పెంటమ
ముప్పయ్యో పడిలో ఉన్న పెంటమ్మ బ్రతుకుబండిని ఉత్సాహంగా అలుపు లేకుండా లాక్కుంటూ ముందుకు పోతూంది. మహిళా స్వాతంత్య్రం. సాధికారత గురించి ఆమెకు పెద్దగా తెలీదు. అసలు తెలీదు. ఒక్కతే కూతురుగా గారాబంగా పెరిగింది. చదువుకోవడానికి అమ్మ నాన్నలు పంపలేదు. పనికి వెళ్ళాల్సిన అవసరం ఆమెకు రాలేదు. కానీ పెళ్ళి, కుటుంబబాధ్యతలు ఆమెను నిరంతర జీవన సంఘర్షణలో పడేసాయి. సంగారెడ్డి దగ్గర కలుముల అన్న చిన్న గ్రామం నుండి నగరానికి వలస వచ్చిన ఆమె కుటుంబం పొలాలు, ఇల్లు, బంధువులు అన్ని ఊర్లోనే వదిలి వచ్చింది. తనకు ఊహ తెలియని వయసులోనే అమ్మ, నాన్న, అన్న, తను నగరానికి జీవనోపాధికోసం వెతుక్కుంటూ వచ్చారు. అలా ఒక గ్రామీణ వ్యవసాయ కుటుంబం నగరంలో భవన నిర్మాణ కార్మిక కుటుంబంగా మారిపోయింది. ఎందుకు ఊరొదిలి రావాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ఆమె అమాయకమైన సమాధానం, తమ కుటుంబం పచ్చగా ఉండేదని, ఎవరయినా చెడు చేస్తారేమోనన్న భయంతోనే అలా వచ్చేశామని. కారణాలేమయినా సరే, వలస జీవనం వాళ్ళ కుటుంబంలో మార్పులు తెచ్చిన మాట నిజం. అన్నీ వదులుకుని వలస పక్షులుగా నగరానికి వచ్చిన కుటుంబంలో ఆమె స్థానానికి, భద్రతకు లోటేమి రాలేదు. అమ్మ, నాన్న, అన్న రెక్కలు ముక్కలు చేసుకున్నా, అన్న పెళ్ళి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయినా, ఆమెకు శ్రమపడాల్సిన అవసరం రాలేదు. పుట్టింటి రక్షణలో నిశ్చింతగానే ఉండిపోయింది. ఒక్క కూతుర్ని బయటికెలా పంపుతాం. ఎలా శ్రమ పడనిస్తామన్న అమ్మనాన్నల అతిజాగ్రత్త ఆమెను ప్రపంచం తెలియని అమాయకురాలిగానే ఉంచేసింది. అయితే, తల్లితండ్రుల అతిజాగ్రత్త ఆమెను బంధించి, ఆమెను ప్రపంచాన్ని కుదించివేస్తే, పెళ్ళితో వచ్చిన బాధ్యతలు ఆమెను సుడిగాలిలా చుట్టి వీధిలోకి నెట్టేసాయి. యెంత కష్టపడినా కుటుంబాన్ని ఒక్కడే నిబాయిన్చులేకపోతున్న భర్త మేస్త్రి పనికి తోడుగా తను కూడా ఏదో ఒక పనిచెయ్యక తప్పని పరిస్థితి. కానీ, ఆమెకు వచ్చిన పని ఏముంది, ఏ పని చేసుకోవాలన్న చదువు తోడేది? కనీసం సంతకం కూడా చేయలేని పరిస్థితి ఆమెది. అందుకే, ఆమెకు తోచిన పని ఒక్కటే, ఇళ్ళలో పని చెయ్యడం. అమ్మనాన్నల కట్టుబాట్లు, కన్నీళ్ళు ఇక్కడేమీ పనిచెయ్యలేదు. చివరికి వాళ్ళు కూడా అయిష్టంగానే ఆమె పని చెయ్యడానికి ఒప్పుకున్నారు. కొంతకాలం తరువాత అమ్మ, నాన్న, అన్న ఒకే సంవత్సరంలో చనిపోయారు. అది ఆమెకు తేరుకోలేని దెబ్బ. అంతేకాదు, చిన్నప్పట్నుండి ఆమె పూర్తిగా ఆధారపడిన ఒక ఆధారం ఆమెకు పూర్తిగా లేకుండా పోయింది.
సాధికారత గురించి, స్వాతంత్య్రం గురించి మాట్లాడినప్పుడు పెంటమ్మ లాంటి స్త్రీలు మనల్ని ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంటుంది. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు అంతులేని కష్టాలు వాళ్ళను చుట్టుముట్టడం కనిపిస్తుంటుంది. అలాంటిది, అవ్యవస్థీకృత రంగంలో పనికోసం వెతుక్కుంటూ, ఏ క్షణం పని ఊడిపోతుందోనని గిజగిజలాడుతూ, పని వెతుక్కుంటూ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ బతుకు బండిని లాగే పెంటమ్మ లాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు ఎదుర్కుంటున్నది ఊహకు కూడా అందదు. తను, తన భర్త కలిసే సంసారం నడుపుతామని, భర్త చేతికి తన సంపాదన ఇవ్వకపోయినా ఖర్చు గురించిన వివరాలు మాత్రం అతనికి చెప్పాలని ఏ ఫిర్యాదు లేకుండా చెప్పే పెంటమ్మ, చదువుకుంటే తన జీవితం బాగుండేదేమోనని కాస్త బాధపడినట్లు కనిపిస్తుంది. హక్కుల గురించి, ఉద్యమాల గురించి ఏమాత్రం తెలియని పెంటమ్మ తనకేమీ తెలియదని అనుకోవడంలోనే తృప్తి పడుతున్నట్లు అనిపిస్తుంది. ఆడవాళ్లయిన, మగవాళ్లయిన కష్టమైతే తప్పదు కానీ, ఇద్దర్లో ఆడవాళ్లకే కష్టం ఎక్కువుంటుంది. ఒక ఇల్లు కట్టుకుంటే చాలు ఇంక జీవితంలో ఏ లోటు ఉండదంటుంది. ఒక చిన్న సర్కారీ కొలువు దొరికితే ఇంకంతకంటే భాగ్యమా అని సంబరపడుతుంది. యింత కష్టంలోనూ పెంటమ్మ నవ్వుతూనే ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఎంతో ఆశతో ఉంటుంది. పెళ్ళయినప్పట్నుంచి అంటే పదిహేనేల్లనుండి ఇళ్ళలో చాకిరీ చేస్తున్నా కూడా ఆమె అలసిపోయినట్లు కనిపించదు. జీవితం పట్ల పెద్దగ ఫిర్యాదులు వినిపించవు. పరిస్థితిని మార్చుకోవాలన్న ఆరాటం కనిపించదు. ఆమె నిశ్చింతను, ఓర్పును చూసి మెచ్చుకోవాలనిపించినా కూడా కాస్త చైతన్యం కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో కదా అన్న ఆశ కూడా కలుగుతుంది. ఆమెకు ఇంకో కోరిక, ఆశయం కూడా ఉన్నాయి. అది ఆమె ఒక్కగానొక్క కూతురి భవిష్యత్తు. ఆరో తరగతి చదువుతున్న ఆమె కూతురు వరలక్ష్మి బాగా చదువుకోవాలని, మంచి కొలువు చేయాలనీ, తనలాగా బాధపడొద్దని, ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్నవి ఆమె కలలు. తన తల్లితండ్రుల్లాగా కూతుర్ని చదివించకుండా ఉండొద్దని, ఒక్క కూతురయినా సరే ఆమెకు ప్రపంచం తెలిసేలాగా చేసి, బాగా చదివించి, గౌరవంగా బ్రతికేలాగా చెయ్యాలని ఆమె ఆకాంక్ష. సాధికారత అన్న మాట ఆమె వినను కూడా లేదు. కానీ కూతురయినా సాధికారత సాధించాలని ఆమె తహతహలాడుతోంది. తన జీవితంలో సాధించలేని హక్కులను కూతురికయినా అందేలా చెయ్యాలని తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి, పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు నడుస్తోంది పెంటమ్మ.
ఇంటర్వ్యూ: కె.సునీతారాణి
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags