ఈ పుస్తకంలో రచయిత, అనిశెట్టి సాయి కుమార్ గారు ప్రాచీన గ్రీకు దేశం నుంచి మొదలై నేటి ఆధునిక ప్రభుత్వాల వరకు విస్తరించిన ప్రజాస్వామ్య భావన పుట్టుక పరిణామం, వివిధ దశలు అలాగే నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎలా నిలబడిరదో చక్కగా విశదీకరించారు.
వివిధ సామాజిక రాజకీయ వేత్తలు వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛకు చట్ట సమానత్వానికి, పౌర హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ, వెలువరించిన సిద్ధాంతాలు – నిరంకుశులైన రాజుల పాలనలో మగ్గిపోయిన ఆయా దేశాల ప్రజలకు కొత్త ఊపిరులు అందిస్తూ – అలాగే ప్రపంచ మానవాళికి ఉత్తేజాన్ని కల్పిస్తూ ఆధునిక దేశాల్లో చట్టబద్ధ పాలనకు నూతన రాజ్యాంగాల నిర్మాణానికి ఏ విధంగా దారులు వేశాయో చాలా బాగా చర్చించారు.
ప్రపంచ మానవాళికి శాస్త్రీయ సామ్యవాద స్ఫూర్తిని, సైద్ధాంతిక భూమికను అందించిన ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తలు కమ్యూనిజం పితామహులు కారల్ మార్క్స్ ఏంగెల్స్ సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించిన తీరు బాగుంది.
ఆధునిక భారతదేశంలో స్వాతంత్రోద్యమ కాలంలోనూ, వివిధ సందర్భాలలోను, ప్రజాస్వామ్య దృక్పధాలు బలంగా వ్రేళ్లూనుకోవడానికి దోహదపడిన మహనీయులు, దార్శనికులు, మహోన్నత నేతలు – మహాత్మా గాంధీ, డా.బి.ఆర్. అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూల విశేష కృషి గురించిన లోతైన విశ్లేషణ అందించారు.
భారతదేశంలో మానవవాద దృక్పధం ఏర్పాటులో గణనీయమైన కృషి సల్పి భారదేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులపై తమదైన విశేష ముద్ర వేసిన, మేధావులు యం ఎన్ రాయ్ మరియు జయప్రకాశ్ నారాయణ్‌ల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను పొందుపరిచారు. ఈ పుస్తకం ద్వారా చరిత్రకు వర్తమానానికి మధ్య ఉన్న లింక్‌ను వివరించడంలో రచయిత సఫలీకృతులైనారు. ఈ పుస్తకంలోని 13 అధ్యాయాలలో ప్రజాస్వామ్య సిద్ధాంత భావన ఆవిర్భావం నుంచి వర్తమానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ తీరు తెన్నులను తెలియ చెప్పటంలో భాగంగా రాజనీతి శాస్త్రానికి చరిత్ర, ఆర్థిక, సామాజిక తత్వశాస్త్రాలతో ముడిపడిన పరస్పర సంబంధాన్ని గురించి లోతైన అవగాహన కల్పించారు.
ఈ పుస్తకం ద్వారా రచయిత, సాయి కుమార్ గారికి రాజనీతి శాస్త్రంపై ఉన్న గాఢమైన అభిమానం, అపార విషయ పరిజ్ఞానం, లోతైన అధ్యయనం ప్రపంచ భారతీయ రాజకీయాలపై ఉన్న విశేషమైన అవగాహనా సైద్ధాంతిక దృక్పథం, ఆయా సిద్ధాంత కర్తల సిద్ధాంతాలను సులభతరంగా విడమర్చి చెప్పే రచనా పటిమ, ప్రతి అధ్యయనంలోను స్పష్టమౌతు వచ్చింది. రాజనీతి శాస్త్ర విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసే వారికి ఈ పుస్తకం కరదీపిక వంటిది. రచయిత సాయి కుమార్ గారు ఇలాంటి మరెన్నో విలువైన రచనలు అందిస్తారని ఆశిస్తున్నాను.