2006 సంవత్సరానికి సంబంధించి రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారం, విశిష్ట కథానికా పురస్కార సభ 31 డిశంబరు 2006 న నగర కేంద్ర గ్రంధాలయం, చిక్కడపల్లిలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ,చలమేశ్వర్ పురస్కారాల ప్రదానం చేసారు. రంగవల్లి స్మారక విశిష్ట పురస్కారం ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యకి, విశిష్ట కథానికా పురస్కారం రచయిత్రి చంద్రలతకి ప్రదానం చేసారు.
సభను ప్రారంభించిన వాసిరెడ్డి నవీన్ పురస్కారాల గురించి వివరించారు. ఈ సభకు ప్రముఖ కవి కె. శివారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ భాషావేత్త చేకూరి రామారావుగారు ట్రస్టు గురించి పరిచయం చేసారు.
ఈ సభలో పురస్కారాన్ని అందుకున్న అనంతరం సంధ్య చేసిన ఉద్విగ్నభరిత ఉపన్యాసం సూటిగా ఆహుతుల గుండెల్ని తాకింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు స్పందించకపోవడం గురించి, మానవీయ విలువల్ని కోల్పోవడం గురించి సంధ్య చాలా ఆవేదన నిండిన గొంతుతో మాట్లాడారు. రంగవల్లి స్వయంగా తన చేయి పట్టుకు నడిపించి, ఉద్యమాల్లోకి తీసుకువచ్చిందని, అలాంటి రంగవల్లి అక్క పేరుమీద ఇస్తున్న పురస్కారాన్ని అందుకోవడం తనకు గర్వంగా, ఆనందంగా వుందని, అయితే ఈ పురస్కారం తన సంస్థకే చెందుతుందని చెబుతూ తనకు ఇచ్చిన నగదును కూడా సంస్థకే ఇస్తున్నట్లు ప్రకటించింది.
తర్వాత ‘రేగడి విత్తులు’, ‘దృశ్యాదృశ్యం’ రచయిత్రి చంద్రలత స్పందిస్తూ సంధ్యక్కతో కలిసి ఈ వేదికను పంచుకోవడం తనకు సంతోషంగా వుందని, తను కాల్పనిక రచయిత్రినైతే సంధ్యక్క కార్యకర్త అని, ఈ సభ, ఈ పురస్కారం తన బాధ్యతను పెంచాయని అన్నారు.
చివరగా ట్రస్ట్ చైర్మన్ ఎస్.వి. ఎల్.నరశింహారావు గారు ఇకనుంచి నవంబరు 11 రంగవల్లి మరణించిన రోజు కూడా సాహిత్య కార్యక్రమం చేపడతామని ప్రకటిస్తూ, వందన సమర్పణ చేయడంతో సభ ముగిసింది.