వందేళ్ళ క్రితం, వైశ్యుల్లో సాంఘిక చైతన్యం: ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభలో దరిశి చెంచయ్య అధ్యక్షోపన్యాసం – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా

ఆర్యవైశ్య యువజన సోదరీ సోదర మణులారా!
ప్రస్తుతము ప్రపంచమున గొప్ప సంఘర్షణ మేర్పడినది. ధనవంతులతో దరిద్రులకును, బలవంతులతో బలహీనులకును, పాలకులతో పాలితులకును పోరాటమేర్పడినది. ఒక దేశమును మరియొక దేశము, ఒక జాతిని మరియొక జాతి, నమ్ముట లేదు. ప్రజా స్వాతంత్య్రమునకై ప్రభుత్వ విధానములు తారుమారు జేయబడుచున్నవి.

మత, సాంఘిక నిరంకుశత్వమును రూపుమాప ప్రయత్నములు తీవ్రరూపము దాల్చుచున్నవి. స్త్రీలు తమ హక్కులకై పురుషులతో పోరు సలుపుచున్నారు. కొలది కాలముననే అత్యద్భుతమగు మార్పులు జరుగగలవు. జరిగి తీరును. మార్పులు జరుగుటకు ముందు, సంఘర్షణ మేర్పడుట సహజమై యున్నది. ఇట్టి పోరాటము వలన, ప్రజలు భరింపరాని యాపదలను బడుచున్నారు. ఒక పోరాటము వలన, వేరొక దానికి బీజములు నాటబడుచున్నవి. వీని వలన తాత్కాలిక సౌఖ్యములైనను సంభవించుట లేదు. ప్రేమవలననే నిజమగు మార్పులు సంభవించును. ప్రేమవలననే శాశ్వత సౌఖ్య మేర్పడగలదు. ప్రేమవలన ప్రపంచమును జయింపవలెనను మహాత్ముల వాక్యములమోఘములై యున్నవి. నేటి యుద్ధములు జరుగకుండునటుల జేయుటకును, జాతి మత వివక్షత లేక యెల్లరు సర్వ మానవ సౌభ్రాతృత్వమును గలిగియుండుటకును, మానవకోటి యంతయు సుఖముగా, శాంతియుతముగా ప్రపంచయాత్ర జరుపుకొనుటకును మార్గముల నేర్పరుచుటకై యువజన మహాసభ లేర్పడుచున్నవి.
భరతఖండమున నేడు అమలునందున్న మత, సాంఘిక విపరీత పరిస్థితుల వలన, ఏ కులము వారా కులమునకు ప్రత్యేక యువజన సంఘముల స్థాపించి, తమ కులము నభివృద్ధికి దెచ్చుకొనుచు, తద్వారా తమ దేశమును, ప్రపంచమును బాగుజేయవలయునని తీర్మానించుకొనుచున్నారు. అట్టి యుద్దేశములతోనే sTÖ ప్రథమ వైశ్య యువజన మహాసభ నేడిచ్చట సమావేశమైనది.
ఏ కులము వారైనను తమ కులమునే గాక, దేశమును, ప్రపంచమును, బాగుజేయ దలంచునప్పుడు, తమ దేశమునందుగల మత, సాంఘిక, రాజకీయ పరిస్థితులను; ప్రపంచ వాతావరణమునే గాక, తమ కులమునందలి ముఖ్య లోపములను గమనించిననే గాని, తమ కులము నభివృద్ధికి దేజాలరు.
నేడు మన దేశమున గొప్ప సంగ్రామము జరుగుచున్నది. ఈ యుద్ధమునకు సభలును, పత్రికలును అస్త్ర శస్త్రములుగ నేర్పడినవి. ఈ యుద్ధమున రెండు కక్షలు గలవు. ఒక కక్షవారల్పసంఖ్యాకులు. ఒక కక్షవారధికసంఖ్యాకులు. రెండు కక్షలేల యేర్పడినవో, వారు నెరవేర్చదలచిన ఆశయములేవో, వారి భవిష్యత్కార్యక్రమమెట్టిదో బోధపడుచునే యున్నవి.
మత, సాంఘిక విషయములందు నెల్లరమేకాభిప్రాయముతో పోరుసల్పి, రాజకీయ స్వాతంత్య్రమును సంపాదించుదమని ఒక కక్ష నాయకులు బలుకుచున్నారు. వీరే అల్పసంఖ్యాకులతో జేరిన కక్షకు జెందినవారు. వీరు అగ్రజాతివారుగను, మత నాయకులుగను, బ్రాహ్మణులుగను వ్యవహరింపబడుచున్నారు. వీరు ప్రస్తుత మత, సాంఘిక పరిస్థితుల వలన అనేక సౌకర్యములను పొందుచున్నారు. నేటి మత, సాంఘిక పరిస్థితుల యందెట్టి మార్పులు గల్గినను, తమ సౌఖ్యము, తమ యధికారము జెల్లవని భయపడుచున్నారు.
ఇక నధిక సంఖ్యాకులగు రెండవ కక్షవారు ళిబ్రాహ్మణేతరులురి వేల సంవత్సరముల నుండి మత, సాంఘిక పీడనము వలన భరింపరాని కష్టముల బడుచు, మత, సాంఘిక స్వాతంత్య్రము లేకపోవుట వలననే హిందూదేశము పరాధీనయై బానిస దశ ననుభవించుచున్నదనియు, ముందు మత, సాంఘిక భేదములంతరించిన గాని ప్రయోజనము లేదనియు, మత, సాంఘిక స్వాతంత్య్రము వచ్చిన వెంటనే రాజకీయ స్వాతంత్య్రము తనంతట తానే వచ్చుననియు, కావున మున్ముందు మత, సాంఘిక సమస్యల పరిష్కరింప పాటుపడెదమనుచున్నారు. రాజకీయ స్వాతంత్య్రమునకై వారు త్వరపడుట లేదు. వేల సంవత్సరముల నుండి అణగద్రొక్కబడి, అధమ స్థితికి దేబడిన కులములవారీ రెండవ కక్షకు జెందినవారు. ఈ సాంఘిక, మత విప్లవములవలన వీరు అన్ని విధముల బాగుపడువారు గాని, నష్టపడువారు గారు.
ఈ సంగ్రామము మీ యెదుటనే జరుగుచున్నది. వైశ్యులు ఇంతవరకు పై రెండు కక్షలలో దేనియందును స్పష్టముగ జేరియుండలేదు. దూరము నుండి వీక్షించుచున్నారు. ఇకముందు, ఏదో యొక కక్షకు జేరకుండ నుండజాలరు. “మా కక్షకు జెందనివారు మాకు విరోధులని” రెండు కక్షల వారును జెప్పుచున్నారు.
బ్రాహ్మణేతర సంఘముల వారు జెప్పినట్లు, మత, సాంఘిక కష్టములను వెంటనే నివారింపవలసినంత దారుణమైన లోపములు ఉన్నవో లేవో ఆలోచింతము. బ్రాహ్మణులు జెప్పునట్లు, రాజకీయ స్వాతంత్య్రమేర్పడిన వెంటనే మత, సాంఘిక స్వాతంత్య్రము రాగలదేమో యోచింతము. బ్రాహ్మణులు స్వరాజ్యము వచ్చినప్పుడు నాయకులై, బ్రాహ్మణేతరులకు అన్యాయము చేయకుండుదురేమో చర్చింతము.
ప్రాచీన భారతదేశ చారిత్ర మత్యంత పూజనీయమైనది. మిక్కిలి కీర్తివంతమైనది. నాగరికతకు హిందుదేశము తోడ్పడినటుల యే దేశమును తోడ్పడి యుండలేదు. ఆనాటి భారతీయుల మనో దేహ ఆధ్యాత్మిక శక్తు లత్యద్భుతములైనవి. వర్ణించుటకలవిగానివి. మనుష్యులై జన్మించిరే గాని, నిజముగ వారు దేవతలే. వారట్టి గొప్పవారేల గాగలిగిరి? వారట్టి శక్తుల నేల పొందగలిగిరి? ఆ కాలము నందలి మత, సాంఘిక కట్టుబాటులే వారినట్టి వారినిగ జేయగల్గెను! గుణాధిక్యత గలవాడే బ్రాహ్మణుడు, గుణహీనుడే శూద్రుడు. పుట్టుక ప్రధానముగా నుండలేదు. ఉత్తమ ప్రవర్తన వలననే బ్రాహ్మణుడు కాగలిగెను. బ్రహ్మచర్యము నవలంబించుట, తపస్సుజేయుట, పరోపకారమునకై స్వార్థమును త్యాగము జేయుట, ద్రవ్యముపై నపేక్ష లేకుండుట మొదలగు నుత్తమ గుణములు గలవాడేజాతివాడైనను బ్రాహ్మణుడుగ నేర్పడుచుండెను.
జన్మనా జాయతే శూద్రః । కర్మణా జాయతే ద్విజః ।
వేద పాఠేన విప్రశ్చ । బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః ॥
మన ఋషుల జన్మములను గమనించినచో, sTÖ విషయములన్నియు స్పష్టపడగలవు. ఇక నాకాలమున బ్రాహ్మణులు గొప్ప కార్యముల జేసినారన్న ఆశ్చర్యమేమున్నది? ప్రజలట్టి వారిని గౌరవించిరనిన విచిత్రమేమున్నది? పవిత్రమగు వేదమతమన్నను, ప్రబంధ మతమన్నను, ఉత్తమమగు కట్టుబాట్లతో నిర్మింపబడిన హిందూ సంఘమన్నను, సక్రమ పద్ధతులతో సాగింపబడిన యాకాలమున గదా యేర్పడియుండినవి! అట్టి స్థితిగతుల నేర్పరచుటకును, అట్టి గౌరవమును సంపాదించుటకును, ప్రతి మనుజుడును ప్రయత్నించెనన్న అందతిశయోక్తి యేమున్నది?
కాని, ప్రస్తుతము మన మత, సాంఘిక పరిస్థితులెట్లున్నవి? పుట్టుక వలననే కొందరు అధికులుగను, అనేకులు అధములుగను జూడబడు స్థితి యేర్పడినది. ఎట్టి నీచ గుణములున్నను, బ్రాహ్మణులని పిలువబడు నింట బుట్టిన మాత్రమున, వానిని బ్రాహ్మణునిగ పూజింపవలెను. ఎట్టి సద్గుణముల గలిగియున్నను, పంచములుగ వ్యవహరింపబడుచున్న యింట బుట్టిన మాత్రమున, వానిని అధమునిగ జూడవలెను. మత, సాంఘిక గౌరవమునకు గుణాధిక్యత యెంతమాత్రము గణింపబడుట లేదు. హిందూ సంఘము ఇంతకన్నను అధోగతికి పోజాలునా? ఇట్టి సాంఘికపు మార్పుల వలన బ్రాహ్మణులకన్న నధోగతి పాలైనవారు గలరా? పుట్టుక వలన నేర్పడిన బ్రాహ్మణ గురువుల ప్రవర్తనలు భరతఖండము నధోగతికి దింపలేదా? ఈ నూతన బ్రాహ్మణులు, ప్రాచీన బ్రాహ్మణుల గౌరవములను, హక్కులను తమయందే నిలుపుకొని, బాహ్మణేతరుల నణగద్రొక్కి, వారి ధనమును దినుచు, బ్రాహ్మణేతరులలో అగ్రగణ్యులనంబడు ఉత్తములను గూడ బ్రాహ్మణులలో అధమాధములకన్న మత, సాంఘీక గౌరవములకు అర్హులు గారని యేర్పరచిన మత పీడనమును ఆత్మగౌరవము గల యే బ్రాహ్మణేతరుడు సహించగలడు? పరోపకారమే మతముగానెంచు మహాత్ములు, ఇట్టి మత, సాంఘిక నిరంకుశత్వమును, పీడనమును చూచుచు నుపేక్షజేయగలరా?
పూర్వకాలమున మహా ఋషులు, మునీశ్వరులు, తత్వశాస్త్రజ్ఞులు పొందుచుండిన మహా గౌరవమును, ప్రస్తుతము జగద్గురువులమని పేరు బెట్టుకొని, సమస్త ఇంద్రియ భోగములకు మరగి, స్వలాభము నపేక్షించుచు, తమ శాఖవారిని పోషించుటకు ప్రజలను పీడించుచుండ, వివక్షత తెలిసిన వారు ఇట్టి నామధారుల శిష్యులమని ఒప్పుకొనవలసినదేనా? దుర్నియమములైన మత, సాంఘిక కట్టుబాట్లకు లోబడి, బానిసలమై యుండవలసినదేనా? దేవాలయములు, మఠములు, పీఠములు, పురాణములు, హరికథలు, మంత్రములు మొదలగు పవిత్ర మార్గములన్నియు ఈ నవీన బ్రాహ్మణుల ఆధిక్యతను స్థిరపరచుటకు దుర్వినియోగము జేయబడుచుండగా, చేతగానివారివలె మనము చూచుచు నూరకుండవలసినదేనా? గుణాధిక్యత వలన గౌరవింపబడవలయునని బ్రాహ్మణేతరులు గోరుచున్నారు. జన్మవలన తమకు సంక్రమించిన గౌరవమును త్యజించమని ఈ నూతన బ్రాహ్మణులు జెప్పుచున్నారు. ఈ కారణముల వలన, రెండు కక్షలు ఏర్పడుటకును, సాంఘిక మహాసమరము జరుగుటకును అవకాశము గల్గినది. బ్రాహ్మణత్వమనే కోటను బ్రాహ్మణేతరులు ముట్టడించినారు. కోటలోని వారు బైటకు వచ్చి యుద్ధము జేయజాలక యున్నారు. కోటలోనివారికి ఆహారసామగ్రి లేదని బ్రాహ్మణేతరులెరుంగుదురా? బ్రాహ్మణేతరులు కోట సింహద్వారమును పగులగొట్టగలరా? బ్రాహ్మణేతరులు కోటను ఆక్రమించగలరా?
ఈ మహా సంగ్రామములో వైశ్యుల విధి యెట్టిది? బ్రాహ్మణేతరులలో ముఖ్యులైన వైశ్యులును, శూద్రులును సమానముగా బ్రాహ్మణత్వమునకు దాసులు కాలేదు. వైశ్యులే ఎక్కువగా లోబడినారు. మత, సాంఘిక విషయములందు బ్రాహ్మణులు చెప్పినదే వేదవాక్కులనియు, ప్రతికూలించి పని చేసిన యెడల, పాపము ననుభవించెదరనియు నమ్మియున్నారు. తమ్మును సాంఘికముగా లోబరచుటకు వేయబడిన బంధములనే వైశ్యులు పావనములుగా దలచుచున్నారు. తమ హీన స్థితిని, బాహ్మణుల ఆధిక్యతను శాశ్వతముగా స్థిరపరచుటకు, దేవాలయములను సంతోషముతో కట్టి యిచ్చుచున్నారు. తమ కులమందు జన్మించిన దేవతయైన కన్యకాపరమేశ్వరిని సైతము తమ చేతులార పూజించు భాగ్యము వదలుకొని, బ్రాహ్మణులకు డబ్బిచ్చి, పూజ చేయించుచున్నారు. వైశ్యులు దాసులైనారని సంతోషించి కాబోలు, వైశ్యులకు వేదాధికారము లేదనియు (బ్రాహ్మణుల”) శాసించుచున్నారు. వైశ్య మహనీయులను నీచముగా గణించునట్టియు, ఎక్కువ దుర్ణయములకు ఆకరమైనట్టియు, గురువులమని పేరు పెట్టుకొని ప్రజా పీడనము చేయునట్టియు, బ్రాహ్మణుల పాదములకైన గాక, పాదములకు తొడుగుకొను చక్కల కైన గాక, పూజలు చేసి తరించినామని వైశ్యులు చెప్పుకొనుచున్నారు. పవిత్రము చేయగలిగిన షోడశ కర్మలను మÖర్ఖశిరోమణులైన పురోహితుల యిష్టానుసారమైన శ్లోకములనే మంత్రములచేత చేయించుకొనుచున్నారు.
అంగుళ్యాగ్రె నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ।
ప్రాణాయామ మిదంప్రోక్తం ఋషిభిః పరికల్పితం ॥
మÖలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే ।
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః ॥
పై రెండు శ్లోకములను పురోహితులు వైశ్యులకు గాయత్రీ ప్రాణాయామములకు బదులుగా ఉపనయన కాలమందు నేర్పుచున్నారు. బ్రాహ్మణులు నేర్చుకొను మంత్రము ఏదనగా `
ఓంభూర్భు వస్సువః ఓం తత్సవితుర్వ రేణ్యం ।
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ॥
ఈ విధముగా, వైశ్యుల వలన వచ్చెడు ద్రవ్యార్జనము చేతనే వారితోను, ఇతర జాతులతోను (కులస్థులతోను), బ్రాహ్మణులు సంగ్రామము సలుపుచున్నారు. బ్రాహ్మణుల అన్యాయమైన ఆధిక్యతను నశింపజేయవలెనని ధృఢచిత్తులైన బ్రాహ్మణేతరులతో పోరాడుటకు వైశ్యుల ద్రవ్యమే బ్రాహ్మణులకాధారమగుచున్నది. ఇవియన్నియు యోచించి, వైశ్య యువకులు తమ విధిని తీర్మానించుకోవలసిన కాలము వచ్చినది. బ్రాహ్మణ నాయకులు చెప్పు రీతిగా, ప్రప్రథమమున రాజకీయ స్వాతంత్య్రము సంపాదించుకొని, అటు తరువాత సాంఘిక, మత స్వాతంత్య్రమును బ్రాహ్మణేతరులు ఎందుకు సంపాదించుకొనకూడదందురా? ఇంట గెలచి రచ్చ గెలచుట మంచిది. మత సంబంధ ఆధిక్యము మాత్రమే గలిగియున్నప్పుడు (బ్రాహ్మణులు) ఇతరులను ఇంత పీడించుచుండగా, రాజకీయాధిక్యము కూడ వచ్చిన తర్వాత, మరింత పీడించుటకు బదులు సౌష్టవము కలుగుటకు కారణమేముండును? అట్టి సమబుద్ది ఇప్పుడే కలుగజేసికొని, తర్వాత జాస్తి స్వాతంత్య్రములకు ఏల ప్రయత్నింపగూడదు? మరియు, బలమైన సాంఘిక సంబంధమైన పునాది లేక, రాజకీయతా భవనము బలముగా నుండదనియు, అట్టి కట్టడము స్వల్ప కాలములోనే శిథిలమగుననియు, దానిలో నివసించి యుండునంత కాలము భయోత్పాతములకు లోనై యుండుననియు, బ్రాహ్మణేతరులు చెప్పుదురు. ఇట్టి వాదములు బ్రాహ్మణులకు రుచించుటలేదు. కాబట్టి, వైశ్య యువజనులారా! మీ కర్తవ్యమేమి?
ఒకప్పుడు యువకుడైన శ్రీయుత ఆత్మూరి లక్ష్మీనరసింహ సోమయాజిగారి నాయకత్వముతో, వైశ్య యువకులు బ్రాహ్మణ మత నిరంకుశత్వమును ధ్వంసము చేయవలెనని, యనేక సంవత్సరములు పోరాడిరి. అనేక కష్టములు అనుభవించిరి. బ్రాహ్మణ మత నిరంకుశత్వమును నశింపజేయుటేగాక, సంఘ సంస్కరణ విషయమున అడ్డము వచ్చిన శంకరాచార్యులకు సైతము హైకోర్టులో జరిమానా విధింపజేయగలిగినారు. కాని, బ్రాహ్మణ మత నిరంకుశత్వము ఏ రెండు మÖడు పట్టణములలోనో తప్ప, ఇతర ప్రదేశములందు పూర్వమువలెనే బాగుగా సాగుచునేయున్నది. కీర్తిశేషులైన మామిడి వెంకటార్యులును, ఆత్మూరి లక్ష్మీనరసింహ సోమయాజిగారును, పాలూరి శంకరనారాయణ శ్రేష్టిగారును ప్రారంభించిన మత యుద్ధమును మనము సాగించవలెనా? లేక, వదులుకోవలెనా? నేను మాత్రము యుద్ధములో పాల్గొనవలెనని తీర్మానించుకొని యున్నాను. ఏ దేవాలయములో విగ్రహమును బ్రాహ్మణులవలె నేను పూజించుటకు హక్కు లేక, దూరముగా నిలువబడి, డబ్బిచ్చి, పూజ చేయించవలసియుండునో, అట్టి దేవాలయములకు పోకుండయుండుటే నాకు ఇష్టము. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రామమోహనరాయి గారి శిష్యుడనై యుండుటకు వెనుదీయకపోవుటేగాక, త్రిమత పీఠముల పీడను నశింపజేయుటకును ఇష్టపడెదను. తానుచ్చరించు మంత్రముల యర్థమేమియో చెప్పజాలని మÖర్ఖశిరోమణుల చేత కర్మలు చేయించుకొనుట కంటే, ఆదిశంకరుని జ్ఞానకాండనే అనుసరించెదను.
శ్లో॥ యోధీత్య విధివద్వేదాన్ వేదార్థం న విచారయేత్ ।
ససాన్వయ శూద్రకల్పః సంపాద్యం న ప్రపద్యతే ॥
(అనగా ఎవడు వేదములను చదివి, శాస్త్ర ప్రకారము వేదార్థమును విచారించడో, వాడు శూద్రునితో తుల్యుడనియు, పొందదగిన ఫలమును పొందజాలడనియు జ్ఞాశనస్మృతి 3 అధ్యాయము 129 శ్లోకములో వ్రాసియున్నారు.)
మన కులములోని సాంఘిక దురాచారములన్నియు బ్రాహ్మణుల వలన ఏర్పడినవి కావు. కొన్నిటికి మనమే కారణము. మనము వానిని తొలగించదలచిన యెడల, బ్రాహ్మణులు అడ్డము రాజాలరు. అస్పృశ్యత, దృష్టి దోషము ఉండవచ్చునా? అట్టి క్రూరాచారములను వైశ్య యువజనులు లేకుండ జేయుట తమ విధి కాదా? వివాహ సమయములందు, ఎంత ద్రవ్యము మనవారు పాడుచేయుట లేదు? చిన్న పిల్లలకు పెండ్లిండ్లు చేయుట హానికరమని మీకు తెలియనిదేమున్నది? యువతులు గాకముందే తల్లులగు స్త్రీలను మీరు చూచుట లేదా? అట్టి తల్లులచే పెంచబడిన వారు ఆరోగ్యవంతులై, శరీర దార్డó్యము కలిగి, మనోబలము కలవారై యుండగలరా? అట్టి తల్లులు సౌఖ్యపడగలరా? భర్తలనగా ఎవరో తెలియని వితంతువులు మన సంఘమున ఎందరు లేరు? బిడ్డలను కని, పెంచవలసిన సహజమైన తమ జన్మహక్కును వదలుకొని, నిర్బంధ వైధవ్యమును అనుభవించుమని పీడించు క్రూరాచారము మన సంఘమందుండవలసినదేనా? మనయందు కనికరమను గుణముండిన యెడల, వారి బాధలు చూచుచు తొలగించక యుండగలమా? ఈ దురాచారము మన సంఘమునకు శాశ్వతమైన అగౌరవము కాదా? అబలలైనటువంటి మన సోదరీమణులకే మనము న్యాయము చేయలేని అశక్తులమైనపుడు, మత, సాంఘిక, రాజకీయ స్వాతంత్య్రమునకు మనము పోరాడుటేమి? కార్యసాఫల్యమగుటేమి? అస్పృశ్యత, దృష్టి దోషము, నిర్బంధ వైధవ్యము అను క్రూరాచారములను తొలగజేయునంతవరకు, మన బానిసత్వమును దైవము మనకు న్యాయముగా విధించిన శిక్షగా కనుబడుటలేదా? కాబట్టి, పైజెప్పిన దురాచారములు మన కులమందుండుటకు బ్రాహ్మణులెంతమాత్రము కారణము కాదనియు, మనమే కారణమనియు నిర్ధారణ చేయవలసి యుండును.
మన వైశ్య యువతులు విద్యా సంపన్నులు కారు. సంఘాభివృద్ధికి వారు ముఖ్య ఆటంకమని విద్యావంతులకు తెలియని విషయము కాదు. వారి అజ్ఞానము, మన మత గురువులకు చాల లాభకారిగా నేర్పడినది. వ్రతములను సలిపిన, పుణ్యము వచ్చునని నేర్పుచున్నారే కాని, అన్ని వ్రతముల కంటెను పాతివ్రత్యము శ్రేష్ఠమని చెప్పు గురువులు కనబడుట లేదు. మనము స్త్రీ విద్య నుపేక్షించుచుండుట వలన గదా మనవారు మÖఢ విశ్వాసమునకు లోనైయుండుట! యువకులు తమ మిత్రులతో మాట్లాడునంతకాలము యుల్లాసము కలిగి యుండుటయు, ఇంటికి వెళ్లగానే సమాన విద్యావతి కాని భార్యతో ఉల్లాసముగా కాలము గడుపలేక పోవుటయు తటస్థించుట లేదా? మహనీయులు బోధించిన గొప్ప యంశములను విని, వాటిని తమ జీవితములో సాధించదలచియు, ఇంటికి వెళ్లిన వెంటనె తమ అభిప్రాయములను గ్రహించుకోలేని స్త్రీలుండుట వలన, తామేమియు చేయజాలక, నిరుత్సాహులై, తమ జీవితములను వృధా చేయుచుండుట లేదా? ప్రతి యువకుడును తన భార్యను, తన సోదరిని తనయంత విద్యావతులుగా చేయుట తన ముఖ్య కర్తవ్యమై యున్నది. పురుషులు అవకాశమిచ్చినప్పుడు విద్య నేర్చుకొనని స్త్రీలు అరుదుగా నుందురు.
వైశ్య యువకులకు తమ వ్యాపార వృత్తికి అనుకూలమైన విద్య నేర్పు పాఠశాలలు లేవు. వ్యాపార విద్య మనకు ముఖ్యావసరము. అది నేర్చుకోలేనప్పుడు, విద్యావిహీనుడై యుండుటకంటె నేదోయొక విద్య నేర్చుకొనుట మంచిది. ప్రస్తుతము ఉన్నత విద్య యింగ్లీషు ద్వార మాత్రమే నేర్చుకొనవలసి యున్నది. అంతియగాక, ప్రభుత్వ ఉద్యోగములలో ప్రవేశింపవలయునా, కూడదా, అను విషయమును సహా ఆలోచించవలసి యున్నది. వైశ్యులయందు, ఉద్యోగీయులకు (ప్రభుత్వోద్యోగులకు) సానుభూతి లేదను సంగతి, పురవాసుల కంటే గ్రామవాసులకు బాగుగ తెలియును. వైశ్యులకు గౌరవమనునది నగరములలోనే స్వల్పము. కుగ్రామములందు లేనే లేదు.
మన యువజనులు కొందరు ప్రభుత్వ ఉద్యోగములందు ప్రవేశించుట మంచిది. ప్లీడరు వృత్తిలో అనేకులుండుట అవసరము. గవర్నమెంటు ఉద్యోగీయులకు అసహాయోద్యమ కాలమందు గౌరవమునందు లోటు కలిగినను, ఇప్పుడు పూర్వము వలెనే ఎక్కువ గౌరవింపబడుచున్నందున, ఉద్యోగీయులు ఏ కులమునకు సంబంధించియుందురో, ఆ కులమువారికి గౌరవమున్ను, సానుభూతియు, తమ హక్కులు గౌరవింపబడుటయు జరుగుచున్నవి. ఈ విషయమునందు బ్రాహ్మణులను గాని, శూద్రులను గాని ద్వేషించుట న్యాయము కాదు. ఆంగ్లేయ విద్యను మనము అభ్యసించవలదని కాని, ఉద్యోగములలో చేరకూడదని కాని, తద్వారా గౌరవమును సంపాదింపకూడదని కాని ఎవరైనను అడ్డుపడియుండిరా? ఈ సందర్భములో, కీర్తిశేషులైన వేమÖరి పార్థసారథి సెట్టి గారితో నేను ఏకీభవించుచున్నాను. మన కులములో చాలమంది జనులున్నారు అనియు, ద్రవ్యమునకు లోపము లేదనియు, అయినను మన కులమునకు గౌరవము తెచ్చువారు కాని, మన హక్కులను జాగ్రత్తపెట్టువారు కాని చాల అరుదనియు, ప్రతి పట్టణమందు నుండెడు ఉన్నతోద్యోగీయులలో కనీసము ఒకరైనను వైశ్యులుగా నుండవలెననియు, అందువలన వైశ్యులు ఆంగ్లేయ విద్య నభ్యసించునట్టు చేయవలెననియు, ద్రవ్యవంతులైనవారు శ్రద్ధతో చదువుట లేదనియు, (కావున) బీద విద్యార్థులకు ద్రవ్య సహాయము చేసి, విద్య చెప్పించిననేకాని వైశ్య కులమునకు శ్రేయోదాయముగా నుండదనియు, కీర్తిశేషులయిన పార్థసారథి సెట్టిగారు చెప్పుచుండెడివారు. గనుక, వసతి గృహములను స్థాపించి, బీద విద్యార్థులకు విద్య చెప్పించుటకు ద్రవ్యవంతుల సహాయము కోరవలెను. మనవారు అన్నసత్రములను నెలకొల్పి, దృఢకాయులయి అబద్ధపు సాక్ష్యము చెప్పునట్టియు, వ్యాజ్యములను వేయించునట్టియు అగ్రజాతివారికి (బ్రాహ్మణులకు) భోజనము పెట్టి, సోమరులను పోషించి, దేశారిష్టమునకు తోడ్పడుటకంటె, బీద వైశ్య విద్యార్థులకు అట్టి సత్రములలో భోజనము పెట్టి, విద్య చెప్పించుట ఎక్కువ యుక్తము కాదా?
మరియొక కారణము వలనను ఇంగ్లీషు విద్య మన యువకులకు ముఖ్య అవసరముగా తోచుచున్నది. పురపాలక సభలకు, శాసన సభలకు సభ్యులుగా వెళ్లువారికి సాంఘిక గౌరవము చేకూరుచున్నది. అట్టివారు దేశసేవ చేయగలుగుచున్నారు. ఎన్నికలలో నిలువబడిన అభ్యర్థుల తరఫున పనిచేయుట వలన, మన కులములలో ఐకమత్యము, కులాభిమానము ఏర్పడుచున్నది. కాని, ఎన్నికలలో జయప్రదమగుటకు అభ్యర్థులు విద్యావంతులుగాను, ద్రవ్యవంతులుగాను ఉండవలెను. ప్రస్తుత స్థితిగతులనుబట్టి యోచించగా, కొన్ని జిల్లాలలో అభ్యర్థులుగా నుండదగినవారు ఒక్కరైన కనుపడుట లేదు. సంఘమునకు మేలు చేయని వారికి ప్రజా గౌరవము ఏలాగున లభించగలదు? ఈ విషయములలో మన స్థితి చాల విచారకరముగనున్నది. కాబట్టి, ద్రవ్యవంతులయిన యువకులు, ఉద్యోగాభిలాషకొరకు కాకపోయినను, వైశ్యకుల గౌరవమునకు హూణభాష నభ్యసించవలెనని కోరుచున్నాను. ఈ విషయములలో సామి వేంకటాచలం సెట్టిగారి వలనను, బచ్చు పాపయ్య సెట్టిగారి వలనను, టి. ఆదినారాయణ సెట్టిగారి వలనను మన కులమునకు వచ్చుచున్నట్టి గౌరవము మనకందరకు విదితము. ద్రవ్యవంతులగు వైశ్య యువకులు వీరిని ఆదర్శకముగ నుంచుకొనుట మంచిది.
మీరందరు సావధానులై మరొక లోపమును వినవలెనని కోరుచున్నాను. నేను చెప్పబోవు విషయము ప్రత్యేకముగా మన కులమునకే సంబంధించి యున్నది. ప్రతి కులమునకును ప్రత్యేకముగా కొన్ని లోపములున్నవి. మన కులము వారిని మాత్రము పిరికివారని పిలుచుచున్నారు. అత్యంతమైన ధైర్య సాహసములు కలవారు మన కులములో ఎందరో కలరు. బెడవాడ పుర నివాసియగు మఠం బాల సుబ్రహ్మణ్యం గుప్త గారితోను, ఏలూరు పుర వాసియగు కంభంపాటి కన్నయ్య గారితోను సమానమైన ధైర్యసాహసములు కలవారు ఇతర కులములలోను అంతగానుండరు. కాని, సర్వసాధారణముగా వైశ్యులు ఏలాటివారో మనకందరికిని తెలిసిన విషయమే. అయితే, sTÖ లోపమునకు మనము కారణభూతుముల కాము. ప్రతి దేశమందును వ్యాపారము చేయువారికి ఈలాటి గుణమే యున్నది. ఈ లోపమును పోగొట్టుట ఎంత మాత్రమును కష్టము కాదు. ఏయే పట్టణములలో వైశ్య యువకులు కుస్తీ, కర్ర త్రిప్పుట మొదలగు ఆత్మరక్షక శిక్షను పొందిరో, అట్టి వైశ్య సంఘములలో పిరికితనమనునది లేకపోవుటే గాక, హిందూ మహమ్మదీయులకు మత కలహములు లేకుండుటకు తోడ్పడుచున్నది. కాబట్టి, ప్రతి పట్టణమునందును, గ్రామమునందును, తాలింఖానాలుండుట వైశ్యులకు ముఖ్యావశ్యకముగా నున్నది. ఇట్టి తాలింఖానాల స్థాపించి, ఈ వైశ్య యువజన సభ వారు కేంద్రస్థానమును (Central Office) స్థాపించి, వీరిలో పోటీలు పెట్టుచు, ఉత్సాహము కలుగజేయుట ముఖ్యావశ్యకము. ఇంతియగాక, మద్రాసు యÖనివర్సిటి వారు ఏర్పరచిన మిలిటరీ ట్రెయినింగు సంఘములలో ప్రతి వైశ్య విద్యార్థియు చేరుట మంచిది.
వైశ్య యువజనులారా! మన చరిత్ర ఈ సభతో ప్రారంభము కాలేదు. మన చరిత్ర పురాతనమైనది. కీర్తివంతమైన కార్యములను ఇదివరకే అనేకములు వైశ్య యువకులు చేసియున్నారు. నవీన సాంప్రదాయము అవసరమయినదని తెలిసియుండినను, పెద్దలు జంకుచు, మనస్సులోని అభిప్రాయములను వెలిబుచ్చజాలక, కాలయాపనము చేయుచుండినపుడెల్లను, యువకులే తమ సహజ ధైర్యసాహసములతో ఆ కార్యములను నెరవేర్చియున్నారు. (a) ఆత్మూరి లక్ష్మీనరసింహ సోమయాజి గారు యువకుడుగా నుండిన కాలములో నెరవేర్చిన మేలును ఇదివరకే చెప్పియున్నాను. (b) పైడా రామక్రిష్ణయ్యగారు యువకుడుగా నుండిన కాలమందు కందుకూరి వీరేశలింగం గారికి తోడ్పడి యొనర్చిన సంఘసేవ అందరికిని తెలిసిన విషయమే. (c) ఆర్యవైశ్య సభలను జయప్రదముగా జరుపుటకు మన యువకులే ముఖ్య కారణమని మీరు గ్రహించెదరు గాక! (d) సముద్రయాన విషయములో సీమకక్షి, నాటుకక్షి అని యేర్పడి, కులపెద్దలందరికి అనేక మాసములు అత్యంత మనస్తాపములు కలుగుచుండగా, సంఘ బహిష్కారమునకు వెరవక, తమ సహజ ధైర్యములతో పరదేశములకు వెళ్లివచ్చుట చేత, పెద్దవారికి విషమముగా కనుపడిన కార్యమును సులభముగా నిర్వహించినదియు యువకులే. ఆ విషయమును పెద్దవారినే నిర్వహించుమని వదలివేసియుండిన యెడల, ఇంతవరకైనను పరిష్కరింపబడియుండెడిదో లేదో ఇక్కడ వివరించుట అనవసరము. (e) ప్రతి వైశ్య మహాసభ యందును, ఏ విషయములను గురించి మన పెద్దలు బల్లలు బ్రద్దలగునట్లు చర్చించుకొనుచుండిరో, లోన తమకు ఇష్టమున్నను బహిరంగముగా నొప్పుకొనుటకు జంకుచుండిరో, నలుగురి తోడ్పాటు తీర్మానములకు వోటు కొరకైన చేతులెత్తుటకు జంకుచుండిరో, అట్టి రజస్వలానంతర, బాల వితంతూద్వాహములను, లింగధారి వైశ్యులతో భోజనములను ఈ విషయములను, విశాఖపట్టణ 11వ వైశ్య మహాసభలో తీర్మానము చేయుటయే గాక, లింగధారి వైశ్యులతో భోజనములను సలిపి తమ కార్యశూరత్వమును కనుబరచినది వైశ్య యువకులే. (f) వితంతూద్వాహములు శాస్త్రోక్తమని వైశ్య యువకులు విశాఖపట్టణమందు తీర్మానము చేయుటకు ముందే, కొందరు యువజనులు అట్టి వివాహములను చేసికొనియుండుట తెలిసి, వారితో సహపంక్తి భోజనము చేసి, ఆ తీర్మానమును సహా కార్యరూపకముగా నెరవేర్చి, శాశ్వతమైన కీర్తిని సంపాదించవలెనని ప్రయత్నించిరి కాని, అట్టి వివాహితులు ఆ సమయమున లభించకపోవుట వలన, అట్టి మహత్కార్యము ఆ సమయమున నిర్వహించబడలేదు. మొన్న మొన్న దివ్యజ్ఞాన సమాజపు ఆర్యవైశ్య ప్రముఖులు అట్టి మహదవకాశమును కల్పించి, మనకెంతయు సంతసము కావించిరి. అయినను, ఇల్లు అలుకగనే పండుగాయెనని తృప్తిపడక, మనమందరము ప్రయత్నపూర్వకముగ ఆ తీర్మానమును అమలులోనికి తెచ్చుట మనకు విధికృతమైయున్నది. మనమట్టి పవిత్ర కార్యమును నిర్వహించి, మన సంఘాభివృద్ధికై తోడ్పడెదము గాక!
ఈ విషయములో పెద్దవారి మీద ఆధారపడియుండిన యెడల, యుగాంతరము లోపల నెరవేరదు. వితంతువులను పునర్వివాహము చేసికొనినవారితో పంక్తిభోజనము చేయుట ఒక తప్పిదమా? సమస్త దురాచారములతో సంచరించుచు, కులమునకు తలవంపు గలిగించుచున్న వారి యిండ్లలో ఎరిగియు భోజనములు సలుపుచు, తమ బిడ్డల నిచ్చిపుచ్చుకొనుచుండుట కంటే, దుర్మార్గముగ సంచరించుట కిచ్చగింపక, ఒక భర్తను చేపట్టి, పవిత్రముగ తమ జీవితమును గడపనెంచిన దంపతుల యిండ్లలో మనము భోంచేయుట దోషమైనదా? వైశ్య యువజనులారా! యోచింపుడ”. సంఘము నాశనమగుచున్నది. ఇట్టి సంస్కరణములు చేసినగాని, సంఘము పవిత్రము కాజాలదు. ఇష్టములేని వితంతువులను వివాహమాడమని నేను చెప్పుట లేదు. కాని, స్వకులములో వివాహము చేసికొనిన వారితో భోజనము చేయుట ఎంతమాత్రము తప్పిదము కాదని నా యభిప్రాయము. ఈ వైశ్య యువజన సభవారు చేయబోవు కీర్తివంతములైన కార్యములలో, ఈ విషయమును ఆచరణలో పెట్టుటయే ప్రప్రథమమయిన కార్యము కానిండు. వైశ్య యువజనుల కీర్తి ఇంకను సమాప్తి కాలేదు. (g) అనేక పట్టణములలో వైశ్య యువజనులు గ్రంథాలయములను స్థాపించి, పుస్తుకములను ప్రతియింటికి తీసికొనివెళ్లి, యిష్టములేని వారలను కూడ చదువునట్టు ప్రోత్సాహపరచి, స్త్రీ పురుషులు అను వివక్షత లేక, అందరియందును జ్ఞానాభివృద్ధి చేయుచున్నారు. (h) గుంటూరు, బందరు పురములలో వైశ్య యువకులు సభల వలనను, కరపత్రముల వలనను, త్రిపీఠములయొక్క లోపములను ప్రబోధము చేయుచుండుట వలన, ఆ పట్టణంబులకు జగద్గురువులు వచ్చి తరింపజేయుట లేదు. (i) కొందరు ద్రవ్యవంతులైన వైశ్య యువకులు తాలింఖానాల నేర్పరచి, వైశ్య యువకులను తరిఫీదు చేయుటలో వారి ద్రవ్యమును, వారి శక్తిని, వినియోగపెట్టుచున్నారు. అట్టి కీర్తివంతమైన పూర్వచరిత్రతో ఈ యువజన సభ ఆరంభమగుచున్నది.
మనము చేయవలసిన కార్యములనేకములున్నవి. (a) ప్రతి గ్రామమునందును, పట్టణమందును వైశ్య సేవా సంఘము లేర్పరచుట.
(b) గ్రంథాలయములను స్థాపించి, వివేకాభివృద్ధియు, ప్రపంచ వ్యవహారములను తెలియజేయుట. వంద, రెండు వందల గ్రంథములను, స్త్రీ, పురుషులను వివక్షత లేక అందరికిని అందజేయుట. (c) ఈ చర్చా సభలను ఏర్పరచి, ఆధునిక వ్యవహారములన్నిటిని తర్కించుచు, సభలలో మాటలాడుటకు, ప్రపంచ వ్యవహారములను గ్రహించుటకును, మహాపురుషుల జీవితములను ఆదర్శకములుగా నేర్పరచుకొనుటకును, ప్రయత్నింపుట. (d) తాలింఖానాలను స్థాపించుట. (e) విద్యార్థి వసతి గృహములను (Hostels) నెలకొల్పుట, బీద విద్యార్థులకు భోజనములను, బట్టలను ఏర్పాటు చేయుట, ఎచ్చటెచ్చట sTÖలాటి వసతి గృహములున్నవి, విద్యార్థులను ఎచ్చటెచ్చటికి పంపిన యెడల అనుకూలముగానుండునో తెలిసికొని సహాయము చేయుటకు కేంద్రస్థానమును (Central Office) ఏర్పరచుట. (f) పౌరోహిత గర్వమును, పూజారుల దురహంకారమును అణచివేయుట. (g) బ్రాహ్మణుడు, శూద్రుడు, పంచముడు అను వివక్షత లేక, అందరిని సమభావముతో ఆదరించుట. (h) జగద్గురువులమని చెప్పుకొని, ప్రజలను పీడించువారి లోపములను బహిరంగపరచుట. (i) పంచములకు రాత్రి కాలమందు పాఠశాలను నిర్మించి, పని చేయువారికి, సహాయము చేయుట. అస్పృశ్యతను, దృష్టిదోషమును తొలగించి, ఆ నిర్భాగ్యులకు కనికరము చూపుట. (j) మనవారు అపాత్రదానము చేయక, బీద విద్యార్థులను పోషించునట్లు ప్రోత్సాహపరుచుట. (k) అనాథ బాలికలను శ్రీయుత నాళం రామలింగయ్య గారి స్త్రీల సేవాసదనమునకు పంపించి, ఉపాధ్యాయినులు గాను, వైద్యులు గాను, మంత్రసానులు గాను తరిపీతు (తర్ఫీదు) చేయుట. పండుగల సమయమందు ద్రవ్యము పోగుచేసి, స్త్రీల విద్యకై ఆ సేవాసదనమునకు పంపుట. (l) మత, సాంఘిక విషయములలో దేశోపకారులగు అన్ని కులముల వారితోను కలసి పనిచేయుట. ఇంకను అనేక విధముల తమ కులము వృద్ధికి తేవచ్చును.
ఇట్టి కార్యములను నెరవేర్చుటకు ద్రవ్యము కావలసియుండును. యువజనులు యుత్సాహముతో పనిచేయుచు, ప్రప్రథమమున కలిగెడు అపజయములకు నిరుత్సాహము పడక, శీఘ్రకాలములోనే గొప్ప కార్యములను నెరవేర్చవలెనని ఆశపడక, శ్రద్ధతో పనిచేయుచుండువారికి, ద్రవ్యము లభించగలదు.
నా యుపన్యాసమును ముగించక మునుపొక విషయమును ముఖ్యముగా చెప్పదలంచినాను. బ్రాహ్మణుడై జన్మించినంతటనే బ్రాహ్మణుని ద్వేషించవద్దు. వారిలో ననేకమంది గొప్పవారును, దేశభక్తులును కలరు. ప్రస్తుతము సంఘమునందుండెడి సాంఘిక, మత పీడనమునకు ఈ కాలపు బ్రాహ్మణులు కారణము కారు. సంఘములో దురాచారములు ప్రబలియుండు కాలములో మనమందరము జన్మించియున్నాము. మత, సాంఘిక విషయములలో అందరము కలిసి, వాని సమ భావమునకు ప్రయత్నించవలెను. అగ్రజన్ములమని చెప్పుకొనువారి అహంకారమును కాని, యితర కులములవారి హీనస్థితిని గాని ఒప్పుకొనక, అందరిని సమభావముతో చూడ ప్రయత్నింపవలెను. సర్వమానవ సమానత్వమునకు ప్రయత్నించుటకు కొందరు బ్రాహ్మణులకు అంతరంగమున ఇష్టము ఉన్నను, కార్యసాఫల్యము చేయజాలక విచారపడుచున్నారు. బ్రాహ్మణులు నీచమైన యుద్యోగములలో చేరుట కంటెను, వైశ్యుల యిండ్ల చుట్టును తిరిగి, బిచ్చమెత్తి జీవించుట కంటెను, యే వ్యవసాయ(ము) వలననో, యే వ్యాపారము వలననో, జీవించుట మంచిదని గ్రహించియు, తమ కోరికల నెరవేర్చుకొనజాలకున్నారు. బ్రాహ్మణులు బిచ్చమెత్తుటకును, సోమరులగుటకును, వైశ్యుల అపాత్రదానములే కారణములనియు, తద్వారా అన్యాయమైన మత, సాంఘిక పరిస్థితులు స్థిరపడి యున్నవనియు, దేశభక్తులైన బ్రాహ్మణులనుచున్నారు. సరియైన విద్యా వివేకములు వైశ్య కులమునందు ఏర్పడనిదే, బ్రాహ్మణ మతమనునది నశించదని, శూద్రజాతి నాయకులు స్థిరాభిప్రాయులై యున్నారు. వైశ్యులు విద్యావంతులై, దేశోపకారమైన పనులను చేయునట్లు ప్రోత్సహించవలసిన విధి వైశ్య యువజనులదైయున్నది.
యువకుడుగా నుండుట గొప్ప యదృష్టము. ప్రపంచమునందంతట జరుగుచున్న గొప్ప మార్పులలో పాల్గొనుటకు అవకాశముండుట గొప్ప భాగ్యము. మన తరువాత రాబోవు వారు, మనకన్న నెక్కువ సౌఖ్యముగా జీవించుటకు, ప్రపంచమును బాగుపరచుటలో సహాయపడుట యశోదాయకము. యువజనులు ఏ కార్యమునుగాని చేయబూనుకొనిన యెడల, నిర్వహింపగలరు. ఏ కాలము నందైనను, ప్రపంచమునందు జరిగిన గొప్ప మార్పులన్నియు, యువజనుల యుత్సాహము వలననే నెరవేర్పబడినవిగాని, యుత్సాహరహితులైన పెద్దల యాలోచనల వల్ల కాదు. మంచి యాలోచన చెప్పుట పెద్దల పని. అట్టి యాలోచనలను కార్యసాఫల్యము చేయవలసిన వారు యువజనులే.
వైశ్య కులమునందు జన్మించి, కులము పావనము చేసిన మహానీయుల సుగుణములు ప్రతి వైశ్య యువకునియందును ఉండవలెను. ఆత్మూరు లక్ష్మీనరసింహ సోమయాజి గారి వలెను, సుంకు నారాయణస్వామి సెట్టి వారి వలెను, సంఘములను నిర్మించుటయు; వేమÖరి పార్థసారథి సెట్టి గారి వలె యువకుల విద్యా విషయములందు స్వార్థ త్యాగము; తనకు ధర్మమని తోచిన దానిని నిర్భయముగా నిర్వహించుటయందు నాళం కృష్ణరావు గారియు, కంభముపాటి కన్నయ్య గారియు ధైర్య సాహసములును; నాళం రామలింగయ్య గారి దానమును; సుంకు సుబ్రహ్మణ్యము గారి పరోపకార నిరతియు; ప్రతి యువజనునియందును ఉండెనేని, మన కులము బాగుపడుటయే గాక, తద్వారా దేశమునకు మేలు చేయగలుగుదురు.
మనము వైశ్యులమైనను, హిందూ దేశీయులమని మరువరాదు. మన కులమునకు ఏదైనా చేయుటలో అట్టి కార్యము వలన, దేశమునకు హాని కలుగునని తోచిన యెడల, అట్టి కార్యము చేయకూడదు. కులమును పూజించవద్దు. కులము ద్వారా మేలును, కీర్తియు కలుగునట్లు సహాయపడుడు. ప్రస్తుతము దేశోద్ధారణకు వైశ్య కులము సహాయకారిగా లేదని తెలుసుకొని, యిక మీదట ఎట్టి మార్పులు కలిగిన సహాయకారిగ నుండకలదో, ఆ మార్పులను చేయుదము. కులకక్షలు, సాంఘిక పీడనము ఉండునంతవఱకు, ఏదో యొకటి, రెండు కులముల వారు మాత్రము నాగరికులు కాగలిగినను, దేశము అభివృద్ధికి రాజాలదనియు, ప్రజలందరును విద్యావివేకులైనగాని హిందూదేశము కీర్తివంతము కాదనియు గ్రహించి, దేశసేవ చేయుదము. అంతవఱకును వివిధ మతముల వారికిని, కులముల వారికిని, వాస్తవమైన ఐకమత్యము గాని, పరస్పర విశ్వాసము గాని యేర్పడజాలదు.
ఇటీవల క్రైస్తవుల స్మశానములకు వెళ్లియుంటిని. ప్రతి సమాధి మీదను ఒక రాయి నిలువ పెట్టబడి, ఫలాని రోజున జన్మించి, ఫలాని రోజున మరణించెనని తప్ప, మఱియెద్దియు వ్రాయబడియుండలేదు. వారు జీవించియుండిన యరువది సంవత్సరముల కాలములో, ఏమాత్రము మేలు చేసినట్లు వ్రాసికోలేనందుకు చాల జాలిపడితిని. మన యువజనుల జీవితములు అట్టి వ్యర్థ జీవితములుగ నుండకుండు గాక. ఇచ్చట సమావేశించియుండు యువజనులందరును ప్రపంచాభివృద్ధికి తోడ్పడుదురు గాక.
యువకులుగానుండినప్పుడు గొప్ప కార్యముల నెరవేర్చిన వారే, sTÖ కాలమునందు దేశ నాయకులుగా నేర్పడినారు. ఇప్పుడు గొప్ప కార్యములను చేయు యువజనులే, రేపు గొప్ప నాయకులు కానున్నారు. మీరందరును గొప్ప కార్యములను చేయుడు. కీర్తి రహితమైన సుఖజీవనము కంటె, కీర్తియుతమైన కష్టజీవనమే మీయందరికిని దైవము ప్రసాదించుగాక. వైశ్య యువజన సంఘము శుక్లపక్ష చంద్రుని వలె నభివృద్ధి పొందుగాక.
ఉడుముండదె నూరేండ్లును పడియుండదె పేర్మిపాము పదినూరేండ్లున్
మడుగున కొక్కెరయుండదె కడునిల పురుషార్థపరుడు కావలె సుమతి.
లిలిలిలిలి
(ఈ పునర్ముద్రిత వ్యాసం, యిప్పటికి వందేళ్ల క్రితం, 1926వ సంవత్సరం జనవరి నెలలో మద్రాసులో జరిగిన ‘ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభ’కు అధ్యక్షత వహించిన ప్రముఖ విప్లవ జాతీయవాదీ, సంఘ సంస్కర్తా అయిన దరిశి చెంచయ్య చేసిన ప్రసంగ పాఠం (‘ఆధ్యక్షకోపన్యాసము’, ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభా చర్యా నివేదిక, ఆహ్వాన సంఘము వారి వలన ప్రచురింపబడినది, చెన్నపురము, జనవరి 1926, పు.25`42). 1926 జనవరి 2వ తేదీ నుండి 5వ తేదీ దాకా నాలుగు రోజులపాటు జరిగిన ఈ మహాసభలో స్త్రీలూ, పురుషులూ కలిసి మొత్తం 986 మంది పాల్గొన్నారు. తెలుగు జిల్లాల నుండి కూడా చాలామంది దీనికి హాజరయ్యారు (గుంటూరు జిల్లా నుండి: 81; కృష్ణా: 11; నెల్లూరు: 12; తూర్పు గోదావరి: 16; పశ్చిమ గోదావరి: 11; అనంతపురం: 8; చిత్తూరు: 12; కడప: 13; కర్నూలు: 5; విశాఖపట్టణం: 3; బళ్లారి: 9; గంజాం: 1). అలాగే, తమిళ జిల్లాలైన కోయంబత్తూరు, సేలం, మధురై, తంజావూరు, తిరుచినాపల్లి, చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాటు, దక్షిణ ఆర్కాటుల నుండీ; పుదుక్కోట, పుదుచ్చేరిల నుండీ; మైసూరు, బెంగుళూరు, శృంగేరిల నుండీ ప్రతినిధులు వచ్చారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానిక కన్యకా పరమేశ్వరీ దేవస్థానపు సత్రంలో వసతులు, భోజనాలు యేర్పాటు చేశారు (‘ఉపోద్ఘాతము’, పైదే., పు.2).
ప్రారంభోపన్యాసాన్ని టి. ఆదినారాయణ శ్రేష్ఠి చేయగా (పైదే., పు.8`11), ఆహ్వాన సంఘాధ్యక్షుడైన తుంపూడి వేంకటానంద భగవత్ బి.ఏ., గారు స్వాగతోపన్యాసం చేశారు (పైదే., పు.11`24). తమ`తమ ఉపన్యాసాల్లో వీరిద్దరూ వైశ్య కులాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల్ని ప్రస్తావించి, మరీ ముఖ్యంగా వైశ్య సంఘంలో సంస్కరణావశ్యకతను గూర్చి నొక్కి చెప్పారు. మహాసభలో మొత్తం 25 తీర్మానాలు చేయబడ్డాయి. “ఆర్యవైశ్యుల స్వాధీనములోనుండు అన్ని దేవాలయములలోను బ్రాహ్మణులతో పాటు ఆర్యవైశ్యులు సమస్త ఆచారములలోను, మర్యాదలలోను, పూజలలోను, అభిషేకములలోను సమానత్వము కలిగి యుండవలయును”; “ఆర్యవైశ్యులు తమ శుభాశుభ కర్మలను వైశ్యుల మÖలముగ కూడ జరిపించుకొనుటకు ప్రోత్సాహము కలుగజేయవలెను” (అంటే స్వకుల పౌరోహిత్యాన్ని ప్రోత్సహించడం); “హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టమును దుష్పరిపాలనకును, దుర్వినియోగమునకు లోనైన చెన్న రాజధానిలోని త్రిమత పీఠములకు వర్తింపజేయవలయునని ప్రభుత్వము వారిని ఈ మహాసభ వారు కోరుచున్నారు. ఆ పీఠములను ఆర్యవైశ్యులెల్లరు బహిష్కరింపవలెనని తీర్మానించుచున్నారు”; “మతాంతరులైన ఆర్యవైశ్యులు పశ్చాత్తప్తులై, తిరిగి ఆర్యవైశ్య సంఘమందు చేరగోరిన యెడల, వారికి సంస్కారము (శుద్ధి) చేసి, సంఘమందు మరల చేర్చుకొనవచ్చును”; “ఆర్యవైశ్య బాలికలకు 12 సంవత్సరముల లోపలను, బాలురకు 18 సంవత్సరముల లోపలను వివాహములను; బాలికలకు 14 సంవత్సరముల లోపలను, బాలురకు 20 సంవత్సరముల లోపలను నిషేకములను చేయగూడదు”; “బాలికలు రజస్వలలు కాకపూర్వమే వివాహితులు కావలసిన ఆవశ్యకత లేదు” (ఈ తీర్మానాన్ని కొల్లూరి సూర్యనారాయణ ప్రతిపాదించగా, శ్రీమతి దరిశి అన్నపూర్ణమ్మ, శ్రీమతి తుంపూడి ఇందిరా భగవతమ్మ గార్లు కూడా సమర్థిస్తూ ప్రసంగించారు. అయితే, యం. ఆంజనేయులు, బి.ఏ., యల్.టి., గారు దీన్ని వ్యతిరేకించారు); “వరశుల్క, కన్యాశుల్కములను ఈ సభవారు ఖండించుచున్నారు” మొదలైన తీర్మానాలు పాస్ చేశారు. “ఆర్యవైశ్యులు తమ యాస్తిలో కొడుకులకు భాగము ఇచ్చునట్లే, కూతుళ్లకు కూడ భాగము ఇచ్చుచుండుట ఆవశ్యకము” అనే తీర్మానాన్ని తుంపూడి గోపాలకృష్ణ భగవత్ ప్రతిపాదించగా, ఎన్. శ్రీనివాసన్ దీనిపై ప్రసంగించారు. అయితే, డి.యల్. సెట్టి ఆక్షేపించగా, ఈ ప్రతిపాదన అంగీకరించబడలేదు. 12వ ఆర్యవైశ్య మహాసభలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి గుంటూరు వైశ్య సేవా సంఘం తరపున పోలిసెట్టి ఆదినారాయణ గుప్త ఒక తాలింఖానాను స్థాపించి, జయప్రదంగా నడిపిస్తున్నందుకుగాను, ఆయనను అభినందిస్తూ, ఒక తీర్మానం చేశారు. అలాగే, ప్రముఖ వైశ్య మేధావులైన శతావధాని దోమా వెంకటస్వామి గుప్తకు “విద్యా వినోద” బిరుదునూ; దోగుపర్తి స్వామిగుప్తకు “సిద్ధాంత శిరోభూషణ” బిరుదునూ ప్రకటిస్తూ తీర్మానం చేశారు. చివరిగా, తుంపూడి వేంకటానంద భగవత్ గారిని ఆర్యవైశ్య యువజన మహాసభకు ప్రధాన కార్యదర్శి గానూ, గర్రె సుబ్బుకృష్ణ సెట్టి గారిని ప్రధాన కోశాధిపతి గానూ ఎన్నుకుంటూ తీర్మానం చేశారు (‘తీర్మానములు’, పైదే., పు.46`55).
మహాసభలో పాల్గొన్న యువజనుల్ని ఉత్సాహపరచడానికీ, ప్రోత్సహించడానికీ వక్తృత్వ పోటీలు (“ఉపన్యాస కౌశల్య నిర్ణయము”) నిర్వహించారు. జనవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘సౌందర్యమహలు’లో “పూర్వ పశ్చిమ నాగరికత” అనే అంశంపై జరిగిన పోటీలో పదిమంది పాల్గొని, ఇంగ్లీషులో మాట్లాడారు. వారిలో పి. కంద నరసింహం అనే అతను తుంపూడి భగవంతం గుప్త పేరిట యేర్పాటైన బంగారు పతకం గెలుచుకున్నాడు. అదేరోజు “స్త్రీలకెంతవరకు స్వాతంత్రమియ్యవచ్చును” అనే అంశంపై నలుగురు “యువజనులు” ఉపన్యసించగా, దరిశి అన్నపూర్ణమ్మ, యం. హరినారాయణ విజేతలుగా నిలబడ్డారు. దాంతో, సుంకు సుబ్రమణ్య సెట్టి పేర రెండు బంగారు పతకాల్ని యివ్వాల్సివచ్చింది. జనవరి 5వ తేదీన కూడా వక్తృత్వ పోటీలు కొనసాగాయి: యివి ప్రత్యేకంగా విద్యార్థుల కోసం యేర్పాటయ్యాయి. “ఉచితానుచిత దానములు” అనే అంశంపై జరిగిన పోటీలో 11 మంది హైస్కూలు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు పాల్గొనగా, కాశి నాగన్న సెట్టి అనే విద్యార్థి, కట్టా వేంకట సుబ్బయ్య పేరిట యేర్పరచిన స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. అలాగే, “ఆచారములు” అనే అంశంపై పెట్టిన పోటీలో 12 మంది హైస్కూలు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు పాల్గొనగా, శ్రీమతి ఆర్. సుబ్బమ్మ (దరిశి చెంచయ్య మరదలు), సామి వెంకటాచలం సెట్టి పేరిట నెలకొల్పిన స్వర్ణ పతకం గెలుచుకుంది (పైదే., పు.57`58). ఇవన్నీ గమనిస్తే, ఎంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభ జరిగిందో, నిర్వాహకులు ఎంత పకడ్బందీ ప్రణాళికతో సభని నిర్వహించారో సులభంగా అర్థమౌతుంది.
జ్ఞానరంగంలోనూ, విద్వత్తు విషయంలోనూ బ్రాహ్మణులతో పోటీపడ్డ వైశ్యులు, ఈ విషయంలో కూడా మహాసభలో ఒక చక్కటి యేర్పాటు చేశారు. అది వైశ్యుల ‘జ్ఞాన ప్రదర్శన’కు సంబంధించింది. 1926 జనవరి 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 10 గంటలదాకా తుంపూడి భగవంతం గుప్త ఆధ్వర్యంలో “ఆంధ్ర విద్యా వాచస్పతి, సాహిత్య సరస్వతి, శతావధాని, విద్యావినోద” మొదలైన బిరుదులు కలిగిన దోమా వేంకటస్వామి గుప్త అష్టావధానం చేశారు. దీనికి బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమÖర్తి శాస్త్రి మొదలైన బ్రాహ్మణ పండితులు హాజరై, “అవధానము తృప్తికరముగను, శీఘ్రముగను జరిగినదని” ప్రశంసించారు (పైదే., పు.58`65).
అధ్యక్షోపన్యాసం చేసిన దరిశి చెంచయ్యది బొత్తిగా పరిచయం అక్కర్లేని పేరైనప్పటికీ, ఆయన జీవితం, కార్యాచరణలకు సంబంధించిన కొన్ని వివరాలైనా తెలుసుకోవడం తన ప్రసంగాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పటి నెల్లూరు జిల్లా కనిగిరిలో, 1890లో, ఒక “పేద” వైశ్య కుటుంబంలో పుట్టిన చెంచయ్య, కనిగిరి, ఒంగోలు, మద్రాసులలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత బర్కిలీలోని యÖనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి వ్యవసాయశాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ సాధించారు. విద్యార్థి దశలో కందుకూరి వీరేశలింగం రచనలు, బ్రహ్మసమాజ సిద్ధాంతాలు, కొంతవరకు బౌద్ధతత్త్వం మొదలైన వాటితో ప్రభావితులయ్యారు. అమెరికాలో చదువుకుంటున్నప్పుడు, లాలా హర్‌దయాళ్, జితేంద్రనాథ్ లాహిరీ మొదలైన వారితో కలిసి ‘గదర’ అనే విప్లవ పార్టీని స్థాపించి, భారతదేశ స్వాతంత్య్రం కోసం విదేశీ భూమి నుండి కృషిచేశారు. 1952 సెప్టెంబరులో మొదట ప్రచురించబడి, 384 పేజీల్లో విస్తరించిన దరిశి చెంచయ్య ఆత్మకథ నేనూ`నా దేశం (తృతీయ ముద్రణ, జూలై 1985, జయంతి పబ్లికేషన్స్, విజయవాడ) లో 112 పేజీలు గదర్ పార్టీలో ఆయన అనుభవాల్నీ, అప్పటి విప్లవకర పరిస్థితుల్నీ కూలంకశంగా వివరిస్తాయి (పు.44`156). విప్లవ జాతీయోద్యమంలో కీలక భాగస్వామి కావడం వల్ల, జైలుశిక్షకు గురైన చెంచయ్య, చిత్రహింసలననుభవించారు. తన 36 సంవత్సరాల పబ్లిక్ జీవితంలో నాలుగుసార్లు జైలు శిక్షకు గురయ్యారు: రెండుసార్లు బ్రిటిష్ వలస ప్రభుత్వమÖ, రెండుసార్లు “స్వతంత్ర” భారత ప్రభుత్వమÖ ఆయన్ని నిర్బంధించాయి. బాంకాక్, సింగపూర్, కలకత్తా, లాీVAర్, ఢిల్లీ, కన్ననూరు, కోయంబత్తూరు, వెల్లూరు మొదలైన ఎనిమిది జైళ్లలో ఎనిమిది సంవత్సరాలు గడిపారు. సింగపూర్ మిలటరీ జైలులో అనుభవించిన ఆరు నెలల ‘సాలిటరీ ఇంప్రిజన్‌మెంట’ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు (నేనూ`నా దేశం, పు.369`370).
గదర్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం వలన కలిగిన జైలు నిర్బంధం 1919లో ముగియడంతో, స్వదేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకోదలిచారు చెంచయ్య. 1920ల్లో అహ్మదాబాద్, కాకినాడ, మద్రాసు మొదలైన చోట్ల జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్ రాజకీయాలు ఆయనకు బొత్తిగా నచ్చలేదు. మరీ ముఖ్యంగా, “స్వరాజ్యం” అనే మాటకు కాంగ్రెస్ యిచ్చిన నిర్వచనం ఆయన్ని పూర్తిగా నిరుత్సాహపరచింది (నేనూ`నా దేశం, పు.157). అందుకే, “కాంగ్రెసు ఆశయాలంటే అసంతృప్తి ఏర్పడినందున నా జీవితాన్ని కాంగ్రెసుకు అర్పించలేకపోయాను” అని నిష్కర్షగా ప్రకటించారు (నేనూ`నా దేశం, పు.171).
అయితే, ఏదో ఒక “ప్రజాభ్యుదయ” కార్యక్రమం చేపట్టి, దేశాభివృద్ధికి పాటుపడకపోవడం తనకు “అసాధ్యమైన విషయం” కాబట్టి, సంఘ సంస్కరణవైపు దృష్టి మళ్లించారు. వేశ్యావృత్తి నిర్మూలన; బ్రాహ్మణాధిక్యతనూ, పౌరోహిత్యాన్నీ, మఠాధిపతుల్నీ ధిక్కరించడం; రజస్వలానంతర వివాహాలూ, వితంతు వివాహాలూ చేయించడం; అనాథ స్తీ, శిశు సంరక్షణాలయాల యేర్పాటు; పతిత యువతీ జనోద్ధరణ; స్త్రీ విద్యను ప్రోత్సహించడం; హరిజనాభివృద్ధికి పాటుపడ్డం మొదలైన 12 సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని తీసుకున్నారు (నేనూ`నా దేశం, పు.159`160). ఈ దిశగా, మొట్టమొదట కళావంతుల కులానికి చెందిన యామినీ పూర్ణతిలకమ్మ, యం. వెంకట్రావు లతో కలిసి, 1921లో ‘కళావంతుల సంస్కరణ సంఘం’ స్థాపించి, కళావంతుల కుటుంబాలకు చెందిన స్త్రీలు వేశ్యావృత్తిని వదిలిపెట్టి, వివాహాలు చేసుకునేట్లు ప్రోత్సహించారు (నేనూ`నాదేశం, పు.175`182). తర్వాత, తన స్వకులాభివృద్ధిపై దృష్టిపెట్టిన చెంచయ్య, వైశ్యులలో సంఘ సంస్కరణ కోసం నడుం బిగించారు. వైశ్యుల సాంఘికాభివృద్ధికై ఆయన చేపట్టిన కార్యకలాపాలన్నింటినీ స్థలాభావం కారణంగా యిక్కడ వివరించడం సాధ్యం కాదు కాబట్టి, తను విజయవంతంగా నిర్వహించిన వితంతు పునర్వివాీVAద్యమానికి మాత్రమే పరిమితమవుతున్నాను.
1921 జనాభా లెక్కల ప్రకారం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని వైశ్య స్తీల సంఖ్య 91,174. వారిలో 20`40 సంవత్సరాల మధ్య వయసు కలవారిలో 6,772 మంది వితంతువులు; 15`20 సంవత్సరాల మధ్య వయసు వారిలో 699 మంది వితంతువులు; 12`15 మధ్య వయసులో 217 మంది వితంతువులు; 5`12 మధ్య వయసులో 73 మంది వితంతువులు; 5 సంవత్సరాలలోపు వయసులో ఇద్దరు వితంతువులు వుండినారు (‘జనాభా లెక్క’, వాసవి, ఆగష్టు 1926, పు.15). బ్రాహ్మణుల్లో మాదిరిగానే వైశ్యుల్లో కూడా రజస్వలానంతర వివాహాల పట్లా, వితంతు పునర్వివాహాల పట్లా, తీవ్ర వ్యతిరేకత వుండేది. వితంతు పునర్వివాహాలు చేసుకున్న వారిని సాంఘిక బహిష్కరణ అనే ఆయుధంతో తీవ్రంగా వేధించేవారు. వారితో సహపంక్తి భోజనాలు పూర్తిగా నిషిద్ధం. వితంతు పునర్వివాహ దంపతులు అనుభవించిన సాంఘిక వెలి, పులికన్నా భయంకరంగా వుండేది. అలాంటి చారిత్రక నేపథ్యంలో, శిఖరం కోటీశ్వర గుప్త, తుంపూడి భగవంతం గుప్త, మోతే నారాయణరావు, కె. యస్. గుప్త, అత్యం నరసింహమÖర్తి, మాజేటి రామచంద్రరావు, లింగమల్లు జగన్నాథం (మచిలీపట్నం), శిఖాకొల్లు పట్టాభిరాములు గుప్త, గ్రంధి సుబ్బరాయగుప్త శర్మ, కొత్త అచ్చయ్య సెట్టి, యేటూరి వెంకట సుబ్బయ్య (కడప జిల్లా వేంపల్లి), సి.యస్. గుప్త (నెల్లూరు), కొప్పరపు సుబ్బయ్య (కడప జిల్లా ప్రొద్దుటూరు) మొదలైన మిత్రుల, అభిమానుల సహాయ సహకారాలతో గుంటూరు, ఏలూరు, మచిలీపట్నం, విశాఖపట్టణం, విజయవాడ, బళ్లారి మొదలైన ప్రాంతాలలో వితంతు పునర్వివాహాలు జరిపించారు చెంచయ్య.
గుంటూరు వైశ్యుల్లో ఛాందసత్వం పాలు చాలా యెక్కువగా వుండేది. వేషభూషల్లో కూడా వాళ్ళు అపర బ్రాహ్మణుల్లా ప్రవర్తించేవారు (దరిశి చెంచయ్య, ‘గుంటూరు ఆర్యవైశ్యుల మతము’, వాసవి, అనుబంధము, జులై 1926, పు.2`6). 1926లో చెంచయ్య జరిపించిన మొట్టమొదటి వితంతు వివాహం ఛాందసుల తీవ్ర ప్రతిఘటనల మధ్య గుంటూరులోనే జరిగింది: ఎంతలా అంటే, వితంతు వివాహ అనుకూలురు, ప్రతికూలురు ఒకర్నొకరు కొట్టుకోవడంతో, సుమారు 32 మంది గాయపడ్డారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఎన్ని ఘర్షణల మధ్య ఈ వివాహం జరపాల్సి వచ్చిందో తన ఆత్మకథలో చెంచయ్య దీర్ఘంగా వివరించారు (నేనూ-నా దేశం, పు.198-205). ఏలూరులో జరిగిన వైశ్య వితంతు పునర్వివాహం కూడా తీవ్ర ప్రతిఘటనల మధ్యే జరిగింది. పెళ్లికొడుకే లేకపోతే వివాహం ఆగిపోతుందిగా! అందుకే, పునర్వివాహ విరోధులు సినిమాల్లో మాదిరి వరున్ని కిడ్నాప్ చేశారు. కష్టాýతో నిండిన తన సుదీర్ఘ జైలు జీవితాన్ని గుర్తుచేసి, కిడ్నాప్ చేసిన వారిని భయపెట్టి మరీ వరున్ని విడిపించుకు వచ్చారు చెంచయ్య (నేనూ`నా దేశం, పు.205-211). ఇలా అతని ఆధ్వర్యంలో వైశ్యకులంలో ప్రారంభమైన వితంతు పునర్వివాీVAద్యమం క్రమంగా మచిలీపట్నం, విశాఖపట్టణం, విజయవాడ, బళ్లారి, మదనపల్లి, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమంటే, చెంచయ్య నేతృత్వంలోని వితంతు పునర్వివాీVAద్యమం, కేవలం వైశ్య కులానికి మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక దురాచార పీడితులైన స్త్రీలందరి క్షేమాన్నీ కోరుకున్న చెంచయ్య, ఎన్నో కష్టాలు పడి, కమ్మవారిలోనూ (నేనూ- నా దేశం, పు.217-224), విశ్వ బ్రాహ్మణులలోనూ (నేనూ-నా దేశం, పు.224-228) పునర్వివాహాలు చేయించారు. 16 సంవత్సరాల ఒక బ్రాహ్మణ వితంతువుకు పునర్వివాహం చేయించాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, సఫలీకృతుడను కాలేకపోయానని బాధపడ్డారు. అయినా, మద్రాసులో తాను స్థాపించిన శరణాలయంలో ఎక్కువ మంది బ్రాహ్మణ వితంతువులే వుండడం ఆయనకు కాస్తంత ఊరట కల్గించింది (నేనూ-నా దేశం, పు.228-229).
1932వ సంవత్సరంలో తను చేపట్టిన ఉద్యమాన్ని స్వీయ మదింపు చేసుకున్న చెంచయ్య, ఈవిధంగా రాశారు: “నాకున్న పది వత్సరముల సంఘ సేవానుభవములో పదునైదుగురు వితంతువులకు వివాహములు చేయించితిని; పండ్రెండుగురిని పాఠశాలలకు బంపితిని; నలుగురిని వ్యభిచారము నుండి తప్పించితిని. ఇంకను ఎందరో బాలికలకు పూర్వాచారములననుసరించి దుస్థితులకT లోనుగాకముందే, వివాహములు చేయించితిని. తగినంత సహాయము నేను చేయగలిగేటంతవరకు, ఎందరో వితంతువులు మా యింటనే, మా కుటుంబములోని వారుగా నివసించుచుండిరి” (‘దురదృష్టవంతులైన స్త్రీలు’, వాసవి, ఏప్రిల్ 1932, పు.10). ‘అబ్బే! ఇంత చేసీ చెంచయ్య చేయించింది 15 పునర్వివాహాలేనా!’ అని ఇవాళ మనం అనుకొని, అతని కృషిని తక్కువ చేసి చూడవచ్చు. కానీ, చెంచయ్య చేయించిన వివాహాల సంఖ్య కాదు ముఖ్యం. ప్రతి వితంతు పునర్వివాహం సమాజంలో కల్గించిన సంచలనం, తద్వారా క్రమక్రమంగా అభివృద్ధి చెందిన ఉదారవాద వాతావరణం, అభ్యుదయ శక్తులు పైచేయి సాధించడం, ఛాందసత్వ ఓటమి మొదలైన అంశాలు ముఖ్యమైనవి. సామాజికాభివృద్ధికి సంబంధించి ప్రజల్లో, మరీ ముఖ్యంగా స్త్రీలలో, కలిగిన మానసిక పరివర్తన మరీ మరీ ముఖ్యమైన విషయం. ఈ లెక్కన చెంచయ్యా, అతని మిత్రులూ సాధించింది అఖండమైన విజయమే!
కనీసం కుటుంబ రక్షణ వున్న వితంతువుల సంగతి సరే! అది కూడా కరువై, కాముకులైన దుష్ట పురుషుల దౌష్ట్యానికి బలై, గర్భవతులై, సంఘ బహిష్కారానికి గురైన వితంతువుల మాటేంటి? ఇలాంటి దిక్కూమొక్కూ లేని స్త్రీలకు ఆశ్రయం కల్పించడానికి వితంతు శరణాలయాల్ని స్థాపించే కార్యక్రమం చేపట్టారు చెంచయ్య. విజయవాడలో వుంటున్నప్పుడు తన మిత్రుడి భార్య అయిన తుర్లపాటి రాజేశ్వరమ్మ, తన మొదటి భార్య అయిన దరిశి అన్నపూర్ణమ్మ తదితరులతో కలిసి, ఒక వితంతు శరణాలయాన్ని ఏర్పాటుచేసి, సుమారు 60 మంది గర్భిణులైన వితంతువులకు అండగా నిలబడ్డారు (నేనూ-నా దేశం, పు.233-235). తర్వాత, 1930లో మద్రాసుకు మకాం మార్చినపుడు, ముత్తా వెంకట సుబ్బారావు, తుంపూడి భగవంతం గుప్తలతో కలిసి యింకో వితంతు శరణాలయాన్ని స్థాపించి, “అన్ని కులాల” వితంతువులకూ ఆశ్రయమిచ్చారు (నేనూ-నా దేశం, పు.215). చెంచయ్య స్ఫూర్తితో అతని స్నేహితుడైన అద్దేపల్లి సర్వాసెట్టి నర్సాపురంలో ఒక శరణాలయాన్ని యేర్పాటుచేసి, జయప్రదంగా నిర్వహించారు (నేనూ-నా దేశం, పు.215). ఈవిధంగా, ఆధునికాంధ్ర సమాజానికీ, మహిళాభ్యున్నతికీ, మరీ ముఖ్యంగా వైశ్య సంఘాభివృద్ధికీ అత్యంత విలువైన సేవలనందించారు దరిశి చెంచయ్య.
ప్రభుత్వోద్యోగాలూ, రాజకీయ ప్రాతినిధ్యం మొదలైన విషయాల్లో “వెనుకబడ్డ” బ్రాహ్మణేతర కులాలకు సరైన అవకాశాలు కల్పించడం ద్వారా ఆయా కులాలను అభివృద్ధిలోకి తీసుకురావచ్చనీ, తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందనీ చెంచయ్య వాదించేవారు. కానీ, ఆయన వాదనను వ్యతిరేకించిన “బ్రాహ్మణ కులాభిమానులు”, “యోగ్యత (మెరిట్) ముఖ్యమని వాదించేవారు”. అందుకే, బ్రాహ్మణేతరుల అభివృద్ధి విషయంలో తన నిర్ణయంపై గట్టిగా నిలబడ్డ చెంచయ్యను కొంతమంది “కులతత్వ వాది” అని నిందించేవారనీ, “వాస్తవానికి జాతీయోద్యమానికి తోడ్పడడమే నా పని. దూరదృష్టి లేనివారు నా ఉద్యమములోని అభ్యుదయాన్ని చూడలేకపోయారు” అనీ వాపోయారు (నేనూ-నా దేశం, పు.187-188).
ఇక దరిశి చెంచయ్య అధ్యక్షోపన్యాసం చేసిన ‘ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభ’ వైపు మళ్లుదాం. 1926లో ఈ మహాసభ యేర్పడ్డాకనే వైశ్య సంఘంలో మార్పులు చాలా త్వరగా చోటుచేసుకోనారంభించాయి. వైశ్య సమాజాభివృద్ధిలో, మరీ ముఖ్యంగా మహిళాభివృద్ధి విషయంలో, సంకుచితాభిప్రాయాలు కలిగిన పాతతరం వైశ్యుల్ని బలంగా వెనక్కు నెట్టిన యువతరం ముందుకొచ్చి, చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. దరిశి చెంచయ్య చేపట్టిన సంఘ సంస్కరణోద్యమానికి అన్నివిధాలుగా వెన్నుదన్నుగా నిలిచింది. అందుకే, “వితంతూద్వాహాల ఉద్యమానికి, ఇతర సంఘ సంస్కరణలకు ఈ సంస్థ బాగా ఉపయోగపడింది. ఈ యువక సంఘం నా కష్టపరంపరలను దాటించి చివరకు వృద్ధులను నెట్టేసి వారి ఆట కట్టించింది” అని ఆయన మనసారా ప్రశంసించారు (నేనూ-నా దేశం, పు.196).
చెంచయ్య కార్యకలాపాలకు కొండంత అండగా నిలబడ్డమే కాకుండా, వైశ్యులు ఎప్పటికీ మరువరానటువంటి మరో మీVAపకారాన్ని కూడా ‘ఆర్యవైశ్య యువజన మహాజన’ చేసింది. అదే వాసవి అనే అద్భుతమైన మాసపత్రిక ప్రచురణ. తుంపూడి భగవంతం గుప్త సంపాదకత్వంలో, 1926వ సంవత్సరం మార్చిలో ప్రారంభమై, మద్రాసు నుండి వెలువడనారంభించిన వాసవి, (బహుశా) 1939వ సంవత్సరంలో ఆగిపోయే వరకూ వైశ్య కులానికి ఎనలేని సేవ చేసింది. పత్రిక ప్రారంభంలో ఒక్క రూపాయిగా వుండిన సంవత్సర చందా, తర్వాతి కాలంలో రెండు రూపాయలకు పెంచబడింది. ప్రారంభమైన సంవత్సర కాలానికే 2,150 మంది చందాదారులతో విస్తృతంగా ప్రచారమైంది. పత్రిక ప్రచురణకు చాలా నాణ్యమైన కాగితం వాడేవారు. రాజకీయ విషయాలు తప్ప, వైశ్యుల అభివృద్ధికి తోడ్పడే సర్వ విషయాల్నీ ప్రచురిస్తానని ప్రకటించుకున్న వాసవి, కేవలం సంఘ సంస్కరణ అనుకూలుర రచనల్నే కాకుండా, ప్రతికూలుర రచనలు కూడా ప్రచురించి, భిన్నాభిప్రాయాల్ని ప్రోత్సహించేది (‘స్వవిషయము’, మార్చి 1926, పు.1`2).
సంస్కరణ వ్యతిరేకుల రచనలకు కూడా చోటు కల్పించినప్పటికీ, వాసవి ప్రధాన స్వరం అభ్యుదయం వైపే వుండేది. వైశ్య కులానికి చెంది, పూర్తిగా మరుగున పడిపోయిన ఎందరో రచయితలు, రచయిత్రులు వాసవి పుటల్లో కన్పిస్తారు. ఈ రచయితలు, రచయిత్రుల్లో అత్యధికులు సామాజికాభ్యుదయం వైపే మొగ్గుచూపడం విశేషం. అందుకే, బాల్య వివాహాల్ని ఖండిస్తూ, రజస్వలానంతర వివాహాల్నీ, వితంతు పునర్వివాహాల్నీ ప్రోత్సహిస్తూ; స్త్రీ విద్యను సమర్థిస్తూ రాసిన రచనలెన్నో వాసవి నిండా వున్నాయి. అలాగే, బ్రాహ్మణాధిపత్యాన్నీ, వైశ్యుల్లోనే వున్న ఛాందసత్వాన్నీ కడిగిపడేసిన రచనలు కూడా ఈ పత్రికలో ప్రచురితమయ్యేవి. వైశ్యుల “ఘనమైన” చరిత్రను కూడా వాసవి విస్తృతంగా ప్రచురించేది (ఉదాకి: తుంపూడి భగవంతం గుప్త, ‘శ్రీకృషTఁడు వైశ్యుఁడు’, జనవరి 1927, పు.25`27; అంబటి సుబ్బారాయ గుప్త, ‘చాణక్యుఁడు వైశ్యకులజుఁడు’, ఆగష్టు 1931, పు.166`171; తుం. భగవన్త గుప్త, ‘వైశ్య చరిత్ర సంబంధ శాసనములు’, అక్టోబర్ 1926, పు.35`37). దరిశి చెంచయ్య రాసిన మేల్కొలుపు వ్యాసాలూ (ఉదాకి: ‘మేల్కొనుడు-వైశ్య సోదరులారా!’, మార్చి 1926, పు.4-6), అతని మొదటి భార్య అన్నపూర్ణమ్మ రచనలూ (ఉదాకి: ‘హైందవ స్తీల హక్కులు`కర్తవ్యములు’, జనవరి 1929, పు.390`394) ఈ పత్రిక పుటల్ని అలంకరించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆర్యవైశ్య సభలూ, సమావేశాల రిపోర్టులూ; మరీ ముఖ్యంగా ‘ఆర్యవైశ్య యువజన మహాసభ’ కార్యక్రమాలూ విస్తృతంగా రిపోర్టు చేసేది. ఒక్క మాటలో చెప్పాలంటే, తీవ్రమైన ఆత్మన్యూనతాభావంతో సతమతమౌతున్న వైశ్యకులస్థుల గుండెల్లో ఆత్మవిశ్వాసమనే కాగడాను రగిలించి, ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేయడంలో వాసవి చేసిన కృషి అంతా యింతా కాదు. చెంచయ్యలాంటి వైశ్య సంస్కర్తల ఆలోచనల్ని తెలుగునేల నాలుగుచెఱుగులా వెదజల్లడంలోనూ, సంస్కరణోద్యమాన్ని సంఘటితం చెయ్యడంలోనూ అమోఘంగా పనిచేసిన వాసవి, ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్ధంలోని ఆంధ్రదేశ సామాజిక చరిత్ర రచనకు విశిష్టమైన ప్రాథమికాధారంగా ఉపయోగపడుతుంది. అలాంటి వాసవి జననం ‘ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభ’లో తీసుకున్న తీర్మాన ఫలం.
చెంచయ్య ప్రేక్షకులను సంబోధించిన తీరు భిన్నంగానూ, మిక్కిలి ఆసక్తికరంగానూ, ప్రశంసనీయంగానూ వుంది. ఆయన తన ప్రసంగాన్ని “సోదరీ సోదరమణులారా!” అని ప్రారంభించారు. సాధారణంగా స్త్రీ, పురుషులిద్దరూ పాల్గొన్న సభలూ, సమావేశాలు “సోదర సోదరీమణులారా!” అనే సంబోధనతో ప్రారంభమవడం మనం గమనిస్తున్నదే! ‘ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభ’లో స్వాగతోపన్యాసం చేసిన తుంపూడి వేంకటానంద భగవత్ గారు కూడా ఇలాగే సంబోధించారు. ఇలాంటి సందర్భంలో, తన సంబోధనలో మొదట ‘సోదరీ’మణులను తలవడం చెంచయ్య స్త్రీజన పక్షపాతాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
1926 జనవరిలో చెంచయ్య చేసిన అధ్యక్షోపన్యాసం నాటికి అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ, ప్రాంతీయంగానూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచాన్నంతా కల్లోలపరచిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, దాని పర్యవసానాలు ప్రజల్ని – భారతీయుల్ని కలుపుకొని – వెంటాడుతూ వుండినాయి. గాంధీ నాయకత్వంలో ప్రారంభించబడి, ప్రజల్లో అనేక భ్రమల్ని సృష్టించిన సహాయ నిరాకరణోద్యమం అర్ధాంతరంగా విరమించబడి, ప్రజల్ని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసింది. మద్రాసు ప్రెసిడెన్సీలో 1916లో యేర్పడిన జస్టీస్ పార్టీ (సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్) నాయకత్వంలోని బ్రాహ్మణేతరోద్యమం, బ్రాహ్మణేతర కులాలకు విద్యావకాశాలు, ప్రభుత్వోద్యోగాలు, రాజకీయ సంస్థల్లో ప్రాతినిథ్యం మొదలైన విషయాల్లో సమన్యాయం కోసం గట్టిగా పోరాడుతుండింది. ఇలాంటి భావజాలంలో భాగంగానే, ఆంధ్ర ప్రాంతంలో దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి, త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలైన బ్రాహ్మణేతర సాంస్కృతిక, సామాజిక నాయకులు, బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ ఉద్యమాల్ని ప్రారంభించి, సమాజంలో`ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో`బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించసాగారు. ఈ క్రమంలోనే, బ్రిటిష్ పాలిత ఆంధ్రలో 20వ శతాబ్దం ప్రారంభం నుండీ అనేక కుల సంఘాలు యేర్పడ్డాయి. ప్రతి కుల సంఘం తన సొంత కుల పురోభివృద్ధికి కృషిచేసింది. ఈ విస్తృత కృషిలో భాగంగానే, కుల సంఘాలన్నీ తమ`తమ కులాల్లో విద్యను ప్రోత్సహించడం, సంఘ సంస్కరణకు పాటుపడడం మొదలైన కార్యక్రమాలతో ముందుకు సాగాయి. ‘ఆర్యవైశ్య యువజన మహాసభ’ మాతృసంస్థ అయిన ‘ఆర్యవైశ్య మహాసభ’ కూడా అలా యేర్పడిందే (1907లో). ఈ చార్రితక నేపథ్యంలోనే దరిశి చెంచయ్య అధ్యక్షోపన్యాసాన్ని అర్థం చేసుకోవాలి.
ముగింపు: పైన మనం చూసినట్లు, దేశ స్వాతంత్య్రానికీ, సమాజాభివృద్ధికీ ఎంతగానో పాటుపడ్డ దరిశి చెంచయ్య, తన ఆత్మకథ చివర్లో (1951 సెప్టెంబరు) “నేను కోరిన సంపూర్ణ స్వరాజ్యం కాని, ప్రజా ప్రభుత్వం కాని ఏర్పడనే లేదు. కాని, నా జీవితకాలంలో ఏర్పడుతుందనే నమ్మకం నాకు ఇప్పటికీ దృఢంగానే ఉన్నది” అని విశ్వసించారు (నేనూ-నా దేశం, పు.370). అయితే, 1964 డిసెంబరులో ఆయన చనిపోయే నాటికి కాదు కదా, యిప్పటికైనా తను ఆశించిన సంపూర్ణ స్వరాజ్యం కానీ, ప్రజల ప్రభుత్వం కానీ నిజంగా యేర్పడ్డాయా అనేది చాలా పెద్ద ప్రశ్నే!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.