అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్‌ మందార
ఈ ఎమర్జెన్సీ గందరగోళంతో మేం కాలేజీని మధ్యలోనే వదిలెయ్యాల్సి వచ్చింది, దాంతో ఇక మాకు పార్టీతో సంబంధం లేని ఇతర మిత్రులను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చుట్టూ గిరి గీసినట్లు, మా ప్రపంచం చాలా చిన్నదైపోవటంతో.. క్రమంగా జీవితం నిరాసక్తంగా కూడా మారటం మొదలైంది. ఎమర్జెన్సీకి ముందు పగటి పూటైనా జనాల్ని కలుసుకునేవాళ్లం.

ఇంట్లో తల్లిదండ్రులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కాలేజీకి వెళ్తున్నామనో, పిక్నిక్‌లనో, సినిమాలనో… ఇవేమీ కాకపోతే స్నేహితురాలు సుమీత్‌తో ఉంటాననో.. ఏదో ఒకటి చెప్పి బయటకొచ్చేవాళ్లం. ఓసారి నేను మిత్రులతో కలసి కాంగ్రెస్‌ సమావేశాలకు నాగపూర్‌ వెళ్లాల్సి వస్తే అక్కడి విద్యా సంస్థ ఒకటి మమ్మల్ని సెమినార్‌కు ఆహ్వానిస్తున్నట్టుగా నేనే ఒక లెటర్‌ టైప్‌ చేసి, సైక్లోస్టయిల్‌ కాపీలు తీసి, వాటి మీద నేనే సంతకాలు కూడా పెట్టేసి.. మా ఇంటికీ, మిత్రుల ఇళ్లకీ పోస్ట్‌ చేశాను. అలా సమయాన్ని బట్టి ఇంట్లో వాళ్లని ఏదో రకంగా మభ్యపెట్టి వెళ్లేవాళ్లం. కానీ అండర్‌గ్రౌండ్‌లో ఉండాలంటే ఇవేం కుదరవు. కొన్ని పద్ధతులు కచ్చితంగా, కఠినంగా పాటించాల్సిందే. మేం ఎటు వెళ్లాలన్నా చీకటిపడిన తర్వాతే వెళ్లాలి. మళ్లీ తెల్లవారక ముందే తిరిగి రావాలి. అదైనా జనసంచారం ఎక్కువ ఉండే బహిరంగ ప్రదేశాలకు వెళ్లటానికి లేదు. వామపక్ష సానుభూతిపరులుగా పేరుపడ్డ వాళ్ల ఇళ్లకుగానీ, మాతో సంబంధాలున్న వాళ్ల ఇళ్లకుగానీ అసలే వెళ్లటానికి లేదు. కాలుచేతులన్నీ కట్టేసినట్టే! ఉండేది చిన్నచిన్న గదుల్లో కాబట్టి మేం వేసుకునే బట్టల విషయంలో, మన ప్రవర్తన, కదలికల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఓ రోజు నేను గదిలో యధాలాపంగా చిన్న కూనిరాగం ఏదో తీయబోయాను. వెంటనే ఆ ఇంటావిడ ‘అలా పాడతావేంటమ్మా, నిన్ను అంతా సెక్స్‌వర్కర్‌ అనుకుంటారని’ హెచ్చరించింది. ఏతావాతా జరిగిందేమంటే.. నాకు, మనకు తెలిసిన ప్రపంచం పూర్తిగా తల్లకిందులైపోయింది!
పార్టీ సహచరులను కలవాలన్నా కూడా ఏదో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే సాధ్యం. ఇలాంటి నియమ నిబంధనలన్నింటికీ అలవాటు పడేందుకు నాకు కొంత సమయం పట్టింది. వీటికి తోడు ఇతరత్రా కష్టాలూ చాలానే ఉన్నాయి. మిత్రులు ఎవరైనా అరెస్టు అయితే వెంటనే మేమంతా వాళ్లకు తెలిసిన, వాళ్లు వచ్చిపోయిన ఇళ్లన్నింటినీ ఖాళీ చేసి, కొత్త ప్రదేశాల్లో తలదాచుకోవాలి. ఎందుకంటే ఇంటరాగేషన్‌లో పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక వాళ్లు తమకు తెలిసిన షెల్టర్ల వివరాలన్నీ చెప్పేసే ప్రమాదం ఉంది. దీనివల్ల మేం ఉన్నట్టుండి ఒక్కోసారి నిలవ నీడ అనేదే లేక, రోడ్డున పడేవాళ్లం. నేను ఏ ఫ్రెండ్‌ ఇంటికో వెళితే వాళ్లు వణికిపోయి, వెనక్కి పంపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఒకసారి నాకు మలేరియా జ్వరం వచ్చింది. 105 డిగ్రీలతో ఒళ్లు కాలిపోతుంటే.. స్నేహితులొకరు వచ్చి నన్ను చికిత్స కోసం తెలిసిన డాక్టర్‌ ఇంటికి తీసుకెళ్లారు. కానీ భయంతో ఆ డాక్టర్‌ మమ్మల్ని బయటకు పొమ్మన్నాడు!
అంత అత్యవసర పరిస్థితిలో కూడా మా ప్రేమ సంబంధాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ మేం సన్నిహిత మిత్రుల ఇళ్లలో కలుసుకుని, రాత్రంతా గడిపేవాళ్లం (మాట్లాడుకోడానికే లెండి!). ఒక్కోసారి సాయంత్రం కొద్దిగా చీకటిపడ్డాక.. నగరంలో మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశాల్లో అలా నడుస్తూ గడిపే వాళ్లం. ఆ చీకటిపడే వేళ మమ్మల్ని పోల్చుకోవటం పోలీసులకుగానీ, నిఘా అధికారులకుగానీ అంత సులువు కాదు. రెండోది మమ్మల్ని ఎరిగిన వాళ్లెవరూ ఆ సమయంలో బయటకు రారు. కాబట్టి అప్పుడే కొంత ధైర్యంగా బయట తిరిగేవాళ్లం. కానీ అదే సమయంలో లోలోపల ఎంతో మథన పడుతుండే వాళ్లం. పెళ్లి చేసుకున్నా, స్థిరంగా ఉండే భాగస్వామ్యాలను ఎంచుకున్నా.. మా రాజకీయ కార్యకలాపాలకు అవెక్కడ అడ్డం వస్తాయోనన్న ఆందోళన మా మనసుల్ని తొలిచేస్తుండేది. ఈ సమయంలోనే మేం అలెగ్జాండ్రా కొల్లొన్‌టాయ్‌ రచనలను విపరీతంగా చదివాం. ఆమె రాసిన ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఎ సెగ్జువల్లీ ఇమానిసిపేటెడ్‌ కమ్యూనిస్ట్‌ వుమన్‌’, ‘సెగ్జువల్‌ రిలేషన్స్‌ అండ్‌ ది క్లాస్‌ స్ట్రగుల్‌: లవ్‌ అండ్‌ ది న్యూ మొరాలిటీస్‌’ వంటి పుస్తకాలు నాకైతే బైబిల్‌లా అనిపించేవి. నేను చదివిన ఏకైక మార్క్సిస్ట్‌, ఫెమినిస్ట్‌ రచయిత ఆమె. ఇంకా షీలా రోబోతమ్‌ వంటి మార్క్సిస్ట్‌, ఫెమినిస్ట్‌ రచయితలు మరికొందరు వున్నారుగానీ కొల్లొన్‌టాయ్‌ స్వయంగా పార్టీలో పనిచేసిన వ్యక్తి కూడా కావటంతో ఆమెతో నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. స్త్రీల హక్కుల కోసం బలంగా వాదించిన ఆమె` ఆకలి దప్పికల్లాగే లైంగికత కూడా ఒక ప్రకృతి సిద్ధమైన సహజాతమని తన రచనల ద్వారా విస్తృతంగా చాటి చెప్పింది. మేం లైంగికత గురించి పార్టీ పెద్దలతో ఎన్నడూ మాట్లాడలేదు, అలాంటి విషయాలు చర్చించే పరిస్థితులు కూడా లేవు కాబట్టి కొల్లొన్‌టాయ్‌ రచనలు మా మనసులకు మరింత దగ్గరయ్యాయి. ఆమె రచనలే గనక చదవకపోయి
ఉంటే నేను అసలు పెళ్లి చేసుకుని వుండేదాన్ని కాదేమో అనిపిస్తుంటుంది. విదేశాల్లో ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు పార్టీలో చురుకుగా పాల్గొన్న మహిళల్ని పెళ్లి చేసుకున్నారన్న వాస్తవం మాకు పెద్ద భరోసానిచ్చింది. మావోకు నలుగురు భార్యలు. ఇక లెనిన్‌, ఫిడెల్‌ కాస్ట్రో, చే గవేరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో మేం మన దేశంలోని కమ్యూనిస్టు నాయకుల గురించి అంతగా చెప్పుకొనేవాళ్లం కాదు. ఎందుకంటే ఇక్కడ తమతో పాటు విప్లవోద్యమంలో కలిసి నడుస్తున్న మహిళలను జీవిత భాగస్వాములుగా చేసుకున్న నాయకులు చాలా తక్కువ. దాదాపు మా పార్టీలోని నాయకులంతా కూడా తమ భార్యాబిడ్డల్ని వదిలేసి
ఉద్యమంలోకి వచ్చినవాళ్లే. కొందరికి వివాహేతర సంబంధాలూ ఉన్నట్టు ప్రతీతి.
1975 జులైలో నేనూ, సిరిల్‌ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయాన్ని మా పార్టీ పెద్దలకూ, మిత్రులకు కూడా చెప్పాం. అయితే తర్వాత కొద్ది రోజులకే మా తల్లిదండ్రులు ఒక దొంగ కబురు పంపించి నన్ను మద్రాస్‌కు రప్పించుకున్నారు. అదంతా బాలీవుడ్‌ సినిమా ఫక్కీలో జరిగింది. హైదరాబాద్‌లోని మా స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసి.. అమ్మకు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని చెప్పారు. వెంటనే ఆ వార్త మా పార్టీ పెద్దలకు చేరింది. నాకెందుకో ఆ వార్త నమ్మబుద్ధి కాలేదు. కానీ మా కామ్రేడ్స్‌ మాత్రం ఓసారి వెళ్లి చూసి రమ్మని బలవంతపెట్టారు. దీంతో నేను హడావుడిగా బయల్దేరి మద్రాస్‌ రైలు ఎక్కాను, చేజేతులా బోనులో చిక్కుకుపోయాను. తీరా ఇంటికివెళ్లి చూస్తే అక్కడ అమ్మ ఆరోగ్యంగా, హాయిగా తిరుగుతోంది. మా పెద్దక్కయ్యకి రెండో బిడ్డ పుట్టింది. ఇంకో అక్కయ్యకి పెళ్లి ఖాయమైంది. వాళ్లంతా కలసి నన్నెలాగైనా ఇంటికి రప్పించి, ‘అదుపులో’ పెట్టుకోవాలని వేసిన ఎత్తుగడ అది. వెళ్లగానే వాళ్లు నన్నో గదిలో పెట్టి, పారిపోకుండా బయట గడియ పెట్టేశారు. వాళ్లు నాకేం చేయబోతున్నారో అన్న భయంతో లోపల్నించి నేనూ గడియ పెట్టేసుకున్నాను. కిటికీలోంచి చూస్తే బయట చిన్న తోట వుంది. దాన్ని ఆనుకునే సీఐటీ కాలనీ మెయిన్‌ రోడ్డు. అదంతా మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ భవనం వెనకాలే, విశాలమైన పెద్దపెద్ద ఇళ్లలో సంపన్నులైన తమిళ బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే ప్రాంతం అది.
మూడు రోజుల పాటు నన్ను ఆ గదిలోనే బంధించి ఉంచారు. ఈ మూడు రోజులూ నాకు ఒకటే పని. అటుగా రోడ్డు మీద ఎవరు పోతూ కనిపించినా లోపలి నుంచి సాయం కోసం అరుస్తూనే ఉన్నాను. నా వయసు ఇరవై ఒక్కటనీ, మేజర్‌ననీ, తల్లిదండ్రులు నన్ను గదిలో బంధించారనీ, బయటపడేందుకు సాయం చెయ్యమనీ అటుగా రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరినీ అర్థిస్తూనే ఉన్నాను. మరోవైపు మా పెద్దక్కయ్య నాకు పోటీగా ఆ కిటికీ పక్కనే నిలబడి` నేనొక నక్సలైట్‌ననీ, అందుకే గదిలో బంధించామని గట్టిగా అందరికీ చెప్పటం మొదలుపెట్టింది. దీంతో అప్పటి వరకూ అక్కడ నిలబడి నా గోడు వింటున్న వాళ్లు కూడా అక్క మాటలు వినగానే భయపడి విసవిసా అక్కడ్నించి వెళ్లిపోయే వాళ్లు. కొందరైతే బుగ్గలు నొక్కుకుంటూ ‘అదృష్టం, మీ అమ్మానాన్నా నిన్నింకా గదిలోనే పెట్టారు. అసలుకైతే కాల్చిపారెయ్యాలి’ అని నన్నే నానా మాటలూ అన్నారు. మూడు రోజులైనా చుట్టుపక్కల జనాల నుంచి ఎలాంటి సాయమూ అందకపోవటంతో నాకు కొద్దికొద్దిగా వాస్తవం బోధపడటం మొదలైంది. కిటికీ దగ్గర పోగవుతున్న జనానికీ, నాకూ మధ్య గట్టిగా ఇరవై అడుగుల దూరం కూడా ఉండదు, కానీ వాళ్లలో ఒక్కరు కూడా నా పరిస్థితికి జాలిపడినవాళ్లు లేరు. ఆ నగరం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది, నన్ను అనాథలా వదిలేసింది. నిస్సహాయత ఆవరించి, అసహనంలో కూరుకుపోయిన నేను ఒక్కోసారి ఆ వీధి మొత్తం వినబడేలా బిగ్గరగా అరిచేదాన్ని. అయినా ఒక్కళ్లు కూడా స్పందించ లేదు. తినడానికి లోపల ఏమీ లేదు. నా గదికి ఆనుకునే బాత్రూమ్‌ ఉంది, కాబట్టి తాగడానికి కొళాయి నీళ్లైతే ఉన్నాయి. గదిలో వెతికితే అక్కయ్య తన పసిబిడ్డ కోసం అమెరికా నుంచి తీసుకొచ్చుకున్న ‘ఎన్‌ఫామిల్‌’ బేబీ ఫుడ్‌ టిన్నులు కనిపించాయి. ఒకటి తెరిచి తిందామని ప్రయత్నిస్తే పిసరంత కూడా మింగుడు పడలేదు.
మూడు రోజుల తర్వాత నేను తలుపు గడియ తీసి, వాళ్లని లోనికి రానిచ్చాను. అలా ఎందుకు చేశానో నాకు ఇప్పటికీ అంతుబట్టదు, బహుశా ఆకలికి తట్టుకోలేక మెత్తబడ్డానేమో. వెంటనే మావాళ్లు నన్ను పూనమల్లె హై రోడ్డులో ఉన్న సైకియాట్రిస్ట్‌ డా. రామారావు పాలీ క్లినిక్‌కి లాక్కుపోయారు. నేనా డాక్టర్ని నానా రకాలుగా బతిమలాడుకున్నాను. నేనేం చిన్నపిల్లను కాదనీ, స్వేచ్ఛగా జీవించే హక్కున్న పౌరురాలుననీ, నా యిష్టాఇష్టాలను పట్టించుకోకుండా, నా ఆలోచనలకు విరుద్ధంగా మా తల్లిదండ్రులు నన్ను నిర్బంధించారని మొరపెట్టుకున్నాను. మానసికంగా నాకెలాంటి సమస్యలూ లేవని, నేనేం సోయి తప్పి వేరే లోకంలో లేనని, పరిసర సమాజం పట్ల, మన జీవన వాస్తవాల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాననీ, ఇంకా చెప్పాలంటే వాటిలో మార్పు తేవాలన్న కృత నిశ్చయంతో కూడా ఉన్నానని వివరంగా చెప్పిన గుర్తు. కానీ ఆయన నా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా నాది ఒకరకమైన ‘జబ్బు’ అనీ, దాన్ని పూర్తిగా ‘నయం’ చేసేస్తానని నాన్నకు హామీ ఇచ్చాడు. సరిగ్గా ఇలాంటి సమస్యతోనే ఆ మధ్య బెంగుళూరు నుంచి ఒక యువకుడిని తన దగ్గరకు తీసుకొస్తే.. అవలీలగా నయం చేసి పంపినట్లు కూడా చెప్పాడు. నాకు నక్సలైట్లు ‘బ్రెయిన్‌ వాష్‌’ చెయ్యటం వల్లే నేనిలా తయారయ్యాననీ, దాన్ని వదలగొట్టేందుకు తను ‘రీ`బ్రెయిన్‌వాష్‌’ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నాకు మత్తుమందు ఇచ్చి… ఆ క్లినిక్‌లోనే నాకు కరెంట్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ రోజు నేనెంత నిస్సహాయ స్థితిలోకి జారిపోయానో తల్చుకుంటే ఇప్పటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. నన్నెందుకిలా చిత్రహింసలు పెడుతున్నారు? నన్ను ఒక జంతువులా చూస్తున్నారెందుకు? దీని బదులు ఒక్కసారే చంపెయ్యచ్చుకదా అని లోపల్లోపలే కుమిలిపోయాను. చుట్టూ చూస్తే నాలాగా షాక్‌ ట్రీట్‌మెంట్‌కు గురైన వాళ్లు బోలెడంతమంది! వాళ్లను చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచింది. ఎక్కడో పిచ్చి చూపులు చూస్తూ.. నోట్లోంచి చొల్లు కారుతూ.. కాళ్లూ చేతులూ వేలాడబడి, జీవచ్ఛవాల్లా ఉన్న వాళ్లని అక్కడ్నించి చక్రాల కుర్చీల్లో తోసుకుపోతున్నారు. ఇక ఆ సైకియాట్రిస్ట్‌ రామారావు అంటే నాకు తీవ్రమైన ద్వేషం మొదలైంది. అతడిని చాలాకాలం పాటు అసహ్యించుకున్నాను. అతని మీద కేసు పెట్టాలనీ, మీడియా ముందుకు లాగి అతడి అకృత్యాలను బట్టబయలు చేయాలనీ అనిపించేది. అప్పుడప్పుడు రాత్రిపూట అతడిని చంపేసినట్టుగా కలలు కూడా వచ్చేవి. ఆ రోజుల్లో అతను గనక రోడ్డు మీద కనిపిస్తే.. ఖచ్చితంగా మీదబడి దాడి చేసేదాన్నే.
ఆ ఘటన తర్వాత చాలాకాలం పాటు నేను మళ్లీ మద్రాస్‌లో అడుగుపెట్టడానికే ఇష్టపడలేదు. కొన్ని సంవత్సరాల వరకూ ఆ ‘ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ’ గురించి ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. అది నా మనసులో ఎక్కడో తీవ్రమైన గాయాలు చేసింది. ఆ వ్యధనంతా అనుభవించింది నేను కాదు, మరెవరో యువతి అన్నట్లు.. నేనలా నిశ్చేష్టనైపోయాను. చివరికి ఆ జ్ఞాపకాల తలంపు వచ్చినా కూడా మనసు అల్లకల్లోలమై, నాలో నేనే మౌన ఘోష అనుభవించేదాన్ని. అది జరిగిన దాదాపు ఇరవై మూడేళ్లకు గానీ నేను దాని గురించి పెదవి విప్పలేదు. 1998లో వీణా శతృఘ్న, శ్రీవిద్యా నటరాజన్‌లతో కలిసి నేను స్త్రీల ఆరోగ్యం గురించి ‘టేకింగ్‌ ఛార్జ్‌ ఆఫ్‌ అవర్‌ బాడీస్‌’ అనే పుస్తకం రాశాను. దానిలో మెంటల్‌ హెల్త్‌ అధ్యాయంపై పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా ఆ అనుభవం గురించి బయటపడ్డాను. ఆ రోజు వీణ, భార్గవి దావర్‌ (ఆమె మెంటల్‌ హెల్త్‌ కార్యకర్త, నాతో పాటు ఆ అధ్యాయానికి సహ రచయిత కూడా)లు ఇద్దరే
ఉన్నారు. వాళ్లిద్దరికీ దాని గురించి చెప్తూ చెప్తూ చాలాసేపటి వరకూ అలా దు:ఖిస్తూనే వుండిపోయాను. ఆ పుస్తకంలో దీని గురించి రాస్తున్నప్పుడు కూడా కన్నీళ్లతో చెంపలు తడిసిపోతూ ఉండేవి. ఆ చిత్తు ప్రతులు చదుతుంటే పొగిలిపొగిలి, ఏడుపు తన్నుకొస్తూ, కొన్నిసార్లు దాన్ని పక్కనబెట్టెయ్యాల్సి వచ్చేది. మళ్లీ కోలుకోటానికి చాలాసేపు పట్టేది. నేను అంతగా ఎందుకు కుమిలిపోయేదాన్నో, మనసులో అంత దుఃఖం ఎలా గూడుకట్టుకుపోయిందో నాకే అర్థం కాలేదు. ఇది కేవలం ఆ రోజు నేను అనుభవించిన నరకం వల్లో, లేకపోతే ఆ షాక్‌ ట్రీట్‌మెంట్‌తో జ్ఞాపక శక్తి, మెదడు పనితీరు వంటివి కొంత దెబ్బతినటం వల్లనో, లేక నాలోని పూర్వపు జీవశక్తి, ఉత్సాహం సన్నగిల్లటం వంటి వాటి వల్లనే అని నేను అనుకోను. మన సొంత కుటుంబమే మనకు పూర్తి వ్యతిరేకంగా మారి, నమ్మక ద్రోహానికి పాల్పడినప్పుడు.. దాన్నెలా అర్థం చేసుకోవాలో తెలీక, ఆ ఘాతుకాన్ని తట్టుకునే శక్తి మనలో లేక అలా అయ్యిందేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ శత్రుత్వం లేదు, ప్రతీకారం లేదు, న్యాయం లేదు` పూర్తిగా మనవాళ్లు అనుకున్న వాళ్లే ఇలా వెంటాడి వేధిస్తున్నారు! ఈ విషయంలో మా అమ్మానాన్నలను కొంత వరకూ అర్థం చేసుకోవచ్చు. తమ కన్న కూతురు వెళ్లి నక్సలైట్లలో చేరడంతో బెంబేలెత్తిపోయి, ఆమెను ఎలాగైనా ‘రక్షించుకోవాలని’ వాళ్లు తపన పడటం కొంత వరకూ సమంజసమే కావొచ్చు. కానీ చదువుకున్నవాళ్లూ, అన్నీ తెలిసినవాళ్లూ అయిన మా అక్కయ్యలైనా నాకెందుకు అండగా నిలబడలేదన్నదే నా బాధ.
2019లో, అంటే ఇది జరిగిన నలభై నాలుగేళ్ల తర్వాత కేరళలో ఇలాంటి సంఘటనే మరోటి వార్తల్లోకి ఎక్కింది. ఒక హిందూ యువతి ముస్లింను పెళ్లి చేసుకుని, ఇస్లాం మతం స్వీకరించింది. అందుకు ఆగ్రహించిన హదియా తల్లిదండ్రులు నాకులాగే ఆమెను కూడా ఇంట్లో నిర్బంధించారు. పౌర సమాజం, చివరకు కింది కోర్టులు సైతం ఆ తల్లిదండ్రులకే మద్దతునివ్వటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికీ మన సమాజంలో ఎంతోమంది మహిళలు ఇటువంటి దు:స్థితినే అనుభవిస్తున్నారనటానికి తార్కాణం ఇది.
ఇరవై రోజుల ‘మానసిక చికిత్స’ తర్వాత చెకప్‌ కోసమంటూ నన్ను చాలాసార్లు ఆ రామారావు క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఇక లాభం లేదని నేను పూర్తిగా మారిపోయినట్టు, నా తల్లిదండ్రులు చెప్పే వాటన్నింటికీ ఒప్పుకుంటున్నట్టు నటించటం ఆరంభించాను. వాళ్లు చెప్పినట్టు ఐఏఎస్‌, ఐఐఎం కోర్సులకు దరఖాస్తులు పెట్టాను. శాస్త్రీయ సంగీతం క్లాసులకు వెళ్తానని మాటిచ్చాను. అలా నా కొత్త దినచర్య మొదలు కాబోతుండగానే.. మెల్లగా ఎలాగైనా ఇంట్లోంచి తప్పించుకుపోవాలని ప్రయత్నించి, పరమ దారుణంగా దెబ్బతిన్నాను! ఆ రోజు నాన్న మమ్మల్నందర్నీ ఓ పెళ్లికి తీసుకెళ్లారు. నేను బాత్‌రూంకి వెళ్లాలని చెప్పి పక్కకొచ్చి, ఆ ఫంక్షన్‌ హాల్లోంచి బయటికి పరుగెత్తాను. ఓ టాక్సీని ఆపి, మద్రాస్‌ ఐఐటీకి తీసుకెళ్లమని చెప్పాను. ఐఐటీలో నాకు తెలిసిన స్నేహితుల దగ్గరకు వెళ్లాలన్నది ప్లాను. కానీ నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో పాటు నేను చాలా ఆందోళనగా కూడా కనిపించినట్లున్నాను.. దీంతో ఆ టాక్సీ డ్రైవరు నన్ను ఐఐటీ దగ్గర దింపినట్టే దింపి.. వెంటనే పోలీసులకు చెప్పినట్లున్నాడు. ఈలోపు నాన్న కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లి నేను కిడ్నాప్‌కు గురైనట్టు ఫిర్యాదు చేశారు. దీంతో నేను అలా ట్యాక్సీ దిగి, ఐఐటీ లోపలికి వెళ్లి, నా మిత్రుల కోసం వెతుక్కుంటున్నానో లేదో.. ఎదురుగా నాన్న, పోలీసులు, కొంతమంది బంధువులు గుమిగూడి కనిపించారు.
ఐఐటీ డీన్‌ కూడా పైనుంచి దిగి కిందికి వచ్చారు. మేమంతా ఆరుబయట, ఓ మలుపు దగ్గర నిలబడి ఉన్నాం. ఆ నాటి హాస్య భరిత విషాదాంత నాటకంలో ఎవరి పాత్రల్ని వాళ్లు బాగా పోషించడం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. బయటి వ్యక్తుల్ని క్యాంపస్‌లోకి అనుమతించేది లేదు కాబట్టి తక్షణమే నన్ను వెళ్లిపొమ్మన్నాడు ఆ ఐఐటీ డీన్‌. కిడ్నాప్‌ ఫిర్యాదు పెండిరగ్‌లో వుంది కాబట్టి మూడు రోజుల పాటు ప్రతిరోజూ స్టేషన్‌కు వచ్చి కనిపించి వెళ్లాలని, నేను ఎక్కడ ఉంటున్నానో చెప్పాలని పోలీసులు హుకుం జారీ చేశారు. నా స్నేహితులేమో ఉలుకూ పలుకూ లేకుండా, బెల్లం కొట్టిన రాళ్లలా నిలబడ్డారు. ఇంత గందరగోళంలో.. ఆయన అక్కడికి ఎందుకొచ్చారో తెలియదుగానీ.. నాకు చాలా సన్నిహితమైన స్కూల్‌ ఫ్రెండ్‌ జయశ్రీ శ్రీనివాసన్‌ వాళ్ల నాన్న కూడా ఆ గుంపులో కనిపించారు. ఆయన్ను చూస్తూనే నా ప్రాణం లేచొచ్చింది. పోలీసులు పెట్టిన మూడు రోజుల గడువూ ముగిసేవరకూ మీ ఇంట్లో ఉండనివ్వండంటూ ఆయన్నూ, చుట్టూ ఉన్న మిగతా బంధువులనూ ప్రాధేయపడ్డాను. ముందు అక్కడ చేరితే, తర్వాత ఎలాగోలా అక్కడ్నించి హైదరాబాద్‌ వెళ్లిపోవాలన్నది నా ప్లాను. కానీ నా వేడుకోళ్లకు వాళ్లెవ్వరిలోనూ చలనం లేదు. అంతా అలా నిల్చుండి పోయారు. ఇక చేసేదేం లేక నేనే తలవంచుకుని నాన్న వెంట ఇంటికి తిరిగి వెళ్లాను. అయితే నా ఆశలు మాత్రం చచ్చిపోలేదు.
ఈలోగా నన్ను మా ఇంట్లో బంధించారన్న విషయం హైదరాబాద్‌లోని నా మిత్రులకు తెలిసింది. అక్కడ్నించి ఎలాగైనా తప్పించి తీసుకొచ్చేందుకు శశిని మద్రాస్‌కు పంపించారు. అతను నా ఐఐటీ మిత్రుల ద్వారా జయశ్రీ శ్రీనివాసన్‌ను కలుసుకున్నాడు. జయశ్రీ కుటుంబం అంటే మా ఇంట్లో అందరికీ ప్రత్యేక అభిమానం. అందుకని శశి ఒక లెటర్‌ రాసి పుస్తకంలో పెట్టి, నాకు అందజేయమని జయశ్రీకి ఇచ్చాడు. మళ్లీ నేను కూడా అలాగే తిరుగు జాబు రాసి పంపించాను. ఇలా చాలా తక్కువ టైములోనే మేమిద్దరం ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అప్పటికి మరో వారం రోజుల్లో మా అక్కయ్య పెళ్లి వుంది. అందరూ ఆ హడావుడిలో వున్నారు. (తన పెళ్లి వేడుక నేను ‘చెడగొట్టానంటూ’.. అక్క నన్ను ఎన్నటికీ క్షమించలేదు). ముందుగా అనుకున్న టైముకు నేను మా అక్క కూతురితో కలిసి సంగీతం క్లాసుకు బయల్దేరాను. అలా ఇంటి నుంచి కాలు బయటపెడుతూనే.. ఒక్క ఉదుటన పరుగెత్తుకుంటూ మా వీధి చివరకు వెళ్లి ఆగాను. అప్పటికే అక్కడ ఓ మిత్రుడు మోటర్‌ బైక్‌ మీద సిద్ధంగా వున్నాడు. వెనకాల నుంచి మా అక్క కూతురు ‘పిన్ని పారిపోతోంది… పిన్ని పారిపోతోంది…’ అని గట్టిగా అరుస్తుండటం వినబడుతూనే ఉంది.. నేను గభాల్న ఆ మోటర్‌ బైక్‌ ఎక్కి కూచున్నాను. అనుకున్న ప్రకారం ఆ మిత్రుడు నన్ను వేగంగా మరో ఇంటికి తీసుకెళ్లి దింపాడు. నేను అక్కడ బట్టలు మార్చుకుని, ఎవరూ గుర్తుపట్టకుండా జుట్టు ఇంకోలా దువ్వుకుని.. మళ్లీ ఇంకొకరి బైక్‌ ఎక్కేశాను. వాయు వేగంలో మేం బెంగుళూరు రోడ్డులో, మద్రాస్‌కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం చేరిపోయాం. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమిళనాడు రాష్ట్ర సరిహద్దులను దాటిపోవాలి. ఎందుకంటే నాన్న మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యటం, వాళ్లు తక్షణం రంగంలో దిగటం ఖాయం. మేం అరక్కోణం చేరేప్పటికే శశి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. వెంటనే మేమిద్దరం బయల్దేరి మొదట బెంగుళూరుకు, అక్కడ్నించి బస్సులో హైదరాబాద్‌కు వచ్చి పడ్డాం! ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకూ కూడా నేను మళ్లీ మా తల్లిదండ్రుల మొహం చూళ్లేదు. నేనీ పుస్తకం రాస్తూ నాటి సంఘటనలను మళ్లీ ఒకసారి మిత్రులతో సరి చూసుకుంటున్నప్పుడు.. ఆ రోజు మేం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చేప్పుడు బస్సులో నా ప్రవర్తన చాలా చిత్రంగా ఉందనీ, నేను తీవ్రమైన అయోమయంలో వున్నట్టు అనిపించిందనీ శశి గుర్తు చేసుకున్నాడు. మా సన్నిహిత సహచరుడు జంపాల ప్రసాద్‌ను పోలీసులు చంపేశారన్న వార్త చెప్పినా కూడా నేను ఆ రోజు పెద్దగా స్పందించకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పాడు.
1975 నవంబర్‌లో హైదరాబాద్‌కు తిరిగివచ్చేటప్పటికి.. ఇక్కడి పరిస్థితులేమీ బాగాలేవు. ఆ విషయం అర్థమవటానికి నాకు అట్టే సమయమేం పట్టలేదు. పోలీసుల నిఘా, అరెస్టులు, చిత్రహింసలు మావాళ్లలో చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. మా నాయకుడు నీలం రామచంద్రయ్యతో పాటు జంపాల ప్రసాద్‌ని ‘ఎన్‌కౌంటర్‌’ చేశారు. ఆ భారీ పదురుదెబ్బతో ఎందరో కామ్రేడ్స్‌ వణికిపోతున్నారు. నేను హైదరాబాద్‌కు తిరిగి రావటం పట్ల మావాళ్లంతా సంతోషించారు కానీ ఆ గందరగోళంలో నా మానసిక స్థితిని వాళ్లు సరిగా పట్టించుకోలేదు. నేను సిరిల్‌ని కలిసినప్పుడు అతనెవరో పోల్చుకోలేకపోవడంతో అప్పుడు బయటపడిరది, నా పరిస్థితి ఏమిటన్నది! నేనిక్కడ లేని సమయంలో తను కొద్దిగా గడ్డం పెంచుకున్నాడు. అంతమాత్రాన తను గుర్తుపట్టలేనంతగా ఏం మారిపోలేదు. ఒక మీటింగుకు వెళ్లి పక్కవాళ్లను అతనెవరని అడిగితే.. వాళ్లు బిత్తరపోయి.. ‘నువ్వు పెళ్లి చేసుకోబోయేది అతడినే’ అని చెప్పారు. నేను ఒక్కసారిగా కంగు తిని ‘తనెవ్వరో నాకు తెలియను కూడా తెలీదే!’ అన్నాను. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అదే పనిగా నేను పాత మిత్రులను, కామ్రేడ్లను గుర్తు చేసుకోవటం మొదలుపెట్టాను. మధుసూదన్‌ రాజ్‌ అని, నాకు చాలా సన్నిహితుడైన కామ్రేడ్‌ ఉండేవాడు (తర్వాత తను ఎన్‌కౌంటర్‌ అయ్యాడు). వాళ్ల ఇంటి తలుపులు మాకోసం ఎప్పుడూ తెరిచే వుండేవి. మధుసూదన్‌ వాళ్ల నాన్న ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. మావాళ్లు నన్ను ఆయన వద్దకు తీసుకువెళ్లారు. నాకు మద్రాస్‌లో అమ్మానాన్నా ఇప్పించిన షాక్‌ ట్రీట్‌మెంట్‌ గురించీ, ప్రస్తుత నా అయోమయ స్థితి గురించీ ఆయనకు అంతా వివరంగా చెప్పాను. ఆయన నన్ను రకరకాలుగా పరీక్షించారు. వేళ్లు పైకెత్తమన్నారు, తర్వాత చేతులు కదపమన్నారు, వివిధ భంగిమల్లో నడవమన్నారు, ఇంకా బోలెడన్ని ప్రశ్నలు అడిగారు. చివరికి` నా జ్ఞాపక శక్తి కొంతమేర దెబ్బతిందనీ, అయితే నా దైనందిన జీవితానికేం ఇబ్బంది ఉండదని చెప్పారు. అంతకు మించి ఆయన ఒక్క ముక్క కూడా వివరం చెప్పలేదు. మొత్తానికి ఆయన మాటలు నాకు గొప్ప ఊరటనిచ్చాయి` నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను, సజీవంగా, శారీరక ఇబ్బందుల్లేకుండా ఉన్నాను. అదే పదివేలు! మెల్లగా నాకు ఒక్క ఫోన్‌ నంబరు కూడా గుర్తుకు రావటం లేదన్న విషయం గమనించాను. అంతకు ముందు నా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉండేది. అప్పటి వరకూ నాకు ఫోన్‌ నెంబర్లని పుస్తకంలో రాసుకునే అలవాటే లేదు. ఎన్ని నంబర్లు అయినా పేజీలకు పేజీలే అలా ఫొటో తీసినట్టుగా మనసులో ముద్ర పడిపోయేవి. వాటిని మెరుపు వేగంతో అలా చూసి, ఇలా ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకునే దాన్ని. ఇప్పుడా సామర్థ్యాన్ని కోల్పోయాను. అలాగే గణితశాస్త్రం మీద నాకున్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. నా చుట్టూ వున్న కామ్రేడ్లెవరూ దీన్ని గమనించే పరిస్థితిలో లేరు. అందరి దృష్టీ అప్పుడు దేశంలో వేగంగా మారిపోతున్న పరిణామాల మీదే కేంద్రీకృతమై వుంది. దీంతో ఆ ఈసీటీ చికిత్స గురించిగానీ, తదనంతరం నేను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి గానీ నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు, చివరకు సిరిల్‌తో కూడా!
పార్టీలోని యువ సభ్యులు చాలామంది పోలీసులకు లొంగిపోయారు. కొందరు అరెస్ట్‌ అయ్యారు, మరికొందరు పార్టీకీ పోలీసులకూ కనిపించకుండా మాయమై` దూరంగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళ్లి తల దాచుకున్నారు. పోలీసులు రహస్య స్థావరాలన్నింటి మీదా దాడులు చేశారు. చాలామందికి తమ బృంద సహచరులతో సంబంధాలు తెగిపోయాయి. పార్టీ నాయకత్వంలో ఆర్డర్‌ మొత్తం అస్తవ్యస్తమై, పరిస్థితి గందరగోళంగా తయారైంది. హైదరాబాద్‌ తిరిగి వచ్చిన కొద్ది రోజులకే.. 1975 నవంబర్‌ చివర్లోనో, డిసెంబర్‌ మొదట్లోనో నేనూ సిరిల్‌ ‘పార్టీ పెళ్లి’ చేసుకున్నాం. నేను మద్రాస్‌కు వెళ్లడానికి ముందు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే. కానీ తిరిగి వచ్చిన తర్వాత నేను చాలా అనిశ్చితంగా, అయోమయంగా అయిపోయాను. పార్టీ నేతలు మాత్రం మేం సత్వరమే పెళ్లి చేసుకుంటే మంచిదని, అది మన క్యాడర్‌లో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని తొందరపెట్టారు. సాధారణంగా పార్టీ పెళ్లిళ్లు బహిరంగ సభల్లా జరుగుతాయి. పెళ్లి చేసుకునే జంట వేదిక మీద కూచుంటుంది. మిగతావాళ్లంతా వేదిక ముందర కుర్చీల్లోనో, నేల మీదో కూర్చుంటారు. వేదిక మీద కార్ల్‌ మార్క్స్‌ చిత్రపటం, ఓ ఎర్రజెండా అలంకరిస్తారు. పార్టీ నాయకులొకరు వేదిక మీదకొచ్చి` సందర్భానుసారం జంట మధ్య ఉండాల్సిన ప్రేమ, విధేయత, విప్లవ కాంక్షల గురించి చిన్న ఉపన్యాసం ఇస్తారు. అప్పుడా అమ్మాయీ, అబ్బాయీ.. ‘మేం ఒకరి బాగోగులు ఒకరం చూసుకుంటాం, మనసా వాచా విప్లవానికి కట్టుబడి వుంటాం’ అనే పద్ధతిలో పెళ్లి ప్రమాణాలు చేస్తారు. తర్వాత వాళ్లిద్దరూ పరస్పరం పూలదండలు మార్చుకుంటారు. అంతే, పెళ్లి అయిపోతుంది! మా పెళ్లి కార్యక్రమాన్ని మా పార్టీ నేత చండ్ర పుల్లారెడ్డి (సీపీ) నిర్వహించారు. రాయలసీమలోని ఓ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన విద్యార్థి దశలోనే స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మా పెళ్లి కార్యక్రమం హిమాయత్‌సాగర్‌ చెరువు దగ్గర రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని సెల్లార్‌లో జరిగింది. అందుకే ఏ రకంగా చూసినా దాన్ని ‘అండర్‌గ్రౌండ్‌’ పెళ్లి అనుకోవచ్చు. మేమిద్దరం పెళ్లి ప్రమాణ పత్రాలను చదివాం, సీపీ చాలా క్లుప్తంగా ప్రసంగించి, మా ఇద్దరికీ వివాహం జరిగినట్లుగా ప్రకటించారు. వచ్చిన కొద్దిమందికీ అరటి పళ్లు పంచిపెట్టారు. అంతా చాలా కొద్దిసమయంలోనే పూర్తయిపోయింది.
పెళ్లైన తర్వాత నేనూ, సిరిల్‌ హైదరాబాద్‌లోని డబీర్‌పురా, యాకుత్‌పురా వంటి ప్రాంతాల్లో చిన్నచిన్న రూములు (8 బై 8
ఉంటాయేమో!) అద్దెకు తీసుకుని వాటిలో వుండేవాళ్లం. చుట్టూ ఉన్న చాలా కుటుంబాలకు కలిపి ఒకటే బాత్రూము వుండేది. కిరోసిన్‌ స్టౌ మీద వంటచేయటం నేను అప్పుడే నేర్చుకున్నాను. గతంలో వంటగదిలో అమ్మకు, అక్కయ్యలకు ఏదో చిన్నగా సాయం చేయటం తప్పించి, అంత వరకూ వంట చేసిన అలవాటు లేదు నాకు. మా ఇద్దరికీ అప్పుడు ఇంట్లో మూత వున్న గిన్నె ఒక్కటే వుండేది. (మేమే కాదు, బహుశా చాలామంది కామ్రేడ్స్‌ పరిస్థితి అదేననుకుంటా.) గిన్నెలో అన్నం వండటం, మూత మీద ఆమ్లెట్స్‌ వేయటం. తినటానికి ఒకళ్లం ఆ మూతనే ప్లేటుగా వాడుకుంటే, మరొకరం నేరుగా గిన్నెలోనే తినేవాళ్లం. పెళ్లై ఇల్లు అద్దె తీసుకున్న వెంటనే నేను ఐదు రూపాయలు పెట్టి ఒక మంగళసూత్రం కొనుక్కుని మెళ్లో వేసుకున్నాను. ఇరుగు పొరుగువాళ్లంతా మాకు ఎక్కడ పెళ్లి కాలేదని అనుమానిస్తారో, ఎక్కడ సూటీపోటీ ప్రశ్నలు మొదలవుతాయోనన్న భయం. పురుషులకు ఇలాంటి బెడదలు ఏముండవు గానీ, హిందూ స్త్రీలు మాత్రం తమకు పెళ్లయినట్టుగా స్పష్టంగా తెలియజెప్పే చిహ్నాలను ఒంటి మీద ధరించాలి. తమ బానిసత్వాన్నీ, అదే సమయంలో ఇతర పురుషులకు తాము అందుబాటులో లేమన్న విషయాన్నీ చాటుకోవాలి. అయితే ఆ మంగళసూత్రం నాసిరకంది కావటంతో కొన్న పదిరోజులకే తెగిపోయింది. ఇంకోటి కొనుక్కోడానికి నాకు టైం దొరకలేదు. ఆ తర్వాత మేం చాలా రకాల ఇళ్లు మారాం. అన్ని చోట్లా కూడా నేను హిందూ స్త్రీలు ధరించే ఎలాంటి వివాహ చిహ్నాలూ లేకుండానే హాయిగా ఉన్నాను. అప్పటి నుంచీ నాకు అనిపించిందేమిటంటే` వివాహ చిహ్నాలు ధరించకపోతే ఏమనుకుంటారో అన్న ఆందోళన ఎక్కువగా మన బుర్రకే పరిమితమైన వ్యవహారం. మనం గనక ఒక స్థాయి ఆత్మ విశ్వాసాన్ని కలిగివుంటే.. జనం ఆ చిహ్నాల ఆధారంగా మనల్ని అంచనావేయటం చాలావరకూ మానేస్తారు.
అంతకంతకూ అణచివేత, నిర్బంధాలు పెరిగిపోతుండటం, పోలీసులు తరచూ మా గదుల మీద దాడులు చేస్తుండటంతో 1975`76 మధ్య నేను చాలాసార్లు హైదరాబాద్‌ వదిలేసి బయటకు వెళుతూ, మళ్లీ సిటీకి వస్తూ గడపాల్సి వచ్చింది. సిరిల్‌ మాత్రం తను వుండటానికి చిన్నచోటు సంపాదించుకోగలిగాడు. కానీ రోజురోజుకూ మేమిద్దరం కలిసి జంటగా వుండటమన్నది చాలా కష్టంగా తయారైంది. ఇక లాభం లేదని నేను బయల్దేరి దిల్లీ వెళ్లాను. అక్కడ ఐఏఎస్‌ అధికారి బి.ఎన్‌.యుగంధర్‌ ఇంట్లో ఒక నెల పాటు వున్నాను. వాళ్ల ఫ్లాట్‌ విజ్ఞాన్‌ భవన్‌ ఎదురుగా వుండేది. ఆయన భార్య ప్రభావతి తిరుపతిలో ఉపన్యాసకురాలిగా పనిచేస్తుండటంతో దిల్లీలో ఆయన ఒక్కరే వుండేవారు. తను చాలా బాగా మాట్లాడేవారు. అయితే మా అభిరుచులు వేర్వేరుగా ఉండటంతో తిండి విషయంలో మేం తరచూ వాదులాడుకునేవాళ్లం. ఆయన రసంలో ఉల్లిపాయలు వేసేవాళ్లు, నాకేమో అది అస్సలు భరించలేని వ్యవహారం. నేను అక్కడ వున్నప్పుడే సిరిల్‌కు మరో పెద్దన్న ఉన్నాడనీ, ఆయన పేరు కార్ల్‌ అని తెలిసింది. ఆయన కూడా ఐఏఎస్‌ అధికారే. యుగంధర్‌, కార్ల్‌ మంచి మిత్రులు కూడా. నేను దిల్లీలోనే వున్నానన్న విషయం తెలిసి కార్ల్‌, ఆయన భార్య సత్వంత్‌ కౌర్‌ (ఆమె కూడా ఐఏఎస్సే) నన్ను చూడాలనుకుంటున్నట్టు కబురు పంపారు. వీళ్ల గురించి వింటూనే నేను నిర్ఘాంతపోయాను. సిరిల్‌ కుటుంబం గురించి నాకేమీ తెలియకపోవటం విస్మయాన్ని కలిగించిన మాట వాస్తవమేగానీ.. అయితే మా కుటుంబాలతో మాకు సంబంధాలు ఎంత తక్కువగా ఉన్నాయో ఇది చెప్పకనే చెబుతుంది.
ఎమర్జెన్సీ అనుభవాలతో పాటు దీర్ఘకాలం అజ్ఞాతంలోనే ఉండిపోవాల్సి రావటంతో పార్టీ మీద మాకున్న నమ్మకం క్రమేపీ సడలటం మొదలైంది. చాలాకాలం తర్వాత మొట్టమొదటి సారిగా మేం హైదరాబాద్‌లో ఇతర కామ్రేడ్‌లను కలిశాం. వాళ్లంతా హైదరాబాద్‌లో, ఇంకా వరంగల్‌, ఖమ్మం వంటి సమీప పట్టణాల్లో అజ్ఞాతంలో ఉంటున్న వాళ్లు. తమ స్థావరాల మీద పోలీసులు దాడులు ఉద్థృతం చేయటంతో.. గత్యంతరంలేని పరిస్థితుల్లో పార్టీ ప్రోటోకాల్‌ని పక్కనపెట్టి ఆశ్రయం కోసం హైదరాబాద్‌లోని మిత్రుల ఇళ్లకు చేరారు. వాళ్లను కలిసినప్పుడు` పార్టీలో జీవితం గురించీ, సభ్యులను విధేయులుగా వుంచుకునేందుకు పార్టీ సృష్టించి ప్రచారం చేసే కథల గురించీ మాకు.. ఎలాంటి సెన్సార్‌ లేని సమాచారం బోలెడంత చెప్పారు. అప్పటి వరకూ మాకు పార్టీ` అడవి అంతా ఒక విముక్త ప్రాంతమనీ, అక్కడ విప్లవ చట్టాలే అమలవుతున్నాయని చెప్తూ వచ్చింది. కానీ అక్కడ అడవిలో పోలీసులు వెంటాడుతుంటే తప్పించుకుని సిటీకి వచ్చిన మా మిత్రులు, ముఖ్యంగా సారంగపాణి, మోహన్‌ రాజ్‌ యాదవ్‌, పప్ల వెంకటేశ్వర రావు వంటి వారు` అడవి విముక్త ప్రాంతమన్నది పెద్ద కట్టుకథని మాకు చెప్పారు. అక్కడ స్త్రీల పట్ల ఎలా ప్రవర్తిస్తారో, వాళ్లని ఎలా వశపరుచుకుంటారో, చివరికి అత్యాచారాలు కూడా ఎలా జరుగుతుంటాయో.. అన్నదమ్ముల్లోనే ఒకరినొకరు ఎలా మోసగించుకుంటారో, గుడ్ల నీరు కుక్కుకుంటున్న తల్లులు తమ పసిగుడ్డులను ఎలా వదిలిపెట్టేలా చేస్తారో.. వాళ్లు చెబుతుంటే వినటం మా వంతయ్యింది. అన్నీ భయంకర కథలే. నిస్సందేహంగా, విప్లవం అంటే విందు పార్టీ కాదు. కానీ అది ప్రజల ప్రేమతో, విప్లవకారుల మధ్య సహకార సౌహార్దాలతో పరిపుష్టం కావాలి, అప్పుడే అది వర్థిల్లుతుంది. కానీ అజ్ఞాతంలో వుండటమంటే మేం ప్రజల నుంచి దూరం కావటమే కదా. మేం వాళ్లతో మమేకమయ్యే, వారితో కలిసి పనిచేసే పరిస్థితే లేదు. పైగా మా కష్టాలను మేం చాలా ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవేవో ఒకరిద్దరి అనుభవాలు కాదు. ఒకరి తర్వాత ఒకరుగా, చాలామంది యువ కామ్రేడ్‌ల నుంచి మేం ఇలాంటి కథనాలే వినాల్సి వచ్చింది.

పత్రులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ఫోన్‌ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.