అనువాదం – సుధామయి సత్తెనపల్లి
బీహార్ నుంచి వలస వచ్చిన రీతా కుటుంబం యమునా నది వరద మైదానాల్లో తాత్కాలికంగా కట్టుకున్న గుడిసెలో నివసిస్తోంది. పరీక్షలకు నిలయంగా కనిపిస్తోన్న ఈ ప్రదేశంలో వారి జీవనోపాధి ఏనుగు గడ్డిని అమ్మడం.
ఆమె కూర్చున్న ఒక పెద్ద ఎండుగడ్డి మోపు చుట్టూ, దారుణమైన విధ్వంసమేదో జరిగినట్లు కనిపిస్తోంది. విరిగిన వెదురు బొంగులు, చిరిగిన టార్పాలిన్ పట్టాలు, ప్లైవుడ్ పలకలు, తాళ్ళ ముక్కలు, నలిగిపోయిన చీరలు, వంటపాత్రలు, గిన్నెలు, మట్టి గొట్టుకున్న బట్టలు వగైరా రోజువారీ సామగ్రి అంతా చెల్లాచెదరుగా పరచుకొని ఉందక్కడ. వాళ్ళు ఇల్లుగా పిలుచుకున్న ప్రదేశమిదే. ఇప్పటికీ అది ఇల్లే. రెండు రోజుల క్రితం దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళ బుల్‌డోజర్లు వాళ్ళ గుడిసెలన్నీటినీ నేలమట్టం చేసేక, ఇక్కడి దృశ్యమంతా మారిపోయింది. చిల్లా సరోదా ఖాదర్ అనే జనాభా లెక్కల పట్టణంలోని ఈ జనావాస ప్రదేశంలో ఉన్న 10-15 ఇళ్ళలో రీతాదేవి గుడిసె కూడా ఒకటి.
కానీ ఆమెను ఈ పరిస్థితులేవీ అంతగా ఇబ్బంది పెడుతున్నట్లు లేదు. సుమారు ఒక అంగుళం వెడల్పున్న బంగారు-గోధుమ రంగు గడ్డి ఆకును ఒక చేతిలో పట్టుకుని, మరో చేతిలోని కొడవలితో దాన్ని రెండు మూడు పల్చటి చీలికలుగా చేస్తున్నారు. ప్రభుత్వం దిల్లీలో అభివృద్ధి చేయాలనుకుంటోన్న ఆరు జీవ వైవిధ్య పార్కుల్లో ఒకటైన యమునా క్షేత్ర సమీపంలోని బస్తీలో నివాసముండే ఆమెకు గానీ, మిగిలిన జనానికి గానీ ఇళ్ళ ముందు భూతంలా బుల్‌డోజర్ నిలబడడం కొత్తా కాదు, అదంటే ఇప్పుడు వాళ్ళకు బెదురూ లేదు. ‘‘యప్‌ా జమీన్ సర్కారీ హై ఇస్ లియే తో రaుగ్గీ-వుగ్గీ తోడ్ దేతా హై. పట్టే పర్ జమీన్ యప్‌ా వహీ లోగ్ సాల్ భర్ కే లియే లేతేఁ హై జో ఖేతీ కర్తేఁ హై’’ (ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ వేసుకున్న గుడిసెలని కూల్చేస్తున్నారు. ఏడాది కాలానికి పట్టా తీసుకున్న వాళ్ళే ఇక్కడ వ్యవసాయం చేస్తారు.)’’
‘‘మేం అక్షర్‌ధామ్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది,’’ అన్నారు రీతా. ‘‘ఎవరో చేపలను శుభ్రం చేస్తుండగా, ఆ చేపల వ్యర్థాలను ఒక కాకి ఎత్తుకుపోయి గుడిలో పడేసింది. దాంతో వాళ్ళు మొత్తం రaుగ్గీ (గుడిసెలు)నే పడగొట్టేశారు. అదంతా 2015లో జరిగింది. అప్పుడు చిల్లా ఖాదర్‌లోని ఈ బస్తీకి వచ్చాం. ఇక్కడ కూడా నాలుగయిదుసార్లు అలానే జరిగింది. అయినా ఇక్కడే ఉంటున్నాం.’’ నెలకు 500 రూపాయల అద్దెకు తీసుకున్న జాగాలో, ఆమె కుటుంబం ఒక చిన్న 8శ10 అడుగుల గదిని కట్టుకుంది.
‘‘ఓ గుజ్జర్ వ్యక్తికి అద్దె కడుతున్నాం. ఆయన పేరు రాజ్‌వీర్. ఆయన కూడా చిల్లాలోనే ఉంటాడు. ఆయన తాత చాలాకాలం క్రితమే ఈ భూమిని ప్రభుత్వానికి అమ్మేశాడు. అందుకోసం వాళ్ళకి పరిహారం కూడా అందింది. అయినా ఇప్పటికీ ఈ భూమి తనదే అంటాడాయన. మాలాంటి బీదవాళ్ళని కొట్టీ బెదిరించీ డబ్బు గుంజుకుంటాడు,’’ చెప్పారు రీతా. ‘‘తుమ్హారా ఖేత్, తుమ్హారీ జమీన్, తూ జాన్. హమారాతో రెహ్నే సే మతలబ్ హై (నీ పొలం, నీ భూమి, అదంతా నీ ఇష్టం. మాకెందుకు? ఇక్కడ ఉండనిస్తే చాలు మాకు). మేం ఎప్పుడూ పక్కా ఇళ్ళు కట్టుకోం. వాళ్ళు పడగొట్టినప్పుడల్లా కొత్త ఇల్లు కట్టుకుంటూ కూర్చునేదెవరు?’’ చీలికలు చేసిన గడ్డిని చిన్న కట్టగా కడుతూ అన్నారామె.
ఈసారి కూల్చివేతలు పూర్తయిన తర్వాత, రీతా కుటుంబం తమ గుడిసె తాలూకు రెండు గోడలను మళ్ళీ నిలబెట్టి, వాటి మీద పైకప్పుగా ఒక ప్లాస్టిక్ పట్టాను పరవగలిగారు. ఆ బస్తీలో చాలామంది ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి వచ్చిన వలస వచ్చిన దినసరి కూలీలే. రీతా కూడా బీహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందినవారు. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధిని వెతుక్కుంటూ బస్‌బిట్టీ గ్రామం నుంచి 1993లో ఢల్లీికి వలస వచ్చినప్పటి నుంచీ రీతా ఇక్కడే
ఉంటోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, దాదాపు 90.3 లక్షలమంది అదే కారణంతో బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు. రీతా మల్లాప్‌ా అనే జాలరి సముదాయానికి చెందినవారు. బీహార్‌లో నిషాద్, ధీమర్ అని కూడా పిలిచే ఈ కులం ఇప్పుడు షెడ్యూల్డ్ కులంగా నమోదైంది.
ఇక్కడ నివసించే వారిలో చాలామంది యమునానదీతలంలో వ్యవసాయం చేసేవారు, లేదా కూలిపనులు చేసుకునేవారు. ఇంకొందరు మయూర్ విహార్ ఫేజ్-1, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండ్లు, ఐస్‌క్రీమ్, చెరుకురసం వంటివి అమ్ముతుంటారు. సమాచార్ అపార్ట్‌మెంట్స్‌లో సెక్యూరిటీ గార్డులుగా, పనిమనుషులుగా పని చేసేవారు మరి కొందరు. గడ్డి కోతపై ఆధారపడిన రీతా, అయిదుగురు సభ్యులున్న ఆమె కుటుంబం శిథిలావస్థలో ఉన్న తమ ఇంటి బయట కూర్చుని గడ్డిని సన్నసన్నని చీలికలుగా చేస్తున్నారు.
ఆ గడ్డిని పటేరా (టైఫా ఎలిఫెంటినా – ఏనుగు గడ్డి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది) అంటారని హిందీలో మాట్లాడే రీతా చెప్పారు. ‘‘అది అడవుల్లో దానంతట అదే పెరుగుతుంది. దాన్ని పెంచడానికి విత్తనాలు నాటి ఎరువులు చల్లక్కర్లేదు. వ్యవసాయం చేసే వారందరికీ దీని గురించి తెలుసు.’’ ఈ ఉష్ణమండల గడ్డిని పశుదాణాగా, తెగుళ్ళ నివారణకు, కాగితపు గుజ్జు, బయో-ఆయిల్, బయో-గ్యాస్‌ల తయారీకి కూడా వాడతారు. దీని ఔషధ గుణాలతో అనేక రుగ్మతలను నయం చేయవచ్చని ఆయుర్వేదం కూడా చెప్తోంది. అయితే రీతా, ఆమె కుటుంబం ఈ గడ్డిని సేకరించి రైతులకు, కూరగాయలు అమ్మే వారికీ అమ్ముతారు. వారు మండీకి వెళ్ళే ముందు ఆ గడ్డి చీలికలతో ఆకుకూరలను కట్టలుగా కట్టి తీసుకువెళ్తారు.
పాలక్ (పాలకూర), మేథీ (మెంతికూర), కలమి (తూటికూర), సర్సోఁ (ఆవ ఆకులు), బథువా (అడవి బచ్చలి) లాంటి ఆకుకూరలను పటేరా చీలికలతో కట్టలు కడతారు. ఈ ఆకుకూరల కట్టలను కొంటున్నప్పుడు గమనిస్తే, వాటిని పటేరా గడ్డితోనే కట్టినట్లు తెలుస్తుంది.
‘‘ఈ గడ్డి దాదాపు ఐదు నుంచి ఏడు అడుగుల పొడవుంటుంది,’’ వివరించారు రీతా. ‘‘అది అన్ని ఋతువుల్లోనూ దొరికినా, వర్షాకాలంలో మాత్రం అది మాకు పనికిరాదు. భాదో, అశ్విని (సుమారుగా అగస్ట్ నుంచి అక్టోబర్ వరకు)ల మధ్య మాకు పటేరా కోత పని ఉండదు. అప్పుడు కురిసే వానలకు ఆ గడ్డి వాలిపోయి కుళ్ళిపోతుంది.’’
యమునానది వరద మైదానాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వర్షాలు మరిన్ని కష్టాలను కురిపిస్తాయి. ప్రతి వర్షాకాలంలో, ఆమె తన గ్రామానికి తిరిగి వెళ్ళకపోతే, ఆమె కూడా ఇతరుల మాదిరిగానే ఆ నివాస ప్రదేశం నుండి మారి, న్యూ అశోక్ నగర్ స్టేషన్‌ను మయూర్ విహార్-1కి కలిపే ప్రధాన రహదారిపై ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బ్లూ లైన్ మెట్రో వంతెన కింద నివసించాల్సి ఉంటుంది. ఆమె నివసించే చోటు నుండి 10-15 నిమిషాల నడక దూరంలో ఉండే ఈ వంతెన కింద నుండి జీవితం భిన్నంగా కనిపిస్తుంది. తారు రోడ్లు, కాంక్రీట్ భవనాలు, దుకాణాలు, బడులు, హోటళ్ళు, మాల్స్ చుట్టుముట్టి ఉంటాయి. అక్కడి నుంచి చూస్తే ఆ వంతెన కింది జీవితాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. దానికి సరిగ్గా ఎదురుగా, ఒక వెడల్పయిన బురద దారి, ఈ పెద్ద నగరం మధ్యలో ఉన్న పచ్చని పొలానికి మనల్ని నడిపిస్తుంది.
చుట్టూ చెట్లున్నా బావురుమంటోన్న ఖాళీ జాగాలనూ, ఓ జత బాహాటంగా పారే మురుగు కాలవలనూ దాటి ఎదురుగా ఉన్న ఆ సందులోకి నడిస్తే, వలస వచ్చిన వారి నివాస ప్రదేశాలుండే చిల్లా ఖాదర్‌కు చేరుకోవచ్చు. వాళ్ళక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారీగా, విడివిడిగా స్థిరపడ్డారు. రీతా తన రాష్ట్రమైన బీహార్‌కు చెందిన వారితో కలిసి నివసిస్తున్నారు. వలస వచ్చిన వారి మొత్తం సంఖ్యలో 50 శాతం ఉత్తరప్రదేశ్ నుంచి రాగా, 22 శాతం బీహార్ నుంచి వచ్చారని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ 2023లో ప్రచురించిన ఒక నివేదిక చెప్తోంది. సంఖ్యాపరంగా, బీహార్ నుంచి వలస వచ్చే జనాభాది రెండో పెద్ద సంఖ్య.
రీతా చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు దిల్లీ వచ్చారు. ‘‘అప్పుడు నాకు అయిదేళ్ళుంటాయేమో,’’ అన్నారామె. ‘‘అప్పట్లో అక్షర్‌ధామ్ దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు కూడా మావి ఇలా తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలే.’’ ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలని ఆమెకు లేదు. ‘‘ఇక్కడ ఇంత ఖాళీ జాగా ఉంది. పటేరా ఉంది. కావలసినన్ని కట్టెపుల్లలు దొరుకుతాయి. పైగా అద్దె కూడా తక్కువ. ఎవరైనా ఇంకెందుకు వెనక్కు వెళ్ళటం? ఇప్పుడు మా గ్రామంలో కూడా మాకంటూ ఏమీ లేదు.’’
దిల్లీ వచ్చాక ఆమె తల్లిదండ్రులు చేసిన పనినే ఆమె కూడా చేస్తున్నారు. ‘‘మా అమ్మా నాన్నా ఇక్కడికి వచ్చాక పటేరా గురించి తెలుసుకున్నారు. ఓ కొడవలి కొనుక్కుని, పని చేయడం మొదలుపెట్టారు. అది పెరిగే చోటికి వెళ్ళటం, దాన్ని కోసి తెచ్చి, చీలికలుగా చేసి, అమ్మటం, మళ్ళీ అక్కడికి వెళ్ళటం…’’ ఇప్పుడక్కడ అయిదుగురు ఇదే పనిని చేస్తున్నారు: రీతా(37), ఆమె భర్త శంభు (40), వారి ఇద్దరు కొడుకులు – ఒకీల్ (20), సుశీల్ (18), 16 ఏళ్ళ కూతురు రాధ.
‘‘మేమందరం కలిసి పనిచేస్తే, రోజుకు సుమారు 1000 రూపాయలు సంపాదిస్తాం,’’ చెప్పారు రీతా. ‘‘కానీ ఇప్పుడు బియ్యం, పప్పులు, కూరగాయలు, అన్నిటి ధరలూ పెరిగాయి. ఎప్పుడైనా చేపలు వండుకోవాలంటే, వాటిని కొనడానికే ఎక్కువ డబ్బు పోతుంది. ఆ తర్వాత మసాలాలు, నూనె, గ్యాస్ సిలిండర్ – ఇలాంటివన్నీ అదనం. చివరకు కష్టమ్మీద రోజుకు 300 రూపాయలు పొదుపు చేయగలం.’’
‘‘అలా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే, మేం నెలకి కనీసం 10000 రూపాయలైనా సంపాదించడం లేదని తెలుస్తోంది. అందులో రూ. 3500 పాలకే అవుతుంది. దానికి తోడు తేయాకు, పంచదార, అల్లం… కుటుంబం ఉంటే, అది (ఆదాయం) చాలా తక్కువ అనిపిస్తుంది. బట్టలు, మందులు, తిండి ఇలా ప్రతిదానికీ అందులోంచే ఖర్చు పెట్టాలి. దాచుకునేందుకేమీ మిగలదు. పండగలొచ్చినా సరే, అందరం బట్టలు కొనుక్కోలేం. ఆగే తూ లేలే, పీఛే హమ్ లే లేంగే, ఐసా హీ చలతా హై (ముందు నువ్వు కొనుక్కో, మేం తర్వాత కొనుక్కుంటాంలే, అంటూ గడిపేస్తాం),’’ చెప్పారామె.
… … …
అది మే 27, 2025. పటేరాను కోసి తేవడానికి రీతా అడవికి వెళ్తున్నారు. రెండు రోజుల ముందు రాజధానిలో అకాలవర్షం కురిసినా, ఈ రోజు మాత్రం విపరీతమైన వేడిగా ఉంది. అంత పొద్దున్నే ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ, అది 39 డిగ్రీల్లా అనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ప్రజలు వీలైనంత వరకూ ఇళ్ళలోంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అలాంటివేవీ తనకు వర్తించవని రీతాకు తెలుసు. ఆవిడ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకపోతే, ఆవిడ కుటుంబం పస్తులుండాల్సివస్తుంది.
చేతిలో నీళ్ళ సీసాతో, పటేరా గడ్డి కోసి తెచ్చేందుకు రోజూ దాదాపు కిలోమీటరున్నర దూరం నడుస్తారు రీతా. ఆమె కూతురు రాధ, కొడవలి చేతబట్టి ఆమెకు తోడుగా నడుస్తోంది. అది ఒక్క మనిషి వల్ల అయ్యే పని కాదని రీతాకి తెలుసు. చాలాసార్లు రాధ, చిన్నకొడుకు సుశీల్ ఆవిడకు తోడు వస్తారు. ఇవాళ, కాసేపటి తర్వాత వాళ్ళను కలుస్తానని సుశీల్ చెప్పాడు.
కంచె కట్టిన పొలాలను దాటుకుంటూ రీతా, వాటి వెనుకనున్న ఖాళీ జాగాలో పెరిగే పటేరాను చేరుకుంటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ ప్రాంతంలో నీళ్ళు దాదాపు నడుము లోతున కనిపిస్తున్నాయి. ఆ వాసన, చుట్టుపక్కల ఉన్న బురద, ఆ బురద నీటిలో తేలుతోన్న చిన్న చిన్న పురుగులు ఆమెను అందులోకి ప్రవేశించకుండా ఆపలేకపోయాయి. అరిగిపోయిన నీలి రంగు చెప్పులను అంచున వదిలి, చేతిలో ఒక టార్పాలిన్ పట్టాను పట్టుకొని రీతా నీళ్ళలోకి నడిచారు.
ఇంతలో, పొడవుగా ఎదిగిన గడ్డిలోకి మాయమైన రాధ, కాసేపటి తర్వాత కోసిన పటేరా గడ్డిమోపును తలపై పెట్టుకుని తిరిగి వచ్చింది. సరిగ్గా సమయానికి వచ్చిన సుశీల్ ఆ మోపును దించి, దగ్గర్లో ఉన్న పొలంలో ఆ గడ్డిని పరచి ఆరబెట్టడానికి సాయపడ్డాడు. ‘‘నీళ్ళెప్పుడూ మోకాటి లోతున ఉంటాయి. యమున నీరు ఈ ప్రాంతాన్ని వరదతో ముంచెత్తుతుంది. ముళ్ళపొదలే కాకుండా ఇంకా చాలా ఉంటాయిక్కడ. మేం వాటిని తోసుకుంటూ వెళ్తాం. ఈ నీళ్ళెంత మురికిగా ఉంటాయో మీరు ఊహించలేరు. ఇదంతా చేసేది మా జానెడు పొట్టకోసమే,’’ అన్నారు రీతా.
తర్వాతి రెండు గంటల్లో ఆ తల్లీకూతుళ్ళు ఎన్నోమార్లు ఆ నీళ్ళలోకి దిగారు. నడుము లోతు నీళ్ళలో అడుగులు వేస్తూ, పటేరాను కోసి, తలల మీద పదేసి కిలోల బరువున్న మోపులను మోసుకొచ్చి, పొలంలో ఆరబెడుతున్నారు. ఆరిన తర్వాత ఆ గడ్డిని ఈసారి ముప్పై, నలభై కిలోల బరువుండే పెద్ద మోపులుగా కట్టి, ఇంటికి మోసుకెళ్ళి, ఆ గడ్డిని సన్నటి చీలికలుగా చేస్తారు.
పదునైన పటేరా గడ్డి ఆకులు మన వేళ్ళను కోసేయగలవు. రీతా తన చేతుల మీదున్న కొన్ని మచ్చలను చూపించారు. ‘‘చూడండి, ఇవన్నీ అలా కోసుకుపోయిన మచ్చలే. కోసుకుపోయినప్పడు వంటింటి చిట్కా ఏదైనా వాడి చూస్తాం. బాగా నొప్పిగా ఉంటే, కొద్దిగా వేడి నూనెను రాసుకుంటాం. నొప్పి తగ్గిపోతుంది. యమునా మాయి మా గాయాలను, నొప్పులన్నిటినీ తీసేసుకుంటుంది.’’
‘‘మాకు తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఇంజక్షన్, లేదా మందులు వాడతాం. ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రం ఎప్పుడూ వెళ్ళం,’’ చెప్పారు రీతా. ‘‘చిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రికే వెళ్తాం. అక్కడ ఒకరిద్దరు డాక్టర్లున్నారు, రెaాలా ఛాప్ (వైద్యులమని చెప్పుకునేవారు) ఇక్కడికే వస్తారు. వాళ్ళకి యాభయ్యో వందో ఇచ్చి మాత్రలు తీసుకుంటాం. బహుశా మేం బీదవాళ్ళమని వాళ్ళు మాకవే ఇస్తారేమో. ఏమైతేనేం, అవి మాకు పని చేస్తాయి.’’ ఎండిన పటేరా గడ్డిని చీలికలు చేసి, చిన్న చిన్న కట్టలుగా కడతారు. ‘‘రైతులకు కట్ట పది రూపాయలకు అమ్ముతాం.’’ రీతాకు ప్రతి రోజు తెల్లవారుజామున నాలుగింటికే మొదలవుతుంది. కత్తిరించిన పటేరా గడ్డి కట్టలను, ఆమె భర్త శంభు ముఖియా తన సొంత సైకిల్ రిక్షా బండిలో నింపి, అమ్ముకురావడానికి వెళ్ళిపోతారు. ఉదయం 8 గంటలకంతా అందరూ బయటికి వచ్చేస్తారు. ఇంటి పనంతా పూర్తిచేసుకొని రీతా, ఆమె పిల్లలూ అడవికి బయల్దేరతారు. శంభు గడ్డి అమ్మేందుకు బయటకు వెళ్తారు. 100 కిలోల పటేరాను బండిలో వేసుకుని చిల్లా ఖాదర్ చుట్టుపక్కల 3 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో ఉండే పొలాలకూ మండీలకూ వెళ్తారు. అయినా సరుకంతా అమ్ముడుపోతుందన్న నమ్మకమేమీ లేదు.
‘‘అటు యూపీ, హరియాణా వరకూ వెళ్తాం,’’ చెప్పారు శంభూ. ‘‘అవి అమ్ముడు పోకపోతే, అదంతా వెనక్కు మోసుకు రావలసిందే. ఒక్కోసారి సమయానికి తిండి కూడా దొరకదు. తినాలంటే నగరానికి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళి 1000 రూపాయలు సంపాదించి, అందులో 500 తిండికీ నీళ్ళకే ఖర్చు పెడితే, సంపాదించింది సగమై పోతుంది. అమ్ముకోలేని రోజున ఆకలితోనే ఇంటికొస్తాం.’’ ఆయన ఇంటికొచ్చేసరికి రాత్రి పది గంటలవుతుంది.
ఇదిలా ఉంటే, ఈ జనాభా లెక్కల పట్టణంలో వారి ఉనికి నిరంతరం చాలా ప్రమాదంలో ఉంటుంది, ఏ క్షణానైనా మరో కూల్చివేత కార్యక్రమం జరగవచ్చు. ‘జనాభా లెక్కల పట్టణం’ అంటే అధికారికంగా పట్టణం అని ప్రకటించనిదిÑ పట్టణంగా పరిపాలనలోకి రానిది. కనీస జనాభా 5000Ñ చదరపు కిలోమీటర్‌కు 400 జనసాంద్రతÑ కనీసం 75 శాతం మంది పురుష శ్రామికులు వ్యవసాయ వృత్తిలో లేకపోవటం వంటి కొన్ని నగర లక్షణాలు ఉన్నదాన్ని జనాభా లెక్కల పట్టణం అంటారు.
బ్రతుకుబండి ఇన్ని ఇక్కట్ల బాటలో నడుస్తున్నా, రీతా తన పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. పెద్ద కొడుకు ఒకిల్ కుమార్ 12వ తరగతి పూర్తి చేశాడు. సుశీల్ 9 వరకూ చదివి ఆపేశాడు. రాధ 8 వరకూ చదివింది. ‘నాకు 12 ఏళ్ళ వయసులో పెళ్ళయింది. ఇక్కడ నా చిన్న తమ్ముడు పుట్టాడు, అక్కడ నాకు పెళ్ళి జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో జనం 20-22 ఏళ్ళ వయసుకు, కుదిరితే 25 ఏళ్ళ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నాకు ఆ వయసు వచ్చేసరికి ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు. నాకు చదువుకోవడమంటే ఎంతో ఇష్టం. అయితే, ఆ అవకాశమే రాలేదు,’’ అన్నారామె.
మధ్యాహ్న సమయాల్లో పిల్లలకు చదువు చెప్పడానికి ఆమె ఉండే బస్తీకి వచ్చే కొందరు మహిళా సామాజిక కార్యకర్తల ద్వారా, రీతాకు చదువుతో కనీస పరిచయం ఏర్పడిరది. ఆ పద్ధతికి పెద్ద తీరూ తెన్నూ లేకపోయినా, ఆమె తన భర్తతో కలిసి ఉండేందుకు వెళ్ళటానికి ముందు ఆరు నెలలపాటు ఆమె చదువు సాగింది. ‘‘ఆ మేడమ్‌గార్ల చలవ వల్లనే నేనీ రోజు నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లు, అన్నీ రాయగలుగుతున్నాను. నాకు తెలుసు!’’ అంటూ నాకు రాసి చూపించేందుకు త్వరత్వరగా ఒక డైరీ, పెన్నూ తీసుకున్నారు.
నేను చూస్తున్నదల్లా ఆమె ముఖాన్నంతా వెలిగించిన ఒక సగర్వపు చిరునవ్వునే. ఈ కథనం మొదట హిందీలో వెలువడిరది.
