‘‘డాక్టరుగారూ! మీతో అర్జెంటుగా మాట్లాడాలి’’ చెప్పాడు కిరణ్ సైకియాట్రిస్ట్ శ్రీధర్ కు.
‘‘సార్! జ్యోతి మీద చెయ్యేస్తే అంతవరకు మామూలుగానే ఉన్న జ్యోతి ఏదో శక్తి ఆవహించినట్లు నన్ను విసిరి కొడుతుంది. నేను కూడా బాక్సింగ్ ఛాంపియన్ ను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరైతే ఈసారికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చేది.’’
ఇన్నిరోజుల బాధ డాక్టర్ ముందు వెళ్లగక్కాడు కిరణ్.
‘‘మరి జ్యోతి గురించి నీకన్ని విషయాలు బాగా తెలుసని పెళ్లికి ముందు చెప్పావు?’’ నవ్వుకుంటూ అన్నాడు శ్రీధర్.
జ్యోతిని పెళ్లి చేసుకుంటానని డాక్టర్ శ్రీధర్ కి చెబితే, ‘‘జ్యోతి గురించి నీకేమి తెలుసు? ఎంత తెలుసు? బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నావా?’’ అని శ్రీధర్ పదేపదే అడిగిన విషయం గుర్తుకొచ్చింది కిరణ్‌కు. ఆయన ఎన్నిసార్లు అడిగినా ‘‘జ్యోతి గురించి నాకు బాగా తెలుసు’’ అని గట్టిగా చెప్పి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడా విషయం గుర్తుకొచ్చింది కిరణ్‌కు.
‘‘సార్! జ్యోతి గురించి, నాకు తెలిసింది చాలా తక్కువనే విషయం ఇప్పుడర్థమైంది. జ్యోతి ఎందుకలా బిహేవ్ చేస్తుంది? నేనంటే తనకు చాలా ఇష్టం. కానీ తనను టచ్ చెయ్యగానే ఏదో శక్తి పూనినట్లు అయిపోతుంది. ఎందుకలా చేస్తుంది?’’ కాస్తంత ఆందోళనగా అడిగాడు కిరణ్. ‘‘ఈ మాటకు సమాధానం చెప్పాలంటే పదిహేనేళ్ళ క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి’’ కిరణ్‌తో చెబుతూ ఆలోచనలలో మునిగిపోయాడు శ్రీధర్. పదిహేనేళ్ళ క్రితం ఏమి జరిగింది? అప్పుడేం జరిగింది? అది గుర్తుకొస్తే శ్రీధర్ మనసు యిప్పటికీ రగిలిపోతుంటుంది.
‘‘ఒక మగవాడు చేసే క్షణకాలపు దౌర్జన్యానికి గురై ఎంతోమంది స్త్రీలు… ఆ దౌర్జన్యాన్ని అడ్డుకునే క్రమంలో కొందరు చనిపోతుండగా, బ్రతికున్నవాళ్ళు మనసుకయ్యే గాయాలతో జీవితాంతం బాధ పడుతుంటారు. వాళ్లే కాదు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆ గాయాలను తమ జీవితకాలం మోస్తూనే ఉంటారు. వీటికి కారణమైన మగవాడికి యే శిక్ష విధిస్తే, వీటికి సరితూగుతుంది? ఏ శిక్ష విధిస్తే మిగిలిన వాళ్ళు యిటువంటి దుశ్చర్య చేయడానికి భయపడతారో అటువంటి శిక్షలు ఉండాలి. అవసరమైతే మన రాజ్యాంగాన్ని మార్చాలి. అప్పుడు గాని ఇటువంటి నేరాలను అరికట్టలేము. ఆరోజు ఎప్పుడొస్తుందో?’’ జ్ఞాపకాలతో మనసు రగిలిపోతుంటే, కోపంగా అనుకున్నాడు శ్రీధర్.
జ్యోతిని గతమెప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని ముందు నుండి తెలిసినవాడు శ్రీధర్. జ్ఞాపకాల పొరలలో ఆ గతాన్ని జ్యోతి దాచేసినా, ఎప్పటికైనా ఆ గతాన్ని ఆమె ఎదుర్కోవలసి వస్తుందని ముందునుండి వూహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. పదిహేనేళ్ళ క్రితం ఏమి జరిగింది? గతంలోకి వెళ్ళిపోయాడు, గత పాతికేళ్లుగా ‘‘ఆశ్రయం’’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న డాక్టర్ శ్రీధర్. ‘‘సార్! ఈ పాప రెండు రోజులు బట్టీ ఏమీ తినడం లేదు. ఆ టేబుల్ క్రింద నుండి బయటకు రావడం లేదు.’’ రెండు రోజులుగా ఊర్లోలేని శ్రీధర్ రాగానే చెప్పింది ఆయా.
ఐదేళ్ళ పాప బల్లక్రింద ముడుచుకుని భయం భయంగా చూస్తూ వుంది. ఊర్లో లేకపోయినా ఆ పాప ఏ పరిస్థితులలో ‘ఆశ్రయం’ను చేరిందో శ్రీధర్‌కు తెలుసు. తల్లిని మృగాళ్లు వేటాడి చంపేస్తే, ప్రత్యక్షంగా చూసిన ఒకే ఒక్క సాక్షి. ఆ మృగాళ్లు ఎవరో? తల్లిని ఏం చేస్తున్నారో? కూడా తెలియనంత చిన్నవయసు. ఆ పాపను ఎక్కడుంచాలో తెలియక ఆశ్రయంకు అప్పచెప్పారు పోలీసులు. ‘‘నువ్వు తప్పించి ఈ రూములోకి ఎవరిని రానివ్వవద్దు. ఈ రూమ్ నిండా బొమ్మలు పెట్టు. వాటితోపాటు తినడానికి చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టి, తలుపులు దగ్గరగా వెయ్యి’’ చెప్పాడు శ్రీధర్. ఏం చేయాలో అర్ధమయ్యింది ఆయాకు. శ్రీధర్ చెప్పినట్లే చేసి సీసీటీవీ మానిటర్ దగ్గర కూర్చుంది. మరో మూడు గంటలకు ఆ పాప బల్ల క్రింద నుండి బయటకు వచ్చి చాక్లెట్ తిని, బొమ్మలతో ఆడుకోవడం చూసి, ఆనందంగా నిట్టూర్చింది. మరో వారం రోజులకు ఆయాను రూములోనికి రానిచ్చేది. పెట్టినది తినేది. ఇంకా ఎవరిని చూసినా బల్లకిందకు చేరిపోయేది. ఈసారి ఒక మనిషి బొమ్మను రూములో పెట్టమన్నాడు శ్రీధర్. ఆ బొమ్మను చూడగానే ఏమి గుర్తు వచ్చిందో మరలా బల్ల క్రిందకు చేరిపోయింది భయంభయంగా.
‘‘ఆ పాప చూస్తుండగా, ఆ మనిషి బొమ్మని కాళ్లతో తొక్కి, కొడుతూ ఉండు. ఆ పాప బయటకు వచ్చేదాకా!’’ చెప్పాడు శ్రీధర్. ఆ మరుసటి రోజు పాప బల్లక్రింద నుండి నెమ్మదిగా బయటకు వచ్చి తన చిట్టి పాదాన్ని ఆ బొమ్మమీద పెట్టింది. ‘‘నువ్వూ కొడతావా?’’ అడిగింది ఆయా. తలూపింది పాప. ఇద్దరూ కలిసి ఆ బొమ్మను తొక్కితొక్కి కొట్టి అలసిపోయారు. ‘‘రోజూ ఇలాగే కొడదామా?’’ అన్న ఆయా ప్రశ్నకు ధైర్యంగా తలూపింది పాప. మరో నాలుగు రోజులకు ఇంకా పెద్ద బొమ్మను స్టాండుకు వేలాడదీసి పాప చూస్తుండగా శ్రీధర్ కొట్టడం మొదలుపెట్టాడు. అంతవరకు శ్రీధర్ వస్తే బల్ల క్రింద దాక్కునే పాప నెమ్మదిగా శ్రీధర్ తో పాటు ఆ బొమ్మను కొట్టడం మొదలు పెట్టింది. ఈసారి స్టాండుకు ఇసుక సంచీని కట్టి దానికి మగవాడిలా కళ్ళు, ముక్కు పెట్టి కిక్ బాక్సింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు శ్రీధర్. ‘‘నువ్వూ నేర్చుకుంటావా?’’ ఉత్సుకతతో చూస్తున్న పాపనడిగాడు. తల్లి మీద పాశవికంగా దాడి చేసిన వాళ్లను కొడుతున్నాననుకుని ఇసుక సంచీని బలంగా కొట్టేది పాప. అలా జ్యోతి చదువుతో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుని, యిరవయ్యేళ్లు వచ్చేసరికి నేషనల్ ఛాంపియన్ అయింది. ఇంకొక నేషనల్ ఛాంపియన్ అయిన కిరణ్, జ్యోతిని ఇష్టపడి, ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని అడిగాడు శ్రీధర్‌ని.
‘‘జ్యోతి గురించి నీకేం తెలుసు?’’ అడిగాడు శ్రీధర్ కిరణ్‌ని.
‘‘గత అయిదేళ్లుగా జ్యోతితో పాటే నేను కూడా ట్రైనింగ్ అవుతున్నాను. ఆమెను బాగా అర్థం చేసుకున్నాను. ఆమెకు కూడా నేనంటే ఇష్టమే’’ చెప్పాడు కిరణ్. ‘‘జ్యోతి గతం గురించి… ఆమె ఏ పరిస్థితులలో ఇక్కడికొచ్చిందో… ‘‘ శ్రీధర్ మాట పూర్తి చేయకుండానే, ‘‘ఎవరైనా యే పరిస్థితులలో ఇక్కడికొస్తారో నాకు తెలుసు. ఆమె గతంతో నాకు పనిలేదు. నా పేరెంట్స్ నా మాట కాదనరు’’ ధైర్యంగా చెప్పాడు కిరణ్. ‘‘గాని గతం ఆమెను ఎప్పటికీ వెంటాడుతుంది. అది మీ జీవితాలలో కల్లోలం రేపవచ్చు. దానికీ సిద్ధపడ్డగలవా?’’ సూటిగా అడిగాడు శ్రీధర్. ‘‘జ్యోతిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధం’’ తన నిర్ణయాన్ని చెప్పాడు కిరణ్. అలా వాళ్ల పెళ్లి అయింది. ఇదిగో పెళ్లి అయిన వారం రోజులకు కిరణ్ ఇలా…
తనకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో మునిగి పోయిన డాక్టర్ శ్రీధర్‌ని చూసి ‘‘సార్! పదిహేనేళ్ళ క్రితం ఏం జరిగింది?’’ గట్టిగా అడిగాడు కిరణ్. కిరణ్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు శ్రీధర్. ‘‘ముందు ఇది చదువు. నీకే అర్థమవుతుంది, జ్యోతి ఎందుకలా చేస్తుందోనని?’’ బీరువాలో నుండి జ్యోతి ఫైలును తీసుకొచ్చి ఇచ్చాడు కిరణ్‌కు శ్రీధర్. ‘‘అంటే జ్యోతిని నేను ముట్టుకోగానే, తనకు గతం జ్ఞాపకం వస్తుందా?’’ ఫైలు మొత్తం చదివాక, ఆశ్చర్యపోయాడు కిరణ్. ‘‘అవును. కాలక్రమంలో జ్యోతి గతాన్ని మరచిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలు గతం పొరలలో చేరిపోయాయి. గాని నువ్వు ముట్టుకోగానే ఆ జ్ఞాపకాలు ఆమెకు తెలియకుండానే బయటకొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలలో ఉన్నది నువ్వేనని, అప్పుడు చెయ్యలేకపోయిన పనిని ఇప్పుడు చేస్తున్నానని అనుకుంటూ నిన్ను కొడుతుంది’’ చెప్పాడు శ్రీధర్. ‘‘మరి ఇప్పుడెలా?’’ సందిగ్ధంగా అడిగాడు కిరణ్. ‘‘బాధే అయినా, ఆమెకు గతాన్ని జ్ఞాపకం చేయాలి. వర్తమానం వేరు. గతం వేరు. అని ఆమె తెలుసుకొనేటట్లు చేయాలి. అందుకు నీ సహకారం కావాలి’’ చెప్పాడు శ్రీధర్. ‘‘తప్పకుండా చేస్తాను డాక్టర్. జ్యోతి ఆనందంగా నా కౌగిలిలో ఒదిగిపోయేటందుకు నేనేమైనా చేస్తాను’’ నమ్మకంతో చెప్పాడు కిరణ్. ‘‘రేపు నీతో పాటు జ్యోతిని తీసుకురా. వైద్యం మొదలుపెడతాను’’ భరోసా ఇచ్చాడు శ్రీధర్.
… … …
‘‘జ్యోతి! ఎలా ఉంది నీ వైవాహిక జీవితం?’’ పెళ్లి అయ్యాక తొలిసారి ఆశ్రయంకు వచ్చిన జ్యోతిని, యేమీ తెలియనట్లు అడిగాడు శ్రీధర్. ‘‘పగలంతా బాగానే ఉన్నా రాత్రయ్యాక ఏమౌతుందో నాకే తెలియడంలేదు. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. కిరణ్‌ని ఎందుకు కొడుతున్నానో తెలియడం లేదు’’ ఈ వారం రోజుల ఆందోళన కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది జ్యోతికి. వెక్కివెక్కి ఏడ్చేసింది. జ్యోతి దుఃఖమంతా కరిగి, మనసు తేలికైన వరకు ఏం మాట్లాడలేదు శ్రీధర్. ‘‘మనం మర్చిపోయినా, చిన్నప్పటి జ్ఞాపకాలు బలంగా వేళ్ళూనుకుంటాయి మెదడు పొరల్లో. అవి చేదు జ్ఞాపకాలయితే, సందర్భానుసారం అప్పుడప్పుడు బయటికి వచ్చి మనలను ఆందోళనకు గురిచేస్తాయి. జ్ఞాపకమేదైనా దానిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి.’’ అంటూ అనునయించాడు జ్యోతిని. ‘‘కిరణ్ అంటే నీకిష్టమే కదా! కిరణ్ కోసం నువ్వేమైనా చేస్తావు కదా!’’ జ్యోతి కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అడిగాడు శ్రీధర్. ‘‘ఏమైనా చేస్తాను డాక్టర్! మా వైవాహిక జీవితం హ్యాపీగా ఉండడానికి ఏమైనా చేస్తాను’’ తన నిర్ణయాన్ని చెప్పింది జ్యోతి.
… … …
‘‘ఇప్పుడు నీకు ఇంజక్షన్ ఇచ్చాను. నువ్వు ఇప్పుడు ఐదేళ్ల చిన్నపిల్లవు. ఇప్పుడు కొన్ని వీడియోలు నీకు చూపిస్తాను. అవి చూసి నీకేమనిపిస్తుందో చెప్పు’’ అని కొన్ని వీడియోలు చూపించసాగాడు శ్రీధర్. మొదటి వీడియోని చూసి ‘‘మా అమ్మను యేమీ చెయ్యొద్దు’’ అని అరుస్తూ ‘‘అమ్మా… అమ్మా… అని వెక్కి వెక్కి ఏడవసాగింది జ్యోతి. కొంతసేపు జ్యోతిని ఏడవనిచ్చిన శ్రీధర్ జ్యోతితో, ‘‘ఇప్పుడు నువ్వు యిరవై ఏళ్ల యువతివి. ఈ వీడియో చూసి నీకేం అనిపిస్తుందో చెప్పు’’ అని మరల అదే వీడియోని ప్లే చేశాడు. ‘‘ఒరేయ్ బలహీనులతో ఆడుకోవడం కాదు. నన్ను ముట్టుకోండిరా? చెప్తాను మీకు? ఏ ఎముకకా ఎముక విరగ్గొట్టకపోతే అప్పుడడగండి’’ ఊగిపోతూ అంది జ్యోతి. కాసేపు జ్యోతిని అలా మాట్లాడనిచ్చి, ‘‘ఈ వీడియో చూడు’’ అని భార్యభర్తలు అన్యోన్యంగా ఉన్న, ఇంకొక వీడియో ప్లే చెయ్యసాగాడు శ్రీధర్. ‘‘ఇదేమిటి? అతను ఆవిడను ముట్టుకుంటున్నా, ఆమె సంతోషిస్తుందేమిటి? తిరిగి కొట్టకుండా!’’ ఆశ్చర్యపోతూ అడిగింది జ్యోతి.
‘‘అంటే స్పర్శలో కూడా చెడ్డవి, మంచివి ఉంటాయి. చెడ్డ స్పర్శ తగిలినప్పుడు మన మనస్సు, శరీరం ఆ స్పర్శకు వ్యతిరేకంగా స్పందిస్తాయి. ఆ స్పర్శకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాయి. అందుకు ప్రయత్నం చేస్తాయి. అదే మంచి స్పర్శ అయినప్పుడు ఆ రెండూ అనుకూలంగా స్పందించి, ఇంకా కావాలని కోరుకుంటాయి. ఉదాహరణకు బాక్సింగ్‌లో నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నీ కోచ్ నిన్ను హగ్ చేసుకున్నాడు. అప్పుడేమనిపించింది నీకు?’’ ప్రశ్నించాడు శ్రీధర్. ‘‘కోచ్ కల నెరవేర్చాననిపించింది’’ చెప్పింది జ్యోతి. ‘‘గాని ఆ కోచ్ కూడా ఒక మగవాడే కదా! అప్పుడెందుకు నీకు కోపం రాలేదు? అంటే అది మంచి స్పర్శ కాబట్టి, నీకు కోపం రాలేదు. అంటే నీకు ఇష్టం లేకుండా ఎవరైనా నిన్ను తాకితే నీకు కోపం వస్తుంది. అదే నీకిష్టమైన వాళ్లు తాకితే ఆ స్పర్శలోని ఆత్మీయతను నీ మనసు అర్థం చేసుకుంటుంది’’ నెమ్మదిగా బోధిస్తున్నాడు శ్రీధర్.
‘‘అదే నీకింకా దగ్గరవాళ్ళు నిన్ను తాకితే… ఉదాహరణకు… కిరణ్.. నీ భర్త, నీకెంతో ఇష్టమైనవాడు. నిన్ను ప్రేమించినవాడు… నిన్ను తాకితే నీ మనస్సు స్పందించి అతనిలో కరిగిపోవాలని అనిపిస్తుంది. నిజమేనా?’’ ప్రశ్న వేసి జ్యోతి స్పందన కోసం ఆగాడు. ‘‘అలాగే అనిపిస్తుంది గాని కిరణ్ స్పర్శ తగలగానే ఏమవుతుందో నాకే తెలియడం లేదు. నేను వేరే మనిషిలాగ మారిపోతున్నాను. ఆలోచనలను ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా, నాకే తెలియకుండా అతనిని తోసి వేస్తున్నాను.’’ సాలోచనగా చెప్పింది జ్యోతి. ‘‘మరేం ఫర్వాలేదు. కొద్ది రోజులకు కిరణ్ నీ భర్తని, అతను నిన్ను ఎంత తాకినా, ఎక్కడ తాకినా అది ప్రేమతో మాత్రమేనని నీ మనస్సు, శరీరం రెండూ అంగీకరిస్తాయి. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి’’ జ్యోతి భుజం తట్టి చెప్పాడు శ్రీధర్. ఈ స్పర్శ మంచిదా! చెడ్డదా! ఆలోచనలో మునిగి పోయింది జ్యోతి.
… … …
ఇలా కొన్ని సెషన్స్ అయ్యాక, ఐదేళ్ల జ్యోతి మనస్సు తను కట్టుకున్న గూడులో నుంచి బయటకు రావడం మొదలుపెట్టింది. నెమ్మది, నెమ్మదిగా కిరణ్ స్పర్శను అలవాటు చేసుకుంటుంది. ఒక సెషన్లో… శ్రీధర్, కిరణ్ కాకుండా ఇంకెవరో ఆమె భుజాన్ని పట్టి గట్టిగా నొక్కారు. ‘‘ఇప్పుడేం చేయాలనిపిస్తుంది నీకు’’ ప్రశ్నించాడు శ్రీధర్. ‘‘గట్టిగా కొట్టాలనిపిస్తుంది’’ జ్యోతి.
‘‘ఎందుకని’’
‘‘అతనికి నాకు యే రిలేషన్ లేదు. యే రిలేషన్ లేకుండా నన్ను ముట్టుకోవడానికి అతనెవడు?’’ అరిచింది జ్యోతి.
‘‘మరి అలాంటి వారిని యేమి చేయాలి?’’ శ్రీధర్.
‘‘యేమి చేయాలి?’’ ఆలోచిస్తూ అడిగింది జ్యోతి.
‘‘నువ్వే ఆ పరిస్థితులలో ఉంటే ఎదురు తిరగడం. నువ్వు కాకుండా వేరేవాళ్ళు ఉండి, వాళ్ళు ఎదురు తిరగలేకపోతే, నువ్వు వాళ్ళకి హెల్ప్ చెయ్యడం. ఆ హెల్ప్ అనేది ఫిజికల్‌గా గాని, లేకుంటే న్యాయపరంగా గాని’’ సలహా ఇచ్చాడు శ్రీధర్… ‘‘న్యాయపరంగా అంటే యెలా?’’ అర్థం కాక అడిగింది. ‘‘నువ్వు న్యాయశాస్త్రం చదివి, న్యాయవాదిగా కోర్టులో వారి కేసులను వాదించడం. అన్యాయానికి గురైన వాళ్లకు న్యాయపరమైన సలహాలతో ఆదుకోవడం’’ చెప్పాడు శ్రీధర్. ‘‘అయితే తొందరగా నేను న్యాయవాదిని అవుతాను’’ చెప్పింది జ్యోతి.
… … …
మరో పదిహేనేళ్లకు, కిరణ్ స్థాపించిన బాక్సింగ్ ఇన్స్టిట్యూట్లో ఆడపిల్లలకు కోచింగ్ ఇస్తూ, ఆశ్రయం వ్యవహారాలలో శ్రీధర్‌కు సహాయం చేస్తూ, ఇంకొక ప్రక్క లాయర్‌గా, మగవాళ్ళ చేతుల్లో వంచనకు గురైన ఆడవాళ్ళ తరపున ఫ్రీగా వాదిస్తుంది జ్యోతి. కిరణ్, జ్యోతులకు యిప్పుడు ఇద్దరు ఆడపిల్లలు. వారిద్దరూ బాక్సింగ్ ఛాంపియన్ లై, లాయర్లుగా ప్రాక్టీస్ చెయ్యాలని జ్యోతి కోరిక.