– ఎలసాని వేదవతి
ఆధునిక సాహిత్య రచనలో 19 వ శతాబ్దంలో విభిన్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందరో రచయితలు తమ రచనల ద్వారా ఒక నూతన శకాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అటువంటి ఆధునిక సాహిత్య రచయితలలో “కొడవటిగంటి కుటుంబరావు” అగ్రశ్రేణికి చెందినవారు. వీరు 1909 అక్టోబరు 28 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. దాదాపు 50 సంవత్సరాల పాటు తన రచనల ద్వారా జనజీవితాన్ని జాగృతం చేశారు.
కుటుంబరావు ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు, నాటికలు, గల్ఫికలు రచించారు. మధ్యతరగతి వ్యక్తుల జీవితాలను, కుటుంబ వ్యవస్థను, స్త్రీ, పురుషుల మధ్య వుండే సంబంధ, బాంధవ్యాలను, స్త్రీ, పురుషుల మధ్య వివక్షతను తన సాహిత్యంలో భాగం చేసారు. స్త్రీ, పురుషులు కలిసి వుండే వ్యవస్థలో వారిమధ్య ఏర్పడే బాంధవ్యాలను, ఆర్థిక, సాంఘిక స్థితిగతులు, నీతులు, రీతులు మొదలైనవి నియంత్రిస్తాయి. అయితే వాటికి లోబడి కొందరుంటారు. కొందరు ఆ పరిస్థితులకు ఎదురు తిరుగుతారు. జీవితాన్ని తాము అనుకొన్నట్లుగా గడపడమనేది సమాజంలో సంఘర్షించగలిగే వాళ్ళ హృదయ చైతన్యం యొక్క హెచ్చు తగ్గులను బట్టి వుంటుంది.
కొడవటిగంటి కుటుంబరావుగారు కుటుంబంలో, సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య వున్న సామాజిక, ఆర్థిక, లైంగిక వివక్షతలను తమ కథలలో ఆవిష్కరించారు. వారి కథలలో గల స్త్రీ పాత్రలను ఒకసారి పరిశీలిద్దాం.
బాల్య వివాహాల వలన బాలికల దుర్భర స్థితి, స్త్రీలకు విద్య, ఉద్యోగ రంగాలలో ఎదురయ్యే వివక్షత, స్వేచ్ఛ లేకపోవటాన్ని, ఉత్పాదక శ్రమగా గుర్తింపబడని స్త్రీల ఇంటిచాకిరీ, లైంగిక తారతమ్యాలను, నీతి ధర్మాలలో హెచ్చుతగ్గులొచ్చిన రెండు సందర్భాలలో ఎదుర్కొనే వివక్షతను అమాయకురాలు, జౌట్, అరణ్యం, స్వేచ్చ మొదలైన కథల ద్వారా తెలుసుకోవచ్చును.
కొడవటిగంటి కుటుంబరావు రచించిన కథలలో ఒక భాగం ‘అమాయకురాలు’. ఈ కథలో రచయిత సమాజంలోని స్త్రీ తన జీవితాన్ని తాను నిర్ణయించుకునే స్వాతంత్య్రాన్ని, తనకేం కావాలో కూడా తెలుసుకోలేని స్థితిలో ఎలా వుందో తెలియచేసారు.
ఇందులో భ్రమర, వెంకటేశ్వర్లు చిన్ననాటి స్నేహితులు ఒకే కులానికి చెందినవారు. వెంకటేశ్వర్లుకు భ్రమరపై ప్రేమనా లేక కాంక్షనా తెలియని స్థితి, అలాగే భ్రమరకు కూడా అతని పట్ల ఎటువంటి అభిప్రాయమో తెలీదు. కాని అతనితో జీవితం కావాలనుకుని దాన్ని ఎలా చెప్పాలో తెలియని అమాయక స్థితిలో రచయిత చిత్రించినారు.
ఆ తరువాత భ్రమరకు వేరు వ్యక్తితో పెళ్ళి కావడం, భర్త మరణించడం జరుగుతుంది. తిరిగి మనస్సులో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన వున్నా సమాజ, ఆచార సంప్రదాయాలకు భయపడి తన కోరికను లోలోపల సమాధి చేసుకుంటుంది.
వెంకటేశ్వర్లకు వివాహం నిశ్చయమైందని తెలుసుకుని తన అమాయకతతో, భయంతో తనను కోరుకున్న వాడిని దూరం చేసుకున్నాననే బాధతో వైధవ్యంలో ఒంటరిగా మిగిలిపోతుంది.
“జౌట్” కథలో శేషుకు పదకొండో ఏట పెళ్ళవుతుంది. బాల్యవితంతువు అవుతుంది. మళ్ళీ పెళ్ళి ప్రస్తావన రెండు సంవత్సరాలకే పదమూడవ ఏటనే వస్తుంది. నిర్వేదమైన నవ్వు నవ్వుతుంది. తుఫానుకు కదిలే రేకుల పాకలాగా చలించిపోతుంది. అంటే మళ్ళీ జౌటేనన్నమాట. బాల్యవివాహాలు బాలికల జీవితాన్ని ఎంత దుర్భరం చేస్తాయో చెప్పటానికి కొడవటిగంటి కుటుంబరావు ఈ కథ రాశారు.
పై రెండు కథలలో “వితంతు వివాహం” అనేది సామాన్యంగా కనిపించే అంశం. అయితే ఇక్కడ మొదటి కథలో భ్రమర తన అమాయకతతో, భయంతో కోరుకున్నవాడిని వదులుకుని కేవలం శరీరాన్ని మాత్రమే పెళ్ళి అనే బంధంలో ముడివేసింది. ఆధునిక సమాజంలో కూడా విద్యావంతులైన స్త్రీలు తల్లిదండ్రులకు, సమాజానికి వెరసి మనస్సులేని మనువుకు సిద్దపడక తప్పడంలేదన్న విషయాన్ని ఇందులో చూపించారు. అలాగే వితంతువు అయిన తను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనే కోరిక వున్నా భయంతో తన కోరికను తనలోనే సమాధి చేసుకున్న నిస్సహాయతను ఈ కథలో చూపించారు.
రెండో కథలో బాల వితంతువు సమస్యల పట్ల కొడవటిగంటి కుటుంబరావుకు గల వ్యధను ఇందులో గమనించవచ్చు.
సమకాలిక పితృస్వామ్య సమాజంలో, కుటుంబంలో స్త్రీలు ఏవిధంగా లైంగిక వివక్షతను ఎదుర్కొంటున్నారో వివరించారు.
“అరణ్యం” కథలో పదిహేనేళ్ళ అమ్మాయి దారిద్రం వలన నడివయస్సు దాటిన వ్యక్తికి భార్య కావలసి వచ్చింది. తన కూతురు వయస్సుకన్నా చిన్నదైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న వెంకటనర్సయ్య వంట మనిషితో శారీరక సంబంధం కొనసాగిస్తూ భార్యమీద అనుమానంతో కొట్టడం, కూతురి పెళ్ళి ఆలోచన చేయలేకపోవడం, సమకాలిక సమాజంలో లైంగికత్వం స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధానంలో వున్న తేడాకు నిదర్శనం.
‘ఒంటిస్తంభం మేడ’ కథలోని వితంతువు తండ్రి అరణ్యం కథలోని వెంకటనర్సయ్య లాంటివాడే. తాను ఒక వేశ్య అయిన వితంతువు దగ్గర లైంగిక సుఖం పొందుతూ కూతురు పెళ్ళి చేయకపోవడం, ఆమె మనస్సు లైంగిక విషయాల పట్ల మళ్ళకుండా ఆమె ముందు సుఖరోగాల గురించి మాట్లాడటమంటే స్త్రీల లైంగికతా స్వేచ్ఛను నిర్ధేశించటమే.
అలాగే ఒక వయస్సు వచ్చేవరకే స్త్రీకి ఇంట్లో సమాన స్థానం వుంటుంది. యవ్వనం తరువాత త్వరగా వదిలించుకుందామనే చూస్తారు. అన్న, తమ్ములతో పాటుగా ఏ విధమైన హక్కులు స్త్రీలకు లభించవు.
“స్వేచ్ఛ” కథలో కూడా తమ చెల్లెలికి మొదటి సంబంధం కన్నా రెండవ సంబంధం పెళ్ళికొడుకు ఐదువందలు తక్కువ కట్నం తీసుకుంటున్నాడని అతనితోనే ఆమె పెళ్ళి ఖాయం చేస్తారు. అంటే కుటుంబంలో స్త్రీ విలువ ఐదువందల పాటి కూడా విలువ లేదన్న విషయం ఇందులో స్పష్టం చేసారు.
తరువాత ఆ స్త్రీ స్వేచ్ఛకోసం వేరే వ్యక్తితో వెళ్ళిపోవుటకు ఇది కారణం అని నిర్ధారించి చెప్పలేదు.
స్త్రీలు కేవలం భోగవస్తువులుగా, శరీర కోరికలు తీర్చే వస్తువులు, జీతం ఇవ్వక్కరలేని పనిమనుషులుగా పితృస్వామ్య వ్యవస్థ పరిగణించడాన్ని కొడవటిగంటి కుటుంబరావు నిశితంగా విమర్శించారు.
భర్త ఐనందుకు పురుషునికి స్త్రీపై తన పశుప్రవృత్తిని ప్రదర్శించే హక్కు వుండడం, స్త్రీ ఇంటిల్లిపాదికి విశ్రాంతిలేని చాకిరీ చేయవలసి రావడం వస్తే వీటిని ఆమోదిస్తూ ఆ స్త్రీనే నీతికలది, పతివ్రత అవుతుందంటే వ్యక్తిత్వమున్న ఏ స్త్రీ భరించదు. పురుషుడు మాత్రం వివాహ బంధంలోనైనా, వివాహేతర సంబంధంలోనైనా ప్రేమించో, పీడించో సుఖాన్ని, స్వేచ్ఛను పొందగల్గడం, స్త్రీలకు ఆ అవకాశం లేకపోవటమనే వివక్షతను కొడవటిగంటి కుటుంబరావు నిరసించారు. సామాజిక నీతులనుండి కాకుండా స్త్రీని ఒక మానవ వ్యక్తిగా గుర్తించడం జరగాలన్నది కుటుంబరావు సూచించిన మార్గం.
సమకాలిక పితృస్వామ్య సమాజంలోని వితంతువుల సమస్యల పట్ల, స్త్రీల లైంగిక వివక్షత పట్ల కొడవటిగంటి కుటుంబరావు కలత చెందారు. ఎక్కువ వయస్సు వున్న వాళ్ళతో పెళ్ళి చేయడం వలన స్త్రీలు యవ్వనంలోకి రాకముందే వితంతువులుగా మారే పరిస్థితులు, వాళ్ళకు చదువుకుని ఉద్యోగాలు చేసి స్వతంత్య్రంగా జీవితం గడిపే అవకాశాలు లేకపోవడం వితంతువులకు మళ్ళీ పెళ్ళి చేయకపోవడం, చేసుకోవాలనున్నా సమాజానికి భయపడి చేసుకోలేక వితంతువులుగానే బ్రతకవలసిన పరిస్థితులు. లైంగికతా వివక్షతలను కొడవటిగంటి కుటుంబరావు స్వేచ్ఛ, అమాయకురాలు, అరణ్యం, ఒంటిస్తంభం, మేడ మొదలగు కథలలో చూపించారు.
ఈ పరిస్థితులనుండి బయటపడడానికి ధైర్యం చేసిన స్త్రీ పాత్రలు సృష్టించడం ద్వారా పురుష వివక్షతను ఎదుర్కోవలసిన అవసరం స్త్రీలకు ఎంతైనా వుందని కొడవటిగంటి కుటుంబరావు సూచించారు.