భూమిక ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు : నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా భూమిక సంస్థ పిల్లలతో పనిచేస్తున్న అన్ని ఏరియాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భూమిక ఉమెన్స్ కలెక్టివ్ మహిళలపై, పిల్లలపై జరుగుతున్న జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
ఇందులో భాగంగానే 24 గంటలు పనిచేసే ఒక హెల్ప్‌లైన్ నడుపుతుంది. మన దేశంలో ఎక్కడి నుండైనా సమస్యల్లో ఉన్నవారు ఫోన్ చేయడం ద్వారా ఫోన్లో సలహాలు ఇవ్వడం, వారికి ఎటువంటి సహాయం అవసరం అనే దానికి సంబంధించిన సంస్థలకు అనుసంధానం చేయడం చేస్తుంది. అలాగే హైదరాబాద్, కరీంనగర్, రాజమండ్రి, ఏలూరు, రంపచోడవరం, విజయవాడలలో కౌన్సిలింగ్ సెంటర్లు నిర్వహిస్తుంది. గ్రామాలలోనూ, అర్బన్ బస్తిలలోను మహిళలతో, పిల్లలతో, పురుషులతో, ట్రాన్స్ వ్యక్తులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, శిక్షణ ఇవ్వడం చేస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్‌లు, రెయిన్బో హోమ్స్‌లో పిల్లలకు పలు అంశాలపట్ల అనగా లైఫ్ స్కిల్స్, చైల్డ్ రైట్స్ – సపోప్ట్‌సిస్టమ్స్, సైబర్ సేఫ్టీ, సోషల్ మీడియా ప్రభావము, రాజ్యాంగ హక్కులు- బాధ్యతలు వంటి అనేక అంశాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం చేస్తున్నాము. ఇందులో భాగంగానే బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ భూమిక సంస్థ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్‌లలో, కాలేజీలలో, రెయిన్బో హోమ్స్‌లోను, బస్తీలలో పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాల పట్ల పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవి: పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, వకృత్వము, కథలను చెప్పడం.
ముందుగా పోటీలు నిర్వహిస్తున్న స్కూల్స్ హోమ్స్ బస్తీలలో పిల్లలకు పోటీలు నిర్వహిస్తున్న సందర్భాన్ని వివరించినప్పుడు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పోటీలలో పాల్గొనడానికి వారి పేర్లను ఇచ్చారు.1. పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నివారణ.2. చైల్డ్ సేఫ్టీ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ అనే అంశాల పైన పోస్టర్ మేకింగ్ చేయడం 3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు సావిత్రిబాయిపూలే గురించి వకృత్వ పోటీ నిర్వహణ.4. డ్రగ్ అబ్యూస్, టైం మేనేజ్మెంట్ ఈ రెండు అంశాలపై వ్యాసరచన.5. చదువు యొక్క ప్రాముఖ్యత మరియు రాజ్యాంగ హక్కులు పరిరక్షణ అంశముపై సొంతంగా వారు ఏదైనా ఒక కథను చెప్పడం. పై అంశాలపై పిల్లలందరికీ పోటీలు నిర్వహించినప్పుడు ప్రతి అంశంపై 15 నుండి 20 మంది పిల్లల వరకు పోటీలలో పాల్గొన్నారు.
నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు పోటీలు నిర్వహించిన అన్ని చోట్ల సిఆర్ సి వీక్ గురించి అవగాహన కార్యక్రమాలు చేసాము. స్కూల్స్ మరియు రెయిన్బో హోమ్స్‌లో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కొంతమంది పిల్లలు పాటలు పాడడం, డాన్సులు వేయడం వంటి వాటి ద్వారా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు స్కూల్స్‌లోను, హోమ్స్‌లో నిర్వహించడం వలన పిల్లలలో ఉన్న సామర్థ్యాలను తెలుసుకోగలిగాము అని స్కూల్ టీచర్లు హోం నిర్వాహకులు చెప్పారు. బస్తీలలో, గ్రామాలలో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించినప్పుడు ముందుగా భూమిక గూర్చి పరిచయం చేస్తూ, ఈరోజు జరగబోయే మీటింగ్ ఉద్దేశాన్ని తెలియజేశాము. పాటల ద్వారా పిల్లల్ని ఉత్తేజపరిచి వారికున్న, హక్కుల కోసం అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, ఎదుర్కొంటున్న సమస్యలను వారి ద్వారా చెప్పించాము. వారిలో కొంతమంది పిల్లలు బాల్యవివాహాలను గురించి, షీటీమ్స్ గురించి స్కిట్స్ వేశారు. పాటలు పాడడం డాన్సులు వేయడం చేశారు. అలాగే సంస్థ నుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీమ్ మెంబర్స్ పిల్లల్ని మరింత ఉత్సాహపరచడం కోసం బాలల హక్కులకు వారిపై జరుగుతున్న వివక్షతకు సంబంధించిన చైతన్యవంతమైన పాటలు పాడుతూ పిల్లలని బస్తీ వాసులందరిని అవగాహన కల్పిస్తూ వారు కూడా ఇందులో భాగస్వాములయ్యేలాగా చేశారు. ముఖ్యంగా సిఆర్‌సి వీక్ ఎందుకు నిర్వహించుకుంటున్నాము. దాని ప్రాముఖ్యతను వివరించడం బాలలకు ఉన్న హక్కులు దాని గురించిన అవగాహన అందరికీ ఉండడం గురించి వివరించారు. ముఖ్యంగా బాల బాలికల విద్య ఆరోగ్యం భద్రత అభివృద్ధి పాల్గొనే హక్కుల గురించి వివరించాము. పిల్లలపై జరుగుతున్న హింస, దోపిడి, వివక్షలపై మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను పంచుకుంటూ బాలకార్మిక వ్యవస్థ ప్రస్తుతం ఎక్కువగా కనిపించనప్పటికీ చాలాచోట్ల ఇంకా పిల్లలతో పనిచేయిస్తున్నారు అని కొంతమంది మాట్లాడారు. బాల్యవివాహాలు, బహిరంగ ప్రదేశాలలో పిల్లలపై ప్రత్యేకంగా బాలికలపై హింస గురించి అందరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు నుండి షీ టీం బృంద సభ్యులు వచ్చి షీ టీం ఎలా పనిచేస్తుంది, బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి చర్యలకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు. కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి. పిల్లల భద్రత కోసం ఎలాంటి సహకార వ్యవస్థ ఉంది అనేది వివరించారు. బస్తీ వాసులు కూడా వాళ్ల బస్తీలలో మహిళలకు పిల్లలకు ఉన్న భద్రత గురించి షీ టీమ్ బృందంతో పంచుకున్నారు. ఇలా వారి బస్తీకి మొదటిసారిగా షీ టీం బృందం రావడం, భూమిక సంస్థ ప్రత్యేకంగా పిల్లల కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం వలన బస్తీ వాసులందరికీ నమ్మకం ఏర్పడిరది. అలాగే ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు అనే అవగాహన వచ్చింది అని మాట్లాడారు. పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వారి విద్య, ఆరోగ్యము, రక్షణ, పోషణ విషయంలో అందరూ బాధ్యతగా ఉండడము. భూమిక సంస్థ ద్వారా బస్తీలలో నియమించిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరూ పిల్లల అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో బాధ్యత తీసుకోవాలని రెగ్యులర్గా సిపిసి మీటింగ్స్ నిర్వహించుకోవాలని చర్చించుకున్నారు. పిల్లలు వారి అభిప్రాయాలను ఆలోచనలను పంచుకోవడంలోనూ వారి సొంత విషయాలలో వారిని నిర్ణయాలు తీసుకునేలాగా ప్రోత్సహించడం వారికి సంబంధించిన అన్ని అంశాలు పట్ల వారిని భాగస్వాములు చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి బస్తీలోనూ కొంతమంది పిల్లలు బస్తీ ఛాంపియన్స్‌గా ఉన్నారు. వారందరూ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసం బస్తీ వాసులందరినీ కలిపి ఒక చోటికి తీసుకురాగలడం.
పిల్లల హక్కులకు సంబంధించిన స్లొగన్స్ చెప్పడం, ర్యాలీ నిర్వహించడంలోనూ ముందుండి బాధ్యత తీసుకున్నారు. పిల్లలందరికీ సమాన హక్కులు ఉండడంలోనూ, అవి పొందడంలో వారి పట్ల ఎవరూ వివక్షత చూపకూడదు. సమాన హక్కుల ఉండడం, సమాన అవకాశాలను పొందడం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు దీనికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతైనా అవసరం. వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అని చెప్పడం జరిగింది.
చివరగా పిల్లల ప్రాధమిక హక్కులు అయినా విద్య, ఆరోగ్యము, రక్షణ పొందడం, జీవించే హక్కు వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ వాటికి సంబంధించిన స్లొగన్స్ చదువుతూ మిగిలిన అందరూ అవి పలుకుతూ బస్తీలోని ప్రతి ఒక్క గల్లీకి తిరుగుతూ పిల్లల హక్కుల పట్ల అందరికీ అవగాహన పెంచే విధంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు మిగిలిన బస్తీ వాసులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోటీలలో ఉత్తీర్ణులైన అందరిని ప్రోత్సహించే లాగా చిన్నచిన్న బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆ బహుమతులను వారి తల్లిదండ్రుల ద్వారాను, బస్తీ నాయకుల ద్వారా తీసుకోవడం ఈ చిన్న బహుమతి గెలుచుకోవడం అనేది వారి బస్తీలో వారికొక గుర్తింపుని తీసుకొచ్చిందని పిల్లలు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
