– జి.చంద్రమౌళి, కె.రాధిక
నేడు భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైనది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మన సమాజంలో నేటికి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చుననీ యాజమాన్య దోపిడి పెరిగిపోవడం బాల కార్మిక వ్యవస్థ పుట్టడానికి దోహదం చేస్తున్నాయి. నేటికి మన దేశ జనాభాలో 30 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అనధికారిక అంచనాలు. రెక్కాడితేగాని డొక్కాడని అభాగ్యులు బాలకార్మికులు.
చిట్టిచేతుల చిన్నారులు తల్లిదండ్రుల బీదరికం కారణంగా కుటుంబానికి ఆర్థికంగా మద్దతునివ్వడం కొరకు బాల కార్మికులుగా మారుతున్నారు. మన సమాజ నిర్మాతలైన బాలలు ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితులు లేకపోవడం, తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, దోపిడి, వివక్ష, కుల అణచివేత, లింగ అణచివేత, చెడు స్నేహాలు, అశక్తత, ఇలా అనేక కారణాల వలన బాలలు పని మనుషులుగా, బాల నేరస్థులుగా, సెక్స్వర్కర్లుగా మార్చబడి, దోపిడికి గురిఅవుతు బాల కార్మికులుగా రూపుదాల్చుతున్నారు. పేదరికం వలన బాల కార్మిక వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ వలన నిరక్షరాస్యత, నిరక్షరాస్యత వలన పేదరికం ఇలా ఒకదాని ఆధారంగా మరొకటి చక్రబంధమై పెరుగుతున్నది. 1996 యునిసెఫ్ నివేదిక పేర్కొన్న సంగతిని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించుకోవాలి. ఈ దేశ చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్య కేవలం బాలకార్మిక వ్యవస్థ ఒకటి మాత్రమే కాదు. బాలకార్మిక వ్యవస్థలో బాల్యం కుమిలిపోతున్నది. దీనితో పాటుగా వీధి బాలల పేరిట బాట తప్పిన బాల్యం వీధులలో రోదిస్తుంది. దురదృష్టవశాత్తు ‘ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చింది’ అన్నట్లుగా బాలకార్మికుల ఆక్రందనలను పట్టించుకునే మనసు సమాజానికి కరువైంది. ఒక లక్ష్యం, ఒక గమ్యం అన్నింటిని మించి ఒక ఆధారం, ఆలంబన లేక తెగిన గాలిపటాలలా జీవిస్తున్నారు.
పిల్లలు పనిచేయటం అన్నది మనం నైతికంగా సమ్మతించలేని విషయం. వారు విద్య నేర్చుకోవాలి, ఆటలాడుకోవాలి. పిల్లలు సృజనాత్మకమైన మరుపురాని బాల్యాన్ని గడపాలి. మనదేశంలో బాల కార్మికులు అధిక సంఖ్యలో వుండడానికి ప్రధాన కారణం దారిద్య్రం. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి వున్న వర్గాల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. బాలకార్మికులు ఏ వ్యాపకం లేకుండా, రేపన్న ఆలోచన రానీయకుండా జీవితాన్ని సాగిస్తున్నారంటే వారి శ్రమశక్తి, మేధోసంపద వృధా అవుతుంది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమై చదువు సంధ్యలు లేక, అనారోగ్య పరిస్థితులలో దేశ సంపదను వృద్ధి చేస్తూ కుటుంబాలకు అండగా వుండే బాలలు ఏం కోల్పోతున్నారో ఆలోచిస్తే ఈ సామాజిక వ్యవస్థ అసలు స్వరూపం బాధ్యతారాహిత్యం బహిర్గతమవుతుంది. 2003 సంవత్సరానికి మెగసేసే అవార్డు గ్రహీత ఆచార్య “శాంతాసిన్హా” అన్నట్లు బడిలో కాకుండా బాలలు ఎక్కడున్నా కార్మికులే వున్నా విస్తృత నిర్వచనం బాలల పరిస్థితిని స్పష్టం చేస్తుంది.
బాలకార్మిక వ్యవస్థ- స్వరూపం:
వ్యవసాయం, పశువులు, మేకలు, గొర్రెలు కాయడం, ఇంటి పనులు చేయడం, హోటళ్ళు, రెస్టారెంట్లు, దాబాలలో కిరాణా హోల్సేల్ వ్యాపారాలు, మోటారు మెకానిజం, పత్తి, పొగాకు, మత్స్య పరిశ్రమ, గనులు, అగ్గిపెట్టెల తయారీ, బాణాసంచా పరిశ్రమ, బీడీ పరిశ్రమ, రత్నాలను పాలిష్ చేసేందుకు, పలకలను తయారు చేయడానికి, రాళ్ళు కొట్టించడం, సిమెంట్ తయారీ, నిర్మాణ పరిశ్రమ, మందుగుండు సామాగ్రి, తాళాలు తయారు చేసే సంస్థలలో, అద్దాల కర్మాగారంలోను, రైల్వే శాఖలోను, ఓడ రేవులలోను, తివాచీల, నేత పరిశ్రమలోను, సబ్బుల తయారీ పరిశ్రమ ఇలా అనేక రూపాల్లో చాలా రంగాలకు బాలకార్మిక వ్యవస్థ విస్తరించింది. వారి శారీరక, మానసిక ఆరోగ్యాలకు హానికరమైన పరిస్థితుల్లో బాలకార్మికులు పని చేస్తున్నారు. బాల బాలికలు నిర్భందంగా వివిధ శాఖల పనులలోకి నెట్టబడుతున్నారు.
14 సంవత్సరాలలోపు వయస్సు కలిగి వుండి పనిచేసే వారిని బాల కార్మికులుగా గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ శ్రామిక కార్యాలయం పనిలో చేరేవారి వయస్సు విషయంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం 15 సంవత్సరాల వయస్సు నిండిన వారు మాత్రమే శ్రామికులుగా పనిచేయడానికి అర్హులు. ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో బాలల హక్కుల కన్వెన్షన్ను గుర్తించి 18 సంవత్సరాలలోపు వ్యక్తులందరిని బాలలుగా పరిగణించడం జరుగుతుంది. కాని నేడు బాలలు వారి ఆనందమైన, తీపి జ్ఞాపకాల బాల్యాన్ని అనుభవించకముందే బాల కార్మిక వ్యవస్థ వారి సంపూర్ణమైన బాల్యాన్ని వివిధ రంగాలలో మింగివేయడం జరుగుతుంది.
బాల కార్మికులు – గణాంకాలు:
ప్రపంచంలోని పది దేశాలలో ఎక్కువగా బాలకార్మికులు పడరాని కష్టాలు ఎదుర్కొంటున్నారు. పది దేశాల జాబితాలో సూడాన్, ఉగాండా, కాంగో దేశాలు మొదటి స్థానాలను ఆక్రమించినాయి. అలాగే భారతదేశంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగానే వుంది. బాల కార్మిక వ్యవస్థలో భారతదేశం 6 వ స్థానంలో వుంది. మన దేశంలో 2001 వ సంవత్సరంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగి వుండి బాల కార్మికులుగా పనిచేస్తున్న వీరి సంఖ్య 12.6 మిలియన్లు. బెల్జియం దేశంలోని దేశ జనాభా కంటే మన దేశంలోని బాల కార్మికుల సంఖ్య అధికం. మన దేశంలోని బాల కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది అనగా దాదాపు 6.7 మిలియన్ల బాలకార్మికులు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.23 లక్షల మంది బాల కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వం జూన్, 2005 లో ప్రకటించింది. అయితే ఈ సంఖ్యకు రెట్టింపు బాల కార్మికులు మన రాష్ట్రంలో ఉన్నట్లు అనధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.
ఐక్యరాజ్య బాలల నిధి (యునిసెఫ్) ప్రకారం ప్రపంచంలో 24.60 కోట్లు మంది బాలకార్మికులున్నారు. 1999 సంవత్సరంలో యునిసెఫ్ లెక్కల ప్రకారం మన దేశంలో 4.40 కోట్ల మంది బాలకార్మికులున్నారు. బాల కార్మికులు లేని దేశమంటూ లేదు! ప్రపంచంలో ప్రతి సంవత్సరం పని సంబంధమైన ప్రమాదాల్లో 22 వేల మంది బాల కార్మికులు దుర్మరణం చెందుతున్నారు. బాల కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. బాల కార్మికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్యకు సంబంధించి నేటి వరకు సమగ్ర సర్వే నిర్వహించిన దాఖలాలు లేవు. మనదేశంలో ఇళ్ళలో పనిచేసే బాలకార్మికుల సంఖ్య 14 లక్షలకు పైగా వుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లోనే ఇళ్ళలో పనిచేసే బాలకార్మికుల సంఖ్య దాదాపు 1.50 లక్షల వరకు వుండవచ్చునని అంచనా. ఈ గణాంక వివరాలన్నీ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి విధానం:
ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడికలో ప్రకరణ (1) ప్రకారం 18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరు బాలలే. 1959 నవంబరు 29 న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కులపై ప్రకటన చేస్తూ అంతర్జాతీయ మానవహక్కులను అంతర్భాగంగా గుర్తించింది. 1979 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి “అంతర్జాతీయ బాలల సంవత్సరం” గా ప్రకటించింది. ప్రతి పిల్లవాడికి జీవించి, అభివృద్ధి చెందే హక్కును సహజ హక్కుగా ఒప్పందం ప్రకటించింది. అలాగే బాలల ఆరోగ్య, విద్య హక్కులను అతి ముఖ్యమైన హక్కులుగా గుర్తించింది. 1989 లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కులపై ఒక అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. 1992 డిసెంబరు 11 న ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. బాలల రక్షణ ప్రకటన (1979) బాల నేరస్తుల పట్ల పాటించవలసిన ఐక్యరాజ్యసమితి ప్రమాణాలు, నిబంధనలు ప్రపంచంలోని అన్ని మూలల్లోను నివసిస్తున్న పిల్లలకు జాతి, మత, వర్గ,లింగ భేదం లేకుండా సమానమైన రక్షణ, సంక్షేమం కావాలనే మానవాళి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాయి. వాటన్నింటికి కొనసాగింపుగానే 1989 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ముందుకు వచ్చింది.
1992 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన బాలల హక్కుల ఒప్పందం “విద్యను పొందటం బాలల హక్కు”, విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత అని 28 ప్రకరణలో స్పష్టంగాను పేర్కొంది. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన(1948) లో మానవులందరికి సంబంధించిన హక్కులను పరిరక్షించడం జరిగింది. దీనిలో కొన్ని నిబంధనలు ప్రత్యేకంగా పిల్లలు, వారి విద్యకు సంబంధించినవి. నిబంధన 26లో ప్రతి ఒక్కరికి విద్య హక్కు వుందని పేర్కొనడం జరిగింది. బాలల హక్కుల 6 వ నిబంధనలో బాలల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి వారికి ప్రేమ, అనురాగం, సదవగాహన అందించడం అవసరమని పేర్కొనడమైంది.
బాలల హక్కులు- భారత రాజ్యాంగ రక్షణలుః
చిన్నారుల పట్ల సమాజానికి బృహత్తర బాధ్యత ఉన్నదన్న విషయాన్ని భారత రాజ్యాంగం నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని 24 వ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల లోపు బాల బాలికలను కర్మాగారాలు, గనులు లాంటి ప్రమాదకర ప్రదేశాలలో కార్మికులుగా నియమించరాదు. రాజ్యాంగంలోని 45 అధికరణం 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు సార్వత్రిక నిర్భంద ఉచిత విద్యావకాశాలు కల్పించింది. ప్రభుత్వం ఈ అధినియమును మార్పుచేసి 86 వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6-14 సంవత్సరాలలోపు బాలల నిర్భంధ ప్రాథమిక విద్యను 21 (ఎ) ఆర్టికల్ ప్రకారం “ప్రాథమిక హక్కు”గా మార్చడం జరిగింది. ఆర్టికల్ 23 ప్రకారం వెట్టి చాకిరి, స్త్రీ, శిశువులను నిర్భందంగా అవమానకర పనులకు ప్రోత్సహించడం నిషేధించడం జరిగింది. 1975 సంవత్సరంలో వెట్టి చాకిరి నిరోధక చట్టాన్ని పార్లమెంటు చేసింది.
మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పరిశ్రమల చట్టం 1881 , బాలల చట్టం 1933, బాలల ఉద్యోగ కల్పన చట్టం 1938, కర్మాగారాల చట్టం 1948, ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951, గనుల చట్టం 1952, మోటారు రవాణా కార్మిక చట్టం 1961, ఫ్యాక్టరీ చట్టం 1982 భారత రాజ్యాంగంపై చట్టాలను రూపొందించడం జరిగింది. 1901 లో గనుల చట్టం, 1990 సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు వివిధ చట్టాలు రావడం జరిగినాయి. మన రాష్ట్రం మరో అడుగు ముందుకేసి బడికి వెళ్ళని బడి ఈడు (6-14) వయస్సున్న పిల్లలంతా బాల కార్మికులేనని ప్రకటించడం మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం విధానాలను, చట్టాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ విజన్ 2020 డాక్యుమెంట్లో బాలల విద్యా హక్కు మనందరి బాధ్యతగా డిసెంబర్ 1999 లో ప్రకటించింది.
ఆర్టికల్ 15: మహిళలు, బాలల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు చేయవచ్చు.
ఆర్టికల్ 23(1): బాలలను అమ్మడం, కొనడం, భిక్షాటన చేయించడం, నిర్భంధ చాకిరీలు నిషేదితం.
ప్రకరణం 30 (సి): లేత వయస్సు పిల్లలను అపహస్యం కాకుండా చూడాలని, ఆర్థిక అవసరంతో తమ వయస్సుకి, శక్తికి మించిన పనుల్లో నిమగ్నం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై వుంది.
ప్రకరణం 39 (ఎఫ్): బాలలు స్వేచ్ఛాయుత, గౌరవప్రద పరిస్థితుల్లో ఆరోగ్యవంతంగా పెరగడానికి తగినన్ని అవకాశాలు, సౌకర్యాలు కల్పించి, బాల్యాన్ని కామపీడన నుంచి, నైతిక, భౌతిక నిర్లక్ష్యాల నుంచి ప్రభుత్వం బాలలను రక్షించాలి.
ప్రకరణం 47: బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి.
బాలలకు రక్షణ కల్పిస్తూ భారతీయ శిక్షాస్మృతిలో ఐ.పి.సి. 361, ఐ.పి.సి 363-ఎ, ఐ.పి.సి 366, బాలలకు రక్షణ కల్పించింది. భారత ప్రభుత్వం బాలల కోసం కొన్ని చెప్పుకోదగిన చట్టాలు చేసింది. వానిలో బాలల ఆరోగ్యం, విద్య విషయాలలో వివిధ రాష్ట్రాలలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఒక నిర్దిష్ట వయోపరిమితి వరకు ప్రాథమిక ఉచిత విద్యను కల్పిస్తున్నాయి. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో ప్రసాదించిన నిర్భంద ఉచిత ప్రాథమిక విద్య విధానం నేటికి అమలు కాలేదు. మాతా, శిశు సంక్షేమం పేరిట ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికి పెద్దగా సాధించింది ఏమి లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న బాలకార్మిక చట్టం 1986 ను అనుసరించి మనదేశంలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడం జరగలేదు. ఈ సంవత్సరం (2006) ఆగస్టు 1 వ తేది నుండి పనులను బాలకార్మికుల చేత చేయించరాదని భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బాలకార్మికులను ఇళ్ళల్లో పని చేయడానికి నియమించుకోరాదు. ఈ నిషేధపు ఉత్తర్వులు 2006 అక్టోబర్ 10 వ తేది నుండి అమలులోకి వచ్చాయి.
బాలకార్మిక వ్యవస్థ – అమలు తీరు:
– బాలకార్మికుల చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమానులను శిక్షించే యంత్రాంగం పటిష్టంగా లేదు.
– ప్రభుత్వం చట్టాలను రూపొందించడం వరకే తమ బాధ్యత తీరిపోయిందని వ్యవహరిస్తుంది.
– రాజకీయ పక్షాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను శక్తిమేరకు కృషి చేయడం లేదు.
– యాజమానులు బాలకార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.
– సమాజం బాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.
– ప్రసార సాధనాలు ప్రజలలో సరియైన అవగాహన కల్పించలేక పోతున్నాయి.
– అధికారులు బాలకార్మిక చట్టాలను అమలుపర్చడంలో సరియైన శ్రద్ధ కనపర్చడం లేదు.
– బాల కార్మికులు చట్టాన్ని ఎన్నో సంస్థలు, ఫ్యాక్టరీలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే యంత్రాంగం సక్రమంగా లేదు. కార్మిక సంఘాలు సహితం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అన్యాయం.
“పనిచేయడానికి రెండు చేతులున్నాయి, తినడానికి ఒక నోరుంది” అని బాలలు తమ పొట్ట తామే నింపుకుంటూ కుటుంబానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే ఆదాయవనరులు అవుతున్నారు. అందమైన బాల్యాన్ని కోల్పోయి, విద్య గ్రంథాలకు దూరమై, పలక బలపం పట్టవలసిన చేతులు పార పలుగు పట్టుకుంటూ బరువైన పనులు చేస్తూ అనారోగ్యం, ఆకలిమంటలతో అసహాయ స్థితిలో పనిచేస్తున్న బాలలను ఏ చట్టాలు పరిరక్షించలేకపోతున్నాయి. అమ్మ ఒడిలో, బడిలో చేర్చలేకపోతున్నాయి. ప్రభుత్వాలు బాలకార్మిక చట్టాలను కఠినంగా అమలుచేసి బాలకార్మికుల సౌకర్యార్థం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, బాల కార్మికుల పునరావాసానికి ప్రత్యేక పథకాలను రూపొందించి, వారి విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు బాల కార్మిక చట్టాలను ఆచరణలో పెడితే బాలల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వుంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమవుతుంది.
బాలకార్మికుల నిర్మూలనకు సూచనలు:
బాల కార్మిక వ్యవస్థని నిషేధించినంత మాత్రాన, దానంతటదే రద్దు కాదు. ఇది బాలల సమస్య, ఒక సామాజిక రుగ్మత. ఈ చిన్నారులు సంఘ వ్యతిరేక శక్తులుగా మారి మొత్తం సమాజానికే సమస్యగా మారుతున్నారు. బాల కార్మికులను సమాజం ఉపేక్షిస్తున్న మాట యదార్థమే అయినా చిన్నారుల చీకటి బతుకులలో వెలుగు రేఖలు నింపే ప్రయత్నాలు మరిన్ని సమాజం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత వహించాలి. బాలల హక్కుల పరిరక్షణ ఏ ఒక్కరితోనూ సాధించబడదు. ఇది అందరి బాధ్యతగా గుర్తించినప్పుడే సాధ్యమవుతుంది.
– సామాజిక పరంగా, హక్కుల పరంగా బాలల అభివృద్ధి సంరక్షణ కోసం ఉన్న శాసనాలను సమీక్షించి మార్పులు చేయడం.
– బాలల హక్కుల పరిరక్షణ కోసం కావల్సిన వనరులు బడ్జెట్లో ప్రతిపాదించి అమలు చేయడం.
– ప్రజలను చైతన్యపరిచే కృత్యాలను, కార్యక్రమాలను ప్రోత్సహించడం
– పిల్లలకు మంచి పరికరాలు, వసతులు ఉన్న పాఠశాలలను అందుబాటులోకి తేవటం.
– బాలల హక్కుల పరిరక్షణకు పర్యవేక్షకులను నియమించి, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం.
– ప్రభుత్వేతర సంస్థల సేవలను ప్రోత్సహించడం
– ప్రసార మాధ్యమాల ద్వారా పిల్లలను చాకిరికి గురి చేయటంలోని నిర్దయతను, కౄరత్వాన్ని తెలియజేయాలి.
– ప్రభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలి.వృత్తి నైపుణ్యతలో, ఆర్థిక విషయాల్లో, సంస్థాపరమైన, సిబ్బంది వస్తు పరికరాల విషయంలో ప్రభుత్వేతర సంస్థలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలి.
– బాల శ్రామికులకు మరిన్ని పునరావాస పథకాలు కల్పించాలి. వారికి విద్యను, వృత్తి నైపుణ్యంలో శిక్షణను అందుబాటు లోకి తీసుకురావాలి.
– పిల్లల శారీరక, మానసిక, ఆరోగ్యాలను కాపాడటం తల్లిదండ్రులు తన కనీస బాధ్యతగా గుర్తించడం.
– తల్లిదండ్రులు తమ జీవనం కోసం పిల్లల జీవితాన్ని పణంగా పెట్టకపోవడం,
– తల్లిదండ్రులు పిల్లల ద్వారా పొందే స్వల్ప ఆదాయాన్ని ఆశించకుండా వుండడం.
– సమాజం ప్రభుత్వంలో నిర్వహించే చైతన్య కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయడం.
– ప్రజలు ప్రభుత్వం రూపొందించే చట్టాలను, విధానాలను, గౌరవించి, ప్రోత్సహించడం.
– ప్రజలు కూడా భాగస్వాములు కావటం అత్యావశ్యకం. పిల్లల చాకిరి నిర్మూలనకు ప్రధానంగా ప్రేరణ సమాజం నుంచే రావాలి.
– ఉపాధ్యాయులు పాఠశాల వాతావరణాన్ని ఆకర్షణీయంగా చేసి, బడి నమోదుకు ప్రోత్సహించడం.
– ఉపాధ్యాయులు ఔత్సాహికముగా, నిబద్ధతతో బాలల సమస్యల పట్ల సమాజంలో స్పందన స్ఫురింపచేయాలి.
చిన్నారులకు బంగారు బాటలను నిర్మించుదాం:
ఆట పాటలతో చదువుతో హాయిగా గడిచిపోయే అవకాశాలను, సౌకర్యాలను బాలబాలికలకు కల్పించాలి. అప్పుడే బాలకార్మిక వ్యవస్థ బలహీనపడుతుంది. బాల కార్మిక వ్యవస్థను విముక్తి చేయడానికి ప్రభుత్వం, పౌర సమాజం బాధ్యత వహించాలి. శ్రమలో మసిమాడిన పసి మొగ్గలకు రక్షక కవచాన్నివ్వాలి. ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం కలిగిన బాలల సమాజాన్ని మనం నిర్మిస్తే, రేపది గొప్ప సమాజంగా రూపాంతరం చెందుతుంది. బాలల స్వేచ్ఛను బాలలకిద్దాం. బాలల సౌకర్యాలను బాలలకిద్దాం. బాలల హక్కులకు రక్షణ కల్పిద్దాం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. పశువుల మందలను కాపాడిన చిట్టి చేతులే మానవ సమాజాన్ని కాపాడగలరని నిరూపిద్దాం. పునాదులు లేని సౌధాలు కుప్పకూలిపోతాయి. పునాదులను విస్మరించి గాలిలో నిర్మించుకున్న అందమైన భవనాలు శిథిలమైపోతాయి. సమాజ నిర్మాణానికి ఈ సత్యం వర్తిస్తుంది. సమాజ నిర్మాణానికి పునాది బాలలు. బాలలు బంగారు కాంతులతో విలసిల్లినపుడే సమాజం వెలుగు పూలు పూయిస్తుంది.
“పిల్లల పట్ల ప్రపంచం చూపించే ప్రేమానురాగాలు, విశ్వాసాలకు మించిన పవిత్ర అంశం మరొకటి లేదు. పిల్లల హక్కులను పరిరక్షిస్తూ, ఆ హక్కులను గౌరవిస్తూ, వారి సంక్షేమాన్ని రక్షిస్తూ పిల్లల జీవితాలు భయమన్నది ఎరుగక, కొరతన్నది తెలియక శాంతియుతంగా ఎదిగేందుకు నిర్వర్తించే కర్తవ్యాన్ని మించిన కర్తవ్యం మరొకటి లేదు”
– కోఫి అన్నన్ (ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అభివృద్ధి ఫలితాలు అందరికి అందాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది. బాలకార్మిక వ్యవస్థ చట్ట పరిధిని మరింత విస్తృత పరుస్తూ, బాల కార్మిక చట్టాలు బలంగా అమలయ్యేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మానవ విలువలతో ముడిపడిన చట్టాల విషయంలో సమాజం సహకారం అందించనిదే లక్ష్యాలను సాధించడం సాధ్యమయ్యే విషయం కాదు. సమాజం, ప్రభుత్వ సహకారాలతో బాలల భావి జీవితాలలో వెలుగు కాంతులను విస్తరింప చేయడానికి నడుం బిగించి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. చిన్నారి భవితకు బంగారు బాటలు వేద్దాం.
పిల్లల సంక్షేమ బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది. వనరుల కేటాయింపులో పిల్లల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా బాలల సమస్యలపై ఒక జాతీయ విధానాన్ని మన ప్రభుత్వాలు రూపొందించలేకపోయాయి. బాలల సమస్య దేశ భవిష్యత్తు సమస్య. కొత్త చట్టాలు రూపొందించటంతో బాటు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. బాలల ఆరోగ్యం, విద్య దేశాభివృద్ధికి అత్యంత కీలకమైనవి.
బాలల బాల్యం బడిలోనే, బాలల భవిష్యత్తు బడితోనే!
ఈ సమాజ కళ్యాణ కార్యక్రమంలో సమాజంలోనే అందరూ భాగస్వాములు కావాలి! చేదోడు, వాదోడు అందించాలి.