ఆడపిల్లల్ని చూడనివ్వండి
తలెత్తి కళ్ళెత్తి సూటిగానే చూడనివ్వండి
తాత… తండ్రి… భర్త… కొడుకు కళ్ళతో కాదు
తమ కళ్ళతోనే… తమ దృక్పథంతోనే
లోకాన్నీ, ప్రకృతినీ, సమాజాన్నీ స్పష్టంగానే చూడనివ్వండి
ఇన్నాళ్ళు తలొంచుకొని బానిసత్వం కళ్ళద్దాల్లోంచి
భయం భయంగా… సంకోచ సందేహంగా
కనబడి కనబడని లోకాన్ని
వినబడి వినబడని రాగాన్ని
పొరలు గమ్ముకున్న సమాజాన్ని
పొగలు నిండిన ప్రకృతిని
దర్శించిన నేత్రాలను విముక్తం చేసుకోనివ్వండి
విరబూసే చూడనివ్వండి
విరగబడి వీక్షించనివ్వండి
చూస్తేనే కదా లోతులు తెలిసేది
అంచులు తాకేది
తీరాలు దాటేది
తీగల్ని మీటేది
చుడనిస్తేనే కదా
నిజాలు తెలిసేది
నిగ్గులు తేలేది
నిస్పృహ తొలిగేది
నిప్పులు కురిసేది
వాళ్ళు తలెత్తి చూడనంత కాలం లోకం ప్రశాంతంగా కొనసాగిందనీ
సమాజం సురక్షితంగా పురోగమించిందనీ
వ్యవస్థ ప్రకంపించకుండా పయనించిందనీ
అబద్దాలు ప్రచారం చేయకండి
అడ్డుగీతాలు గీయకండి
కేవలం కళ్లంత ఒళ్ళు చేసుకునే కాదు
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరి చూడనివ్వండి
చూపులను పూల బాణాలుగా కాదు
తుపాకీ తూటాలుగా పేలనివ్వండి
ఓర చూపులతో ఓడిపోయే దీనులని గురించే కాదు
కంటి మంటలో కాలిపోనున్న ఆధిపత్యం గురించి పాడనివ్వండి
కలకత్తా కాళికా నాలికపైనే కాదు
శిరమెత్తిన కాళ్ళ వెలుగుల్లో కవిత్వాన్ని వెలిగించనివ్వండి
శతాబ్దాల అణచివేతపై… వివక్షపై…
తరతరాల దురహంకారంపై… దుర్నీతిపై
ఒక ధృడమైన చూపుని చుడనివ్వండి
ప్రతిఘటన చైతన్యానికి ప్రతీకలై మండనివ్వండి
(మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)