భూమిక ఆధ్వర్యంలో జరిగిన కథ, వ్యాసాల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 18-10.06 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో జరిగింది.రచయిత్రి శిలాలోలిత ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ “భూమిక విజయవంతంగా నిర్వహంచిన కథ, వ్యాసాల పోటీలలో ఇది రెండవది. ఈ సంవత్సరం “ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య’ల గూర్చి వ్యాసరచన పోటీపెట్టాం. కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికే బహుమతులను కేటాయించడం జరిగింది. పుస్తకాలు చదవడం తగ్గిపోతున్న ఈ కాలంలో కాలేజీ పిల్లలను ప్రోత్సహించాలని అనుకున్నాం” అన్నారు. ఈ సందర్భంగా భార్గవీరావుగారు రాసిన “కలగంటి,కలగంటి పుస్తకాన్ని శారదా శ్రీనివాసన్ ఆవిష్కరించారు. శారదా శ్రీనివాసన్ భార్గవీరావు ‘కలగంటి-కలగంటి’ పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని భార్గవీరావు తల్లిగారైన శాంతిగారికి అందజేసారు. శారదా శ్రీనివాసన్ మాట్లాడుతూ “భార్గవీరావుతో నా పరిచయం దాదాపు 18 ఏళ్ళనాటిది. రేడియో కార్యక్రమంలో కన్నడ కార్యక్రమాలను నిర్వహించడానికి భార్గవీరావు రేడియో స్టేషన్కి వచ్చేవారు. జాతీయ కవి సమ్మేళనంలో అన్ని భాషలలో మాకు కవితలొచ్చేవి. వాటిని ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేసేవాళ్ళం. భార్గవీరావు మాకు అనువాదాలు చేసేవారు” అన్నారు. ఆవిడ మొట్టమొదటి ఆల్బమ్ ‘గోడలనీడలు’ ఆ రోజుల్లోనే వచ్చింది. గిరీష్ కర్నాడ్ నాటకాలు కూడా ఆవిడ అనువాదం చేసేవారు. తర్వాత సుజాతాదేవి కలగంటి-కలగంటి పుస్తకం గురించి క్లుప్తంగా మాట్లాడుతూ “ఈ పుస్తకంలో 18 కథలున్నాయి. ఒక రచయిత ప్రతిభ కథాసంకలనంలోనే కన్పిస్తుంది. కథలో 20 రకాల మనస్తత్వాలతోపాటు అన్ని సమస్యల్ని రచయిత పరిచయం చేస్తారని చెప్పారు. ఈ కథలన్నీ ఆలోచింపజేసేవిగా వున్నాయని” అన్నారు. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి కథ, వ్యాసాల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేసారు.
చివరగా కె. సత్యవతి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అబ్బూరి చాయాదేవిగారికి, శారదా శ్రీనివాసన్గారికి, పుస్తకం గూర్చి మాట్లాడిన సుజాతగారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అమెరికాలో వుంటున్న భూమిక చందాదారులైన ఆరి సీతారామయ్యగారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెబుతూ వారికి ధన్యవాదాలు సభాముఖంగా తెలియచేసారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అబ్బూరి ఛాయాదేవి, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల గార్లకు కృతజ్ఞతలు తెలియచేసారు. చివర పోటీలో విజేతలైన రచయిత్రులు స్వర్ణ ప్రభాతలక్ష్మి, రేణుక అయోల, డి. విజయ, సమ్మెట విజయ, ప్రసన్నకుమారి, పుష్ప తమ స్పందన తెలియచేసారు. వందన సమర్పణ అనంతరం సభ ముగిసింది.