పిల్లల పెంపకంనుంచే మార్పు రావాలి.

కొండపల్లి దుర్గాదేవి
కొండపల్లి దుర్గాదేవి గారు ఖమ్మం జిల్లాలో మహిళా సమస్యల పట్ల ఎక్కువగా కృషి చేశారు. మహిళా సంఘ అధ్యక్షురాలిగా, సామాజిక కార్యకర్తగా విశేషకృషి చేశారు.  రాష్ట్ర, కార్యదర్శిగా అనేక బరువు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించారు. వారి రాజకీయ, సామాజిక జీవితానుభవాన్ని పంచుకుందాం.
కానీ నేను నా జీవితంలో చేసినవన్నీ నాకెంతో ఆత్మతృప్తినిచ్చినా, యింకా చెయ్యాల్సింది చాలానే వుంది. మీకు రాజకీయ జీవితం యిష్టమా? కుటుంబ జీవితం యిష్టమా? అనేదానికి(చిర్నవ్వుతో) రెండూ యిష్టమే. నా బాల్యం గురించి చెప్పాలంటే కారేపల్లి మా ఊరు. భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబం మాది. మా నాన్న నేతునూరి వీరరాఘవగారు. కమ్యూనిస్ట్‌ భావజాలంలో వుండేవారు. స్త్రీలు బయటికి రావడం అంటూ వుండేది కాదు. కానీ మా నాన్నగారి ప్రోత్సాహం వల్ల ఇల్లందులో జరిగిన గ్రంథాలయ మహాసభకు వాలంటీరుగా వుండటం, పాటలు పాడటం నాకెంతో ఉత్సాహాన్నిచ్చేవి. అక్కడే సాహిత్యాన్ని ఎక్కువగా చదువుకున్నాను. అమ్మ, గోర్కీ నాపై చాలా ప్రభావాన్ని చూపాయి. జనంలో వుండటం బాగన్పించేది. 1933లో ఏప్రిల్‌ 10న పుట్టాన్నేను. రజాకార్‌ మూమెంట్‌లో మా బాబాయ్‌తో కలిసి కె.యల్‌. నరసింహారావు గారు పనిచేశారు. అప్పట్లో పార్టీకి తెలంగాణాలో నిషేదం వుంది, ఆంధ్రలో లేదు. అందుకని నన్ను, తమ్ముడిని వీళ్ళన్నా బతికితే చాలని విజయవాడ పంపారు. ఆ రోజుల్లోనే నాకు రాజకీయావగాహన బాగా పెరిగింది. కె.యల్‌. గారు పరిచయమయ్యారు. పుట్టిన ప్రతిమనిషీ సమాజానికెంతైనా చెయ్యాల్సిన బాధ్యత వుందనిపించేది.
కె.యల్‌.గారిలో నాకు నచ్చిన విషయాలు సేవాభావం, నిజాయితీ, ఆడవాళ్ళ పట్ల వుండే గౌరవం, కరుణ గల హృదయం. మీ పెళ్ళికి పెద్దలొప్పుకోలేదు ఆర్థిక అంతరాలున్నాయన్న కారణంతో అభ్యంతరపెట్టినా, మేం దండల పెళ్ళి చేసుకున్నాం. పెద్దకొడుకు ఉత్తమ్‌కుమార్‌ లాయర్‌, రెండవకొడుకు పావన్‌ 52లో పుట్టినప్పుడే పుచ్చలపల్లి గారు ఎమ్‌.ఎల్‌.ఏ. అయ్యారు. పార్టీలో యిప్పటికీ పావనున్నాడు. వారి భార్య లీలగారు నేనూ మంచి స్నేహితులం, ఆకుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం కూడా పరిచయమయ్యాం. కూతురు సుధ లెక్చరరిప్పుడు. నాకు పాటలంటే యిష్టమని చెప్పాను కదా! శ్రీశ్రీ పాటల్ని అద్భుతంగా పాడుతున్న యాకూబ్‌ని చూసినప్పటి నుంచీ నా పెంపుడు కొడుయిపోయాడు. కె.యల్‌.గారు మూడుసార్లు ఎమ్‌.ఎల్‌.ఏగా చేశారు. ఎమ్‌ఎల్‌ఏ క్వార్టర్స్‌లో వుండటంవల్ల స్త్రీలందరం సంఘటితం కావడం, కలిసి ప్రయాణాలు చేయడం, రేడియో ప్రోగ్రాములు, పార్టీలతో నిమిత్తం లేకుండా స్త్రీలంతా స్నేహంగా వుండేవాళ్ళం. ఉదయంగారితో పరిచయమైంది. 33 నుంచీ మహిళాసంఘం వుండేది. 1974లో రాష్ట్ర మహాసభ పునర్నిర్మాణం జరిగింది. ఖమ్మంలో అన్ని రాష్ట్రాల నుంచీ బెంగాల్‌, కేరళ నుంచి మహిళామంత్రులు కార్యకర్తలు వచ్చారు. నన్ను కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. జిల్లా అంతా పర్యటనలు చేయాలి. ముందు కొంత సంశయించినా? చెయ్యగలవా? అని ఇంట్లో చర్చకు రాగానే పట్టుదల వచ్చి పనిచేశాను. ఖమ్మం జిల్లాలోనే ఒక పఠిష్టమైన మహిళాసంఘంగా తీర్చిదిద్దాను. ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాను.
ఈ మహిళాసంఘాల ద్వారా మేం కుటుంబ తగాదాలు పరిష్కరించేవాళ్ళం. మహిళలను సమీకరించడానికి మొదట్లో చాలా కష్టమయ్యేది. అందరూ పొలం పనుల్లో వుండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి, మనని మనం చైతన్యపరుచుకోవడం ఎంత అవసరమో తెలియజెప్పేవాళ్ళం. స్త్రీలు కూడా  మనుషులే అనే స్పృహను కలిగించడానికి చాలాసార్లు చర్చించేవాళ్ళం. అన్ని పనులతోపాటు స్త్రీలంతా కలవటం కూడా ఒక పనే అనేవాళ్ళం. స్త్రీని తక్కువగా చూడడాన్ని వ్యతిరేకించేవాళ్ళం. నన్ను నేను చైతన్యపరచుకోవడానికి, సంస్కరించుకోవడానికి మూడు నాలుగేళ్ళకు పైగానే పట్టింది.  ఉద్యోగం పురుషలక్షణం కాదు. మానవలక్షణం కూడా. మొత్తం పనులన్నీ నావే అనుకుని మీదేసుకోకుండా, పనుల్ని అందరూ పంచుకుంటే, స్త్రీకి ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికస్వేచ్ఛ వున్నప్పుడు మాత్రమే, తాను సంపాదించే ప్రతిపైసా మీదా తనకు హక్కున్నప్పుడు మాత్రమే ఆర్థిక స్వాతంత్య్రం వున్నట్లు. ఐతే యివన్నీ మనం చేయగలం. ఆర్థికపరమైన బాధ్యతగా ఉద్యోగాల్ని ఎట్లా భావిస్తారో, సామాజిక బాధ్యతగా కూడా సంస్కరణ బాధ్యతల్ని స్వీకరించాలి. మనం చేస్తున్న మంచిపనులు, నమ్మకమే పనిగంటల్ని మిగుల్చుతుంది. వెసులుబాటును కూడా మనమే చేసుకోగలగాలి. పిల్లల పెంపకంలో కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొనేట్లుగా నేర్పాన్నేను. మంచిపిల్లలుగా పెంచానన్న తృప్తి నాకుంది.
మహిళా సాధికారత గురించి – కారేపల్లి గ్రామపంచాయితీలో మెంబర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యాను. ఎంతో నిజాయితీగా కమిటీని నడిపేవాళ్ళం. ఉద్యోగస్తురాలైన స్త్రీకి తన తల్లిదండ్రులకు ఖర్చుపెట్టుకోగలిగే స్వేచ్ఛ ఈనాటికీ కొందరికి లేదు. ఇంట్లో, బయటా, పనిస్థలాల్లో హింస చాలా పెరిగిపోయింది. స్త్రీలంటే వుండే న్యూనతాభావం పోలేదు సాంతం. పిల్లల పెంపకంనుంచే మార్పు రావాలి. తల్లిదండ్రులు చైతన్యవంతులైనప్పుడు చాలావరకు ఈ సమస్యలు రావు. స్త్రీనింకా వస్తువుగా, తన హక్కుగా భావించడం వల్లనే, ఇన్ని గొడవలు – స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేసే స్థితి పోవాలి. నా దృష్టిలో స్త్రీలే సమర్థులు కూడా. ఇప్పుడున్న స్థితిపై నా అభిప్రాయంఏటంటే మహిళాసంఘాల్లో మార్పు రావాలి. వాళ్ళ దృష్టికీ సమగ్రత రావాలి. మా రోజుల్లో వున్నట్లుగా లేవిప్పుడు చాలావరకు. కెప్టెన్‌ లక్ష్మి, బృందా కారత్‌ లాంటి వాళ్ళ స్ఫూర్తి కావాలి. బెంగాల్‌లో పనిమనుషుల్ని కూడా సంఘసభ్యులుగా చేర్పించారు. లీలమ్మగారు పనిమనుషులకు సెలవులు జీతంతో యివ్వడమే కాకుండా, ఆ తర్వాత పెన్షన్‌ కూడా యిచ్చారు.  సమాజానికి నాకు చేతనైనంత వరకూ సేవచేసానన్న తృప్తి మిగిలింది. వ్యవసాయ రైతుల కార్మిక సమస్య గురించి, 12,000 మంది మహిళలను సమీకరించడం దేశంలోనే గుర్తింపు వచ్చింది. ఈ 77 ఏళ్ళ జీవితంలో రాజీపడటమే పరిష్కారం కాకుండా ఆ సమస్య తీవ్రతను బట్టి ధైర్యంగా స్త్రీ బతకొచ్చు అని ధైర్యాన్నిచ్చినదాన్ని. కె.ఎల్‌.గారూ నేనూ ఒకే భావజాలంతో వున్నవాళ్ళం కాబట్టి కలిసి హాయిగా జీవించాం. ఇవాళ చాలావరకు అలా లేరు. వ్యక్తి శ్రేయస్సే ముఖ్యమనుకుంటున్నారు. పూర్తిగా తను, తన కుటుంబం, ఆ తర్వాతే సమాజం అనుకుంటున్నారు. మౌలికంగా ఈ తేడా మా తరానికీ ఈ తరానికీ వుంది. పోరాటకాలంలో కొరియర్‌గా వ్యవహరించడం నాకిప్పటికీ తృప్తి కలిగించే సంగతి. స్త్రీలను చైతన్యపరచడంలో, ఐక్యత దిశగా పయనించడంలో, ఎందరో స్త్రీలకు ఆలంబనగా నిలిచిన ఒకనాటి మహావృక్షం కొండపల్లి దుర్గాదేవి గారు. ఇప్పటికీ సమావేశాలన్నా, జనసందోహమన్నా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న నిత్యచలనశీలి ఆమె.                                                                 ఇంటర్వ్యూ: శిలాలోలిత

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

2 Responses to పిల్లల పెంపకంనుంచే మార్పు రావాలి.

  1. jayabharathi says:

    నమస్స్కారము సత్యవతి గారూ
    మీ భుమిక దినిదిన ప్రవర్ధమానమై ఎదుగుతున్నందుకు సంతొషమ. బహుష నెను మీకు గుర్థు ఉందకపొవచ్చు 2003 అనుకుంతాను, అఖిల భారత మహిలా సహిత్య,అక్వయిత్రుల సమ్మెలనంలొ కలిషాము . అప్పత్లొ మీరు నన్ను భుమిక సత్యవథిగా గుర్థు ఉంచుకుంటెచాలు అనెవారు. . షిలలొలిథగారు కూదా నన్ను మర్చిపొరని అనుకుంతా. మా పొలెపల్లిసెజ
    గురించి మీరు. వ్రాసిన ఆర్తికలు బాగుందిబానన్ను గుర్థుంచుకుంతె మత్లదంది. 9989040440 జయ భారతి సుసర్ల

  2. jayabharathi says:

    నెను మొదటి సారి తెలిగు లొ టైపు చెసా . చాలా తప్పులు వచ్చాయి . క్షమించంది. .

Leave a Reply to jayabharathi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.