ప్రొ. పుష్పా రామకృష్ణగారు ఇంగ్లీషు ప్రొఫెసరుగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేసి మొన్న డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. పుష్పారామకృష్ణగారు అకడమిక్‌లో, అడ్మినిస్ట్రేషన్‌లో ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డైరెక్టర్ అకడమిక్స్, న్యాక్ కమిటీలోలో గౌరవసభ్యులుగా ఇలా ఏ పదవిని అలంకరించినా ఆ పదవికి గౌరవాన్ని తెచ్చి పెట్టేలాగా సమర్ధవంతంగా నిర్వహించి యూనివర్సిటీలో గుర్తింపు పొందారు. ఇంగ్లీషు భాషా బోధన మీద పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణలు చేసి ఎంతో మంది విద్యార్ధుల పరిశోధనలను పర్యవేక్షించారు. ఈమె తెలుగులో ప్రముఖ పాత్రికేయులు శ్రీ.జి.ఎస్.భార్గవగారి కుమార్తె. సాహిత్యమన్నా, విద్యార్ధులన్నా విపరీతమైన ప్రేమ, స్త్రీ సాధికారతకు, సాఫల్యతకు ఈమె చక్కని ఉదాహరణ.
ప్ర. నమస్కారం మేడం, ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీకు నా హార్ధిక శుభాభికాంక్షలు.
పుష్ప. శుభాకాంక్షలు మనందరికీను. ఇంకా, ఇంకా మన స్త్రీలందరు వారి వారి పరిమితుల్ని, అడ్డంకుల్ని దాటి, సమాజంలో మన్ననలు పొందుతారని ఇంకా ఇలాంటి ఉత్సవాల్ని ఉత్సాహంగా చేసుకుంటారు.
ప్ర. మరి ఈ వందేళ్ళ ప్రయాణాన్ని పరిశీలిస్తే మీకేమయినిపిస్తుంది? నిజంగా భారతీయ మహిళలు సాధికారతను సాధించారంటారా?
పుష్ప. ఖచ్చితంగా వందేళ్ళ కిందటి కంటే ఇప్పుడు మహిళలు సాధికారత విషయంలో కాస్త మెరుగ్గా వున్నారనే చెప్పాలి. కాకపోతే భారతీయ సమాజం, దాని సంస్కృతి, కట్టుబాట్లు, కుటుంబ వ్యవస్థ వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మార్పు అన్నది మనదేశంలో క్రమేణా జరుగుతున్నదనే వాస్తవాన్ని గుర్తించాలి. స్త్రీల విషయంలో మార్పు అకస్మాత్తుగానో, విప్లవాత్మకంగానో లేదు. మార్పు క్రమేణా వన్నందువల్ల స్త్రీల విషయంలో ప్రగతి కూడా నిదానంగానే జరుగుతుంది.అయినా కూడ మనదేశంలో స్త్రీవిద్య, ఆరోగ్యం, ఉద్యోగ విషయాల్లో ముందున్నామనే చెప్పవచ్చు. కాకపోతే ప్రజల దృష్టికోణంలో కొన్ని రంగాల్లో మార్పు కొంత వేగంగానే రావల్సిన అవసరముంది.
ప్ర. ఇప్పటి మహిళ బయట ఉద్యోగం చేస్తూ, ఇంట్లో ఇంటిపని చేస్తూ పిల్లల పెంపకం వారి అవసరాలను తీరుస్తూ, ఇలా కుటుంబంలో అన్ని పనులు మీద పడెటప్పటికీ ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీలు చాలా ఒత్తిడికి లోనవుతున్నారుకదా! దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?
పుష్ప. నిజమే. మన ఇండియన్ కాంటెస్ట్‌లో స్త్రీకి ఇంటిపని, బయటపని ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో పనిచేసేవారికి ఇంటినుండి, పనిచేసే చోటుకు మధ్యన దూరం. ప్రయాణం ఇలా అన్ని కలిసి ఒత్తిడిని పెంచుతాయి. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే పనికి, వున్న సమయానికి మధ్య సమన్వయం చేసుకునే అవగాహన ప్రతి స్త్రీకి వుండాలి. ఇంటి పనికి, ఆఫీసు పనికి సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. దానికి స్త్రీకి సరియైన అటిట్ట్యూడ్ బట్టి వారు పనులను ఇష్టపడి చేస్తున్నారా, కష్టపడి చేస్తున్నారా అన్నది వుంటుంది. మనం పనిని ఇష్టపడి చేస్తుంటే మాత్రం చాలా మటుకు సాధకబాధలు తగ్గిన్నట్టనిపిస్తాయి. ఇంకా అన్ని పనులు మా మీదే పడ్డాయన్న సెల్ప్‌పిటీ కూడా ఒత్తిడిని ఇంకా పెంచి చీకాకు పరుస్తుంది. అందుకే స్త్రీకి తన సమర్ధతతపై అవగాహన, ఆత్మవిశ్వాసం వుండడం ముఖ్యం.
ప్ర. ఇంటి పనిని పురుషుడు తన బాధ్యతలో భాగంగా గుర్తిస్తే స్త్రీకి ఎంతో ఊరట లభిస్తుంది అని ఉద్యోగం చేసే స్త్రీల అభిప్రాయం. మరి మీ అభిప్రాయం?
పుష్ప. అది నిజమే, కాని పరిస్థితి ముఖ్యంగా మన భారతదేశంలో అలా లేదు. సంప్రదాయబద్ద కుటుంబాల్లోనూ, జనాలల్లోను ఇంటి పని అంటే ఆడవాళ్ళ పని అని ముద్ర పడిపోయింది. ఎవరైనా భర్తలు దీనికి భిన్నంగా ఆలోచించి, ఇంటి పనిలో పాలు పంచుకుంటే మిగిలిన కుటుంబ సభ్యులుదాన్ని బాధ్యత పంచుకోవడం అనికాక భార్య చేయిస్తుందన్న భావన వస్తుందని కూడా మగవాళ్ళు ముందుకు రారు. ఇదో స్టిగ్మ కింద వస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే చదువుకున్న వాళ్ళలో మార్పు వస్తున్నది. దీనికి ముఖ్యంగా నా కుటుంబ నేపధ్యం, చదువు, కుటుంబంలో పిల్లల పెంపకం ఇవన్నీ పరిస్థితుల్లో మార్పు రావడానికి కారణమౌతాయి. అందుకే పిల్లలకు పనిపట్ల గౌరవాన్ని పెంచాలి. ఇప్పటి జనరేషన్‌లో పిల్లలు తల్లి పనిచేయడం, ఆమె పడే సాధక బాధలు చూస్తారు గనుక కొంత పని పంచుకోవడం పట్ల వెనుకాడరు. ఇదంతా మనం ఎలాంటి విలువల్ని పిల్లలకు బోధిస్తున్నాం. మనం పాటిస్తున్న విలువలు ఇవీన్న చాలా ముఖ్యం,
ప్ర. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలా మంది స్త్రీలు, ఇంటిపని, బయటపని వత్తిడికి లోనయి ఎందుకొచ్చిన తంటా, హాయిగా గృహిణిగా వుంటే చాలు అని అనడం ఈ మధ్య వింటున్నాం. దీనిపై మీ స్పందన.
పుష్ప. అలా ఆలోచించడం వాళ్ళకు తాత్కాలికంగా ఉపశయనం ఇస్తుందేమోకాని అది పరిష్కారం కాదు. కొద్దిరోజులకే వారి నిర్ణయంపట్ల చింతిస్తారేమో. ఎందుకంటే ఉద్యోగం డబ్బునే కాదు. వారికో గుర్తింపును, ఆత్మతృప్తిని, గౌరవాన్ని ఇస్తుంది. ఇకపోతే కొందరికి నిజంగానేకొన్ని సీరియస్ హాబీస్ లేదా కళల పట్ల ఆసక్తి వుంటాయి. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, రచనావ్యాసంగం ఫ్యాషన్‌డిజైనింగు ఇలా వారు తమ సృజనాత్మక పనులకు ఉద్యోగం ఆటంకం అనిపిస్తే, ఉద్యోగాన్ని వదిలేసి తమ పూర్తి సమయాన్ని కేటాయించవచ్చు. దీనికి వయస్సుతోనో, చేసే ఉద్యోగంతోనో సంబంధం లేదు. ఎందుకంటే మా అమ్మగారు పదవీ విరమణ తరువాత డెభ్భై ఏళ్ళ వయస్సులో చిత్రలేఖనాన్ని కొనసాగిస్తోంది. అది ఆమె సృజనాత్మక అభివ్యక్తి. అది ఆమెకు అమితానందానిస్తోంది.
ప్ర. నేటి స్త్రీ వున్న ఈ సంక్లిష్టబాధ్యతల నేపధ్యంలో తనకై తను సమయాన్ని కేటాయించుకోలేకపోతుంది. అంటే తనకంటూ పర్సనల్ స్పెేస్ లేకుండా పోతుందని కూడా కొన్ని సార్లు అనిపిస్తుంది కదా! దీనికి మీరేమంటారు?
పుష్ప. ఇది కొంతవరకు నిజమేకానీ. అది జీవితంలో కొన్ని దశలలో అంటే పిల్లలు చిన్నగా వున్నపుడు, కుటుంబంలో అందరూ కొన్ని సందర్భాల్లో బాధ్యతల్ని పంచుకోలేకపోయినప్పుడో అలా జరుగుతుంది. కానీ ఎల్లప్పుడూ అది వుంటుందని అనుకోను.
ప్ర. చదువుకు స్త్రీల సాధికారతకు వున్న సంబంధం ఎలాంటిది?
పుష్ప. దీనికి నేను ఇంకో పదాన్ని చేరుస్తాను. అది నైపుణ్యం. చదువు, వృత్తి విద్యా నైపుణ్యం లేదా ఇంకేదైనా పనిలో నైపుణ్యం ఈ రెండు స్త్రీలలో అపారమైన ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. తద్వారా వారికి ఇంకా సమాజంలో పురోగతి పొందాలని అంతవరకు తామెరగని ప్రపంచంలో కూడా గుర్తింపు పొందాలని ఓ ఆశయం ఏర్పడుతుంది. ఇంకా చదువు వారిలో మానసిక పరిణితికి కూడా తోడ్పడుతుంది. నైపుణ్యం వల్లనే పల్లెలోని స్త్రీలు ఆర్ధికాభివృద్ధి పొందుతున్నారు. దీనికి డ్వాక్రా మహిళలే మంచి ఉదాహరణ. ఓపెన్ యూనివర్సిటీలు వచ్చాక స్త్రీల చదువుకు మంచి అవకాశం ఏర్పడింది. మా యూనివర్సిటీలోనే వివిధ కోర్సుల్లో నమోదయిన స్త్రీల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వుంది. 2009 సంవత్సరానికిగాను మా దగ్గర నమోదు చేసుకున్నా స్త్రీలు దాదాపు 41%. ఇది నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం.
భూమిక కోసం సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి బయటకొస్తుంటే పుష్పరామకృష్ణగారిలోని ఆత్మవిశ్వాసాన్ని, సహృదయతను ప్రతిబింబిస్తూ ఎదురుగా ఎర్రని పూల చెట్టు స్నేహంగా నవ్వినట్టనిపించింది. ఇంటర్వ్యూ : సుజాతాపట్వారి
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags