అనసూయ
అనసూయగారు మీ గురించి చెప్పండి.
నేను ఆదివాసీ స్త్రీని. పూసుగూడెం మాది. ఖమ్మంజిల్లా లోని ములకలపల్లి మండలం. ఏజన్సీ ప్రాంతం. మా అమ్మమ్మ పెంపకంలో స్వేచ్ఛగా పెరిగాను. ఆమె ప్రభావం నా మీద చాలా వుంది. తెలివితేటల్తో బతకాలంటే చదువు, ఉద్యోగం అవసరమని అమ్మమ్మ చెప్పేది. రోజూ 12 కి.మీ నడిచి పాల్వంచలో చదువుకున్నాను. డిగ్రీ పూర్తి చేసి కోయ పిల్లల స్కూల్లోనే టీచర్‌గా పనిచేస్తున్నాను.
ఉద్యోగానుభవాలు
14 మంది పిల్లలున్న బడిలో 106 మంది పెరిగేట్లుగా తయారుచేశాను. చదువు విలువచెబ్తూవస్తున్నాను. ఆగిన చదువల్ని కొనసాగింపజేస్తున్నాను. చిన్నప్పుడు తెలుగును అర్ధం చేసుకోవడానికి నేను పడ్డ బాధ, ఇబ్బంది గుర్తుండడంవల్ల వీళ్ళు ఆ బాధ పడకూడదనుకున్నాను. మా మాతృబాష కోయతూరులోనే చెబ్తూ తెలుగు, ఇంగ్లీషు పట్ల ఆసక్తిని పెంచాను. ఈ భాషా అవసరాన్ని ఐటిడిఏ వాళ్ళు గ్రహించడంవల్ల కొన్ని పుస్తకాలను ముద్రించారు. కానీ అవి సరిగ్గా అందరికీ అందుబాటులో రాలేదు. నాకు మా భాషా సాహిత్యాన్నంతా లిఖిత సాహిత్యంగా తెలుగులోకి అనువదించుకోవాలనే కోరిక వుంది.
సమాజసేవ పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
నాకు చిన్నప్పటి నుంచీ పాటలంటే ఇష్టం. ఎక్కువగా పాడేదాన్ని. అక్షరదీపం వాళ్ళు జిల్లా అంతా తిప్పారు. ఆక్రమంలోనే కవి విద్యాసాగర్‌తో పరిచయం. ఆ పరిచయం, కులాంతర వివాహ దిశగా సాగింది. మా పద్ధతుల్లో పెళ్ళి చేసుకోవడానికి ఆయన అంగీకరించడంవల్ల పెళ్ళి జరిగింది. ఇద్దరి భావాలు, ఒకటి కావడం, సమాజానికేమైనా చెయ్యాలన్న సంకల్పాలుండటం వల్లనే దగ్గరయ్యాం. కలిసి జీవిస్తున్నార. కలిసి పనిచేస్తున్నాం.
ఆదివాసీ కవిత్వాన్ని గురించి చెప్పండి?
ఆదివాసీల పాటలన్నీ అద్భుతమైన కవిత్వారూపాలే, మౌఖిక సాహిత్యమే చాలావరకు. ఆదివాసీ సమస్యపట్ల కవిత్వం రాసిన వాళ్ళు గిరిజనులా, గిరిజనేతరులా అనే విషయం పక్కన పెడితే, తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్ర వేయగలిగారు.
‘ఆదివాసీ మాటకు లిపి ఇవ్వలేని భాషా శాస్త్రమా!
నీవొక చీకటిఖండం
తెల్లకాగితం
సిగ్గుతో తలదించుకున్న శిలాన్యాకాశం’
లిపిలేని భాషలు ఎంత నిర్లక్ష్యానికి గురౌతున్నాయో మనకు తెలుసు సామ్రాజ్యవాద, మైదాన ప్రాంత సంస్కృతులు గిరిజన యువతుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో కవిత్వాలు వెల్లడిస్తున్నాయి. మా వారి పండుగలు, నృత్యాలు, మౌఖిక సాహిత్యం వేరు అని ఇవాళ మసక బారుతున్నాయి. ఇవ్వాళ మా పాట మోడైపోయింది. మా ఆట పరాయిదై పోయింది. బూతు పాటల మోకాలముందు రేలపాటలు నోళ్ళు వెళ్ళబడుతున్నాయి. ఒకప్పుడు సంతలు నిత్యావసర వస్తువులకు కేంద్రంగా వుండేవి. ఇవ్వాళ అవే వస్తువ్యామోహ పంపిణీ కేంద్రాలుగా మారాయి. బాహ్య సౌందర్యంవైపు చూపు మరల్చడంలో కీలకపాత్ర పోషిిస్తున్నాయి. ఒక గిరిజనుడు వెన్నెల్లో నడుస్తున్నప్పుడు అతని నీడ ఎలా వెంట వస్తుందో, సామ్రాజ్యవాద విష సంస్కృతి కూడా అలానే వెంబడిస్తుంది.
గిరిజనులు మైదాన ప్రాంతాలవైపు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు?
మతమే లేని మా సమాజంలోకి కొత్త కొత్త మతాలు ప్రవేశించి మా గిరిజనులను రెండుగా చీల్చి పాలిస్తున్నాయి. బలిపశువులుగా మారుతున్నాయి. ఏ గిరిజన గూడెంలో చూసినా గిరిజనేతర దుశ్యంతులు ఎక్కువగా వున్నాడు.
‘వెలివేతల్ని భరించ దు:ఖాన్ని దాచుకుంటావ్ సరే
గర్భాన్నెలా దాచుకుంటావ్
వాడు మళ్ళీ ఏ గిరిజన గూడెంలోనో
సగం ఆకాశాన్ని కొండ చిలువలా ఆక్రమించేవుంటాడు
దేహాన్ని ఆక్రమించినంత సులభంగానే భూముల్ని ఆక్రమించి
1/70 సాక్షిగా పంటల్ని బస్తాలకెత్తుకుని
నెత్తుటిగుడ్డును నజరానాగా ఇచ్చి వెళ్తాడు”
మైదాన ప్రాంత గిరిజనేతరులు బతుకుదెరువు పేరుతో అటవీ ప్రాంతంలో అడుగుపెట్టాకే మా జీవితాల్లో అలజడి మొదలైంది. సాంప్రదాయ పంటలు పోయాయి. వ్యాపారపంటలు వచ్చాయి. భూములు అన్యాక్రాంతమయ్యాయి.సహజత్వం మసకబారింది. అనుకరణ మొదలైంది. అలవాట్లు మారిపోయాయి. పురాతన సంస్కృతి సాంప్రదాయాల స్థానంలో ఆధునికత వచ్చింది. కొత్తల పండుగ, సుంకులు పండుగ, ఇలకట్ల పండుగలు పోయాయి. కొత్త కొత్త పండుగలు రాజ్యమేలుతున్నాయి. భూపరాయీకరణతో పాటు, బతుకు పరాయీకరణ జరిగిపోయింది.
ఉద్యమాల ప్రభావం సాహిత్యంపై పడిన రీతి?
గిరిజనేతరులు అడుగుపెట్టికే మా జీవితాలు అల్లకలోల్లమయ్యాయి. ఆ కల్లోలం నుండే శ్రీకాకుళం ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ప్రభావంతోనే ఛాయారాజ్ ‘శ్రీకాకుళకావ్యం’ రాశారు. కొన్ని వ్యాసాలు, పరిశోధనలు, కవిత్వాలు, కథలు వచ్చాయి.1989 ప్రాంతాల్లో ఈ దీర్ఘకావ్యం వస్తే మళ్ళీ 2007లో నల్లూరి రుక్మిణి ‘ముంపు’ పేరుతో పోలవరం వ్యతిరేక దీర్ఘకవిత వచ్చింది. పోలవరం, వాకపల్లి సంఘటనల తర్వాత సాహిత్యకారులు క్షేత్రస్థాయి పర్యటనకు రావటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకోవచ్చు’ అయితే ఆ స్థాయిలో సాహిత్యం రావాల్సిన అవసరం వుంది. మళ్ళీ ‘బల్లుగూడ’ లో అంతే దారుణం జరిగింది.
గిరిజన సాహిత్యం గురించి
1930లో మొదటి గిరిజన కథ వస్తే, 2009 నాటికి గిరిజన కథా సంకలనం వెలుగు చూడగలిగింది. గిరిజన కధల్ని 3 రకాలుగా విభజింపవచ్చు. 1. ఉద్యమకధలు 2. సానుభూతితో రాసిన కథలు 3. వాస్తవిక కథలు. సాహిత్యం సంఘాలకన్న గిరిజన ఉద్యమాలతో పనిచేసినవారే మంచికధలు రాశారు. కారణాలు ఏమైనప్పటికీ అనేక సందర్భాల్లో మా వాళ్ళు సాహిత్యంలో పరాయివాళ్ళుగానే మిగిలారు.
గోపిభాగ్యలక్ష్మి రాసిన ‘జంగుబాయి’ వాడ్రేవు వీరలక్ష్మిదేవి రాసిన ‘కొండఫలం’ లాంటి కథలు ఇంకా రావలసి వుంది. కొండరెడ్ల వల్ల వెదురు అంతరించిదని ఫారెస్ట్ వారి వాదన. కానీ నిజానికి వెదురు అంతరించింది గిరిజనులవల్లకాదు కాగితం పరిశ్రమవల్ల.
అనువాద సమస్యలెలా వున్నాయి?
పోలవరం ముంపు దీర్ఘ కవితను కోయభాషలోకి అనువదిస్తున్నపుడు ఒక ఆసక్తికరమైన విషయం గమనించాను. వెదురు పొదను కోయభాషలో ఏమంటారో నాకు తట్టలేదు. స్కూల్లో పిల్లల్ని అడిగిన తెలీదన్నారు. 60 సం. దాటిని వృద్ధులు మాత్రమే వెదురుపొదను ‘పిడెం’ అంటారని చెప్పగలిగారు. ఏజన్సీలోకి కాగితం పరిశ్రమలు రావటంతో వెదురు ఒక్కటే అంతరించిపోలేదు. దాంతో పెనవెసుకుపోయిన కోయ, కొండరెడ్ల పదసంపద, పాటలు మొత్తం అంతరించాయి.
లిఖిత సాహిత్యానికి మీవంతు కృషిి?
ఏ ఉద్యమం వచ్చినా మావాళ్ళలో ఆట, పాటను ప్రోత్సాహించారే తప్ప – లిఖిత సాహిత్యంవైపు మళ్ళించే ప్రయత్నంచేయలేదు. లిఖిత సాహిత్యంలో నేనే మొదటిదాన్ని. మా భాషలోని ఎన్నెన్నో విషయాన్ని, సంస్కృతినీ లిఖిత రూపంలోకి తీసుకొస్తున్నాను.
విద్యావంతులౌతున్న వారిపై మీ అభిప్రాయం?
ఆధునికత మాయలో పడి పోతున్నారు. మైదాన ప్రాంత సంస్కృతిని అనుసరిస్తూ మూలాలకు దూరమౌతున్నారు. ఒకవైపు కొందరు సాహిత్యకారులు గిరజనేతర స్వభావాన్ని వదులుకుని గిరిజనుల్తో మమేకం కావాలని చూస్తుంటే మరో వైపు ఆ గిరిజనులే జాతి స్వభావాన్ని వదులుకుని గిరిజనేతరుల్ని అనుసరించాలని తహ తహలాడుతున్నారు.
గిరిజనుల్ని సాహిత్యకారులుగా మార్చాలంటే..
గిరిజనుల గురించి రాసిన సాహిత్యాన్ని గిరిజనుల భాషలోనే అనువదించాలి. వాళ్ళతోనే చదివించాలి లేదా చదివి వినిపించాలి. అప్పుడే కథ అంటే ఏమిటో కవిత్వం అంటే ఏమిటో తెలుస్తుంది.
ఒక గిరిజన స్త్రీగా, మీరు ఎదిగిన క్రమంలో మిమ్మల్ని బాగా సంతృప్తి పరిచిన విషయమేమిటి?
నేను ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, మానవత్వమున్న మనిషిగా, కులమత భేదాలు పాటించని వ్యక్తిగా, నా వాళ్ళను ఎంతమందిని వీలైతే అంతమందిని విద్యావంతులుగా చేస్తున్న తృప్తి వుంది. కోయ భాషలోకి విస్తృతంగా అనువాదాలు చేసి నావాళ్ళందరి గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని వుంది.
మీరే ఒక వెలుగు. వెన్నెల. మీతో మాట్లాడిన తృప్తితో ‘భూమిక’ తరుఫున ధన్యవాదాలు చెబ్తున్నాను.
ఇంటర్వ్యూ : శిలాలోలిత
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags