యం. రత్నమాల
వినడం చదవడం తప్ప చూడలేదు మీరు చూశారా
ఫీనిక్స్ పక్షి చితాభస్మం నుంచి ప్రాణం పోసుకుని పైకెగురుతుందని
అమ్మా సీతమ్మ తల్లి కష్టాలు కడగండ్లు దిగమింగి లవకుశుల్ని కనిచ్చిన కన్నతల్లి
రాముడు నీ పతిదేవుడు రగిల్చిన అగ్నిజ్వాలల్లోంచి నడిచివచ్చావట కదా
నిరంతర జీవనపోరాటంలో మేం నిత్యం నిప్పులగుండాల్లోనే నడుస్తున్నాం
ఫీనిక్స్ పక్షిలా చస్తూ బతుకుతూ మానవజాతి మనుగడ నిలుపుతున్నాం
దమయంతి ప్రేమించినందుకో మరెవరో ప్రేమించనందుకో
ద్రౌపది నవ్వినందుకో ఇంకొకరు నవ్వనందుకో
కన్యకాపరమేశ్వరి ఒప్పనందుకో మరొకరు మాట్లాడినందుకో
నేరాల్ని మోపకుండానే నిత్యాగ్నిగుండాల్లోకి విసిరివేయబడుతున్నాం
వంటిల్లు మాత్రమే కాదు ఇల్లంతా నిప్పులకొలిమే
సమాజం సలసల మసులుతున్న ఉష్ణకాసారమ్
క్షణక్షణం అనుక్షణం బుగ్గయ్యినా బతుబారం మోస్తున్నాం
అంగంగాల్ని చూపు బాకుల్లో కాల్చిన బాంబులు చేసి కాల్చి తింటుంటే
గుండెమండి నిలువెల్లా కాలి కుప్పకూలిన చితాభస్మం నుంచి
ఫీనిక్స్ పక్షిలా సీతమ్మ వారిలా బతుకుతున్నాం, బతుకనిస్తున్నాం
అమ్మా సీతమ్మ తల్లి నీ బతుకు పుక్కిటిపురాణం కాదు నిత్తెసత్తెం
ఫీనిక్స్ పక్షి చితాభస్మం నుంచి ప్రాణం పోసుకుని పైకెగరడం పచ్చినిజం
నేను కథానాయికను (స్వగతం)
కొప్పర్తి వసుంధర
నేటి ”నేడే చూడండి” చిత్రాలలో
నేనో కథానాయికను,
ఎవరో అరువిస్తే పలికే గొంతు నాది,
ఎవరో ఆడిస్తే ఆడే ఆట నాది,
నేనో ”అందాల ఆ(ట)డ బొమ్మని”
ముంబయి ముద్దుగుమ్మను
నాకంటూ విలువల్లేవు
నాకంటూ వలువల్లేవు
ముద్దు ముద్దు మాటలు, కవ్వింపు చేష్టలు
హీరో చుట్టూ ప్రదక్షిణలు ఇదే నా నటన
36-24-36లతో ఎక్స్‌ఫోజింగు నా నాట్యం
నాకంటూ నైతిక బాధ్యతల్లేవు
సమాజానికి నేనిచ్చే సందేశాల్లేవు
నాకొచ్చే పారితోషికం పైనే నా గురి
ప్రస్తుతానికి ఇలానే సాగుతోంది మరి.
చెప్పానుగా నేనో అందాల ఆ(ట)డ బొమ్మనంతే.
వ్యత్యాసం
డా|| ఎస్వీ సత్యనారాయణ
స్వచ్ఛమైన ప్రేమకు పర్యాయపదం
ఆత్మీయత
అనురాగం –
తుచ్ఛమైన వాంఛకు పర్యవసానం
విద్వేషం
విధ్వంసం –
పరిశుద్ధమైన స్నేహానికి ప్రాతిపదిక
విశ్వాసం
వికాసం –
వికృతమైన ద్వేషానికి పరాకాష్ట
ఉక్రోషం
ఉన్మాదం –
ఎవరికి తెలుసు?
భీంపల్లి శ్రీకాంత్
ఆ అరవిచ్చిన అందం వెనక
ఎన్ని విషాద ఛాయలు
దాగున్నాయో – ఎవరికి తెలుసు?
ఆ వెన్నెల కురిసే చూపుల వెనక
ఎన్ని చింతనిప్పుల్లాంటి
లావా విప్లవాగ్నులో – ఎవరికి తెలుసు?
ఆ తడిగా మెరిసే పెదాల వెనక
ఎన్ని విషాద పదాలు
వివర్ణమయ్యాయో – ఎవరికి తెలుసు?
స్వార్థమెరుగని ఆ హృదయం వెనక
ఎన్ని విషాద గీతికలు
గాయపడ్డాయో – ఎవరికి తెలుసు?
నలగని ఆ చిరునవ్వుల వెనక
ఎన్ని వెకిలినవ్వులు
వెక్కిరించాయో – ఎవరికి తెలుసు?
ఆ ముత్యాల పలుకుల వెనక
ఎన్ని చేదుమాటలు
దాగి ఉన్నాయో – ఎవరికి తెలుసు?
ఆ వెన్నెల జీవితం వెనక
ఎన్ని అమావాస్య చీకట్లు
కమ్ముకున్నాయో – ఎవరికి తెలుసు?
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags