మహిళలు, బాలికలపై హింస ప్రపంచంలో అత్యంత ప్రబలంగా, విస్తృతంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటిగా మిగిలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔనూ) ప్రచురించిన అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు స్త్రీలు తమ జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక సన్నిహిత భాగస్వామి హింస లేదా భాగస్వామి కాని లైంగిక హింసకు గురయ్యారని సూచిస్తున్నాయి.
ఈ హింసలో ఎక్కువ భాగం సన్నిహిత భాగస్వామి హింస జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో దాదాపు మూడిరట ఒకవంతు వారు తమ సన్నిహిత భాగస్వామి ద్వారా ఏదో ఒక రకమైన శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారని నివేదించారు. ప్రపంచంలో మహిళపై జరిగే హింసలు, నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవి మహిళల శారీరక, మానసిక, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
మన దేశంలో పలు నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం అత్యాచారాలు, గృహ హింస, కిడ్నాప్‌లు, దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ ఘోరాలకు పౌర సమాజం స్పందించడంతో కొన్ని చట్టాలు వచ్చాయి. 2012లో దేశ రాజధాని ఢల్లీిలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ళ ‘నిర్భయ’పై జరిగిన దారుణం తర్వాత ప్రజలు రోడ్లపైకి రావడంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.ఎస్.వర్మ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడిరది. వీరి సూచనలతో క్రిమినల్ లా (సవరణ) చట్టం 2013 అమలులోకి వచ్చింది. మహిళలపై కొత్త తరహాలో జరుగుతున్న వేధింపులు, నేరాలను నిర్వచించింది. శిక్షలను కఠినతరం చేసింది. అయినా నేరాలు పెరుగుతున్నాయి. బాలికలపై పైశాచికత్వం ఏడాదికేడాది పెరిగిపోతుంది. చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం వచ్చినా బాలికలపై నేరాలు తగ్గడంలేదు.
భారతదేశంలో నేరాల రేట్లు పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికీ మన దేశం ప్రశాంతమైన దేశం. దేశాల వారీగా నేరాల రేట్ల అంచనా (2024) ప్రకారం, 197 దేశాలలో భారతదేశం 79వ స్థానంలో ఉంది. ఒక దేశంలో వ్యవస్థీకృత నేరాల స్థాయిలను కొలవడానికి ఒక సాధనం అయిన గ్లోబల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశం 193 దేశాలలో 61వ స్థానంలో ఉంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా నేరాలను కట్టడి చేయడానికి భారతదేశం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. 2014 నుండి 2022 వరకు, 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు (అందులో 13 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు) ప్రతి లక్ష మంది మహిళల జనాభాకు మహిళలపై జరిగిన నేరాల సంఖ్యలో మొదటి పది స్థానాల్లో అస్సాం, ఢల్లీి, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు తెలంగాణ 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కాలంలో ప్రతి సంవత్సరం మొదటి పది స్థానాల్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్, అండమాన్ మరియు నికోబార్ దీవులు గత 9 సంవత్సరాలలో 5 సంవత్సరాలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి.
తెలంగాణలో మహిళలపై పెరిగిన నేరాలు: దేశంలోని నివేదికల ప్రకారం గడచిన పది సంవత్సరాల నుండి తెలంగాణా రాష్ట్రం మహిళలపై నేరాలు జరుతున్న మొదటి పది రాష్ట్రాల జాబితాలో ఉంది. ఇటీవలి రాష్ట్ర పోలిస్ శాఖ విడుదల చేసిన 2024 వార్షిక నివేదిక గణాంకాలు (2024 నవంబర్ వరకు జరిగన నేరాలు) పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై నేరాలు గత సంవత్సరం కంటే 4.78 శాతం పెరిగాయి. రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు (మహిళపై జరిగిన నేరాలు కలిపి) 2023లో 2,13,121 కేసులు నమోదు కాగ, 2024లో 2,34,158 కేసులు నమోదు అయ్యి 9.87 శాతం పెరిగాయి.
వరకట్న వేధింపులు కొంతమేర తగ్గినప్పటికీ, హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. మహిళలకు సంబంధించిన నేరాల్లో 2023లో మొత్తం 19,013 కేసులు నమోదు కాగ, 2024లో 19,922 కేసులు రికార్డయ్యాయి. ఇందులో హత్యలు 241 ఉండగా, అత్యాచారాలు 2,945 ఉన్నాయి. మరోవైపు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు కూడా 8.71 శాతం పెరిగాయి. ప్రధానంగా ఒక ఏడాది కాలంలోనే, మహిళలపై అత్యాచారాల శాతం పెరిగింది. అత్యాచారాలు 2023లో 2284 జరగగా 2024లో 2945 జరిగాయి, ఇందులో 2922 (99.21 శాతం) పరిచయస్తుల వల్ల జరగినవే కావడం ఆందోళన కలిగించే అంశం. కేవలం 23కేసుల్లో మాత్రమే బాధితులకు పరిచయం లేని వాళ్లు నిందితులుగా ఉన్నారు. మహిళలకు తెలిసిన వాళ్లే వారికి ప్రమాదం చేపట్టడం సమాజంలో ప్రతికూల సామజిక మార్పుకు దారి తీస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రేమ వ్యవహారాలు, టీనేజ్ రిలేషన్ షిప్స్ ఇతరత్రా కారణాలతో అత్యాచార కేసులు పెరిగాయని నివేదికలో పేర్కొన్నారు. బాధితుల్లో 15 ఏండ్లలోపు వాళ్లు 87 మంది, 15 నుంచి 18 ఏండ్ల లోపు వాళ్లు 1,970 మంది, 18 ఏండ్లకు పైబడిన వాళ్లు 888 మంది ఉన్నారని నివేదిక తెలిపింది.
గత రెండేళ్లలో హత్య కేసుల్లో బాధితులైన మహిళల సంఖ్య 200 దాటింది, 2024లో 241 హత్యలు, 2023 సంవత్సరంలో 213 హత్యలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 181 ఉండగా, 2021లో మొత్తం 199, 2020లో 161 మంది మహిళలు హత్యకు గురయ్యారు. వరకట్న హత్యలు 2023లో 33 జరగగా, 2024లో 22 జరిగాయి. వరకట్నపు వేధింపుల ద్వారా 2023లో 132 మంది మహిళలు చనిపోగా, 2024లో 216 మంది మహిళలు చనిపోయారు. ఆత్మహత్యకు ప్రేరిపిత కేసులు 2023లో 363 కేసులు నమోదు కాగ, 2024లో 379 కేసులు నమోదు అయ్యాయి. అత్మభిమానానికి భంగం సంబంధించిన అంశాల్లో 2023లో 5,464 కేసులు నమోదు అయ్యాయి, 2024లో 5,040కు పెరిగాయి. కిడ్నాప్, అపహరణ 2023లో 884 ఉండగా 2024లో 1,122 కేసులకి పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరం నుండి 2024 నవంబర్ వరకు ఈ మధ్య కాలంలో మహిళలపై జరిగిన లైంగిక దాడులు పరిశీలిస్తే 28.94 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు గల కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ నేరాలు జరిగిన బాధితుల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు కూడా ఉన్నారు. చాలా కాలం నుండి దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. మహిళలపై జరిగిన మొత్తం అన్ని రకాల నేరాల్లో 2020లో14,853 కేసులు నమోదవ్వగా 2024లో 19,013 కేసులు నమోదు అయ్యాయి.
అత్యాచార కేసుల్లో, అత్యధిక సంఖ్యలో బాధితులు 15-18 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. అంటే ప్రధానంగా టీనేజ్ సంబంధాలు ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నాయని నేటి గణాంకాలు తెలుపుతున్నాయి. అత్యాచారం, పోక్సో కేసులలో, పోలీసులు అనుమానితులను వెంటనే అరెస్టు చేశారని, వాస్తవానికి 940 మంది అరెస్టులు సంఘటన జరిగిన ఎనిమిది గంటల్లోనే జరిగాయని, 428 అత్యాచార, పోక్సో కేసులలో, సంబంధిత అధికారులు బాధితులకు 5.42 కోట్ల పరిహారం చెల్లించారని రాష్ట్ర పోలిస్ శాఖ విడుదల చేసిన 2024 వార్షిక నివేదిక పేర్కొంది. గతంలో మాదిరిగా కాకుండా తమపై జరిగే నేరాల గురించి ఫిర్యాదులు చేసేందుకు బాధితురాళ్లు ముందుకొస్తుండటంతో మహిళపై కేసుల సంఖ్య పెరుగుతోందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలోని ‘‘షీ’’ బృందాలు కలిగిస్తున్న అవగాహన కూడా బాధితురాళ్లు ముందుకొచ్చేలా చేస్తోంది. నేరుగా ఠాణాకే వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఈ-మెయిల్, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పలు సామజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించడమూ కేసుల నమోదు పెరుగుదలకు కారణం. ఒక రకంగా రాజకీయ అస్థిరత, పాలనా సమస్యలు మహిళలపై నేరాలు పెరగడానికి దోహదపడ్డాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో దాదాపు పది వేల మందికి పైగా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను ఎదుర్కొన్నారు. ఈ అంశాలు, ఇతర అంశాలతో పాటు, రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడానికి దారితీశాయి.
నూతన సంస్కరణలు, అధ్యయనాలు అవసరం: మహిళలపై గ్రామీణ, నగర ప్రాంతాలలో పలు నేరాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా నగర జనాభా శాతం (38.8 శాతం) పెరుతుంది. రాబోయే సంవత్సరాల్లో వేగంగా పట్టణీకరణ పెరుగుతుంది, కాబట్టి నగరాల్లోని నేరాలను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి అవసరం. అందులో భాగంగా కొన్ని రంగాలు, వివిధ వర్గాల ప్రజల నేర ప్రవర్తన, వలస జనాభా వారి నిర్దిష్ట నేరాల పట్ల ప్రవృత్తిని కలిగి ఉన్నారా లేదా అనేది అనే అంశాలపై మరిన్ని అధ్యయనాలు జరగాలి. న్యాయ వ్యవస్థలో నేర కేసులను వేగంగా ముగించడానికి, పోలీసింగ్ నాణ్యతను, సంస్కరణ ప్రక్రియలను మెరుగుపరచడానికి మార్గాలను కూడా పరిగణించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన నేర గణాంకాలకు ఎక్కువ ప్రామాణికతను ఇచ్చే, నేర బాధితుల సర్వేను చేపట్టడం ద్వారా సమాచార విశ్వసనీయతను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో లింగ సున్నితత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు 8వ, 9వ తరగతులకు చెందిన 1,036 మంది విద్యార్థులకు తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం శిక్షణ ఇవ్వాలనుకోవడం మంచి పరిణామం. లింగ అసమానత, మహిళలపై నేరాలు, లింగ ఆధారిత హింసకు సంబంధించిన పెరుగుతున్న నేరాలను పరిష్కరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. విద్య, అవగాహన ద్వారా నేరాల నివారణ ప్రాముఖ్యతను ఈ ప్రాజెక్ట్ చెబుతుంది. ఈ ప్రాజెక్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరించాలి. విద్యార్ధుల్లో లింగ సమానత్వంపై అవగాహనను పాఠశాల స్థాయి నుండే పెంపొందించాలి.
మహిళలపై నేరాలు పెరగటానికి పలు సామజిక, ఆర్ధిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. నేటి సమాజంలోని మానషుల మధ్య సామజిక సంబంధాలు ప్రాధమికంగా లేవు, కేవలం గౌణ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. నేటి సమాజంలోని యువత ఆలోచన విధానం ఎక్కువగా సమాజం కోసం పని చేసే విధంగా లేదు అంటే సామజిక భాద్యతపై అవగాహన తక్కువగా ఉండటం కుడా మహిళలపై నేరాలు పెరగటానికి ‘‘పరోక్షంగా’’ ఒక కారణంగా పేర్కొనవచ్చు. మహిళపై నేరాలని తగ్గించటంలో కుంటుంబం పాత్ర అతి ముఖ్యమైనది, కుటుంబం ప్రతి పౌరున్ని నియంత్రించే ఒక సామజిక సంస్థ, కుటుంబాలు నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల్ని నియంత్రించాల్సిన భాద్యత మరింత తీసుకోవాలి.
` సమాజ శాస్త్ర పరిశోధకులు Ê అకడమిక్ కౌన్సిలర్, దూర విద్యా కేంద్రం, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్