గడ్డి పువ్వులా దారెంట సాగిపోతూ
కోతలైనంక చెదిరిన చేనులా
మారిన తన జీవితానికి చింతిస్తూ
మోడువారిన మానులా ఒంటరిగా
భానుడి భగభగలు లెక్కచెయ్యక
పరిగె ఏరుతూ…
గత ఆలోచనల సుడిగుండంలో చిక్కింది.
సకల వ్యసనాలకు అలవాటు పడి
హరిశ్చంద్రుడు, చంద్రమతిని అంగట్లో అమ్మినట్లు
తనను బేరం పెట్టిన పతిని ఎదిరించి
బతుకంతా…
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షులా మారింది.
ఇద్దరు పిల్లలు పుట్టినంక …
అనుమానపు నిందేసి పుట్టింటికి తరిమితే
పాతికేళ్లకే బతుకు భారాన్ని మోస్తూ
నిప్పుల కుంపటి మోస్తున్నది.
సీతలా అగ్నిలో దూకలేదుగానీ
అంతకుమించి బాధను భరిస్తున్నది.
దరిలేని బావిలో తోసి
చేతులు దులుపుకున్న తండ్రిని నిందించలేక
తను మునగలేక…
పిల్లల బతుకుకోరకు
కనబడని అగ్నిపర్వతాన్ని గుండెల్లో మోస్తున్నది.
ఎండమావిలో నీరు లేనట్టు…
తన పేరులోని వసంతం జీవితంలో లేదు.