అరకు లోయలో వికసిస్తున్న
ఆ గడ్డి పూల సొగసుకు
వెన్నెల దివిటీలు వెలిగిస్తుంది
ఆ రాతి పలకల మీద కురుస్తున్న
నీటి తుంపర్లు ముత్యాల సరుల్లా జారి
నేల మీద పరుచుకుంటున్నాయి
ఆ జాజిపూల చెట్టు నుండి వస్తున్న
సౌగంధ్యంతో ఆ లోయ పరిమళిస్తుంది
ఆ గిరిజన కాంతల
కాలి కడియాల సవ్వడికి
వెలుతురు తుమ్మెదలు పరవశమవుతున్నాయి
ఆ నగరవాసులు
అడుగుపెట్టనంత వరకు
అదొక సహజ సౌందర్యం
ఎన్నో ప్రకృతులు ధ్వంసించిన
నగర జీవులు
నిజమే! సింహంళంలో
ఆ తథాగతుని పాదాల చెంత
ఆ తెల్ల పావడాలు ధరించి
స్వర్ణకాంతులీనే యువతీమణులు
పున్నాగ పూలతో సేవిస్తున్నారు
బౌద్ధ జీవన గానపు విహంగాలు
సప్త సముద్రాలు దాటి వెళ్లాయి
అగడ్తలను, సేతువులను అధిగమించాయి
అవి ‘‘చీనా’’భాషలో
చిత్రలిపిలో పలికాయి
అవి’’ సింహళం’’లో
మధురవాణి గా ధ్వనించాయి..
ఆ పక్షులు మధ్య భారతం లో
పాళీ’’లో సూక్తులుగా భాషించాయి
ఆ కోయిలలు
ఆంధ్రుల అంతఃపురాలలో
మహారాణుల గుండెల మీద
చిత్రాలు గీశాయి
మలేషియా, మాల్దీవులకు
ఆ చిలకలు సందేశ పత్రాలు
మోసుకెళ్లాయి
నిజానికి! తేయాకు తోటల్లో
ఆకు,ఆకును లేత గోళ్ళతో
చిదుముతున్న ఆ పడతుల
సొగసులో ఇంద్రధనస్సులున్నాయి
వారి చిరునవ్వుల్లో
స్వేచ్చా వాయువుల
రమణీయ గాన రaరులు స్రవిస్తున్నాయి
నిజానికి! ఈ శ్రమ రమ
ప్రకృతి వికాసానికి ఊపిరి
నిజమే! అనేక దీపాల
జీవన వైవిధ్యం
బహుముఖ దర్శనం
మరో పక్క
అట్లాంటిక్ మహాసముద్రం
మధ్యలో చిన్న ద్వీపం
అదే ఐర్లాండ్
అక్కడ జలపాతాల సవ్వడిలో
నీటి తుంపరులను
వెలిగిస్తున్న సూర్య కిరణాలు
దృశ్యా దృశ్య వీక్షణం
కర్ణ పేయం, చిత్ర రమ్యం
వీరేంటి?
ఆ యువతులు ఇన్స్టాగ్రామ్‌లో
నిరాచ్చేదనా దృశ్య భ్రమలో
శుష్కిస్తున్నారు
ప్రకృతి అంతా స్వచ్ఛంగా
దర్శనమిస్తుంది సుమా!
ఎందుకు?
ఎవరో అభినందన కోసం
జీవితం భగ్నం చేసుకుంటున్నారు?
అక్షరంలో ఉండే జ్ఞాన ద్యుతిని
అందుకోలేని అంథత్వమా?
అక్షరం ఒక జీవన సౌధం
అక్షర ఒక ప్రతిభా సోపానం
అక్షరం ఒక శ్రుతి రమ్య గానం
అక్షరం ఒక లేఖనా శిల్ప నైపుణ్యం
అక్షరం రెండు మునివేళ్లతో
విశ్వాన్ని వెలిగించే జీవన సృజనం
నిజమే! మీరెప్పుడైనా
నెమలి నృత్యాన్ని చూశారా!?
దానిది ఎంత స్వీయ వికాసం!
ఎంత నాట్య భంగిమ!?
ఎన్ని రంగుల వలయాలు తనను వరించాయో!
ఆత్మ న్యూనత లేని నయన కాంతులవి
ఆకాశాన్ని, భూమినీ
తాళాలుగా వాయిస్తున్న పధఘటన దానిది
మీరు జీరో సైజుకి
ఎంత తగ్గాలని చేస్తున్న
కృత్రిమ శ్రమ వ్యర్థం
ఎవరి అందం వారిది కదా!
ఆ సింహళపు అడవుల్లోని
ఏనుగుల గుంపుల దృశ్యాల కోసం
ఆ తెల్ల భామలు కెమెరాలతో
అడవుల్లోకి జొరబడడం ఎందుకు?
ఆ దక్షిణాఫ్రికా స్త్రీలు, జవ్వనులు
బలంగా, అందంగా లేరా?
వారి విన్యాసాలు
కనుల విందు చేయడం లేదా?
నిన్ను నీవు దర్శించుకోవడమంటే
నీ ప్రతిభని, నీ జ్ఞానాన్ని,
నీ శక్తిని, నీ అభివ్యక్తిని
నీ అసంఖ్యాక భావనా
శకుంతల సంపదను
నీ గాన మాధుర్య స్వరాన్ని,
నిక్షేపాన్ని
నీ ఆలోచనా విస్తృతిని
అసలు వీక్షిస్తున్నావా?
విశ్వాంతరాళాన ఉన్న
జీవ నిధులు నీలోనే ఉన్నాయిగా!
అంతేకాదు
నీ ప్రేమ కడలి అలల ధ్వని
నీలో దాగున్న అనేక గుణగణాల నిధులను
నీవు దర్శించాలి సుమా!
ముందు నీవు కదులు
ఎవరికోసమో కాదు
నీకోసమే! అనే ‘అంతర్వాణి’ని వినలేదా?!
నిజమే! అకాలంగా కడలి ఉధృతి
అదొక జీవన సంక్షోభం
ముసురులో చిన్నచిన్న గుడిసెల్లో
మాగుడు వాసన
విస్తృత భవనాలూ మునుగుతున్నాయి కదా!
నిజమే! చెరువులెన్నో భవనాలయ్యాయి
జల సంక్షోభంలో భవనాలు
చెరువులవుతున్నాయి
సమతుల్యత తప్పినప్పుడు అంతా వైరుధ్యమేగా!
విశాల భూభాగంలో
చారెడు నేలలేని జీవులు
దోసిలు పట్టిన వారు ఎంత వారైనా
భిక్ష గాళ్లేగా!
అందుకే! ఎందరో చక్రవర్తులు పాలించారు, అంతరించారు
ఆ రాళ్లగుట్టలో నిలబడి
జీవన సత్యాలు అందించిన వేమన
మానవ దర్శనాన్ని బోధించలేదా!
రాళ్లకెందుకు రంగు వస్త్రాలు?
శ్రమజీవికి
కనీసపు ఉడుపులు ధరింపజేయండి అన్నాడుగా!
సజీవుడైన కవి ప్రపంచాన్ని పాలించే చక్రవర్తేగా!
అతడు మనసులను, మనుషులను, భూపాలురను సైతం
మేల్కొలపగలడు
అతడు మనో సామ్రాజ్యాలను
ప్రజ్వలింప చేస్తాడు
అతడు మానవుల
అంతర్గత శక్తులను
సజీవింప చేస్తాడు
అతడు సాలీడులో దాగున్న
యంత్ర పరికరాలను కనిపెడతాడు
అతడు యంత్ర పరికరాల్లో దాగున్న
విధ్వంస ధ్వనిని వింటాడు
ఆ సుకవి ప్రపంచ ప్రేమికుడు
ఆ కవి వెలుగు బాటలో
మనమూ ప్రకాశిద్దాం