` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
మేం సమర్పించిన మొదటి విడత దరఖాస్తులపై 1985 జనవరిలో అధికారిక నోటిఫికేషన్లు జారీ అవడంతో ఒక్కసారిగా భూస్వాములు అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికార్లు జీతగాళ్లతో ‘ఇకనుంచీ మీరు వెట్టి పనికి వెళ్లనవసరం లేదు, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాల్సినపని లేదు. మీకు నచ్చిన చోట, మంచి జీతం లభించేచోట మీరు పనిచేయవచ్చు’ అని చెప్పారు. తహశీల్దారు వాళ్లకి ప్రాథమికంగా 250 రూపాయల ప్రభుత్వ సహాయాన్ని కూడా అందించారు.
దీనికి తోడు రెండు నెలల్లో నాలుగు వేల రూపాయల పునరావాసం లభిస్తుందని వారికి వివరించారు. ఆ పునరావాసం విలువను మేం మొదట్లో అర్థం చేసుకోలేకపోయాం, వెట్టి చాకిరీ నుంచి విముక్తులైనవారికి బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆ పునరావాసాన్ని బర్రెల రూపంలో ఇస్తానంటే ఒప్పుకున్నాం. కానీ కొద్ది రోజుల్లోనే అది ఎదురుదెబ్బ కొట్టింది. వెట్టి చాకిరీ నుంచి విముక్తులైన కూలీలలను బ్లాక్ డెవలప్‌మెంట్ అధికార్లు దూరప్రాంత పశువుల సంతకు తీసుకెళ్లి కొన్ని బర్రెలను చూపించి ప్రభుత్వ సహాయం కింద వాటిని తీసుకోమన్నారు. కొందరు తీసుకున్నారు. కానీ వాళ్లకి పశుపోషణపై బొత్తిగా అవగాహన లేదు. పాలు ఎలా పితకాలో, ఎలా అమ్మాలో ఏమీ తెలియదు. అందువల్ల కొన్నాళ్లకే వాటిని తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చింది. మరి కొందరు కొన్న బర్రెలు సరైన పోషణ లేక చచ్చిపోయాయి.
జీతగాళ్లు ఆనాటి తమ తొలి విజయాన్ని సంబరంగా జరుపుకోలేక పోయారు. బహుశ పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయన్న నమ్మకం వాళ్లకింకా కలగలేదు. అక్కడక్కడా కొందరు భూస్వాములు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా మాజీ వెట్టి కూలీలను పట్టుకుని తమ బాకీలను చెల్లించమంటూ నిలదీసిన, కొట్టిన సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా నల్లవెల్లి గ్రామానికి చెందిన భూస్వామి రబ్బానీ, మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గుర్రం జంగారెడ్డి అనే భూస్వాములు ఈ దౌర్జన్యాలను మొదలుపెట్టారు. అయితే ఆ ఇద్దరు భూస్వాములను పోలీస్ స్టేషన్‌కు రప్పించినప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా గ్రామస్తులెవరూ నోరు విప్పలేకపోయారు. అయినప్పటికీ ఆ ఇద్దరు భూస్వాములూ అప్పుడు వరుసగా మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి ఇకముందు ఎప్పుడూ మాజీ వెట్టి కూలీల జోలికి వెళ్లమంటూ వారు పోలీసులకు హామీ ఇచ్చారు. గతంలో పోలీస్ స్టేషన్‌లలో పరిస్థితి చాలా దయనీయంగా వుండేది. 1984 ప్రాంతంలో రెడ్డి కులస్థులు తప్ప ఇతరులెవరూ ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లలో అడుగుపెట్టేందుకు సాహసించేవారు కాదు. చెర్లపటేల్‌గూడెంకు చెందిన పాండురంగా రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ మీదా, మధుకర్ రెడ్డి అనే అతను యాచారం పోలీస్ స్టేషన్ మీదా పెత్తనం చేసేవాళ్లు. పాండురంగా రెడ్డి బాగా పలుకుబడి వున్న మాజీ పంచాయితీ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి చిన్న తమ్ముడు. అతను భుజం మీద తుపాకీ పెట్టుకుని మరీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుండేవాడు. రెడ్డి కులస్తులు మినహా ఇతర కులస్తులందరికీ ఆ పోలీస్ స్టేషన్‌లో పైరవీలు చేసిపెట్టేవాడు. కొందరు రెడ్డి కులస్తులు కూడా ఆయనతో పనులు చేయించుకునేవారు. బాధితులు తమ దరఖాస్తులనూ, ముడుపులనూ తెచ్చి పాండురంగా రెడ్డి లేదా మధుకర్ రెడ్డి చేతుల్లో పెట్టి పోలీస్ స్టేషన్ల బయట దూరంగా నిరీక్షిస్తూ కూర్చునే వారు. ఆ పైరవీకార్లు రాసిచ్చిన పిటిషన్ల మీద గుడ్డిగా సంతకాలు పెట్టేవారు. ఆ పైరవీకార్లేమో దర్జాగా పోలీస్ స్టేషన్‌లోపలికి వెళ్తూ వస్తూ వుండేవారు. గత ఇరవై ఏళ్లుగా అంటే 1985లో మేము రంగప్రవేశం చేసేంత వరకూ ఎఫ్‌ఐఆర్‌లన్నీ ఆ ఇద్దరు పైరవీకార్ల చేతి రాతతోనే వున్నాయని అక్కడి పోలీస్ కానిస్టేబుళ్లు నాతో చెప్పారు.
రబ్బానీ, జంగా రెడ్డిల సమన్లూ, రెవెన్యూ అధికార్లు గ్రామాలకు రావడమూ ఒకేసారి జరిగాయి. ఆ అధికార్లే ఒక్కో వెట్టి చాకిరీ కూలీకి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 250 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిని వెట్టినుంచి విముక్తి చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఆవిధంగా మొత్తం ఎనభై మంది కూలీలు వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందారు. దాంతో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. అంతకు ముందు మొదటి దఫా విచారణకు రాని వెట్టి కూలీలంతా వచ్చి తమకు మరో అవకాశం ఇవ్వమని కోరారు. వాళ్ల తరఫున కూడా రిపీట్ పిటిషన్లను సమర్పించాం. ఇతర గ్రామాలకు చెందిన వెట్టి చాకిరీ కూలీలు సైతం వచ్చి వారితో చేరారు.
సరిగ్గా అదేసమయంలో మాకు సీపీఎం పార్టీ నుంచి సమస్యలు ఎదురవడం మొదలయింది. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల చాలా గ్రామాలలో ఆ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు వుంది. రెడ్డి కులానికి చెందిన భూస్వాముల్లో, సంపన్న రైతుల్లో కూడా అత్యధికులు సీపీఎంకి చెందినవాళ్లే. సీపీఐ`ఎంఎల్, న్యూ డెమాక్రసీ గ్రూపునకు చెందిన గోవర్ధన్ రెడ్డి కూడా ఇక్కడి రంగాపూర్ గ్రామస్తుడే. అప్పుడతను పీడీఎస్‌యూ విద్యార్థి. త్వరలో పీడీఎస్‌యూ నాయకుడు కాబోతున్నాడు. చండ్రపుల్లారెడ్డి (సీపీ) గ్రూపునుంచి చీలిపోయి ఏర్పడిన గ్రూపు న్యూ డెమాక్రసీ. నేను కేవలం మాదిగ వాడల్లోనే మీటింగులు పెడుతున్నాననీ, కూలీలను రైతులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాననీ సీపీఎం పార్టీ, గోవర్థన్ విమర్శించేవాళ్లు. గ్రామస్థులతో అంటే ఇతర కులాల వారితో మీటింగులు ఎందుకు నిర్వహించడం లేదని అడిగేవారు. వారి విషయంలో ఎందుకంత అప్రమత్తంగా వుంటున్నారని ప్రశ్నించేవాళ్లు. వారి విషయంలో అంటే అగ్రకులాలతో అన్నది వాళ్ల ఉద్దేశం. రైతులు కూడా పేదవాళ్లే కదా మరి కూలీలను ఆ రైతులకు వ్యతిరేకంగా ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించేవాళ్లు. రైతులూ కూలీలూ పరస్పరం సామరస్యంతో జీవించాలని హితవు పలికేవాళ్లు. ఎరువులనూ, విత్తనాలనూ సబ్సిడీ ధరలకు అందించాలని, రుణాల మీద వడ్డీ రేటు తగ్గించాలని డిమాండ్ చేయాలి తప్ప ఇలా కూలీలకు అధిక వేతనాలు ఇవ్వాలని కోరడం వల్ల రైతులకూ కూలీలకూ మధ్య సంబంధాలు దెబ్బతింటాయనేది వారి వాదన. ఊరిమధ్యన సమావేశాలు నిర్వహిస్తే మాదిగలు స్వేచ్ఛగా పాల్గొనలేరన్న విషయం నాకు తెలుసు. వాళ్లక్కడ నోరు విప్పడానికే వెనకాడతారు. కాబట్టి వారి వాడలో నిర్వహించడమే మేలు. వ్యవసాయ కూలీలు రాజ్యాంగపరమైన తమ హక్కును కోరడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. సంపన్న రైతుల లేదా బీద రైతుల దుస్థితికి భూమిలేని నిరుపేద కూలీలు బాధ్యులు కారు. అలాగే విప్లవ బాధ్యత కూడా వారి భుజాలమీదనే లేదు.
ఈ అన్ని సందర్భాలలోనూ బొజ్జా తారకం మాకు నిరంతరం మద్దతుగా వుంటూ మా మీటింగులలో పాల్గొనేవారు. నిజనిర్ధారణ కమిటీలను రప్పించేవారు. మా బహిరంగ సభల్లో మాట్లాడేవారు. ఆయనతో పాటు కె. నాగయ్య, జె.బి.రాజు, ప్రేమ్ కుమార్‌లు కూడా వచ్చేవారు. నాగయ్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. అనేక దళిత సంక్షేమ సంఘాల్లో పనిచేసేవారు. జె.బి.రాజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసేవారు. నాగయ్య లాగే అనేక దళిత సంక్షేమ సంఘాల్లో పాటుపడేవారు. ప్రేమ్ కుమార్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి. ఎస్.సి. వెల్‌ఫేర్ అసోసియేషన్‌లో చురుకుగా పనిచేసేవారు. అంబేడ్కర్ యువజన సంఘంలో ముఖ్య నాయకుడు.
మొదట్లో మేం వెట్టి చాకిరీ కూలీల తరఫున పిటిషన్లను సమర్పించినప్పుడు అధికార్లు సత్వరమే స్పందించారు. కానీ కొద్ది రోజుల తరువాత భూస్వాముల నుంచీ, స్థానిక రాజకీయ నాయకుల నుంచీ ఒత్తిళ్లు రావడంతో వారిలో స్తబ్దత ఏర్పడిరది. ఒత్తిడి అంతర్గతమైనది కాబట్టి దాని గురించి మాకు వివరంగా తెలియదు. ఆ స్తబ్దతను పోగొట్టేందుకు మేం రెండు రకాలుగా ప్రయత్నించాం. వెట్టి కూలీలను వెట్టి నుంచి విముక్తి చేయకపోవడంపై వాస్తవాలను తెలుసుకునేందుకు ‘సలహా’ సంస్థ ఒక నిజనిర్ధారణ కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక ప్రతులను పత్రికా విలేఖర్లకూ, సీనియర్ అధికార్లకూ అందజేశాం. వెట్టిచాకిరీ కూలీలను ఇంటర్వ్యూ చేసి ఆ కథనాలను పత్రికలలో రాసేందుకు వీలుగా పత్రికా విలేఖర్ల బృందాలను గ్రామాలకు తీసుకెళ్లేందుకు కృషి చేశాం. ఆ సమయంలో ఎస్.ఆర్. శంకరన్ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా క్రియాశీలంగా వున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కలసి ఇబ్రహీంపట్నం సందర్శించారు. తత్ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగంలో మళ్లీ కదలిక మొదలయ్యింది.
ఆరోజుల్లో పత్రికలు మాకు ఒక ఆయుధంలా తోడ్పడేవి. గ్రామాల్లో పత్రికలంటే భగవద్గీతతో సమానం. ఒక వార్త నిజమని నిరూపించేందుకు జనం ‘పేపర్లో వచ్చింది’ అనే మాటను తరచూ ఉపయోగించేవారు. పేపర్లో వచ్చిన వార్తలను చూసి రాజకీయనాయకులు కూడా గాభరాపడేవారు. ఆనాటి పత్రికా విలేఖర్లకు మంచి మనసుండేది. పేదల సమస్యలపై వెంటనే స్పందించేవారు. ఎంత దూరమైనా నడిచి వచ్చేవారు. ఆకలినీ ఎండనూ లెక్కచేసేవారు కాదు. ఇవాళ పత్రికా దిగ్గజాలైన వారిలో చాలా మంది ఆనాడు అతి సామాన్య విలేఖర్లు. జి.ఎస్. వాసు అప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో యువ రిపోర్టర్. స్టాన్లీ థియోడోర్, జి. వెంకటేశ్వర్లు ఇద్దరూ హిందూ దిన పత్రికలో నూనుగు మీసాల విలేఖర్లు. టి. లక్ష్మీపతి, ఆర్. అఖిలేశ్వరి, ఆర్.జె. రాజేంద్ర ప్రసాద్ బాగా పేరున్న సీనియర్లు. ఇబ్రహీంపట్నంలో తను కలుసుకున్న స్త్రీల గురించి అఖిలేశ్వరి దక్కన్ హెరాల్డ్ పత్రికలో వరుస కథనాలు రాసేవారు. నేను వీలున్నప్పుడల్లా పత్రికా కార్యాలయాలకు వెళ్లి రిపోర్టర్లతో స్నేహం పెంచుకునేదాన్ని. నా దగ్గర అనేక వార్తా కథనాలుండేవి. నేను చెప్తుంటే రిపోర్టర్లు శ్రద్ధగా వినేవారు, మనస్ఫూర్తిగా సహకారాన్ని అందించేవారు.
ఈ ప్రచారం కారణంగానే ఇతర గ్రామాల్లోని జనంలో కూడా నమ్మకం ఏర్పడి మరింత మంది మా వద్దకు వస్తుండేవారు. అప్పుడు ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతి సంఘం తన సొంత రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకునేది. ఐక్యతను పెంపొందించుకునేందుకు అది దోహదం చేస్తుందని సంఘం నాయకులు చెప్పేవారు. ఆ ఫండ్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వుండేది. సమావేశాల నిర్వహణకూ, ఇబ్బందులలో వున్న వెట్టి చాకిరీ కూలీలకు ఆర్థిక సాయం అందించేందుకూ ఆ ఫండ్‌ను వెచ్చించేవారు. కొన్ని గ్రామాల్లో సంఘాలు చిట్టీలు కూడా నడిపేవి.
శంకరయ్య, బుగ్గయ్య, నేనూ ఇతర గ్రామాలకు అక్కడివాళ్ల ఆహ్వానం మేరకు వెళ్లడం మొదలుపెట్టాం. ‘మీకోసం నేను ఏం చేయాలో చెప్పండి’ అని గ్రామస్తులను అడిగితే ‘ఏం లేదమ్మా, మా ఊరికి మీరిలా వస్తుంటే చాలు. మిగతావన్నీ మేం చూసుకుంటాం’ అనేవాళ్లు. తరచూ నన్ను ఏదో ఒక చోటుకి తీసుకెళ్లేవారు, తమ సమావేశాల్లో కూర్చోబెట్టుకునేవారు. చట్టం గురించి అందరికీ చెప్పమని కోరేవాళ్లు. నేను చెప్పిన తరువాత తమ నిర్ణయం తాము తీసుకునేవారు. క్రమంగా ఆ మీటింగ్‌లు కుల సమావేశాల్లాగా లేదా మాదిగల పంచాయితీల్లాగా అనిపించేవి నాకు. అక్కడ ఇతర కులాలవారు కూడా వుండేవారు కానీ మాదిగలే ఆ సమావేశాలను నిర్వహించేవారు. సమావేశాలు ఎప్పుడూ మాదిగల వాడలోనే జరిగేవి. గ్రామంలో అందరికంటే మాదిగలదే అట్టడుగువర్గం. బయటి వాడల్లో అయితే వాళ్లు అంత సౌకర్యంగా పాల్గొనలేరు కాబట్టి సమావేశాలు వారి వాడలో జరగడమే సబబని నాకు అనిపించింది. అదీకాక వ్యవసాయ కూలీలలో అత్యధికులు మాదిగలే. ఆ సమావేశాలకు సాధికారికత కల్పించేందుకు మాదిగ కుల పెద్దలు కూడా వాటిలో పాల్గొనేవారు. కానీ వేదిక ఎక్కేవారు కాదు. సాధారణంగా ఎవరి పేరు పిలిస్తే వారే ముందుకు వచ్చేవారు. ‘ఓ కిష్టయ్యా ఈ పనికి నువ్వైతేనే సరిగ్గా వుంటుంది’ అని ఎవరో ఒకరు అనేవారు. లేదా ‘ఓ చంద్రమ్మా అందరూ నీ మాటే వింటారు కాబట్టి నువ్వే వుండాలి’ అనేవారు. ఒకోసారి అలా నామినేట్ చేయబడ్డ వ్యక్తి ఏవో వ్యక్తిగత కారణాలు చెప్పి వెనక్కి తగ్గేవారు. ఈ సమావేశాల్లో చాలామంది ఇతర మహిళలు కూడా పాల్గొనేవారు. వారిలో కొందరు నన్ను కలుసుకునేందుకు ఆసక్తి కనబరిచేవారు. నా పక్కన కూర్చునేందుకు వచ్చేవారు. నాకు మార్గదర్శకంగా పలు విషయాలను వివరించేవారు. అలా మహిళలు నా చుట్టూ గుమికూడినప్పుడు మొదట్లో అలా నన్ను విసిగించవద్దని, దూరంగా వెళ్లిపొండని వారిని మగవాళ్లు అడ్డుకునేవారు. ‘ఫరవాలేదు ఏం అడుగుతారో అడగనివ్వండి’ అంటూ నేను వారితో మాటలు కలిపేదాన్ని. వాళ్లు నన్ను తమ అక్కున చేర్చుకున్నారు. నిద్రపోవాల్సిన సమయంలో కూడా వాళ్లు నన్ను వదిలేవాళ్లు కాదు. ప్రొద్దున్నే దొడ్డికి బయలుదేరినా, మరో ఊరికి వెళ్తున్నా తోడుగా వచ్చేవారు. అయితే భోజన సమయంలో మాత్రం ఒక్కసారిగా మాయమైపోయేవారు. నాకు అన్నం పెడుతున్న ఇంటివాళ్లకు తాము భారం కాకూడదన్నది వాళ్ల ఉద్దేశం.
సమావేశాల్లో చురుకుగా పాల్గొనే మహిళలంతా ముఫ్పై ఏళ్ల వయసు దాటిన వారే. కొందరి పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయిపోయాయి, మనవలూ మనవరాళ్లున్నారు. భర్త చనిపోయిన స్త్రీలు కూడా కొందరున్నారు. మా మీటింగులకి వెళ్లకూడదని ఏ మహిళ భర్తా అడ్డుచెప్పేవాడు కాదు. ఆ మహిళల్లో మహామాటకారులు, లొడలొడ వాగేవారు, మౌనంగా, గంభీరంగా వుండేవారు` రకరకాల వాళ్లుండేవారు. అయితే అందరూ ఉల్లాసంగా, చురుకుగా కనిపించేవారు. అందంగా, ధైర్యంగా, దయగా కూడా వుండేవారు. వాళ్లంతా ఎలాంటి సమూహాల్లోనైనా స్పష్టంగా మాట్లాడగలిగేవారు.
అలాంటి మహిళల్లో యాచారం గ్రామానికి చెందిన ఎలిమినేటి చంద్రమ్మ ఒకరు. ఇద్దరు పిల్లలు చిన్నగా వున్నప్పుడే ఆమె భర్త చనిపోయాడు. అప్పటి నుంచీ ఆమె ఒంటి చేత్తో ఇంటిని నడుపుకుంటూ వస్తోంది. ఆ ఊళ్లోనే నెలకు కేవలం ఇరవై రూపాయల జీతంతో వీధులు ఊడ్చే పని చేసేది. మొదటిసారి నేను ఆమెను కలుసుకున్నప్పుడు తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను ఏ మగాడికీ లొంగలేదమ్మా’ అని గర్వంగా చెప్పింది. ఆ మాటను అర్థం చేసుకునేందుకు నాకు కొన్ని నెలలు పట్టింది. మన సమాజంలో ఒక ఒంటరి మాదిగ మహిళ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో నాకు తెలిసింది. అడుగడుగునా పదురైన అనుభవాలే ఆమెను రాటు దేలేట్టు చేశాయి. ఏదైనా సలహా కోసం అందరూ ఆమె దగ్గరకే వచ్చేవారు. యాచారం లోని వెట్టి చాకిరీ కూలీలు పనిలోకి వెళ్లకుండా సమ్మెకు దిగినప్పుడు వారి తరపున భూస్వాముల వద్దకు ఆమే ధైర్యంగా వెళ్లి వారి డిమాండ్లేమిటో చెప్పివచ్చింది. యాచారం గ్రామం మాకు ఎంతో ముఖ్యమైన గ్రామం. ఆ తరువాతి కాలంలో మేం అనేక మీటింగులను అక్కడే నిర్వహించాం. సాధారణంగా చంద్రమ్మ ఎప్పుడూ నా పక్కన కూర్చుని నేను ఏమైనా మరిచిపోతే గుర్తుచేస్తుండేది. నాకు తెలియని విషయాలు చెప్తుండేది.
నలభై ఏళ్ల చంద్రమ్మ పంతో అందంగా వుండేది. వయసు ప్రభావం వల్ల కొన్ని గీతలు పడ్డప్పటికీ ఆమె ముఖం ప్రసన్నంగా, నవ్వు తొణికిసలాడుతూ వుండేది. చాలా సన్నగా వుండేది, సున్నితంగా కనిపించేది కానీ అవసరమైనప్పుడు గట్టిగా వ్యవహరించేది. నవ్వు మొహం, మెరిసే కళ్లు. అయితే రోజు రోజుకూ మా పని ఒత్తిడి పెరగడం వల్ల నేను ఆమెను ఇదివరకటి మాదిరిగా తరచూ కలవలేకపోయేదాన్ని. అలా వుండగా ఒక రోజు హఠాత్తుగా చంద్రమ్మ ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలిసింది. నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె తన కొడుకుతో పాటు కలసి వుండేది. ఆరోజు కొడుకుతో ఏదో గొడవ జరిగిందట. అంతే, అదే రాత్రి ఆమె ఇంటి దూలానికి ఉరి వేసుకుని చనిపోయింది. అప్పుడు నేను జబ్బార్‌గూడెం భూ తగాదా ఆందోళనలో తలమున్కలై వున్నాను. అయినా చంద్రమ్మ కోసం కొంత సమయాన్ని వెచ్చించలేకపోవడంలో అర్థం వుందా? అది తలచుకుంటే నాకు ఇప్పటికీ చాలా బాధ కలుగుతూ వుంటుంది.
పేతుల గ్రామానికి చెందిన బచ్చమ్మ కూడా నాకు స్వయంగా ఒక సంరక్షకురాలిగా వుండేది. ఎలాంటి వాదనల్లో నైనా, ఎవరితో నైనా సరే చంద్రమ్మ కంటే గట్టిగా మాట్లాడేది. ఆమె భర్త రైల్వేలో పనిచేసేవాడు. అందుకే ఆర్థికంగా మిగతా వారి కంటే తన పరిస్థితి కాస్త మెరుగ్గా వుండేది. నెలనెలా పెన్షన్ వచ్చేది. చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లేటప్పుడు నాకు తోడుగా వచ్చేవాళ్లలో ఆమె కూడా ఒకరు. అంతే కాకుండా ఆమెకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది బంధువులు వున్నారు. వాళ్లతో మాట్లాడి వారిని మా సంఘంలో చేర్పించేందుకు ప్రయత్నించేది.
నేను బాగా ఇష్టపడిన మరో మహిళ గట్టు రాములమ్మ. నేను ఎంతో అభిమానంగా ఫ్రేమ్ కట్టించుకున్న రాములమ్మ ఫొటో ఒకటి ఇప్పటికీ నా టేబుల్ మీద వుంది. వృద్ధాప్యం వల్ల మొహం ముడతలు పడి గీతలు తేలినప్పటికీ ఎంతో బాగుండేది. మనసులోకి దూసుకుపోతున్నట్టుండే ఆమె చూపులు ఇప్పటికీ నన్ను వెంటాడుతుంటాయి. ఇబ్రహీంపట్నంలో నాకు తెలిసిన స్త్రీ లందరిలో పెద్దది రాములమ్మే. ఇక్కడ ఆమె కొడుకు గట్టు బాషా గురించి ఒక మాట చెప్పాలి. అతను ఎలిమినేడులో మాదిగల నాయకుడిగా వున్నప్పుడు ఆ ఊళ్లో అత్యంత దుర్మార్గుడూ, శక్తిమంతుడూ అయిన భూపాల్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎలిమినేడులో కూలీలు సమ్మె చేసినప్పుడు అతని పంట వాటాను భూస్వామి ఎగ్గొట్టారు. అతని సోదరుడొకరు అప్పును తీర్చలేదనే సాకుతో బాషా సాగు చేసిన భూమిలో మూడు నెలల పంటను స్వాధీనం చేసుకున్నాడు. ఎలిమినేడులో అత్యంత మిలిటెంట్ వ్యక్తుల్లో గట్టు బాషా ఒకరు. అతను పోరాటాల్లో పాల్గొనేందుకు ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు. అయితే పరిస్థితులను కూడా అంతే జాగ్రత్తగా అంచనా వేయగలిగేవాడు. బస్సు సౌకర్యంలేని గ్రామాలకు నేను అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు అతనే నన్ను సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుండేవాడు. వాయు వేగంతో దూసుకువెళ్లేవాడు. బక్కగా కనిపించినప్పటికీ ఎంతో బలంగా వుండేవాడు. చిన్న కళ్లు, చురుకైన మొహం. సూటిగా, పదునుగా మాట్లాడే మాటలకు అతని మేక గడ్డం తగ్గట్టుగా అనిపించేది. జబ్బార్‌గూడెం భూ పోరాటంలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాల్లో అతని కుటుంబం కూడా ఒకటి. కానీ అతనెప్పుడూ అందుకు విచారించలేదు. పైగా జబ్బార్‌గూడెం మాదిగలెవరైనా గొడవచేస్తే వారిని గట్టిగా మందలించి, ‘మీ కోసం ఎలిమినేడు మాదిగలు ఎన్నో కష్టాలపాలైతేనే మీకు భూములు లభించాయి’ అంటూ వారిని శాంతింపజేశాడు.
బాషా తల్లి గట్టు రాములమ్మ ఇంటి బరువు బాధ్యతలన్నీ తీరి స్వేచ్ఛగా వుండేది. నేను ఇతర గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆమె నాకు తోడుగా వచ్చేది. ఆమె బిడ్డలకు మనవరాళ్లు, మునిమనవరాళ్లు వున్నారు. అంటే ఆమె తన తర్వాత ఐదు తరాలను చూసింది. ఆరోజుల్లో ఆడపిల్లలు కేవలం పదమూడేళ్ల వయసులోనే బిడ్డ తల్లులైపోయేవారు. ఇరవై ఆరేళ్ల వయసు లోనే కొందరు అమ్మమ్మలై పోయేవారు. మేం వెళ్లిన ప్రతి గ్రామంలో రాములమ్మ సంతతి ఎవరో ఒకరు వుండేవారు. ఆమె వాళ్ల ఇళ్లకు వెళ్లి వస్తుండేది. ఒకప్పుడు తను ఎన్ని కష్టాలు పడిరదో రాములమ్మ తరచూ నాకు చెప్పేది. ఇతర ఆడపిల్లల మాదిరిగానే ఆమెకు చాలా చిన్న వయసులో పెళ్లయింది. పిల్లల్ని కన్నది. ఆమె భర్త కూడా చాలా చిన్న వయసులోనే పిల్లల బాధ్యతను రాములమ్మ భుజాల మీద వేసి పోయాడు. తన పిల్లల్ని ఆమె ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆ రోజుల్లో కోతలు అయిపోయిన తరువాత పంట పొలాల్లో మిగిలిన పరిగెను సేకరించి జల్లెడపట్టి తాలు గింజల్ని తెచ్చి పిల్లలకు వండి పెట్టేదాన్నని ఆనాటి కష్టాలను గుర్తుచేసుకునేది. కట్టుకోడానికి బట్టలు లేకపోవల్ల పెద్ద సంచులను కలిపి కుట్టి చీరెను తయారుచేసుకునేదట. అయినా తను ఇంకో మగవాడి తోడు కోసం ఎన్నడూ చూడలేదు అని చెప్పింది. ఆ వయసులో కూడా ఆమె తల వెంట్రుకలు నెరవలేదు. నల్లగా నిగనిగలాడుతూ వుండేవి. సూదిలోకి చాలా సులువుగా దారం ఎక్కించగలిగేది.
అయితే, వృద్ధాప్యం వల్ల అప్పుడప్పుడూ మతిమరుపునకు గురయ్యేది. నాకు ఎలాంటి దుస్తులు ధరించాలో, జనంతో ఎట్లా మాట్లాడాలో, గ్రామ సమస్యలను ఎట్లా చూడాలో చెప్పే తను మాట్లాడుతూ మాట్లాడుతూనే నేను ఎవర్నో మరచిపోయేది. ‘గీతమ్మ అనే ఒక పడుచు పిల్ల పట్నం నుంచి ఇక్కడికి వచ్చి మాదిగలకు చానా సహాయం చేస్తుండేది’ అని నాతోనే చెప్తుండేది. ఎవరైనా మన గురించి గొప్పగా చెప్తుంటే సంతోషంగా వుంటుంది కదా. అందుకే నేను అడ్డు పడకుండా ఆమె మాటల్ని అలాగే వింటుండేదాన్ని.
చంద్రమ్మ, బచ్చమ్మ, రాములమ్మ, మరికొంతమంది ఇతర మహిళలు ఇబ్రహీంపట్నంలో నాకు గురువులు. వాళ్లు నాకోసం ఎంతో సమయాన్ని వెచ్చించి చాలా విషయాలు వివరిస్తుండేవారు. ఏం చేస్తే మంచిదో చెప్పేవాళ్లు. ఒకసారి పెద్దతుండ్ల గ్రామంలో ఒక రెడ్డి ఇంటి కోడలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్తే ఆమెను స్వయంగా తన తండ్రి దగ్గర పడుకొమ్మని ఒత్తిడి చేసేవాడని అంటారు. ఆ మాట విన్నాక నా రక్తం సలసల మరిగిపోయింది. వెంటనే ఆ ఊరికి వెళ్లి ఆడవాళ్లందరినీ కూడదీసి ఆ తండ్రీ కొడుకులకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాను. కానీ వీళ్లంతా వద్దంటే వద్దన్నారు. ఆ స్త్రీలు అలాంటి చెత్త భర్తల్ని వదిలేయడానికి సిద్ధపడనంతవరకూ మనం ఏం చేయలేం అన్నారు. మనం జోక్యం చేసుకుంటే ఆ రెడ్డి కులంలోని మగవాళ్లూ ఆడవాళ్లూ అందరూ ఒక్కటై మన మీదనే దాడులకు దిగుతారని చెప్పారు. నేను వాళ్లతో చాలా సేపు వాదించాను, అనేక విధాలుగా తర్జనభర్జనలు పడ్డాను. చివరికి వాళ్ల సలహానే పాటించాల్సి వచ్చింది.
ఇక్కడికి వచ్చిన కొత్తలో కొన్ని ఇళ్లలో చూసిన దుర్భరమైన పేదరికం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసేది. కొందరు ఒక పూరింటి వైపు చూపిస్తూ ‘ఈ ఇంట్లో మూడు రోజుల సంది పొయ్యి ముట్టించలేదమ్మా’ అని చెప్పారు. ఆ ఇంట్లోని పిల్లలు ఆకలిని ఎలా తట్టుకుంటున్నారు మరి అని అడిగితే ఇరుగు పొరుగు వాళ్లే అప్పుడప్పుడు ఆ పిల్లలకు తిండి పెడుతుంటారట. నేను ఆ వాడలో కొన్ని పెళ్లిళ్లు చూశాను. కొత్త పెళ్లి కూతురు ఒక చాపను, ఇత్తడి చెంబును, కొన్ని అల్యూమినియం పాత్రలను, ఒక జత బట్టలను వరకట్నం కింద తనతో తెచ్చుకుంటుంది. పెళ్లికి వచ్చిన బంధువులకు పచ్చి పులుసుతో భోజనం పెట్టేవాళ్లు. చింతపండు, తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చి మిరపకాయలతో ఆ పచ్చి పులుసును తయారు చేస్తారు. నేను ఆ పెళ్ళిళ్లకు హాజరయ్యే దాన్ని. పెళ్లికి వచ్చిన బంధు మిత్రుల్నీ, వారు వేసుకున్న దుస్తుల్నీ, పెండ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బైండ్ల పురోహితుడ్నీ, అక్కడ కేరింతలు కొడుతూ ఆడుకునే పిల్లల్నీ ఎంతో ఆసక్తితో గమనించేదాన్ని. వాళ్లు కూడా నా వంక అంతే ఆసక్తితో చూసేవారు.
11. యజమానుల కోరలు పెరకడం
గ్రామీణులు సంఘటితమవుతున్నారు. శంకరయ్యా, బుగ్గయ్యా, నేనూ` ముగ్గురం కలసికట్టుగా, ఉత్సాహంగా పనిచేస్తున్నాం. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుంది. పైపైన పనిచేయడం ఇక ఎంతమాత్రం కుదరదు. మాకో సంస్థ కావాలి. మా గురించి మేం చెప్పుకునేందుకు ఏదో ఒకటి కావాలి. ఏ విషయమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మాకో చట్టబద్ధమైన గుర్తింపు వుండాలి. మా నియోజకవర్గం బయట ప్రాతినిధ్యం వహించేందుకు మాకంటూ ఒక వేదిక అవసరం. వ్యక్తిగత స్థాయిలో కాకుండా అంతకంటే ఉన్నతంగా ఆలోచించేందుకూ, పనిచేసేందుకూ, ముందుకు వెళ్లేందుకూ సొంత సంస్థ కావాలి.
1985 మార్చిలో ‘‘ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం’’ (ఐటీవీసీఎస్) పేరుతో కార్మిక శాఖ వద్ద ఒక ట్రేడ్ యూనియన్‌ని రిజిస్టర్ చేసుకున్నాం. దానిని క్లుప్తంగా ‘సంగం’ (సంఘం) అని పిలుచుకునేవాళ్లం. వ్యవసాయ కార్మికుల వేతనాలు, బలవంతపు పని, నష్టపరిహారం వంటి సమస్యల విషయంలో ప్రాతినిధ్యం వహించేందుకు స్వచ్ఛంద సంస్థ కంటే ట్రేడ్ యూనియన్ అయితేనే బాగుంటుంది.
ఇదేమంత సులభమైన ప్రక్రియ కాదు. ఏ సంస్థకైనా ముందుగా నియమ నిబంధనలూ, మానిఫెస్టో కావాలి. సిరిల్, బుగ్గయ్య, శంకరయ్యల సహకారంతో నేను వాటిని తయారుచేశాను. మొదట అవి చాలా బాగున్నాయనే అనుకున్నాం. కానీ, వాటితో ట్రేడ్ యూనియన్‌ను రిజిస్టర్ చేసుకోవడం కుదరదని లేబర్ ఆఫీసు సిబ్బంది తిరస్కరించారు. చివరకు మేం ఆ నియమ నిబంధనలు ఎలా వుండాలో వాళ్లనే రూపొందించమన్నాం (అందుకు ముడుపులు కూడా చెల్లించుకున్నాం). మార్చిలో జరిగిన మొదటి సమావేశంలో నియమనిబంధనల ప్రకారం మా సంఘం కార్య నిర్వాహకులను ఎన్నుకున్నాం (శంకరయ్య అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిని). సాధారణ ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిగాయి. అయితే మా సర్వసభ్య సమావేశాలు గ్రామ సభల మాదిరిగా జరిగేవి. ప్రతి ఒక్కరూ వాటిలో పాల్గొనేవారు. ఒకవిధంగా అవి కుల పెద్దలు నిర్వహించే కుల సమావేశాల్లా వుండేవి. మా సంఘంలో చేరిన ప్రతి సభ్యుడికీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో పాటు ఒక ఐటీవీసీఎస్ గుర్తింపు కార్డును ఇచ్చాం. అది వారికి అనేకవిధాలా ఉపయోగడేది. మండల కార్యాలయానికి, కలెక్టర్ ఆఫీసుకు వెళ్లినప్పుడు దానిని వారు తమ గుర్తింపుగా చూపించుకునేవారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు మాత్రం జాగ్రత్తగా వుండాల్సి వచ్చేది. అక్కడ కార్డు చూపించడమంటే తరచూ లాఠీ దెబ్బలు తినడమే.
మా యూనియన్‌ను రిజిస్టర్ చేసిన కొన్నాళ్లకే 1985 మే 25న ఎన్.టి. రామారావు తెలుగు దేశం ప్రభుత్వం మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మండల రెవెన్యూ వ్యవస్థ (ఎం.ఆర్.ఒ.) చాలా కొత్త. ప్రతి జిల్లాను వివిధ మండలాలుగా విభజించారు. అంతకు ముందు తాలూకా తహశీల్దారుకు ఏ అధికారాలు వుండేవో వాటన్నింటినీ ఎంఆర్‌ఓకు బదిలీ చేశారు. ఎన్.టి. రామారావు ప్రభుత్వం మండలాల ఏర్పాటుతో పాటు వారసత్వ పట్వారీ వ్యవస్థను కూడా రద్దు చేసింది. పట్వారీలు గ్రామ సహాయకులుగా (విలేజ్ అసిస్టెంట్లుగా) మారిపోయారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం జీతభత్యాలను నిర్ణయించింది. ప్రతి విలేజ్ అసిస్టెంట్ ఐదారు గ్రామాలను చూసేవాడు. ఇబ్రహీంపట్నం తాలూకాను ఐదు మండలాలుగా విభజించారు. అవి ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, మహేశ్వరం, కందుకూరు మండలాలు.
ఆరోజుల్లో మా దృష్టి ప్రధానంగా యాచారం మీద వుండేది. అయితే ఇబ్రహీంపట్నంలోని మిగతా మండలాల్లో కూడా మా కార్యక్రమాలు జరుగుతుండేవి. తహశీల్ వ్యవస్థతో పోలిస్తే మండల వ్యవస్థ జనానికి ఎక్కువ ఉపయోగకరంగా అనిపించింది. తహశీల్దారు సువిశాల ప్రాంతాన్ని ఏలే అత్యంత శక్తిమంతుడు. అతనొక గెజిటెడ్ ఆఫీసర్. ఆ పదంలోనే ప్రతి ఒక్కరికీ అతనికి అపారమైన అధికారాలు వుంటాయన్న భావనను కలిగించేది. గెజిటెడ్ ఆఫీసర్లు కార్యనిర్వాహక/ యాజమాన్య స్థాయి ప్రజా సేవకులు. వారికి అధికారిక ముద్ర వేసే అధికారం భారత రాష్ట్రపతి లేదా ఆయా రాష్ట్రాల గవర్నర్‌ల నుంచి లభిస్తుంది. ఈ కొత్త మండల రెవెన్యూ అధికార్లు (ఎంఆర్‌ఓలు) కూడా గెజిటెడ్ అధికార్లు కావచ్చు, కానీ వారిలో చాలామంది గెజిటెడ్ అధికార్లు కారు. కొత్తగా నియమించబడ్డ ఎంఆర్‌ఓలు సాధారణంగా యుక్త వయసు పురుషులు (స్తీల సంఖ్య తక్కువ). వారికి పేదప్రజలను కను చూపుతోనే హడలగొట్టడం అప్పటికింకా తెలియదు. అంతకు ముందు దూర ప్రాంత గ్రామాల జనం ఏదైనా పనిమీద తహశీల్ కార్యాలయానికి వెళ్లి రావాలంటే రెండ్రోజుల సమయం పట్టేది. ఎందుకంటే పనయ్యాక అదేరోజు తమ గ్రామం తిరిగి వచ్చేందుకు బస్సు సౌకర్యం వుండేది కాదు. ఇప్పుడు దూరం తగ్గడం వల్ల మండల కార్యాలయానికి ఒక్కరోజులో వెళ్లి రావడం సులభమైపోయింది.
