పి. సత్యవతి
ఒకసారెప్పుడో ఒక తోటకెళ్ళి అక్కడ ఒక మొక్కకి పూసిన పూలు చూసి ”ఏయ్! భలే వున్నయ్ కదూ అచ్చు ప్లాస్టిక్ పూలలా..” అని మెచ్చుకుంది ఒక మిత్ర.. ఇంకోసారి నీలిమేఘాలు విజయవాడ ఆవిష్కరణ సభలో లంక అన్నపూర్ణ గారు తన జీవితానుభవాలు చెబుతుంటే కన్నీళ్ళెవరైనా చూస్తారేమోనని గబుక్కిన పమిట కొంగుతో తుడుచుకున్నాను నేను. అది చాలాకాలంకిందటి మాట. ఇప్పుడైతే కన్నీళ్ళు ఎవరైనా చూసినా నాకేం ఇబ్బంది లేదు. పక్కనున్న ఇంకోమిత్ర అంది” ఆవిడ అనుభవాలు నిజంగా ఒక సినిమా చూస్తున్నట్లు వున్నాయి” అని ఇదొక తిరుగుడు. అంటే రివర్స్ అన్నమాట. చిన్నప్పుడెప్పుడైనా కాగితంపూలు చూస్తే నిజంపూలలా ఎంత బాగా చేశారో అనో, సినిమా నచ్చితే జీవితానికి దగ్గరగా ఉందనో అనుకునే వాళ్ళం కదా! ఇదంతా చెప్పాల్సిన సందర్భమే ఇది. ఎందుకంటే ఒక ఖరీదైన మనుషులకు (డబ్బున్న అనే అర్థంలో మాత్రమే ఖరీదైన) మాత్రమే సభ్యత్వం ఇచ్చే ఖరీదైన క్లబ్బులో జరిగిన సంక్రాంతి వేడుకలు చూసొచ్చాక నాకీ పోలిక గుర్తొచ్చింది. కనీసం యాభై అరవై సరికొత్త మోడల్ కార్లు పట్టే ఆవరణ అంతా ఎరుపు నీలం పసుపు గులాబీ రంగులతో నిండిన రంగవల్లులు. ఓ ఏడెనిమిది గంగిరెద్దులు. ఓ రోట్లో పిండిదంచుతున్నట్లు ఫోటోలు దిగుతున్న పట్టుచీరెలు. అక్కడే అరిసెలు వండే వాళ్ళు… వండుతున్నట్లు ఫోటోలు దిగేవాళ్ళు. ఒక రెండ్లెడ్ల బండి. దాని మీద చెరకు గడలు.. అమ్మాయిలంతా పట్టు లంగా ఓణీ సెట్లు. ఒన్ గ్రామ్ గోల్డో నిజం గోల్డో గానీ నగలే నగలు.., పాపడి బిళ్ళలు కట్టెవంకీలు వడ్డాణాలు మణికట్టు నించీ మోచేతిదాకా గాజులే గాజులు. ఒకవైపున గాలి పటాలు. మొత్తం, ఇదంతా ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారు ఏర్పాటు చేసారు. అందరి దగ్గరా ఆగకుండా సెల్ మోతలు ”హాయి హ్యాపీ సంక్రాంతి” సేమ్ టు యు” ఈ వాతావరణాన్నంతనీ అలుముకోవలసినదేదో లేనట్లనిపించింది. అదేమిటో తెలుసుకుందామని ఆవరణ చుట్టూ తిరిగాను.
గ్రామీణ జీవన సౌరభం ఇంకా నా శరీరాన్ని చుట్టుకుని వుంది. కొన్ని వేల సబ్బుల వాడకం కూడా దాన్ని వదిలించలేక పోయింది. అప్పుడిలాంటి కాంపాక్ట్ మేకప్ కిట్లు లేవు. గతించిందంతా మంచిదనేంత చాదస్తం లేనిదాన్నే గానీ ఈ మేకప్ చూశాక నేను అనుకోకుండా కాల యంత్రంలోకెక్కేసి దశాబ్దాల వెనక్కి వెళ్లాను. అక్కడ అరిసెలొండడం ఒక సామూహిక కార్యాచరణ. ఇవ్వాళ మీ ఇంట్లో రేపు మా ఇంట్లో ఎల్లుండి ఇంకో ఇంట్లో పాత్రధారులు మాత్రం అందరిళ్ళల్లోనూ వారే.. బావి పిన్ని (వాళ్ళింట్లో మంచినీళ్ల బావి వుంది). ఆవిడ ఇంటి పేరు ఊరందరికీ బావే. కొందరికి పిన్ని, కొందరికి పెద్దమ్మ కొందరికి అత్త.. ఎత్తరుగుల రంగనాయకమ్మత్త మెరక వీధి తాయారమ్మ, పచ్చమేడ పార్వతమ్మ. కరణం గారి చెల్లెలు. పోస్ట్ మాస్టర్‌గారి పక్కింటావిడ.. ఇందులో ముగ్గురు పాకం స్పెషలిష్టులు. ఇద్దరు అరిసెలు వత్తడంలో ప్రవీణులు. పిండిదంచే పాపాయమ్మ, బూబమ్మ, లక్ష్మి కాంతమ్మ సావిత్రి. జల్లించే జయమ్మ సరోజిని ఇదంతా ఒక బృందం. అరిసెలొక రోజు చెక్కలొకరోజు. బస్తీలనించీ వచ్చే కూతుళ్లకి కోడళ్ళకి పచ్చళ్ళు ఇంకోరోజు.. మీ ఇంట్లో ఒక రోజు మాయింట్లో ఒక రోజు. వారం రోజులు అందరికీ ఒళ్ళు విరుపే. కళ్ళం మీదే పంట అమ్మితే బ్యాంకులో నగలు. ఇంటికి పాలమ్మీ వెన్న అమ్మీ మగవాళ్లకి తెలీకుండా కొన్న ఒక్కొక్క పావుకాసూ అరకాసూ చద్రహారమో పలకసరులో. అయితే అది ఎరువులు కొనడానికో మందుచల్లించడానికో సమయానికి అక్కరకొచ్చేది. పంట రాగానే ఇంట్లో అందరికీ రెండు మూడు జతల బట్టలతో పాటు అదీ ఇంటికొచ్చేది. ఇంకా ధరొస్తుందనుకుంటే అక్కడే… సంక్రాంతికి తప్పనిసరిగా అందరికీ కొత్త బట్టలు. అవింకా ”మిషను అబ్బాయి” దగ్గరే వుంటే అతని కొట్టు చుట్టూ సాయంత్రం దాకా ప్రదక్షిణాలు. బొమ్మల కొలువుల పేరంటాలు. శనగలు రేగిపళ్ళు. పసి పిల్లలకి భోగిపళ్ళు.. ఇట్లా అన్నీ ఒక చోట కాదు అక్కడొకటీ ఇక్కడొకటి. సంక్రాంతి పొద్దున వడ్ల బస్తా ఒకటి బయటపెడితే మధ్యాహ్నానికి ఖాళి… వచ్చిన వాళ్లకి లేదనకుండా దానం చెయ్యాలి. లేకపోతే నానమ్మకి కోపం వచ్చేది. అదంతా ఇప్పుడు లేకపోలేదు. పొలాలమ్ముకోకుండా ”ఎలాగైనా కాపాడుకున్న వారికి” ఇంకా అన్నీ వున్నాయి. బావి పిన్ని అల్లుడు వాళ్ళ పొలం అమ్మించేసి నగరంలో వ్యాపారాలకి వెళ్ళాడు. ఎత్తరుగుల అత్తయ్య పొలం సంసార సాగరం మింగేసింది. అప్పటి సామూహిక కార్యాచరణ కాలం మాయలో కరిగి పోయింది. లేదంటే ఇంకా ఆడపిల్లలు చదువుకోకుండా సంపాదించకుండా నేనున్నానంటూ జ్ఞాపకం చేసుకోకుండా అరిసెలొండుతూ పాలు తీస్తూ వుండమంటం కాదు.. వాళ్ళలా అరెసెలొండుతూ పాలు తీస్తూ కూడా బహు చమత్కారంగా ఆర్థిక శాఖ నిర్వహించే వాళ్ళు. అనసూయ అరచేతిలో గుగ్గుళ్లుడికించినట్లు అవసరం పడంగానే ఎక్కడనుంచో డబ్బుల్తీసేవాళ్ళు. పదేళ్లకిందట శ్రావణ శుక్రవారానికి కొనుక్కున్న వెంకటగిరి చీరె మడతల్లోనించో అటక మీదున్న పనికిరాని ఇత్తడికడవలో పెట్టిన పాత పర్సులో నుంచో ధనలక్ష్మి ప్రత్యక్షమయ్యేది. వేలూ లక్షలూ కాకపోవచ్చు.. వందలు పదులే అయినా అది అమ్మ మహత్యం!! అమ్మమ్మలూ నానమ్మలు చెప్పే ఆ పండగల కథలు నోరూరిస్తే ఇదిగో ఇలా ”రీ ఎనాక్ట్” చేసుకోడమే… అచ్చం సంక్రాంతిలా వుందికదూ? అని భుజం చరుచుకోడమే. పండగలు రిచువల్స్ కావు.. పండగలు తప్పనిసరి వేడుకలూ కావు… కానీ ఆ వేడుకల్లో ఒక ఎదురుచూపు వుండేది. వాటిని ఆవరించుకుని ఒక గ్రామీణ జీవన ఆత్మ వుండేది… రీమిక్స్ పాటలో అసలు కళాకారుని ఆర్తి లుప్తమైనట్లు ఈ రీ మిక్స్ సంక్రాంతిలో బహుశా ఆ ఆత్మ లుప్తమైందేమో!! దానికోసమే వెతికి వుంటాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags