ఊయలలో నిదురించే
ఉంగా ఉంగా పసిపాప నైనా
బుడి బుడి అడుగుల నడకన సాగే
తళ తళ చూపుల చిన్నారి నైనా
బరువైన పుస్తకాల సంచిని మోస్తూ
పరుగు పరుగున బడికెళ్లే పాపాయినైనా
తరగని విద్యల నార్జించే తపనలో
మెట్టు మెట్టు ఎక్కుతున్న చదువులమ్మనైనా
అవసరం ముంచుకు రాగా
అనుకోని ప్రయాణం సాగించే ప్రౌఢ నైనా
కాలం కలిసి రాక అయినా వారికి దూరంగా
కాబడి కరుణకై ఎదురు చూసే ఒంటరి అవ్వనైనా
వైద్యమో.. న్యాయమో… విద్యనో… అందించే
మాన్య మహిళా సేవిక నైనా
పనిచోటులోనో… నట్టింటిలోనో…
ఒంటరిగానే… గుంపులోనో
పగలూ రేయన్న తేడా పాటించక
కూడా ఎవరైనా ఉన్నదీ… లేనిదీ… ఎంచక
సిగ్గన్న మానవ లక్షణాన్ని పూర్తిగా విడిచి మనిషినన్న సంగతి నసలే మరిచి
పశువులకే జుగుప్స కలిగించేంత హేయంగా
రాక్షసులకే వికారం పుట్టించేంత వికృతంగా
హత్యాచారాలకి తెగబడే పిశాచరూపులున్న
ఈ లోకంలో మమ్మల్నిక పుట్టించకు ప్రభూ!
మాకంటూ ఓ ప్రపంచాన్ని ప్రత్యేకంగా సృష్టించు!
మేమూ నిర్భయంగా పరిఢవిల్లే వాతావరణం కల్పించు!
మాదైనా లోకాన కరువు కాటకాలు ప్రబలినా మంచు కొండలు వణికించినా
పరుచుకున్న ఎడారులు నిరాశ పరిచినా
పగబట్టిన పాములు వెంటాడి కాటేసినా మా దారుల్ని ముళ్ళ కంపలు కప్పేసినా
మమ్మల్నెవరూ అమ్మవారీగా కొలవకున్నా
అన్నిటినీ అధిగమించి సహనంతో ముందుకు సాగుతామే కానీ…
ఈ శంకాకుల మనసులో నిత్యం చస్తూ… జీవంచలేం!
మా పార్ధన మన్నించు!
మాకో సురక్షిత భవిష్యత్ నందించు ప్రభూ !