‘యోధ – మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు’ విజయ భండారు సంపాదకత్వంలో కొత్తగా వెలువడిన కథా సంకలనం! ఇందులో మొత్తంగా 53 కథలు ఉన్నాయి. అన్నీ రచయిత్రులు రాసినవే! అనేక మంది సీనియర్ రచయిత్రులు మొదలుకొని యువ రచయిత్రుల వరకు 53 మంది అనేక దృష్టి కోణాల నుండి ఈ మాతృత్వం అనే అంశాన్ని తీసుకొని వివిధ సమస్యలు చర్చిస్తూ కథలను రచించారు.
మాతృత్వం అనగానే అది ఒక మధుర భావన అని స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం అని స్త్రీల జన్మ మాతృత్వంతోనే సార్ధకమవుతుందని ఇలా రకరకాలుగా మాతృత్వాన్ని పొగుడుతూ దానికి ఒక మహోన్నత స్థానం అన్న భ్రమ కలిగించింది మన సమాజం! కానీ నిజజీవితంలో స్త్రీలకు తల్లులుగా ప్రత్యేకమైన అధికారాలు ఏమి ఉండవు. నిజానికి ఆమెకు పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయంలో కానీ, అసలు కనాలా వద్దా అనే విషయంలో కానీ నిర్ణయాధికారం ఏమి ఉండదు. మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదేవోభవ! అంటూ తల్లిని తండ్రిని గురువును దైవంతో సమానంగా చెప్పే సంస్కృతిలో తల్లిని గౌరవించకపోగా చాలా హీనంగా చూసే ఉదంతాలు ఎన్నో ఉంటాయి.
మాతృత్వం అనే మిత్‌లోని డొల్లతనాన్ని బయటకు చెప్పటానికే ఈ కథా సంకలనం తేవాలని పూనుకున్నామని అంటారు సంపాదకులు విజయ భండారు. తరతరాలుగా మాతృత్వం ఒక వరంగా భావిస్తూ, తల్లులు కాలేని స్త్రీల జీవితం వ్యర్థం వృధా అంటూ ఒక మూస సంప్రదాయాన్ని పితృస్వామిక సమాజం మోస్తూ వస్తున్నది. పిల్లలను కనడం, పెంచడంలోనే, స్త్రీల జన్మ సార్థకం ఉందంటూ మాతృత్వానికి అగ్ర తాంబూలం ఇచ్చి కుటుంబ వ్యవస్థలో వారిని జీవితకాల బందీలుగా మార్చివేసింది. మాతృత్వ భావన చాటున అనేక మానసిక శారీరిక సంఘర్షణలను, హింసలను, సామాజిక సవాళ్లను మహిళలు ఎదుర్కొంటున్నారని, వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్న యోధలు వారు అని, అలాంటి జీవిత జీవితాలే ఈ కథలు అని అంటారు.
ఇక ఈ సంకలనానికి చాలా విలువైన ముందుమాటను వ్రాసిన వోల్గా మాతృత్వం అనే భావనను మార్స్క్ మరియు స్త్రీవాద దృక్పథంతో విశ్లేషిస్తూ, మాతృత్వ భావన అంటే ఏమిటి, దానిని పితృస్వామ్య సమాజం ఏ రకంగా తమకు అనుకూలంగా మలచుకుందీ వివరిస్తారు. మాతృత్వ భావజాలమే స్త్రీల అణచివేతకు పునాది! దీని ద్వారానే స్త్రీ పురుష స్వభావాలను వేరువేరుగా ఏర్పరిచి పితృస్వామ్యాన్ని స్థిరపరచటం సాధ్యమవుతుంది. ప్రైవేటు పబ్లిక్ రంగాలుగా సమాజాన్ని విభజించగలుగుతుంది. ప్రైవేటు రంగమైన ఇల్లు ఇంటి చాకిరి పిల్లల పెంపకాన్ని స్త్రీల ప్రపంచం చేసి, తక్కిన ఆర్థిక రాజకీయ రంగాలన్నింటిని పురుషులకు కట్టబెట్ట కలుగుతుంది అని అంటారు.
స్త్రీవాద సిద్ధాంతం అభివృద్ధి చెందే క్రమంలో స్త్రీ పురుష భావనలు సాంఘిక నిర్మాణాలు మాత్రమే అని నిరూపితమైంది. పిల్లలను కనటం, మాతృత్వం ఒకటి కాదు! పితృస్వామ్య నిర్మాణం జరిగే క్రమంలోనే మాతృత్వం అనే భావజాల నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇది స్త్రీలను లొంగదీయడానికి అత్యున్నతమైన ఆయుధం అయింది. స్త్రీలు తమ మనసుతో శరీరంతో చేసే పునరుత్పత్తిపై హక్కు కోల్పోవడం చరిత్ర గతినే మార్చి వేసిందని, ఆ హక్కు కోసం స్త్రీలు పోరాటం చేయాలని తల్లిగా తమ హక్కులను పొందాలని అంటారు వోల్గా.
నిజానికి మాతృత్వం అనేది సమాజంలో, వివాహ వ్యవస్థలో ఒక భాగమే! అదేమీ విడిగా సమాజం నుండి దూరంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా ఉండదు. తల్లులు లేదా మాతృమూర్తులు అనబడేవారు కూతుళ్లుగా పుట్టి, ఆడపిల్లలుగా పెరిగి పెళ్లి చేసుకొని ఒక భర్తకు భార్యగా ఒక ఇంట్లో కూడలిగా ఉంటూ ఆ తర్వాత తల్లులవుతారు. అందుకే సమాజంలో ఆడపిల్లకు ఎంత ప్రాధాన్యత ఆదరణ ఉందో, ఒక ఇంట్లో భార్యకు లేదా కోడలుకు ఎంత ప్రేమ గౌరవం అధికారం లభిస్తాయో సహజంగానే ఆమె తల్లిగా అయినప్పుడు అంతే ప్రేమ గౌరవం అధికారాలు ఉంటాయి. భార్యగా లేని గౌరవ అధికారాలు తల్లి అయినప్పుడు హఠాత్తుగా లభిస్తాయి అనుకోవడం అవివేకం. మన పితృస్వామ్య సమాజంలో ఆస్తి హక్కు గానీ వారసత్వ హక్కులు గాని తండ్రి ద్వారానే సంక్రమిస్తాయి. కాబట్టి సమాజ పరంగా చూసుకున్న చట్టపరంగా చూసుకున్న తల్లికి దక్కే గౌరవం స్త్రీలకు దక్కే గౌరవంతో సమానంగానే ఉంటుంది.
అసలు కుటుంబ వ్యవస్థ అంతా మగవారికి అనుకూలంగా ఉండేటట్లు రూపొందించబడిరది కనుక అందులో ఈ తల్లులైన స్త్రీలకు శ్రమ, చాకిరి, బరువు బాధ్యతలు వీరి వంతుగా ఉండి, తండ్రి అయిన పురుషుడికి మాత్రం పిల్లల నుండి గౌరవం, పిల్లలపైన అధికారం అతని వంతుగా దక్కుతాయి. బాధ్యత మాత్రం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్త్రీ భర్త నుండి విడిపోయిన ఆమెకు భర్తను కోల్పోయిన పిల్లల బాధ్యత మాత్రం ఆమె మీదే ఉంటుంది. అదే పురుషుడు భార్య నుండి విడిపోతే, కేవలం భరణం మాత్రం చెల్లించి పిల్లల బాధ్యత నుండి తేలికగా బయటపడతాడు, లేదు భార్యను కోల్పోతే వెంటనే రెండో పెళ్లి చేసుకొని ఈ పిల్లల బాధ్యతను ఆ రెండో భార్యకు బదిలీ చేసేస్తున్నారు. ఆ భార్య ఈ పిల్లలను ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లిగానే మిగిలిపోతుంది. అంటే తల్లిగా ఎదుర్కొనే కష్టాలు వివక్ష, హింస స్త్రీగా ఎదుర్కొనే దానితోనే ముడిపడి ఉంటుంది.
ఈ సంకలనంలోని కథలలో స్త్రీలు ఏ రకంగా మాతృత్వ బాధ్యతలతో బరువుతో నలిగిపోతున్నారు, తమ జీవితాన్ని మొత్తం పిల్లల పెంపకం వారి బాధ్యతతోనే గడిపి, చివరికి వారి నిరాదరణకు ఎలా గురి అవుతున్నారు కూడా చర్చిస్తాయి. కొన్ని కథలు నేరుగా మాతృత్వం గురించి కాకుండా ఒక స్త్రీగా వారి ఎదుర్కొనే సవాళ్లు హింస ఇబ్బందులు వీటిని చర్చిస్తాయి. ఇవి ఏ రకంగా మాతృత్వానికి సంబంధించినవి అని మొదట చదవగానే అనిపించిన మనం పైన చెప్పుకున్నట్టు అన్నిటికీ మూలం మళ్ళీ స్త్రీల పట్ల చూపించే వివక్షతోనే ముడిపడి ఉంటుంది.
ఇక కథాంశం వారీగా కథలలోకి వెళదాం.
మామూలుగానే పిల్లల పెంపకం అనేది ఒక క్లిష్టమైన బాధ్యత. అలాంటిది ఒక మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న పాపను, బాబును పెంచడం అనేది ఇంకా పెద్ద సవాలు. ఇదే అంశంతో రాసిన కథ చంగల్వ రామలక్ష్మి వివక్ష మన సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. తమ పిల్లలు అలాంటి ఒక ట్రాన్స్‌జెండర్ అని తెలిసినప్పుడు ఆ తల్లి పడే ఆవేదన, ఎదుర్కొనే వివక్ష, సందేహాలు, బాధలు ఇవన్నీ చర్చించిన కదా విజయ భండారు రాసిన మార్పు అనివార్యం,.
అలాగే ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిగా మారే క్రమంలో వచ్చిన ఇబ్బందులు, తల్లి కావడానికి పడే పాట్లు చర్చించిన కథ బి. శాంతి ప్రబోధ వ్రాసిన గణేష్ ఎలియాస్ గౌరీ. మాతృత్వ భావనలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకము అనే భావనని బద్దలు కొట్టిన కథ ఇది. మోహన రాసిన ’పురస్కృత’ కథ కూడా ట్రాన్స్ జెండర్ వ్యక్తుల పైనే.
సాధారణంగా మన సమాజంలో స్త్రీలకు రెండో పెళ్లి కావటం అనేది కష్టం. పిల్లలు ఉంటే మరీ కష్టం! ఈ అంశాన్ని చర్చించిన కథలు నల్లూరి రుక్మిణి రాసిన ఆజమాయిషి, నామని సుజనాదేవి రాసిన అలల తరంగాలు, రత్న సుమతి రాసిన తిరిగిరాని వసంతం, కొలిపాక శోభారాణి రాసిన చితికిన బాల్యం, దుట్టా శమంతకమణి ’మృదు మధురం’, నాంపల్లి సుజాత రంపెకోత వంటి కథలు.
తమ జీవితమంతా పిల్లల కోసమే ధారపోసి వారి కోసం అష్ట కష్టాలు పడి ఆఖరికి వారి నిరాదరణకు గురైన తల్లుల గురించిన కథలు ఇందులో చాలా ఉన్నాయి. కే వరలక్ష్మి వ్రాసిన శత్రువు, అయినంపూడి శ్రీలక్ష్మి వ్రాసిన తుది నిర్ణయం, రావుల కిరణ్మయి తల్లి నీకు దండమే, దొంతల సుజాత రాసిన కడుపు తీపి, జి అనసూయ రాసిన అమ్మ పి. రాజ్యలక్ష్మి రాసిన ఫాతిమా, శాంతి శ్రీ బెనర్జీ రాసిన నీటి మీద రాతలు, లక్ష్మీ సుహాసిని రాసిన జాస్మిన్. రaాన్సీ కొప్పిశెట్టి రాసిన మేలి ముసుగు ఇవన్నీ అలాంటి కధలే!
కుటుంబ జీవితంలో అనునిత్యం భర్తలు పెట్టే హింస నుండి తప్పించుకొని ఒంటరిగానే జీవిస్తూ తమ పిల్లల్ని ఒంటిచేత్తోనే పెంచాలన్న నిర్ణయం తీసుకునే స్త్రీలు ఈ కథల్లో చాలామంది ఉన్నారు. సయ్యద్ నస్మా షమీ రాసిన మెహర్ కథ, షేక్ నసీమా బేగం వ్రాసిన వజూద్. సాయి పద్మ రాసిన ఆకాశమంతా ఆలాపనలే, పద్మావతి రాంభక్త రాసిన రెండు ఆకాశాల మధ్య, మణి వడ్లమాణి రాసిన అనాఛ్చాదిత, నవోదయ చంద్రకళ కథ కాని కథ.
పిల్లలు పుట్టని స్త్రీలకి సమాజం పెట్టే పేరు గొడ్రాలు. వారు జీవితాంతం వివక్షకి, దోపిడీకి గురి అవుతూనే ఉంటారు. ఆ కథాంశంతో రాసిన కథలు ఎండపల్లి భారతి రాసిన తల పండిన గొడ్రాలు, సునీత గంగవరపు రాసిన చిగురు వేయని స్వప్నం.
గిరిజ పైడిమర్రి రాసిన ఫాదర్ హుడ్, సింగరాజు రమాదేవి రాసిన ఇంకొంచెం ప్రేమించనివా రెండు కూడా పిల్లల పెంపకంలో తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యుల బాధ్యతను గుర్తుచేస్తాయి. ఉరిమళ్ళ సునంద రాసిన ఎంత కాలం ఇలా కోళ్ల సావిత్రి దేవి రాసిన నాకింత గాలి కావాలి ఇలాంటి కథే!
ఇక ఒక ఆడపిల్లగా తాము ఎదుర్కొన్న వివక్షను ధైర్యంగా ఎదుర్కొని ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా ధైర్యంగా బయటపడి జీవితంలో ఎదిగిన యోధుల యువతుల కథలు కూడా ఉన్నాయి. వాటిలో సమ్మెట ఉమాదేవి మోదుగ పూలు, జ్వలిత రాసిన మాతృక, తాళ్లపల్లి యాకమ్మ రాసిన ఇంకా ఎన్నాళ్ళు, జయంతి వాసర చెట్ల రాసిన నింగికి మొలిచిన రెక్కలు, ఆదిలక్ష్మి రాసిన మెడల్ కథలు.
మనకు ఆధునిక సాంకేతికతతో ముడిపడిన టెస్ట్ ట్యూబ్ బేబీ గాని ఐ వి ఎఫ్ ద్వారా బిడ్డలను కనడం గాని స్త్రీల అండాలను లేదా పిండాన్ని ఫ్రీజ్ చేసి తదుపరి కాలంలో వాటిని బిడ్డలుగా రూపొందించే పద్ధతి గాని ఇవన్నీ మళ్లీ స్త్రీలను దోపిడీ చేసే విధంగానే ఉంటాయి. వాటిని ఎంచుకోవడంలో గాని వాటి మీద అధికారం విషయంలో కానీ స్త్రీలకు ఏ విధమైన నిర్ణయాధికారాలు ఉండవు. అలాంటి అంశంతో కూడుకున్న కథలు వి ప్రతిమ రాసిన నిగూఢ, మానస ఎండ్లూరి రాసిన ముందుచూపు, నందిగామ నిర్మల కుమారి రాసిన క్షతగాత్ర మొదలైనవి.
తమకు సొంతంగా పిల్లలు లేక పిల్లలను దత్తత తీసుకునే స్త్రీల సమస్యలు ఇంకో విధంగా ఉంటాయి. వీటిని అంశంగా రాసిన కథలు నల్లూరి కాంతి రాసిన హృదయ జననీ, ఆకునూరి విద్యాదేవి రాసిన అమ్మకాని అమ్మ, నండూరి సుందరీ నాగ మణి అమ్మే కావాలి కథ. ఎం.ఆర్.అరుణకుమారి అమ్మ కానుక పిల్లల బదులు వృద్ధులను దత్తత తీసుకునే అంశంతో రాసిన కథ.
పెళ్లి కాకుండానే తల్లులైన స్త్రీలను సమాజం వెలివేస్తుంది. ఆ కారణంగానే తమ బిడ్డలను పట్టగానే వేరు చేసుకున్న కథలు చాలా ఉంటాయి. అలాంటిదే సుప్రియ దేవరకొండ నేను ఓ తల్లినే, రుక్మిణీ దేవరకొండ లచ్చితల్లి. వి. యశోద రాసిన ముత్యాల గర్భం, గర్భ ధారణ పట్ల శాస్త్రీయ అవగాహన పెంచే కథ. ఇక కల్పనా రెంటాల రాసిన నో రిగ్రెట్స్ పిల్లలు వద్దనుకున్నా ఒక దంపతుల గురించిన కథ. సమాజపు కట్టుబాట్ల కన్నా వ్యక్తి స్వేఛ్చను గౌరవించాలనే అంశంతో రాసిన కథ.
పద్మ కుమారి రాసిన పొద్దుచాలని మనుషులు కదా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ తమకంటూ సొంత కుటుంబం, సొంత ఆస్తి ఏర్పరచుకొని ఏమి ఏర్పరచుకోకుండా ఉన్న ఒక స్త్రీ కథ. హేమ లలిత రాసిన భార్య-భరణం ఒక కొత్త అంశంతో కూడుకున్న కథ. తనను వదిలేసిన భర్త పిల్లలను పెంచాలని చెబుతూ తానే అతనికి ఎదురు వెయ్యి రూపాయల భరణం ఇస్తా అని చెప్పి, పిల్లల బాధ్యత భర్తనే తీసుకోవాలి అని వాదించిన స్త్రీ కథ. గీతాంజలి రాసిన ఫ్లయింగ్ మదర్స్ కథగూడా భిన్నమైనది. విదేశాలలో ఉండే తమ పిల్లల పిల్లలకు సంరక్షకులుగా వెళ్లే ఎంతోమంది వృద్ధ దంపతుల దయనీయగాధ.
పిల్లలని పెంచటంలో ఎదురయ్యే వ్యధలు కథాంశాలుగా రాసిన జ్యోతి వలబోజు నేరానికి శిక్ష, వంజారి రోహిణి కన్నా నీ చేతి గీత, సమ్మెట విజయ చీకటి మనుషులు కథలు.
స్త్రీల జీవితాలలోని రోజువారీ జరిగే అన్యాయాలని, అంతులేని వేదనని, సర్వసాధారణం అయిపోయిన హింసని, అత్యాచారాలని వారి దృష్టికోణం నుండి శక్తివంతంగా చెపుతాయి ఈ కథలు. సమస్యల మూలాలను లోతుగా అర్ధం చేసుకోమని చెప్తూ అవగాహనను పెంచుతాయి. ఈ కథల్లోని కథాంశాలు అన్నీ చాలా ముఖ్యమైనవి, ఆలోచించదగ్గవి, చర్చించదగ్గవి!
అయితే మనం సంప్రదాయ కథల్లో వెతికే కథా శిల్పం, కథా నిర్మాణం, శైలి పరంగా చూసినప్పుడు కొన్ని కథలు అంతగా సరితూగకపోవచ్చు. కానీ ఈ కథలన్నీ హృదయంతో రాసిన కథలు! తమ సొంత అనుభవాలు కానీ తమకు తెలిసిన వారి జీవితం కానీ లేదా తాము విన్న వాస్తవ కథనాలను బట్టి కానీ చెప్పిన కథలు! ఈ కథలు అందరికీ చేరాల్సిన అవసరం ఉంది. ఈ జీవితాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఇలా ఎందుకు ఉన్నాయి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సమాజంగా ఈ అణచివేతని దోపిడీని వేదనలను వ్యధలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకొని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది! యోధ కథా సంకలనం ఉద్దేశం కూడా అదే అనిపిస్తుంది.