ఇదా నవయుగము! ఒక అభాగిని – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

సంపాదక మహాశయా!
నా యీ కష్టాలను ‘గృహలక్ష్మి’ ద్వారా ప్రచురించుకుందామనే ఆశ చాలా కాలాన్నుంచి యుండేది. దాని వెంటనే పత్రికా భాష వ్రాయనేర్వని నాబోటి వాళ్లు వ్రాసిన అవకతవక భాషను ప్రచురించుతారా అనే శంక హృదయంలో తట్టి నిరుత్సాహపడుతూ వుండేదాన్ని. ఐనా ప్రత్యేకం స్త్రీల పాలిట కల్పతరువైన ‘గృహలక్ష్మి’యే నా యధార్ధ కష్టాలను ఆలింపక నిరాకరించిన ఇక ఆదరించే వారెవరు? అనే ధైర్యంతో వ్రాయబూనితిని. నేను, అదిగాక పైగా ఈ కాస్త విజ్ఞానం గూడా ‘గృహలక్ష్మి’ ద్వారా సేకరించితిని గాన మా పత్రికయనే అహంభావముతో వ్రాయబూనితిని.

కాబట్టి నన్ను నిరుత్సాహ పెట్టక గట్టిగా ఈ మాసపు సంచికలోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. వచ్చే ఫిబ్రవరి సంచిక కొరకు వ్రేళ్లు లెక్కిడుకొనుచూ, నిరీక్షిస్తూ వుంటాను.
ఇట్లు,
ఒక అభాగిని.
స్త్రీ స్వాతంత్య్రము, స్త్రీ స్వాతంత్య్రము అని దశదిశల మారుమ్రోగుతూ, గగ్గోలు పెట్టుతూ వున్న ఈ రోజుల్లో స్త్రీలకు జరుగుతూ వున్న ఘోర పశుకృత్యాల్ని అనుభవము ద్వారా వివరించుతాను వినండి.
నేను తెనాలి తాలూకాకు చెందిన ఒక కుగ్రామంలో కమ్మ కుటుంబానికి జెందిన ఒక కన్యను. ఇప్పుడు నా ప్రాయము పదునెనిమిది సంవత్సరములకు మించినది. నా తల్లిదండ్రులు నిరక్షరకుక్షులు. పైగా అతి మూఢాచారపరులు. మా యింటి దాపున నున్న స్వజాతి యువకుడొకడు మా ఇంటికి తరచుగా వస్తూ పోతూ వుండేవాడు. ఈ యువకుడు సామాన్య విద్యÑ అట్టే అంత పెద్దా చిన్నా గాని భూస్థితి కలవాడు. కొంత కాలానికి మా ఇద్దరకు ఒకరి మిాదకొకరకు అవ్యాజానురాగ మేర్పడినది. చివరకు ప్రణయగాధలోనికి దిగింది. ఇద్దరము పరస్పర గాఢానురాగముతో వివాహము చేసికొన నిశ్చయించుకున్నాము. ఈ సంగతి కొంత కాలానికి మాయమ్మ పసిగట్టి, నాలుగు చీవాట్లతోటి ఆయబ్బాయిని మా గడప త్రొక్కకుండా చేసింది. నన్ను గూడా చాలా హింసించారు. అప్పటి నుంచి ఆ యువకుడు మా ఇంటికి రానంత మాత్రాన మా పరస్పర ప్రేమకు కొరతవడలేదు. కొన్నాళ్లకు నాకొక సంబంధము తెచ్చారు మావాళ్లు. నా ప్రాణము తీసిననూ అన్యుని వరింపనని గట్టి శపధము చేశాను. నేను వాళ్ల మాట వినని కారణంగా చాలా చాలా బాధపెట్టి హింసించి, చివరకు నిన్ను చంపిjైునా సరే మా కుటుంబ మర్యాదను కాపాడుకుంటాం గాని, మేము మట్టుకు మా ప్రాణాలు పోయినా, నీవు కోరే వరునకిచ్చి చేయమన్నారు మా తల్లిదండ్రులు. చివరకు ఆయబ్బాయిని తన్ని వూరి నుంచి వెళ్లగొట్టాలని గూడా ప్రయత్నించారు. ఐతే అంత పని సాధ్యంకాక పోయింది. ఇది ఇట్లుండగా అమ్మలక్కలందరు వరసాయిగా రాసాగారు మా యింటికి చోద్యము చూడ్డానికి. ఒకమ్మ ‘‘అయ్యో! ఎంత విడ్డూరమమ్మా మా కాలంలో ఈ మాయదారి ప్రేమలు, వలచి పెండ్లిండ్లు చేసికొనుట మేమెరుగమమ్మాÑ పెద్దవాళ్లు ఎంత చెప్పితే అంత గిర్రుగీసి గీతలో వుండే వాళ్లమమ్మా’’ అని ముక్కు మిాద వ్రేలు వేసుకొని చెప్పసాగేదొకమ్మ. మరొకమ్మ ‘‘అయ్యో ఇంత ఘరానాగా బ్రతికిన మిా కుటుంబానికి ఎంత అపకీర్తి తెచ్చిందమ్మా! ఇటువంటి వాళ్లు వుంటేనేమి పోతే నేమి’’ అని పళ్లు పటపట కొరుకుతూ అనేది మరొకమ్మ. ఈ విధంగా అమ్మలక్కలందరు అగ్గిలో గుగ్గిలం పోసినట్లు మా వాళ్లకు మరింత మంట కలుగజేసి నన్ను మరింత బాధలు పెట్టించి సంతోషిస్తూ చూస్తూ కూర్చొండేవాళ్లు. మా వూళ్లో మా యీ ఆదర్శ వివాహాన్ని ఎట్లైనా పట్టుదలతో చేయించాలని కార్యదీక్షతతోనున్న ఒక విద్యాధిక బ్రాహ్మణుడు నన్ను సోదరి మాదిరి చూస్తూ, విద్యాభివృద్ధి చేయమని పత్రిక పుస్తకాలిస్తూ వుండేవాడు నాకు. ఆయన గారిని నాలుగు కూకలేసి మా ఇంటిసాలి రాకుండా చేశారు. నేను పత్రిక, పుస్తకాలేవైనా చదువుకుంటూంటే, ఇంతా చేసింది ఈ మాయదారి చదువులేనని ఆపాళంగా పడదిట్టుతూ నా చేతిలోనివి, లాగిపారేస్తూ వుంటుంది (మాయమ్మ). అప్పటి నుంచి ఇప్పటి వరకు పుస్తకం గాని, పత్రిక గాని వాసన లేకుండా చేశారు మా వాళ్లు మా ఇంటిలో. నాకొరకేనా అన్నట్లు, ఒక వితంతువును జేసి, మా పెద్దమ్మ నొకామెను తోలాడు భగవంతుడు మా ఇంటికి. ఈమెగారి వత్తిడి వల్ల నా బాధలు చెప్పేటందుకే అలవిగావు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను లేచినా, కూర్చున్నా, పగలు రాత్రనక నా చుట్టూ పహరా ఇస్తూ వుంటారెవ్వరొకరు. చివరకు బ్రతుకు తెరవు లేక, జీవితం మీద విరక్తి కలిగి ఏ నుయ్యో, గొయ్యో చూసుకొని ఆత్మహత్య చేసుకుందామన్నా ఆ మాత్రపు అవకాశానికి గూడా నోచుకోలేదు ఈ అభాగిని.
కాస్తోకూస్తో పేరు ప్రతిష్ట గలిగినటువంటి సోషలిష్టు ఐన మా అన్నగారొకాయన వున్నాడు. ఈయన జీవితంలో అత్యధిక భాగాన్ని పల్లెటూరి ప్రచారానికే వినియోగిస్తూ వుంటాడు. ఈయనగారు వేదికలెక్కి ‘‘స్త్రీ స్వాతంత్య్రమియ్యాలి, సంఘసంస్కరణ జరగాలి, మూఢాచారాలంతరించాలంటూ’’ గంభీరోపన్యాసాలిస్తాడు. నా విషయానికొచ్చేటప్పటికి ‘‘నాన్‌సెన్సు లౌ’’ అంటాడు. మరీ మాటాడితే ‘లౌ’ అంటే ఏ బి.యె. యమ్‌.ఏ.లు చదివి దేశాటన చేసిన వాళ్లకే తప్ప నీబోటివాళ్లకేమీ అర్థము కాదంటాడు. ఈ నాయన్నగార్కి ప్రేమంటే పెద్ద విద్యాధికులకు తప్పక నోరూ వాయి లేని మూగజంతువులకు సయితము వుంటుందని ఎరగడు కామాలి. పైగా ఎవ్వరైనా మా అన్నగారిని ఇది చాలా సమంజసమని, ఇటువంటి ప్రేమంపు వివాహాన్ని చేస్తే చాలా ఆదర్శకంగా వుంటుందని, నీవు జోక్యం కలుగచేసుకుంటే వాళ్లకీ కష్టాలు గట్టెక్కుతవని చెప్పితే ‘‘ఈ విషయంలో నేను పెద్దవాళ్లకు ఎదురు తిరిగి జోక్యం కలిగించుకున్నట్లైతే ‘నా లైఫ్‌ రూయిన్‌’ అవుత’’దంటాడు. కావటానికి అన్నగారైనప్పటికి ఇటువంటి పరిపక్వదశకు రాని దొంగ సోషలిష్టుల వలన, సోషలిష్టు సంఘానికే ముప్పు వాటిల్లుతుందని విచారిస్తున్నాను.
మరొక సంగతి. నాకు ఇంకొక చిన్నన్న ఛోటా సోషలిస్టు ఒకడు వున్నాడు. ఈనగారి విచిత్ర గాధ ఇంకోటి వుంది చెప్పుతాను. యీయనగారు మొన్న మొన్నటి వరకు మా ఇద్దరి మధ్యనా వుత్తర ప్రత్యుత్తరాల వరకు జరుపుతూ మా ఈ ప్రేమంపు వివాహానికి రహస్యంగా చాలా దోహదమిచ్చాడు. తీరా చివరకు పెద్దవాళ్లు వీడు గూడా ఈ ఆలోచనలో వున్నాడని గ్రహించి, తన్నబోయి ఇదిగో చూడు ఇంకా ఏమి చేస్తామో అని రెండు లంపకాయలు పుచ్చుకొనేటప్పటికి, ఇలా వుంటే ఇక లాభము లేదని, లబోదిబో నేనేమి ఎరుగనని ప్రమాణాలు చేసి తన మీద వాళ్లకేమాత్రం సంశయం వుండకుండా వుండేందుకు, ఆ యువకుణ్ణి కొట్టటానికి మా పెద్దవాళ్లతో సహా బయలుదేరాడు. మొదట్లో నేను తను తప్పుకొనుటకే ఇలా నటన చేసి మాయబూటకాన్ని పన్నాడని తలంచి పొరబడితిని. తీరా ఇట్లా చూస్తే నన్ను చూచినప్పుడల్లా కళ్లెర్రచేసి కసకసలాడుతూ పైగా నీవు వాడిని వదిలివేసి మేము నిశ్చయించిన పుల్లాయిని చేసుకుంటావా లేదా! నీవు ఇష్టపడక పోయినట్లైతే ఏమి చేస్తానో చూడు అని బెదరించసాగినాడు. అదీగాక పాపం ఆ యువకుణ్ణి తన్ని వూరి నుంచి వెళ్లగొట్టాలని గూడ ప్రయత్నిస్తున్నాడు. మొన్నటిదాకా ఈ విషయం చాలా మంచిదని, పైగా మాకు ఎంతో సహాయం చేసిన వానికి ఈ నాడిరత రిమ్మతెగులు పుట్టుటకు గల కారణాలెవ్వో నాకు బోధపడుటలేదు. పెద్దవాళ్ల వలన ఎముక లిరుగుననే భయము చేతనో లేక మరే కారణంతోనో ఇంతలోనే ఇంత మార్పు చెంది ఇటువంటి నీచానికి పాల్పడిన నా చిన్నన్నగారిని నేనేమనాలో నాకర్థమగుట లేదు.
కుటుంబపోరే చెప్పనలవి గాకుంటే బయటి సంఘపు పోరుకి అంతే లేదు. ఆ యుకునికి నాకు ఏమేమో… అని ఒక పెద్ద దోషాన్ని ఆపాదించిందీ సంఘం. పాఠక మహాశయులు నన్నొకటి ప్రశ్నింపవచ్చును. నీవీమాత్రం జ్ఞానము గలిగి పైగా మేజరై యుండిగూడ నీ స్వేచ్ఛానుసారం ప్రేమించిన వానిని పెండ్లి చేసుకొనుటకు అడ్డుపెట్టే వారెవరు? ఒక వేళ అడ్డుపెట్టి గవర్నమెంటు ద్వారాగాని లేక మరి ఇతరత్రానైనా రక్షణలు లేవా యని ప్రశ్నింపవచ్చును. అవును అదిగూడ సత్యమే. కాని ఇప్పటి వరకు ఈ సంఘమనే పెనుభూతాన్ని చూసి భయపడుతూ పైగా ఈ సంఘమింకేమి చేయనున్నదో యనే భయోత్పాతముచే నిదానించితిని. ఇంకా ఇలాగే కట్లు తెగే వరకు బిగించితే మాత్రం జరిగేదేమో తప్పక జరుగగలదు.
… … …
ఇందలి విషయములు పూర్తిగా నిజముగావచ్చును, కాకపోవచ్చును. కాని, ఇట్టివి జరుగుచుండుట కాదనలేము. ఈ ‘అభాగిని’ తన పూర్తి విలాసమును మాకు తెలియపరచి సహాయము కోరిన, తగు విధమున చేయుటకు సిద్ధముగానున్నాము.
` సంపాదకుడు
… … …
(ఈ వ్యాసం బ్రిటీష్‌ పాలనా కాలం నాటి స్త్రీల పత్రిక అయిన గృహలక్ష్మి లో 1939వ సంవత్సరం ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది (పు. 862`865). జీవితానుభవం ద్వారా రాసిన ఇలాంటి వ్యాసాలెన్నో ఈ పత్రిక పుటల్లో నిక్షిప్తమై వున్నాయి. వలసాంధ్ర మహిళోద్యమ సమాచార గని అయిన గృహలక్ష్మికి సంబంధించిన స్థూల సమాచారం కోసం భూమిక అక్టోబర్‌ (2025) సంచికను చూడగలరు (పు. 25). భగ్న హృదయురాలైన ఈ ‘అభాగిని’ లాంటి ఎంతోమంది స్త్రీలను రచయిత్రులుగా తీర్చిదిద్దడమనేది గృహలక్ష్మి విశిష్టత. అందుకే నాటి స్త్రీలు ఈ పత్రికను తమ పాలిట ‘‘కల్పతరువు’’గా భావించడంలో ఆశ్చర్యమేం లేదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.