవ్వనంలోనున్న యువతులు ఇలా చెయ్యి చాచి అడుక్కోవటం, మన వ్యవస్థల వైఫల్యం కదా!