కార్పొరేట్ 2013లో పేస్ బుక్ ప్రధాన ఆపరేషన్స్ మేనేజర్‌గా కొన్నేళ్ల నుండి పని చేసిన షెరిల్ సాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్: విమెన్, వర్క్ అండ్ విల్ టు సక్సీడ్ పుస్తకాన్ని టైం మ్యాగజిన్ స్త్రీవాదాన్ని రీబూట్ చేసే విప్లవాత్మకమయిన పుస్తకంగా వర్ణించింది. తన వ్యక్తిగత అనుభవాన్ని భూమికగా తీసుకున్న సాండ్ బర్గ్ పని స్థలాల్లో గ్లాస్ సీలింగ్‌ని బద్దలు కొట్టి, మగవాళ్ళతో సమానంగా పై స్థానాల్లోకి చేరుకోవటానికి ఆడవాళ్లు మగస్వామ్య సంస్కృతికి తలొగ్గి (‘లీన్ ఇన్’) వాళ్ళు అవలంబించే ధోరణిని అనుకరించాలనే సూత్రాన్ని ప్రతిపాదించింది.
స్త్రీలు ముందుకు దూసుకుపోయే స్వభావం అలవర్చుకోవాలని, సమాజం స్త్రీలల్లోకి కూర్చిన భయాలని వదిలించుకోవాలని, ముఖ్యంగా పని స్థలాల్లో పై మెట్టు ఎక్కటానికి భయ పడకూడదని, అలాంటి ఆశయం కోసం ఎంతయినా పని చెయ్యాలనే వైఖరి అలవర్చుకోవాలని ఈ పుస్తకం వాదించింది. అన్నింట్లో సహకరించే సమాన జీవిత భాగస్వామిని వెతుక్కోవాలని, ఇంట్లో అన్ని పనులూ తామే చెయ్యాలని, ఇల్లంతా చక్కదిద్దినట్లు ఉండాలని భావించే వైఖరిని వదిలించుకుని, కొంత చిందరవందరగా ఉన్న ఇంట్లో ఉండటం అలవర్చుకోవాలని, అప్పుడే కెరీర్ లో పైకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్తుంది.
సాండ్ బర్గ్ 1969 లో పుట్టి, కులీన యూనివర్సిటీల్లో చదువుకుని, ప్రపంచ బ్యాంకుతో సహా అనేక చోట్ల ‘ప్రపంచ దారిద్య్రాన్ని నిర్మూలనకి’ పని చేసి, తర్వాత ప్రయివేటు సెక్టార్‌కి మారి, 23 ఏళ్ల జుకర్ బర్గ్ ఆధ్వర్యంలో పెద్దదవుతున్న ఫేస్‌్‌బుక్‌లో చేరారు. పని స్థలాల్లో తోటి ఆడవాళ్ల ఇబ్బందుల్ని గుర్తించి, వాటిని తొలగించటానికి రాయటమే కాకుండా సాండ్ బెర్గ్ దానిని కొంత ముందుకు తీసికెళ్లారని చెప్తారు. పుస్తకం తర్వాత లీన్ ఇన్ ఫిలాసఫీతో క్లబ్బులు మొదలయ్యాయి. పని స్థలాల్లో ఆడవాళ్ల అవకాశాల్ని, ఇబ్బందుల్ని అవి చర్చించాయి. ఫేస్ బుక్ తర్వాత మెటాలో మెటర్నిటీ లీవ్, పిల్లల్ని చూసుకోవటానికి వసతులు వీటి వల్లే వచ్చాయని కూడా చెప్పుకుంటారు. కొంత మంది తను స్త్రీవాది అని రాశారు. ఆమె చదువుకున్న సమయంలో స్త్రీవాద ఉద్యమ ప్రభావం అమెరికన్ సమాజం, విశ్వవిద్యాలయాల్లో బాగా ఉన్నప్పటికీ ఆమె దాని ప్రభావం తన మీద పడ్డట్లు ఏ సందర్భంలో అసలు మాట్లాడ లేదు. ఆ విలువలు పాటించలేదు. పుస్తక రచనలో పాల్గొన్న నెల్ స్కోవల్ పేరు చివరి పేజీల్లో ఉంటుంది. మెటా కొన్ని లక్షల అకౌంట్ల సమాచారం వాళ్లకి చెప్పకుండా వేరే కంపెనీలకి అమ్మేసినప్పుడు ఆవిడ కల్పించుకోలేదు. ఆమె లేకుండా మెటా ఆ స్థాయికి వెళ్ళటం అసాధ్యం కానీ, కంపెనీ లాభాలు, ప్రాధాన్యాలని ఆమె ఏ రకంగా కూడా స్త్రీలందరి జీవితాలని మెరుగుపరిచే వైపు దాన్ని నడిపించలేదు.
సాండ్ బర్గ్ సనాతనం నుండి ఉదారవాదిగా మారిన వ్యక్తి. సమాజం మనలోకి చొప్పించే భావజాలాన్ని వదిలించుకుని వ్యక్తిగత స్థాయిలో కష్టపడి అందరూ పని చేస్తే కెరీర్‌లో పై పై కి వెళ్తారని నమ్ముతుంది. అసలు ఆమె చర్చించే ఈ ‘స్త్రీలు’ ఎవరు? ఇల్లు, మొగుడు, కుటుంబం, చదువు, కెరీర్, పిల్లలు, ఆర్ధిక వెసులుబాటు అన్నీ కలిగిన ఎగువ మధ్య తరగతి స్త్రీలు. అప్పటికే చదువు, ఇతర ఆధిక్యతల కారణంగా నాయకత్వ స్థానం లోకి చేరుకొని ఆమె లాగా అందరి కంటే పై స్థాయి లోకి వెళ్లాలనే కోరిక ఉన్నవాళ్లు. అంటే, పనిస్థలాల్లో ఇప్పటికే వున్న మహిళల్లో వీళ్ళు అతి చిన్న శాతం. మరి తన రచనని ‘స్త్రీలు నేర్చుకోవాల్సిన’ సంస్కృతిగా స్త్రీ-పురుష సమానత్వం చట్రంలో ఎందుకు చర్చిస్తున్నట్లు? ఇక్కడే స్త్రీవాదం, స్త్రీ పురుష సమానత్వం ఎవరు, ఎందుకు, ఎట్లా ఉటంకిస్తున్నారనేది, అంటే, దాని రాజకీయాలు అర్ధం చేసుకోవటం అవసరం.
అన్ని సమాజాల్లో మెజారిటీ ఆడవాళ్లు బండ చాకిరీ అన్ని స్థాయిల్లో చేస్తూనే వచ్చారు. వ్యవసాయం నుండి బట్టలు నెయ్యటం, రాళ్లు కొట్టటం నుండి గనుల్లో పని చెయ్యటం, ఫ్యాక్టరీల నుండి ఇతరుల ఇళ్లల్లో పని చెయ్యటం వరకూ, టీ తోటల్లోంచి, అరటి తోటల వరకూ వందల రకాల పనులు బయట వాళ్ళు చేసే పనుల్లో కొన్ని. ఇళ్ళనుండి బయటికి పనులు తరలిన తర్వాత, పనికి తగ్గ వేతనాలు కావాలంటూ 19వ శతాబ్దం నుండి ఇప్పటి వరకూ కొట్లాడుతూనే వున్నారు. వీటితో పాటు చాలా దేశాల్లో దూరం నుండి నీళ్లు మొయ్యటం, కట్టెల పొయ్యి మీద వంట చెయ్యటం, బట్టలుతుక్కోవటానికి దూరాలు నడవటం జరుగుతూనే వుంది. అధిక సంఖ్యాక స్త్రీలకి ఇంటి బయట పని చెయ్యటమనేది కొట్లాడాల్సిన విషయం కాదు, సరయిన పని వసతులు, గౌరవప్రదమైన జీవితానికి సరిపోయే వేతనం వారి సమస్య. విశ్రాంతి తీసుకోవటానికి, పని స్థలాల్లో కాస్సేపు కూర్చోవటానికి, తిండి తినటానికి కావాల్సిన వెసులుబాట్లు వారి సమస్యలు.
ఆధిపత్య కులాలు, జాతుల, వర్గాల వివాహిత స్త్రీలకి వేతనం కోసం పని చెయ్యాల్సిన అవసరం, అవకాశం 20వ శతాబ్దపు మొదటి భాగంలో వచ్చింది. మన దేశంలో మొదట ఈ కులాల, జాతుల, వర్గాల్లోని వితంతువులు ఫ్యాక్టరీ పనుల్లోకి, గనుల్లోకి, సెక్స్ వర్క్ లోకి ప్రవేశించారు. రక రకాల పర్దాల్లోంచి, కుటుంబం కోసమే జీవించటం నుండి, మొగుళ్ళ కనుసన్నల్లో బ్రతకటం, వంశం కోసం స్వచ్ఛమైన పిల్లల్ని కనే శరీరాలే కాక మెదళ్ళకి కూడా పని చెయ్యాలనే కోరికతో ఈ వర్గ, కుల, జాతి స్త్రీలు ‘బయటి’ ప్రపంచంలోకి ప్రవేశించాలనుకున్నారు. వారికి తమ స్థాయి పురుషుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. ఈ వ్యతిరేకతని బద్దలు కొట్టే ప్రయత్నంలో భాగంగానే, బూర్జువా సమానత్వ సూత్రాన్ని స్త్రీలకి కూడా వర్తింప చేస్తూ ఈ స్త్రీ పురుష సమానత్వ భావన వచ్చినట్లు కంపిస్తుంది. పౌరసత్వం, సాంఘిక జీవితానికి ముడి వేసి, ఆడవాళ్లు బయటి కొచ్చి పని చేస్తే వాళ్ళూ, కుటుంబాలు, సమాజం అన్నీ మారతాయని అప్పట్లో అనేక మంది స్త్రీలు వాదించారు. అయితే వాళ్ళు కోరుకున్న సమానత్వం తమ స్థాయి మగవాళ్ళతో. అప్పటికే పని స్థలాల్లో వుండిన కింది స్థాయి స్త్రీలు, పురుషులతో కాదు.
బూర్జువా విప్లవంతో వచ్చిన అమూర్త సమానత్వ ఆదర్శానికి, అది వ్యవస్థీకృతంగా సృష్టించే అసమానతకి మధ్య వైరుధ్యం స్త్రీవాద ఉద్యమంతో సహా ఏ ఉద్యమాన్ని వదలలేదు. షెరిల్ సాండ్ బర్గ్ రచనలో, దాని చుట్టూ జరిగిన చర్చలో కూడా స్త్రీ పురుష సమానత్వ భావనని అందరు స్త్రీలకి పనికొచ్చేదిగా ప్రధాన స్రవంతి వర్ణించటం ఈ వైరుధ్యంలో భాగమే. 1980లలో మొదలయిన ప్రపంచ పెట్టుబడిదారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంక్షేమ వ్యవస్థని నీరు కార్చి, కష్టమైన, తక్కువ జీతాలిచ్చే, పనులని తమ సమాజాల్లో క్రింది స్థాయి మనుషులకి, అలాగే అసలు సంక్షేమ వ్యవస్థ పరిపుష్టంగా లేని అభివృద్ధి చెందుతున్న దేశాలయిన బాంగ్లాదేశ్, భారతదేశం, అప్పటి చైనా, థాయిలాండ్, తర్వాత వియత్నాం దేశాలకి బదిలీ చేసింది. లాభాలని పెంచుకోవటానికి, లేదా నిలుపుకోవటానికి ఈ పునర్వ్యవస్థీకరణ పనికొచ్చింది. అనేక పెద్ద దుస్తుల కంపెనీలయిన హెచ్ అండ్ ఎం, జారా, నైకి, అలాగే ఇతర చెప్పులు బాగులు తయారయ్యేది ఈ దేశాల్లోనే. ఇక్కడ పని చేసే స్త్రీలకి ఏ హక్కులు వుండవు. జీతాలు తక్కువ. ఎంత కష్టపడినా ‘పై స్థాయికి’ వెళ్లే అవకాశమే ఉండదు. నాయకత్వం మాట సరే సరి. అసలు యజమాని ఎవరో తెలియకుండా, వారి నుండి ఏ హక్కులు అడక్కుండా వుండే వ్యవస్థగా ఇది రూపు దిద్దుకుంది. బంగ్లాదేశ్లో పదే పడే ఈ యూనిట్లలో జరిగే ప్రమాదాలు వార్తా పత్రికల్లో చూస్తూనే ఉంటాం.
ఈ పునర్ వ్యవస్థీకరణతో పాటు, మేము కూడా ప్రగతిశీల వాదులమే నన్న ప్రచారోద్యమం కూడా గత ముప్ఫయి ఏళ్ళల్లో పెరిగింది. కొంత మంది మహిళలని ఉద్యోగాల్లోకి తీసుకుని, దానికి ఉధృతంగా ప్రచారం కల్పించటం, మన దేశంలో బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్, సాఫ్ట్వేర్ రంగం తాము సమానత్వం కల్పిస్తామనే ప్రచారాన్ని బాగా చేసుకున్నాయి. ఈ రంగాల్లో ఇప్పటికీ వేతన సమానత్వం రాలేదు. ఆడవాళ్లు ఇప్పటికీ 20 శాతం తక్కువ సంపాదిస్తున్నారు. అలాగే, సమానత్వం గురించి యాడ్స్ చెయ్యటం ఒక ఎత్తు. సర్ఫ్ ఎక్సెల్, నైకీ దీనికి ఉదాహరణలు. వీటితో పాటు ప్లేట్ ఫార్మ్ ఆధారిత, ఆప్ ఆధారిత శ్రామికులలో కూడా ‘ఫ్లెక్సిబిలిటీ’ – పిల్లల్ని, ఇంటిని, కుటుంబాన్ని చూసుకుంటూ – వీలయిన సమయంలో చేసే పనిలో కూడా అనేక మంది స్త్రీలకి అవకాశం లభించింది. అయితే ఇది వ్యవస్తీకృతంగా వుండే లోపాలని సరి దిద్దకుండా – పిల్లల్ని చూసుకునే వ్యవస్థని ఏర్పాటు చెయ్యకుండా – వున్న వ్యవస్థలో సర్దుబాటు చేసుకుని వుండే వెసులుబాటు మాత్రమే. ఆర్ధిక వేత్త ఉమా రాణి, ఈ ప్లాట్ ఫార్మ్ రంగంలో అల్గోరిథమ్ ద్వారా జరిగే స్త్రీల (పురుషుల) దోపిడీ గురించి – చేసిన పనిని బాగాలేదని తిరస్కరించటం, సమయాన్ని పరిగణించకపోవటం, పని ఇచ్చే వెసులుబాటుని తమ దగ్గరే పెట్టుకోవటం, అతి చిన్న పనులుగా విభజించి వాటికి పరిహారం ఇవ్వటం, ఫిర్యాదులు చెయ్యటానికి ఏ వ్యవస్ధ లేక పోవటం – అంతర్జాతీయ శ్రామిక సంస్థ ద్వారా నివేదిక తెచ్చారు.
స్త్రీవాదం ఆడవాళ్ల ఇంటి బాధ్యతలు పెట్టుబడిదారీ వ్యవస్థకి ఎలా వూతం కల్పిస్తాయో 1970 ల్లోనే సిద్ధాంత పరంగా విశదీకరించింది. 2023 సంవత్సర ఆర్ధిక రంగ నోబెల్ బహుమతి గ్రహీత క్లాడియా గోల్డిన్ చదువులో స్త్రీ పురుషుల మధ్య దూరం తగ్గినప్పటికీ, వారి మధ్య కొనసాగుతున్న వేతన దూరం, ఆడవాళ్లపై వుండే కుటుంబ బాధ్యతల వల్లే అని తన పరిశోధనలో చూపించారు. మన దేశంలో ఆర్ధిక వేత్త సాత్యకి రాయ్ 1990ల తర్వాత, సంక్షేమాన్ని వెనక్కి తీసుకోవటం వల్ల, ఆడవారిపై భారం బాగా పెరిగిందని తన పరిశోధనలో వెల్లడిరచారు. ఆర్ధిక మెరుగు వ్యవస్థీకృతంగా అందరికీ మెరుగు తీసుకు రాదనే సంగతి భారత దేశ ‘ప్రగతి’ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
ఇంత వైరుధ్యంతో కూడుకుని వున్న ఆర్ధిక వ్యవస్థలో సాండ్ బర్గ్ లీన్ ఇన్ సిద్ధాంతం ఎంత తక్కువ మంది స్త్రీలకి పరిమితమయిందో చూడొచ్చు. స్త్రీలందరినీ కలిపేసి వారి మధ్య వుండే జాతి, వర్గ భేదాలని కూడా పరిగణనలోకి తీసుకోలేదని బెల్ హుక్స్ అంటే, నాన్సీ ఫ్రేజర్ దీన్ని వున్న పెట్టుబడి దారీ వ్యవస్థలో ఆడవాళ్లు ఎలా సఫలీకృతులవ్వాలనే 101 అని అన్నారు. దీని ఆకర్షణ ప్రధానంగా వ్యవస్థని మార్చకుండా ఆడవాళ్లు కూడా ఆ సూత్రాల ద్వారా ముందుకెళ్లటం. అధికారం, ఆధిపత్యం వున్న కులీన స్త్రీలకి పనికొచ్చే అజెండా ఇది. అయితే వాళ్ళు కూడా మాకు ఈ పోటీ రంగం వద్దు, మా పరిస్థితుల బట్టి మాకు కావాల్సింది మేమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అంటే వాళ్ళకీ పనికి రాదు. వాళ్ళు ఏ జాతికి చెందిన శ్రామిక వర్గ స్త్రీలయినా, వలస సమూహాల్లోని వ్యక్తులయినా, వ్యవస్థని మార్చాలనే ఆసక్తి వున్న స్త్రీవాదులయినా ఈ సిద్ధాంతం పనికి రాదు.
లీన్ ఇన్ మగ స్వామ్య అమ్ముల పొదిలో ఒక బాణం. జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక రాజకీయ వ్యవస్థలకనుగుణంగా పనిచేసే జెండర్ ఆర్డర్‌ని వ్యక్తిగతంగా అధిగమించి ముందుకెళ్ళమనే ఉదారవాద స్లోగన్. మేము వ్యవస్థని, దాని పద్ధతులు, పని తీరుని మార్చము, మీరు మాత్రమే మాకు అనుగుణంగా మారాలి అని చెప్పకుండా చెప్పే వైఖరి. కార్పోరేట్ రంగ మగ నాయకుల పద్ధతులని పాటిస్తే, స్త్రీవాదం, సోషలిజం చెప్పే అందరికీ పనికొచ్చే వ్యవస్తీకృత మార్పులు చెయ్యకుండా సమూహాన్ని పక్కకి పెట్టి వ్యక్తిగతంగా ముందుకెళ్ళచ్చనే ఆశని పెంచి పోషించిన ఈవిడ, ఈ రచన, పదేళ్ల తర్వాత ఏమి సాధించాయని చూస్తే ఆవిడ ముందుకెళ్లటం తప్ప పెద్దగా ఏమీ కన్పించదు.
